బతుకు చిత్రం-9

– రావుల కిరణ్మయి

పొద్దు పొద్దుగాల్నే వచ్చినవ్ ?అక్కా ?కూసో అని  ఇంటిముందున్న గద్దె ను తన భుజం మీది తువ్వాలు తో దులిపి ,సామిత్రి …సామిత్రి …..!అంటూ భార్యను కేకేసాడు.పరమేశు.

ఏందీ ..!అని శిక ముడుచుకుంట వచ్చి న సావిత్రి,గద్దె మీద ఈర్లచ్చిమిని చూసి..

అయ్యో !వదినే ..!నువ్వేనా ?దాదా…!లోపల కూసుందం.పరాయిదానోలె వాకిట్ల కూసునుడేంది?అని చెయి పట్టి లోపలకు రమ్మన్నట్టుగా పిలిచింది.

మనసుల పావురం ఉండాలె గని,ఇంట్లేంది?బైటేంది?వదినె?ఇట్ల గూసో!అని పక్కన కూర్చో బెట్టుకొన్నది.

ఎక్కడివరకు వచ్చినయ్ వదినె పెండ్లి పనులు?అన్నది సావిత్రి.

సుట్టుముట్టు ఊర్లళ్ళ సుట్టాలకందరికి ముట్టినయ్.ఊళ్ళో ఇయ్యాలె.రేపనంగ అన్న,నేను బొట్టప్పజె ప్పుకుంట కారట్లు,ఇచ్చి కూరాడు పట్ట సుత రమ్మని పిలిత్తే అయిపోతదని అనుకుంటాన.

ఆ…గంతే వదినే!గట్నే చెయ్.మల్ల మల్ల ఎన్ని సార్లని తిరుగుతవ్?చిన్న కోడలు అచ్చిన్దా వదినె?అడిగింది.

రాలే వదినే!రెండు రోజుల ముంగట వత్తనన్నారు.మా కోడలుకు పల్లెటూరు పడదట.పని చేతగాదట.కోడలుకంటే ముందు కొడుకే సదిరిండు.అన్నది ఈర్లచ్చిమి.

అంతే వదినె..!మీ కోడలు నడుమంత్రం సిరివత్తె నన్నెత్తుకొమ్మన్నట్టే చేస్తది.అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక అన్నట్టు దాని పుట్టు పూర్వోత్తరం నేనెరుగనా?అది పుట్టినప్పుడు ఇంత గంజి కాచి ఇయ్యటానికి కూడ ఏమి లేకుంటె మా అవ్వే ఇన్నన్ని సన్న నూకలు తీస్కపోయి ఇచ్చింది.దాని అమ్మమ్మ ,బిడ్డా ..!నీ లాంటోల్లు ఉండపటికనే నా బిడ్డ ఈ తిరుగున్నదని కాళ్ళు మొక్కి ఏడిశిందట.మా అమ్మగారు,మీ కోడలు అమ్మగారు ఒక్కూరేనాయే!నాకు తెల్వదన్నట్టు చేత్తది.అమ్మగారింటికాడ ఎన్నడన్నా కనవడ్డ సుత మాట్లాడను గూడ మాట్లాడది.మందలిచ్చినా ఆ…ఊ..అంటది తప్పితె మల్లో ముచ్చట అడుగది.పెయ్యిని చూస్క మురుత్తది.నీ కొడుకు లాగం దొబ్బి ఆటాడిత్తాంది.నువ్వింత మెత్తగుండే వరకు దానికి ఆడింది ఆటరా !పాడింది పాటరా !అన్నట్టు అయితాంది.

లేకుంటే,అక్కను ఏమీ చెయ్యమంటవే?అన్నాడు.గ్లాసులలో చాయ దెచ్చి ఈర్లచ్చిమికి,సావిత్రికి ఇచ్చుకుంటూ పరమేశు.

ఎంది?తమ్మీ?నువ్వు తెస్తివి?అటెంక  మా మరదలు తేక పోయిందా?అన్నది ఈర్లచ్చిమి.

