చాతకపక్షులు  (భాగం-6)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

నెమ్మదిగా కదిలి ఎవరిదారిన వారు పోతున్నారు విద్యార్థులు. గీత మాత్రం ఎవరితోనూ కలవకుండా కొందరికి కొంచెం ముందుగానూ చాలామందికి వెనగ్గానూ నిదానంగా నడుస్తూ, పొరపాటున ఎవరిభుజమేనా తగిల్తే చిరాకు పడుతూ, వాళ్లమాటలు వింటూ, వాటిని నిరసిస్తూ, తన ఆలోచనలేమిటో తనకే తెలీని అయోమయావస్థలో ఇల్లు చేరింది. 

“పాసయేవా?” వరండాలో వాలుకుర్చీలో కూర్చున్న తండ్రి పరమేశంగారు అడిగేరు. 

“ఆఁ” అంటూ తలూపి గీత ఇంటిలోకి వెళ్లిపోయింది. 

“బతికించేవు” అంది వరండాలో కూచుని వత్తులు చేసుకుంటున్న తల్లి కామాక్షి. 

గీత లోపలికెళ్లి తనపుస్తకాలగూటిదగ్గర నిలబడింది. ఆపుస్తకాలు నిన్నటివరకూ తనకి ప్రాణప్రదం. ఇప్పుడు వాటితో అవసరం తీరిపోయింది అనుకోగానే దిగులూ ఆనందమూ కలగాపులగంగా ముప్పిరిగొన్నాయి మనసులో. 

“కాఫీ తాగుదూ గానీ రావే” తల్లి లేచింది వంటింట్లోకి నడుస్తూ.  

“నువ్వు పరీక్ష పాసవుతే నాకు పావలా ఇస్తానన్నావు కదా గాలిపటం కొనుక్కోడానికి,” అన్నాడు తమ్ముడు చిట్టి వెనకనించి వచ్చి. 

“ఎప్పుడన్నానూ?” అంది గీత పరధ్యానంగా. 

“అల్లప్పుడూ …. మరేమోనూ సరోజక్క మనింటికొచ్చినప్పుడూ, … నేనేమో డప్పులు వాయించుకుంటుంటేనూ“ ఏడేళ్ల చిట్టి సాగదీస్తూ చెబుతుంటే గీత వాణ్ణి అట్టే చూస్తూ నిలుచుండిపోయింది. 

పరమేశంగారు కూడా కాఫీకోసం లోపలికొస్తూ “ఏమిట్రా నీసొద. తరవాత ఇస్తుందిలే. వెళ్లి ఆడుకో” అన్నారు.  

గీత ఉలికిపడి అప్పుడే మేలుకున్నట్టు “తరవాత ఇస్తాలే” అంది తమ్ముడితో. 

వంటింట్లోకి వెళ్లి కాఫీ తాగుతుంటే, అమ్మ “నాగమ్మత్తయ్యా వాళ్లింటికెళ్లి రెండు కరివేపాకు రెబ్బలు విరుచుకు రా. పులిహోర కలుపుతాను,” అంది. 

గీత తన పుస్తకాల గూటివేపు మరోసారి చూసి గుమ్మం దిగింది. నిన్నటివరకూ ఆపుస్తకాలమీద ఎనలేని మమకారం, ఇవాళ ఇదీ అని చెప్పలేని నిరీహ. ఆ భావం ఎంత విదిలించుకున్నా మనసులోనించి పోవడం లేదు!

    ***

“అమ్మ కరివేపాకు తెమ్మంది” 

పెరటివేపు వసారాలో స్థంభాన్నానుకు కూచుని సీతారామాంజనేయం చదువుకుంటున్న నాగమ్మ తలెత్తి గీతని చూసి, “కోసుకో” అంది.

గీత మాటాడకుండా చెట్టువేపు సాగింది. 

“పరీక్షలేశారటగా. పాసయేవా?” అనడిగింది నాగమ్మత్తయ్య.

“ఆఁ, పాసయేను.” 

“ఏం చేస్తావయితే?”

కరివేపాకు కొమ్మ వంచి రెమ్మలు దూసుకుంటున్న గీత ఆలోచిస్తోంది. ఆవిడప్రశ్నకి తనదగ్గర సమాధానం సిద్దంగా లేదు. సరోజ మెడిసన్ చదువుతానంది. నవనీతం సెకండరీ గ్రేడ్ ట్రైనింగుకి వెళ్తానంది. కుముదం తల్లి నర్సు. కుముదం కూడా నర్సే అవుతుంది. తను? పెద్ద ప్రశ్నార్థకం. 

దూసిన నాలుగు రెమ్మలు చేత పుచ్చుకుని, “వస్తానత్తా” అంది. 

నాగమ్మ తలెత్తి, కళ్లజోడు తీసి పక్కన పెడుతూ, “వెళ్లొచ్చులే, కూచో” అంది. 

“అక్కడ పోచికోలు చెబుతూ కూర్చోక వేగిరం వచ్చేయి అంది అమ్మ” అంది గీత. 

