“కొత్తస్వరాలు”

దాసరి శిరీష కథలు

   -అనురాధ నాదెళ్ల

          దాదాపు నాలుగు దశాబ్దాల కాలంలో రచయిత్రి శిరీష రాసిన కథలను ఎంపిక చేసి ‘’కొత్త స్వరాలు’’ కథా సంపుటిని 2018 లో తీసుకొచ్చారు.

          ఇందులో కథలన్నీ మనవీ, మనతోటివారివీ. ఆమె పరిశీలన, సహానుభూతి ఈ కథలను రాయించాయి. చుట్టూ ఉన్న మనుషులని, వాళ్ల చిన్న, పెద్ద సంతోషాలనీ, ఆశలనీ, దుఃఖాలనీ, అసంతృప్తులనీ గమనిస్తూ జీవితం వ్యక్తులు కోరుకున్నట్టు ఎందుకుండదు అని దిగులు పడతారు రచయిత్రి. జీవితంలో ఎదురయ్యే అనేకానేక అనుభవాల్ని స్వంతం చేసుకునే క్రమంలో సున్నితత్త్వాన్ని కోల్పోయే పరిస్థితులు ఎందుకుండాలి అని ఆమె ప్రశ్న. అయితే ఏ సమస్యనుంచీ, బాధ్యత నుంచీ కూడా తప్పించుకోమని చెప్పరు. వాటిని సరళంగా, సామరస్యంగా, స్నేహంగా ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నామనే వేదన ఆమె కథల్లో కనిపిస్తుంది. రచయిత్రి సమాజం పట్ల తనకున్న ఆలోచన, ఆరాటాల్నిఈ కథల్లోసహజంగా వ్యక్తీకరించిన తీరు ప్రశంసనీయం.

          ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు తక్కువగా ఉన్న వారికోసం ఏదైనా చెయ్యాలన్న ఆలోచనతో యాభైఏళ్ల వయసులో చేస్తున్నఉద్యోగాన్నివదిలేసారు శిరీష గారు. వెసులుబాటు లేక భవిష్యత్తులోకి నడిచేతమ చిన్నారులను పట్టించుకోలేని తల్లిదండ్రులకు ఆసరాగా ఒక చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ఆ పిల్లల్ని పోగుచేసి, బుజ్జగించి చదువుకోవటం ఎంత అవసరమో, అది జీవితాల్ని ఎలా వెలిగిస్తుందో తెలియజెప్పటంతో తన ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. వారికి ‘’ఆలంబనై’’ చదువుతో పాటు మంచిచెడులను నేర్పుతూ, ఆకలి తీరితేనే చదువు నేర్చుకోగలరని గ్రహించి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రారంభించారు. ఆ పనిలోని నిజాయితీ ఎంతో మందిని ‘’ఆలంబన’’కు దగ్గరచేసింది. రెండు దశాబ్దాలు పైగా ఆమె నడుపుతున్నఈ బడి ఎంతో మంది చిన్నారులకు భవితనిస్తూ వస్తోంది. అనారోగ్యంతో పోరాడుతూ చివరి వరకూ కూడా తనకు సంతోషాన్ని, బలాన్ని ఆ చిన్నారుల నుంచే పొందిన మానవతావాది ఈ రచయిత్రి. ఆమె ‘’ఆలంబన శిరీష’’ గా ప్రపంచానికి మరింత దగ్గరవుతూ వచ్చింది. కథల్లోకి వెళ్లేముందు ఈ పరిచయం తప్పనిసరి అనిపించింది.

కథల్లోకి వెళ్తే…

          కథా వస్తువులన్నీ మనమధ్య జరుగుతున్న సంఘటనలే. మనకు ఎదురయ్యే సన్నివేశాలే. కథలు కావివి. జీవన శకలాలే అని అర్థమవుతుంది చదువరికి.

          ఈ సంపుటిలో 17 కథలున్నాయి. కథలన్నీ కాలక్షేపానికి కాక సమస్యలపట్ల ఆవేదనతో రాసినవే.వాటి పట్ల బాధ్యతగా సానుకూల దృక్పథంతో పరిష్కారాల్ని సూచించాయీ కథలు.

          చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీ, పురుషులు తామిద్దరూ సమాన ప్రతిభ, వ్యక్తిత్వం కలవారని ఒప్పుకుంటారు. కానీ,చాలా విషయాల్లో పురుషుడికున్న వెసులుబాటు లేక తనను తాను కేవలం ఇంటిపనికి, ఉద్యోగానికి, పిల్లల బాధ్యతకి కుదించుకోవలసి వచ్చినప్పుడు స్త్రీ పడే మానసిక వేదనను ప్రతిఫలించేవి కొన్ని కథలు. తన అభిరుచులకనుగుణంగా జీవించే అవకాశంలేక నలిగిపోయే పాత్రలను చూస్తాం. భర్తతో పాటు తనకూ తనవైన ఇష్టాలుంటాయని, వాటిని గుర్తించి, కుటుంబం సహకరించాలని కోరుకునే స్త్రీ పాత్రలు చూస్తాం. అలాటి సందర్భంలోనూ నిశ్శబ్దంగా తన ఒత్తిళ్లను తానే ఎదుర్కొంటూ ఒక్కోసారి తన సమస్యలను భర్త దృష్టికి, ఆలోచనకు తీసుకువచ్చే ప్రయత్నం చూస్తాం. స్త్రీ వాదం గురించి రచయిత్రి నినాదాలు చెయ్యరు. సూటిగా ఏది అవసరమో మాత్రమే చెబుతారు.

          ‘’దారి ఎటు?’’ కథలో తనకున్న ఆర్థిక ఇబ్బందులను పెద్దగా పట్టించుకోకుండా ఇంటిని బాధ్యతగా చూసుకునే భార్య కావాలని పెళ్లిచూపుల్లో చంద్రం చెబుతాడు. నళిని చేసే ఉద్యోగం వదులుకోవలసి వచ్చినా కట్నకానుకలు ఆశించని అతని మంచి మనసుకు ఒక మధ్య తరగతి ఆడపిల్లగా సర్దుకుంటుంది. తన పిల్లల్నిద్దర్నీ బాగా చదివించి, వాళ్లు ఉద్యోగాల్లో స్థిరపడటం గర్వంగా చూసుకుంటాడు చంద్రం. కూతురుకు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పెళ్లికొడుకు అక్కడి వేగవంతమైన జీవన విధానంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగంలో మునిగిపోతే జీవితంలో ఎన్నో పోగొట్టుకోవలసి వస్తుందని, తన భార్య ఉద్యోగం చెయ్యకూడదని చెబుతాడు. ఉన్నత చదువులు చదివిన కూతురు కెరియర్ వదులుకోవటమా అని చంద్రం ముందు కోపం తెచ్చుకుంటాడు. కానీ అవసరమైన నాడు తన చదువు ఎటూ తనకి దారి చూపిస్తుందని చెప్పి,పెళ్లికి అంగీకారం తెలిపిన కూతురి అవగాహన, ఆలోచన అర్థం చేసుకుంటాడు.

          ‘’లాహిరి’’ కథలో ఆర్థికంగా బావుంటుందని భర్త ఆమెను ఉద్యోగంలో ప్రవేశ పెడతాడు. తన పాటను చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను తను పాట పాడుకునే తీరిక లేకుండా చేసాడని బాధ పడుతుంది. కొడుకు పుట్టాకైనా దగ్గరుండి ఆలనాపాలనా చూసుకోవాలని, చక్కగా చదివించుకోవాలని అనుకున్నా ఆమెకు సాగదు. పసి వయసులోనే స్కూళ్లల్లో వేసి ఉద్యోగాలకు పరుగెడుతున్న జీవితాలని చూసి దుఃఖపడుతుంది. వృద్ధాప్యంలో తనకు చేతనైనంత సాయాన్ని చుట్టూ ఉన్నవారికి చెయ్యాలన్న ఆశతో కూలీ పనులకెళ్లే వారి పిల్లలను చదివించటంలో సంతృప్తిని పొందుతుంది. కొడుకు ఆమె ఆలోచన సమర్థిస్తాడు.

