వెనుతిరగని వెన్నెల(భాగం-29)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-29)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే చదువుతూ ఉంటుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు.

***

లాయరు విశ్వ ఆఫీసు బయట గదిలో బెంచీ మీద కూర్చుని  జరిగినదంతా గుర్తు తెచ్చుకుని రాయడం మొదలు పెట్టింది తన్మయి.

దు:ఖం కళ్ల నిండి, అక్షరాలు అలుక్కు పోతూ ఉన్నాయి.

మళ్లీ మళీ అదే ప్రశ్న. “అసలు అతను ఇదంతా ఎందుకు చేసేడు?”

అదే అడిగింది లాయరు విశ్వని.

పేపర్లు అందుకుని దీక్షగా మొదటి వాక్యంసత్యమేవ జయతేవైపు కాస్సేపు చూసి, తరువాత పేజీలన్నీ తిప్పి గబగబా చదివేడు.

చేతిలోని కాగితాల్ని టేబుల్ మీద పెట్టి, పైన పేపర్ వెయిట్ పెడుతూ  తన్మయి వైపు చూసి,

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేఅని కారల్ మార్క్స్ ఏనాడో చెప్పేడు. ఇంత చదువుకున్నారు మీకు నేను చెప్పనవసరంలేదనుకుంటా. కేసులో బాగా అర్థమవుతున్న విషయం ఏవిటంటేఅతను అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నదే ఆర్థిక లాభం కోసం. కానీ అతను అనుకున్న విధంగా మీ నించి అతను ఆశించినంత లాభపడలేకపోయేడు. పైగా అతనికి కావల్సినది వంటింటి కుందేలు వంటి భార్య, మీలా ఉన్నత ఆశయాలున్న యువతి కాదు.

మిమ్మల్ని వద్దనుకోవడం అతని దురదృష్టం. మీది కాదు. అతనెంత దౌర్భాగ్యుడంటే, మీ మెడలో కట్టిన తాళిలో ఒకటి అతని తల్లిదండ్రులు కొన్నది కాబట్టి, అది తిరిగి ఇచ్చేయవలసిందని నోటీసులో రాయించేడు. అంతే కాదు, విడాకుల వల్ల మీకు, మీ అబ్బాయికి మనోవర్తి ఇవ్వబడుతుందని, అతని జీతం నెలకు మూడువందల రూపాయలని దొంగ సర్టిఫికేటు పుట్టించేడు….”

అప్పటి వరకూ తల దించుకుని వింటున్నదల్లా, అతని మాటలకు అడ్డు వస్తూ,

తలెత్తి దృఢంగా అంది తన్మయి.

ప్రేమ పేరుతో, పెళ్ళి పేరుతో నా జీవితంతో ఆడుకుని నన్ను ఇన్ని బాధలు పెట్టి, నన్ను నడి రోడ్డు మీదికి లాగిన అతన్ని అంత సులువుగా వదిలి పెట్టను లాయర్. మీరు చెప్పిన రెండవ ఆప్షను ప్రకారం నిర్దోషిగా నిరూపించుకుని, అతని మీద తిరిగి నేను విడాకుల కేసు పెడతాను. కానీ ఇలా చెయ్యడం వల్ల అతను కోరుకున్నదే నేను ప్రసాదిస్తున్నాను. కాబట్టి విడాకులు ఇవ్వను, అతని దగ్గిరిగి వెళ్లను. కానివ్వండి. కేసు ఎన్ని రోజులు నడుస్తుందో నడవనివ్వండి.”

***

సాయంత్రం ఊరు వెళ్ళగానే బాబుని ఎత్తుకుని తన గదిలోకి వెళ్లి, వాణ్ని కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడవ సాగింది తన్మయి.

ఎంత కాదనుకున్నా దుఃఖం ఆగడం లేదు.

తనేం పాపం చేసింది? ఇంత మనో  క్షోభ అనుభవించాల్సి వస్తోంది?”

తల్లి దుఃఖానికి  అర్థం తెలియక పోయినా చిన్న అరచేతుల్తో కళ్లు తుడవ సాగేడు బాబు

కాస్సేపట్లో బేలగా వాడూ ఏడవడం ప్రారంభించేడు.

