వెనుతిరగని వెన్నెల(భాగం-31)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-31)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే చదువుతూ ఉంటుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. తన్మయి స్థానిక రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగానికి కుదురుకుంటుంది.

***

వారాంతంలో బాబుని తీసుకురావడానికి ఇంటికి వెళ్లింది తన్మయి.

ఇంకో రెండు, మూడు నెల్లలో ఎమ్మే అయిపోతుంది కదమ్మా. తర్వాత పీ హెచ్ డీ ఏదో చేస్తానంటున్నావు. ఇప్పుడీ ఉద్యోగం ఎందుకు?” అన్నాడు భానుమూర్తి.

హాస్టల్ వార్డెన్ ఉద్యోగం ఆయనకు నచ్చలేదని స్పష్టంగా అర్థమవుతూంది.   

వెళ్లనివ్వండి. తనంతట తను బతకాలనుకుంటున్నపుడు అడ్డు చెప్తారేంటి?” అంది జ్యోతి విసుగ్గా.

చిత్రంగా తనని ఆపాలని చూస్తున్న తండ్రి గొంతులో తమని వదలలేని ప్రేమ, వెళ్లనివ్వమని చెప్తున్న తల్లి గొంతులో తమ మీద ఆధారపడి ఎన్నాళ్లు ఉంటుందన్న విసుగు ధ్వనించాయి తన్మయికి

ఒక్క సారిగా కళ్ల నీళ్లు తిరిగాయితను ఎప్పుడు ఇంటికి వచ్చినా తల్లిదండ్రుల్ని వదిలి వెళ్లడానికి  మనసులో తీరని బాధ కలుగుతూ ఉంటుంది.

అయినా కన్న తల్లిదండ్రులకి బాబు, తనూ భారం కాకూడదన్నది తన అభిమతం. అందుకే కష్టమైనా, నష్టమైనా తన కాళ్ళ మీద తను నిలబడే ప్రయత్నం చేస్తోంది.

కానీ అదేం విచిత్రమో

తాము వాళ్లకు భారం కాదని, ఏదేమైనా తామే కళ్లలో పెట్టి చూసుకుంటామని   తల్లిదండ్రులు అంటే బావుణ్ణని ఉంది మరో పక్క.

సంసార జీవితంలోనూ ఇంతే. ఎప్పుడూ ద్వైదీ భావమే. తన కాళ్ల మీద తను నిలబడాలనే గొప్ప పట్టుదల ఒక పక్క. అతని మాట కాదనలేని  ప్రేమాపాశం మరో పక్క.  

ఇలాంటి పరస్పర వ్యతిరేక భావాలు అందరికీ సహజమేనా? లేదా తనలోనే ఏదైనా లోపం ఉందా?

అయినా శేఖర్ లాగా కఠినంగా ఉండడం తనకు ఎప్పటికైనా అలవడుతుందా అసలు!

కట్టుకున్న తనను, కడుపున పుట్టిన వాణ్ణి వదిలి ఎంత తేలికగా వెళ్ళిపోయేడు!!

తన్మయి కళ్లలో నీళ్లు చూసి జ్యోతి దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసి, “ధైర్యంగా ఉండమ్మా, అలా బెంబేలు పడితే ఎలా? నాన్నగారికి కొంచెం కుదుటపడాలే గానీ వారానికోసారైనా నిన్నూ, బాబునీ చూడకుండా  ఉండగలమా చెప్పు?” అంది.

అప్పుడు కూడా తల్లి తనని ఉండమని అనడం లేదు

ఒకరి మీద ఆధారపడకూడదన్న తన అభిమతాన్ని సమర్థించడానికా? తనని ఇంట్లోనే ఉండమంటే వచ్చిపోయే బంధువుల మాటల తాకిడి భరించలేకానిజంగానే తాము భారమని భావిస్తూందా

తల్లి గొంతులో ఇవన్నీ కలగలిపిన భావాలు ధ్వనించడం తనని బాగా బాధపెడుతున్నాయి.

