ప్రఖ్యాత బోడో కవయిత్రి అంజలి బసుమతారి

-డా. ప్రసాదమూర్తి

ఇటీవల అస్సాంలో బోడో కేంద్ర పట్టణమైన కోక్రాఝార్ లో జరిగిన వంద భాషల కవిత్వ ఉత్సవంలో పాల్గొన్నాను. అక్కడి బోడో భాషా సాహిత్యాల వికాసం గురించి, అక్కడి కవులు,రచయితల గురించి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. బోడో భాషలో అద్భుత సాహిత్య కృషి చేస్తున్న ప్రొ.అంజలి బసుమతారితో సంభాషణ మరపురానిది. ఆమె కవయిత్రి,రచయిత్రి,విద్యావేత్త,ఎడిటర్,సామాజిక కార్యకర్త. 2016 లో ఆమెకు సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందారు. అంజు కలం పేరుతో ఆమె రచనలు చేస్తారు. అంజు కవితలు అస్సామీ,బెంగాలీ,హిందీ భాషలలో అనువాదమయ్యాయి. ఆమె రచనలు గౌహతి యూనివర్సిటీ, అస్సాం యూనివర్సిటీ,బోడోల్యాండ్ యూనివర్సిటీలలో పాఠ్యాంశాలుగా ప్రసిద్ధి పొందాయి. ఎన్నో కవిత్వ సంపుటాలు, ఇతర సాహిత్య రచనలు ప్రచురించారు.పలు సాహిత్య పత్రికలకు సంపాదకత్వం  వహించారు. ఆమె సంపాదకత్వంలో ప్రస్తుతం మహిళా రచయితల రచనలతో ప్రత్యేక త్రైమాసిక పత్రిక ఒకటి నడుస్తోంది.

           అంజలి కవిత్వం సరళ సుందరం. ఆత్మకు తాకే అనుభవాల సంచయం. మానవీయ విలువలతో నిండిన పరిపక్వ పసిడి గంధం. సహజ బోడో సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుతో గుబాళించే అక్షర గుఛ్ఛం. బోడో వనితల వారసత్వ సంగ్రామ సంగీతం. ఆమె కవితలలో స్త్రీ హృదయ సంభాషణ స్వచ్ఛమైన గౌరాంగ్ నదీ ప్రవాహంలా వుంటుంది.  

                1985లో అస్సాం రాష్ట్రానికి చెందిన అనుబంధ భాషలలో ఒకటిగా బోడో భాషకు అధికారిక గుర్తింపు లభించింది. అయితే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 2005లో మాత్రమే ఈ భాషను చేర్చారు.   ఎంతో తక్కువ కాలంలోనే బోడో భాషా సాహిత్యం అనేక రూపాల్లో విస్తరించింది. మహిళా రచయితలు, కవయిత్రులు ప్రత్యేకంగా సాహిత్య పత్రికలు నడుపుతున్నారు. 2020 జనవరి 27న ప్రాంతీయ కౌన్సిల్ ఏర్పాటు జరగడంతో అస్సాం అనుబంధ భాషగా బోడో సంపూర్ణ రూపంలో తన విస్తరణ ప్రస్థానం సాగిస్తోంది. ఇప్పుడెందరో ఎందరో బోడో భాషలో అపురూప సాహిత్యాన్ని వెలువరిస్తున్నారు. వారిలో అంజలి బసుమతారి ముందు వరసలో  ఉంటారు. ఆమె కవితలు రెండింటిని ఇక్కడ నేను చేసిన అనువాదంతో ఇస్తున్నాను.

                 || అగ్ని బీజం||

  ఈ అగ్ని బీజాన్ని నేనెక్కడి నుంచి తెచ్చానో నన్నడగొద్దు/ చాన్నాళ్ళ క్రితం మాట../అప్పుడు నేను నిద్రలో ఉన్నాను/ గుండెల్లో ఒక సుప్త జ్వాలాముఖి రగులుతూ వుంది/ ఇప్పుడు అగ్ని బీజాలు నలుదిశలా వ్యాపించాయి/ అందుకే అన్ని వైపులా అగ్ని../ఆకుపచ్చ మైదానంలో రగులుతున్న అగ్ని/

