బతుకు చిత్రం-14

– రావుల కిరణ్మయి

నా పదమూడేళ్ళ వయసులోనే నన్ను పొరుగూరి కామందు,ఇంకొంతమంది పెద్దమనుషులు అందరూ కలిసి నన్నుదేవుడికి ఇచ్చి పెళ్ళి చేసి  దేవాలయ ప్రాంగణం లో శుభ్రం చేస్తుండే జోగిని గా మార్చి నా బతుకును బుగ్గిపాలు చేయాలని అనుకన్నప్పుడు అన్నలు వద్దనక పోగా అప్పుడు కూడా వారు ఇవ్వ జూపిన ఇళ్ళ స్థలం,పొలం పుట్ర కోసం ఆశపడి నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు.అప్పుడు కూడా కట్నకానుకలు తప్పుతాయని అందరి జీవితాలు బాగుంటాయని ఆ రోజు కూడా మనతో గొడవకు దిగారు.

ఆ తర్వాతా, ఇంకెప్పుడూ నీ పెళ్ళి ఆలోచన చేయమని నువ్వు ఊహా లోకం లో విహరిస్తూ రాణివాసం కలలు కంటున్నావని ,ఉట్టికి ఎగరలేనమ్మ మింటికి ఎగురతానందట అలా తినడానికి గంజి నీళ్ళు కూడా కరువైన నువ్వు ఇంకా పోకడ తో కలిసి వచ్చిన అదృష్టాన్ని కాలితో తన్నుతున్నావు.

ఇంక ఇలాగే నీతో పాటే మేమూ ఉన్నామంటే మాకూ పిల్లనిచ్చే వారుండరు.నీతో పాటు మా జీవితాలు కూడా ఇలా జరిగి పోవలసిందేనా?

అమ్మ పెట్టదు అడుక్కొని తిననివ్వదన్నట్టుగా నాయన తానూ సంపాదించక పోగా కనీసం నీకు నచ్చచెప్పడానికి కూడా ముందుకు రావడం లేదు.ఇలా మీరిద్దరూ మా ముగ్గురి అన్నదమ్ముల మీద ఏమాత్రం ప్రేమ చూపక పరాయి వల్ల లాగాను శత్రువులుగానూ చూస్తుండడం మాకు చాలా అవమానంగానూ బాధగానూ ఉంది.అందుకే మేము గుడిసె విడిచి పోవాలని నిర్ణయించుకున్నాము.అని ఆవేశంగా వెళ్ళి పోయారు.

తరువాత సంవత్సరానికి ముత్యమన్న వదినెను తీసుకొని వచ్చి ఈ పొళ్ళను నేను చేసుకోవాలనుకుంటున్నాను.అని నేను దాచిన  కూలీ డబ్బులు వాడుకొని పెళ్ళి చేసుకున్నాడు.పిల్లలు పుట్టినప్పుడు కూడా వారి అవసరం కొరకు ఇక్కడే ఉండి పిల్లలు పెరుగగానే మిగతా బాధ్యతలు తీసుకోవలసి వస్తుందని వెళ్ళి పోయారు.అని చెప్తుండగా …అన్జులు కల్పించుకొని ,

సెల్లే ..!ఇప్పుడు గవన్ని ఎందుకు?పాతవి తవ్వుకుంటే పెంకాసులు తప్ప ఏముంటది?జరిగినయేవో జరిగినయ్.ఇంటికి పెద్దోడు ఏదో అవస్థలు పడలేక అట్ల చేసుంటడు .మనోదని మనమే సడురుక పోవాలె అని మాట్లాడుతుండగా …

ఇంటికి పెద్దన్న అని అట్ల జేత్తే మరి నువ్వు జేసినదేమిటి?నాకు పిల్లనియ్యడానికి మనకు ఏమున్నదని?గందుకే ఎవరూ ముందట వడుతలేరు.గియనోక్కడే నా మంచి తనం చూసి బిడ్డను ఇత్తనంటాండు.కాకపోతే ఆయన దగ్గర చిల్లి గవ్వ కూడ లేదు,కాబట్టి అమ్మ పుస్తెలు,కమ్మలు ఇయ్యుమని ఆనాడు నాయన తోనూ నాతోనూ కయ్యానికి దిగి కొంచవోలేదా?మల్ల ఇద్దరు అన్నలు అడిగితే ,పైసలు కట్టిత్తనని అన్న మాటలు ఎప్పుడో గాల్లోకి ఎగిరి పోయి నీకు సుత పిల్లలు పుట్టి పెరుగావట్టిరి.కానీ నువ్వు మాత్రం ఇంతవరకు ఆ పైసల ముచ్చట ఎత్తుట లెవ్వయితివి?అని అడుగుతుడగా చిన్నవాడు శివుడు కల్పించుకొని ,