కళ్ల నీళ్లు తుడుచుకుని కాసిన్ని మంచి నీళ్లు తాగింది తన్మయి.

డాబా మీదికి వచ్చి కూచుంది.

సంధ్య వేళ కావడంతో పెరట్లోని చెట్ల మీదికి పక్షులు వచ్చి వరసగా వాలుతున్నాయి

తన ముందు నించే ఒక చిన్న గుంపు ఎగురుకుంటూ వచ్చింది.

అందులో పిల్ల పక్షి అన్నిటికన్నా తక్కువ ఎత్తులో ఎగరడం గమనించి తల్లి పక్షి కాబోలు వెను తిరిగి దానితో పాటూ కాస్సేపు ఎగిరింది.

అంతలోనే పిల్ల పక్షి వేగం పుంజుకుని గుంపులో కలిసిపోయి వేరే పక్షులతో ఏదో చెట్టు మీదికి చేరిపోయింది.

తల్లి పక్షి తన గూడు దిశగా కాబోలు మరో చెట్టు మీద వాలింది.

తన్మయికి ఏదో సమాధానం లభించినట్లయ్యింది.

మెట్లు దిగబోతూ పరిచయమైన గొంతులు వినబడుతూండడంతో గబగబా వచ్చింది కిందికి తన్మయి.

ఎప్పుడు వచ్చేరో ఏమో శేఖర్ తల్లీ, తండ్రీ వరండాలో కూచుని ఉన్నారు.

భాను మూర్తి తో శేఖర్ తండ్రి ఏదో వ్యాపార విషయాలు మాట్లాడుతున్నాడు.

మీ నాన్నేడిరా నాన్నాఅంటూ బాబు ని ముద్దు చేస్తూంది దేవి.

చివర మాట పుచ్చుకునినాన్నాన్నాన్న..” అంటున్నాడు బాబు.

తతంగమంతా చూసి తన్మయికి ఒళ్ళు మండుకొచ్చింది. అయినా ముభావంగా వచ్చి ఒక పక్కగా నిలబడింది.

శేఖర్ తల్లిదండ్రులలో ఒక్కరూ తన్మయి వైపు చూడను కూడా చూడలేదు.

అనుకోకుండా తనని మొదటిసారి వాళ్లు చూడడానికి వచ్చినపుడు జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది తన్మయికి.

రోజు అదే చోట తను సిగ్గుతో తల వంచుకుని నిలబడింది.

అప్పటికే శేఖర్ తనని చూడడానికి తరచూ వస్తున్నాడు. అయినా మళ్లీ పెళ్లి చూపుల తతంగమేమిటో అర్థం కాలేదు తన్మయికి.

అతని తల్లి తన మెళ్లో వేసిన బంగారు నగల వైపు తదేకంగా చూడడం, అతని తండ్రి తనని చూస్తూనే నచ్చనట్లు మొహం పెట్టడం తనకింకా బాగా గుర్తున్నాయి.

పిల్ల బాగా అర్భకంగా ఉంది, మందో మాకో ఇప్పించండిఅని వాళ్లు తన వెనకే అనడమూ వాళ్ల కూడా వచ్చిన చుట్టాలు పగలబడి నవ్వడమూ జ్ఞాపకం వచ్చేయి.

పెళ్లవుతూనే తనకి ఒళ్లు రావాలని వాళ్ల వీధిలోని ఆర్ ఎం పీ హాసిటల్ నర్సుని పిలిపించి మక్కల మీద రోజు విడిచి రోజూ ఇంజక్షన్లు పొడిపించేరు.

ఇంజక్షన్లకి ఒళ్ళు రాలేదు సరికదా తర్వాత చాన్నాళ్ల పాటు మక్కలు పట్టేసినట్లు  అయిపోయి సరిగా నడవలేకపోయేది తన్మయి.

ఇప్పటికీ ఒక కాలుమీద ఆనుకుని నిలబడినప్పుడల్లా అదే పరిస్థితి.

