పోలిక 

-వసంతలక్ష్మి అయ్యగారి

ఆరోగ్యమే మహాభాగ్యం,
శరీరారోగ్యము, దేహదారుఢ్యమూ ఉంటేసరా? మందులతో నిలబెట్టుకునే ఆరోగ్యమైనా యీ రోజులకి ఓకే , కానీ మానసికారోగ్యమంటూ మరోటుందిగా ! మనసుఖాయిలా పడితే మందులూ వుండవంటారు.
అసలు మనసుని యెందుకు కష్టపెట్టుకోవాలట?
****
బోలెడు మందులు మాకులతోపాటూ మరిన్ని టానిక్కులు పంపి పండంటి బిడ్డలను ఆరోగ్యమే ప్రధానమంటూ కంటారు తల్లులు. పుట్టినదిమొదలు పోలికలపర్వమే!
ఫలానా పిల్లకి బిస్కెట్ అలర్జీట. వెంటనే తల్లిమనసు తనపిల్లఅలర్జీ లిస్టు తో పోల్చేసుకుని మనసుని కుదుపుకుంటుంది.ఓపిల్లకి పాలు పడవు… మరొకర్తికి పండుపడదు .ఇంకోర్తికి పప్పు పడదు . ఈ లిస్టు కి అంతు లేనట్టే మన పోలికల చిట్టా కూడా చిన్నదేమీ కాదు .
 
స్కూళ్లవయసు లో చదువుల పోలిక … ఆటపాటలపోలిక ..ఆర్థుక స్తోమతల పోలిక.
బాల్యంలోనే బుజ్జిబుర్రలలో బూజులు మొదలు. పోలికల పందెంలో పనికిమాలిన అరమరికలు అరలు పరచుకుంటాయి.తల్లిదండ్రులనుండి యీ విషబీజాలు నెమ్మదిగా తమతమపిల్లల్లో చిగుళ్లుతొడిగేదీ బాల్యం లోనే!
 
ఇక పిల్లల యుక్తవయసు.. “వివాహపర్వం”తెచ్చే పోలికలు అనిర్వచనీయాలు . అక్కడితో ఆగినా ఫరవాలేదు .
వెనువెంటనే పొంచియుండి వెంటాడే మరో పోలిక సంతానం.. లింగభేదం..ప్లస్సూ మైనస్ పరిభాషకూడానూ!
 
పరుగుల పోటీ ప్రపంచం లో  పోలిక ప్రధానమే . అయితే అది అర్థవంతంగానూ,ఆరోగ్యవంతంగానూ సాగితే శ్రేయస్కరమే !
అన్యథా అయితేనే వారి భవిష్యబాటలు బీటలు వారేది .
 
ఉద్యోగపర్వం లో అటు కార్యాలయాలలో  ఉన్నఅంతరాలు యిటు గృహసీమలకూ పాకి  జీవితం దుర్భరంగా మారేఉదంతాలు కోకొల్లలు .
ఫైరవీలు,పదోన్నతులు, బదిలీలు ,జీతాలు, బకాయిలు…ఇలా ఒకటా రెండా మనిషికి 60 నిండేదాకా యిదేగోల లో పడి కొట్టుకోవడమే !
 
సరే … యేదో ఉద్యోగ పర్వాలనుండీ బయటపడి ఆధునిక యుగంలో మహిళలూ.. మగవారూ  కూడా  విశ్రాంత జీవనం కొనసాగిస్తూ కూడా  పోల్చుకోవడం మానరే..
ఇంకేం మిగిలి వుంటుందబ్బా అనుకుంటున్నారా !
అసలైనదదే… మీ కేంటండీ నెలతిరిగేసరికి పెన్షనుచేతికొచ్చేస్తుంది జీతంకన్నా జోరుగా కోతలూ గీతలూ లేకుండా అని ఒకరి మొరైతే …మీది పియఫ్ నిధి కదండీ .. యెంత వడ్డీ రేట్లు పడిపోయి యేడిసినా .. రేపటి రోజు మనం ఠపీ మంటే పెన్షన్ లాగ ఆగదు.. జీవనదిలాగ తదనంతర తరాలకి తృణమో పణమో అయినా మీ పేరున అందుతుందనేది మరొకడి వాదన !
 
భగవంతుడు యెవరి కర్మానుసారం వారికిచ్చినదాంట్లో (సంతానమైనా ,సంపాదనైనా )సంతృప్తి పడి తనకన్నా చిన్న గీతలని తలుస్తూ ఆత్మానందభరితుడై జీవనమాధుర్యాన్ని అనుక్షణం ఆస్వాదిస్తూ బతికితే ఆరోగ్యం సుసంపన్నమే కదా!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.