బతుకు చిత్రం-11

– రావుల కిరణ్మయి

సారయ్య అంజులుకు సుత ముచ్చట చేవులేసిండు.నిన్న  అనుకోకుండా మీ తమ్ముడు శివుడు సుతం ఈ పని కాన్నే కల్సిండు.

అట్నా ..!మా శివుడు ఈడి కచ్చేది గింత తెల్వకపాయనే?

ఎట్లా ఎరుకయితది?అన్నదమ్ములంటే రామలచ్మనులోలె ఉండాలె.ఒక్క కంచం ల దినకున్నా ఒక్క మంచంల పండకున్నా ఒక్క కడుపుల పుట్టినం అన్న పావురం తోనన్న కల్సుండాలే.అప్పుడప్పుడ న్న కష్టమో ,నిష్టురమో పంచుకోవాలె.ఇప్పటికయినా మీ పెద్దన్న ముత్యాలు మిమ్ముల యాజ్జే త్తాండు.రేపు ఐతారం పో .శివుడు సుతం వత్తనన్నడు.

అంజులు అట్నే అని తలూపిండు.

***

అనుకున్నట్టే ఆదివారం అన్నదమ్ములు ముగ్గురూ ముత్యాలు గుడిసె కాన్నే వాళ్ళ  వాళ్ళ భార్యలతో కలుసుకున్నారు.

ముత్యాలు ,ఒరేయ్ నడిపోడా !చిన్నోడా ..!సారయ్య తానకే పనికి వచ్చుకుంట మీరు నన్ను కల్వక పోతిరేమిరా ?అన్నడు.

సారయ్య కాడికి నేనైతే ఈ మధ్యల్నేవత్తాన.అంతకు మునుపు ఓ రెడ్డోళ్ళ దొరకాడ ఇంటి వాచమెన్ గ చేసిన.ఆయన ఇల్లు అమ్ముకొని పోయిండు.వచ్చినాయ్న మాకెవ్వలద్దన్నడు. నీళ్ళల్ల చేపఒడ్డువడట్టు కొద్ది రోజులు పనికి దిరిగి గిల గిల కొట్టుకున్నం.నీడ పట్టు పనేం దొరకలే.ఆఖరికి ఆకలికి ఈ మట్టి పనికి పోవడితిమి.అన్నడు అంజులు.

శివుడు నేను సుత గట్నే గాలికెగిరే ఎంగిలి ఇస్తారాకోలె ఏడ పనుంటే ఆన్నే.అట్ల సారయ్య కాడికచ్చిన.అన్నాడు శివుడు.

సరే ఏదయితే ఏముంది ?గని ,ఓ ముచ్చట చెవులేద్ధమని పిలిపిచ్చిన .మన జాజులమ్మ లగ్గం ముగ్గురం ఎట్లన్న తిప్పలవడిచేత్తే బాగుంటదని నా ఆలోచన.

దానిదేమున్నది ?చెయ్యచ్చుగని ,పైసలు ఎవరి తాన ఉన్నయో వాళ్ళు మున్దువడున్డ్రి .నా కాడ ఒక్క కొత్త గూడ లేదు.అన్నాడు మళ్ళీ అంజులు.

గట్ల చెయ్యి దులుపుకుంటే కాదురా.ముందుగాల సంబంధాలన్న దొరుక వట్టాలే గదా ! మతిల వెట్టుకోని తెలిసున్నోల్లను జాడ జెప్పుమనున్డ్రి .మన లెక్కన కట్టం జేసుకొని దినాం ఇన్ని ఎన్కేసుకునేటోడైతే మంచిగనే ఉంటది.ఏమంటరు ? 

ఎన్కేసుకుంటడా ?ముందటేసుకుంటడా?సుక్కేసుకుంటడా ?సక్కంగుంటడా?అని తీరొక్క తీర్ల చూసే సయిమం దాటుతాంది.లగ్గామయిందొక్కటే లెక్క !అన్నాడు అంజులు.