ఎక్కువసేపు ఇక వాళ్ల ఎదురుగా ఉండడం తనకి చికాకు అనిపించి లోపలికి నడిచింది.

అసలు వీళ్లు ఎందుకు వచ్చేరు?” వంటింట్లో టీ పెడుతున్న తల్లిని అడిగింది.

జ్యోతి కూతురి వైపు నిష్టూరంగా చూసి, “నీకు తప్పినా మాకు తప్పుతాయా ఇవన్నీఅని విసురుగా అంది.

తల్లి అనేది మాత్రం అర్థం కాలేదు తన్మయికి.

బాబు అంత పరిచయంగా వాళ్లతో ఆడుతున్నాడంటే అస్తమాటూ వాళ్లు వచ్చి వెళ్తున్నారన్నమాట.

మర్నాటి నించీ తను హాస్టల్ కి బాబుని తీసుకు వెళ్లిపోతుందన్న విషయం కూడా చెప్పే ఉంటారనిపించింది తన్మయికి.

వాళ్లతో బాటూ తల్లిదండ్రుల మీద కూడా రానురానూ చికాకు వస్తూంది తన్మయికి.

అవతల అతను తనని కోర్టు చుట్టూ తిప్పిస్తున్నాడన్న బాధ కించిత్ అయినా ఉన్నట్టు ఉన్నారా వీళ్లంతా?

ఎందుకు ఇంకా బంధుత్వాలు కొనసాగిస్తున్నారు?

తల్లి అంత బాధపడ్తూ వాళ్లని ఆదరించాల్సిన అవసరం ఏవిటి?

తన వైపు కూడా చూడడం ఇష్టం లేని వాళ్లకి బాబు మీద మాత్రం ప్రేమ ఎందుకు?

ఆలోచించే కొద్దీ తలపోటు రాసాగింది తన్మయికి.

ఇక మీదట ఇక ఎంత తక్కువగా  ఇక్కడికి వస్తే అంత మనశ్శాంతి తనకు దక్కుతుందని మాత్రం అర్థమయ్యింది.

***

బాబు మృదుల్ చిట్టి చేతులందుకుని నడిపిస్తూ హాస్టల్ ఆవరణలోకి తీసుకు వచ్చింది తన్మయి.

బస్సు ప్రయాణమంతా నిద్రపోయేడు

మొదటి సారి తల్లితో  కలిసి బయటకు వచ్చేడేమో చుట్టూ ఉన్న భవంతులని అందమైన పెద్ద కళ్లు విప్పార్చుకుని చూడసాగేడు.  

దగ్గరకు వస్తూనే మురళిఅరే, వీడెంత బావున్నాడో!” అంటూ రెండు చేతులూ చాచి దగ్గరకు తీసుకున్నాడు.

ఎన్నాళ్ల నుంచో పరిచయం ఉన్నట్లు చప్పున మీదికి దుమికేడు మృదుల్.

పక్కనే ఉన్న వెంకట్మీ వాడు మీలాగా నెమ్మదస్తుడు కాదు. మాంచి చలాకీ కుర్రాడు. అవునూ, మృదుల్ అన్న మంచి పేరు వదిలేసి  “బాబూఅని పిలుస్తారేవిటి? బెంగాలీ వాళ్లలామృదుల్ బాబుఅని పేరు పెట్టేరా ఏవిటి? అన్నాడు నవ్వుతూ.

తన్మయి చిరునవ్వుతో అదే సార్థకం చెయ్యండి. అంది రిజిస్టరు లోమృదుల్ బాబుఅని రాస్తూ.

మీరేమో గర్ల్స్ హాస్టలు వార్డెను, వీడేమో అబ్బాయి. టెక్నికల్ గా అబ్బాయిలు గర్ల్స్ హాస్టలులో ఉండకూడదు.” అన్నాడు వెంకట్.

