“కొత్త బడిలో నవీన్”

   -అనురాధ నాదెళ్ల

                              మనం ఈ నెల మాట్లాడుకోబోతున్నది ఒక అరుదైన పుస్తకం. పుస్తక శీర్షిక చూసి ఇదేదో పిల్లలకే సంబంధించిన బడి పుస్తకం అనుకోవద్దు. బడి అంటే పిల్లలకే కాదు టీచర్లకు, అమ్మా, నాన్నలకూ అలా మొత్తం సమాజానికి సంబంధించినది కదా. 

ఈ పుస్తకం ఒక స్నేహితురాలి ద్వారా నన్ను చేరింది. చదువుతున్నంతసేపూ ఒక టీచర్ గా నాకు కొత్త శక్తిని ఇచ్చింది. ఈ పుస్తకంలోని ఆలోచనల్లాటివే నన్ను వేధిస్తుంటాయి. బహుశా నాలాటి ఇంకెందరినో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్నలు నిలేస్తూనే ఉంటాయన్నది వాస్తవం.

బడి, పిల్లల ప్రపంచంలోకి లాక్కెళ్లే ‘’రైలు బడి’’ లాటి అద్భుతమైన పుస్తకం గురించి మనం కొన్నాళ్ల క్రితం ఈ కాలమ్ లోనే మాట్లాడుకున్నాం. పిల్లల్ని ప్రేమించే అందరికీ ఆ ప్రపంచంలోని ఆకర్షణ తెలిసున్నదే. చుట్టూ ప్రపంచం పట్ల నిత్య పరిశీలనతో, కుతూహలంతో పిల్లలు చేసే ఆలోచనలకి ఆకాశమే హద్దన్నది వాస్తవం.

                             రచయిత్రి అహల్యాచారి గొప్ప విద్యావేత్త. పిల్లలలోని సృజనాత్మకత విభిన్నంగా ఉంటుందన్నది ప్రతి టీచర్ అర్థం చేసుకోవాలని ఆమె పదేపదే చెప్పేవారు. రంగూన్ లో పుట్టి, పెరిగిన అహల్యాచారి రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో రంగూన్ వదిలి బెనారస్ వచ్చారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి, మహిళా కళాశాలలో పది సంవత్సరాలపాటు లెక్చరర్ గా పనిచేసారు. అక్కడినుంచి దిల్లీ వచ్చి చదువును కొనసాగించారు. 

జిడ్డు కృష్ణమూర్తి గారి భావాలకు ఆకర్షించబడి చెన్నైలోని కృష్ణమూర్తి ఫౌండేషన్ లో చేరి, విద్యకు సంబంధించిన అనేక సంస్కరణలు, కొత్త ఆవిష్కరణలూ చేసారు. ‘’విద్య ప్రాథమికమైన హక్కు’’ అన్న ప్రభుత్వ చట్టాన్ని అమలుచేసేందుకు కృషి చేసారు. పాఠశాల విద్య సమగ్రంగా ఉండాలనీ, చదువంటే పాఠాలే కాక పిల్లల మానసిక అవసరాలను కూడా తీర్చేదిగా ఉండాలంటారామె. ఎన్.సి.ఇ.ఆర్.టి వారు ఆమె అభిప్రాయాలను ప్రామాణికంగా స్వీకరించి, తమ సిలబస్ ను రూపొందిస్తూ వచ్చారు.

                             ఆమె రాసిన ‘’థింకింగ్ టుగెదర్’’ పుస్తకం ఎన్.సి.ఇ.ఆర్.టి. వారు ప్రచురించారు. ‘’పద్మశ్రీ’’ అవార్డును ఇచ్చి భారత ప్రభుత్వం ఆమెను గౌరవించింది. ఆమె తన నివాసంగా మార్చుకున్న కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆవరణలోనే 92 సంవత్సరాల వయసులో 2013లో మరణించారు. విద్యారంగంలో వస్తున్న మార్పులను నిరంతరం పరిశీలిస్తూ, పిల్లల సంపూర్ణ వికాసం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఉన్నత వ్యక్తి ఆమె.

రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మైసూర్ కు మొదటి ప్రిన్సిపాల్ గా చేసారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కు కూడా మొదటి కమీషనర్ ఆమె.

