తగిన సాయం

-ఆదూరి హైమావతి 

  అనగనగా ఒక చిట్టడవి.దాని సమీపాన ఒక నది. ఆ చిట్టడవిలోని చెట్ల మీద చాలా పక్షులు గూళ్ళుకట్టుకుని జీవించేవి. అక్కడ ఒకపెద్ద బూరుగు చెట్టుకూడా ఉంది. దానిపైకొమ్మమీద ఒక కాకి కర్రలతో గూడుకట్టు కుంది. దాని క్రిందికొమ్మ మీద  ఒక పిచ్చుక  పిడకల తో గూడు కట్టుకుంది. పక్క నే ఉన్న పెద్ద మఱ్ఱి  మాను మీద చాలా పక్షులు గూళ్ళుకట్టుకుని, ఎవరి పాటికి అవి జీవించేవి. 

 ఒక వానాకాలం రాత్రి పెద్ద వాన  వచ్చింది .ఆవానకు  పిచ్చిక గూడు పిడ కలు తడిసి కరిగిపోవటాన గూడు కూలిపోయింది. పిచ్చుక తన ఇద్దరు పసి పిల్లలనూ క్రింద పడ్డ ఆకులమాటున దాచి, పై కొమ్మ మీది కాకమ్మ గూడు దగ్గరకెళ్ళింది.

 ” కాకమ్మక్కా కాకమ్మక్కా ! వానకు నా గూడు కారిపోయింది. నాపసి పిల్లలు చలికి వణుకుతున్నారు .కాస్త నీ గూట్లో వారిద్దరికీ చోటిస్తావా అక్కా! నేను బయటే ఉంటాను, లోనికిరాను.” అని అడిగింది. కాకమ్మ “ఆహా! నీ పిల్లల ఉచ్చ ,పియ్యా నేను భరించి , ఆవాసనకు ఓర్చుకుని  చోటియ్యాలా ? నా పిల్లలకు నిద్రా భంగం కలుగుతుంది, కుదరదు పోపో” అని కసిరింది.

పాపం పిచ్చుక పక్కనే ఉన్న మఱ్ఱిమాను పెద్ద కొమ్మల మాటున ఉన్న చిన్న తొర్రలో తన పిల్లలిద్దరినీ  పెట్టు కుని రాత్రంగా జాగారం చేసింది.  వానతగ్గింది. తెల్ల వారింది. సూర్యుడు వచ్చాడు.

 పిచ్చుక తన పిల్లలకు కాస్తఆహారం తెచ్చి పెట్టి ,జాగ్రత్తగా అక్కడే అరవ కుండా ఉండమని హెచ్చరించింది.రివ్వురివ్వున ఎగురుతూ వెళ్ళి తన స్నేహితులను పిల్చుకొచ్చి ,కావలసిన వస్తువులు సేకరించు కుని ఒక చక్కని గూడు అందరిసాయంతోనూ కట్టుకుంది . పిచ్చుకలు సివిల్ ఇంజ నీర్లు , మంచి గూడు కట్ట డంలో నేర్పరులు . పిచ్చుకమ్మ తన స్నేహి తుల సాయానికి ధన్యవాదాలు చెప్పుకొని తనపిల్లలను గూట్లోకి చేర్చుకుని వెచ్చగా పడుకుంది . 

 ఆరాత్రి మరలా పెద్ద గాలీవాన వచ్చాయి. పెద్ద గాలికి చాలా చెట్ల కొమ్మ లు విరిగి పోయాయి.కాకమ్మ గూడున్న బూరుగు చెట్టుకొమ్మలన్నీ విరిగి పడిపోయాయి. కాకమ్మ తన పిల్లలను మఱ్ఱి మాను మొదట్లోకి చేర్చి కొత్త గా గూడుకట్టుకున్న పిచ్చుక గూటి వద్దకెళ్ళి,” పిచ్చుక చెల్లాయ్ ! పిచ్చుక చెల్లాయ్! గాలికి నాగూడు పడిపోయింది, నీగూట్లో నాపిల్లలకు కాస్త ఈ రాత్రికి చోటిస్తావా! తెల్లారగానే వెళ్ళిపోతాను.” అంది నిస్సిగ్గుగా. 

  పాపమా పిచ్చుక మంచి మనసుతో” రారా !కాకమ్మక్కా! రారా! నీపిల్లలే కాదు, నీవుకూడా లోపలికిరా! చలికి ఎలా బయట ఉంటావు, నాకొత్త గృహా నికి మీరే మొదటి అతిధులు.నా ఇంట్లో ఒక అతిధి గదికూడా కట్టానులే!  స్వాగతం ” అని ఆహ్వానించి ,చోటిచ్చింది.

 మెత్తని గడ్డితో నేసిన ఒక దుప్పటికూడా ఇచ్చింది. 

కాకమ్మ పశ్చాత్తాపంతో ” పిచ్చుక చెల్లాయ్ ! నీదెంత మంచి మనసు అప కారికి కూడా ఉపకారం చేసే నీ మనస్సు చాలా గొప్పది. నన్ను మన్నిం చు” అంది. 

పిచ్చుకమ్మ ” కాకమ్మక్కా! నీవు నాకెలా అపకారివి అవుతావు, నీవు కాదన డం వల్లే నాబధ్ధకం వదలిపోయి నాస్నేహితులు చెప్పినట్లు దృఢమైన గూడు కట్టు కున్నాను, ఒక రకంగా నీవు నాకెంతో మేలు చేశావు. ఆలోచన లు మానుకుని హాయిగా నిద్రపో!” అని చెప్పింది. 

 చూశారా బాలలూ !పిచ్చుక ఎంత గొప్పదో! మనమూ మనకు చేతనైన సాయాన్ని  ఆపదలో ఉన్నపుడు మన తోటి వారికి చేసి  ఆదుకుని సహకరించాలి.   

      *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.