ఎటు  చూసినా అగ్ని జ్వాలలు../హృదయ కీలలు /నాకు జీవించే అధికారం కావాలి

/నాకు సర్వ సమాన అధికారం కావాలి/ రెప్ప చప్పుడైతే చాలు అగ్ని ప్రవహిస్తుంది/ ధిక్కార స్వరమై  గోడల్ని బద్దలు కొట్టుకుంటూ/ అన్ని దిక్కులా అగ్ని వ్యాపిస్తుంది/ నదిలో ప్రవహిస్తున్న ఉన్మత్త వాయువులా-/ కాలం ఎప్పుడూ ఒకలా వుండదు/ నా మెడ మీద మోకాలు పెట్టి చూడు/ రాజ్ పథ్ లో నిరసన జ్వాల నింగినంటుతుంది/ కార్పొరేట్ కంపెనీలు, సర్కారీ దోపిడి తంత్రాలు/  అప్పుడప్పుడు ఈ అగ్ని బీజాన్ని మరింత మండిస్తాయి/ అమ్మ మాటిమాటికీ చెప్తూ ఉండేది/ “ నిప్పుతో చెలగాటం ఆడొద్దు” /పొయ్యిలో మండుతున్న కట్టెకు పాదం తాపితే/ అమ్మతప్పు  నమస్కరించాలి”  అనేది/  నాన్న ఎప్పుడూ అనేవాడు/ “ ఒక చిన్న నిప్పు కణం /  అడవిని దహించి బూడిద చేయగలదు  జాగ్రత్త !”

 నేనెప్పుడూ అగ్నితో ఆడుకోలేదు/  చిన్నప్పుడు చలిలో పొయ్యి దగ్గర కూర్చునేదాన్ని/  అప్పటి మాట వేరు /

కానీ నేను  ఈ అగ్ని బీజాన్ని జాగ్రత్తగా దాచుకున్నాను/ ఎప్పుడు అవసరం పడుతుందో/

 అధర్మాన్ని దహించడానికి/   లోపలో  బయటో ఉన్న  దానవుడిని దగ్ధం చేయడానికి-/

అప్పుడప్పుడూ నాకు అగ్నిశిఖలా మారి / నాట్యం చేయాలనిపిస్తుంది /విలయ భంగిమతో  ఎర్రని నేత్రాలతో/  హూంకరిస్తూ   అన్నిటినీ కాల్చి పారేస్తూ/   దాహార్తికి తో చప్పరించి బూడిద చేయాలని ఉంటుంది/ ఎవరు  మాత్రం  అగ్ని బీజాన్ని కోరుకుంటారు?  “ 

               || ఉరితాడు మీద వెన్నెల ||

 పచ్చని నేల/ వెన్నెల తో కడిగిన ఎవరో /విధవరాలి పసుపుపచ్చ నిశ్శబ్ద మొఖం /తల్లి ఒడిలో /ఏడాదిన్నర బిడ్డ మొహం మీద అపారమైన అంధకారం/తల్లి ముఖం లాంటిదే ప్రతిబింబంమా బాల్కనీ కి ఎదురుగా రావిచెట్టు మలుపులో రోడ్డు../ రైలు పట్టాల మీద నలిగిపోయిన పాము లాగా పడి ఉంది/పురుగు పుట్ర కీచుకీచు శబ్దాలు చేస్తున్నాయి/ దూరంగా ఒక కుక్క కలలో అరుస్తోంది/

 నా డైరీలో చివరి పేజీనీ  కాలం గోళ్ళు రక్కుతున్నాయి/అవును అర్ధరాత్రి కావడానికి ఇంకా కొన్ని క్షణాలు బాకీ ఉన్నాయిబయట డిసెంబర్  మాసాంతపు చలిగాలి గోల చేస్తోంది/మా బాల్కనీ లో కూడా గోడల్ని చలి అల్లుకుంది/నేను వణికితే నాతోపాటు నా నీడ కూడా వణికిందిబాల్కనీ అద్దంలో బెలూన్ లా మెరుస్తున్న చంద్రుడిలో/   ఏదో బాధతో కూడిన పెళుసు నవ్వు./   మోహమయి మోనాలిసా నవ్వులాంటిది../  ప్రస్తుతానికి ఊపిరి పూర్తిగా పోలేదు.” 

    ఈ రెండు కవితల్లో ఆమె అభివ్యక్తిలోని గాఢత, భావాల్లోని విప్లవాత్మకత అర్థమవుతుంది. అంజలితో నా సంభాషణ ద్వారా ఆమె గురించి నాకు తెలిసిన విషయాలు ఇవి..           

