విజయవాటిక-5

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

మరుసటి రోజు రాజప్రసాదంలోని మరొక అత్యంత కీలకమైన సమావేశంలో పాల్గొన్నారు మహాదేవవర్మ, శ్రీకరులు. 

మంత్రులకు ఈ రాచకార్యం గురించి ఆలోచించి, తగు విధంగా కళింగులతో కార్యము నడపని మహారాజు ఆజ్ఞాపించాడు. 

“కారా! నీవు మరింత జాగ్రత్త వహించు. రాజధాని విజయవాటికలోనైనా, అమరావతిలోనైనా  మనకు తెలియనిదే గాలి కూడా చొరకూడదు…” అన్నారు మహారాజు. 

“తమ ఆజ్ఞ మహారాజా!!” చెప్పాడు శ్రీకరుడు.

తదనంతరం మహాదేవుడు పరివారంతో అమరావతి వచ్చేశాడు. 

   శ్రీకరుడు మాత్రం రాజధాని నుంచి బయలుదేరి ముగలరాజపురానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న గుట్టలలో గుహాలయాలు తొలుస్తున్నారు శిల్పులు. ఆ పని దాదాపుగా అప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నది. అది పూర్తి కావొచ్చినది. 
ఆ గుహాలయాలు రాతిని తొలచి భూగర్భములోకి తవ్వినవి. బాహ్యములో శిలలు కనపడవు. అలా తయారుచెయ్యటం వలన అవి బహు కాలం నిలచి ఉంటాయి. వచ్చే కాలాలలో విష్ణుకుండినుల ఘనతను చాటాలని మహారాజు ప్రయత్నం. అందుకే శిల్పాలన్ని అంతర్గతంలోనే ఉన్నాయి. వాటిని గమనిస్తూ లోపలికి నడిచాడు శ్రీకరుడు. లోపల చతురస్రాకారపు గుహ, అందులో ఒక గర్భాలయం ఉన్నాయి. వాటికి ఎటువంటి అలంకరణం లేదు. ద్వారానికి మాత్రం అటూ-ఇటూ నిలువెత్తు ద్వారపాలకులను నిలబెట్టారు, శిల్పులు. ఆ ద్వారపాలకులు ఒక చెయ్యి పెద్ద గద పైన ఆన్చి, కొద్దిగా వంగి నిలబడి ఉన్నారు. ముఖం ప్రసన్నంగా ఉంది. వారి శిరోవేష్టనంలో ఎద్దుకొమ్ములు ఉన్నాయి. వెంట్రుకలు భుజాల మీదకు పాకి ఉన్నాయి.  ఆలయాలలో స్తంభాలు ఘనచతురస్రంగా రెండేసి అడుగుల పొడవు, వెడల్పుతో ఏడడుగుల ఎత్తు ఉన్నాయి. స్తంభముల పైన పద్మాలు, మధ్యన కోణాలు వాలుగా చెక్కారు, శిల్పులు. ప్రతి స్తంభానికి ఒక కుడ్యస్తంభం ఉంది. పంచచూరు ఆలయద్వారం పైన చూరు మందంగా ఉంది. అది ముందుకు చొచ్చుకువచ్చి గవాక్షాన్ని అందంగా అలంకరించింది. గవాక్షం నుంచి మనుషులు తొంగి చూస్తున్నట్లుగా చెక్కారు, శిల్పులు. ఈ గుహాలయాలు మొత్తం మూడు ఉన్నాయి అక్కడ. అవి త్రిమూర్తులకు అంకితమివ్వబడినాయి. మూడు మండపంలలో మధ్య మందిరంలో శివపార్వతుల గుర్తుగా శివలింగం ప్రతిష్టకు సిద్ధము చేసి ఉంది. 
మందిరంలో శివలింగాలతో పాటూ, శివపార్వతుల ముఖాలు కూడా చెక్కారు శిల్పులు. పశ్చిమ మందిరంలో మూడు ముఖాల బ్రహ్మ, ఒక వైపు నటరాజు, మరో వైపు తాండవరూపంలో కాళిక చెక్కి ఉన్నారు. 
ఇవన్ని వచ్చే పాల్గుణ మాసపు శివరాత్రి నాటికి ఆవిష్కరింపబడతాయి. చాలా మటుకు అయిపోయినా, శిల్పులు ఇంకా ఏదో చెక్కూతూనే ఉన్నారు.
శిల్పులు ఆ శిల్పాలను ఎంతో వైభవంగా చెక్కారు. జీవకళను ఒప్పారుతున్న వాటిని గమనిస్తూ, ఆ శిల్పులను చూస్తూ నడుస్తున్నాడు శ్రీకరుడు. 
అక్కడికి స్తపతి వచ్చి శ్రీకరునితో తిరుగుతూ, అతని ప్రశ్నలకు సమాధానమిస్తున్నాడు. 
“స్తపతీ! వీరంతా మొదటి నుంచి ఉన్నవారేనా? మధ్యలో ఎవరైనా మారారా?”
“అందరూ కారు ప్రభూ! కొందరు మాత్రమే మారారు…”
“మారిన వారు ఎంత మంది…”
“అక్కడ, ఆ పైన ఋషులను  చెక్కుతున్నారు చూశారా… వారు కొత్తవారు. వచ్చి కొద్ది నెలలు మాత్రమే అయినది…”
“ఎక్కడి నుంచి వచ్చారో వారు… వారి ప్రత్యేకతలేమిటో?”
“వారు ముఖంలో పోలికలను సున్నితంగా చెక్కగలరు. మీరు చూశినారా క్రింది వరుసలో ఉన్న శిల్పముల కంటే పైన ఉన్న ఈ ఋషుల నాసికలు ఎంత సూటిగా ఉన్నవో. ఇవి వారు వచ్చాకనే చెక్కినారు. అవి మన పూర్వపువారు చెక్కినవి. పరీక్షగా చూస్తే మీకు తేడా తెలిసిపోతుంది…”

