తెలివైన మంత్రి

-ఆదూరి హైమావతి 

            అనగా అనగా అమరపురి అనే రాజ్యాన్ని  అమరవర్మ అనే రాజు పాలించేవాడు. అతనికి తనరాజ్యాన్ని విస్తరించాలనే ఆశపుట్టింది. యుధ్ధంచేసి పక్క రాజ్యాలను కలుపుకుని తానే  మహారాజు కావాలనీ, చుట్టుపక్కల రాజులంతా తనకు సామంతులుగా ఉండాలనే విపరీతమైన  కోరికతో నిద్రకూడా సరిగా పట్టకుండాపోయింది. ఆశమానవుని సుఖంగా ఉండనివ్వదు .

            ఒకరోజున మహామంత్రిని పిలిచి తనకోరిక వివరించి, యుధ్ధానికి కావలసిన సరంజామా, కొత్త సైనికులను చేర్చి వారికి శిక్షణనిచ్చి  సైన్యాన్నిరెట్టింపు చేయమని సైన్యధికారికి పురమాయించమని ఆజ్ఞాపించాడు.

            మహామంత్రి “ప్రభూ! మీకోర్కె బావుంది. ఐతే ప్రభూ! యుధ్ధంవలన జన నష్టం  కలుగుతుంది. ప్రజలంతా తమకు కలిగిన కష్టానికి తమవారు యుధ్ధంలో   మరణిస్తే వారికోసం దుఃఖిస్తూ , దానికి కారకులైన ప్రభువును దూషించి, ద్వేషిస్తారు. కురుక్షేత్ర యుధ్ధాన్ని ఒకమారు గుర్తుతెచ్చుకోండి ప్రభూ! యుధ్ధం తమకంత మంచిది కాదు ప్రభూ! మరోమారు ఆలోచించండి. ప్రస్తుతం మనరాజ్యం సుభిక్షంగా ఉంది. పంటలు సరిగా పండుతున్నాయి. రైతులంతా చక్కగా పండించుకుని ప్రభువులవారికి సక్రమంగా పన్ను చెల్లిస్తున్నారు. యుధ్ధం వలన ఖజానా ఖాళీ ఐతే ఆభారం  ప్రజలమీద పడితే వారు భరించలేరు. కొనితెచ్చుకోడమెందుకు ప్రభూ! ఆలోచించమని మనవి.” అని విన్నవించుకున్నాడు.

            ఆశ తనశ్రేయస్సుకోరే వారిమాటకూడా  విననివ్వదు. చెవులు , మనసు  మూసుకు పోతాయి. మంచి చెడుగా అనిపిస్తుంది.

            “మహామంత్రీ! మా ఆజ్ఞ పాలించండి, నీతులు చెప్పాలని చూడకండి.” అని లేచి అంతఃపురంలోకి వెళ్లాడు.

            చేసేదేమీలేక  మహామంత్రి సైన్యాధిపతితో ఆలోచించి ఇరువురూ కలసి పధకం ఆలోచించి రాజ్యమంతా చాటింపు వేయించారు.

            రాజ్యంలో యువకులంతా వచ్చి సైన్యంలో చేరాలనీ , నగర మైదానంలో అంతావచ్చి సైన్యాధికారి వద్ద పేర్లు నమోదు చేసుకుని, సైన్యానికి అవసరమైన శిక్షణ పొందాలనీ, రాజ్యంలోని కమ్మరులంతా వచ్చి కత్తులూ, శూలాలూ మొదలైన ఆయుధాలు మహారాజుకు తయారుచేసి ఇవ్వాలనీ, దానికి కావలసిన ముడియినుము తామే తెచ్చు కోవాలనీ , రాజ్యంలోని గుఱ్ఱాలు కలవారంతా వాటిని మహారాజుకు యుధ్ధంకోసం అప్పగించాలనీ ఇలా చాలా చాలా కావలసిన సామాగ్రికోసం  దండోరావేయించారు. 

            మహారాజుకు విషయమంతా విన్నవించారు మహామంత్రీ ,సైన్యాధిపతీ. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూడాలనీ, అప్పుడు ఏఏ రాజ్యాలమీద, ఎప్పుడు యుధ్ధానికి  వెళ్లవచ్చో నిర్థారించుకోవచ్చనే  ఆలోచన కలిగింది మహారాజుకు. నగరమంతా తిరుగుతూ అన్నీ చూసి సంతృప్తి చెందాడు మహారాజు.

