అనుసృజన

ధ్రువస్వామిని- 3

హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్

అనువాదం: ఆర్. శాంత సుందరి

(ఒక దుర్గం లోపల బంగారపు నగిషీలు చెక్కిన స్తంభాలతో ఒక లోగిలి.  మధ్యలో చిన్న చిన్న మెట్లు. దాని కెదురుగా కశ్మీరీ పద్ధతిలో చెక్కిన అందమైన చెక్క సింహాసనం. మధ్యనున్న రెండు స్తంభాలూ పైదాకా లేవు.వాటికి రెండువైపులా పెద్ద పెద్ద చిత్రాలున్నాయి.టిబెట్ కి చెందిన పట్టు తెరలు వేలాడుతున్నాయి.ఎదురుగా చిన్న ఆవరణ ఉంది. దానికి రెండువైపులా నాలుగైదు మొక్కల పాదులు , పూలతో నిండిన తీగలూ కనిపిస్తున్నాయి.)

కోమా ః (మొక్కలని చూస్తూ నెమ్మదిగా ప్రవేశిస్తుంది) వీటికి నీళ్ళు పొయ్యాలి, లేకపోతే ఎండిపోయి, ధూళితో నిండి వీటి అందం కనిపించకుండా పోతుంది.( ఒంగి చూస్తూ) ఇవాళ ఈ ఆకులని కూడా ఎవరూ కడిగినట్టు లేదు.పువ్వులు విచ్చుకోనే లేదు.కిలకిలా నవ్వేందుకు శక్తిలేనట్టు కనిపిస్తున్నాయి!(ఆలోచించి)అవును కదా, కొన్నాళ్ళుగా మహారాజు యుద్ధం సమస్యని పరిష్కరించటంలో మునిగిఉన్నారు,నేను కూడా ఇటుకేసి రాలేదు.మరి వీటి గురించి పట్టించుకునేవారెవరు?ఆవేళ ఇక్కడ మరో రెండు ఆసనాలని అమర్చమని చెప్పాను, కానీ నామాట ఎవరు వింటారు? అందరికీ రక్తపిపాస పట్టుకుంది.ప్రాణం తీయాలనీ, ఇవ్వాలనీ పిచ్చి ఆవేశంలో ఉన్నారు. వసంత రుతువులో పవనాలు ఉత్సాహంగా వస్తాయి, నిరాశగా వెళ్ళిపోతాయి.ఎవరికీ వాటి స్పర్శ తెలియదు.కానీ జీవితం నిజానికి అలా ఉండకూడదు.(మెట్టు మీద కూర్చుని ఆలోచిస్తూ) ప్రణయం ! ప్రేమ !! ఎదుటినుంచి వస్తూ కళ్ళని  మిరుమిట్లు గొలిపే వెలుగుని కళ్ళలోకి ఒంపినప్పుడు ఇక ఎదురుగా ఉన్న వస్తువులన్నీ అస్పష్టంగా కనిపిస్తాయి.ఇక్కడ ఒక్క కాంతి కిరణం కూడా లేదు.అదే వెర్రి ఆవేశం, పొరపాట్లు, దుఃఖం ! ప్రేమించటానికి ఒక రుతువంటూ ఉంటుంది.దాన్ని వదులుకోవటం, జాగ్రత్తగా ఆలోచించి పనులు చెయ్యటం, రెండూ ఒకటే.ఈ రెండు పనులు చేసేవారూ మూర్ఖులని తెలివైనవారి అభిప్రాయం .అయితే కోమా, నువ్వు ఏది మంచిదంటావు?

( మౌనంగా కళ్ళు మూసుకుని తన్మయత్వంలో మునిగిపోతుంది.శకరాజు ప్రవేశిస్తాడు.చేతిలో పొడవాటి కత్తి, ముఖంలో ఆందోళన.అతను నిలబడిన చోటినుంచి కోమాని చూడలేడు)

శకరాజు ః ఖింగల్ ఇంకా రాలేదేమిటి చెప్మా, అతన్ని ఎవరూ ఖైదు చెయ్యలేదు కదా? అలా జరిగి ఉండదు.వాళ్ళు అంధులైతే తప్ప పొంచి ఉన్న ఆపద తప్పక కనిపిస్తుంది. (ఆలోచిస్తూ) ఆపద వాళ్ళకొక్కరికే కాదు , మాకూ ఉంది.రక్తపుటేర్లు పారక తప్పదేమో! మనసు చాలా కలవరపడుతోంది. ఇక్కడ ఏకాంతంగా కాసేపు కూర్చుంటాను.చెదిరిపోయిన మనసుని కూడగట్టుకోవాలి.(ఇటూ అటూ చూస్తాడు.ఆ అలికిడికి కోమా లేచి నిలబడుతుంది.ఆమెని చూసి) ఓ,కోమా! కోమా!!

కోమా ః చిత్తం మహారాజా ! ఆజ్ఞాపించండి.