“అవును. వారు చెక్కిన వాటి రూపురేఖలు ఎంతో స్పష్టంగా ఉన్నవి. చూడటానికి ఎంతో నాజుకుగా కూడా ఉన్నవి…”
“వారితో నే మాట్లాడాలి స్తపతి!” అన్నాడు శ్రీకరుడు శిల్పాలను పరీక్షగా చూస్తూ.
వారిని రమ్మని పిలిచి గుహల బయటవైపుకు వెళ్ళారు వారిరువురు. 
కొంత సేపటికి నలుగు శిల్పులు వచ్చారు. వారి రూపురేఖలు తూర్పువాళ్ళను పోలి ఉన్నాయి. వారి భాషలో కూడా కొంత తూర్పు వారి యాస తెలుస్తోంది. 

“ఎక్కుడ్నుంచి వచ్చారు మీరు?” అడిగాడు శ్రీకరుడు వారిని పరీక్షగా చూస్తూ.

“మాది తూర్పుదేశం ప్రభూ! రాజమహేంద్రవరములో శిల్ప కళను నేర్చుకున్నాము. ఇక్కడి ప్రభువులు దేవాలయాలు నిర్మిస్తున్నారని విని, మా కళను చూపించుకునే అవకాశముందని ఇటు వచ్చాము…” చెప్పారు వారిలో నాయకుని వలె ఉన్న అతను. 

“మీ గురువులెవరు? ఇది మీ కులవృత్తా?”

“అవును ప్రభు! ఇది మా కుల వృత్తే. శ్రీ సరసవిశ్వయ్య మా గురువు…” చెప్పాడతను వినయంగా. 

“ఇక్కడ పనిచెయ్యటం మొదలుపెట్టి ఎంత కాలమయ్యింది?”

“సుమారుగా నాలుగు పున్నముల కాలము ప్రభూ!”