            ఐతే మహామంత్రి “మహారాజా! మనం ముగ్గురం రాత్రులు మారు వేషాల్లో వెళ్ళి  నగర సంచారం చేస్తూ ప్రజల మనో భావాలు కూడా తెలుసుకుంటే మనం ఇంకా ఏఏ ఏర్పాట్లు ఎలా చేసుకోవచ్చో తమకు మనసుకు వస్తుంది.” అన్నాడు .

            ఇదీ బాగుందని భావించాడు మహారాజు.

            ఆరోజురాత్రి ముగ్గురూ మారు వేషాలు ధరించి నగరంలో కాలినడకన సంచరించసాగారు.

            ఒకచోట నడుస్తున్నవారిని చూసి ఒక మనిషి”  ఎవరయ్యా మీరు? మాదేశంవారా పొరుగువారా! ఈదేశం వారైతే వెంటనే వెళ్ళిపోండి మారుమూల గ్రామాలకు వెళ్ళి దాక్కోండి, బతికుంటే బలుసాకు తినైనా ఉండొచ్చు. మారాజ పరివారం చూస్తే మిమ్మూ సైన్యంలో చేరమని వెంటపడతారు. యుధ్ధంలో గెలుపు ఏరాజుదైనా చచ్చేది సైన్యమే. వారికేం వారు రాజభోగాలు అనుభవిస్తూ హాయిగా ఉంటారు. పరాయి దేశస్తులైతే వెళ్ళి మీరాజుకు యుధ్ధం వస్తుందని హెచ్చరిక చేయండి. వెళ్ళండి త్వరగా” అన్నాడు.

            మరో వీధిలో నడుస్తుండగా  ఇద్దరు మనుషులు మాట్లాడుకోడం వినిపించింది” ఇంత కాలం నాకు అవిటి వాడు పుట్టాడని దేవుడ్ని తిట్టుకుంటూ ఏడ్చేవాడిని. అది నాకు వరం అని ఇప్పుడు తెలిసింది. నీ కొడుకు అన్ని అవయవాలతో ఉన్నాడని నన్ను హేళన చేశావు. చూడూ సైన్యంలో చేరాడు వెళ్ళి. యుధ్ధంలో  బతికి బయటపడి ఇల్లు చేరతాడో  లేదో. దేవునికే తెలుసు.అవిటి పిల్లలే మనకు దక్కుతారని తెలిసింది. నేనే అదృష్టవంతుడ్ని” అనుకోడం విన్నారు.

            ఒకచోట  ఒక కమ్మరి ఇంట్లో “ఇదేం రాజయ్యా! ఇంత రాజ్యకాంక్ష ఎందుకు? ఉన్నది చాలదా! మనబతుకు తెరువుమానుకుని ఈ ఆశపోతుకు కత్తులు చేసి ఇస్తున్నాం. ఈపాపం మనలనూ కట్టి కుదుపుతుంది. ఈ రాజ్యంలో ఉండటం మనఖర్మ. రాజ్యంకోసం యుధ్ధం చేసిన కౌరవులేమయ్యారు? వందమందీ చావలేదా . మనరాజు మాత్రం  యుధ్ధంలో బతికి తిరిగొస్తాడా!”

            “పోతే మేలే. మళ్ళా ఇట్టాఎవరూ చేయరు. ఛీ యదవ ఆశ.” అన్నది  అతనిభార్య..

            ఇలా ఎక్కడికెళ్ళిన అక్కడ తమ బిడ్డలంతా యుధ్ధంలోకి వెళ్లాల్సి వచ్చిందని బాధ పడే తల్లులూ, తండ్రులూ. వారి మానసికబాధ, వారంతా ఇప్పుడే తనను దూషించడం. రాత్రంతా  విన్న మహారాజు ఇంటికొచ్చి అంతఃపురంలో పడుకోగానే వారి మాటలన్నీ మనస్సులో మెదిలి తన ఆశకు ఎందరు బలైపోతారో !’ అనే ఆలోచన వచ్చింది.

            తెల్లారగానే  మహామంత్రిని పిలిచి ‘తనమనసు మార్చుకుంటున్నాననీ ,సైన్యంలో కొత్తగా చేరిన  జనమంతా హాయిగా ఇళ్ళకెళ్ళి పూర్వం వృత్తులు చేసుకుంటూ బతకొచ్చని’ ప్రకటించమని కోరాడు.

            మహామంత్రి  రాజాజ్ఞను  అలా దండోరావేయించాడు. తమ పధకం  ఫలించినందుకు మహామంత్రి, సైన్యాధిపతీ సంతోషించారు. తెలివైన వారు రాజోద్యోగులుగా ఉంటే రాజ్యం శుభిక్షంగా ఉంటుంది.  అలా యుధ్ధ మేఘాలు విచ్చిపోయి అంతా  ఊపిరి పీల్చుకున్నారు.

         *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.