జ్యోతి వంటింట్లో నుంచి గాభరాగా పరుగెత్తుకు వచ్చింది. “ఏమ్మా, ఏవయ్యిందిఅంటూ.

“ఏం చెప్పాలి తల్లికి? ఎలా చెప్పాలి? తల్లికి సుతరామూ ఇష్టం లేకపోయినా, ఇటువంటి దరిద్రుడిని, మానవత్వం లేని మనిషిని, దుర్మార్గుడిని ప్రేమించి ఇష్టపడి, పెళ్లి చేసుకున్నదని వివరించగలదా?”

తల్లి వద్దన్నపుడు విని ఉంటే ఎంత బావుండేది.

ఏవీ మాట్లాడకుండా, తల్లి ఒళ్ళో తలదాచుకుని భోరుమని విలపించసాగింది.

నిన్ను ఒక్కదాన్నీ విశాఖపట్నంలో ఉండొద్దంటే వినవు. ఇలా బెంగపడి పోయి, డీలా అయిపోతే ఎలా చెప్పు? నువ్విలా ఏడుస్తూ ఉంటే ఇక ఒక పక్క ఒంట్లో బాలేని నాన్నగారిని, చంటాడిని చూసుకునే ధైర్యం నాకెలా వస్తుంది?” అంది జ్యోతి కళ్ళద్దుకుంటూ.

రాత్రి ఒక నిద్ర మాత్ర మింగి బలవంతాన నిద్రకుపక్రమించింది తన్మయి

ఫోనులో చుట్టాలెవరితోనో మాట్లాడుతున్న తల్లి మాటలు లీలగా వినిపిస్తున్నాయి.

అతన్ని విపరీతంగా ప్రేమించింది. హఠాత్తుగా అతను ఇలా విడాకుల నోటీసు పంపించేసరికి తట్టుకోలేక పోతూ ఉంది…..”

***

మరుసటి వారంలో మొదటి విడత కోర్టుకి బయలుదేరింది తన్మయి.

బయట ఎండ తీవ్రంగా కాస్తూంది. కోర్టు ఆవరణ అంతా ఎత్తైన చెట్ల నించి రాలి పడ్డ ఆకులతో, గాలిలో ఎగురుతూన్న దుమ్ము, ధూళితో నిండి తన్మయి మనస్సులోని అసహనంలాగే చికాకుగా ఉంది.

ఆవరణ గోడని ఆనుకుని దించిన టర్పంటైను గుడ్డల నీడల్లో టైపు మిషన్ల ముందు గుమస్తాలు, పిల్ల ప్లీడర్లు వచ్చిన వాళ్లని  వచ్చినట్లు పంచుకుంటున్నారు. లావాదేవీల కోసం సంవత్సరాల తరబడి తిరుగుతూన్నట్లు వాడిపోయిన ముఖాలతో రకరకాల మనుషులు ఆవరణలో అటూ ఇటూ తిరుగుతున్నారు.

ఒక మూలగా చిన్న షెడ్లలో ఒక గదిలో ఉంది ఫామిలీ కోర్టు. సినిమాలలో తప్ప ఎప్పుడూ కోర్టు ఎలా ఉంటుందో చూడలేదు తన్మయి. మారుమూల గది కోర్టంటే నమ్మబుద్ధి కావడం లేదు

చుట్టు పక్కల  ఆడవాళ్లంతా కోర్టు పిలుపు వచ్చేంత వరకూ చెట్ల కింది చప్టాల మీద దీనంగా కూలబడీ, నిలబడీ ఉన్నారు

ఇక మగాళ్ళయితే వ్యవస్థ అంతా తమ వైపే మొగ్గుతుందన్న ధీమాగా ఉన్నట్లు కనిపించారు తన్మయికిచేతిలో సిగిరెట్లు చివరకు రాగానే కాలి కింద నలుపుతూ వ్యంగ్యం చూపులు విసురుతూ కొందరు, నములుతూన్న కిళ్లీని తుపుక్కున మొహాన ఊస్తున్నట్టు పక్కకి ఊస్తూ , వెకిలిగా అటు ఇటూ తిరుగుతూ కొందరు.

