నవతరం యువతి

తమిళం : ఉషా సుబ్రమణ్యన్

తెలుగు అనువాదం : గౌరీ కృపానందన్

“జేజేలు! మూర్తీభవించిన స్త్రీత్వానికి జేజేలు! నా పేరు భారతి. తలపాగా ధరించిన తమిళ కవి… నా పేరుతో ఉన్న  భారతియారును నా వాదనకు తోడుగా ఉండమని ఆహ్వానిస్తున్నాను.”

సూటిగా చూస్తూ, అంతులేని ఆత్మవిశ్వాసంతో వేదిక మీద నిటారుగా నిలబడ్డ ఆ యువతిని చూసి అందరూ చప్పట్లు కొట్టి మరీ ప్రోత్సహించారు.

ఉప్పెన లాగా భారతి ప్రసంగించింది. “పురుషుడికి స్త్రీ ఏమాత్రమూ తక్కువ కాదు” అని ఘంటాపథంగా నినదించింది. మనువు కాలం  నుంచి ఈ నాటిదాకా సమాజంలో,  స్త్రీ ఒకరిపై ఆధారపడి ఉన్నట్లుగానే భావించే తలంపు మారాలని నొక్కి వక్కాణించింది.  దిగ్బ్రమ చెందినవారిలా ప్రేక్షకులు ఆమెనే చూస్తూ ఉండి పోయారు.

“స్త్రీల సమానత్వం వర్ధిల్లాలి!” గంభీరంగా ఆమె ప్రసంగం ముగించగానే ప్రేక్షకుల కరతాళధ్వనులు ముగింపుకు రావడానికే పదినిమిషాలు పట్టాయి.

కళాశాల ప్రిన్సిపాల్ వేదిక మీదికి వచ్చింది. “ఉత్తమ వక్తగా ఈ ఏడాది షీల్డును బి.ఏ. ఆఖరు సంవత్సరం చదువుతున్న కుమారి భారతి గెలుచుకుంది. రూపంలో, మాటలలో, చేతలలో తమిళ కవి భారతియారు ఊహించిన నవతరం యువతికి ప్రతీక భారతి. ఆమె కలలు కనే స్త్రీ లోకం నిజమవ్వాలని ఆశిస్తున్నాము.”

మోయలేని బరువుతో ఉన్న షీల్డ్ చేతులు మారింది. మళ్ళీ కరతాళధ్వనులు. బంగారు రంగు చూడిదారు, పూలు ప్రింట్ చేసిన నల్ల రంగు దుప్పట్టాతో భారతి దేవతలాగా చిరునవ్వును చిందించింది. బాబ్ చేసిన ఆమె కేశాలు గాలికి రెపరెపలాడాయి. ఎరుపు రంగుతో తీర్చి దిద్దిన ఆమె పెదవులు సంతోషంతో వికసించాయి. తెల్లని పలుపరుసను బహిర్గతం చేశాయి.

పొగడ్తలు ఆమెకు కొత్త కాదు. ఆంగ్లంలో అయినా, తమిళంలో అయినా మాటల్లో ఆమెను గెలిచేవారు ఎవరూ లేరు. అందులోనూ స్త్రీ స్వాతంత్ర్యం ఆమెకు నచ్చిన సబ్జెక్ట్. ముంచుకు వస్తున్న ఉప్పెనలాగా బయలుదేరి పోతుంది. ఇంట్లో ఆమె అన్నయ్య సంపత్, “అమ్మ బాబోయ్! దాడి చెయ్యడానికి బయలు దేరావా?” అంటూ ఆమెను ఆటలు పట్టిస్తున్నట్లు మంచం క్రింద దాక్కునే వాడు. అమ్మా నాన్నలకు తమ కూతురు అందచందాలతో, తెలివితేటలతో భాసిల్లుతూ  చదువులో మొదటి మార్కులు తెచ్చుకుంటూ, మంచి క్రీడాకారిణిగానూ ఉన్నందులో ఒకింత గర్వం కూడా.