అట్లని గుడ్డోనికి ,గూనోనికి ఇచ్చి దులుపుకుందామా ?అన్నాడు ముత్యాలు.

ఏందన్నో!వాళ్ళను గట్ల తక్కువనుకోవడితివి ?వాళ్ళు బతికినంత గౌరవంగా ఎవ్వలు బతుకుతలేరు.ఆళ్ళను అట్ల తక్కువ జేసుడు సాన తప్పు.నీకియ్య మనసు లేకుంటే ఊకో గని ఇంకోపారి అట్లా పేర్నాలు పెట్టకు. 

పేర్నాలు గాదయ్యా !మీ అన్న అనేది.వదిలిచ్చుకున్నట్టు గాక కొద్దిల కొద్దిల నన్న మంచి సంబంధం ఇయాల్నని,మనసున్నోల్లు అయితే చాలు.ఇంకో ఇషయం అట్లాంటి సాటి మనిషిని గౌరవించి ఇత్తే ఇంత పుణ్యమన్న ఉంటది.అన్నది ముత్యాలు భార్య.

ముత్యాలు భార్య వైపు చూసి సిగ్గుపడి ,నిజమేనే తొందరవడ్డ ,వాల్లే మనసున్నోల్లు ఉంటరు.వాళ్ళకు ఇంకొగరిని తక్కువ చేసే ఆలోచన్ గూడా ఉండదు.అన్నాడు చెంపలు వేసుకుంటూ.

అట్లయితే అట్ల గూడ ఎన్కకు పోకుంట ఎంకులాడుదం.ఏమంటారు ?అన్నట్టు గా చూశాడు శివుడు అన్నల వైపు .

ఏమనేది లేదురా !మంచి గుణమున్నోడి కోసం ఎదుకుదం.అంతే గని ఇంగేమి చూసేది లేదు .ఇట్లా ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చిన వారై ఆ రోజు అందరూ కలిసి భోజనాలు చేశారు.ఇక ముందు కూడా ఎప్పుడూ ఇలాగే కలుసుకోవాలని అనుకున్నారు.

***

ముత్యాలూ …!ఓరి ….ముత్యాలూ ….!గుడిసె ముందు ఎవరిదో గొంతు వినిపించేసరికి ముత్యాలు అతని భార్యా బయటికి వచ్చారు.చూస్తే మేస్త్రీ ,

రా..అన్నా …రా ..!నువ్వు నన్ను ఎతుక్కుంట వచ్చుడేందే?ఒక్క ఫోన్ డబ్బా కాడికి చేత్తే ఉరికచ్చేటోన్నిగాదె !అన్నాడు.మంచం వాల్చుకుంట.

సరేగని ,మంచిముచ్చట కలిసే చెప్పాల్నని ఉరికచ్చిన.అన్నాడు కూర్చుంటూ.

ఏంటిదో అన్నట్టు గా ముత్యాలూ ,ఆయన భార్యా మొహాలు పెట్టేసరికి,

గదేనయ్య ,మీ చెల్లెకు లగ్గం చెయ్యాలే ,పిల్లగాడుంటే చూడమంటివిగదా ! ఒక మంచి సంబంధం దొరికింది . కూసోని తరాలు తిన్నా తరగని ఆస్తి.మారానోలె బతకచ్చు.సిటీలనే ఉండుడు.అని మొదలు పెట్టంగనే ,

అయ్యా !మీరు చెప్తున్నది,మా చెల్లెకేనా ?పైసా కట్నం ఇచ్చుకోలేనోల్లం.మా చెల్లె జాజిపువ్వే.కాని పెద్దగా చదువు లేనిది.అంట్లు తోముడు తప్ప వేరే పనులేం రావు.గసొంటి దానికి ,మీరు చెప్పే సంబంధం నక్కకీ నాగలోకానికున్నంత పరకున్నది.పరాశికమైనా లగ్గం ముచ్చట్ల తగదు సామీ !అన్నాడు.