ఆడేంది?మగేంది?అక్కా!నిన్ను చూసినంకనే నేను కూడ అదోటిదోటి ఆసరైతాన.లేకుంటే ముసలితనానికి మనకెవలు చేత్తరు?తిట్టుకున్నా,కొట్టుకున్నా మల్ల ఆపతికి భార్యకు భర్త,భర్త కు భార్య తప్ప ఎవ్వలు గారు.అన్నడు.

అగో..!గా తండ్లాట తోనే సైదులు గానికి ఓ తోడున్డాల్నని కులం కాక పోయినా వాణ్ని బాగ అర్థం చేసుకునేటట్టున్నదని ,వీడు బాగ కాయిశు పడుతాండని నేను సుత ఏమీ సూడక,అడుగక ముందడుగేసిన తమ్మీ!అన్నది.

మంచిపని చేసినవ్ అక్కా..!కులం,మతం కూడు బెడ్తయా..?గుడ్డ నిత్తయా..?చిన్న కోడలు అయిన కులందేనాయే.ఏ పాటి అర్సుకున్టాందో ఏర్పడతలేదా? అన్నాడు.

చిన్నోనికి గదే ఉండి,పెండ్లి ముచ్చట్లకు దూరమున్టాండు.అయ్యగారు లేకుంటె అమాసాగుతదాని .

..వాడు పట్టించుకోకుంటే పెండ్లి ఆగుతదా?తమ్మీ? 

 అంతే గదక్కా!బావకేమన్న అక్కెరుంటే నేను లేనా?సాయతుకు.ఒక్క ఫోన్ చేస్తే వచ్చి వాల్త.అన్నాడు.

ఫోన్ ఎందుకయ్య?ఈ వాడకావాడ ఏపాటి దూరం?రాన్గనో,పోన్గనో మందలిచ్చుకుంట ఉంటె సరే..!అన్నది సావిత్రి.

అట్నేతీ!అని బాయి కాడ పనుందని వెళ్ళి పోయాడు పరమేశు.

సావిత్రీ ..!నీ లెక్కన్నే ఆ జాజులమ్మ సుత సైదులు ను బాగు జేసుకుంటే చూసి జీవిడువాలనున్నదే!అన్నది.

పెండ్లి పెట్టుకొని గవేమి మాటలు?వదినె?ఊకో..! ఎండ ఎల్లకాలముండది,నీడ నిండా ఉండదని ఎప్పుడు సైదులు అట్నే ఉంటడా?లగ్గమైనంక పిల్లో జెల్లో అయితే వాడే మార్తడు.పరమేశు ఎట్లుండే?యాది మరుత్తివా ?వదినే ?అన్నది.

గదే..!వదినే నత్తోడు …నత్తోడని…ఊరంత పిల్శి అసలు పేరు మరిపిచ్చిరి.నిన్ను చేసుకున్నంకనే కదా!వాని కిస్మత్ మారింది.గట్నే నా కొడుకు దశ తిరుగక పోతదాని చిన్న ఆశ.అన్నది.

అంత మంచే జరుగుతది వదినే..!సరే గని,పసుపు గిన ఎన్నడు కొడ్తానవ్ ?అడిగింది సావిత్రి .

ముచ్చట సంబురాన మొగుణ్ణి మర్సినట్టే ఉన్నది నా ముచ్చట సుత.అది చెప్పి నిన్ను పిలువడానికే వచ్చిన,రేపు శనివారం అనుకుంటాన.నువ్వు పొద్దుగాల్నే రా వదినే.ఇంకో నలుగురు ముత్తైదు వలను పిలుత్త.ఆన్నే భోజనాలు సుత.ఇంకో ఇసయం గా పొదుపు సంఘంల అప్పు అడిగితె బాగుండు.మా ఆడిబిడ్డలకు ఇంటిల్లిపాదికి బట్టలు పెట్టి శార పోత్తె బాగుండని ఉన్నది.ఓ పారి బోదం సంఘం కాడికి వత్తవాని వచ్చిన్నే అన్నది.

దాన్దేమున్నదొదినే?పోదాం తీ .!మాపటికి వత్త తీ ..!అట్నే నాకు వచ్చేటియి,నేను నీకు ఇచ్చేటియి అన్ని ఇత్త తీ ..!అన్నది సావిత్రి.

ఈర్లచ్చిమి మనసు కుదుటపడింది.ఇంటికి బయలుదేరింది.