“మీకిక్కడ సౌకర్యంగా ఉన్నదా? వాతావరణములో తేడాగా ఏమైనా ఉన్నదా? మీ గోదావరి తీరానికి మా కృష్ణా తీరానికి మీకు తేడా లేదుగా?”

“లేదు ప్రభూ! మా స్తపతి మమ్ములను చాలా చక్కగా కాచుకుంటున్నాడు…”

“మీరేనా ఇంకా ఎవరైనా వచ్చారా?”

“మాతో ఇంకో నలుగురు కూడా ఉన్నారు ప్రభూ! వారు ఉత్తరపు గుహల వద్ద పని చేస్తున్నారు…” చెప్పాడతను.

కృష్ణానది ఉత్తరపు ఒడ్డున ఉండవల్లి వద్ద మరో గుహాలయాల నిర్మాణం సాగుతున్నది. అది మరింత పెద్దదైన కట్టడం. 

శ్రీకరుడు తల ఊపి వారిని పంపేశాడు. స్తపతికి జాగత్తలు చెప్పి ఏవైనా తేడాలు కనపడితే కబురు పంపమని చెప్పి అమరావతి వైపు సాగిపోయాడు. 

***

అమరావతి చేరిన తరువాత శ్రీకరుడు తన అనుచరులను అత్యవసరంగా సమావేశపెట్టాడు. 

ఆ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొన్నాడు.

 అవి, అమరావతికి, విజయవాటికకు వచ్చే బాటసారులను ప్రతిదినము ముందు పరీక్షించి నగరములోనికి పంపటం. కళింగ వైపుగా వచ్చే వారిలో అనుమానస్పదమైన వారిని  తన వద్దకు పంపటం. బాటసారులపై నిఘా పెంచటం. 

అనుమతి లేనిదే ఎవ్వరిని ఉత్తరపు రహదారి వైపుకు అనుమతించ వద్దని ఆజ్ఞ జారిచేసాడు. రాకపోకలపైన నిఘా ఉంచి, నగరంలో మారువేషాలలో చారుల కదలికలను పెంచారు. ముఖ్యమైన మెరికల వంటి చారులను కళింగకు పంపటం కూడా జరిగింది. పల్లవులు ఉన్న దక్షిణ సరిహద్దు వద్దకు కూడా కొందరు చారులను పంపారు. దేశ సరిహద్దులకు మరింత సైన్యం పంపాలన్న నిర్ణయం చేశారు. సైన్యం పెంచాలన్న ఆలోచనను అమలు చేస్తూ, ఇంద్రపురిలో సైన్యం పెంచాలన్న ఆలోచన కూడా చేశాడు శ్రీకరుడు. ఆ విషయం చర్చించేందుకు ఇంద్రపురి ప్రయాణమవ్వాలనుకున్నాడు. 

కళింగ రాజకుమారి చిత్రపఠాలు కొన్ని తెప్పించటం, అది మహారాజుకు, మహాదేవవర్మకు పంపటం కూడా వెనువెంఠనే చేశాడు శ్రీకరుడు. 

 ***

 మాధవవర్మ ముఖ్యమంత్రులలో ఆదిత్యవర్మ ఒకరు. ఆయన నాయకత్వంలో కొందరు సభ్యులతో ఒక బృందాన్ని కళింగకు పంపటానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. వారు ఆ శ్రావణము వెళ్ళే లోపు వెళ్ళి పని చక్కబెట్టుకు రావాలని అనుకున్నారు.

***

శ్రావణపూర్ణిమ…

ఆకసములో వెన్నెల పరుచుకున్నది, మబ్బులు మెరుస్తున్నవి. ఆ మెరుస్తున్న మబ్బులు వెన్నెలను ప్రతిబింబిస్తూ మహావిష్ణువు పవళించిన పాలసముద్రాన్ని తలపిస్తున్నవి. 

తెల్లని ఆ వెన్నెల పాల మీద నురుగులా ఉంది. చూడటానికది వాగ్దేవి దరహాసంలా ఉంది… మల్లెల తోటలా తెలుపు పరుచుకొని ఉంది. నీలపు కృష్ణ తరంగాలపై వెన్నెల వెండి పుప్పొడిలా ఉంది. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఇసుకతిన్నెలు వెన్నెలలో వెండి కొండలవలె మెరుస్తున్నవి.