“అలాగే వెళ్దూ గానిలే. కాలేజీలో చేర్తావా మరి?”

“ఏమో.”

“ఏమో ఏమిటి? చదివింది చాలు. మరింక చదవక్కర్లేదు అందా ఏమిటి మీ అమ్మ?”

“ఉహుఁ. అమ్మేమీ అనలేదు.”

“మరి మీ నాన్న అన్నాడా?”

గీత లేదన్నట్టు తల అడ్డంగా వూపి, “వెళ్తాను ఆలస్యం అయిపోతుంది” అంది. 

“సరే వెళ్లు గానీ ఏమో, ఏవిటో అంటూ ఆ నంగిమాటలు వదిలెయ్. సుబ్భరంగా కాలేజీలో చేరు. చాకలిపద్దు చూడ్డం వస్తే చాలు అనుకునే రోజులు పోయేయి. ఓ కాయితపుముక్క వుంటే గానీ పుస్తె ముడెయ్యడు ఎవడూ.”

Sep2021గీత మరోమారు తలూపి మెట్లు దిగింది. కనీసం రాత్రయినా అడుగుతారా అమ్మా నాన్నా ఏం చేస్తావని? అడిగితే ఏం చెప్పడం? తనని అడక్కుండా వాళ్లే ఏదో నిర్ణయం చేసేసి ఇది చెయ్యి అంటే ఏం చెప్పడం? ఆలోచనలతో సతమతమవుతోంది గీత. 

గీత అంచనా కొంతవరకూ నిజమే అయింది. 

రాత్రి భోజనాలదగ్గర కామాక్షి ఆ ప్రసంగం తెచ్చింది. కూర కంచాల్లో వడ్డిస్తూ, “కాలేజీలో చేరాలంటే చాలా డబ్బవుతుంది కాబోలు” అంది తనలో తను మాటాడుకుంటున్నట్టు. 

“వూ” అన్నారు పరమేశంగారు సాలోచనగా. 

“కాలర్షిప్పులో ఏవో వుంటాయిట గదా” అందావిడ మళ్లీ.

“సరేలే వదినా! అవన్నీ మనలాటివాళ్లకి కావు. డబ్బున్న ఆసామీలకే ఆ పట్టాభిషేకాలన్నీను” అన్నాడు మరిది భానుమూర్తి. 

“ప్చ్” అందావిడ నీరు గారిపోతూ. డబ్బున్నవాళ్లకే స్కాలర్షిప్పులు ఎందుకిస్తారని అడిగేంత అమాయకురాలు కాదు ఆవిడ. 

తలొంచుకు అన్నం కూరా కెలుకుతున్న గీతకి అమ్మా, నాన్నా, చిన్నాన్నా తనగురించీ, తన భవిష్యత్తుగురించీ మాటాడుతున్నట్టు అనిపించడంలేదు.

*** 

పరమేశంగారిది బతికి చెడ్డ కుటుంబం. ఆస్తులన్నీ హరించుకుపోగా ఇవాళో రేపో కూలిపోడానికి సిద్దంగా వున్న పెంకుటిల్లూ, విజయవాడలో ఎలిమెంటరీ స్కూల్లో ఉద్యోగమూ అంతే ఆయన లోకం. ఇద్దరు మొగపిల్లలూ ఇద్దరు ఆడపిల్లలూ. గీత రెండో సంతానం. ఆయన తమ్ముడు భానుమూర్తి టెలిపోను కంపెనీలో ఆపరేటరుగా పని చేస్తూ చేదోడు వాదోడుగా ఆఇంటనే కాలం గడుపుతున్నాడు. చేదోడుగా వున్నందున పిల్లల చదువులకి సాయం అవుతోంది. వాదోడుగా అతడు విసిరే విసుర్లు మాత్రం చిరాగ్గా వుంటున్నాయి కామాక్షికీ, గీతకీ. వాళ్లతో పాటు ఆ పంచనే కాలం వెళ్లబుచ్చుకుంటున్న మరో ప్రాణం బామ్మగారు. ఆవిడ పరమేశంగారికి వరసకి పినతల్లి అవుతుంది. వున్న ఒక్క కొడుకూ ఆవిడని ఇంట్లోంచి తగిలేస్తే, పరమేశంగారి తల్లి, అయ్యో నాకు సాక్షాత్తు అక్కలాటిది అంటూ చేరదీసింది. పరమేశంగారి తల్లి పోయినతరవాత ఆవిడకి వారసురాల్లాగా ఆయింట్లోనే కాలం గడుపుతున్నారు బామ్మగారు.  

***

శనివారం సరోజ ఇంట్లో పార్టీకి గీత వెళ్లి తిరిగి వచ్చేసరికి పొద్దు పోయింది. 

“పార్టీ బాగుందా?” అనడిగింది తల్లి కామాక్షి గీతమొహంలోకి చూస్తూ. అక్కడ ఆపిల్ల ఎలాటి ప్రశ్నలు ఎదుర్కొని వుంటుందో ఆవిడ వూహించుకుని బాధ పడింది. 

గీత మౌనంగా తలూపి గదిలోకి వెళ్లింది బట్టలు మార్చుకోడానికి. 