వాతావరణానికి కాళ్లలో బలం పోయినట్లయ్యి తన్మయి ఒక చెట్టు కింద కూలబడింది.

తండ్రి చాటు బిడ్డగా, అపురూపంగా పెరిగింది తన్మయి.

తనకెప్పుడూ మగవాళ్లు క్రూ రులనే భావన ఇంతకు ముందెప్పుడూ కలగలేదు

పెద్దగా ఆకులు లేని చెట్టు కింద ఎండ సూటిగా తగుల్తూండడంతో భుజాన చెంగు తీసి నెత్తిన కప్పుకుంది.

దూరం నించి బండి మీద నల్ల కళ్లద్దాలు పెట్టుకుని అటు వైపే బండి మీద వస్తున్న శేఖర్ ని చూడగానే ఒక్కసారిగా అసహ్యం, కోపం చప్పున తలని తాకేయి. నుదుటిన కారుతున్న ఒక్కొక్క స్వేద బిందువూ ఒంట్లో సలసలా మరుగుతున్న రక్తపు బిందువులా అనిపించసాగింది.

దగ్గరికి వస్తున్నపుడు కావాలని తన్మయి వైపు కాకుండా మరోవైపు చూసుకుంటూ బండిని స్టాండు వేసి, కళ్లద్దాలు చేతిని తిప్పుతూ, అతని తాలూకు లాయరు వైపుకి నిర్లక్ష్యంగా నడుచుకుంటూ వెళ్లిపోయేడు.

“ధూ, పెద స్టిల్లొకటి ఎదవకి” అని తన కోసమే అన్నట్టు  తన్మయికి దగ్గర్లో కూచున్న మరొకామె మొగుణ్ణి తిట్ట సాగింది.

తన్మయికి హఠాత్తుగా మొదటిసారి అతను తన వైపు చూసిన ప్రేమైక చూపు జ్ఞాపకం వచ్చింది

ఛీ“… అని తల చప్పున విదిలించుకుంది.

బయట నిప్పులు చెరుగుతున్న ఎండ తలలో దూరి చెలరేగసాగింది. విపరీత భావాలు పుట్టుకు రాసాగేయి.

తనెవరో తెలీనట్లు నిర్లక్ష్యంగా నడుచుకెళ్లిపోతున్న అతన్ని అక్కడే నరికెయ్యాలన్నంత కసి పుట్టుకు రాసాగింది. బలవంతంగా తమాయించుకుంది.

ఎలాగైతేనేం, మరో గంట తర్వాత తమ వంతు వచ్చింది. లాయరు విశ్వ తన్మయిని పిలుచుకెళ్ళేడు

పెళ్లలు ఊడిన చిన్న గదిలో కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఒక బెంచీకి అటు వెపు జడ్జి కూచున్నాడు, అతని పక్కగా టైపు మిషనుతో గుమస్తా.

ఇద్దరి తరఫు లాయర్లు జడ్జి దగ్గరకు వెళ్లి కాగితాలు సమర్పించి, అతి నెమ్మదిగా వాళ్ల ముగ్గురికీ తప్ప ఎవరికీ వినబడకుండా ఏదో చెప్పసాగేరు.

శేఖర్ని, తన్మయిని పక్క పక్కన నిలబెట్టేరు.

అతని ఉనికికి తన్మయికి గొంగళీపొరుగులు పాకుతున్నంత జలదరింపు కలగ సాగింది.

అసలే బాధావేశాలతో దహించుకుపోతున్న తన్మయికి అక్కడ జరుగుతున్నదేదీ అర్థంకాకుండా పోవడమే కాకుండా లాయర్లు మాట్లాడుకుంటున్నది అసలు వినబడడమే లేదు.

పది నిమిషాల్లో లాయరు విశ్వరండి బయటకుఅనే వరకు అలాగే కట్టె పుల్లలా నిలబడింది.