ఈ రచయిత్రి, మానవతావాది గురించి ఇంతగా చెప్పుకోవటానికి కారణం ఆమెకు పిల్లల పట్ల ఉన్న వాత్సల్యం. భవిష్యత్తులోకి నడిచే పిల్లల దృష్టికోణం నుంచి మాత్రమే విద్యావిధానాన్ని రూపొందించాలన్న ఉదారమైన, వాస్తవికమైన ఆలోచనాధోరణి ఆమెకు ప్రత్యేక స్థానాన్నిచ్చింది.

                                  ఈ పుస్తకాన్ని నండూరి వెంకట సుబ్బారావు గారు అనువదించారు. ముందుమాటలో అరవింద స్కూల్ ఇంద్రాణిగారు పుస్తకం గురించి చక్కని పరిచయం చేసారు. 

సరే, పుస్తకంలో ఏముందో చూద్దాం. 

ఈ పుస్తకం ‘’సంవాదం’’ ఆవశ్యకతను చెబుతుంది. మనం అసలు సంవాదం (Dialogue) అనే అంశాన్ని ఎప్పుడైనా పట్టించుకుంటామా? అదీ పిల్లలతో! పెద్దవాళ్లు చెప్పినదాన్ని పిల్లలు పాటించి తీరాల్సిన అవసరం గురించే చెబుతాం. 

పిల్లల మధ్య, పిల్లలకు, టీచర్లకు మధ్య, పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఎప్పుడైనా ఏ విషయం గురించైనా ప్రశ్నలు, చర్చలు మనం ప్రోత్సహించామా? పెద్దల ఆధిపత్యం, పిల్లల్ని నోరెత్తనివ్వని నియంతృత్వం మాత్రమే చుట్టూ కనిపిస్తోంది. ప్రశ్నించుకుని, సమాధానం వెతుక్కోవటంతోనే ఏ రంగమైనా ముందడుగు వేసేది. ఇన్ని వేల సంవత్సరాల మనిషి మనుగడలో సంవాదాలే ఇప్పటి అబివృధ్ధికి దారిని వేసాయి. 

                                  పాఠశాలల్లో జరిగే బోధన పిల్లల్ని పరీక్షలకు, ఉద్యోగాలకు తయారుచేస్తుంది. అంతవరకే. మరి చుట్టూ ఉన్న చిన్న, పెద్ద విషయాల గురించి పిల్లల మనసుల్లో పుట్టే సందేహాలను తీర్చేందుకు ఎలాటి విద్యను అందించాలి మనం? దీనికి అవకాశం ఇస్తున్నామా? లేదు. తరం తర్వాత తరం పిల్లలు పెరిగి పెద్దై, సమాజంలో తమవంతు బాధ్యతలు తలకెత్తుకుంటూ సంవాదాల మాటే ఎరుగని మరో తరాన్ని నిరంతరంగా తయారుచేస్తున్నారు. 

అసలు మన ఇళ్లలో పిల్లలు దేనిగురించైనా ఒక ప్రశ్న వేస్తే జవాబు చెప్పే ఔదార్యం, సహనం, అవసరమైన జ్ఞానం, సమయం మనలో ఎందరికుంది? 

సింపుల్ గా ‘’నీకేం తెలీదు, ఊర్కే ప్రశ్నలు వెయ్యకు. వెళ్లి ఆడుకో’’ అనో, ‘’పుస్తకాలు తీసి చదువుకో’’ అనో అనేస్తాం. చిన్నారుల జిజ్ఞాసను కొట్టిపారేస్తాం.

పిల్లల ఆందోళనలు, ఆలోచనలు, భయాలు, ఇష్టాలు ఎవరితో చెప్పుకుంటారు? సందేహాలను ఎలా తీర్చుకుంటారు? అధిక సిలబస్, పోటీతత్త్వంతో మన విద్యావిధానం పిల్లల్ని, పెద్దల్ని మానసికమైన ఒత్తిడికి లోను చేస్తోంది. కానీ దాని గురించిం మాత్రం మాట్లాడనివ్వదు. పిల్లవాడు తన మనసులోని మాటల్ని చెప్పుకుందుకు ఇంట్లోనూ, బడిలోనూ కూడా ఎవరూ లేరు. మరి వాడిని వినేదెవరు? వాడి ప్రశ్నలకు సమాధానాలు ఎలా తెలుస్తాయి? పాఠ్య పుస్తకాలకి ఆవల ఎన్నో విషయాలుంటాయనీ, వాటిని గమనించే చిన్నారులకు అంతులేని సందేహాలుంటాయనీ మనం ఎందుకు పట్టించుకోం? చిన్నప్పుడు మనమూ ఆ దశను దాటి వచ్చినవాళ్లమే కదా.

