రాగో

భాగం-13

– సాధన 

12 November 2020

దళం వచ్చిందన్న కబురు విన్న గ్రామస్తులంతా సంగంలో తెగని పంచాయితీలు అన్నల ముందు తెంపుకోవచ్చని సంతోషించారు. ఊరి సంగంతోనే అన్ని పంచాయితీలు చేసుకోవాలనీ, పంచాయితీలు దళం చేయదనీ ప్రతిసారి ఎంతగా నచ్చ చెప్పినా మామూలుగా సంఘంలో తెగని పంచాయితీలు అన్నలే చేయక తప్పదని ఊరందరితో పాటు సంఘనాయకులక్కూడా ఉంటుంది. అలా ఒకటో, రెండో తప్పనిసరిగా మీదపడక తప్పదని దళానిక్కూడ తెలుసు. అలా అప్పుడే రెండు పంచాయితీలు తయారగున్నయి. అందులో ఒకటి :

పుంగాటి కనుకో బిడ్డ ఆకులు తెంపిన డబ్బులు మొగనికి తెలవకుండా, అవ్వదగ్గర చాటుగా దాచుకున్న కేసు. పెట్టే, బేడా లేని సంసారం కదా. బిడ్డ ఇచ్చిన డబ్బులు ఎక్కడ దాచాలో అర్థంగాక తల్లి ఆ నోట్లను ఇంటి చూరులో చెక్కింది. మూడు మాసాల తర్వాత చూరులో చేయి పెట్టి చూస్తే తల్లికి నోట్లు కట్టిన గుడ్డముల్లెకు బదులు మెత్తటి మట్టి పెళ్ళలు తలిగేసరికి గుండెలదరసాగాయి. ముచ్చెమటలు పోశాయి. చెదలు తినగా ముక్కలు ముక్కలైన నోట్లు చూసేసరికి తల్లీబిడ్డల మొత్తుకోళ్ళు, తల బాదుకోవడాలు, దీవెనలు, శాపనార్థాలు మిన్నంటాయి. బిడ్డ తల్లిని సతాయిస్తుంటే, తల్లి తన ఖర్మని, దేవున్ని తిట్టుకుంటుంది. తన డబ్బు ఎలాగైనా సరే ఇచ్చి తీరాలంటుంది బిడ్డ. ముసలిదాన్ని నేనెలా చావాలంటుంది తల్లి. గోటుల్ ముందుకు వచ్చింది తగువు. ఆ తల్లీ కూతుళ్ళు సంఘం వారికి పెద్ద తలనొప్పి అయ్యారు. ‘దాచుకున్న డబ్బు దానికి ఇవ్వకపోతే ఎలాగే’ అంటే ‘చెదలు తింటే నేనేం చెయ్యాలి? దాని చూర్ల అయితే మాత్రం చెదలు పట్టయా, ఆ నోట్లే తీసుకోనీ” అంటుంది తల్లి, ‘ముసలిది నీ పైసలు తినలేదు కదా దాన్ని సాధించి ఏం లాభం’ అంటే ‘అదంతా నాకు తెలియదు. నా పైసలు నాకు కావాల’ంటుంది కూతురు. ‘అప్పోసప్పో చేసి బిడ్డకివ్వు’ అంటే ‘ససేమిరా కాద’ంటుంది తల్లి. ‘నేను వదల’నంటుంది. బిడ్డ. ఎటూ తేల్చలేని సంఘంవారు అన్నల ముందు పెట్టారు ఈ తగువు.