నది మీదగా వీస్తున్న గాలి గిలిగింతలు పెడుతోంది.

ఆ సమయంలో ఆ నది మీద తేలి పోతున్న నౌకలో ఒక జంట, ఆ వెన్నెలను పూర్తిగా గ్రోలే ప్రయత్నంలో ఉన్నట్లున్నది.  భువికి దిగిన ఇంద్రునిలా ఉన్నాడా యువకుడు. శచీదేవిలా వెలుగుతున్నదా చిన్నది. చంద్రుడు భువికి జారి రెండు ముక్కలై ఒక పురుష రూపం, ఒక స్త్రీ రూపం తీసుకున్నట్లుగా ఉన్నారిరువురు. 

వెన్నెల కన్నా తెల్లని వస్త్రాలలో ప్రసన్నమైన ఆ యువకుని ముఖంలో చిరునవ్వు చూసి, అంత వెన్నెలా చిన్నబోయినటుగా మబ్బులు కమ్మాయి.

విశాలమైన నుదురు, చురుకైన కన్నులతో పరిసరాలు గమనిస్తున్నా, అతని పెదవులు చిరునవ్వును దాచలేకపోతున్నవి. విశాలమైన అతని వక్షస్థలం మీద ఆ చిన్నది తల పెట్టుకొని ముడుచుకు కూర్చున్నది.

తెల్లని చీర, పచ్చని రవికలో మహాలక్ష్మిలా మెరుస్తున్నదామె. ముత్యాల వరసల హారాలు, చేతులకు ముత్యాల గాజులు, ముఖంలో మెరుస్తున్న ఎర్రని పెదవులతో, నును గంధం కస్తూరి కలిపిన వర్ణంలో ఉన్న చెక్కిళ్ళలతో, సిగ్గుతో బరువెక్కిన రెప్పలను అతి కష్టం మీద తెరచి, చంద్రుని మించిన అందాల ప్రియుడిని ఓరగా చూస్తున్నది. ఆమె చంద్రుని వెతుకుతూ వచ్చిన తారా దేవిలా ఉంది. నీలి తరంగాల నదిపై మెరుపు తీగలా ఉంది. శాపవశాత్తూ భువికి జారిన దేవకన్యలా ఉంది.

ఆ వెన్నెలలో తడుస్తున్న ఆ జంట, అందాలలో ఒకరిని మించి ఒకరున్నారు. ఒకరికి పోటిగా ఒకరున్నారు. ఒకరికి తోడుగా ఒకరై మెరుస్తున్నారు. ఎటు నుంచి చూసినా ఆ అందాల జంట భూమి మీదకు విహారం చెయ్యటానికి వచ్చిన దేవతలే తప్ప మానవమాత్రులుగా అనిపించటంలేదు. 

ఆ నౌక మీద వీరు తప్ప మరో నరమానవులు లేరు. ఇద్దరూ గువ్వ పిట్టల్లా ఒదిగి ఉన్నారు. ఒకరికి ఒకరు సరిజోడులా ఉన్నారు. విశ్వకర్మ శ్రద్ధగా కూర్చిన జంటలా ఉన్నారు. చంద్రవంకలో చేరిన చకోరములా ఉన్నారిద్దరూ.  

“ఈ వెన్నెల నీ చిరునవ్వు ముందు చిన్నబోయింది చెలీ!” అన్నాడతను ఆమె వత్తైన వంకుల ముంగురులను సరిచేస్తూ.

ఆమె నవ్వింది. చిన్న చిరు నవ్వు అది. ఆకాశంలో మెరుపులు మెరిసినట్లుగా ఆమెనవ్వు పెదవుల మీద మెరిసింది. తెల్లని దంతాలు వజ్రపు తునకల్లా తళుక్కుమన్నాయి. ఆ రాత్రి, ఆ నౌకమీద మెరవనిదేది లేనట్లుగా ఉన్నది చూడబోతే. 