ఏదో అర్థమైనట్లు చప్పున తన్మయి వైపు పరుగెత్తుకొచ్చి  ఒళ్లోకి ఎక్కి మెడ కావలించుకున్నాడు బాబు.

తన్మయి వాడి వీపు మీద రాస్తూ ఆలోచిస్తూండగా

వెంకట్ గట్టిగా నవ్వుతూభయపడకండి. అయిదేళ్లు నిండని పిల్లలని మా బాయ్స్ హాస్టల్ లో చేర్చుకోం.” అన్నాడు.

మురళి అదే కాంతివంతమైన చిరునవ్వుతోమేం యోగాలో చేర్చుకుంటాంఅన్నాడు.

***

వచ్చిన రెండో రోజుకే బాబు అందరికీ ఇష్టమైన వాడయ్యిపోయేడు.

హాస్టలు మొత్తం మీద చిన్న వాడు కావడంతో గేటు కీపర్ దగ్గర్నించి, వంటింటి వాళ్ల వరకూ అంతా బాబు ని ఎత్తుకుని ముద్దు చేసే వాళ్లే అయ్యేరు.

తోడొకరు లేని జీవితంతో పోరాటం మొదలు పెట్టిన తన్మయికి వివేకానందా పాఠశాల గొప్ప శాంతి నిలయం అయింది

ఆదివారం పూట తెల్లవారు ఝామున చలి చీకట్లలో వెలుతురు రేఖలు విచ్చుకునే సమయాన యోగా చివరన చెప్పేఓంకారం నాదంలో ప్రపంచాన్ని గెలవగల ఒక గొప్ప ఉత్తేజం నిండినట్లయింది తన్మయికి.

పిల్లలంతా యోగా నించి రాగానే వాకిట్లో పెద్ద గాబుల  నిండా వేణ్ణీళ్లు కాచి, చిన్న పిల్లలందరికీ నలుగు పెట్టే కార్యక్రమం మొదలు పెట్టేరు ఆయాలు.

తొలిపొద్దు వాకిట పసుపు కలిపిన నలుగు పిండి పూసుకుని  పిల్లలందరూ పార్వతీ దేవి తయారు చేసిన చిట్టి వినాయకుల్లా ఉన్నారు

స్నానాలు కాగానే కలువ పూలు తెప్పించి హాలు మధ్య ఉన్న పెద్ద నీళ్ల గిన్నెలో పిల్లలతో వేయించింది తన్మయి.

కాస్త ఎడంగా నిలబడి చూస్తున్న పెద్ద పిల్లలని పిలిచిముగ్గులు పెట్టడం నేర్పించనా? ” అంది.

అంతా సంతోషంగా చుట్టూ మూగేరు.

గర్ల్స్ హాస్టలు ఆవరణ పండగ వచ్చినట్లు  మిలమిలా మెరిసిపోసాగింది.

అటుగా వెళ్తూ వెంకట్ఏవిటండీ ఇది వివేకానందా పాఠశాలలోని గర్ల్స్ హాస్టలేనా? లేదా పొరబాటున మా ఊరు వచ్చేనా?” అన్నాడు

వెనకే మురళి వచ్చేడు. మురళి చాలా మిత భాషి. కళ్ళతోనే పలకరించేడు

శబ్దం కన్నా, నిశ్శబ్దం ఎక్కువ ప్రతిభావంతమైనదని మొదటిసారి తెలుసుకుంది తన్మయి.

మురళి నుదుటి మీది విభూది రేఖ, వెలిగే కళ్ళు, చిర్నవ్వు చెదరని ముఖం, ప్రశాంతమైన వదనం పిల్లలందరినీ ఆకర్షించి, క్రమశిక్షణలో ఉంచడాన్ని గమనించింది తన్మయి.

“మన  ఆవరణని ఆనుకుని ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్తున్నాం. మీరూ వస్తారా?” అన్నాడు వెంకట్.

ఒక్క నిమిషంఅని బాబుని ఆయాకి అప్పగించి వాళ్లతో నడిచింది తన్మయి.