సెల్లే,ఆమ్మ సొమ్ముల గురించి మేము గాని నాయన గానీ సోచాయించుతలేము.నువ్వెందుకు ఇప్పుడు వాటిని ముంగటేసుకున్నవ్ ?అనగా,

మీరు ఎందుకుసోచాయించుతరు?ఆ అన్న పుత్తడి దక్కించుకున్నడనే గదా !నువ్వు అమ్మ కాళ్ళ కడియాలు,ఉల్లిగుత్తుల కాళ్ళ పట్టీల మీద కన్నేసి నీ  పెళ్లప్పుడు ఎండి తీసుక పోయి దక్కించుకున్నవ్ !ఇట్లా ఎవలి అక్కరకు వాళ్ళు వాడుకొని,నాయనను,నన్ను పీల్చి పిప్పి చేసి ఊరిడిసి పోయింది.

గా మధ్య నాయన పాణం బాగా లేదు, అని మత్లావు పంపితే తెల్లారేసరికి ఆ తావిడిసి పోయినోళ్ళు మీరు.వత్తె నాయన సాదుకం మీద వడుతది,మంది నానా తీర్ల అంటారనే గదా మొగం చూపించకుండా ఇన్నోద్దులు ఆడీడ తిరుక్కుంట గడుపుకొని మల్లిప్పుడు,

నా మేలని,నా బాధ్యతని సమ్మంధం పట్టుకొని వత్తిరి.

ఇండ్ల గూడ మల్ల మీ సార్థమే చూసుకుంటిరి.ఇగ మీరు మారేదెన్నడు ?నన్ను,నాయ్నను బాగా చూ సుకునేదెన్నడు? అని అంటుండగా ..

అన్జులు,సెల్లే నువ్వన్నయన్ని సత్తాలే.మాకు అంతకుమించి గతి లేక అట్ల జేస్తిమి.పైసా కోసమే కదా పాకులాడి నానా యేషాలు ఏసి ఇయ్యాల నీ ముంగట నిలవడ్డది.

మాకెట్లాగూ నీకు సొమ్ములు వెట్టి లగ్గం జేసెంత తాహతు లేదు.కనుకనే అందరికీ పాయిదా ఉండే ఈ సమ్మంధం సరే అనుకుంటిమి.నువ్వు ఊ…అంటే అమ్మ సొమ్ములు,ఈ గుడిసె ఆయన సిరిమంతం ముందు ఎంత?ఒక్కదానివి బాగు పడుడే కాక ఇంటి ఆడిబిడ్డగా మాకు ఈ మేలు చేయ్యరాదా?

సచ్చి నీ కడుపున పుడతం.మా పిల్లలు మేము అందరం మా ఇలవేల్పోలె నిన్ను కొలుసుకుంటం.నిమ్మళంగా సోచాయించి నిర్ణయం తీసుకో.          

అన్నా ..!నా కడుపున మీరు పుట్టానూ వద్దు నేనీ పెళ్ళి చేసుకోనూ వద్దు.మీ అందరికి ఇష్టం లేక పొతే నాయన ను చూసుకుంట ఇట్నే బతుకు ఎల్లదీసుకుంట కానీ కాటికి కాళ్ళు జాపుకున్న ఆ పెద్దమనిషిని చేసుకొని ఆయన ఊడిగం చేస్కుంట ఆయన పిల్లల  ముందు కేవలం డబ్బు కోసమే ఈమె పెళ్ళి చేసుకుంది అనే చులకన భావన తో నేను బతకలేను.దయుంచి ఇగ మీరు ఆ ముచ్చట ఇడ్సిపెట్టున్డ్రి.

అయ్యో తల్లీ..!అన్నలు లగ్గం గానియ్యలేదట అన్న చెడ్డ పేరు మాకెందుకు తల్లీ?నువ్వూ ..నీ జీవితం నడుమిట్ల మేమెవరం ?చెల్లె బాగుండాలని వాళ్ళ కు తోచిన సమ్మంధం తెచ్చిండ్రు.నువ్వు ఒప్పుకుంటే అందరం సల్లగ బతుకచ్చని ఆశవడ్డరు .కాకుంటే  మీ పెద్దన్న తరుపున గూడ నేనే సెప్తాన.ఇగ మాకు మాత్రం సమ్మంధాలు చూసి కట్నకాన్కలు ఇచ్చి ఘనంగ లగ్గం జేసే తాహతు లేదు.మాగ్గూడ పొల్లగాండ్లు ఎదిగత్తాన్డ్రు.ఇగ మీ నాయన మాకు కూడవెట్టి కుప్పలిచ్చింది లేదు అవిటి మీద మేం గూసోని తిన్నది లేదు కాబట్టి ఆయనను సాదినా సాదకున్నా మమ్ముల ఎవ్వలు అడిగేది లేదు అని ఆవేశంగా అన్నది ముత్యాలు భార్య.