శకరాజు ః (ఆమె వైపు ప్రేమగా చూస్తూ) ఆజ్ఞ కాదు కోమా ! నీకు ఆజ్ఞ ఇవ్వటమేంటి? ఎందుకు అలా  అలిగినట్టు మాట్లాడుతున్నావ్?

కోమా ః అలగటానికి నాకు హక్కెక్కడిది?

శకరాజు ః ఈ మధ్య నేను ఇరుక్కున్న భయంకరమైన పరిస్థితిలో కాస్త అన్యమనస్కంగా ఉండటం సహజమే.నువ్వది మరిచిపోకూడదు.

కోమా ః అయితే మీరు కలవరపడుతూ ఉంటే దాన్ని నేను పంచుకోకూడదా?నన్ను పాలు పంచుకోనివ్వకపోవడం వల్ల మీ పరిస్థితి ఏమైనా మెరుగు పడిందా?

శకరాజు ః నా సమస్యలన్నీ నీకు చెప్పి నీ మనసుకి బాధ కలిగించటం నాకిష్టం లేదు.నా ఎదుటనున్నది జీవన మరణ సమస్య.

కోమా ః సమస్యలు వాటంతటవే రావు.నా ఉద్దేశంలో మనిషి అవి జీవితానికి అవసరమని అనుకుంటాడు.సాలెపురుగులా వాటిని పట్టుకుని  వేలాడేందుకు తనే స్వయంగా సమస్యలని సృష్టించుకుంటాడు.జీవితంలో ముఖ్యమైనవి   ప్రసన్నంగానూ ఉల్లాసంగానూ ఉండటం. అవే మనిషి భవిష్యత్తుకి మంచి చేసి అదృష్టాన్ని కొనితెస్తాయి.వాటిని నిర్లక్ష్యం చెయ్యకూడదు ప్రభూ!

శకరాజు ః అదృష్టం, దురదృష్టం  –  మనిషి దౌర్బల్యానికి మారుపేర్లు.నేనైతే పురుషార్థాన్నే అన్నిటినీ నిర్ణయించేదిగా భావిస్తాను.అదే అదృష్టాన్ని లాక్కు వస్తుంది.కానీ ఈ యుద్ధం గురించి నాకేమీ ఉత్సాహం లేదు కోమా, విజయం సాధించాలని బైలుదేరింది నేను మాత్రమే కాదు.

కోమా ః లోక వ్యవహారాన్ని అనుసరించి మీకన్నా గొప్పవాడి ముందు మీరు కాస్త వినయం కనబరిచి ఈ ఉపద్రవాన్ని నివారించి ఉండవచ్చు.

శకరాజు ః అదే కదా నాకు సాధ్యం కావడం లేదు.

కోమా ః ఒక మనిషిలో ఏదైనా లోటుపాట్లున్నప్పుడు గొప్పవాడిలా నటించకుండా ఉండటమే మంచిదేమో?

శకరాజు ః ( కోపంగా) ఈ ఉపదేశాలు ఇప్పుడిక చాలించు కోమా.నేను ఎవరికన్నా గొప్పవాడిననీ అనుకోవటం లేదు, తక్కువవాడిననీ అనుకునేందుకు ఇష్టపడను.ఇంకా రాతి విగ్రహంలా అక్కడే నిలబడ్డావు, నా దగ్గరకి రా.

కోమా ః అవును మహారాజా, పాషాణంలో కూడా ఎన్నో తీయటి జలధారలు ప్రవహిస్తూ ఉంటాయి ! వాటిలో మధువు కాదు, చల్లటి నీరు ఉంటుంది.అది దాహంతో ఉన్నవారికి తృప్తి…

శకరాజు ః కానీ నాకిప్పుడు ఉత్సాహం రావాలంటే ఒక మధుపాత్రే కావాలి .

కోమా ః (సూటిగా అతనివైపే చూస్తూ) నేను తెస్తాను, మీరు కూర్చోండి.

( కోమా ఒక చిన్న ఆసనం అతనికి దగ్గరగా జరిపి వెళ్తుంది.శకరాజు దానిమీద కూర్చుంటాడు.ఖింగల్ ప్రవేశిస్తాడు)

శకరాజు ః చెప్పు, ఏమిటి సమాచారం?

ఖింగల్ ః మహారాజా ! మన ముట్టడి ఛేదించటం అసాధ్యమని వాళ్ళకి నేను బాగా అర్థమయ్యేటట్టు చెప్పాను.వాళ్ళకి రెండే మార్గాలున్నాయి. ప్రాణాలైనా అర్పించాలి, లేదా నా సంధి నియమాలకి అంగీకరించాలి.

శకరాజు ః (కుతూహలంగా) అయితే వాళ్ళు అంగీకరించారా?

