కొత్త అడుగులు – 23

కవిత్వ రుతువు వైష్ణవి శ్రీ

– శిలాలోలిత

విస్తృతంగా రాసే కవయిత్రి. కొంతకాలంపాటు జర్నలిస్ట్ గా టీచర్ గా పనిచేసి ప్రస్తుతం సియటిక్ ప్రాబ్లమ్ వల్ల ఖాళీగా వుంటున్నారు. ఖాళీ అనకూడదు. ఎక్కువగా రాస్తున్నారు. చిన్నప్పటి నుంచి, బహుశా 9, 10 తరగతుల నుంచి వాళ్ళ అమ్మతో పాటు షాడో నుంచి, యండమూరి, తదితరుల రచనలన్నీ చదివేసింది. చుట్టూవున్న వాతావరణం, మతాలను అమర్యాదకు గురిచేయడం, కుల, జాతి, వర్షాల మధ్య నుండే స్పర్థలు ఆమెను ఊపిరాడనియ్యకుండా చేయడంలో ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి ఎదుర్కొనే స్థితిని అలవర్చుకుంది.

మనుషులంతా ఒకటేనని ఎందుకు గుర్తించరనేదే ఆమె ఆవేదన. చిన్నప్పటినుంచీ అవమానాలకు ఎదిరీది, ఆత్మ గౌరవ ప్రకటనలు చేసింది.

కృష్ణాజిల్లాలో వున్న ‘హనుమాన్ జంక్షన్’ ఆమె పుట్టిన ఊరు. వైజాగ్లో టీచర్ గా, విజయవాడలో జర్నలిస్ట్ గా పనిచేస్తూ వుండేది. గాయపడిన ఆమె మనస్సు రెండేళ్ళపాటు  డిప్రెషన్ నదిలోకి పడేసింది. ఎంత ఈదినా ఒడ్డుకు రాలేకపోయింది. అటువంటి ఆ డిప్రెషన్ నుంచి ఆమెను ఓ కెరటమై వచ్చి తాకింది కవిత్వం. కవిత్వం నాకు చాలా వూరట నిచ్చింది. సోషల్ మీడియా వల్ల కూడా నేను ఎంతో నేర్చుకోగలిగాను. ‘కవి సంగమం’లో చేరడం వల్ల కవిత్వ మెరుగులు దిద్దుకోగలిగాను అని అన్నది.

ఆమె మొదటి కవితా సంపుటి ‘ఏడవ రుతువు’ 2019 లో వచ్చింది. ‘కరోనా’ మీద రాసిన 20 కవితలు త్వరలో రెండవ పుస్తకంగా రాబోతోంది. మూడవ పుస్తకంగా కవిత్వ సంపుటి కూడా రాబోతోంది.

కులాంతర వివాహం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె సహచరుడు ఆర్మీ సోల్జర్ అవడం వల్ల అప్పటికే తనకున్న దేశభక్తి రెట్టింపయింది. భావ సారూప్యత ఇద్దరినీ ఒకటి చేసింది.

మనుషులంతా ఒకటిగా కలిసిమెలిసి జీవించాలన్న తపనను కూడా కవిత్వంలో పదేపదే ప్రస్తావిస్తుంది. ఆమె గుండె మండినప్పుడల్లా, ఆమె జ్ఞాపకం వానలా కురిసినప్పుడల్లా, ఆమె దృష్టి దుర్మార్గాన్ని తునుమాడినప్పుడల్లా, అదొక అక్షర దేహాన్ని ధరించి కవితగా మారుతుంది. నెమ్మదిగా చెప్పినట్లున్నా స్పష్టత నిండిన కవిత్వం ఆమెది. వైష్ణవి శ్రీ లో నేను గమనించిన అంశమునుండే తక్షణ స్పందన. ఒక వార్తో, ఒక మాటో, ఒక విషయమో, ఒక సంఘటనో జరగ్గానే అల్లకల్లోలమవ్వడం ఆమె స్వభావం. ఆ విషయం మీద రాయకుండా వుండలేదు. రాసేంతవరకూ అగ్నిలా మండుతూనే వుంటుంది. అలాంటి రాయలేకుండా ఉండే కవిత్వాన్ని కవితగా మార్చుతుంది. ఒక్కొక్కసారి అంతవేగంగా రాసెయ్యడం వల్ల అక్కడక్కడా కొన్ని చోట్ల కవిత్వం పలచబడినా, అది విషయం బలమైనది కావడం వల్ల పరిగణనలోకి రాదు. ‘గౌరీ లంకేష్’ మీద రాసిన కవితలో…

‘‘అక్షరాన్నెవరూ చంపలేరు

భగభగమండే అగ్నిగోళం కదా’ – అంటుంది.