దారిలో మగ్గాల సప్పుడు శాలోళ్ళ ఇంటిదాక రాగానే వినబడుతుండగా..శాలోళ్ళ గౌరీశం డబ్బులు ఇచ్చేది గుర్తుకు వచ్చి…,అటువైపు నడిచి వాళ్ళింటికి వెళ్ళింది.

అన్నా ..!గౌరన్నా..!బాగున్నావే!అన్నది.

నువ్వా లచ్చిమి రారా…ఏమే ..పద్మా ..!లచ్చిమచ్చింది కూసోను పీట  పట్కరా..!అన్నాడు చేస్తున్న పని ఆపి.

పీటెందుకే?అవతల ఏగిరమున్నది.మా సైదులు పెళ్ళి పెట్టుకుంటిమి కదా!నువ్విచ్చే పైసలు ఇత్తవేమోనని అచ్చిన.

అయ్యో .!వదినే …!నువ్వు అడుగక ముందే ఇయ్యాల్నని తల్సినం గని,సూత్తివా..?కరువచ్చి సరుకంత మూలకే ఉన్నది.దుకాణ పోళ్ళు ఇదే మోకానీ అగ్గువ సగ్గువకు అడుగుతాండ్రు.ఊర్లు దిరిగి  అమ్ముకునేటోళ్ళు జాడే లేరు.సరుకు ఏ కొంచెం అమ్ముడైనా ముందుగాల ముందుగాల నీకే ఇయ్యాల్ననుకుంటానం.  

అవునా..!అన్నా..!కానీ మా సంగతి కూడా మీకు బాగ ఎరికే కదా !చేతిలో చిల్లి గవ్వ కూడా లేని అమ్మాయిని కోడలిగా చేసుకుంటానం.ఇది గొప్ప కోసం చెప్పటం లేదు.నేనైనా ఆ పొల్లకు బట్టలు బాతలు కడుపునిండ పెట్టాలెగదా!ఇగ మా యవ్వారం గూడా నీకెరికే.అందుకే అడిగిన.అని ముద్దు ముద్దుగా కల హంసలు,చిలుకలు.పూల తీగలు.కమలాలు ఇట్లా అందమైన బొమ్మలతో,మంచి రంగులతో నేయ బడిన ఎనిమిది గజాల ఆ చీరలను చూడగానే ఈర్లచ్చిమికి ఒక ఆలోచన వచ్చి ..,

అన్నా..!నేనొక మాట చెప్త.నువ్వు ఏమనుకోనంటే,నువ్విచ్చే ఈ పైసల కింద ఈ చీరలు నాకిస్తే మా ఆడబిడ్డలకు  పెట్టడానికి పనికస్తయ్ . ఇటు నీ కష్టం,నా కట్టం రెండు తీర్తయ్.ఏమంటవ్?అన్నది.

వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు మంచి ఉపాయం చెప్పినవ్ చెల్లే!ఇంతకంటె ఎక్కువ నాకేమి గావాలే అన్నాడు సంబరంగా.

వదినే ..!నీ సాయం ఎన్నడు మరువ.ఇంకొగరింకొగరైతే ఏ చెర్ల దూకైనా మా బాకి కట్టమందురు గావచ్చు.గీ తీర్గ ఓపిక పట్టుదురా!అన్నది పద్మ ఆప్యాయంగా చేతులు దగ్గరకు తీసుకొని.

వదినే ..!ఉండంగ ఇయ్య లేక పోవుడు కాదు కదా!కరువు కాలం గట్లున్నది.సరే ,నువ్వు గట్ల బాధవెట్టుకోక మా వోళ్లకు సరిపోయేటివి నువ్వే తీసి పెట్టు వదినే!మూట ఇయ్యాల ఉంటది రేపు ఓతది,మాట మంచి ఎల్లకాలముండేటివి గదా!అవి పోకుండా కాపాడుకోవాలే.అన్నది తనూ ఆప్యాయంగాఈర్లచ్చిమి.  

అలా గౌరీశమ్ ఇంటికాన్నుండి వస్తూ వస్తూ.. ఒకప్పుడు వాల్ల స్థితిగతులు గుర్తు చేసుకోవట్టింది.