ఖింగల్ ః మరో మార్గమేముంది? ఈ కుర్రవాడు రామగుప్తుడు తండ్రి సముద్రగుప్తుడిలా దిగ్విజయానికి బైలుదేరాడు.అతనికి ఈ దుర్గమమైన కొండ లోయల గురించి తెలియదు.కానీ నేను చెప్పినదంతా అర్థం చేసుకున్నట్టున్నాడు,అందుకే అన్ని నియమాలకీ కట్టుబడేందుకు ఒప్పుకోక తప్పలేదు.

శకరాజు ః (ఆనందంగా లేచి అతని రెండు చేతులూ పట్టుకుంటాడు) ఆఁ? నువ్వు చెపుతున్నది నిజమేనా?నేను ఆశించలేదు.నా రెండో నియమానికి కూడా రామగుప్తుడు ఒప్పుకున్నాడా?

(బంగారు పాత్రలో మధువుతో వచ్చి కోమా మౌనంగా వెనక నిలబడుతుంది)

ఖింగల్ ః చిత్తం మహారాజా ! మీరు కోరినవన్నీ ఇచ్చేందుకు వాళ్ళు అంగీకరించారు . త్వరలో ధ్రువస్వామిని కూడా మీదవుతుంది.

(కోమా ఉలిక్కిపడుతుంది. శకరాజు సంతోషం పట్టలేక ఖింగల్ చేతులు పట్టుకుని ఊపేస్తాడు)

శకరాజు ః ఖింగల్, ఎంత మంచి వార్త చెప్పావు ! ఈనాడు దేవపుత్రుల ఆత్మలు సంతోషిస్తాయి.వాళ్ల ఓటమికి ఇది ప్రతీకారం.గుప్తులు ఎలాగూ మనం ఆటవికులమనీ,క్రూరమైన వాళ్ళమనీ, అనాగరికులమనీ అనుకుంటున్నారు, నేను చేసే పని కూడా అందుకు నిదర్శనంగానే ఉండనీ.అన్నట్టు,నా సామంతులకోసం కూడా స్త్రీలని పంపమని అడిగాను.

ఖింగల్ ః వాళ్ళు కూడా వస్తారు ప్రభూ !

శకరాజు ః అలాగయితే బంగారు తప్పెటలతో నృత్యానికి ఏర్పాటు చెయ్యి.ఈ విజయోత్సవాన్ని ఘనంగా జరుపుదాం.సామంత రాజులని కూడా త్వరగా రమ్మని చెప్పు.

(ఖింగల్ నిష్క్రమిస్తాడు.శకరాజు సంతోషం తో ఉప్పొంగుతూ అటూ ఇటూ పచార్లు చేస్తాడు.కోమా మధుపాత్రతో నెమ్మదిగా సింహాసనం దగ్గరకి వెళ్ళి నిలబడుతుంది.నలుగురు సామంత రాజులూ, వాళ్ళ వెనకే నర్తకీ మణులూ ప్రవేశిస్తారు.వాళ్ళ వైపే చూస్తూ శకరాజు సింహాసనం మీద కూర్చుంటాడు.సామంత రాజులు అతని పాదాల వద్ద మెట్లమీద కూర్చుంటారు.నర్తకీ మణులు పాడుతూ నాట్యం చేస్తారు)

(నృత్యం ముగించి వాళ్ళు నిష్క్రమించేందుకు కదులుతారు)

ఒక సామంతుడు ః ప్రభూ, ఇంత పెద్ద విజయం సాధించాక ఇలా పేలవంగా ఉత్సవం జరుపుకుంటే బాగా లేదు.మన ఎదురుగా కలశం నిండుగా ఉండగా…

శకరాజు ః వీళ్ళకి పాత్రల నిండా మధువు నింపి ఇవ్వండి.

(నాట్యగత్తెలు ఒక్కొక్కరికీ కొసరి కొసరి మధువు తాగిస్తారు)

రెండో సామంతుడు ః ప్రభువు ఆజ్ఞ శిరసావహించటం తప్ప మరో మార్గం లేదు.ఆయన తెలివిగా పరిష్కరించారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ చీకటి రాత్రిని మనం రక్తంతో ఎర్రబడేట్టు చెయ్యవలసి వచ్చేది.

మూడో సామంతుడు ః ఏమిటా  పిచ్చి వాగుడు? మాట్లాడకుండా అప్పనంగా వచ్చిన ఈ గెలుపుని సంతోషంగా అనుభవించు.పోరాడవలసి వస్తే ఈ పొగరంతా అణగిపోయేదే.

రెండో సామంతుడు ః (కోపంతో తూలుతూ లేస్తాడు) నన్నేనా అంటున్నావు?

మూడో సామంతుడు ః అవునయ్యా, నిన్నే !