          ‘’నాకూ కావాలి’’ కథలో భార్యాభర్తలిద్దరికీ తమవైన అభిరుచులున్నాయి. అతను తనకు పాట పట్ల, కళ పట్ల ఉన్న ప్రేమని కొనసాగించుకోగలిగినా ఆమె మాత్రం ఉద్యోగం, ఇంటి బాధ్యతల మధ్య తన అభిరుచులకు దూరంగా జరగవలసి వస్తుంది. అతను తన పాట రిహార్సల్స్ కి వచ్చి కమ్మగా పాట నేర్చుకునే స్త్రీ ఆలస్యంగా రావటాన్ని సానుభూతితో అర్థం చేసుకుంటాడు. ఆడవాళ్లకి ఇంటి బాధ్యతలుంటాయి కదా, ఆలస్యం అవకతప్పదన్నట్టు మిగిలిన ట్రూప్ లో వాళ్లకి నచ్చజెపుతాడు. కానీ భార్య ఆఫీసులో డ్రామా రిహార్సల్స్ కారణంగా ఆలస్యంగా ఇంటికి రావటం, వంట, పిల్లల బాధ్యత పట్టించుకోలేకపోవటాన్ని సహించలేకపోతాడు. భార్య తన జీవితంలో అభిరుచులకు చోటు కావద్దా అని సూటిగా అడిగినప్పుడు,‘’నిజమే, పురుషునితో సమానంగా చదువు, ఉద్యోగం, ఆలోచన ఉన్న స్త్రీ స్వంత అభిరుచులకు దూరంగా ఉండాలనటం న్యాయమేనా’’ అని ఆలోచనలోపడతాడు. భార్యాభర్తలిద్దరూ పరస్పరం అర్థం చేసుకుని ఒకరి ఎదుగుదలకి ఒకరు సహకరించాలన్న భావంతో ఉండే సంసారాలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.

          ఈ సంపుటిలో మరొక ముఖ్యమైన కథావస్తువు పిల్లల చదువులపట్ల మధ్యతరగతి తల్లిదండ్రుల ఆలోచనలు, మితిమీరిన అంచనాలు, అవి పిల్లల మీద పెట్టే ఒత్తిడి. పెద్దలు సంపాదన కోసం పరుగులు పెడుతుంటే వారుపిల్లలతో సామరస్య పూర్వకంగా, స్నేహంగా,సన్నిహితంగా ఉండే సమయంలేదు. చదువుకొమ్మనటం మినహా కుటుంబపరంగా ఎలాటి ప్రేమ, ప్రోత్సాహం అందని పిల్లలు మానసిక వేదనతో, ఒంటరితనంతో చదువుల పట్ల విముఖంగా, నిరుత్సాహపూరకంగా తయారైతే తప్పెవరిది? ఈ పోటీలు ఎవరి మధ్య, ఎలా మొదలయ్యాయి? వాటికి అంతు ఎక్కడ? ఎల్ కేజీ సీటు నుంచి ఎమ్సెట్ వరకు, ఆపైన అమెరికా కలలు ఫలించేవరకు పిల్లలు తల్లిదండ్రుల ఆశల్ని నిజం చేసే బాధ్యతను ఎలా మోయగలరు? అది న్యాయమేనా?

          ప్రసిద్ధ వర్తమాన కవి శివశంకర్ ”పెంపకం’’ కవితలో చెప్పినట్టు…

          ‘’పెద్దగా నేర్పిందేమీ లేదు

          పలక మీద దయ అనే రెండక్షరాలు రాసి దిద్దించాను

          అమ్మ ఆకాంక్ష లాగానో నాన్న నమ్మకంలాగానో కాకుండా

          మీరు మీకు మల్లేనే జీవించమనికోరాను…’’

          అలాటి అవకాశం, అనుభవం పిల్లలకి ఇస్తున్నామా అని తల్లిదండ్రులు తమని తాము ప్రశ్నించుకోవాలి.

          చదువులు జీవితం పట్ల ప్రేమను, అవగాహనను పెంచేవిగా కాకుండా ఏం నేర్పుతున్నాయి? చదువుల ఫలితం పెద్ద ఉద్యోగాలు, సంపాదనే అయితే జీవితానికి నిర్వచనం ఏమనిచెబుతాం? పరీక్ష పేపర్ అవుటైందంటే దానికోసం తాపత్రయపడి పిల్లల కందించే తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఎలాటి విలువలు నేర్పిస్తున్నారో వారికే తెలియదు. ప్రస్తుత సమాజంలో ఒక జాడ్యంగా మారిన ఈ పోటీవిధానం పట్ల రచయిత్రి ఎంత ఆవేదన చెందుతూ రాసేరో ‘’అల’’ కథచెబుతుంది.