అలాంటిదే మరొకటి:

జూరు, లల్లీలు ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. చాటుమాటుగా కలుసుకుంటుండేవారు. తీరా లల్లికి మూడు మాసాల కడుపు అయ్యే సరికి ఈ ఈ చాటుమాటు సంసారం వద్దనీ, ఇల్లు చొచ్చుడే మంచిదనుకున్నారు లల్లీ, జూరులు. ఇల్లుచొచ్చిన దగ్గర నుండి ఊళ్ళో లావరిస్ (జులాయి)గా తిరిగే బాజీ బుర్రలో పురుగు తొలుస్తుంది. ఏ ఇంట్లో ఏం జరిగినా పుల్లలు పెట్టడానికి తయారయ్యే బాజీ ఒక మధ్యాహ్నం జూరు ఇంట్లో లేనపుడు మంచాన పడ్డ అతనికాక పర్దేశీతో లల్లి ముచ్చట తీశాడు. పూటుగా తాగున్న బాజీ ఆ ఇంట్లో పర్దేశీ పెద్దరికాన్ని దెప్పి పొడుస్తూ, కావాలంటే తను ఓదే (మంత్రం) చేసి తెల్లారేసరికల్లా లల్లికి కడుపు పోయేలా చేయగలనని నోటికొచ్చినట్లు వాగడం మొదలెట్టాడు. పనీ పాట లేని ముసలాళ్ళు ఇద్దరి మధ్య మాట మాట పెరిగి పందెం కాసుకునేంతవరకు పోయింది. బాజీమంత్రం పారితే పర్దేశీ వంద రూపాయలిచ్చుకోవాలని, లేకుంటే బాజే పర్దేశీకి వంద ఇచ్చుకోవాలనీ పందెం వేసుకున్నారు. లల్లీ – జూరులకు ఈ గొడవే తెలియదు. వారంతర్వాత పర్దేశీ పటేల్ని, ఊరి పెద్దల్ని పట్టుకొని గోటుల్ ముందు పంచాయితీ చేయించి బాజీనుండి వంద రూపాయలు ఊడగొట్టాడు. పంచాయితీదార్లు బైటక్ ఖర్చుకింద పాతిక రూపాయలు లాగేసి, మజా చేసి డెబ్బయి అయిదు రూపాయలు పర్దేశీ చేతిలో పెట్టారు. తాగిన మైకంలో అన్నమాటను పట్టుకొని అన్యాయంగా దండుగ వసూలు చేశారని బాజీ ప్రతిరోజు గోటుల్ ముందు హంగామా చేయడం ప్రారంభించాడు. ఊరి పెద్దలు చేసిన అన్యాయాన్ని సంఘం వాళ్ళయినా సరిచేయకపోతే అన్నల ముందే ఇది తేల్చుకుంటానని బాజీ పట్టుపట్టడంతో ఈ తగువు కూడ అన్నల ముందుకు వచ్చింది.

* * *

టీ తాగి దళం ఊరు చివరన ఉన్న నాలుగు మాదిగిండ్లు దాటి అడవిలోనికి వచ్చింది. టుగె, కుల్లెలు నెత్తిపై నీళ్ళ బిందెలతో వస్తున్నారు. బోరింగ్ నీళ్ళు చిలుం చిలుం వస్తాయనీ, తాగబుద్ధికాదనీ ఊరివాళ్ళందరు నూతినీళ్ళే తోడుకుంటున్నా దళం మాత్రం కావాలని ఆ బోరింగ్ నీళ్ళే మోసుకెళ్ళడం దాదలందరికి గమ్మత్తుగుంది.

మాదుగులు ఈ ఊరికి ఈ నడుమనే వచ్చిండ్రు. కూలి, నాలి చేసుకోవడం, చచ్చిన పశువుల తోలు తీసి చెప్పులు కుట్టి బ్రతకడం వీరి కులవృత్తి. సేత (వ్యవసాయం) పనుల్లో ఆదివాసీలకు మాదుగులతో అవుసరం లేదు. తొండాలు ఇవ్వాలంటే అసలు మోటబావులే లేవు. తాళ్ళు, తలుగులు ఇద్దామంటే ఆ పనులు ఆదివాసీలే స్వయంగా చేసుకుంటారు. ఇక చచ్చిన పసులను మోసుకెళ్ళటం, అక్కడున్న వారికి చెప్పులు ఇవ్వడంలాంటి పనుల్లో కూడ వీరి అవసరం అంతంత మాత్రమే. కూలి నాలి చేసి బ్రతకడం వీరికి మిగిలింది.