    12, 13 సంవత్సరాల వయసులో స్కూల్ మేగజైన్లో ఆమె రాయడం మొదలు పెట్టారు.  స్కూల్ వార్షికోత్సవ సాహిత్య పోటీలలో పాల్గొనే వారు. బోడో సాహిత్య సభ ఉత్సవాల్లో పాల్గొన్నారు. హైస్కూల్ రోజుల్లోనే  మ్యాగజైన్లో రాయడానికి మొదటి ప్రేరణ ఆమెకు తన అక్కయ్యల నుంచి,  గురువుల నుండి లభించింది.  సిలబస్లో ఉన్న కవితలు బాగా నచ్చేవి.  కమల్ కుమార్ బ్రహ్మ, మనోరంజన్ లహరి మొదలైన వారి  కవితలు ఎంతో అందంగా కనిపించేవి. వారి కవితల్లో వాస్తవికత, ప్రకృతి కలగలిసిన సౌందర్యం ఉండేది. ప్రఖ్యాత బోడో రొమాంటిక్ కవి ఇషాన్ మషమరి  కవితలు, చరణ్ నర్సరీ దేశభక్తి కవితలు తననెంతో ఉత్సాహపరిచేవని, తన మీద ఎంతో ప్రభావం చూపించాయని ఆమె చెప్పారు.  బోడో సాహిత్య ఆధునిక ఉద్యమకారుడు రాజేంద్ర కుమార్ బ్రహ్మ తనకు జీవితకాలపు ప్రేరణ అంటారు.

     మెట్రిక్యులేషన్ తరువాత గౌహతిలో కాటన్ కాలేజీలో లో చేరారు అంజలి.   అక్కడ ఎంతో విశాలమైన విద్యా సాంస్కృతిక సాహిత్య వాతావరణం ఆమెకు  లభించింది.  ప్రముఖ అస్సామీ కవి నవ కాంత్ బారువ  ఇంగ్లీషు కవిత్వ పాఠాలు చెప్పేవారట.  హిరేన్  భట్టాచార్య, నీల్ మోని ఫుకార్ తన  ఫేవరెట్ కవులు. ఆ రోజుల్లో తాను పాబ్లో నెరుడా కవితలను అస్సామీ అనువాదంలో చదివి మంత్రముగ్ధురాలయ్యారు.  ఆ కవి  ప్రభావం తన మీద చెరగని ముద్ర వేసిందని అన్నారు.

    తండ్రి తరఫునుంచి తల్లి తరపు నుంచి కొంత సాహిత్య వారసత్వం ఉంది. అంజలి అమ్మగారి  తండ్రి బోడో సాహిత్యంలో తొలితరానికి చెందిన గొప్ప రచయిత. మామయ్య అప్పట్లో గొప్ప కథా చయిత. తనలో సాహిత్యాభిరుచికి వారి ప్రేరణ చాలా వుందని అంజలి అంటారు.   కజిన్స్ నుంచి కవితా రచనలో తనకు ఎంతో ప్రోత్సాహం లభించింది. 

  మీకు ఎలాంటి కవిత్వమంటే ఇష్టం అని అడిగితే ఇలా అన్నారు.  నా హృదయాన్ని తాకే అందమైన కవిత్వం ఏదైనా ఏ రకమైనదైనా నాకు ఇష్టమే. నేను వచన కవిత్వం ఇష్టపడతాను. నా దృష్టిలో కవిత్వమంటే దాంట్లో కవితా సౌందర్యం ఉండాలి. అది ఆత్మను కలిగి ఉండాలి. వర్తమానానికి సంబంధించిన  ప్రకృతి, ఫెమినిజం,  జెండర్ వగైరాలంటే ఇష్టం.  slaam  పోయెట్రీ నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి.

   ఆమె ఇంకా ఇలా చెప్పారు. కవిత్వం నాలో ఒక భాగం అనుకుంటాను. ఒక మంచి కవిత రాసిన అనుభవం దైవికమైనది. అది మనసుకు ఎంతో సంతృప్తినిస్తుంది.  కవిత్వ రచన మేధోపరమైన ప్రాసెస్.  ఒక ఆలోచన మనసులో మొదలవుతుంది.  దానితో కవి అనేక రోజులు మథన పడతాడు. తరువాత అక్షరాల రూపంలో కవిత  బయటకు వస్తుంది. ఇది ఒకరకంగా మానసిక వ్యాయామం. దీనికి ఎంతో సాధన కావాలి. కవిత్వమంటే  నిర్మించబడాలి. తిరిగి తిరిగి తిరగరాయాలి. నేను కవితను  మూడు నాలుగు సార్లు తిరిగి రాస్తేనే  గాని పూర్తి రూపాన్ని ఇవ్వలేను. ఒక్కోసారి సింగిల్ స్ట్రోక్ తో ఒక పోయెమ్ పుడుతుంది.

