గాబ్రియెల్ గార్షియా మార్కెజ్ ‘ది స్కాండల్ ఆఫ్ ది సెంచురీ’

పుస్తక పరిచయం 

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ఈ నెల నుండి ప్రారంభం)

  -ఎన్.వేణుగోపాల్

మార్కెజ్ గురించి మరొకసారి…

బెజవాడ ఏలూరు రోడ్డులో గడిచిన వైభవోజ్వల దినాలలో నవోదయ పబ్లిషర్స్ దుకాణంలో 1981-82ల్లో పరిచయం అయిన నాటి నుంచి మిత్రులు, ప్రస్తుతం పల్లవి పబ్లికేషన్స్ నడుపుతున్న వెంకటనారాయణ గారు రెండు మూడు రోజుల కింద ఉదయాన్నే ఫోన్ చేసి మార్కెజ్ ను గుర్తు చేశారు. “మీరు మార్కెజ్ చీకటి పాట తెలుగు చేశారు గదా, అది మళ్లీ ఏమన్నా వేయదలచుకున్నారా, లేకపోతే మమ్మల్ని వేయమంటారా” అని అడిగారు. అచ్చు పత్రికలలో, సారంగ వెబ్ పత్రికలో,  నా ఫేస్ బుక్ గోడ మీద గాబ్రియెల్ గార్షియా మార్కెజ్ ను ఎన్నోసార్లు తలచుకున్నాను, ఆయన గురించి పంచుకున్నాను. వెంకటనారాయణ గారి ఫోన్ కాల్ తో మళ్లీ ఒకసారి మార్కెజ్ గురించి చెప్పాలనిపిస్తున్నది.

చిలే లో ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చి, సల్వడోర్ అయెండె అధ్యక్షుడుగా ఏర్పడిన పాపులర్ యూనిటీ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని 1973 సెప్టెంబర్ 11న సి ఐ ఎ ప్రోద్బలంతో సైనిక కుట్ర కూలదోసింది. అధ్యక్షుడినీ, పాపులర్ ఫ్రంట్ ప్రభుత్వ సమర్థకులనూ వేలాది మందిని ఊచకోత కోసింది. సైనిక కుట్రకు నాయకత్వం వహించి, ఆ తర్వాత తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని, మరుక్షణమే అమెరికన్ ప్రభుత్వ గుర్తింపు పొందాడు సైనిక నియంత ఆగస్టో పినోషే. ఆ సైనిక ప్రభుత్వం అరెస్టులకూ చిత్రహింసలకూ హత్యలకూ గురిచేసిన చిలియన్ ప్రజల సంఖ్య తక్కువలో తక్కువ ఇరవై ఎనిమిది వేలు అనీ, ఎక్కువలో ఎక్కువ ఒక లక్షా నలబై వేలు అనీ వేరువేరు అంచనాలున్నాయి. రాజధాని శాంటియాగోలోని ఫుట్ బాల్ స్టేడియంలో పాపులర్ యూనిటీ ప్రభుత్వ సమర్థకుడూ, ప్రపంచ ప్రసిద్ధుడూ అయిన కళాకారుడు విక్టర్ యారాతో సహా వందలాది మందిని సైనికులు కాల్చిచంపారు.

ఆ తర్వాత పదిహేడు సంవత్సరాల పాటు ఆగస్టో పినోషే దేశం మీద చీకటి తెర కప్పి అత్యంత దుర్మార్గ పాలన సాగించాడు. సైన్యం చేతిలో హత్యకు గురవుతామనే అనుమానంతో వందలాది మంది ప్రగతిశీల కవులు, కళాకారులు, రచయితలు, విద్యావేత్తలు తలదాచుకోవడానికి యూరప్ కూ అమెరికాకూ వలస వెళ్లారు. అలా ప్రవాసానికి వెళ్లిన వాళ్లలో ఎవరు తిరిగి స్వదేశానికి రావచ్చునో, ఎవరు ఎప్పటికీ రావడానికి వీల్లేదో పినోషే ప్రభుత్వం జాబితాలు విడుదల చేసింది. తన పేరు ఎప్పటికీ తిరిగి రాగూడని నిషిద్ధ వ్యక్తుల జాబితాలో ఉండడం చూసిన చిలేయన్ సినిమా దర్శకుడు మిగ్వెల్ లిట్టిన్, అయినా సరే స్వదేశానికి వెళ్లాలనీ, దేశం లోపల అమలవుతున్న చీకటి పాలనను చిత్రించి ప్రపంచానికి చాటి చెప్పాలనీ నిర్ణయించుకున్నాడు.