కేసు వచ్చే నెలకు వాయిదా వేయించేను. మీరనుకున్నట్లే అతన్ని కోర్టు చుట్టూ వీలైనన్నాళ్లు తిప్పిద్దాం. వచ్చే వారం మీరు ఒకసారి ఆఫీసుకి రండి.” అన్నాడు.

తలూపుతూ తన్మయి దూరంగా దుమ్ము రేపుకుంటూ కనుమరుగవుతున్న శేఖర్ బండి వైపు  చూసింది.

***

బస్సెక్కిరామ కృష్ణా బీచ్అంది కండక్టరుతో.

సముద్ర తీరం వైపు అడుగులు వేసింది.

చెప్పులు తీసి చేత్తో పట్టుకుంది. వేసవి మధ్యాహ్నపు వేడికి ఇసుకలో కాళ్లు కాలసాగేయి. అయినా ముందుకు నడిచింది

దేహమంతా కాలి బూడిదయ్యి పోయేటట్లు సలసలా మరుగుతున్న ఆలోచనలు

మండుతున్న ఇసుక నీళ్ళని తాకుతున్న చోట అలలు వెనక్కి వెళుతూనే చిన్నగా పొగలు రేగ సాగేయి.

ఒంగి ఇసుకని గుప్పెట నిండా చేతిలోకి ఉండలా తీసుకుని అరచేతుల్తో గట్టిగా పిండింది. వేళ్లల్లో రాయిని తీసుకుని ఇసుకలా పిండి చేసెయ్యాలన్న ఆవేశం ప్రవేశించింది. కానీ అసహాయంగా తనలాగే రాలిపోతున్న ఇసుకని ఒడిసి పట్టుకుని తన వైపే వస్తున్న అలల వైపు చూస్తూ బలంగా విసిరింది.

ప్రపంచమా! నువ్వు సముద్రమై ఉవ్వెత్తున నన్ను నిలువునా ముంచేసినా సరే, ఎదిరిస్తాను. నిలబడతాను. దృఢంగా నిలబడతాను.” అంది గట్టిగా ఆకాశం వైపు చూస్తూ.

అలల ఒరవడికి కాళ్లు ఇసుకలో కూరుకు పోతున్నా, ఏటవాలుగా దిగువకి కెరటాలు తనని లాక్కుపోతున్న భ్రాంతి కలుగుతూన్నా ఎంతో సేపు అలాగే నిలబడింది.

కళ్ల లోంచి కారుతున్న ఉప్పు నీళ్లు సముద్రపు నీళ్ల కంటే ఎక్కువగా ఉప్పగా తగల సాగేయి.

అవి అధైర్యపు కన్నీళ్లు కాదు. కసితో రగులుతూన్న  రక్తపుటేరులు.

వెనక్కి తిరిగి వస్తూ  రోడ్డు ఎక్కబోతున్న తన్మయికి ఎదురుగా ఇద్దరు మగాళ్లు తనని ఎప్పటి నించో గమనిస్తున్నట్టు  వెకిలిగా నవ్వడాన్ని గమనించింది.

వాళ్ల ముఖాన ఉమ్మేసే కుసంస్కారం తనకు లేదు

ఒంగి కాలి చెప్పు తీసింది. తన్మయి కళ్ళలో రౌద్రం చూసి వాళ్లు ఒక్కడుగు వెనక్కి వేసేరు

తన్మయికి బస్సులో మగవాళ్ల ఉనికి కూడా అసహ్యం కలిగించసాగింది.

అనంత ఇంటికి చేరి తను తలుపు తీయగానే నిస్సత్తువగా నేలమీద కూలబడి మోకాళ్లలో తల దాచుకుని దు:ఖపడసాగింది తన్మయి.

అనంత నిశ్శబ్దంగా పక్కన కూచుని వెన్ను రాయసాగింది తన్మయికి.

తనంతట తను దు:ఖంలోంచి  తేరుకునే దాకా ఆగి,  “తన్మయీ! నువ్వు అమాయకురాలివి. నీకు ఎప్పుడూ అంతా మంచే జరుగుతుంది. ఇదిగో సాక్ష్యం చూడు. నీకు వివేకానందా పాఠశాల నించి ఇంటర్వ్యూ కోసం ఉత్తరం వచ్చింది.” అని చేతిలో పెట్టింది.