అగో ..!మాకేమియ్యలేదంటానవ్?ఆడికి మా నాయన నాకేదో ఇచ్చినట్టు.మీకే ఉన్నారు గని పిల్లలు నాకు లేరా?నా పరిస్థితి గూడ గంతే.సెల్లె లగ్గంజేసుడు ముచ్చట మాగ్గూడ ఎర్కలే.పెద్దోనికి పేనన్న వారద్దు గని నడిపోనికి నాగు బామెక్కినా ఏమ్గాదన్నట్టే ఉన్నది నీ ముచ్చట ఇంటాంటే ,అన్నాడు అన్జులు.

ముత్యం భార్య అట్ల గాదు అని మాట్లడబోతుండగా చిన్నోడు శివుడు కల్పించుకొని ..

ముందు పుట్టిన ఇద్దరు పెద్దోళ్ళను గాదని అక్కడికి నాకేదో ఇచ్చినట్టు నన్నేదో మురిపెం జేసినట్టు మాట్లాడవడితిరి.ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు కూడా అంతే దూరం కదా!అలాంటప్పుడు మీరిద్దరు ఎట్లంటే నేనూ అట్నే అన్నాడు శివుడు.

ముగ్గురి కొడుకులు మాట్ల్ల్డుతున్న మాటలు వింటూ పీరయ్య మౌనంగా రోదించ సాగాడు.

అన్నలూ …!మీ మాట గాదన్నందుకు నన్ను తప్పు వట్టకున్డ్రి. నాయ్నను మీరెవ్వలు సాదకుంట మాయే!నేనే ఆయన కడుపున పుట్టినందుకు నన్ను పెంచి పెద్దచేసినందుకు సాది ఆ ఋణం కొంతైనా తీర్చుకుంట.తల్లిదండ్రులను చూసుకోవలసిన భాధ్యత ఒక్క కొడుకులకే అని ఏడ రాసి పెట్టున్నది.ఆడపిల్లలు గూడ ఆస్తి పాస్తులకోసం ఆశపడక వాళ్ళ ను చూసుకుంటేనే ముసలోళ్ళు ఆగం గారు ఆళ్ళ కోసం పతాకం వేరే వేరే ఇల్లు కట్టవలసిన అక్కెర ఉండదు.అన్నది జాజులమ్మ .

 

బిడ్డా..జాజులూ ..!నీకేం న్యాయం జేసిన్నని నన్ను సాదుతవ్.?ముగ్గురు కొడుకులే అని గర్వంగ మురిసి పోయిన.పాములకు పాలు వోసి పెంచుతాన్నని ఎన్నడు అనుకోలే.వీళ్ళకు నొప్పచ్చినా ,రోగమచ్చినా తగ్గేదాంక పచ్చి గంగ కూడ ముట్టకుండ వీళ్ళకు సేవ జేసుకుంట దేవునికి దండం పెట్టేది.అసొంటిది వీళ్ళు ఇప్పుడు బుక్కెడు బువ్వ పెట్టడానికి మాతోని గాదని చేతులెత్తేస్తాండ్రు.అమ్మ సొమ్ములు నా పైసలు నీ కూలి పైసలు సుత వీళ్ళకే పెడితి.అవన్నీ నీటి రాతలైపాయే .అని ఏ డుస్తుండగా…ముత్యం 

మా చేతులు మా  నెత్తిలనే పెట్టి ఇప్పుడు మేము నిన్ను సాదుడు మాతోని గాదు అనంగనే దుఃఖ మత్తాందా? మొగుణ్ణి గొట్టి మొర మొర మొత్తుకున్నట్టు నువ్వే ఏడ్సి మమ్ముల బద్నాం జేత్తానవా?అన్నాడు చాలా కోపంగా.

నాయ్నా ..!ఊకుండు.అన్నకు బాధయితాంది.ఈటన్నిటికి మూలం పైసలు లేక పోవుడే గదా!అవ్వే ఉంటే నిన్ను సుతం పువ్వుల్ల వెట్టుకొని చూసుకునేటోల్లె  గదా!ఆళ్ళకు మన మీద పావురం ఉండబట్టికనే ఇట్ల అనగలిగిండ్రు.ఇగ అన్ని మర్సి పోదం.పైటాళ్ళ దాటవట్టే.భోజనాలకు లేవుండ్రి అన్నది జాజులమ్మ.