గౌరీశం తండ్రి చాలా నియతి గలవాడుండే.సుట్టు ముట్టు ఊర్లళ్ళ ఎవరింట్ల పెండ్లైనా,పెళ్ళికూతురు చీర నేతకు ఆయనకే ఇచ్చేది,దానికి రెండు కారణాలు.ఆయన తగిన ఖరీదులోనే చీర నేయడం ఒకటైతే,ఆయన హస్తవాసి చాలా మంచిదని ఆయన నేసిన చీర తో పెళ్ళి పీట లెక్కిన ఆడబిడ్డ సుఖ సంతోషాలతో తులతూగుతదని గట్టి నమ్మకం మరొకటి.అట్ల ఎప్పుడు లయ బద్దంగా ఆ వాడ మీద మగ్గం రికం లేకుండా పాట  పాడుతున్నట్టే ఉండేది.తరువాత కొడుకు గౌరీశం కూడా తండ్రి అంతటో డైనా కాలం మారి ,మునుపటంత గిరాకీ వస్తలేదు. యంత్రాలు మొదలై చేతి నేత ను దెబ్బ తీస్తున్నది,అలా పూలమ్మిన చోటే కట్టెలు అమ్మలేక కుల వృత్తిని వదులుకోలేక కాపాడుకుంటూ కడుపుకు తప్ప మరేమీ ఆశించకుండా వెళ్ళదీస్తున్నడు.అనుకుంటూ ఇల్లు చేరింది ఈర్లచ్చిమి.

బిడ్డా !జాజులూ..!పిలుస్తున్నాడు పీరయ్య మంచం లో కూర్చుండే.

ఏంటిదే నాయనా..!ఏం గావాలె అనుకుంట చేస్తున్న పని ఆపి వచ్చింది.

ఏం జేత్తానావ్ ?తల్లీ ..!

ఏముందే..పెళ్ళి దగ్గరవడవట్టే.గింత గుడిసెకు జాజు రుద్ది మల్ల సున్నం తోని ముగ్గులన్న ఏద్దామని నా సాయతు కోమలున్ను నేను రుద్దుతానమే.అన్నది.

ఆ మాటలకు పీరయ్య కండ్లలో నీళ్ళు తిరుగుతుండగా…మీ అమ్మా,అన్నలుంటే నీ పెళ్ళి ఎంత వైభోగంగా జరిగేదో!తల్లీ!చూసే రాత లేక మీ అమ్మ సచ్చి పోతే,చేసే బాధ్యత లేక మీ అన్న లు తప్పించుకుంటే దేవుడు దయ జూసి ఆ ఈర్లచ్చిమిని తోలిచ్చిండు.ఇక్కడికీ దేవుడే మనకు తోడు న్నా డు బిడ్డా..!లేకుంటే నువ్వు ఆ రాములోరి కళ్యాణ గద్దె మీద చేరుడేంది?ఆ అయ్య కు సేవ జేసుడేంది?నాకు ఇప్పటికి కల లెక్కల్నే,మాయ లెక్కల్నే ఉన్నది.అంటూ కళ్ళు తుడుచు కోసాగాడు.

నాయ్నా..!నువ్విట్ట మాటి మాటికి రంది పడుతుంటె పనులెట్లయితయ్?చెప్పు.మనోళ్ళకు నువ్వు చెప్పకుంటే ,పీరిగాడు కండ్లు నెత్తికెక్కి,కాళ్ళు భూమ్మీద ఆడ్తలేనట్టే ఉన్నయ్.లగ్గానికి మేం కూడ తలో చెయ్యేత్తనన్నం గదా!వీనికి గిన్తనన్న ఇశ్వాసం లేకుంటె ఎట్లని నానాతీర్ల మాట్లాడుతరు.వాళ్ళ కొంచపు బుద్ధులు నికెరుక లేదానే?నువ్వెందుకు అనిపించుకోవాలె?ఏనుగు సచ్చినా బతికినా బంగారమేనని నువ్వు ఎప్పటికి ఒక్కతీర్గనే  ఇజ్జతుగుండాలే!అని అంటుండగా…

ఇంకెక్కడి ఇజ్జతు బిడ్డా?అన్నలు మనల్ని మన మానాన మనల్ని వదిలేసినప్పుడే పాయె.లోకులకు నేను అలుసైంది గక్కన్నే కదా!ఒంటరోడు వానితోని ఏమైతదనే కదా వాళ్ళ ధీమా?అన్నాడు.

