ఆమె శిరీషం..!

(దాసరి శిరీష గారికి నెచ్చెలి నివాళి-) 

-శాంతిశ్రీ 

ప్రముఖ కథా రచయిత్రి దాసరి శిరీష గారు భౌతికంగా లేరన్న మాట వినగానే షాక్‌ అయ్యాను. గతంలోనే ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిసినా.. ఆ తర్వాత సహచరులు శేషుబాబు గారి ఆకస్మిక నిష్క్రమణ కుంగదీసినా.. కొన్నిరోజులు ఇబ్బందిపడినా.. తర్వాత తేరుకున్నారు. యాక్టివ్‌గా ఉంటున్నారు..

ఈ కరోనాతో ఎక్కడివాళ్లం అక్కడ ఉండిపోవడం.. భౌతికంగా కలుసుకోలేకపోవడం ఓ విచారకర పరిస్థితులు. ఫేస్‌బుక్‌లో మనోజ నంబూరి పోస్టు చూడగానే షాక్‌ అయ్యాను. ఆ తర్వాత చైతన్య పింగళి పోస్టు, ఇంకా వివరంగా అపర్ణ తోట పోస్టు చూశాక వాస్తవాన్ని నిబాయించుకునే ప్రయత్నం చేశాను. మనకే ఇలా ఉందంటే వాళ్లెంత తల్లడిల్లుతున్నారో అనిపించింది. ఇంకా చెప్పాలంటే శిరీషగారి తల్లి పరిపూర్ణమ్మ గారి పరిస్థితి ఊహించలేం.

అనారోగ్య సమస్యలే కారణమైనా కొందరి నిష్క్రమణ అంగీకరించలేనట్లు ఉంటుంది. అలాంటి ఆలంబన శిరీష గారు మనల్ని వీడిపోవడం. శిరీషం అంటే సంస్కృతంలో ‘‘సున్నితమైన పువ్వు’’ అని అర్థం.. నిజంగానే శిరీషగారు అంత సున్నితమైన హృదయులు. అందుకే సమాజంలోని సున్నితమైన విషయాలపై ఆమె అలా స్పందించేవారు. అందుకు నిదర్శనమే ‘ఆలంబన’ నిర్మాణం.

శిరీష గారు  కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు.  ఆమె 70వ వసంతంలో ఈ నెల 3వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 12.20 గంటలకు కూకట్‌పల్లిలోని స్వగృహంలో కన్నుమూశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ అధ్యక్షులు దాసరి నాగభూషణరావు, ప్రజానాట్య మండలి తొలితరం కళాకారిణి నంబూరి పరిపూర్ణల  కుమార్తె  శిరీష. శిరీష గారు 20 ఏళ్ళ కిందట బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగానికి రాజీనామా చేసి, ‘‘ఆలంబన’’ సహాయ, సలహా కేంద్రాన్ని స్థాపించారు. సరిగ్గా 50 ఏళ్ల వయస్సులో ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ, చదువుకు దూరమైన నిరుపేద, వీధి బాలలకు ఉచితంగా ప్రాథమిక విద్యను అందించే ‘‘ఆలంబన’’ కావడం శిరీష గారి సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది. మరికొంతమంది విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయాన్నీ అందించారు. పరిపూర్ణగారి పెంపకం.. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన నేపథ్యం ఆమెను ఆలంబన వైపు అడుగులు వేయించింది. సమాజం గురించి ఆలోచించే విధానం ఉన్న కుటుంబంలో పుట్టి, వాటిని అందిపుచ్చుకున్నారు శిరీష గారు. జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ఎదుర్కోవడం కూడా పరిపూర్ణ గారి నుండే అలవడి ఉంటాయనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు శిరీషగారి ఎడబాటునూ పరిపూర్ణమ్మ నిబ్బరంగా తీసుకుని అందరినీ అక్కున చేర్చుకునే తీరు చూస్తుంటే.. అలాగే అనిపిస్తోంది నాకు. ఆ కుటుంబమే ఒక గొప్ప అనుబంధాల వేదిక అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరణించిన తర్వాత దాసరి శిరీష గారి భౌతికకాయాన్ని శనివారం ఎర్రగడ్డలోని ఇఎస్‌ఐ మెడికల్‌ కాలేజీకి ఆమె కుటుంబసభ్యులు అప్పగించినట్లు తెలిపారు. ఇలా మరణం తర్వాత ఆదర్శంగా నిలిచారు శిరీషగారు.