అడవి బందుకున్న ఖేతుల్ వద్ద దళం ఆగింది. ఆ ఖేతుల్ పోలీసు పటేల్ పుప్లా తమ్ముడిది. గడ్డి కొరతతో ఇబ్బంది పడలేక ఈ యేడే రెండు వేల రూపాయలు పెట్టి వెయ్యి బెంగుళూరు పెంకలు తెచ్చి కప్పాడు. ఆ ఖేతుల్లో సగం వరకు ఏవేవో దినుసులతో నిండి ఉండిన విటిమ (ముల్లె)లు ఆక్రమించాయి. ఆ ఖేతుల్ వాలకం చూస్తుంటే మోతుబరి రైతుదిగా సులభంగా గుర్తుపట్టవచ్చు. ఖేతుల్లో విడిది చేసిన దళ సభ్యులు ఎవరి స్థలాలు వారు చూసుకున్నారు.

గ్రామస్తులు వచ్చేలోగా ఎకౌంట్స్ పని పూర్తి చేసుకోడానికి కూచున్నడు కమాండర్. దళం జమా, ఖర్చులు మూడు మాసాలకొకసారిపై కమిటీకి పంపాలి.

ఊల్లె, టుగె, కుల్లె, బొడ్డలు గాండోముందు కూచొని మరాఠిలో అ, ఆ లు దిద్దుకుంటున్నారు. గొడ్డలి పట్టిన చేతులు బలపం పట్టడానికి అలవాటు పడుతున్నాయి.

కర్ప – డుంగలు టిన్ బాంబులు, బ్యాటరీ సెట్లు తీసుకొని సెంట్రీ పోస్టుకు బయలుదేరారు.

మూర మాత్రం నిద్రలేమితో పార్టీన్ ఒడిలో పడిపోయాడు.

జైని, మిన్కో, సీదోలు దువ్వెనలు తీసుకొని తలతో కుస్తీపట్లకు సిద్ధమైనారు. వర్షాకాలం తలలో పేనులతో మహా అవస్థ. ఎంత చుండు కట్టినా చలికాలం, ఎండాకాలం మేలనిపిస్తది. గిరిజ మాత్రం చేతిలో పుస్తకంతో ఖేతుల్లోని వంటగది వైపు దారి తీసింది. రెండు రోజుల క్రితం నానపోసిన ఇప్పపూలు బాగా పులిసిపోయి కల్లు గబ్బుతో ముక్కుపుట లదిరిపోగా అక్కడ కూచోలేక మరుక్షణంలోనే గిరిజ మళ్ళీ అక్కల దగ్గర చేరింది.

కల్లు గబ్బుతో తల తిరిగి పుస్తకం మీద మనసు నిల్వని గిరిజ “ఛాయ్ చేద్దామా” అంటూ నెమ్మదిగా జైనిని కదలించింది.

మాల వాళ్ళ ఇంట్లో ఛాయ్ తాగినందుకు ఇంకా మనసు పీకుతునే ఉన్న జైనికి “దాదలు జావ తెస్తరేమో’ అని అంది. “జావ తెస్తరేమో అక్కా అయినా కమాండర్ నడుగుదాం” అని తుంచేసింది జైని. ఛాయ్ గురించి ఎవరైనా అడిగితే బాగుండునని కోరుకునే గిరిజకు ఆ విషయం ఎప్పుడూ తనే కదపాల్సి రావడం బాధగానే ఉంటుంది. కానీ ఎపుడూ తానే బయటపడుతుంది గిరిజ. ఖేతుల్ గుమ్మంలోకి రాగానే దూరాన ఊరివాళ్ళు వస్తూండడం కనిపించింది. ‘ఇక ఈ పూటకు ఛాయ్ బందే’ అనుకుంటూ బయటకు నడిచింది.