రెండో సామంతుడు ః అలాగయితే రా, ఏదో ఒకటి తేల్చుకుందాం!( ఇద్దరితో మొదలైన కొట్లాటలో మిగిలిన వాళ్ళిద్దరూ కూడా కల్పించుకునే సరికి పెద్ద గలభాగా మారుతుంది.శకరాజు ఖింఘల్ కి సైగ చేస్తాడు.అతను వాళ్లని బైటికి తీసుకెళ్తాడు.తూర్యనాదం వినిపిస్తుంది)

శకరాజు ః రాత్రవబోతున్నదని సూచించారు.దుర్గ ద్వారం ఇంకాసేపట్లో మూసేస్తారు.నా మనసు కలవరపడుతోంది. ఖింగల్ !

(ఖింగల్ మళ్ళీ ప్రవేశిస్తాడు)

ఖింగల్ ః పల్లకీలు దుర్గ ద్వారం దగ్గరకి వచ్చేశాయి.

శకరాజు ః (గర్వంగా) ఇక ఆలస్యం దేనికి? వాళ్ళని ఇప్పుడే వెంటపెట్టుకు రా.

ఖింగల్ ః ( వినయంగా) కానీ మహారాణీ గారి కోరిక…

శకరాజు ః ఏమిటది?

ఖింగల్ ః ఆమె ముందుగా మిమ్మల్నే కలవాలనుకుంటోంది.ఆమె గౌరవం…

శకరాజు ః (పగలబడి నవ్వి) ఏమిటీ, గౌరవమా? విధికి లొంగి దాసోహం అన్నవారికి గౌరవం గురించి ఎక్కువ పట్టింపు ఉంటుంది . అది వాళ్ళకి పట్టిన దయనీయమైన స్థితి.

ఖింగల్ ః ఆమె తమకు రాణీ అయేందుకు వస్తున్నారు.

శకరాజు ః (నవ్వి) ఆహాఁ. నువ్వు మధ్యవర్తివి కదూ ! సరే నీ మాటే కానియ్, ఆమెను ఏకాంతంగానే కలుసుకుంటాలే, నువ్వెళ్ళు.

(ఖింగల్ నిష్క్రమిస్తాడు)

కోమా ః మహారాజా , నన్నేం చెయ్యమని సెలవిస్తారు?

శకరాజు ః (ఉలిక్కిపడి) అరే, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? ఆ సంగతి మరిచేపోయాను.మనసు నిలవటం లేదు.నా దగ్గరకు రా కోమా !

కోమా ః కొత్తరాణీ వస్తోంది కదా, అందుకే ఆ ఆనందంలో అన్నీ మరిచిపోయారు.

శకరాజు ః (సర్దుకుని) కొత్త రాణీ రావటం నీకు నచ్చలేదా కోమా?

కోమా ః ( నిర్వికారంగా) లోకంలో చాలా విషయాలు మంచివి కాకపోయినా నచ్చుతాయి.అలాగే ఎన్నో మంచి విషయాలు నచ్చకుండా పోతాయి.

శకరాజు ః (చిరాకుపడుతూ) నువ్వు ఆచార్య మిహిరదేవుడిలా  వేదాంతం మాట్లాడుతున్నావు.

కోమా ః ఆయన నాకు తండ్రి లాంటి వారు.ఆయన దగ్గరే అన్నీ నేర్చుకుంటూ పెరిగాను.అయినా రాజుకి బాగున్నాయని అనిపించినవే నాకు కూడా నచ్చాలి.

శకరాజు ః ( ఇబ్బందిగా) ఓ, నువ్వు ఇంత సున్నితంగా ఆలోచిస్తావని నాకు ఇవాళే తెలిసింది.

కోమా ః రాజా, నీ ప్రేమలోని సహజమైన సంతోషాన్నీ, మధుర వచనాలనీ చవి చూశాక నా మనసులోని నిశ్శబ్ద శూన్యంలో , మోడువారిన భావాలలో వసంతమూ, మకరందమూ నిండాయి.ఆరోజునుంచే నాలో అనుభూతులు కూడా మేల్కొన్నాయి.అలా అనుకోవటం నా భ్రమేనా? నేను పొరబడ్డానని చెప్పు రాజా !

(కోపోద్రేకానికి గురై కోమా తలెత్తి రాజు కళ్ళలోకి చూస్తుంది)

శకరాజు ః (సంకోచిస్తూ) కాదు కోమా,నీది భ్రమ కాదు.నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను.

కోమా ః ( అదే భావం తో) అయినా ఇలా చేస్తున్నారా?

శకరాజు ః ఎలా చేస్తున్నాను?

కోమా ః అదే, ఈ రోజు జరగబోతున్నది. నా రాజా ! ఈనాడు నువ్వొక స్త్రీని ఆమె భర్తనుంచి విడదీసి నీ అహం తృప్తి చెందేందుకు ఎలాంటి అన్యాయమైన పని చేస్తున్నావు?

శకరాజు ః ( తేలికగా తీసిపారేసి నవ్వుతూ) పిచ్చి కోమా ! అది రాజకీయాలకి సంబంధించిన ప్రతీకారం.

