ఒక్కొక్క పువ్వేసి-4

-జూపాక సుభద్ర

నేరాలు పట్టని ఘోరాలు

‘సారూ మాది నక్కలగండి, దేవరకొండ పాజెట్టుల భూమికి బాసినోల్లము. భూమి వోయిందని నాకొడుకు సచ్చిపోయిండు. బతికే బతుకుదెరువు లేక నాసిన్నకొడుకు పెండ్లం పిల్లలతోని పట్నమొచ్చి ఆటో తోల్కుంటుండు. నా కోడలు మిషినికుడ్తది. ముగ్గురు పిల్లల్తోని యెట్లనో కాలమెల్లదీత్తండ్రు. వూల్లేమి గాలిపోయిందని మేంగూడ యెక్కువ యీ బస్తిల్నేవుంటము. యిది సింగరేని కాలనీ బస్తంటరు. గీ బస్తిల మాయిండ్లు 10, 20 గజాలల్ల నాలుగు రేకులు దొర్కితె సాలు, గోడలు కప్పులేస్కుంటరు. గిసోంటిట్ల కిరాయికుంటన్నము. యీడ అందరూ మా అసోంటి పేదోల్లే వున్నరు. యీడ ఎక్కడలేని సారా, గుట్కాలు, గంజాయి దుకునాలు పొద్దు మాపు రికాము లేకుంట నడుత్తయి.గీ బస్తిల అటిటు సొలుగకుంట నడిసే మొగోల్లు చాన తక్కువ.గిసోంటి మొగోల్ల మద్దె ఆడోల్లేంబతుకుతరు? సందకాడ నేను కూరగాయలకు బొయిన. కోడలు యింట్ల పంజేత్తంది. పిల్లలు యింటి ముందటాడుకుంటండ్రు.ఆరేండ్ల పసిగుడ్డు నా మన్మరాలును బుదుగరిచ్చి, పక్కోడు ఆనికి జెట్టబుట్ట, ఆడు ఆగంజేసి నా బిడ్డను సంపిండు. పిల్ల కనవడ్తలేదని అంత దిరిగినము.
పోలీసులు బస్తీలకొత్తె ’అయ్యా సారు, నా మన్మరాలు కనవడ్తలేదు‘ అని సెప్పితే నన్ను నూకేస్కుంట పోయిండ్రుగానీ పట్టిచ్చుకోలే నా మాటను. అయిదారు గంటలు మొత్తుకున్నా కొట్టుకున్నా… నా సైత్ర దొర్కలే.ఆఖరికి అనుమానపడి తాళమేసున్న యింట్ల సూడుండ్రని సెప్తె… బస్తోల్లు తాలంబల్గగొట్టి సూత్తె, ఏమున్నది ఆగమాగంగ సచ్చిపోయి పరుపుల సుట్టి వున్నది. ఆ యింటోడు ఒక్కడే వుంటడు. బట్టెబాజిగాడు. తల్లి పెండ్లమ్ యెల్లిపోయిండ్రు. పాలుగారె నా పసికూనను కంట్లె బెట్టుకొని పంపె. నా బిడ్డెట్ల సచ్చిపోయిందో ఆన్ని గూడ అట్లనే సంపాలె’’ అని చైత్ర నాయినమ్మ వలపోత.
హైద్రాబాద్ నగరం నడిబొడ్డులో వున్న సింగరేని కాలనీ బస్తీకి చెందిన ఆరు సంవత్సరాల పసిపాప, చైత్ర అనే బాలిక అతి దారునంగా అత్యాచారం, హత్యచేయబడింది. గంజాయి, సారా మత్తులో జులాయిగా వుండి, పోర్న్ వీడియోల్లో తూలుతుండే వాల్లు తప్ప, తల్లికి బుట్టిన యెవ్వడు యింత దుర్మార్గానికి ఒడిగట్టరు. పాప నాయినమ్మ జెప్పినట్లు గీ బస్తి సారాకు, గుట్కాలకు గంజాయికి అడ్డ, అందరు పొట్ట చేతబట్టుకొని బత్కొచ్చిన పేదోల్లు. ఎస్సీ, ఎస్టీ, వడ్డెర కులాలున్నయి. యీ బస్తీని మన రాష్ట్ర మంత్రి కేటీ ఆర్ దత్తత తీస్కున్నాడు. కానీ యిక్కడ మగవాల్లు మత్తులో వున్న సంగతి, పోర్న్ వీడియోలకు, గంజాయి, సారాలకు అడ్డగా వున్నదని తెల్వదా!యీ గంజాయి, సారా పోర్న్ వీడియోల్లో మునిగిన యువతకు ఉద్యోగ రక్షణ, మహిళలకు రక్షణ చేయాలనే బాధ్యత లేదా!