                                 ఈ పుస్తకంలో ఉన్న 35 అధ్యాయాలు 35 సంవాదాలకు మొదలు. వీటిని అనుసరిస్తూ వెళితే మరిన్ని సంవాదాలు, పరిష్కారాలు దొరుకుతాయి. పిల్లల ఆలోచన మరింత విశాలమవుతుంది. పిల్లలకోసం ఆలోచించే పెద్దలకు, మేధావులకు ఈ విషయం ఎందుకు ప్రాముఖ్యమున్నదిగా తోచదు? పిల్లలను వినేందుకు సమయం ఎందుకు ఉండటంలేదు? వాళ్ల ప్రశ్నలు మనలో కొత్త ఆలోచనలను ప్రేరేపించే సందర్భాలెన్నన్నో! క్షణం నిలబడక పందెపు జీవితాల్ని గడిపే పెద్దలం పిల్లలకి ఏం నేర్పుతున్నాం?

బడి అంటే పెద్ద భవనాలు, ఖరీదైన వాతావరణం, ఆధునిక ప్రయోగశాలలు, మెరిసిపోయే యూనిఫాంలు…ఇవే అన్న భ్రమ చాలామంది పెద్దల్లో ఉంది. అలాటి బడిలో క్రమశిక్షణతో చదువు నేర్పి ర్యాంకులు తెచ్చుకునేలా చేస్తారన్న ఆలోచన. బడికి పిల్లవాడు ఎంత ఇష్టంగా వెళ్తున్నాడు? చనువుతో టీచర్లనడిగి తన సందేహాలు తీర్చుకునే అవకాశం ఎంత ఉంది? టీచర్లతో ఎలాటి అనుబంధం ఉంది అన్నది ప్రాముఖ్యత లేని విషయమైపోయింది. నేటి విద్యాలయాల్లో డబ్బుకున్న ప్రాధాన్యం వాటిని వాణిజ్యపరమైన సంస్థల్ని చేస్తోంది.  

                               ప్రేమగా బోధించే టీచర్లు, చక్కని ఆటస్థలం, బడి తోటలో మట్టితో పని చేసి, ప్రకృతితో మమేకమై పెరిగే వీలు ఉన్న బడి అంటే పిల్లలకు ఎంత ఆనందం! పాఠాలు, పరీక్షలు మాత్రమే బడి అంటే పిల్లలకు కలిగే విసుగు, అనాసక్తి ఎవరైనా గమనిస్తున్నారా? పిల్లల్లోని చైతన్యం నాలుగ్గోడల మధ్య ఉన్న క్లాసురూం లో అణగారిపోతోందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? చుట్టూ ప్రపంచాన్ని కళ్లు విప్పార్చుకుని చూసే పిల్లవాడి ఉత్సాహాన్ని, సంతోషాన్ని అర్థం చేసుకునే పెద్దలెందరు? ఇవిగో ఈ విషయాల్నే అహల్యాచారిగారు చెప్పారు.

మొదటి కథలో నవీన్ అనే చిన్నపిల్లవాడికి తన బడి అన్నా, ప్రేమగా బోధించే టీచర్లన్నాఎంతో ఇష్టం. కానీ, తల్లిదండ్రులు ఖరీదైన బడిలో ప్రవేశ పరీక్ష రాయించేందుకు కోచింగు ఇస్తూ వాడి వేసవి సెలవులన్నీ వృథా చేసేస్తారు. పైగా నవీన్ తెలివితేటలపై నమ్మకం లేనట్టుగా ఆ సీట్ కోసం పెద్ద రికమెండేషన్ కూడా చేయిస్తారు. నవీన్ కి సీట్ వచ్చిందని తెలిసాక రికమెండేషన్ పని చేసిందని సంతోషిస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో నవీన్ కి పాతబడి, టీచర్లంటేనే ఇష్టమనీ, కొత్తబడిలో చేరటం ఇష్టం లేదని వాళ్లు పట్టించుకోరు. తను కష్టపడి ప్రవేశ పరీక్ష రాసాడని కూడా పట్టించుకోరు. 