తన్మయి నమ్మలేనట్లు కవరు ఆదరాబాదరా గా విప్పి చూసింది.

నిజంగానే ఇంటర్వ్యూ లెటర్ అది. కానీ తామనుకున్నట్లు టీచరు ఉద్యోగానికి కాదు. టీచరు ఉద్యోగాలు అన్నీ నిండిపోయినందువల్ల  సాయంకాలపు ట్యూటరుగానూ, గర్ల్స్ హాస్టలు వార్డెనుగానూ పనిచేయడానికి  ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూకి రమ్మని సారాంశం

తన్మయి కళ్లు మూసుకుని ఉత్తరాన్ని కళ్లకద్దుకుంది.

తనున్న పరిస్థితుల్లో ఏదో ఒక ఉద్యోగం తనకి అవసరం. బహుశా: ఇదే తనకు నప్పే ఉద్యోగమేమో!

దిక్కులేకుండా ఎటో కొట్టుకుపోతున్న తన జీవితానికి ఒక చిన్న ఆధారం లభించబోతూంది.

కృతజ్ఞతలు మిత్రమా! శతకోటి కృతజ్ఞతలు!!” అని మనసులోనే అనేక ధన్యవాదాలు చెప్పసాగింది

***

మర్నాడు యూనివర్సిటీ నుంచి మధ్యాహ్నం భోజన సమయానికి ముందే త్వరగా బయటికి వచ్చి కేంటీను లో టీ తాగి, తిన్నగా వివేకానందా పాఠశాల వైపు బస్సెక్కింది

మధ్య మధ్యాహ్నం భోజనం చెయ్యకుండా టీ తాగి ఉండడం అలవాటు చేసుకుందికేంటీనులో భోజనం చెయ్యడానికి సరిపడా డబ్బులు లేకపోవడం ఒక్కటే కాదు, తినాలనిపించకపోవడమూ కారణమే. ఎందుకో మధ్య అన్నం తినబోతే కడుపులో తిప్పుతూ అస్సలు సహించడం లేదు. మనస్సులో తెలీని దుఃఖం. కడుపులో నుంచి మెలికలు తిరిగే బాధ. నిరంతరం రగులుతూన్న అగ్నిజ్వాల లాంటి  బాధ. ఒక పక్క కళ్ల ముందు అత్యున్నతమైన లక్ష్యం. ఎగిసి పడ్తున్న బాధల ముందు కాలే కడుపు ఒక లెక్క కాదు

దాదాపు గంట ప్రయాణం తర్వాత బస్సు మధురవాడ చివర్లో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల స్టాపుకు చేరుకుంది

బస్సు దిగి మట్టి రోడ్డు గుండా లోపలికి నడిచింది తన్మయి. తారు రోడ్డు నించి చిన్న గుట్ట మీదికి ఉందా రోడ్డు. పది నిముషాల నడక తర్వాత గుట్ట దిగుతూనే  దాదాపు  పది ఎకరాల మేర  పెద్ద ప్రహరీ లోపల వరసగా అందమైన అయిదారు భవనాలు కనిపించాయి. దాదాపు పది స్కూలు బస్సులు గేటు బయట బారులు తీరి ఉన్నాయి.  

రెసిడెన్షియల్ పాఠశాల అంటే ఇంత పెద్దగా ఉంటుందని ఊహించుకోలేదు తన్మయి. ఆశ్చర్యంతో అడుగులు వేసింది

పెద్ద గేటుకి ఒక పక్కగా కాపలాదారు కూచున్న చోట రిజిస్టరు లో సంతకం పెట్టి లోపలికి అడుగుపెట్టింది

మధ్య బాగా పాదుకుంటున్న రెసిడెన్షియల్  కార్పొరేట్ పాఠశాలల గురించి తన్మయి విందే కానీ, ఎప్పుడూ చూడలేదు

మొదటి బిల్డింగు లోనే ఉన్న కరస్పాండెంటు ఆఫీసులోకి అడుగు పెట్టింది. వెయిటింగు హాలులో రిసెప్షన్ పక్కనే నిలువెత్తు స్వామీ వివేకానంద కాంస్య విగ్రహం, కాళ్ల  దగ్గిర చుట్టూ పేర్చిన దేవ గన్నేరు పూలు.