బట్టల సెప్పు వెట్టి కొట్టినట్టే జేసి ఇప్పుడు మల్ల బువ్వ దినమంటానవా?మాకు ఇంటికాడ బువ్వ లేక నీ ఇంటికి రాలేదు.నీ లగ్గం ముచ్చట తేల్చుక పోను వచ్చినం.మంచి మర్యాదే చేసినవ్.ఇగ నీకో దండం నీ బువ్వ కో దండం.అని ముత్యం భార్య ముత్యంతో 

ఇంగ పారాదు.సెల్లే సెల్లే అని తండ్ల్లాడుతే మంచి మర్యాదే చేసింది.మల్ల గిన వచ్చేవ్!పా …అనుకుంటూ ఆయనను చెయ్యి వట్టి లేపి తీసుకపోవట్టింది.

ఇది చూసి అంజులు ,శివుడు కూడా వెళ్ళడానికి లేచారు.

జాజులమ్మ,పీరయ్య ఆశ్చర్య పోతూ చూస్తుండడం తప్ప ఏమీ చేయలేక పోయారు.

కొంచెం సేపటి వరకు ముగ్గురు అన్నలతో ,ముగ్గురు వదినలతో కళ కళ లాడిన ఆ గుడిసె ఒక్కసారిగా చిన్నవోయింది.

                                 ఎప్పుడు సంపద గలిగిన 

                                 అప్పుడె బందువులు వత్తురది రెట్లన్నన్ 

                                తెప్పలుగా చెరువు నిండిన 

                               కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ ..!

అన్న సుమతి పద్యం ఎప్పుడో చిన్నప్పుడు అయ్యగారు జెప్పింది ఇప్పుడు గుర్తుకు వచ్చి విరక్తిగా నవ్వుకున్నాడు. 

వండిన వంటంతా అలాగే ఉండి పోవడం తో జాజులమ్మ తమ వాడ చివరనుండే ముసలమ్మకని తీసుకు పోయింది.

ముసలమ్మకు అందరూ మనవలే.ఇద్దరు కొడుకులు దేశాలు వట్టుకొని పోతే ఎదురు చూసీ…. చూసీ….కోడళ్ళు సంతానాన్ని ముసల్దానికే వదిలేసి వాళ్ళ బతుకేదో మంచి గానో , చెడుగానో బతుకుతున్నారు.

జాజులమ్మకు కష్టం సుఖం చెప్పుకోను ఉన్న ఆప్త మిత్రురాలిలాగా ఆమెను భావిస్తుంది.అందుకే తనూ ,నాయ్నా తినగా మిగిలినదంతా గిన్నెల్లో సర్దుకొని ఆమె ఇంటికి చేరుకున్నది.

అవ్వా ..!అవ్వా..!అని పిల్సుకుంట గిన్నెలు దింపింది.

అవ్వా ..!ఈ పొద్దుకు నువ్వు ఏం వండకు.అన్నది.

దానికి ముసలమ్మ నవ్వుతూ …

ఏమే పిల్లా …కూడండకుంటే నేనేమి తిననూ …జాజీ …

మల్ల ..నీ మొగుడేమన్న నాకు సుత పెట్టేనా ..జాజీ ..

వయసు దాన్ని నిన్ను ..ముసలిదాన్ని నన్ను …కట్టుకొని వాడు 

ఏమైపోతాడే…జాజీ ..ఏట్లోకి దూకన్న దూకునేమోనే ..జాజీ ..

…………………………………………………………………..

……………………………………………………………………సరదాగా పాట అందుకుంది.

సిగ్గుల మొగ్గవుతూనే జాజులమ్మ ..

ఎహే ..!ఆపు .నీ పరాశికం.నేను బువ్వ,కూర మా గుడిసెల కెళ్ళి తెచ్చిన.ఇగో జూడు అని గిన్నెలు చూపించింది.

అప్పుడే కొలతలు మర్సినవా ?పిల్లా ..!ఏమిటికి ఇంతెక్కువ వండినవ్?అన్నది మళ్ళి నవ్వుతూ ముసలమ్మ.

మర్సుడు గాదు.మా ముగ్గురన్నలూ.ముగ్గురు వదినెలూ నన్నూ,మా నాయన ను చూడ వత్తె వండిన ,గని వాళ్ళు మల్లచ్చినప్పుడు తింటం  తీ ..!అని ఏగిరం ఏగిరం పోయిండ్రు.గందుకే నీకు తెచ్చిన.

పిల్లా..!తెస్తే సంబురమేగని ,నీ అన్నలు నిమ్మలంగనే పోయిన్డ్రా?మల్లత్తమన్నరా ?నాకైతే ఎందుకో నమ్మబుద్ధయిత లేదే!నువ్వేదో దాచి పెడ్తానవ్ అని పిత్తాంది.

ఏంది ?బిడ్డా ..!నా తోని సుత సేప్పుకోరానిదా !అన్నది చేతులను తనచేతుల్లోకి తీసుకుంటూ ఆప్యాయంగా.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.