చాతకపక్షులు  (భాగం-8)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

“ఆమాట ఆయన్నే అడగండి,” అంది కామాక్షి తన తప్పేంలేదు అని స్పష్టం చేస్తూ. పిల్లచదువుకి తనతమ్ముడు సాయం చేస్తానంటే ఆయనతమ్ముడు హేళన చేసిన వైనం ఆవిడ ఎదలో ముల్లై కెలుకుతూ వుంది మరి. 

“రానియ్యి. వాణ్ణే అడుగుతాను,” అన్నారాయన. 

గీత తల్లివెనక చేరి, “అయిన గొడవ చాలదూ? మళ్లీ ఇప్పుడెందుకూ ఆ వూసెత్తడం?” అంది నసుగుతూ. 

“బాగుంది. నిన్ను ఎందుకు కాలేజీకి పంపలేదూ అంటే మీనాన్నని అడగమన్నాను. వున్నమాటే కదా?” అంది ఆవిడ అమాయకంగా మొహం పెట్టి. 

శివరావుగారు అక్కడికా సంభాషణ ఆపి, “భానుమూర్తి ఏం చేస్తున్నాడు?” అని అడిగారు. 

“ఫోన్లకంపెనీలో పని చేస్తున్నాడు.” 

“ఏమాత్రం వస్తుందేమిటి?” 

“మూడు వందలు తెస్తాడు. అదికాక ఓటీలుంటాయి.”

శివరావుగారు పరధ్యానంగా వున్నారేమో “ఏవిటీ?” అని అడిగారు మళ్లీ. 

“అదేనండీ, ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బిస్తారూ.”

శివరావుగారు ఆహా అని తల తాటించి, కాళ్లు కడుక్కుని వస్తానంటూ పెరటివేపు నడిచేరు. 

పరమేశంగారు ఇంటికొచ్చేవేళకి కనుచీకటి పడుతూంది. అంతకుమున్నే పనుందంటూ వూళ్లోకెళ్లిన శివరావుగారు తిరిగొచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటింది. 

“బండి దిగీ దిగకముందే పనుందంటూ వూరిమీద పడకపోతే, నిదానంగా చూసుకోకూడదూ ఆ పనులేవో,” అన్నారు పరమేశంగారు మందలిస్తున్నట్టు. 

“మరే, నేనూ నీలాగే బడిపంతుల్ని ఆయివుంటే, ఠంచనుగా పదింటికి వెళ్లి, నాలుగు కొట్టేసరికల్లా తిరగొచ్చేసి పూలరంగడిలా పవళించేవాడినే. నాది వ్యాపారమయ్యా నాయనా. మాకు పని చేయుకాలమూ, విశ్రాంతిసమయమూ, ఎండాకాలమూ, వానాకాలమూ, రాత్రీ, పగలూ, తిండీ, నిద్రా ఏమీ వుండవు. సర్వం విష్ణుమయం అన్నట్లుగా మాకు ఎల్లవేళలా ఒకే కార్యక్రమం, వ్యాపారం.”

“హుమ్. రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పినట్టు తాను తొక్కనిదారిలో ఏముందో తెలీదు కదా. నువ్వే బడిపంతులివి అయుంటే పూలరంగడూ, పవళింపూ లాటి మాటలు వాడవు,” అన్నారు పరమేశంగారు వెలితినవ్వుతో. 

“పోనీలే. నావి అపభ్రంశాలు అని ఒప్పేసుగుంటాను. ఇప్పుడు పాఠాలు మొదలెట్టకు” అన్నారు శివరావు తేలిగ్గా నవ్వేసి. 

“ఇప్పటికే ఆలస్యం అయింది. భోజనానికి రండి” అంది కామాక్షి వంటగదివేపు దారి తీస్తూ. 

భోజనాలదగ్గర మళ్లీ శివరావు గీత చదువు ప్రసక్తి తెచ్చేరు. పరమేశంగారికి అది మాటాడ్డం ఇష్టం లేదు. పెద్దవాడు కాలేజీలో రెండో ఏడు చదువుతున్నాడు. గీత తరవాత ఇంకా పిల్లలున్నారు. వాళ్లకి కూడా నాలుగు అక్షరపుముక్కలు రావాలి కదా. ఆమాటే అన్నారాయన. 

శివరావు వూరుకోలేదు, “ఇదే మనవాళ్లతో వచ్చిన చిక్కు. నాపిల్లలకి పట్టెడన్నం పెట్టుకోలేకపోతానా అనో, రాతిలోని కప్పను రక్షించువాడే రక్షిస్తాడనో పిల్లల్ని కనేస్తారు. ఆఖరికి ఆపట్టెడన్నంతోనే సరిపుచ్చుకుంటారు.”