పన్నెండేళ్ల ప్రవాసం తర్వాత, రహస్యంగా మొత్తం చిత్ర నిర్మాణ బృందాన్నంతా తయారు చేసుకుని మారువేషంతో, వేరే పేర్ల పాస్ పోర్టులతో, ఇతర చిత్రీకరణల అనుమతి పత్రాలతో చిలే వెళ్లాడు. దేశంలోకి అడుగు పెట్టడానికే వీల్లేదని శాసించిన పాలకుల కళ్లుగప్పి, దేశంలోకి వెళ్లడం మాత్రమే కాదు, ఆరు వారాలు దేశంలో గడిపి లక్ష అడుగుల సినిమా చిత్రీకరించాడు. ఆ ముడి ఫిల్మ్ నుంచి టెలివిజన్ కోసం ఒక నాలుగు గంటల సినిమా, ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లలో విడుదల కోసం ఒక రెండు గంటల సినిమా తయారు చేశాడు. ఆ అద్భుత, సాహసిక అనుభవం ఆయన మాటల్లోనే విని, మార్కెజ్ రాసిన వాస్తవ-కల్పనా రచన ‘క్లాండెస్టైన్ ఇన్ చిలే’.

“….బెంగళూరులో ఉండగానే దొరికిన మరొక మార్కెజ్ అద్భుతం ‘క్లాండెస్టైన్ ఇన్ చిలే’. అకాలంగా మరణించిన సాహితీమిత్రుడు గోపీ స్మృతిలో ఒక పుస్తక ప్రచురణ కార్యక్రమం, ముఖ్యంగా తనకు ఇష్టమైన అనువాద సాహిత్యం ప్రచురించాలని అనుకున్నప్పుడు వెంటనే తట్టినదీ, కొద్ది రోజుల్లోనే అనువాదం, ప్రచురణ అయిపోయినదీ ఆ ‘క్లాండెస్టైన్ ఇన్ చిలే’ పుస్తకమే. నేను, సి వనజ కలిసి అనువాదం చేసిన, ‘చీకటి పాట’ పేరుతో వచ్చిన ఆ పుస్తకంలో సల్వదోర్ అయెండె పేరు వర్ణక్రమం దగ్గరి నుంచి ఎన్నో పొరపాట్లు ఉన్నప్పటికీ తెలుగులో వెలువడిన మొట్టమొదటి మార్కెజ్ పుస్తకం అది. దాని అనువాదంతో, ప్రచురణతో సంబంధం ఉండడం నాకు సంతోషంగా, గర్వంగా ఉంటుంది” అని 2014లో మార్కెజ్ మరణించినప్పుడు సారంగ లో రాసిన వ్యాసంలో రాశాను. 

అలా 1995లో వచ్చిన ‘చీకటి పాట’ తెలుగులోకి వచ్చిన మార్కెజ్ మొదటి పుస్తకం మాత్రమే కాదు. ఇరవై ఐదేళ్ల తర్వాత ఇవాళ్టికి కూడా అదే ఏకైక పుస్తకంగా ఉండడం తెలుగు సాహిత్య ప్రపంచం మీద ఒక వ్యాఖ్య. ఇరుగు పొరుగు  భాషలైన దక్షిణాది భాషలలోనే మార్కెజ్ రచనలు ఎన్నో అనువాదం కావడం మాత్రమే కాక, పునర్ముద్రణలు కూడా పొందాయని విన్నాను. ఇటీవల జయతి లోహితాక్షన్ గారు ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ తెలుగు చేశారనో, చేస్తున్నారనో విన్నాను. అది వెలువడితే రెండో పుస్తకం అవుతుంది.