సాహిత్యాల కొమ్మ కథా, నవలా రచయిత్రి శిరీషగారు. ఆమె రచించిన కథలు ‘మనోవీధి’, ‘కొత్త స్వరాలు’ కథా సంపుటాలుగా వెలువడ్డాయి. ‘దూరతీరాలు’ అనే నవల కూడా వెలువరించారు. ‘వేదిక’ పేరుతో వారంతంలో సాహిత్య చర్చలనూ శిరీష గారు నిర్వహించేవారు. ఆమె కథలు జీవన కథనాలే. ఆమె జీవితం ఓ పెద్ద అలతోనే ఆరంభమై.. సముద్రానికి ఆటుపోట్లలా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, సంద్రంలానే నిబ్బరంగా ఉందామె. చిన్ననాడే తండ్రి నిరాదరణకు గురైన బిడ్డల బతుకు ఎలా ఉంటుందో అది అనుభవించేవారికే తెలుస్తుంది. అయినా అలాంటి అననుకూల పరిస్థితుల్లో ఇంతలా సాహిత్య కొమ్మలా ఎదగడం మామూలు విషయం కాదు. అందుకు కారణం మూలాల నుండి ఆమె అన్వేషణా దృషి కోణం అభివృద్ధి చెందుతూ రావడమే.

మౌనంగానే ఎదగమని మొగ్గ చెప్పినట్లు శిరీష గారూ మౌనంగానే ఎదుగుతూ పరిమళభరితమైన సాహిత్య, సామాజిక సున్నిత కుసుమమై విరాజిల్లారు. నిజం చెప్పాలంటే మొదట నాకు శిరీష గారి కన్నా ఆమె సోదరుడు దాసరి అమరేంద్ర గారితోనే ఎక్కువ సాన్నిహిత్యం. శిరీషగారితో నా అనుబంధం మౌనంగానే ఎదిగింది. జీవన సారూప్యత కూడా నన్ను శిరీషగారికీ, అమరేంద్రగారికీ దగ్గర చేసింది. నేనెప్పుడూ ఈ విషయం వారితో పంచుకోలేదు. కానీ నన్ను వారితో అనుబంధాన్ని మానసికంగా పెనవేసుకునేలా చేసింది. అమ్మలో నన్ను నేను చూసుకునేలా అనిపించడానికి అదే కారణం. ఒంటరిమహిళ పెంపకంలో పెరిగినవాళ్లు.. సరైన సమాజదిశలో ఎదుగుతారు. అదీ సమాజ మూలాలు తెలిసిన వారికే సుసాధ్యమైన విషయం. అదే పరిపూర్ణమ్మ ఔన్నత్యం. అదే వారిని ఈ రోజు సమాజంలో ఉన్నతంగా నిలబెట్టింది. అలాంటి పునాది నేపథ్యంలో స్వతహాగా ఉన్న సున్నితత్వం అనేకన్నా మానవత్వం నిండుగా ఉన్న మనీషి శిరీషగారు. అందుకే ఆ చెట్టు కొమ్మలైన అపర్ణ, అరుణ్‌ సాహిత్య ‘తోట’లో అక్షరపూలు పూయిస్తూ.. సామాజిక వికసిత కుసుమాలుగా ప్రకాశిస్తున్నారు.

ఆమెతో నా అనుబంధం ఎంతలా అంటే ఈ రోజు ఈ వ్యాసం గీత గారు పట్టు పట్టి రాయించారుగానీ.. శిరీషగారి గురించి రాయాలంటే ముందు ఎడతెగని దుఃఖం వస్తోంది. అలా దీన్ని నాలుగో తేదీ నుండి రాస్తూ ఆపేస్తూ.. ఇక ఇంతకంటే రాయలేకపోయాను. ఈ రచన శిరీషగారి గురించి పరిపూర్ణమైన రచన కాదు.  క్లుప్తంగా అయినా శిరీష గారికి ఇవే నా అక్షర నీరాజనాలు.. 

****

Please follow and like us:

3 thoughts on “దాసరి శిరీష గారికి నివాళి!”

  1. శాంతిశ్రీ గారు, మేము (వేదిక) కూడా ఒక మంచి స్నేహితురాలిని కోల్పొయ్యాము. కూకట్‌పల్లి, హైద్రాబాదులో సెప్టెంబరు 5న, 2021 న జరిగిన శిరీషగారి సంస్మరణ సభలో మనిద్దరం కలిసి మాట్లాడుకోవడం కుదరలేదు. ఆ తరువాత వచ్చిన శనివారం, 11 సెప్టెంబరున (సెప్టెంబరు నెల లో రెండవ శనివారం) వేదిక ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. స్నేహితులు, సాహితీ మిత్రులు అందులో పాల్గొన్నారు. శిరీషగారితోను, వారి సాహిత్యంతోను తమ జ్ఞాపకాలను పంచుకుని నివాళిలు అర్పించుకున్నారు. ‘వేదిక’ కి శిరీష గారి స్థాపించిన ‘ఆలంబన’ ఒక గొప్ప తోడ్పాటు. ‘ఆలంబన’ ప్రాంగణంలోనే ‘వేదిక’ సాహితీ సమావేశాలు జరిగేవి. ప్రతి నెల రెండవ శనివారం సాయంత్రం. దేశ విదేశాలనుంచి సాహితీ మిత్రులు వచ్చి పాల్గొనేవారు. శిరీషగారు లేకపోవడం ‘వేదిక’ కి పెద్ద లోటే. కాని వారి పిల్లలు ఇద్దరూ (అపర్ణ, అరుణ్) ‘ఆలంబన’ స్పూర్థిని పదికాలాలపాటు నిలబెట్టడానికి కార్యోన్ముఖులవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.