“సంపత్ ఇంజినీరుగానో, డాక్టరుగానో కనీసం ఐ.ఏ.ఎస్. ఆఫీసరుగా అయినా అవుతాడని కలలు కన్నాం. అతనేమో బి.ఎస్.సి. ముగించి బ్యాంకు ఉద్యోగంలో చేరాడు” అంటూ అమ్మ గొణిగితే నాన్న, “అయితే ఏమైయ్యింది? అన్నిటికన్నామిన్నగా మనకు ఒక కూతురు పుట్టిందిగా. పది ఊళ్ళను ఏలేస్తుంది చూడు” అంటూ జబ్బలు చరుచుకునే వారు.

“మమ్మీ… డాడీ…” భారతి గుమ్మం నుంచే కేక పెట్టింది. సాధారణంగా అమ్మ, నాన్నా అన్న పిలుపు కూడా సంతోషం పట్టలేక పోతే ఆంగ్లంగా మారిపోతుంది. “ఈ రోజు నాకే ఈ షీల్డ్!”

“ఏమిటి? టాపిక్  స్త్రీ స్వాతంత్ర్యం గురించేనా? స్త్రీలు పాంట్లే వేసుకోవాలి, జుట్టును కత్తిరించుకోవాలి అని నినాదాలు చెయ్యడం అయిపోయిందిగా? ఇక మీద స్త్రీలకు విడిగా బాత్ రూములు వద్దు, ప్రత్యేకంగా బస్సులు ఉండ కూడదు అని నినాదాలు చేయమనరాదూ.”

“అన్నయ్యా! నువ్వు మరీ అసభ్యంగా మాట్లాడుతున్నావు. నీ లాంటి మగవాళ్ళకి స్త్రీల పట్ల అసూయ.”

“అసూయ ఎందుకు?”

“వాళ్ళు అందంగా, తెలివితేటలతో ఉన్నారని.”

“ఒసే పిచ్చిమొద్దూ! తమ అందాన్ని ఉపయోగించి పనులను సాధించుకోనంత వరకు నాకు ఎలాంటి  అసూయా ఉండదు.”

“నువ్వు ఊరుకోరా. నువ్వు నా దగ్గిరికి రా తల్లీ. స్కూల్లో ఏం ప్రైజు ఇచ్చారు నీకు? నాకు చూపించు.” నాన్నమ్మ మనవరాలిని దగ్గిరికి పిలిచింది.

“స్కూల్లో కాదు బామ్మా! కాలేజీలో.”

“సరేలే. ఏదో ఒకటి. చూడ్డానికి చాలా బాగా ఉంది. కానీ దీన్ని పెట్టుకుని ఏం చెయ్యడం? అవును గానీ దేని గురించి మాట్లాడావు? అది చెప్పు.”

“స్త్రీల గురించి బామ్మా! స్త్రీలు తమ కాళ్ళ మీద సొంతంగా నిలబడాలి. ధైర్యంగా వ్యవహరించాలి. మనసుకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకోవాలి. కట్నం ఇవ్వకూడదు అని… నీకు అర్థం కాదులే బామ్మా.”

“ఎందుకు తల్లీ అర్థం కాదు? నేను నీలాగా ఇంగ్లేషు చదువులు చదవలేదు. పేంటు షర్ట్ వేసుకోలేదు. అయినా కూడా ఇవన్నీ నాకు బాగానే అర్థం అవుతాయి. నాకు పెళ్లి అయినప్పుడు పదిహేనేళ్ళు. మీ తాతగారు ఆజానుబాహువు. ఎర్రగా బుర్రగా చూడడానికి రాజాలా ఉండేవారు. నేను నల్లగా, బూజు కర్రలాగా ఉండేదాన్ని. పెద్దవాళ్ళు మమ్మల్ని ఒక మాట అడగకుండానే మా పెళ్లి నిశ్చయం చేసేశారు. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న మీ తాతగారికి నేను ఒక ఉత్తరం రాశాను. మేనరికం కదా అని మీరు నన్ను పెళ్లి చేసుకోవద్దు. నేను మీకు నిజంగానే నచ్చితే పెళ్లి చేసుకుంటే చాలు అని. అలాగే నాకు రాబోయే మొగుడు సంగీతంలో అభిరుచి గలవాడై ఉండాలని అనుకుంటున్నాను. మీకు సంగీతం పట్ల అభిరుచి ఉందా అని అడిగాను. ఆయన అందంగా ఉంటే ఆయన వరకు. నాకు నేను రంభనే.  నాకు సంగీతం అంటే ప్రాణం. ఒక్కొక్కరికీ ఒక అభిరుచి ఉంటుంది. అందమైన అమ్మాయి కావాలను కుంటే ఆయన వేరే అమ్మాయిని వెతుక్కుంటూ పోనీ. అదే విధంగా సంగీతం పట్ల ఇష్టం ఉన్నవాడిని నేను వెతుక్కుందామని అనుకున్నాను. ఆఖరున ఆయనకీ సంగీతం పట్ల ఇష్టం ఉందని తెలిసింది. నన్నూ ఇష్టపడ్డారు. 