రెండు సంవత్సరాల కింద వెలువడిన మార్కెజ్ కొత్త పుస్తకం, ‘ది స్కాండల్ ఆఫ్ ది సెంచురీ అండ్ అదర్ రైటింగ్స్’ దాదాపు ఏడాది కింద చదివి, ఉబ్బి తబ్బిబ్బై, కనీసం దాని పరిచయం అయినా రాద్దామనుకుని, తీరిక లేక రాయలేకపోయాను. ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల కిందటి అనువాదాన్ని పునఃప్రచురించాలనే వెంకటనారాయణ గారి ఆసక్తి ఈ కొత్త పుస్తకం గురించి ఇప్పటికైనా రాయమని పురికొల్పుతున్నది.

మార్కెజ్ రచనా జీవితం ఇరవయ్యో ఏట కథా ప్రక్రియతో మొదలయినప్పటికీ ఒకటి రెండు సంవత్సరాల్లోనే జర్నలిస్టుగా మారాడు. ఆ తర్వాత ప్రపంచ ప్రసిద్ధమైన, సమ్మోహకమైన ఐంద్రజాలిక వాస్తవికతతో నవలలూ కథలూ ఎన్ని రాసినప్పటికీ, నవలకే నోబెల్ బహుమతి పొందినప్పటికీ, ఆ బహుమతి సొమ్ముతో అప్పటికే మునిగిపోతున్న ఒక పత్రిక కొని అందులో జర్నలిస్టుగా కొనసాగాడంటే జర్నలిజం ఆయన జీవితకాల ప్రేమ అని అర్థమవుతుంది.

“నన్ను ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ కోసం గుర్తు పెట్టుకోవడం నాకిష్టం లేదు. నోబెల్ బహుమతి కోసం గుర్తు పెట్టుకోవడం కూడా అంతే. నన్ను వార్తాపత్రికతో గుర్తుపెట్టుకోవాలని నా కోరిక. నేను జర్నలిస్టుగా పుట్టాను. అన్నిటికన్నా ఎక్కువగా నన్ను నేను విలేఖరిగానే భావించుకుంటాను. అది నా రక్తంలో ఉంది” అని ఆయన మరణానికి కొన్నేళ్ల ముందు అన్నాడు.

ఆయన కథలూ నవలలూ ఇంటర్వ్యూలతో సహా ఆయన వచన రచనలు ఎన్నో సార్లు, ఎన్నో చోట్ల అచ్చయ్యాయి, అనువాదమయ్యాయి గాని జర్నలిస్టు రచనల, పత్రికా రచనల సంపుటాలు స్పానిష్ లో వచ్చాయేమో గాని ఇంగ్లిష్ లో ఒక పెద్ద సంపుటంగా రావడం ఇదే మొదటిసారి.  ఆనీ మెక్లీన్ అనువదించగా, క్రిస్టోబల్ పెరా సంపాదకత్వం వహించిన ఈ 300 పేజీల అద్భుతమైన సంపుటాన్ని 2019 లో న్యూయార్క్ లోని ఆల్ఫ్రెడ్ ఎ నాఫ్ ప్రచురణ సంస్థ ప్రచురించింది. అమెరికన్ జర్నలిస్టు, జీవితచరిత్రల రచయిత జోన్ లీ ఆండర్సన్ ముందుమాట రాశారు.

కొలంబియాలోని బరాంకీలా అనే చిన్న పట్టణంలో నడుస్తుండిన ఎల్ హెరాల్డో అనే పత్రికలో 1950 మార్చ్ 16న రాసిన ‘ది ప్రెసిడెన్షియల్ బార్బర్’ అనే వార్తా కథనంతో ఈ సంపుటం మొదలవుతుంది. స్పెయిన్ లోని మాడ్రిడ్ నుంచి వెలువడిన ఎల్ పయిస్ అనే పత్రికలో 1984 జనవర్ 25న అచ్చయిన ‘హౌ డు యు రైట్ ఎ నావెల్’ అనే వ్యాసంతో ముగుస్తుంది. ఈ పుస్తకంలోని మొదటి పత్రికా కథనం నాటికి కొలంబియాలో ఒక ఉదారవాద రాజకీయవేత్త హత్య తర్వాత చెలరేగి, ఇరవై వేలమందిని బలిగొన్న హింసాకాండ వల్ల డిగ్రీ చదువు మధ్యలోనే వదిలెయ్యవలసి వచ్చిన 23 ఏళ్ల కుర్రవాడు గాబ్రియెల్. ఈ పుస్తకంలోని చివరి పత్రికా కథనం నాటికి ఆయన ఏడెనిమిది నవలలు రాసిన, ప్రపంచ ప్రసిద్ధి పొందిన, నోబెల్ బహుమతి కూడా గెల్చుకున్న 57 ఏళ్ల మహా రచయిత.