అయ్యో !ముత్యాలు !నేను పరాశికం ఆడ్తలేను.నే చెప్పేదంతా పదహారణాల నిజం.కాకపోతే పిలగాని వయసు అరవై.మనుమలు,మనుమరాండ్రు అందరున్నరు.ఈ దేశం ల కూడ కాదు.ఈయనొక్కడే ఈడ ఉండేది.భార్య సచ్చిపోయింది .పాపం !తిండికి తిప్పల వడలేక అన్ని నచ్చి చేసుకునేటోల్లుంటే పెళ్లి చేసుకోవాల్ననుకున్టాండు.తప్పేం లేదు కదా !పెళ్ళైతేనే పక్కాగా ఉంటదని,రేపొద్దున ఆస్తి ల వాటాలు కూడా ఉంటయని,చేసుకున్నోళ్ళు కూడా తన పట్ల మరింత బాధ్యతగ ఉంటారని ఆశ పడుతున్నాడు.అని ఆగగా 

అయినా అరవై ఏండ్లోనికిచ్చి చెల్లె గొంతు కోయాల్న? అదేం సుఖపడ్తదని?అన్నాడు నిరాశగా.

ముత్యాలు ..!ఆమె ఒక్కతే కాదు.ఈ పెళ్లి జరిగితే మీ అందరికి కూడ ఆయన ఏ సాయమైనా చేస్తానంటున్నాడు .ఆధారం దొరికితే తీగ లెక్క పాకాలె.మీరూ,మీ పిల్లలు సుత బాగుండచ్చు.మీ చేతి కి మట్టి అంటకుండా మీ చెల్లి లగ్గం చేసి అందరు ఒడ్డెక్కచ్చు.నువ్వు తల కిందుగా తపస్సు చేసినా ఇసోంటి మంచి సంబంధం తేలేవు.నిమ్మలంగనే మీ తమ్ముళ్ళ తోని ఇచారించుకో !నాకైతే చేస్తెనే బాగుంటదని మనసాగక ఇటే ఉరికచ్చిన.అన్నాడు పోవడానికి లేస్తూ.

ముత్యాలు,భార్య మేము ఆలోచించి చెప్తం.గని మిరిప్పుడే కాదన్నట్టుగా ఆయనకు చెప్పకుండ్రి.అన్నది.

ముత్యాలు ఏమీ మాట్లాడలేక పోయాడు.

అతను  వెళ్లి పోయాడు.

మంచం లో కూర్చున్న ముత్యాలు పక్కగా చేరి భార్య,

యాల్లాయితాంది.కూలికి పోను.బువ్వ తిందువు రాయ్య!రాత్రికి తీరిగ్గా ఆలోచించుదాం .అన్నది .

ముత్యాలు భార్య మాటలకు మంత్రించినట్టుగా లేచి అన్నం తినడం మొదలు పెట్టాడు.ఈ లోగా అతని భార్య ఇద్దరికీ మధ్యాహ్నానికి భోజనం ,మంచినీళ్ళు తయారుగా పెట్టింది.తానూ తిని ఇద్దరూ గుడిసె కు తడక అడ్డు పెట్టి బయలుదేరారు.దారిలో ఇద్దరి మధ్యా మౌనమే రాజ్యమేలింది.మామూలు గానైతే   

ఎన్నెన్నో ముచ్చట్లు ఉన్నవీ,లేనివీ ,కన్నవీ ,విన్నవీ అన్నీ కలబోసుకుంటూ వెళ్ళేవాళ్ళు.ముత్యాలు కు సైకిల్ తొక్కడం ఈ రోజు చాలా భారంగా తోస్తున్నది.అది చెల్లెలు గురించి మేస్త్రీ చెప్పిన సంబంధం వల్ల  కావచ్చు.కూటికి గతి లేకున్నా ఎందుకో అతడి మనసు ఈ పెళ్ళికి అంగీకరించడం లేదు.