దూరం నుండి వస్తున్న భూమ్యాల్ సన్నో, పోలీసు పటేల్ పుస్లా వెంట కొందరు జనాలున్నారు. వచ్చీ రాగానే అందరూ “రాం! రాం! లాల్ సలాం” అంటూ చేయెత్తి పలకరించారు.

“హూండా (అందరికి) లాల్ సలాం” రుషి చేయి లేపి బదులు చెప్పాడు.

గ్రామస్తులు ఎవరికి వీలైన స్థలాల్లో వారు కూచున్నారు. భూమ్యల్ సన్నో తన జేబులోని కరపత్రాలను చేతిలోకి తీసుకొని కమాండర్ కూచున్న పాలీన్ షీటులోనే కుడివైపు కూచోగా పటేల్ ఎదురుగా చిన్న బండ తొంపు చేసుకొని కూచున్నాడు. పంచాయితి జనాలు ఎదురుగా చెట్టుకింద కూచున్నారు. వర్షం ఆగిపోయినా చెట్ల ఆకుల నుండి నీళ్ళు బొట్టు బొట్టుగా రాలున్నాయ్. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. స్త్రీలందరూ కొంత దూరంగా నిలబడ్డారు.

వాళ్ళల్లో పెళ్ళి అయినవారు, కానివారు, పిల్లలు కూడ ఉన్నారు. పిల్లలెవరికి ఒంటిమీద మొలతాడు కట్టు మినహా మరేమీ లేదు. పెళ్ళి అయిన స్త్రీలు మొలకు ఒక టవల్ చుట్టుకొని, రొమ్ములు కప్పుకొంటూ ఛాతిపై రెండు చేతులు అడ్డు పెట్టుకున్నారు. కూచునేటపుడు టవల్ లో నుండి ముర్వగెత్తె (లోపలి గోచి) అగుపడకుండా ఛాతిపై నుండి చేతులు తీసి టవల్ అంచులు దగ్గరగా పట్టుకోని ముడుకులు అనించి ప్రయాసపడుతూ కూచున్నారు. ఆ అవస్థ చూసి కలతపడ్డ గిరిజ మూలుగుతున్నట్టు పెద్దగానే నిట్టూర్చింది.

అప్పుడే అక్కడికి వస్తున్న జైని అది విని గిరిజ వీపుమీద చెయ్యి వేసింది.

“మా మాడియా శేడోల అవస్థ ఇలాగే ఉంటుందక్కా. ఒంటినిండా గుడ్డ కప్పుకోవాలంటే అది కూడా రీతి, రివాజులకు వ్యతిరేకమేనని ఖాయిద పెడుతారు. ఇక్కడ కోయతూరు (మగాళ్ళు” అంటూ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసులే అన్నట్లు మొదలెట్టింది జైని.

“నిజమే జైని, కాని పెళ్ళి కాకముందు అందరూ ఎంచక్కా జాకెట్టు వేసుకొని, చీర కట్టుకోవడం లేదా. ముక్కు పుల్లలు, చెవుల కమ్మలు, మొలగొలుసులు కూడ పెట్టుకోవడం లేదా! మరి తీరా పెళ్ళి అయినాక ఒంటినిండా బట్టకూడా లేకుండా ఇలా వికారంగా తయారైతే చూసే కోయతూరుకు మాత్రం బాధగా ఉండదా! ఎవరు ఎందుకు ఎదురుతిరగరు?” అంటూ ఆవేశంగా ఉపన్యాసధోరణిలో పడింది గిరిజ.

“అయ్యో అక్కా! ఇన్నాళ్ళయి ఇక్కడే తిరుగుతూ మా అక్కల్ని ఇవాళే చూస్తున్నట్లు దీనికే ఇంత బాధ పడిపోతావు ఎందుకు” అంటూ గిరిజను దెప్పుతూనే సంబాళిస్తున్నట్లు జైని చెప్పుకపోతుంది.