చీర చెంగు భుజం చుట్టూ  కప్పుకుంటూ, మురళి ఒక్క క్షణం ప్రశంసా పూర్వకంగా తన వైపు చూడడాన్ని  గమనించింది తన్మయి.

హాస్టలు బిల్డింగులు దాటి వెనకగా ఉన్న చిన్న చెరువు గట్టు మీద నడక సాగించేరు

చుట్టుపక్కల నీటి సదుపాయం బాగా ఉండడం వల్ల ఎటు చూసినా పచ్చని చెట్లతో ఆహ్లాదంగా ఉంది.

దూరంగా పర్వతాల వరుసలు ఆకాశం వైపు ఎదగాలన్న ఉన్నతాశయాలకి ప్రతీకలై ధీరంగా నిలబడి ఉన్నాయి.

మురళి, వెంకట్ ఇంజనీరింగు చదివారన్న విషయం విని ఆశ్చర్యపోయింది

మరి యోగా నేర్పిస్తూ….” అని ఆగింది.

అదేనండీ విధి విచిత్రం. ఎమ్మే చదువుతూ మీరు హాస్టలు వార్డెను గా పనిచెయ్యడం లేదూ?” అలాగే మేమూ అన్నమాట అన్నాడు నవ్వుతూ వెంకట్.

తన జీవిత పరిస్థితులు వేరు

వెంకట్ ఇంకా ఫర్వాలేదు. బాయ్స్ హాస్టల్ వార్డెన్ గానే కాకుండా కంప్యూటర్ ఇన్స్ ట్రక్టర్ గా కూడా పనిచేస్తున్నాడు.

కానీ మురళి సంగతి ఏవిటి?

అదే అడిగింది. సమాధానంగా అదే ప్రశాంత నిశ్శబ్దపు చిర్నవ్వు మురళి ముఖమ్మీద.

వెంకట్ అందుకునిఇంజనీరింగ్ లో మేమిద్దరం క్లాస్ మేట్స్ మి. నేనిక్కడ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వచ్చినపుడు నాతో వచ్చిన మురళి ఇక్కడి వాతావరణానికి ముగ్ధుడయ్యేడు. అప్పటి వరకూ అంతర్లీనంగా ఉన్న యోగా ఇన్స్ ట్రక్టర్ కావాలన్న తన ఆకాంక్షకు ఆస్కారం లభించింది. అందునా ఇతరుల సేవ కోసం తన జీవితాన్ని అంకితం చెయ్యాలన్న తన జీవితాశయానికి అంకురార్పణ జరిగింది. ఇందు కోసం ఇంజనీరు ఉద్యోగాన్ని కూడా వదిలేసేడు

అబ్బురంగా  మురళి వైపు చూసింది తన్మయి.

మురళి మాటల్ని విననట్టే నడవ సాగేడు

మాటల్లోనే వృద్ధాశ్రమానికి చేరుకున్నారు.

దాదాపు ఇరవై మంది వృద్ధులు ఉన్నారు అక్కడ

వారంతా విధి వంచితులే

అందరూ ఉండి కుటుంబ అనాదరణలకు గురయ్యిన వారు కొందరు, ఎవరూ లేని ఒంటరి వాళ్లు కొందరు.

రకరకాల అనారోగ్యాలతో సతమతమవుతూ బహుకాల రోగపీడితులైన వారు కొందరు.

జీవితపు చివరి అంకంలో బాధాగ్రస్త భాగాన్ని కనుకొలుకుల్లో దాచుకుని బతుకునీడుస్తున్న  వారు కొందరు.

వెళ్తూనే మురళి తన చేతి సంచిలోని అరటి పళ్లు తీసి తలా ఒకటి ఇచ్చేడు

ఒకరిద్దరికి గబగబా బ్యాండేజీలు మార్చి కట్టేడు

వారందరి క్షేమం కనుక్కోవడమే కాదు. ఆప్యాయంగా వాళ్లతో మాట్లాడసాగేడు.