రోజంతా ఇలా అన్యమనస్కంగానే గడిపాడు.భార్య ఇదంతా గమనిస్తూనే ఉన్నది.కానీ అతడిని ఏమీ అనకుండానే తన పని తానూ కానిస్తూ పని ముగించుకొని ఇల్లు చేరారు.

రాత్రి భోజనం త్వరగా కానిచ్చి ఆరుబయట మంచం లో కూర్చున్న ముత్యాలును చేరింది.

ఏందయ్యా !పొద్దటిసంది అదో తీరుగున్నవ్ ?

ఏం జెప్పాల్నే?నువ్వూ వింటివి గదా!చెల్లెకు మేస్త్రీ తెచ్చిన సంబంధం?గసొంటి పెండ్లి చేత్తేంది? చెయ్యకుంటేంది?దానికి పిల్లాజెల్లా ఉండాల్నని ఆశలు ఉండయా?ఏంది?రెట్టింపు ఈడున్నోనికిచ్చి చేస్తే అదేమి సుఖపడుతది?ఎనుకత పయిసలకాశపడి ఆడపిల్లల చిన్నప్పుడే తాత ఈడు ముసలోల్లకిచ్చి చేసేదట.పుటుక్కున చేసుకున్నోడు పోతే ఖర్మని వదిలేసేదట.గట్నే ముసలోనికి పడుచుపెళ్ళాం లెక్కన ఈ పెళ్లి చేసి జాజులును బలి చేసుడవసరమాని మనసు తల్లడమల్లడమయితాంది.

చెయ్యమని నేను చెప్తలేను గని,ఒక్క దిక్కే ఆలోచించకు.ఈ పెళ్ళి చేత్తే మీ చెల్లె మాత్రం తిండికి బట్టకు లోటు లేకుండా మహరాణిలాగా దర్జాగా బతకచ్చు.ఇక పిల్లలు అంటే పెళ్ళై పిల్లలు లేకుండా ఎంతమంది బతుకుతలేరు?ఆయన ఒప్పుకుంటే ఎవరినైనా తెచ్చి పెంచుకునే ఉపాయం చేస్తే సరిపోతది.అని నాకు తడుతాంది.బీదోల్లుగా పుట్టడం తప్పుగాదు.బీదోల్లుగా చావడం తప్పని పెద్దోళ్ళు చెప్పినట్టు వచ్చిన అవకాశాన్ని దూరం జేసుకోవద్దని నాకనిపిత్తాంది.ఏది ఏమైనా ఈ ముచ్చట మీ తమ్ముళ్ళకు ,నాయనకు,చెల్లెకు చెప్పిసూడు.అందరు ఒప్పుకుంటే చేద్దాం,లేదంటే లేదు.అన్నది.

ముత్యాలుకు అది గూడా నిజమేననిపించింది.తనొక్కడి నిర్ణయం తో జరిగేది కాదు కాబట్టి వాళ్ళను  కలిసి ముచ్చట చెవులేయాలని అనుకున్నాడు.

  ***   

మరునాడు పనికి పోకుంట తమ్ముల్లిద్దిరికి ఆదివారం నాడు ఓసారి వచ్చి పొమ్మని కబురు పంపాడు.

అనుకున్నట్టుగానే ఆదివారం ముగ్గురూ ఆలోచన చేశారు.ముత్యాలు లాగా వాళ్ళు తర్జన భర్జనలు ఏమీ లేకుండానే వదినె  చెప్పినట్టుగా చెల్లె,నాయనల ఇష్టం మీద వదిలేస్తే మన అదృష్టం కొద్ది వాళ్ళు ఒప్పుకుంటే మన అందరి జీవితాలు బాగుపడుతాయి.అని తేల్చి చెప్పారు.

ముత్యాలు  తమ్ముళ్ళు కూడా తనలాగే అనేసరికి మరో ఆలోచన లేకుండా అందరం కలిసి ఊరు పోదాం అన్నాడు.