“ఒంటినిండా కప్పుకోనీకి బట్ట ఇవ్వకపోవడమే ఓ కష్టమూ, అవమానమూ అనుకుంటే బాయిల బతుకే ఇక్కడ ఓ పెద్ద అవమానం. బుక్కెడు బువ్వ పడేస్తే ‘” అన్నా, ‘పో’ అన్నా తోకాడించుకుంటూ కడపలో పడి ఉండే ‘నై’ (కుక్క) లాగా పెళ్ళి అయిన గొట్టెది పిడికెడు మెతుకులు తిని అన్నిటికి భరించుకుంటూ ఇంట్లో పడి ఉండాల్సిందే కానీ అది కూడా ఒక మనిషి క్రింద లెక్కే కాదు. మా ఆదివాసీ ఆడోళ్ళ తిప్పలు చెప్పాలంటే రాస్తే ఓ పెద్ద కథే అవుతుంది” అంటూ ఇంకా ఏదో చెప్పబోతోంది జైని.

జైనిలో ఎవర్నో కొత్త మనిషిని చూస్తున్నట్టు గిరిజ ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూస్తుండిపోయింది. మొన్న మొన్నటివరకు ఏమడిగినా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ తనలో తాను ముడుచుకుపోతూండే రాగోయేనా ఈ జైని అనుకుంటూ జైనిలో పెరుగుతున్న చైతన్యానికీ, అవగాహనకూ, చొరవకూ ఆశ్చర్యపోతూ ఆనందిస్తూ మెచ్చుకోలుగా ఆమె మొహంలోకి గుచ్చి గుచ్చి చూస్తున్న గిరిజ ఆలోచనలకి కమాండర్ పిలుపుతో అడ్డుకట్ట పడింది.

“గిరిజక్కా – మీ అక్కలందరూ ఊరి అక్కలను కూచోబెట్టి మాట్లాడండి. మేము ఈలోగా పంచాయితీలు పూర్తి చేస్తాం!” అని పురమాయించాడు రుషి.

కమాండర్ పిలుపు విని గిరిజ జైని నడుం చుట్టు చేయి వేసి అక్కల వైపు నడుస్తూ మిన్కో, సీదోలను కేక వేసింది.

“రాం, రాం, బాయి” గిరిజ, జైని ఏకకాలంలో ఊరి అక్కలను పలకరించారు.

“రాం, రాం” అంటూ అందరూ ముసిముసి నవ్వులతో దళం అక్కలను ఆహ్వానించారు.

అపుడే అక్కడ సుమారు ముప్పై మంది స్త్రీలు చేరి ఉన్నారు. నడి వయసువారు, పడుచులు, చిన్న పిల్లలు కూడ ఉన్న ఆ గుంపులో మాడియాలు, బారెవాళ్ళతో పాటు కొద్దిమంది డోలు, పర్గాన్, రాజగోండు, హల్ఫి, గోవారీలు కూడ ఉన్నారు. నలుగురైదుగురు అక్కలు మాత్రం ఈ గుంపుకు దూరంగా దాదల దృష్టిలో పడకుండా వెదురు పొద చాటుకు తీగదారి పొరకల కింది నుండి నక్కి నక్కి చూస్తున్నారు.

“మీటింగ్ కీకడా బాయి” (మీటింగ్ చేద్దామా అక్కలు) – గిరిజ.

“ఇంగో” – జనంలో నుండి జవాబు.

“ఏం చెప్పమంటారు” గిరిజ వారినే తిరిగి ప్రశ్నించింది.

“ఒక పాట చెప్పండక్కి” అంటూ ఒక యువతి కోరింది.

“పాట తర్వాత అక్కా, ముందు మా జైనిబాయి ఇవాళ మీటింగ్ చెప్పుతాది” అంటూ ఠక్కున అనేసింది గిరిజ.

జైని ఉలిక్కిపడింది. తానూహించని మాట వినేసరికి తత్తర బిత్తరయింది. “ఎప్పుడూ మాట్లాడని నన్ను గిరిజక్క ఎందుకు ఇబ్బందిలో పడేస్తుంది’ అనుకుంటూ, అదేమాట పైకి అనేసింది.