కోమా ః ( దృఢంగా) కానీ రాజకీయాలకి సంబంధించిన ప్రతీకారం తీర్చుకోవడం ఒక స్త్రీని నాశనం చేయకుండా సాధ్యం కాదా?

శకరాజు ః నీకు అర్థం కాని విషయాల గురించి వాదించకు.

కోమా ః ( వ్యథతో) ఎందుకు వాదించకూడదు? ( ఆగి) కానీ, లేదు, నాకు వాదించే హక్కు లేదు.అది నాకు అర్థమైంది.

( ఆమె బాధగా అక్కణ్ణించి వెళ్ళిపోయేందుకు వెనుతిరిగేంతలో మరో పక్కనుంచి మిహిరదేవుడు ప్రవేశిస్తాడు)

శకరాజు ః (సంభ్రమంగా) వందనాలు ఆచార్యా !

మిహిరదేవుడు ః శుభమస్తు ! (కోమా తలమీద చెయ్యి పెట్టి) తల్లీ, నిన్ను చూసేందుకే వచ్చాను. ఎందుకమ్మా అంత విచారంగా ఉన్నావు?

(శకరాజుకేసి ప్రశ్నార్థకంగా చూస్తాడు)

శకరాజు ః ఆచార్యా ! రామగుప్తుడి గర్వమణచేందుకు అతని భార్య ధ్రువస్వామిని నాకు కానుకగా పంపమని ఆదేశించాను.ఈవేళ రామగుప్తుడి రాణీ నా దుర్గానికి వచ్చింది.కోమాకి అదే అభ్యంతరం!

మిహిరదేవుడు ః (గంభీరంగా)ఇలాంటి పనులకి అభ్యంతరం చెప్పవలసిందే రాజా ! స్త్రీ గౌరవానికి భంగం కలిగించి నువ్వు చెయ్యబోయే భయంకరమైన అపరాధం ఎలాటి ఫలితాన్నిస్తుందో ఆలోచించావా? అంతే కాదు అది కాబోయే భార్య పట్ల నువ్వు చేసే అన్యాయం కూడా.

శకరాజు ః కాబోయే భార్య పట్ల అన్యాయమా?

మిహిరదేవుడు  ః ఈ క్షణికమైన విజయం నిన్ను ఉన్మత్తుణ్ణి చేస్తోందా? ఆచార్యుడినైన నా పెంపుడు కుమార్తెని నువ్వు ప్రేమించటం లేదా?అందులో కూడా సందేహమేనా? రాజా, స్త్రీల ప్రేమనీ , విశ్వాసాన్నీ భగ్నం చెయ్యటం సున్నితమైన దారాన్ని తెంపటం కన్నా చాలా సులభం.అందుకే జాగ్రత్తగా దాని పరిణామాల గురించి ఆలోచించు.

శకరాజు ః మీరు రాజనీతికి సంబంధించిన విషయాల్లో జోక్యం కలిగించుకోకుండా ఉండటమే మంచిదని ఆ అభిప్రాయం.

మిహిరదేవ్ ః రాజనీతి ! అదే మనుషులకి సర్వస్వం కాదు.దానికోసం నీతిని కూడా వదులుకుంటావా?రాజకీయ కుట్రలతో అశాశ్వతమైన సాఫల్యం సాధించి చాలా తెలివైనవాడివని నువ్వు అనుకోవచ్చు,కానీ ఈ లోకంలో ప్రేమించే హృదయాన్ని కోల్పోవడం వల్ల జరిగే గొప్ప హానిని మరిచిపోకు శకరాజా !ప్రేమించే రెండు హృదయాల మధ్య ఒక దివ్య జ్యోతి వెలుగుతూ ఉంటుంది.

శకరాజు ః ఇక చాలించండి . మీరు ఎంత పూజ్యులైనా మీకూ ఒక హద్దుంటుంది.ఇప్పడు మీరిక్కడినుంచి వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను.

(నిష్క్రమిస్తాడు)

మిహిరదేవ్ ః పద కోమా ! పూతీవలూ, చెట్లూ, శిలలే మనకి నీడనిచ్చి సానుభూతి చూపించగలవు.ఈ దుర్గం వదిలి వెళ్ళిపోదాం పద.

కోమా ః ( గద్గదంగా) నాన్న గారూ !( లేచి నిలబడుతుంది)

మిహిరదేవ్ ః అమ్మా! మనసు కుదుటపరుచుకో.కష్టాలు పడేందుకు సిద్ధం కా .మోసం చేసిన వ్యక్తి పట్ల చాలా వ్యామోహం ఉంటుంది…వదలాలనిపించదు.ఆ కపటం బైటికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ మనసుని గాయపరిచి దుఃఖాన్ని కలిగించే ఆ బంధాన్ని తెంపివెయ్యి.