ఎందుకు చెప్ప వచ్చానంటే ఒక అమ్మాయి తను ఎంత అవకరంగా ఉన్నా, తెలివితేటలు లేకున్నా ఆమెకి కూడా ఆత్మగౌరవం అన్నది ఉండాలని. ఆయన అందంగా ఉంటారు. నేను బాగా పాడుతాను. ఆయనకు ముక్కుమీద కోపం. గుణంలో నాకు ప్లస్ మార్కు. ఆయనకు సంపాదించడం తెలుసు. నాకు బాగా వంట చెయ్యడం వచ్చు. ఆడది అంటే ఎందులో తక్కువ?”

“ఇప్పుడు అర్థం అయ్యింది బామ్మా!  మీ మనవరాలు ఎవరి పోలికతో పుట్టిందని. బామ్మ ఏ దారో మనవరాలూ అదే దారి.” సంపత్ నవ్వాడు.

ఇపుడు భారతి ఎం.ఏ. పట్టదారి. బ్యాంకు పరీక్షలు వ్రాస్తూ ఉంది. తీరిక సమయంలో ప్రెంచ్ క్లాసులు, సాయంత్రం పూట టెన్నిస్ ఆట. తల్లి తండ్రులు ఆమె స్వాతంత్ర్యంలో తల దూర్చటం లేదు. వంటిని బిగుతుగా పట్టి ఉంచే డేనియం జీన్సులు, రకరకాలైన కుర్తాలు, చూడీదారులు, వెళ్లి రావడానికి సౌకర్యంగా టూ వీలర్. బుద్ది జీవులైన ఆడ, మగ స్నేహితులతో కబుర్లు… ఆమె జీవితం ఎటువంటి తడబాటు లేకుండా సాగిపోతూ ఉంది.

ఇదే అర్హత, వయసు ఉన్న మగపిల్లలకు, చదువుకూ ఉద్యోగానికి మధ్య ఖాళీగా ఉండే రోజుల్లో కలిగే అభద్రతా భావం ఆమెలో లేదు. 

“ఇంకో గరిటె పెరుగు వెయ్యి” అని తల్లిని అడగడానికి ఆమె సంకోచించవలసిన అవసరం లేదు. “పనీ పాటా లేకున్నా షోకులకు తక్కువేం లేదు” అని తండ్రి గొణుగుడు ఉండదు. ఇంకో ఇంటికి వెళ్ళబోయే పిల్ల అన్న వెసులుబాటు బాగానే ఉండేది.

అమ్మే మొదట పెళ్లి మాటలు ఎత్తింది. “మీ నాన్నగారి లాగే కంపెని ఎక్సిక్యూటివ్ కొడుకట. అమెరికాలో ఎం.ఎస్. ముగించి ఢిల్లీలో పెద్ద కంపెనీలో ఉద్యోగం, మంచి జీతం. అన్ని అలవన్సులు దొరుకుతాయట. ఎటువంటి బాదరబందీలు లేని కుటుంబం. ఒక్కగానొక్క అక్కయ్య  పెళ్లై లండన్‍లో ఉంటోంది. కుల గోత్రాలు, జాతకాలు అన్నీ బాగానే కలిశాయి. ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకుండా మనం ఈ సంబంధాన్ని భారతికి చూద్దామా?”

“నీ అభిప్రాయం ఏమిటి భారతీ?” అడిగారు నాన్న

భారతి జవాబు చెప్పలేదు.

