యుద్ధం ఒక గుండె కోత-8

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

పర్వత పంక్తుల నడుమ యుద్ధనేత్రం విచ్చుకొంది

క్షిపణి విత్తనాలు విస్ఫోటన పొగవృక్షాల్ని సృష్టిస్తున్నాయ్‌

శవాలగుట్టల మీంచి లేచిన మతంవాసన

వాతావరణాన్ని విషపూరితం చేస్తోంది

గాలిలో ప్రవహిస్తున్న ఉన్మాదం

శిరస్త్రాణాన్నీ, కరవాలాన్నీ ధరించి

ప్రపంచ జైత్రయాత్రకు బయల్దేరుతోంది

గోళీకాయ లాడుతోన్న పసివాడు

తుపాకీలో తూటాల్ని నింపటం మొదలెట్టాడు

అక్షరం ఆకారాన్ని తెలియని పసిది

సిగ్గుతో మెలికలు తిరుగుతూ

వేళ్ళని గుండెల్లో దాచుకొని జనానాలోకి పారిపోతోంది

నైతికత్వం అర్థాలు వెతుక్కోటానికి 

మతగ్రంథాల్ని తిరగేస్తోంది

జనాల మధ్యకి చేరిన వైరుధ్యాలు

చీలికల్ని లాక్కొంటూ చెరోవైపుకు పోతున్నాయి

పెరిగిపోతోన్న పరిధులు

వారి వారి కక్ష్యలలో విజృంభిస్తూ విస్తరిస్తున్నాయ్‌

ప్రపంచ యానకంలో ఏర్పడుతోన్న వృత్తాలు

జన జీవనాన్ని నిర్ధేశిస్తున్నాయ్‌

మతగ్రంథ సూక్తులూ, ప్రవచనాలూ చదవటానికి మాత్రమే

ఆచరణలో మాత్రం శూన్యం!

పొరుగువారిని ప్రేమించరు

పక్కవాడిపైనా సంశయమే

మతాన్నే ప్రేమిస్తారు

ఉందో లేదో తెలియని స్వర్గద్వారాలను

కలవరిస్తూనే మతంకోసం మరణిస్తారు

ఇంక అప్పుడు 

దైవాలందరూ భూప్రపంచకం మీదికి

ఆత్మల సేకరణకి బయల్దేరి రావాలి

ఎవరికోసం ఏ ఆత్మ త్యాగం చేసిందో

బూడిద కుప్పలని ఊదుకొంటూ ఏరుకోవాలి

పంచప్రాణాల్ని కన్నబిడ్డలలో పొదిగి

ఎంత ఎదిగినా కళ్ళల్లోనే రూపాన్ని దాచుకొని

తనకోసం కాక పేగుబంధం కోసమే బతికే

కన్నతల్లి మనసులోని మానవత్వాన్ని

మానవతలోని దైవత్వాన్ని గుర్తించిననాడు

హృదయ కవాటాల్ని కదిలించే సున్నితత్వం ఉండిఉంటే

మందిరాలూ మసీదులూ నేలమట్టమయ్యేవి కాదు

శాంతిదూత విగ్రహాలు కుప్పకూలేవి కాదు

*   *   *

వెంటాడుతున్నది దేనినో

వేటాడుతున్నది ఏమిటో

తెలియని అయోమయపు దాడుల్లో

బలయ్యేదిమాత్రం ఖచ్ఛితంగా

అన్నెం పున్నెం ఎరగని అమాయకులే!

చచ్చేదెవరో చంపేదెవర్నో

తెలుసుకోలేని రాక్షసక్రీడ కొనసాగుతూనే ఉంది

మానవత్వం గొంతుమీద

విచ్చుకత్తులు వేలాడుతూనే ఉన్నాయ్‌

ప్రపంచ విపణిలో

అతిచవకైనవి ప్రాణాలే

కొందామంటే మందులోకైనా దొరకనిది మానవత్వమే

ముక్కుపచ్చలారని పసిపిల్ల్లలకు

గోరుముద్దలతోపాటు నేర్పుతున్నవి తుపాకుల ఆటలే

ఇప్పుడు పసివాళ్ళకు కావలసినది

ముద్దు ముద్దు ఆటబొమ్మలు కావు

ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్లూ కాదు

థన్‌ థనాథన్‌ మని పేలే తుపాకులు కావాలి

భయపెట్టే రంగుల రాక్షస మాస్కులు కావాలి

ఉదాత్త కథానాయకుల కథలు కాదు కోరుకునేది

రోమాలు నిక్కబొడుచుకొనేలా చేసి

బీభత్స భయానక దృశ్యాలు కనుగుడ్లను పెకలించేలా

ముప్పుతిప్పలు పెట్టే చీకటి రాజ్యాధినేతల కథలు!

కలలు కనేది నిర్మాణాత్మక ఊహల్ని కాదు

విధ్వంసక వ్యూహాల్ని!

పసితనపు మెదళ్ళలో విధ్వంసక ఆలోచనల్ని

ప్రోది చేసి మరీ మనమే నాటుతున్నామా?

కాలుష్య పూరిత వాతావరణంలోకి మనమే నెట్టేస్తున్నామా?

వెన్నెల్ని ప్రేమించాల్సిన వయసు

పూలతో ఊసులాడాల్సిన మనసు

సీతాకోకచిలుక రంగుల్ని వంటికి పూసుకొని

ఇంద్రధనుస్సుని ఎక్కుపెట్టి

వలపురాగాలు ఆలపించే వయసు

శరీరాన్ని ఆవరించే నాటికి

విచ్చలవిడి శృంగార సుడిగుండాల్లోకి నెట్టి

ప్రేమికుల రోజుల్ని నేర్పినది మనమే!

స్పిరిట్లు, విచ్‌ల వేషాల్తో

పబ్‌లలో దెయ్యాల పార్టీలమత్తుల్లో

జోగుతుంటే నిస్సహాయులమైపోతున్నదీ మనమే!!

ఇప్పుడు వాళ్ళు కామెర్లరోగులైనందుకో

భయానక ముఖాల్ని తగిలించుకున్నందుకో

భీభత్స కృత్యాలు అవలీలగా చేసేస్తున్నందుకో

నిర్మల జీవితాలపై జిహాదులు ప్రకటిస్తున్నందుకో

వాళ్ళ హృదయాలు కల్లోల తరంగిణులైనందుకో

వాపోవటానికి మనకేం హక్కుంది?

మనం నేర్పిన విద్యలే కదా యివన్నీ

భవిష్యత్తును శిలువ వేస్తున్నందుకు

ఇక మనం చేయాల్సింది

ఉష్ట్రపక్షులమై తలను సిగ్గుతో దాచుకోవటమే

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.