కోమా ః ( జాలిగా ) తెంపెయ్యమంటున్నారా నాన్నగారూ? నా కన్నీళ్ళతో పెంచిన ప్రేమలత కళ్ళు మూసుకుని నడవటం వల్ల నా కాళ్ళకే చుట్టుకుంది ! ఒక్క విదిలింపుతో దాన్ని వదిలించుకోమంటారా? దాని పచ్చని చిగురాకులు నలిగిపోయి మట్టిలో కలిసిపోవా? వద్దు, అలాంటి పని చెయ్యమని నన్ను ఆజ్ఞాపించకండి .

మిహిరదేవ్ ః ( నిట్టూర్చి ఆకాశం వైపు చూస్తూ)  నీకు ఇక్కడ మంచి జరిగేటట్టయితే వెళ్దామని అనను.మనం చెట్లనీడలో కూర్చుందాం, జలపాతాల ఒడ్డున, ద్రాక్ష తోటల్లో విశ్రాంతి తీసుకుందాం.నీలాకాశంలో మబ్బు తునకలు మానససరోవరానికి ఎగిరిపోయే హంసల్లా అభినయించేప్పుడు , నువ్వు ఊలు అల్లుతూ కథ చెబుతూ ఉంటే నేను వింటాను.

కోమా ః అయితే ఇప్పుడే వస్తాను ( నలువైపులా చూసి) ఒక గంట సేపు నాకు…

మిహిరదేవ్ ః ( విసుగ్గా పైకి చూస్తూ) నువ్వు నా మాట వినవు కదా ! అటు చూడు నీలం, ఎరుపు కలగలిసిన ఆ తోకచుక్క కదలకుండా ఈ దుర్గం వైపే ఎలా సైగ చేస్తోందో !

కొమా ః (అటు చూస్తూ) అయితే ఒక్క క్షణం నన్ను…

మిహిరదేవ్ ః పిచ్చి పిల్లా! సరే నేను తరవాత వస్తాలే.నువ్వు బాగా ఆలోచించుకో.

( నిష్క్రమిస్తాడు)

కోమా ః నేను వెళ్ళిపోవాలి. కానీ మనసులో ఈ అలజడేమిటి? ఈ దుర్గం శాపగ్రస్తమై, అశుభమేమైనా జరిగితే సుఖ స్వప్నాలు మాయమైపోతాయి.నేనిక్కడే ఉంటే ఆయన తన మనసులోని భావాలను దాచుకుని కృత్రిమంగా ప్రవర్తించవలసి వస్తుంది.అడుగడుగునా అవమానాలు ఎదురవుతూ ఉంటే నా మనసు దాన్ని భరించలేదు.అయితే వెళ్ళిపోనా? అదే మంచిది…నాన్నగారూ, ఆగండి నేను కూడా వస్తున్నాను!

శకరాజు ః ( ప్రవేశించి) కోమా!

కోమా ః వెళ్ళొస్తాను రాజా !

శకరాజు ః ( భయంగా ఆమెకేసి చూస్తూ) అబ్బ, ఎంత భయంకరమైన తోకచుక్క ! ఆకాశంలో విచ్చలవిడిగా తిరిగే తారాలోకపు మహాశాపం ! కోమా, ఆచార్యులవారిని పిలు.ఆయన ఏమి చెయ్యమంటే అది చేస్తాను.ఈ అశుభానికి శాంతి చెయ్యాలి.

కోమా ః ఆయన చాలా కోపంగా ఉన్నారు.ఇప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు.నన్ను తన వెంట తీసుకెళ్ళేందుకు ఎదురుచూస్తూ ఉంటారు.

శకరాజు ః మీ తండ్రి గారి వెంటా…?

కోమా ః అవును.

శకరాజు ః మరి నా ప్రేమ, నా స్నేహం అదంతా మరిచిపోతావా?ఈ అశుభాన్ని నివారించేందుకు శాంతి చెయ్యాలని ఆయనకి నచ్చజెప్పవా?

కోమా ః ( బాధగా) ప్రేమ మాటెత్త వద్దు . ఆ బాధ వదిలింది. కొద్దో గొప్పో ఏమైనా మిగిలి ఉంటే అదీ నెమ్మదిగా పోతుంది.రాజా, నాకు నీమీద ప్రేమ లేదు.దర్పంతో వెలిపోయే నీ గొప్ప పౌరుషాన్ని ఆరాధించాను.నేను ప్రేమించిన ఆ వ్యక్తి చాలా ధారుఢ్యం గలవాడు.ఇప్పుడు నా ఎదుట ఉన్న స్వార్థంతో మలినమైన ఈ వ్యక్తిని నేనెరగను.తన తేజస్సులోని జ్వాలలలో అన్నిటినీ దహించగల వ్యక్తికి ఆకాశం లోని నక్షత్రాలు శుభము సమకూర్చలేవు, అశుభమూ  చేయలేవు. కేవలం అనుమానం తోనే నువ్వింత బలహీనుడవై వణికిపోతున్నావు !

శకరాజు ః ( తోకచుక్కనే మాటి మాటికీ చూస్తూ) భయంకరంగా ఉంది ! కోమా, నన్ను కాపాడు!