సాయంత్రం అక్కడ సాయం పొందుతున్న వారితో పోలిస్తే తన జీవితంలోని కష్టాలు కష్టాలే కాదని అనిపించేయి తన్మయికి. మురళి వారికి సేవ చేస్తున్నపుడు కళ్ళల్లో కనిపించిన సంతృప్తి తన్మయికి కొత్త పాఠం నేర్పింది.

ఇతరుల సేవకై అంకితమైన జీవితం ఎంత ఉత్కృష్టమైనదో అర్థమయింది.

జీవితంలో ఎప్పుడూ పరుల సేవకు కొంత  భాగం కేటాయించాయలని నిర్ణయించుకుంది

వెంకట్, మురళి లతో కలిసి ప్రార్థనలు, భజనలలో పాల్గొనడం, వృద్ధులకు మందులు వగైరాల సప్లైలు సరిచూడడంలో భాగం పంచుకోసాగింది తన్మయి.

ప్రతీ ఆదివారం ఉదయానే పిల్లలతో కలిసి దేవ గన్నేరు పూలు కోసి, మాలలు కట్టి ప్రార్థనా మందిరపు ఆవరణను అలంకరించడంలోనూ మురళికి సాయం చెయ్యసాగింది.

మొదటి నెల జీతంలో రెండు శాతాన్ని పట్టుకెళ్లి  మురళి చేతిలో పెట్టి 

ఇక మీదట వీటిని కూడా వృద్ధాశ్రమంలో పళ్లు కొనడానికి వినియోగించండి.” అంది

***

ఎమ్మే ఫైనలియర్ పరీక్షలు నెల రోజులకు వచ్చేసేయి. అవి కాగానే మరో మూడు నెలల్లో జే ఆర్ ఎఫ్ పరీక్ష   రాయాల్సి వుంది.

తన్మయికి పని చేస్తున్నా పరీక్షల ఆలోచనే చుట్టుముట్టసాగింది.

రోజు ఉదయం డిపార్టుమెంటు బయట చెట్టు కింద బెంచీ మీద కూర్చుని దీక్షగా నోట్సు చదువుతూ ఉంది

క్లాసులన్నీ ముందు రోజే పూర్తయ్యి పోయాయి.

అనంత వెనకగా వచ్చి కళ్లు మూసింది.

చదివింది చాల్లేమ్మా, అవతల అందరూ డిపార్టుమెంటులోని కల్చరల్ హాలులో చేరి పార్టీ చేస్తూంటే ఇక్కడ కూచున్నావేంటీ?” అంది.

బదులుగా చిర్నవ్వు నవ్వుతూ అనంత వెనక నడిచింది.

ఎలా ఉంది కొత్త  ఉద్యోగం, కొత్త జీవితం?” అంది అనంత.

మళ్లీ అదే చిర్నవ్వు చూసి, “నిన్ను చూస్తూంటే నాకూ వచ్చి అక్కడ జాయినయ్యిపోవాలనుంది. మన వాళ్లు ఫైనల్ పరీక్షల కంటే ఎక్కువగా జే ఆర్ ఎఫ్ గురించి ఒకటే టెన్షన్ పడ్తున్నారు. ఫైనల్ పరీక్షలకూ  కంబైండ్ స్టడీస్ చేద్దామనుకుంటున్నాం. ప్రతీ రోజూ లైబ్రరీ బయట మకాం. ఏవంటావ్?” అంది అనంత కనుబొమలు ఎగరేస్తూ.

నీకు బానే ఉందా మరి…” అని సందేహంగా ఆగింది తన్మయి అనంత నెల తప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.

నాకు అబార్షన్ అయ్యింది తన్మయీఅంది చాలా మామూలుగా అనంత.

తన్మయిఅయ్యోఅంది చప్పున.