ఈ ముప్పై ఐదేళ్ల కాలంలో ఆయన ఎన్నో పత్రికలు మారాడు. ఎన్నో పత్రికల్లో రాశాడు. ఎన్నో దేశాలు తిరిగాడు. భూమి మీద ఉన్న అన్ని వస్తువుల మీదా రాశాడు. ఈ సుదీర్ఘ జీవన, సాహితీ ప్రయాణంలో ఆయన కథన శైలి ఎన్నెన్ని విన్యాసాలు చేసిందో, భాష ఆయన చేతిలో ఎట్లా మైనం ముద్దలా కరిగి, ఆయన కోరుకున్న అద్భుతమైన ఆకారాల్లో ఒదిగిపోయిందో, ఒక వాస్తవికత మీద ఆధారపడి కాల్పనిక, ఐంద్రజాలిక ప్రతిసృష్టి ఎలా చేయవచ్చునో చూపే యాబై రచనలివి. ఇందులో 700 పదాలకు మించని చిన్న వార్తా కథనాలూ ఉన్నాయి, ఇరవై వేల పదాలు దాటి, ఒక దినపత్రికలో పదిహేను రోజులపాటు ధారావాహికగా వచ్చిన సుదీర్ఘ వార్తా కథనాలూ ఉన్నాయి.

లాటిన్ అమెరికన్ పత్రికలకు స్థానిక విలేఖరిగానూ, విదేశాల వార్తా సేకరణ చేసే విలేఖరిగానూ గాబ్రియెల్ పారిస్, ఇటలీ, వియన్నా లకూ, తూర్పు యూరప్ నగరాలకూ వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన ఎంత సాధారణ వార్తల నుంచి, మామూలు వార్తా వస్తువుల నుంచి ఎంతెంత అసాధారణమైన, ఐంద్రజాలిక వాస్తవమో, కల్పనో అనిపించే రచనలు సృష్టించాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఆయనను మాత్రమే కాదు, మరెందరో లాటిన్ అమెరికన్ రచయితలను చదువుతున్నప్పుడు అసలు లాటిన్ అమెరికన్ వాస్తవికతలోనూ, దాన్ని పట్టుకున్న రచయితల ఊహాశాలిత లోనూ ఏదో అసాధారణత్వం ఉన్నదనిపిస్తుంది. 

“సరైన నిష్పత్తులలో లేని మన వాస్తవం సాహిత్యానికి ఎంత విపరీతమైన, తీవ్రమైన సమస్య కల్పిస్తుందంటే ఆ వాస్తవాన్ని చెప్పడానికి మన మాటలు సరిపోవు. నిజంగా మన వాస్తవికత పరిమాణాన్ని పట్టుకోవాలంటే ఒక కొత్త శబ్దాల మహా వ్యవస్థను సృష్టించడం అవసరమవుతుంది” అన్నాడు మార్కెజ్ ఒక వ్యాసంలో. “నిజంగా జరిగిన ఘటనలో మూలం లేని ఒక్క వాక్యం కూడా నా పుస్తకాలలో లేదు” అనీ, “లాటిన్ అమెరికన్ రచయితలూ కరీబియన్ రచయితలూ తమ గుండెల మీద చేతులు పెట్టుకుని చెప్పగలదేమంటే, నిజానికి వాస్తవికతే మనకంటె మెరుగైన రచయిత. మన విధి, లేదా బహుశా మన ఘనత, ఆ వాస్తవికతను సవినయంగా అనుకరించడానికి, వీలైనంత ఎక్కువ అనుకరించడానికి ప్రయత్నించడమే” అనీ అన్నాడు.