                                 పిల్లలు పెద్దవాళ్లు చెప్పిన మాటల్ని ఆచరించటం సంగతెలా ఉన్నా, పెద్దవాళ్లను నిశితంగా పరిశీలిస్తూ వారిలా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లో ఉన్న పెద్దల్ని, బడిలో టీచర్లని అనుక్షణం గమనిస్తూనే ఉంటారు. ఈ గమనింపు వారి వారి వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుందుకు కొంతవరకు కారణమవుతాయి. వారిదైన స్వభావం చూపే ప్రభావం కూడా తక్కువది కాదు. స్నేహితుల ఇంటి వాతావరణం, అలవాట్లు, పధ్దతులు గమనించినపుడు తమ ఇంటి వివరాలతో పోల్చుకుంటారు. మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. అవి ఎవరితో చర్చించాలి? వినేందుకు ఎవరూ లేరే!

కొందరు పిల్లలు చిన్నప్పటినుంచి పొందికగా, క్రమశిక్షణతో ఉంటారు. కొందరు తల్లిదండ్రులు, టీచర్లూ ఎంత చెప్పినా నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలాటివారిని మార్చేందుకు వారికంటూ బాధ్యతను అప్పగించటమొక్కటే మార్గం. క్లాసులో అల్లరిచేసే విద్యార్థిని క్లాసు లీడర్ని చేసి బాధ్యత అప్పగించటం బహుశా టీచర్లందరికీ అనుభవమే. పిల్లలకు తమ బాధ్యతలను తెలియజెప్పాలి. తమ పనులకు తామే బాధ్యులన్న ఎరుక కలిగించాలి. మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవటం ఎంత అవసరమో చెప్పాలి. అది మంచి లక్షణమని చెబుతూ, పెద్దలం మంచి ఉదాహరణగా ఉండాలి. 

                               తాము ఏది మంచిదనుకుంటారో అదే పిల్లలు అనుసరించేలా చేస్తారు కొందరు పెద్దలు. దీనితో పెద్దయ్యాక కూడా ప్రతి విషయంలోనూ పెద్దల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. మంచి చెడుల విచక్షణ వివరించి, స్వయంగా నిర్ణయాల్ని తీసుకునేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. హోం వర్క్ ఉందంటే ఎంతసేపు ఆడుకోవాలి, ఎప్పుడు ఇంటికొచ్చి హోం వర్క్ చేసుకోవాలన్నది పిల్లలకే వదిలెయ్యాలి. క్రమంగా వారికి సరైన నిర్ణయం తీసుకోవటం తెలుస్తుంది.

పెద్దల మాటతీరును గమనిస్తుండే పిల్లలు వారిని అనుకరిస్తుంటారు. అందువల్ల మనం మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. ఇంటి సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో, అపరిచితులతో మాట్లాడే పధ్ధతి ఎందుకు, ఎలా వేర్వేరుగా ఉండాలో పిల్లలకి తెలియజెయ్యాలి. పెద్దలతో మాట్లాడేటప్పుడు పాటించాల్సిన మర్యాద, మాటకున్న విలువ, దాని ప్రాధాన్యం చెప్పాలి. పిల్లలతో కబుర్లు చెబుతూ, వారిని చర్చలకి ప్రోత్సహిస్తూ ఇలాటివి తెలియజేయాలి. 

                               సాధారణంగా బడిలో పిల్లలు తమ భోజనాన్నో, తాము తెచ్చుకునే చిరుతిండినో స్నేహితులతో పంచుకుంటారు. తమ దగ్గర ఉన్న డబ్బునో, వస్తువునో పంచుకోవటం వరకే కాక తోటివారికోసం సమయాన్నివ్వటంలో ఉండే ఆనందం, తక్కువ అవకాశాలున్న వారికి చేతనైన సాయంచెయ్యటంలో ఉండే సంతృప్తి పిల్లలకి అర్థమయ్యేలా చెయ్యాలి. తోటివారి పట్ల ఒక సానుకూల ధోరణిని నేర్పాలి. 