తేలికగా నవ్వుతూ, “ఏది జరిగినా మన మంచికేలే, తాదూర కంతలేదు మెడకో డోలని ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో పిల్లల్ని పోషించే పరిస్థితి లేదు మాకు. అయినా ఇప్పుడు ఆలోచించవలసింది పరీక్షలు గట్టెక్కడం గురించిఅంది అనంత.

తన్మయి అనంత వైపు ఆశ్చర్యంగా చూసింది

మనసుకీ, శరీరానికీ  ఉన్న అవినాభావ సంబంధాల్ని అంత తేలికగా తీసుకోవడం తనకు ఎప్పటికైనా సాధ్యమేనా?

విషయాల్ని తేలికగా తీసుకోలేకపోతే జీవితంలో ప్రతీ అడుగు లోనూ  మథన, దిగులు, నిర్వేదం, నిరాశ తప్పవు.

చప్పున తను నెల తప్పిన దగ్గర్నించీ కడుపులోని బిడ్డతో కలిగిన అనుబంధం జ్ఞాపకం వచ్చింది

ఆలోచనలతో సతమతమవుతూ హాలులోకి అడుగు పెడ్తూండగా స్టేజీ మీంచి కరుణ కవిత వినిపించసాగింది.

కవిత శీర్షిక– “ఆమె” 

ఆమె

చూపు కలిపిందా

లేచి వస్తాయి ప్రాణాలు

ఆమె

చూపు తిప్పిందా

పోతాయి ప్రాణాలు…..”

చుట్టూ ఉన్న వాళ్ల చప్పట్లు, గోలల మధ్య  తరువాత శబ్దాలేవీ తన్మయికి తలకెక్కలేదు.

వడిగా వెనక్కి వచ్చి బెంచీ మీద కూలబడింది.

మనస్సులో ఏదో తెలీని అలజడి.

అసలే తనకే తెలీని సమస్యలతో ఎటో కొట్టుకు పోతూంది తన జీవితం.

ఆకాశమంత ఎత్తున ఉన్న తన లక్ష్యాల్ని చేరుకోనివ్వకుండా ఎన్నో అడ్డుపడ్తున్నాయి.

ఉన్నంతలో తన జీవితం దొరికిన చిన్న ఉద్యోగం, సత్ సాంగత్యంతో కాస్త కుదురుగా నడుస్తూ ఉంది

ఇదొక కొత్త సమస్యా?

పార్టీ కావడం వల్లనో ఏమో చక్కగా శుభ్రంగా గడ్డం చేసుకుని, ఉన్నంతలో మంచి దుస్తులు వేసుకున్నందు వల్ల కరుణ ముఖం వెలిగిపోతూంది స్టేజీ మీద.

పైగా కవిత్వంతో ఏదో ఎనలేని శక్తి ఒనగూరుతున్నట్లు గొప్ప ఉత్సాహపూరితమైన గొంతొకటి.

కవితకు వస్తువు తనేనా?

ఆలోచనకే కాళ్లలోంచి ఒణుకు పుట్టుకురాసాగింది తన్మయికి.

మర్నాటి నించి అందరితో కంబైన్డ్ స్టడీస్ కి రావాలి తను

జె ఆర్ ఎఫ్ కు  ఇంత వరకూ చేసిన సాధన ఒక ఎత్తు, ఇక మీదట చేయబోయేది ఒక ఎత్తు. చివరి నెలల్లో చదివేదే ముఖ్యం. ఇప్పుడు ఉన్న తక్కువ సమయంలో జె ఆర్ ఎఫ్ సాధించాలంటే గ్రూప్ స్టడీస్ తప్పనిసరి.

క్షణకాలం కళ్లు మూసుకునిఅజ్ఞాత మిత్రమా! పరిపూర్ణంగా లక్ష్యం  వైపు దృష్టి కేంద్రీకరించగలిగే ఏకాగ్రతని, మనోబలాన్నీ, స్థిర చిత్తతనీ ఇవ్వు నాకుఅని ప్ర్రార్థించింది

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.