నాయ్నా..!నీకిప్పుడు కొడుకులే కాదు.అల్లుడు గూడ ఉన్నడు.అది మరువకు.ఆపతికి సంపతికి కొడుకులే కాదు,బిడ్డలు కూడ అయినోల్లె అని మరువకు.నిన్ను ఇట్నే ఇడ్సి పెడితే ఉన్నయ్ లేనియ్ ముచ్చట్లన్ని ముంగటేసుకొని పొద్దు పుచ్చుతవ్.లే నాకు ఆసరైదువు గని అన్నది.

ఇంతలోనే పోలయ్య వచ్చాడు.

ఏంది ?బిడ్డా..?నాయన ఏమంటాండు?మల్ల మొదలువెట్టిండా?కొడుకులు…కొమ్మలని …?అన్నాడు వస్తూనే.

అవునే,ఎన్నిమాట్ల జెప్పినా ఆయనకు ఆల్లమీదనే యావ?ఆర్చేటోల్లా?తీర్చేటోళ్ళా?నా లగ్గం నెత్తిన వడ్తదనే కదా!తట్టా బుట్టా సడురుకొని జడ పత్తా లేకుంట పోయింది.ఇప్పుడు పిలువడానికి కూడా తెలువదాయే.కాకుంటే మా ముచ్చట్లయితే తెలుసుకునే ఉంటాంటరు.నేను లగ్గమయి పోంగనే వచ్చి వాలకుంటే అడుగు.అన్నది ఈసారి తన కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా.

లగ్గం చేసుకోనేదానివి,ఏడ్వద్దు బిడ్డా?నీకు సాయతుకు చిన్నమ్మను తోల్త.దేవుడే దగ్గరుండి చేయి స్తున్న లగ్గం.నీకు ఢోకా లేదిక. అన్నట్టు ఓ ముఖ్యమైన ముచ్చట చెప్పుదామనే వచ్చిన.రాములోరి కల్యాణం శో పత్రికలు అచ్చేఇంచుకచ్చిండ్రట.మీకు ఎన్నిగావాల్నో తీస్కపొండ్రని పొద్దుగాల ఆచారి గారు మనిషిని తోలిండు.ఆటే పోతాన.చెప్పి పోను వచ్చిన బిడ్డా..!అన్నాడు.

పీరయ్య నిమ్మలానికి వచ్చి పారా …!పోలిగా ..!నేను గూడ వత్తపా… అని భుజం మీద తువాలేసుకొని కదిలాడు.

నువ్వు గిట్ల నీకు చాతనైన పని చేసుకుంట ఉషారుగుంటే పొల్లకు ఎంత సంబురం అని పోలయ్య కూడా కదిలాడు.

జాజులమ్మ ఆ ఇద్దర్నీ చూస్తూ నాయన ఎప్పుడూ ఇదే ఉత్సాహం తో ఉండాలని మనసుల అనుకున్నది.మరో వైపు అన్నలు కూడా తన లగ్గానికి వచ్చి పోతే బాగుండని ఆశ పడింది.కానీ వాళ్ళు ఎఊర్లు తిరుగుతాండ్రో,అందరు ఒక్క తానే ఉన్నరా?వేరు వేరు చోట్ల ఉన్నరా ఏది తెల్వదాయే !అని కూడా అనుకుంది.ఆలోచిస్తున్న జాజులమ్మను…కుదిపి కోమల ….

ఏమే ..!పెండ్లి పిల్లా ఇప్పుడే కలలు కంటానవా?అన్న ను గూర్చి యావ ల పడి నీ పని మర్సిపోతే ఎట్లనే తల్లీ..అంది.

ఎహే…ఆపు ..నువ్వోటి..!గుడిసె కాలి ఒగడేడుత్తాంటే నీలాంటోడే వచ్చి సుత్తకు నిప్పడిగిండట.అన్నది అన్టేందే?అన్నది కోమల.

లేకుంటె ..మరి,మా అన్నలు యాడుండ్రో ఏందోనని నేను అనుకుంటాంటే నువ్వు పరాశికం ఆడవడితివి.అన్నది.         

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.