“ప్రభూ! మిమ్ము చూసి సర్వము మరుపుకొచ్చినది. సముద్రంలో కలసిన నదిలా ఉన్నది నా స్థితి. మీరు తప్ప అన్యమెరుగ నేను. మీరు కనిపించని దినము నాకు యుగముల నరకం…” అన్నదామె కన్నులు మూసుకొని. 

“చెలీ! నీతో ఒక విషయము చెప్పాలి…” అన్నాడతను ఆమె మెడలోని ముత్యాలు సరిచేస్తూ.

“చెప్పండి ప్రభూ!”

అతను ఆమె పెదవులపై చూపుడు వేలుతో సుతారంగా మీటి “మహారాజు మన మహాదేవునకు

సంబంధాలు అనుకుంటున్నారు. నేను కూడా నా వివాహము విషయములో వారి అనుమతి తీసుకోవాలనుకుంటున్నాను…”

ఆమె హృదయం క్షణమాగి తిరిగి కొట్టుకోవటం మొదలెట్టినట్లయింది.

“చాలా సంతోషము. మీరు వివాహమాడదలచిన ఆ అదృష్టవంతురాలెవరు ప్రభూ!” అడిగిందామె.

ఆమెకు అతని ప్రేమ తెలుసు. అయినా, తన పుట్టుక కూడా తెలుసు. తనని స్వీకరిస్తారా అని ఒక భయం లోలోపల…

అతను నవ్వి.. “చూపుతాను చూడు చెలి!” అంటూ ఆమెతో కలసి నౌక అంచుకు జరిగి, నదిలోకి తొంగి చూసాడు.

వారిరువురి నీడలు నదిలో కదలాడాయి…

జలజలా పారిజాతాలు కురిసినట్లుగా, ఒక్కసారిగా హృదయంలో సారంగ మ్రోగినట్లుగా, వీణా తంత్రులు మీటినట్లుగా, సంతోషము అతిశయించి  ఆమెకు మైమరుపు కలిగింది. ఆ క్షణం కోసం ఆమె తపస్సు చేసోంది మరి… ఆ మాట కోసమే ఆమె అప్పటికే శ్రీపర్వత స్వామికి భక్తిగా మొక్కులు మొక్కింది. అమరేశ్వరునికి అభిషేకాలు చేసింది. విజయవాటికలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన దుర్గమ్మకు కాలినడకన వెళ్ళి ముడుపులు సమర్పించింది. ఎన్ని చేసినా, ఈ విషయం అతని నోటి నుంచి వినాలని కలలు కన్నది. 

 ఇన్నాళ్ళకి, శ్రీపర్వత స్వామి కృపన, ఈ శుభశ్రావణ పౌర్ణమి రోజున, అతని నోటి నుంచి వివాహ విషయం విన్నది. ‘ఇంత శుభగడియ ఇక ఉన్నదా? జీవితానికి ఇది చాలు. ఇతని ప్రేమలో మునిగిన జీవితానికి సార్థకత’   అనుకుంది మనసులో.

 అతను ఆ విషయం చెప్పగానే ఆమెకు బుగ్గులలో రివ్వున కెంపులు పూసాయి. ఆ వెన్నెల రాత్రిలో కూడా ఆ కెంపులు ఎంతో తేజోవంతంగా కనిపించాయి అతనికి. 

ఆమెను మృదువుగా తట్టాడు. ప్రేమాతిశయంతో కన్నులు మూసుకున్న ఆమె, అతని చేతులలోకి ఒదిగిపోయింది.  ఆ మైమరుపులో అతనితో చెప్పాలనుకున్న విషయం మరిచిపోయింది.

ఆమె ఆ మరుపు మరి చరిత్రలో మార్పును తెచ్చి గతిని మార్చింది.

అతను శ్రీకరుడు. ఆమె మల్లికావల్లి. 

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.