“లేదు జైని. మన అక్కల బాధలు నీకే బాగ తెలుసు. ఈ రీతులు, రివాజులు నువ్వు చెప్పగలవు. ధైర్యంగా మాట్లాడు. నేను నీపక్క ఉంటాను గదా” అంటూ గిరిజ జైనిని ముందుకు తోసింది.

“చెప్పు అక్కా ఏం గాదు” అంటూ సీదో కూడ ప్రోత్సహించింది.

చెమటలు పోసిన ముఖాన్ని చెమటలు పట్టిన చేతులతో తుడ్చుకుంటుంది. తల గోక్కుంటుంది. గొంతు సవరించుకుంటుంది. కానీ ఇన్ని చేసినా జైనికి మాట పెకలడం లేదు. చివరకు “నాకు వామో (రాదు). నువ్వే చెప్పక్కా” అంటూ గిరిజ వైపు చూసింది.

“చెప్పుండ్రక్కా, పొద్దెక్కుతుంది” అంటూ ఓ ముసలిది జనాల్లో నుండి గాబర పెట్టింది.

ఇక తప్పదనుకున్న జైని మెల్లగా గొంతు సవరించుకుంది. చూపులు పైన నిలిపి లిమ్మరుతుల గుమ్మడి, కమలక్క పాటలు గుర్తు చేసుకుంది. అయినా ఎక్కడ మొదలు పెట్టాలో తేలడం లేదు. ఒకసారి తల్లి గుర్తొచ్చింది. అంతే! మాడియా భాషలో “బాయి” అంటూ మొదలు పెట్టింది. తన తల్లి దిన చర్యనంతా పేర్చుకుంటూ చెప్పుకొస్తుంది.

“పుంజులు కూయంగా లేసి ఏ రోజు గాసం ఆ రోజుకే అన్నట్టు వడ్లు దంచుతూ, జావ (అంబలి) గాసి పొలగాండ్లకు పోసి పొలంకాడ మొగనికి కొంటపోతది ఆడది. మొగుడు జావ తాగుతుంటేనే అది మెల్లగా పొలంలకు దిగుతది. నాగలి పట్టి మొగని దంటకు అది తీసిపోకుండా దున్నుతది. నాగలిడిసిందంటే అడవిల వడి ఆకు, అలము జమ చేసి ఆ రోజు కూర పూర్త తెస్తది. ఇంటికాడ ఆడదాని ఆసరా లేకుంటే ఆ ఇల్లెదుగదు. పూలు ఏరుడు, పండ్లు ఏరుడు, గడ్డలు తవ్వుడు ఇట్ల నూటొక్క పని చేస్తే గాని ఎల్లదు ఆడదాన్కి. గడియసేపు కూచోనీకి ఆరాం ఉండదు. అయినా ఆడదాన్ని అయ్యో అనేటోళ్ళెవళు?” అంటూ జైని అక్కల వైపు చూపులు తిప్పేసరికి వారు నవ్వుతున్నట్లనిపించి ఠక్కున మాట ఆగిపోయింది. మళ్ళీ దిక్కులు చూసింది.

ఇంతలో “వెహ” (చెప్పు) అంటూ గుంపులో నుండి ఎవరో ఒకరు అనేసరికి “అయ్యో ఇంకేం చెప్పాలి” అన్నట్టే తడుముకోసాగింది.

“పొద్దస్తమానం పని చేసిన ఆడది నడుం లాగుతుంటే, మంచంపై నడుం వాలుద్దామంటే కూడ పోలో (పనికి రాదు) అంటారు. రివాజులు అమలు చేసే పెద్దలు పెళ్ళయిందంటే అక్కడ నేలమీద దొర్లాల్సిందే తప్ప మంచం మీద కూచోనైనా కూచోకూడదు” అనంగానే అందరక్కలు కిసుక్కుమన్నారు.