     బోడో సాహిత్యంలో కొత్త తరంగాలను, కొత్త రచయితలను సృష్టించడంలో కీలక పాత్ర పోషించిన గ్రూపులతో ఈమెకు  అనుబంధం ఉంది. బోడో   రైటర్స్ అకాడమీ  సభ్యురాలు. కోక్రాఝార్  జిల్లా బోర్డు ఎంప్లాయిస్ లిటరరీ అసోసియేషన్ స్థాపక సభ్యురాలు.  దాని వార్షిక సాహిత్య పత్రికకు మూడు సంవత్సరాల పాటు ఎడిటర్ గా ఉన్నారు. బోడో సాహిత్య సభ  మౌత్ పీస్ మ్యాగజైన్కి, ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్, ఆల్ బోడో ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ మొదలైన మేగజైన్లలో తరచుగా ఆమె  రచనలు సాగుతూ ఉంటాయి. బోడో కవిత్వ యాంథాలజీకి  ఎడిటోరియల్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు.  బెంగాలీ నుండి బోడో, బోడో నుంచి  బెంగాలీ  కథల కవిత్వాల అనువాదం వర్క్ షాప్ లో కీలక పాత్ర పోషించారు అంజలి.

      2018లో  బోడో ఉమెన్స్ రైటర్స్ అసోసియేషన్ స్థాపించారీమె.  కేవలం రచయిత్రుల కవితలు, రచనలతో త్రైమాసిక పత్రికను తీసుకొస్తున్నారు .ఈ అసోసియేషన్ తరపున వైస్ ప్రెసిడెంట్ గానూ ఎడిటోరియల్ బోర్డు చైర్మన్ ఉన్నారు.  అసోసియేషన్ తరపున ఎన్నో  పుస్తకాలు ప్రచురించారు.  సాహిత్య అకాడమీ అడ్వైజరీ బోర్డు సభ్యురాలిగా  ఆల్ ఇండియా బోర్డు మెంబర్స్ మీటింగ్ నిర్వహించారు. 2020లో  బోడో మహిళా రచయితల రచనలతో కవిత్వం, వచన రచనలు తీసుకు వచ్చారు.

      చివరిగా యువకులకు సందేశం ఏమిస్తారంటే ఇలా అన్నారు. కవిత్వం అనేది మన ఉద్వేగాలను ఆలోచనలను వ్యక్తం చేసే ఒక వాహిక. మాచ్యూ ఆర్నాల్డ్ అన్నట్టు కవిత్వ రచన జీవితాన్ని మనకు విశదీకరిస్తుంది, ఓదారుస్తుంది, నిలబెడుతుంది. ఇప్పటి  కవిత్వం ఎన్నో అంశాలను తీసుకుంటోంది. ప్రేమ, సమానత్వం, అస్తిత్వం, ప్రకృతి, ఆధునిక జీవితం, శాంతి,  ఫెమినిజం, జెండర్, పర్యావరణం మొదలైన అనేక అంశాలను స్పృశిస్తోంది. కొత్త తరం  కవులు ఎంతో టెక్నిక్ తో మంచి  భావాలను వ్యక్తం చేస్తున్నారు. బోడో సాహిత్యంలో ఇప్పుడు అభినయానికి అనువైన కవనం (శ్లామ్ కవిత్వం )  పాపులారిటీ సాధిస్తోంది.

     ప్రస్తుతం అంజలి  వచ్చే ఏడాదికి 2 కొత్త కవితా సంపుటాలు తీసుకురావాలని, అలాగే ఒక కథల పుస్తకం, ఒక దీర్ఘ కవితా సంకలనం, వ్యాస సంకలనం తీసుకురావాలని ఆ దిశగా తన ఉపాధ్యాయ వృత్తితో పాటు సాహిత్య కృషి కొనసాగుతోందని చెప్పారు. ఆమె సాహితీ కృషి మరెన్నో విజయాలను సాధించాలను కోరుకుందాం.

****

Please follow and like us:

One thought on “ప్రఖ్యాత బోడో కవయిత్రి అంజలి బసుమతారి”

  1. పదం పదం లో అభివ్యక్తి కొత్తదనం,స్పష్టత.తయారుచేసిన కవిత లా కాక అలవోకగా వ్రాసినట్టు,లోతైన మనోభావాలను ప్రతిబింబిస్తూ ఉంది.గొప్ప స్ఫూర్తి ని ఇచ్చారు.మూర్తిగారూ.ధన్యవాదాలండీ.

Leave a Reply

Your email address will not be published.