భోజనాలయేయి. అలవాటు ప్రకారం, పరమేశంగారు వరండాలో వాలుకుర్చీలో వాలి పేపరు విప్పేరు ఆనాటి విశేషాలు తెలుసుకోడానికి. గీత చాపలూ, పరుపులూ తెచ్చి పరుస్తోంది మధ్యగదిలో. పిల్లలు ఆపక్కలమీదే కూచుని చదువుకుంటారు. పెద్దలు ఆపక్కలమీదే చేరి ఆరోజు విశేషాలు చెప్పుకుంటారు. వాళ్లచదువులూ, వీళ్లకబుర్లూ ముగిసేక గీత లేచి, పుస్తకాలు తీసి దాచి, పిల్లలకి దుప్పట్లు కప్పి, లైటార్పి పడుకుంటుంది. 

ఇప్పుడు అందరూ ఆవిధంగా గీత పరిచిన పక్కలమీద ఉపవిష్టులయేక, భానుమూర్తి, “అయితే సరోజ ఏంచేస్తుందిటా?” అని అడిగేడు, దిండు మడత పెట్టి దానిమీద మోచేతులానించి, పాముపడగలా తలెత్తి గీతవేపు చూస్తూ. 

గోడనానుకుని కూర్చుని సేద తీర్చుకుంటున్న కామాక్షి, “అలా దిండు విరవొద్దని ఎన్నిమార్లు చెప్పేను, భానూ. కావలిస్తే రెండు దిళ్లు పెట్టుకో,” అంది మరిదితో. 

గీత బాబాయి ప్రశ్నకి జవాబుగా, “మెడిసిన్ చదువుతుందిట” అంది.

“దానికి అంత తెలివితేటలు వున్నాయేమిటి?” అన్నాడు భానుమూర్తి హేళనగా. భానుమూర్తి పాలిటెక్నిక్ ‌కాలేజీలో కుస్తీపట్లు పట్టి అత్తెసరు మార్కులతో యాడాదిక్రితం అయింది అనిపించుకున్నాడు,

అతను సరోజని అలా తీసిపారేయడం గీతకి నచ్చలేదు. మనసు చివుక్కుమంది. “దానికెప్పుడూ మంచిమార్కులే వస్తాయి” అంది..

“అవేవో హిందీ పరీక్షలున్నాయిట కట్టకూడదుటే?” అంది బామ్మగారు వాకిట్లో నులకమంచంమీద పడుకుని చుక్కల్లోకి చూస్తూ. ఆవిడ పరమేశంగారి స్వంతతల్లి కాకపోయినా ఇంట్లో వుంది కనక ఇంటిమనిషికిందే లెఖ్క. అంచేత అడిగినా అడక్కపోయినా ఆవిడ అడపా తడపా ఓ సలహా పారేస్తూ వుంటుంది.

గీత గుండెలు చిక్కబట్టుకుని, “నాకు కాలేజీలో చేరాలని వుంది,” అంది.

“కాలేజీ అంటే మాటలా! బియ్యే కావాలన్నా నాలుగేళ్లు పడుతుంది. ఈలోపున మీనాన్న రిటైరవుతాడు,” అన్నాడు భానుమూర్తి. 

“హిందీ పరీక్షలు మాత్రం ఇవాళ మొదలెడితే రేపయిపోతాయేమిటి?” అంది గీత అతనివేపు చూడకుండా. 

“రేపు కాకపోతే ఎల్లుండి. కనీసం అంత ఖర్చు వుండదు కదా,” అన్నాడు భానుమూర్తి గీతని గుచ్చి చూస్తూ. ఆ అమ్మాయి ఆమాత్రం నోరు విప్పడం అతనికి ఆశ్చర్యంగా వుంది. సరోజ ఇంట్లో పార్టీమహిమ కాదు కదా అనిపించకపోలేదు అతనికి. 

కామాక్షిమొహంలో కళ తప్పడం ఎవరూ గమనించలేదు. “కనీసం బియ్యే అయినా అయితే బాగుండు” అందావిడ నిదానంగా. తనకి సాగలేదు కనీసం కూతురయినా బియే కావాలని ఆవిడ ఆకాంక్ష.. 

పరమేశంగారికి కూడా అంతరాంతరాల ఆ కోరిక వున్నా బాధ్యతలు నెత్తినెక్కి పిండి కొడుతున్నాయి. ఆయన ఎటూ చెప్పలేక మౌనం వహించేరు. 

భానుమూర్తికి వదినగారి వరస నచ్చలేదు. “ఆ బాగుండడం ఏమిటో నాక్కూడా అర్థం అయేలా చెప్పు వదినా, తెలుసుకుంటాను,” అన్నాడు. 

పరమేశంగారు ఆవులిస్తూ, “చాలు పదండింక. పొద్దున్నే లేవాలి” అంటూ లేచేరు. 

గీత భవిష్యత్తు ఎటూ తేలకుండానే ఆపూట చర్చలు ముగిసేయి.  

* * * * *

(ఇంకా ఉంది)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.