తాను చెప్పింది ఎక్కడ తప్పిందోనని పరేషాన్ అవుతున్న జైనికి “ఇంగో, నిట్టమే” (నిజమే) అవి ఎవరో అన్న మాట ‘నడవనీ’ అన్నట్టు ధైర్యమివ్వడంతో మళ్ళీ రివాజుల్లోకి పోయింది జైని.

“ఎక్కడ లేని రివాజులూ మన ఆడవాళ్ళ మీదే రుద్దుతున్నరు. ఏం చేసుడు మీరే విచారం చేసి చెప్పాలి.

పేను (దేవుడు) పూజకాడికి కూడ మనల రానియ్యరు. సవరించేదంతా మనవంతే. కాని దేవుడికి మొక్కడానికి మాత్రం మనం పనికిరాం. ఆ దేవుడెట్ల మెచ్చుతాడో మరి! పంట చేతికొచ్చేవరకు దున్నుడు నుండి కోత వరకు ఏ పనికి మనం లేకుండా వెళ్ళదు. కానీ కళ్ళంలోకి మాత్రం రావద్దంటారు. ఆడది షికారుకు పోకుంటే కాదు అంటారు. పోయి, వేట అయితే కోసే దగ్గర మాత్రం పోలో (పనికిరాదు) అంటారు”.

“గడుసుపిల్లే. అన్ని ఉన్నదున్నట్లే చెప్పుతుంది” అని అక్కడున్న ఆడవాళ్ళలో నుండి ఓ ముసలిది గొణిగింది. ఇది విన్న సీదో “తప్పుంటే చెప్పవ్వా” అనే సరికి ఆ ముసలిది సదురుకొని నవ్వి ఊర్కుంది.

“ఇంటికాడ పని వెళ్ళకుంటే అయ్య నచ్చిన లెయ్యోన్ని (పడుసోణ్ని) బిడ్డనిస్తనని ఆశపెట్టి లామడి తెస్తరు. వానికి నేనుండనని పిల్ల మొత్తుకుంటే అయ్య వినడు. అవ్వ వినదు. గిట్టనోనితోని సంసారం చేయమంటారు. లేకుంటే ఇంట్లున్న లామడే (ఇల్లరికం అల్లుడు) ఊరుకోడంటారు. ఇది వాళ్ళ వరుస” అనే సరికి పెళ్ళికాని పడుచు స్త్రీల ముఖాలు చిరునవ్వుతో వెలగసాగాయి. ఆ నవ్వులు మరింత ప్రోత్సహించినట్టయింది.

ఏడ లెయ్య (పడుచుది) కనపడ్డా, పిల్లదొరక్క పెండ్లి కానోడు వాని బలగాన్నంతా తోలుకొచ్చి పిల్లనిమ్మని ఇంటిమీద కూసుంటరు. ఇయ్యనని మొత్తుకున్నా విడవకుండా జిద్దు చేస్తారు. బత్తెం కట్టుకొనివచ్చి ‘ఇస్తాం’ అనేదాక పిల్ల ఇంటి ముందు ధూం, ధూం చేస్తరు. వాళ్ళ గడుసుతనం భరించలేక ఇంటోల్లు పిల్లనిస్తామంటారు. ఇది ఇట్లయితే, వెనుకట పడుచుపోరి ఒక్కతే కనపడిందంటేనే పది మంది లెయ్యోళ్ళు (పడుసోళ్ళు) అమాంతం మీదపడి చడీ చప్పుడు లేకుండా ఎత్తుకెళ్ళేదట. దాదు లేదు ఫిర్యాదు లేదు” అనేసరికి అందరు గొల్లుమన్నరు. “పెళ్ళి అయి అత్తగారింటికి పోతే బావ కంటిముందు పడొద్దు. బావ పిల్లగాండ్లను పేరు పెట్టి పిల్వద్దు. భీమారిపడ్డ ఆడది కూడ బావ కచ్చరం (ఎడ్లబండి) ఎక్కొద్దు. ఎక్కితే దండుగ. ఇవన్నీ చావుబతుకులు చూడని రివాజులు. తల్లిగారింటికి వస్తే అనల్ పేను అని అంటుముట్టు పెట్టి వంట గదిలోనికే రానియ్యరు.