ఒక అరగంట తర్వాత లోపలికి పిలుపు వచ్చింది తన్మయికి.

కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఇంత పెద్ద కమర్షియల్ స్కూలు నడుపుతున్న ధనవంతుడిలా కాకుండా సాధారణ వ్యక్తి లా కనిపించారు.

తెల్లని నూలు దుస్తులు. సాదాసీదా చెప్పులు. ముఖమ్మీద చక్కని మర్యాద పూర్వక దరహాసం

ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఏవిటో మొదటిసారి ప్రత్యక్షంగా చూసింది తన్మయి.

గర్ల్స్ హాస్టల్ వార్డెను గా అపాయింటుమెంటు లెటరు చేతికిస్తూ  “మీకున్న క్వాలిఫికేషనుకి ఇది సరైన ఉద్యోగం కాదు. మధ్యలో ఎప్పుడైనా టీచరు ఉద్యోగానికి  ఖాళీ ఏర్పడితే మారుస్తాం. వెల్ కమ్ టు వివేకానందా! రండి. ఆవరణ అంతా చూపిస్తాను.”  అని లేచేరు స్కూలు కరస్పాండెంటు రాఘవేంద్రరావు గారు.

స్వయంగా ఆయనే అన్నీ తిప్పి చూపించడం మరో ఆశ్చర్యం.

వెనక్కి చేతులు కట్టుకుని ఆయన ముందు నడుస్తూ ఉంటే ఆయన్ని అనుసరించింది తన్మయి

బాబుకి ఎడ్మిషను అడిగింది మాటల్లో

ప్రీస్కూలు లో జాయిన్ చేయండి. మీరేమీ డబ్బులు కట్టనవసరం లేదు. మీతో బాటూ రెసిడెన్సు, ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం.” అన్నారు.

ఇతరత్రా వివరాలేవీ అడగని ఆయన సంస్కారానికి మనస్సులోనే కృతజ్ఞతలు అర్పించింది తన్మయి

ప్రధాన గేటు నించి ఇరుపక్కలా క్లాసు రూమ్స్. మధ్య బాటకిరుపక్కలా విరబూసిన దేవ గన్నేరు పూలు. చివర నున్న బిల్డింగుకి ముందు అతి పెద్ద వివేకానందుడి విగ్రహం. పక్కనే మలుపు తిరగగానే రామకృష్ణ పరమ  హంస ప్రార్థనా మందిరం. మందిరానికిరుపక్కలా చిన్న కొలనుల్లో  అందంగా విరిసిన కలువ పూలు.

అక్కడి నించి ఆవరణకు మరో పక్క రెండేసి అంతస్తుల్లో ఎదురెదురుగా ఉన్న హాస్టలు భవనాలు.

ప్రశాంతమైన అక్కడి వాతావరణం చూడగానే తన్మయి మనస్సులోనే జోహార్లు అర్పించింది.

మిత్రమా! నన్ను ఇంత అందమైన చోటికి చేర్చినందుకు నీకేమిచ్చుకోగలను!”

తనతో విధి ఎంతగా ఆడుకుంటున్నా తనని చేరాల్సిన చోటికే చేరుస్తూ  ఉంది కాలం.

ఈయన వెంకట్, ఈయన మురళి.” బాయ్స్ హాస్టల్ ప్రధాన వార్డెన్లను పరిచయం చేసేరు రాఘవేంద్ర రావు గారు.

రెండు జోతులూ జోడించి నమస్కారం చేస్తూ మురళి వైపు చూసింది తన్మయి

అప్పుడప్పుడే ధ్యానం నించి బయటికి వచ్చినట్లు ప్రశాంతమైన కళ్ళు. ఒక గొప్ప పూజ్య భావం కలిగింది.