నడిపి తమ్ముడు అన్నా !నేను రాలేనే ,ఇప్పుడిప్పుడే పని దొరుకుతాంది.మల్ల ఎగనామం బెడితే ఎవరూ నమ్మి పని అప్పజెప్పరు.అందుకని నన్నిడిసి పెట్టు అన్నాడు.

చిన్నోడు అన్నా !నాకు కూడా అప్పుండి ,ఇచ్చినోళ్ళ కాన్నే తేరేదాక పనికత్తనని మాటిచ్చిన ఇప్పుడు కాదంటే మల్లోపారి అక్కెరకు ఆడుకుంటరాని …ఆలోచిత్తాన .అన్నాడు .

ముత్యాలు భార్య కల్పించుకొని మొన్న అచ్చినప్పుడు ఏడ దొరికితే ఆడ చేసుకుంటానం అన్నరుగదా!మల్లిప్పుడు గిట్లనవడితిరి?మీకు పోవుడు ఇష్టం లేనట్టున్నది కదా!ఎన్కటికి ఏదో కథ సెప్పినట్టే ఉన్నది మీ ఎవ్వారం.ఎలుకలన్ని పిల్లి మెడల గంట కడితే అది వచ్చేతప్పుడు గంట సప్పుడయితే ఎక్కడోల్లమక్కడ దాక్కోవచ్చని అనుకున్నయట.తీరా గంట ఎవలు గట్టాలే అనే ముచ్చటచ్చేవరకు ఎక్కడియక్కడ పారిపోయినయట.గట్నే ఉన్నది మీ సంగతి కూడా.

చెల్లె లగ్గమంటే సరే …సరే ..అంటరు.అడగడానికి బోను తీరిక లేదంటాండ్రు అన్నది.

అబ్బా !నువ్వుండే !కథలూ ..శాత్రాలు ఇనుకుంట ఉండే సైమమా ?ఇది ?నాకొకటి తోస్తున్నది.మీరు రాకున్నా …రాను బోను చార్జీలు నాకున్ను,మీ వదినెకిత్తే పెద్దోల్లం మాకెట్లాగు తప్పది.పొయ్యి ముచ్చట తేల్చుకత్తం అన్నాడు.

ఆ ….గిప్పుడు మంచి మాట చెప్పినవయ్యా!అట్నేజేత్తం అన్నది.ముత్యాలు భార్య , నిర్ణయం చెప్పుమన్నట్టు మరుదులకేసి చూస్తూ .

వాళ్ళకు ఇది అన్నతిరకాసు పెట్టినట్టుగా అనిపించి ,వాల్ల భార్యల వైపు చూశారు.

వారు మొగుళ్ళను ఒప్పుకోవద్ధన్నట్టుగా కండ్లతోనే సయిగ చేసి ,

అక్కా ..!అయిందానికీ ఒక్క రొండు దినాలు ఆగుండ్రి .ఏదైంది చెప్తం అన్నది నడిపి తమ్ముని భార్య.

మేము సుత అంతే అని చిన్నామె కూడా అనడంతో ,

కట్టెరిగదు  పాము జావదు అన్నట్టే అయిపోయి ఎక్కడోల్లక్కడ వెళ్ళిపోయారు.

***

ఆ రాత్రి అన్జులు భార్య ,మీయన్న చానా తెలివిగ చార్జీలు అడుగుతాండు,అంత ఆపతే ఉంటే ఆయన సొమ్మే పెట్టుకొని పోయిరావచ్చుగదా!నడుమిట్ల మనలను బద్నాం జేసుడేందుకు?అన్నది 

బద్నామేమున్నదే?

అయ్యో …రాత.నువ్వు గింత ఎడ్డిబాగులోనివి గాబట్టే మన బతుకులు గిట్ల తెల్లార్తానయ్ .

ఎక్కడికెక్కడికో ముడేయకే. 

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.