“ఏమిట్రోయ్ ఫామిలీప్లానింగు కబుర్లు చెబుతున్నట్టుంది. తమరికెందరేమిటి పిల్లలు? ఇద్దరా లేక ముగ్గురా?” పరమేశం నవ్వుతూ అన్నాడు. 

శివరావుకి ఆరుగురు పిల్లలు, అందరూ మొగపిల్లలే. “నాకెందరయినా నేను వాళ్లకి పట్టెడు మెతుకులు చాలనుకోలేదు. ప్రతిఒక్కడికీ చాలినంత సంపాదిస్తున్నాను. సంపాదించగల స్తోమత నాకుంది” అన్నాడు శివరావు తన సామర్థ్యం వెల్లడి చేస్తూ. 

కామాక్షి అన్నం మారు వడ్డిస్తుంటే. ఎడంచేత్తో వారిస్తూ, “చాలమ్మా, ఇప్పటికే చాలా ఎక్కువయిపోయింది” అన్నాడు. 

ఆవిడ వెళ్లి పెరుగు తీసుకొచ్చింది. 

భానుమూర్తి ఇంట్లోకి వచ్చి, కాళ్లూ చేతులూ కడుక్కుని వచ్చి మరో పీట వాల్చుకుని కూర్చున్నాడు. 

శివరావు ఆతన్ని పలకరించి కుశలప్రశ్నలు వేశారు. “నువ్వు ఎన్నయినా చెప్పు. ఆడపిల్లలు కూడా చదువుకోవాలనే అంటాను నేను,” అన్నాడు చివరిసారిగా. 

“అది సాగేమాట కాదులే. నాతరం కాదు. పెద్దవాడికి డిగ్రీ వచ్చేసరికి ఇంకో రెండేళ్లు పడుతుంది. ఇంకా గీత తరవాత మరో ఇద్దరు పిల్లలు వున్నారు. వాళ్లకి కూడా నాలుగు ముక్కలు రావాలి కదా,” అన్నారు పరమేశంగారు కటికనిజాలు దృష్టిలో పెట్టుకుని. 

శివరావు, “సరే నీయిష్టం” అన్నారు ముక్తసరిగా. 

పరమేశంగారికి తానేదో తప్పు చేస్తున్నానని అతను అనుకుంటున్నాడేమో అనిపించి, “పెళ్లి చేసేయాలని చూస్తున్నాను” అని జోడించారు.

“దానికిప్పుడే పెళ్లేమిటి? పదహారయినా నిండేయా?” అన్నారు శివరావుగారు ఆశ్చర్యపోతూ. 

పరమేశంగారు వీలయినన్ని కారణాలు చెప్పేరు. గీతేం పసిపిల్ల కాదు అన్నారు. ఆడపిల్లకి పెద్ద చదువులు చెప్పిస్తే ఇంకా పెద్దచదువులు గల అల్లుళ్లని చూడాలన్నారు. వాళ్లకి తగినంత కట్నాలు ఇచ్చుకోవాలి కదా అన్నారు. 

“పోనీ, నువ్వు అల్లుడికోసం వెతుకుతూండు. అంతవరకూ చదువుకోనియ్యి”

“మొగుడికింత వండి పెట్టడానికి కాలేజీ చదువులెందుకండీ” అన్నాడు భానుమూర్తి. 

“డిగ్రీ వుంటే వండిపెట్టడానికి అడ్డొస్తుందేమిటి?”

“అడ్డొస్తుందని కాదు. అవసరం లేదంటున్నాను. మావదిన్ని చూడండి. ఏం చదివింది? అయినా ఎంత నేర్పుగా సంసారాన్ని ఈదుకొస్తోంది.”

“చాల్లే, నామాటే చెప్పుకోవాలి” కామాక్షి విసుక్కుంది. 

“అదేమిటి వదినా, ఈరోజు నేనింతవాడిని అయేనంటే అది నీచేతి చలువే కదా.” 

కామాక్షిమొహంలో చాయామాత్రంగా సంతృప్తి మెరిసి మాయమయింది. మరిది మెచ్చుకున్నందుకు లిప్తపాటు తృప్తి కలిగినా, విషయం పక్కదారి పట్టినందుకు చిరాకు కూడా కలిగింది వెంటనే.  

* * * * *

(ఇంకా ఉంది)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

4 thoughts on “చాతకపక్షులు నవల-8”

    1. అవునండి. ఆడపిల్లచదువంటే అన్ని ఆలోచనలు. మీ స్పందనకు ధన్యవాదాలు.

  1. ఆడపిల్ల చదువుకు ఎన్నెన్ని అభ్యంతరాలు. అవన్నీదాటుకుని వచ్చామంటే అదో ఆశ్చర్యం. కానీ ఇప్పటికీ బడిమెట్లు ఎక్కని పిల్లలుండటమే దురదృష్టకరం. ఈ భాగం మరీ చిన్నదిగా వుంది 🙂

Leave a Reply

Your email address will not be published.