కోమా ః వెళ్తున్నాను మహారాజా! నాన్నగారు నాకోసం ఎదురుచూస్తూ ఉంటారు.

( వెళ్ళిపోతుంది.శకరాజు హతాశుడై సింహాసనం మీద కూలబడతాడు)

పహరా వాడు ః (ప్రవేశించి) మీరు ఏకాంతంగా ఉంటే రావచ్చా అని ధ్రువస్వామిని అడగమన్నారు ప్రభూ !

శకరాజు ః సరే, ఏకాంతంగానే ఉన్నానని చెప్పు.ఇక్కడికి ఇంకెవరినీ రానివ్వకు.

(పహరా వాడు వెళ్తాడు.శకరాజు స్థిమితంగా కూర్చోలేక పచార్లు చేయడం మొదలెడతాడు.మళ్ళీ తోకచుక్క వైపు చూసి, భయపడి కూర్చుంటాడు)

శకరాజు ః అయితే దీనికి ఉపాయమేదీ లేదా? ఎందుకో నా గుండె దడ దడ లాడుతోంది . కోమాకి నచ్చజెప్పి వెనక్కి రప్పించాలి.(ఆలోచించి) కానీ ఇక్కడికిప్పుడు ధ్రువస్వామిని వస్తోంది కదా ! అయినా చూదాం, కోమా నా పట్ల మళ్ళీ ప్రసన్నంగా మారితే…

( వెళ్తాడు)

(స్త్రీ వేషంలో చంద్రగుప్తుడూ,అతని వెనకే బంగారు జరీ పైబట్ట ఒంటినిండా కప్పుకుని ధ్రువస్వామినీ ప్రవేశిస్తారు.ఆమె ముఖం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది)

చంద్రగుప్త్ ః ఈవేళ ఇంత ఆనందంగా ఉన్నావే !

ధ్రువస్వామిని ః నువ్వు మాత్రం లేవా?

చంద్రగుప్త్ ః నా జీవన నిశి లోని ఈ చిమ్మ చీకట్లో ధ్రువతార చెక్కుచెదరని వెలుగులతో మెరిసిపోతోంది ! ఈవేళ మహోత్సవం కదా?

ధ్రువస్వామిని ః వెళ్ళిపో, ఈ నా తుచ్ఛమైన జీవితం కోసం ఇంత పెద్ద త్యాగం చెయ్యడం అనవసరం.

చంద్రగుప్త్ ః దేవీ, ఏదో క్షణికావేశం లో అలా అంటున్నావు.నన్ను పరీక్షించకు.నా శరీరం ఎలాంటి రూపాన్ని ధరించినా నా మనసు మాత్రం నిష్కల్మషం.

ధ్రువస్వామిని ః నువ్వు కోరినది దొరకలేదని,  ఇది నువ్వు చేసే ఆత్మహత్యా ప్రయత్నం గాని కాదు కదా?

చంద్రగుప్త్ ః అలాంటి బాణాల్లాంటి మాటలతో గాయపరచినా నేను మృత్యు ముఖం నుంచి వెనక్కి మళ్ళేది లేదు.నా కర్తవ్యం నేను నిర్వర్తించటం లోనే నాకు సుఖం లభిస్తుంది.

(ధ్రువస్వామిని సైగ చేస్తుంది.శకరాజు ప్రవేశిస్తాడు.ఇద్దరూ మౌనంగా ఉండిపోతారు.శకరాజు ఇద్దర్నీ నిర్ఘాంతపోయి చూస్తాడు)

శకరాజు ః మీ ఇద్దరిలో ఎవరిని రాణి అనుకోవాలి నేను.కళ్ళు చెదిరిపోయే అందం ! లేదు … ఇలాంటి అందాన్ని నేనెప్పుడూ చూడలేదు.ఇద్దరిలో ధ్రువస్వామిని ఎవరు?

ధ్రువస్వామిని ః నేనే, వచ్చేశాను గా!

చంద్రగుప్త్ ః (నవ్వి) శకరాజుని నువ్వు మోసం చెయ్యలేవు.  ధ్రువస్వామిని ఎవరన్నది ఒక గుడ్డివాడు కూడా చెప్పగలడు.

ధ్రువస్వామిని ః (ఆశ్చర్యంగా) చoద్రా! ఏమైంది నీకు? ఇక్కడికి రాగానే నీ మనసులో రాణీ అవ్వాలన్న కోరిక తలెత్తిందా? లేక శకరాజు నుంచి నన్ను కాపాడేందుకు ఇది నువ్వు చూపే స్వామిభక్తి అనుకోవాలా?

(శకరాజు నివ్వెరపోయి ఇద్దరికేసీ చూస్తాడు)

చంద్రగుప్త్ ః నువ్వే ఆ పని చేస్తున్నావేమో, ఎవరికి తెలుసు?