ప్రస్తుతం ప్రపంచమంతా ఒక పోటీ ధోరణిలో పరుగులు పెడుతోంది. గెలుపు మంత్రమొకటే మనుషుల్ని నడిపిస్తోంది. కానీ ఒకరి గెలుపు మరొకరి ఓటమికి కారణమవుతోందన్న స్పృహ ఉండట్లేదు. అందరూ కలిసి నడవటం, గెలవటం నేర్పాల్సిన అవసరం ఉంది. పోటీ తత్వంతో పిల్లల్లో కక్షా, కార్పణ్యాలను నేర్పే బదులు వారిదైన ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాలి. 

                                   నేను అని కాక మనం అన్న ధోరణి అలవాటు చెయ్యాలి. పెద్దలతో సంకోచం లేకుండా తమ అభిప్రాయాలను పంచుకునే చనువు ఇస్తే పిల్లలు ఆరోగ్యకరమైన ఆలోచనలతో, స్వేచ్ఛగా పెరుగుతారు.

సెలవుల్లో పిల్లలకు నచ్చే విషయాలను నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. అవకాశం ఉన్నప్పుడు విహార యాత్రలు చేయించి దేశంలో విభిన్నప్రాంతాల్లోని జీవనశైలిని పరిచయం చెయ్యాలి. పిల్లల దృక్పథం విశాలమవుతుంది. 

                                   ఒక సమస్య ఎదురైనపుడు దిగులుపడకుండా దాని పరిష్కారం కోసం ఆలోచించాలి. చుట్టూ ఉన్నవారిని పరిశీలించినపుడు వారి సమస్యలు అర్థమవుతాయి. మనం చెయ్యగలిగిన సాయం అందించాలి. సమాజంలో ఆర్థికపరమైన తేడాలకి కారణం ఏమిటన్నది గమనించాలి.  

ఆనందంగా జీవించేందుకు అధికంగా డబ్బు, విలాస వస్తువులే అవసరం లేదని అవగాహన కల్పించాలి. తృప్తి అనేదానికున్న ప్రాముఖ్యత చెప్పాలి. ప్రకృతిలోని సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అందరికీ సహజంగా ఆనందాన్నిచ్చే సౌందర్య దృశ్యాలు. చుట్టూ ఉన్న ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న స్పృహ పిల్లలలో కలిగించాలి. సామాజిక ఆస్తులైన బస్సులు, రైళ్లు, రోడ్లు మనం ప్రభుత్వానికి చెల్లించే పన్నుల ద్వారా ఏర్పాటు చెయ్యబడిన వసతులు. వాటికి నష్టం కలిగిస్తే మనమే నష్టపోతాం అని చెప్పాలి. సామాజిక జీవనం పట్ల ఒక బాధ్యతను నేర్పాలి.

తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పడుతుంటారు. అలాగే పెద్దల ఒత్తిడి వలన పిల్లల్లోనూ ఆందోళన ఉంటుంది. ఈ విషయాలన్నీ తల్లిదండ్రులు, పిల్లలు కలిసి చర్చించుకోవలసిన అవసరం ఉంది.

                                  భిన్న సందర్భాలలో మనలో కలిగే భావాలు, స్పందనలు గురించి స్నేహితులతో చర్చించాలి. ద్వేషం, కోపం, అసూయ వంటి ప్రతికూల లక్షణాలు అశాంతిని, అసౌకర్యాన్ని మాత్రమే కలిగిస్తాయి. అవగాహనతో, పరస్పర చర్చలతో చెడు భావాలను నియంత్రించుకోవాలి. 

మాట్లాడుకుందుకు, చర్చించుకుని ఆరోగ్యకరమైన పరిష్కారాల్ని కనుక్కుందుకు మనకు ఎన్నో విషయాలున్నాయని అహల్యాచారిగారు చెబుతున్నారు. మరి మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నామా? పిల్లల్ని మాట్లాడనిస్తున్నామా? లేదు కదా!

ఇకనుంచి మనం మాట్లాడుకుందాం. పిల్లల్ని ‘’ఏమీ తెలియదు ఊరుకోండి’’ అనకుండా వారి మనసుల్ని, ఆలోచనల్ని విందాం. మనమూ వారి ఊహల ఎత్తుకు ఎగిరిపోదాం. సరేనా?

అసలు ఈ పుస్తకం గురించి ఏదేదో రాసేను, కానీ నిజానికి పుస్తకం చదివితే వచ్చే వెలుగు మరింత చిక్కనిది. మీరూ చదవండి.

మీరు పిల్లల్ని ప్రేమిస్తున్నారా? అయితే చదివితీరవలసిన పుస్తకం ఇది.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.