సంపత్ మధ్యలో కలగ జేసుకున్నాడు. “అమ్మా! భారతి పెళ్ళికి ఇప్పుడు తొందరెందుకు? ఇరవై ఒకటే కదా నిండింది. మీ కాలం లాగా అనుకున్నారా? అదీగాక తనకి తెలివితేటలు ఎక్కువ. బాగా చదువుతుంది. ఐ.ఏ.ఎస్. పరీక్షలు వ్రాయనీ. మేనేజ్మెంట్ చదువులు చదవనీ. పెద్ద కంపెనీలో ఎక్సిక్యూటివ్ ఉద్యోగం దొరుకుతుంది. కొన్నేళ్ళు స్వతంత్ర్యంగా, ఫ్రీగా ఉండనీ. ఆ తరువాత ఆమె ఉద్యోగానికీ, ఇష్టానికీ తగిన వరుడు దొరకకుండా పోతాడా? మీకు పని పెట్టకుండా ఆమె తన ఇష్టం ప్రకారం పెళ్లి కొడుకును వెతుక్కుంటుంది. అంతే కదా భారతీ.” 

భారతి కొన్ని క్షణాలు మౌనంగా ఏమీ మాట్లాడకుండా నిలబడింది. ఉన్నట్లుండి ఆమె చెవులు కంది పోయాయి. కోపంతో ముఖం ఎర్రబడింది. “నీకు ఇరవై ఎనిమిదేళ్ళు నిండి పోయాయి. ఇంకా ఏ అమ్మాయీ కుదరలేదు. నీ కన్నా ఏడేళ్ళు చిన్నదాన్ని అయిన నాకు మంచి సంబంధం వచ్చిందని కడుపు మంటగా ఉంటే, బైటికే చెప్పేసి ఉండవచ్చుగా.”

సంపత్, అతని తల్లితండ్రులూ దిగ్భ్రమ చెందినవారిలా చూస్తూ నిలబడి పోగా, భారతి కోపంతో వేగంగా అక్కడి నుంచి వెళ్లి పోయింది. అయితే ఈ సంబంధం గురించి భారతి అభిప్రాయం ఏంటన్నది అందరికీ అర్ధం అయ్యింది.

ఒక రోజు పెళ్లి కొడుకు ఢిల్లీ నుంచి విమానంలో వచ్చి దిగాడు. చూడీదార్ కుర్తాలో భారతి నవనాగరీకంగా అతని ప్రక్కనే సోఫాలో కూర్చుని స్టైల్‍గా ఆంగ్లంలో సంభాషించింది. లిప్‍స్టిక్ పూసుకున్న పెళ్ళికొడుకు తల్లి, పైప్ పీలుస్తున్న తండ్రి భారతి కుటుంబాన్ని డిన్నరుకు రమ్మని ఆహ్వానించారు. పెళ్లి నిశ్చయం అయ్యింది.

ఐ.ఏ.ఎస్. ప్రిలిమ్స్ మొదలవుతున్నాయని సంపత్ పలుసార్లు గుర్తు చేసినా, భారతి చీరలు కొనడంలో, నగల దుకాణానికి వెళ్ళడంలో చూపించిన శ్రద్ధను చదువులో చూపించలేదు.

ఆ రోజు నాన్నగారు ఆపీసు నుంచి వచ్చేటప్పుడే నీరసంగా వచ్చారు. అమ్మను, బామ్మను పిలిచారు. “ఈ సంబంధం మనకు అచ్చి వచ్చేటట్లు లేదు. వదిలేద్దామని అనుకుంటున్నాను.”

“ఏమైయ్యింది?” కంగారుగా బామ్మ అంది.

“ఈ రోజు ఉదయం పెళ్లికొడుకు తండ్రి ఫోన్ చేసారు. ఆయన గారి కొడుక్కి కారు కొంటే ఆపీసులో నెలకి అలవన్సు దొరుకుతుందట. కొత్తగా కాక పోయినా ఒక పాత మాడల్ కారు కొనివ్వమని అన్నారు.”