ధ్రువస్వామిని ః చంద్రా!  నాకు రెండు విధాలా నష్టం కలగజేస్తున్నావు.ఇక్కణ్ణించి వెనక్కి వెళ్ళినా నేను మళ్ళీ గుప్త రాజు అంతఃపురంలో ఉండగలుగుతానా?

చంద్రగుప్త్ ః నన్ను మాటిమాటికీ చంద్రా చంద్రా అని పిలుస్తున్నావు,ఏమిటి నీ ఉద్దేశం?బలే గొడవ తెచ్చిపెట్టావే!అందుకే ఏకాంతంగా కలుసుకోవాలనుకున్నాను.

ధ్రువస్వామిని ః అయితే నాకు ఇక్కడ కూడా మోసమే ఎదురౌతుందా?

శకరాజు ః ఉండండి,(ఇద్దర్నీ పట్టి పట్టి చూస్తూ) ఇద్దర్నీ రాణీలుగా చేసుకుంటే మాత్రం పోయేదేముంది?

ధ్రువస్వామిని ః ఆఁ…

చంద్రగుప్త్ ః ఆఁ…

శకరాజు ః అందులో తప్పేముంది?

చంద్రగుప్త్ ః లేదు, అలా జరగకూడదు.ఎవరు ధ్రువస్వామినో ముందు తేలాలి.

ధ్రువస్వామిని ః (కోపంగా) చంద్రా! నా అదృష్టానికి ధూమకేతువులా అడ్డుపడకు.

శకరాజు ః (తోకచుక్కని చూసి భయంతో) అబ్బ…భయంకరం!

( అసహనంగా పచార్లు చెయ్యటం మొదలెడతాడు)

చంద్రగుప్త్ ః (శకరాజు వీపు మీద చెయ్యి వేసి) ఇదిగో, చూడండి…

ధ్రువస్వామిని ః చoద్రా !

చంద్రగుప్త్ ః నువ్వు అలా బెదిరించటం వల్ల ప్రయోజనమేమీ ఉండదు.

ధ్రువస్వామిని ః అయితే మనిద్దరం కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.

చంద్రగుప్త్ ః ఇక్కడెవరికీ భయం లేదు

( ఇద్దరూ  ఒకేసారి బాకులు బైటికి తీస్తారు).

శకరాజు ః (భయంగా) ఆఁ, ఏమిటిది? ఏం చేస్తున్నారు? ఉండండి.ఆచార్యులు చెప్పిన మాట నిజమే,ఈవేళ ముహూర్తం బాగాలేదు.రేపు నమ్మకమైనవారినెవరినైనా పిలిపించి ఈ విషయమేమిటో తేలుస్తాను.ప్రస్తుతం మీరిద్దరూ విశ్రాంతి తీసుకోండి.

ధ్రువస్వామిని ః లేదు, ఆ నిర్ణయమేదో ఈరోజే జరిగిపోవాలి.

శకరాజు ః (మధ్యలో నిలబడి) నేను చెపుతున్నాను కదా!

చంద్రగుప్త్ ః బలే చెపుతున్నారండీ !

( ధ్రువస్వామిని చంద్రగుప్తుడు శకరాజు మీదికి లంఘిస్తాడేమో అని భయపడి వెనక్కి తగ్గుతుంది. తూర్యనాదం వినిపిస్తుంది.శకరాజు ఆశ్చర్యపోతూ ఆ శబ్దం వింటూ హఠాత్తుగా వెనక్కి తిరిగి చంద్రగుప్తుడి చెయ్యి పట్టుకుంటాడు.ధ్రువస్వామిని ఒక్క ఉదుటున చంద్రగుప్తుడు కప్పుకున్న పైబట్ట లాగేస్తుంది.చంద్రగుప్తుడు తన చెయ్యి విడిపించుకుని శకరాజుని చేతుల్లో బంధిస్తాడు)

శకరాజు ః ( నివ్వెరపోతూ) ఏయ్ , ఎవరు నువ్వు? ఏమిటీ మోసం?

చంద్రగుప్త్ ః నా పేరు చంద్రగుప్తుడు… నీ మృత్యువుని ! నీ పరాక్రమాన్ని పరీక్షించేందుకు ఒంటరిగా వచ్చాను. జాగ్రత్త !

(శకరాజు బాకు దూసి యుద్ధానికి సిద్ధమౌతాడు.ఇద్దరూ కలబడతారు.శకరాజు మరణిస్తాడు.బైట దుర్గంలో ఏదో అలజడి వినిపిస్తుంది.” ధ్రువస్వామినికి జయము జయము !” అంటూ గోలగా రక్తసిక్తమైన శరీరాలతో సామంతులు ప్రవేశిస్తారు.ధ్రువస్వామినినీ, చంద్రగుప్తుణ్ణీ చుట్టుముట్టి ” ధ్రువస్వామినికి జయము జయము !”అని నినాదాలు చేస్తారు)

———–తెర పడుతుంది———-

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.