మగవాళ్ళందరూ తెల్లని లాల్చీ పైజమాలు, స్త్రీలందరూ తెల్లని  చీరలు ధరించడం తప్పని సరి అక్కడ.

ధవళ వర్ణపు దుస్తుల వల్ల వచ్చిన కాంతి మాత్రమే కాదది. మరేదో అలౌకికమైన శక్తివంతమైన కళ్లవి. పైన నుదుట సన్నని విభూతి రేఖ. ఇంత వరకూ తనకు  మురళిలాంటి యువకుడు ఎక్కడా తారసపడలేదు. కానీ ఎందుకో ఎప్పటి నించో పరిచయమైన దరహాసంగా అనిపించింది. ఒంగి ప్రతి నమస్కారం చేస్తూ తన్మయిని సాదరంగా ఆహ్వానించాడు మురళి

వెంకట్ ఉత్సాహవంతమైన యువకుడిని మొదటి పలకరింపులోనే అర్థమైంది. హాస్టలు గోడల్లో ఇమడగలిగే స్వభావం కాదు. మరి ఇక్కడ ఎందుకు ఉన్నాడో

కొత్తగా ప్రారంభించిన గర్ల్స్ హాస్టలు భవనం వరకూ చూసేక వెనుదిరిగేరు.

చివరగా తమ ఆఫీసుకి రెండవ అంతస్తులో ఉన్న కంప్యూటరు లాబు చూపిస్తూఅందరికీ విధిగా కంప్యూటరు ట్రయినింగు కూడా ఇస్తున్నాం. మీరూ మెల్లగా సర్టిఫికేషను చెయ్యండి.” అన్నారు రాఘవేంద్రరావు గారు.

తమతో వచ్చిన వెంకట్లోటస్ సర్టిఫికేషన్ లో మేం ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్నాం.” అన్నాడు.

అప్పుడర్థమయింది వెంకట్ అక్కడెందుకున్నాడో

కంప్యూటరుని మొదటి సారి ఆశ్చర్యంతో చూసింది తన్మయి.

బ్లాక్ & వైట్ స్క్రీను మీద ఏవేవో ఇంగ్లీషు అక్షరాలు తిరుగుతున్నాయి.

అసలు కంప్యూటరు ఉపయోగం ఏవిటో, తామెందుకు సర్టిఫికేషను చెయ్యాలో అర్థం కాలేదు తన్మయికి.

తన్మయి సందేహాన్ని గమనించినట్లు ,”ముందు ముందు మీకే అర్థమవుతుందిలెండి. నేను అమెరికాలో ఉన్నపుడు కన్న కల ఇది. ఇప్పటికి నిజమైంది.” అన్నారు రాఘవేంద్ర రావు గారు.

మరింత ఆశ్చర్యంగా చూసింది ఆయన వైపు. ఈయన అమెరికా నించి తిరిగి వచ్చి ఇక్కడ స్కూలు పెట్టేరా?! అయినా ఇంత నిరాడంబరంగా ఉన్నారా?!” 

***

మర్నాడే బట్టలు, పుస్తకాలు సర్దుకుని వచ్చేసింది తన్మయి.

గర్ల్స్ హాస్టలు హాలులో పెద్ద అక్షరాలతో  “Knowledge is Strength-Weekness is death” అని తన్మయికిష్టమైన వాక్యాలు రాసి ఉన్నాయి.

రెండవ అంతస్థులో పిల్లల విశాలమైన గదుల్ని ఆనుకుని కొసగా ఉన్న చిన్న గదిలోకి అడుగు పెట్టింది

సూట్ కేసులో నుంచి చిన్న వివేకానందుడి విగ్రహం తీసి గోడకున్న  చిన్న గూడులో పెట్టి నమస్కరించింది.

ఎక్కడి నించి ఎక్కడికి చేరింది తన జీవితం!

సముద్రంలోని అలలా, వీచే గాలిలా తనకే తెలీని జీవితం!!