బస్తిల యింత ఘోరం జరిగితే, వచ్చి పరామరిక చేయక పోగా ’నిందితుడు రాజు దొరికాడు పోలీసు కస్టడీలోనే వున్నాడని‘ అబద్దపు ట్వీట్ ఎట్లా చేస్తాడు? అధికారం చేసేవాల్లు ప్రభుత్వాల్ని నడిపేవారు, యింత బాధ్యతారహితంగా వుండడం దారుణమ్. ఒక బాధ్యతాయుతమైన అధికార పదవిలో వుండి, వూహాగానాలుగా ట్వీట్స్ చేయడం, ’సారీ తెలవక అట్లా అనుకున్నాను‘ అనే ట్వీట్లు ప్రజలకేమి ప్రయోజనము? వాల్లను పక్కదాని పట్టించడం తప్ప? దత్తు తీస్కున్న బస్తీలో యిన్ని అసాంఘిక కార్యక్రమాలు, నేరాలు జరుగుతన్నా పట్టకపోవడం, చాలా అన్యాయమ్. ప్రభుత్వాలు నడిపే వాల్లకు యింత నిర్లక్ష్యము, బాధ్యతా రాహిత్యముంటే సమాజాలు ఎట్లా బాగుపడ్తాయి? సోషల్ మీడియా, ప్రతిపక్షాల నాయకులు, ప్రజా సంగాలు, కుల సంగాల నాయకులొచ్చి చైత్ర కుటుంబాన్ని ఓదారుస్తూ, బాసటగా నిలుస్తుంటే… గవర్నమెంటును నడిపే నాయకులు జాడలేరు, పత్తాలేరు.కానీ సినిమా హీరోకి చిన్న ఆక్సిడెంట్ అయిందని హాస్పటల్ కి బోయి పరామరికలు, ఓదార్పులు మేమున్నామనే దన్నులు,దండాలు! సింగరేని కాలనీ బస్తీలో ఒక గిరిజన పాపని రేప్ చేసి చంపితే…ఏమి పట్టని వ్యవహారాలు. యిక మీడియా ఆధిపత్యకులం ఆడపిల్లలకు ఏమైనా జరిగితే,ప్రభుత్వాలను నిలబడనియ్యది, కూచోనియ్యది.పగలు రాత్రి నిర్విరామంగా నిలదీస్తూనే సంచలనాలు చేస్తుంటది.నిర్బయ, దిశ సంఘటనల్లో మీడియా చేసిన ఎస్టాబ్లిష్మెంట్ వల్లనే ప్రభుత్వాలు దిగొచ్చినాయి,తక్షణ చర్యకు. కానీ యిదే మీడియా దళిత, ఆదివాసీ, బీసీ కులాల మహిళల మీద అత్యాచారాలు హత్యలు జరిగితే స్పందించడం లేదు. యిక్కడ ఆరేండ్ల పాప చైత్ర అత్యాచారం, హత్య విషయంలో కూడా మీడియా ‘ వార్త ‘ చేయలేదు. సినిమా యాక్టర్ కి యాక్సిడెంటయితే హాస్పటల్ చుట్టూ చానల్ల మోకరింపు చేసుకొని, నిమిష నిమిషానికి అప్ డేట్స్ యిస్తుందంటే… మీడియా ఏ కులాల పక్షమో అర్థం చేసుకోవచ్చు.
గిరిజన శాఖ, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి ఒక గిరిజనురాలై వుండి కూడా, ఆ పాప హత్యాచారాన్ని ఖండిచడం, కుటుంబానికి ఓదార్పు నివ్వడంగానీ జరగలే. యిక రాష్ట్ర మహిళా కమిషన్ కూడా యిట్లాంటి దారునాలు జరిగినప్పుడు కూడా పట్టించుకోకపోవడం విచారకరం.యిప్పటి దాకా నేరస్తున్ని పట్టుకోలేకపోయారు. మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరగడం కేవలం మహిళా సమస్యలు కావు. యివి సామాజిక సమస్యలు. మహిళలే స్పందించడం కాదు,మన సంగాలు కూడా ఉద్యమించాలి. అప్పుడే సమాజంలో కొంత చైతన్యం వస్తుంది.మహిళల మీద దాడుల్ని నిరోధించే అవకాశం వుంటది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.