అవుతలున్న (బహిష్టు) ఆడదానికి ఐదు రోజులు ముట్టుడు. అది తప్పిపోయి కూడ మగాళ్ళ కంట్ల పడొద్దు. దాంట్లో పూజారి కంటబడితే దండుగ తప్పదు. ఏం చేసినా, ఏం తప్పినా ‘దండుగ’ అని బెదిరిస్తరు ఈ పెద్దలు.

ఇంతెందుకు దసరా పండుగ వచ్చిందంటే అహిరిపోయి మహారాజు కొలువుల పడుచుపోరీలు ఎగరకుంటే ఊరిమీద దండుగా వసూలు చేస్తడు రాజు. ఈ దండుగ ఎవడు కడుతడని ఊరి పెద్దలు ‘ఆడికిపోయి ఎగురుండ్రని’ ఆడోళ్ళను తిప్పల చేస్తరు. ఆ పెద్ద ఊళ్ళె బద్మాష్ గాడిదలు మనల్ని ఏం అన్నా, ఏమి చేసినా వీళ్ళకు పట్టదు” అంటూ జైని చెప్పుకపోతుంటే ఊరి అక్కలు శ్రద్ధగా వింటున్నరు.

“ఆడది ఇల్లు చొచ్చినాంక లగ్గం (పెండ్లి) చేసుకోను వెళ్ళుబాటు లేకుంటే ఈ మహారాజు తొత్తులు ఊళ్ళళ్ళకు వచ్చి యేటా జోడికి అయిదు రూపాయలు పెండ్లి చేసుకునేదాక కట్టుమంటరు. తల్వాలు పోసుకుంటే గానీ ఈ దండుగ తిప్పల తప్పదంటరు.

ఈ రాజులు, రివాజులు అన్ని గలసి ఆఖరికి ఆడది కోడిగుడ్డు తినకూడదని కూడా ఖాయిదా చేసిరి” అంటూ గిరిజవైపు చూసేసరికి గిరిజ ముసిముసిగా నవ్వుతుంది.

“చాలా బాగ చెప్పావు జైని” అని మెచ్చుకుంటూ గిరిజ ఊరి అక్కలవైపు చూసి,

“జై నిబాయి చెప్పినవన్నీ నిజమేనా – అక్కలు” అంది.

“హే” అన్నాయి అన్ని గొంతులు ఒక్కసారి.

“మరి సంఘం పెట్టుకుంటారా! ఇవన్నీ పోవాలంటే మనం అందరం ఒక్కటి గావాలి. మన బతుకులు మారాలంటే మనం కొట్లాడాలి” అనే సరికి ఇందాక మాట్లాడిన ముసలిది అడ్డు తగిలింది.

“ కోయతూరు ననగొద్దా బాయి” – అంది ముసలిది.

ఈ మాట విన్న ఆ గుంపులోని యువతులందరూ “దాదలు చెప్పినాంక కోయతూర్ ఏమంటరు. ఇంక అడుగుడేంది” అంటూ గయ్యిమన్నరు.

“కాదవ్వా. మన కోయతూర్ అందరూ సర్కార్ తోని లడాయి చేయడం లేదా? అక్కలందరం కూడ సంగం బెట్టుకొని మగాళ్ళతో పాటు ఒక్కటై ఆ లడాయి మరింత గట్టిగ చెయ్యాలి. మన రాజ్యం మనకొచ్చి మన కష్టం మనకి దక్కే రోజు వస్తేగానీ ఈ బాధలన్నీ పోవు” అని మళ్ళీ ఓపిగ్గా చెప్పింది గిరిజ.

“ఇంగో కొట్లాడుదాం” అంటూ వణుకుతున్న ఆ ముసలి గొంతు గట్టిగా అనే సరికి అందరూ “ఇంగో” అన్నరు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.