ఆ సామాజిక జీవన వాస్తవాల మీద పత్రికా రచనలుగా వెలువడిన ఈ యాబై కథనాలలో ఒక్కొక్కదాని అద్భుతత్వాన్ని గురించీ చెప్పాలని నాకెంతో కుతూహలంగా ఉంది. అవకాశం ఉంటే అవన్నీ, కనీసం కొన్ని ముఖ్యమైనవైనా అనువాదం చేయాలనీ ఉంది. ఇప్పుడిక్కడ మాత్రం మీరు ఈ పుస్తకం చదివేలా రెచ్చగొట్టడమే నా లక్ష్యం గనుక అన్నీ చెప్పను. కొన్ని మాత్రం చెప్పకుండా ఉండలేను.

1957 అనే ఒకానొక సాధారణ సంవత్సరం ప్రపంచంలోని అనేక దేశాలలో ఎటువంటి చారిత్రక పరిణామాలకు దారి తీసిందో కథలా రాసిన వ్యాసం, కారకాస్ లో ఒక పిచ్చి కుక్క కరిచిన పద్దెనిమిది నెలల పిల్లవాడిని రక్షించడానికి పన్నెండు గంటలు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు దేశాలకు దేశాలే కదిలిపోయి, ఎన్నెన్ని సంచలనాలతో అంతిమ లక్ష్యం నెరవేరిందో ఉత్కంఠభరితంగా రాసిన వ్యాసం, నీటి కొరతతో రెండు నెలల తర్వాత కారకాస్ ఏమవుతుందో ముందే రాసిన ఊహాగానం, హంగరీ, క్యూబా, నికరాగువాల అనుభవాలు వంటి ఎన్నో రచనలు ఆయన కథల్లా, నవలల్లానే ఉంటాయి. 

పుస్తకానికి శీర్షికగా పెట్టిన ‘ది స్కాండల్ ఆఫ్ ది సెంచురీ’ అనే వార్తా కథనానికి ‘ఇన్ డెత్ విల్మా మోంటేసి వాక్స్ ది ఎర్త్’ అనే ఉపశీర్షిక ఉంది. అంటే అది ఒక మరణం కథ. కాని మరణాంతరం ఆ జీవి భూమి మీద నడయాడిన కథ. పుస్తకంలో దాదాపు అరవై పేజీలు ఉన్న ఈ ఒక్క కథనాన్నయినా తెలుగు చేసి అచ్చువేస్తే ఒక సంచలన వార్తను, అది హత్యో, ఆత్మహత్యో, ప్రమాదమో తెలియని స్థాయి నుంచి, దాని వివరాలు బైట పడుతున్నకొద్దీ, పోలీసుల దర్యాప్తు, న్యాయస్థానాల విచారణ సాగుతున్న కొద్దీ హత్యగా వెలికి వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలతో కలిపి, ఒక కాల్పనిక రచన అనిపించేట్టుగా ఎలా రాయవచ్చునో పత్రికా విలేఖరులందరికీ, రచయితలందరికీ పాఠ్యపుస్తకంగా పెట్టవలసిన రచన ఇది.

వార్త తప్పనిసరిగా వాస్తవికతను దాటగూడదు. వాస్తవంలోని తార్కిక పరిమితులను దాటగూడదు. కాని అదే సమయంలో దానికి ఆకర్షణ, చదివించే శక్తి, ఆకట్టుకునే శక్తి అద్దాలంటే దాన్ని కాల్పనిక శైలిలోకి అనువదించాలి. గాబ్రియెల్ అనన్యసాధ్యంగా చేసిన ఆ ప్రయత్నం ఇక్కడ కనబడుతుంది.

ఇన్ని మాటలెందుకు, చదవండి గాబ్రియెల్ గార్షియా మార్కెజ్ ను. ‘ది స్కాండల్ ఆఫ్ ది సెంచురీ’ని.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.