వస్తూనే నాలుగు తెల్ల చీరలు రిసెప్షన్ లో ఇచ్చేరు

అందులో నుంచి ఒకటి తీసి కట్టు కుంది. తిలకం బొట్టు మీద సన్నని విభూది రేఖ పెట్టుకుంది.

అద్దంలో చూసుకుంది. నిండా పాతికేళ్లు రాకుండానే సన్యాసినిగా మారింది!

ఇక్కడ తనకు ఇప్పుడు ఒక్క బిడ్డ కాదు. అంతా తన పిల్లలే

ఆయాలు ఉన్నా పిల్లల ఆలనా, పాలనా దగ్గరుండి పర్యవేక్షించడం, భోజన సదుపాయాలు సక్రమంగా జరుగుతున్నాయో, లేదో చూడడం, తల్లిదండ్రులకు సమాధానాలు చెప్పడం వంటివి ఉద్యోగంలోని భాగాలు.

కావడానికి ఇది రెసిడెన్షియల్ స్కూలు అయినా ఉదయం పిల్లలు స్కూలు భవనానికి వెళ్లిపోగానే తను యూనివర్శిటీకి వెళ్లిపోవచ్చు. సాయంత్రం పిల్లలు వచ్చే వేళకు ముందే తప్పనిసరిగా ఇక్కడ ఉండాలి.

మధ్యాహ్నం పిల్లల భోజన సమయంలో దగ్గరుండలేదని ముందే చెప్పింది.

రాత్రి పూట హాస్టల్ బిల్డింగులోనే జరిగే ట్యూటరింగ్ క్లాసులకు అటెండ్ కావాలి.

ఇక అన్నిటికన్నా ముఖ్యమైన వెసులుబాటు బాబుని ఇక మీదట తనతోనే ఉంచుకోవచ్చు. తను కాలేజీకి వెళ్ళినంత సేపూ వాడూ స్కూలుకి వెళ్లిపోతాడు. తాను లేనప్పుడు ఇతర పిల్లలతో బాటూ వాడి ఆలనా, పాలనా ఇక్కడి ఆయాలు చూస్తారు.

రెసిడెన్సు, భోజనం కాకుండా జీతం నెలకు ఎనిమిది వందల రూపాయలు. డబ్బులు బొటాబొటీగా యూనివర్సిటీకి వెళ్లిరావడానికి, ఇతరత్రా చిన్న ఖర్చులకు సరిపోతాయి. ముఖ్యంగా తన్మయికి అక్కడి వాతావరణం బాగా నచ్చింది.  

తన జీవన పరిస్థితులకు సరిగ్గా సరిపడా ఉద్యోగం దొరకడం తన అదృష్టం.

ఉదయం అయిదు గంటలకు అందరూ కలిసి ప్రార్థనా మందిరం దగ్గర యోగా తరగతులలో విధిగా పాల్గొనాలి.

విశాలమైన ప్రార్థనా మందిరం బయట వాకిట్లో పరిచిన చాపల మీద కూర్చుని ప్రశాంత వాతావరణంలో యోగా తరగతులు జరుగుతాయి.

సన్నగా వినిపించే ఓంకార నాదంతో ప్రకృతిలో తానూ లీనమవుతున్న అనుభూతి కలగసాగింది తన్మయికి.

మనసూ, శరీరమూ ఏకమై ఊపిరిలో అంత: తేజస్సు లీనమై, మనస్సు లోని క్రోధావేశాల్ని దూరం చేసి, మలినపడిన మన:దేహాల్ని శుభ్రం చేసి, జీవన దుఃఖాలన్నీ తీర్చే అద్భుత మార్గం బోధపడినట్లై యింది.

‘యోగా’ తన్మయికి అత్యంత ఇష్టమైన కార్యక్రమం గా మారింది.

మురళి ముఖంలోని దివ్యకాంతికి అర్థం అప్పుడు బోధపడింది.

అప్పుడప్పుడే యోగా నేర్చుకుంటున్న తనకే ఇంత గొప్ప భావన కలుగుతూ ఉంటే, నేర్పించే మురళికి సంవత్సరాల సాధన వల్ల ఒనగూరిన దివ్యకాంతి అది

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.