హమ్ యాప్ కె హై కౌన్

-ప్రసేన్

ఎవరికుండదు చెప్పు…
ఎందుకుండదు చెప్పు!

కండముక్కలేని బక్కనాయాలకూ సిక్స్ పాక్ తో పుట్వ చూసుకోవాలనీ

కురూపసి అష్టావక్రికీ సల్మాన్ తోనో టామ్ క్రూయిజ్ తోనో చుమ్మా ఏవీ ఏస్కోవాలనీ
అప్పలమ్మకూ మిస్ యూనివర్స్ కిరీటం కొట్టే జిఫ్పవ్వాలనీ
గోటింబిళ్ళాడలేని గొట్టంగాడికీ వరల్డ్ కప్పెత్తిపట్టిన బ్రేకింగ్ న్యూసవ్వాలనీ
కదల్లేనోడికీ మారథాన్నడిచే క్లిప్పవ్వాలనీ
ఎడ్డమ్మకు కౌన్ బనేగా కరోడ్పతి నెగ్గిన పిక్ అవ్వాలనీ

ఎవరికుండదు చెప్పు
ఎందుకుండదు చెప్పు

ఫికర్ నహీ గురువా
ప్రతి ముదనష్టపు జబ్బుకూ మందుంది
ప్రతి ఎర్రి కలకూ యాపుంది
ప్రతి కోర్కెకూ ఓ సైటుంది

నీ బక్క బొక్కల్ని యాపులో తోస్తే నువ్వు సిక్స్ పాకర్వి కాదూ..
అందవైకల్యాన్ని యాపులో పడేస్తే
నువు మిస్సిండియా మిస్వరల్డూ కాదూ..
నీ ఎనభై ఏళ్ళను యాపులోకి నెట్టేస్తే
నువ్వే యువ తోపూ యంగ్ తోపున్నరా..

అన్నింటికీ యాపులే
యాప్ హీ జీవన్ హై యాప్ హీ జీత్ హై
యాప్ లోనే సత్యముంది
నిత్యమూ యాపు ఉంది..

కిల్లర్ యాపూ హారర్ యాపూ
లవ్ యాపూ లవ్ మేకింగ్ యాపూ
నవ్వుల యాపూ కన్నీళ్ళ యాపూ
సబ్ చెల్తా హై సబ్ మిల్తా హై

కలలే పరిష్కారం
కలల్లోనే ఆవిష్కారం

అద్సరే గానీ ఇంతచేసీ నిర్భయాలోచనల్ని బొందపెట్టే
యాపెందుకు లేదూ..
ఆ పసిబిడ్డని చిదిమేసే మగబుద్దిని తెగనరికే
యాపెందుకు లేదూ..
ముళ్ళ మాటలను వెన్నెల పూలుగా మార్చే
యాపెందుకు లేదూ..
మనసు మురికినీ మెదడు వెకిలినీ కడిగేసే
యాపెందుకు రాదూ..

దుఖ్ఖం లేని కన్నీళ్ళు రాని వేదన తెలియని లోకాన్నిచ్చే యాపూ నువ్వెక్కడ

పాస్వర్డ్ లేని లాకవ్వని హాంగవ్వని అబద్దం కాని ఓ మానవీయ యాప్ ఏదీ

మార్ఫ్ కాని వర్చువల్ కాని జిఫ్ కాని
మనిషిని మనిషిగా మార్చే నెత్తురూ మాంసాలున్న యాపొకటి పుట్టుకొస్తే ఎంతబాగుండు

ఎంతబాగుండు
కోరికలను దుర్మార్గాలను వైపరీత్యాలను నిట్టనిలువుగా నరికేసే యాపొకటి ఉంటే..

******

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.