‘నాకై… నేను’ కవితలో తనలో తాను, తనకై తాను జీవించే విధానాన్ని చెబ్తూ 

‘‘దారి పొడుగులా గాయాలే
అదే నన్ను ఓదార్చి గేయాలవుతాయంటుంది’’

చాలా మంది విమర్శకులు, తూచేరాళ్ళని, కొలిచే స్కేళ్ళనీ, ఉండే భావజాలాన్ని, తమకున్న సిద్ధాంత బలాన్ని ప్రదర్శనగా చేస్తుంటారు. ఎక్కడెక్కడో, ఏదేదో దేశాల్లోనో ఏవేవో భాషల్లో రచిస్తున్నవారికీ, వీరికీ పోలికలు చెబ్తుంటారు. నిజానికి వీళ్ళెవరూ ఒకరినొకరు చూసుకొని వుండరు. వాళ్ళ వాళ్ళ రచనలు చదివివుండరు. కాని, మానవ స్వభావం, అంతర్లీనత, ఆలోచించే ధోరణి, అనుభవసారం,  అమలు పరిచే చర్యలు ఇంచుమించుగా ఒకటేనన్న నిజాన్ని చెప్పడం కోసం బహుశా ప్రస్తావిస్తారన్పిస్తుంది.

‘ఎనిమిదోరంగు’ – కవితలో

‘జీవితమంటే ఇంద్రధనుస్సులో

ఏడురంగులనుకున్నా

కురిసిన వెన్నెల్లో ఆడుకునే పసిపాప అనుకున్న

ఇదేంటో ధనదాహమనే ఎనిమిదో రంగు పులుముకుంటోంది’’.

‘తలాక్’ అనే కవితలో కూడా ఆమె నిర్భయంగా, నిస్సంకోచంగా ప్రకటించిన తీరు బాగుంటుంది.

‘పైపైకి నవ్వులు రువ్వే కుబూల్లు మాకొద్దు

ఆత్మస్థైర్యాన్ని పెంచి బానిసత్వానికి

‘తలాక్’ చెప్పే అమ్మిజాన్, అబ్బాజాన్ లు

మాకు కావాలిప్పుడు’’ అంటుంది.

“ఏడవ రుతువు” కవితా సంపుటికి తెలకపల్లి రవిగారు, కె.న్. మల్లీశ్వరిగారు కూడా ముందుమాటలు రాశారు. 78 కవితలున్న ఈ పుస్తకం ఎంతో విలువైంది.  ఒక్కో కవితా ఒక్కో భావశకలం. ఆర్తిగీతం, అంతరంగ తరంగం. కన్నీటి జడి, బలోపేతం కావాల్సిన అవసరం ఇలా ఎన్నింటినో కవిత్వం చేసింది.

వస్తు విస్తృతి ఎక్కువ, రాయని కవితాంశం ఆమెది లేదన్నా అతిశయోక్తికాదు. ప్రతి కవితనూ ఎంతో మమకారంతో ఉద్వగ్నతతో రాయడం మనందరికీ కనిపించే విషయం. వైష్ణవి శ్రీ మిగతా రెండు పుస్తకాలు కూడా తొందర్లో వస్తాయి కాబట్టి వీటినీ చదువుదాం.

*****

Please follow and like us:

2 thoughts on “కొత్త అడుగులు-23 ‘కవిత్వ రుతువు వైష్ణవి శ్రీ’”

  1. మంచి విశ్లేషణ చేశారు మా, కవిత్వంలో కదిలిచే సామాజిక అంశాలు ఉండడం బలమైన తన వ్యక్తికరణ అంశాలు బాగా చెప్పారు అభినందనలు వైష్ణవి అక్కా

    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు రూప

Leave a Reply

Your email address will not be published.