“బాగానే ఉంది వ్యవహారం. చాలా స్టైల్‍గా ప్రవర్తించారుగా. ఇప్పుడు పెళ్లిపత్రిక అచ్చు వేసే సమయానికి ఇదేం గొంతెమ్మ కోరిక! వాళ్ళింటి అబ్బాయికి కారు అలవన్సు కావలసి వస్తే తల్లీ, తండ్రీ కొని ఇచ్చుకోనీ. లేకపోతే అమెరికా రిటర్న్డ్ అబ్బాయి అప్పు చేసి కొనుక్కోనీ. నటరాజూ! నా మనవరాలికి ఈ సంబంధం వద్దు. తెలివితేటలు, చక్కదనం ఉన్న పిల్లను ఈ నక్కజిత్తుల మారి ఇంట్లో ఇవ్వనక్కర లేదు.” బామ్మ ఖచ్చితంగా చెప్పేసింది.

“ఏర్పాట్లన్నీ మొదలు పెట్టేశాం అత్తయ్యా. ఎలా ఆపడం? భారతికి కూడా అబ్బాయి నచ్చాడు.” అమ్మ అంది.

“ఒక్కసారి చూసినంత మాత్రాన ఏమంత విపరీతంగా ఇష్టం ఏర్పడి పోతుంది? ఒక అబ్బాయికీ ఒక అమ్మాయికీ మధ్య బాంధవ్యం ఏర్పడడానికి నాలుగేళ్లయినా పడుతుంది. చాల్లే పెద్ద చెప్పవచ్చావు. పోవే పో… ఈ సంబంధం కాకుంటే వెయ్యి సంబంధాలు.” బామ్మ నిర్లక్ష్యంగా అంది.

“అయినా కూడా…” అమ్మ సంకోచించింది. “ఏమండీ! కావాలంటే నా చేతి గాజులు అమ్మేస్తాను. నలబైవేలయినా రావా?”

“బాగానే ఉంది. నీ ఆస్తిని నువ్వు ఎందుకు అమ్మాలి?” ఇది బామ్మ.

“మీరు వేరే ఏదైనా ప్రయత్నం చేసి…”

“నా ప్రావిడెంట్ మొత్తాన్ని పూర్తిగా డ్రా చేసేస్తాను. అందుకు తగిన విధంగానే కదా మనం బడ్జెట్ వేసుకున్నాం. అమ్మ తన నగలను ఇవ్వడం వాళ్ళ ఆ ఖర్చు తగ్గి పోతుంది. వచ్చే ఏడాదిలో రిటైర్ అవబోతున్నాను. లోన్ తీసుకుంటే మళ్ళీ కట్టడం ఎలా?”

ఈ మాటలన్నిటినీ పక్క గదిలో నుంచి వింటున్న భారతి సుడిగాలిలా దూసుకు వచ్చింది.

“నాన్నగారు లోన్ తీసుకుంటే తిరిగి ఇవ్వడం కుదరదు. ఒప్పుకుంటాను. ఎనిమిదేళ్లుగా సంపాదిస్తున్నాడుగా అన్నయ్య? అతగాడికి చెల్లెలి పెళ్లి గురించిన బాధ్యత లేదా? పి.ఎఫ్.లో, బ్యాంకులో ఎవరి కోసం కూడ బెడుతున్నాడు? ఒక్కొక్క కుటుంబంలోనూ నలుగురైదుగురు చెల్లెళ్ళకు ఒక్క అన్నయ్య పెళ్లి చేస్తున్నాడు. ఒక్కగానొక్క చెల్లెలి పెళ్ళికి సాయం చెయ్యడానికి ఇతనికి కుదరదా? అడిగే విధంగా అడిగితే తనే ఇస్తాడు. మీ కూతురి జీవితం పట్ల మీకు ఇంతేనా శ్రద్ధ?” భారతి వెక్కి వెక్కి ఏడవసాగింది.

వేదిక మీదికి ఎక్కి నినాదాలు చేసే కొత్త తరం యువతిని, జుట్టు పూర్తిగా నెరిసిపోయిన బామ్మ జాలిగా చూసింది. ఏదైనా అంటే, “కారు ఆయన మాత్రమే ఎక్కి వెళ్ళడానికా? నన్ను కూడా ప్రేమతో కూర్చోబెట్టి తీసుకు వెళ్తారు కదా?” అని సమాధానం వస్తుందని అర్థం చేసుకున్న బామ్మ పెద్దగా నిట్టూర్పు విడిచింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.