          ‘’స్మృతులు వదలవు’’ కథలోని స్త్రీ ఒకరాత్రి బస్సు ప్రయాణంలో తనకు అరుదుగా దొరికిన ఏకాంతాన్ని మనసుకు నచ్చిన పాత స్మృతుల మధ్య ఇష్టంగా గడుపుతుంది. జీవితం ఆఖరి మజిలోలో ఉన్న ఆమె చిన్ననాటి తన ప్రేమను, ఆ అనుభూతిని ఇచ్చిన వ్యక్తిని మరచిపోలేక పోతుంది. పెద్దలు చేసిన పెళ్లిని కాదనలేని చిన్నవయసు. ఆర్థిక పరమైన లెక్కలు, సంపాదన మినహా ప్రేమ భావన, భావుకత అర్థం కాని భర్తతో జీవితాన్ని గడిపేయటాన్ని తలుచుకుని నిట్టూరుస్తుంది.

          వెనుకబడిన తరగతులనుండి వచ్చినవారు ఆర్థికంగా, సామాజికంగా వివక్షలు ఎదుర్కుంటూనే రిజర్వేషన్ల సహాయం లేకుండా ప్రతిభతో జీవితాల్లో గెలుపును రుచి చూసి తమ నిజాయితీని చాటుకోవటం ‘’కొత్త స్వరాలు’’ కథలో చూస్తాం. కానీ ఆ ఆదర్శం ఎంతో కాలం నిలవదు. గెలుపు మెట్లు ఎక్కి పైకి వెళ్లే కొద్దీ తమను అణచివేసిన అగ్ర కులాల పట్ల ద్వేషం, తమవారి పట్ల నిరాసక్తత మొదలై తమకంటూ ఒక ప్రత్యేకమైన గిరి గీసుకునే వర్గంగా తయారవటం కనిపిస్తుంది. పైగా కష్టంలో సాయం కోరి వచ్చినవారి పట్ల సహానుభూతి లేకుండా ఎలా అవినీతికి పాల్పడతారో చెబుతుందీ కథ. వెనుకబడిన వారమనే న్యూనతతోనో, అగ్రకులాల పట్ల అసహనం తోనో కాక అందరితో మమేకమై తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవచ్చుకదా అన్నది రచయిత్రి ఆలోచన.

          ప్రతి సమస్య పట్లా రచయిత్రి తన ఆలోచనలు సున్నితంగా, బలంగా చెబుతూ, ఆదర్శవంతమైన పరిష్కారాన్ని సూచించటం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రాపంచిక అనుభవాలు ఆమెకు జీవితం మీద కచ్చితమైన అభిప్రాయాలను కలిగించాయి. ప్రతి కథలోని అంశం తన కళ్ళముందున్న జీవితాల్లోనివే.

          ఉద్యోగ జీవితం, నగర జీవితపు ఒత్తిళ్లు మనిషిలోని సహజత్వాన్ని దూరం చేసి, దైనందిన జీవితాన్ని యాంత్రికం చేసి జీవితాన్ని ఎలా నిస్సారం చేస్తాయో కొన్ని కథల్లో చెబుతారు. ఒక్కసారి తీరిక చేసుకుని తాము పుట్టి పెరిగిన పల్లె మూలాల్లోకి, అమ్మ, పెద్దమ్మల సామీప్యానికి వచ్చి బాల్యానుభవాలను మళ్లీ మళ్లీ తలుచుకుంటూ, తాముపోగొట్టుకుంటున్న దేమిటో తెలుసుకుని జీవితాల్లో మార్పులు చేసుకోవాలన్న ఆలోచన చెబుతాయి‘’పరిభ్రమణం’’, ‘’నువ్వూ నేనూ ప్రకృతి’’ కథలు. వేగవంతమైన జీవితంలోంచి తరచుగా ఇలాటి ప్రయాణాలు చెయ్యటం, ఆప్తులను, స్నేహితులను పలకరించి సేదదీరటం అన్నది ఆమెకున్న అందమైన అలవాటు. ఆమె సన్నిహితులందరికీ ఇది తెల్సున్నదే.

          రచయిత్రితో పరిచయమున్నఎవరికైనా ఆమె సున్నిత స్వభావం, భావుకత, ఎదుటిమనిషి కష్టసుఖాలను గ్రహించి సాయం అందించాలన్న తాపత్రయం సులభంగానే తెలిసిపోయాయి. ఎందరు రచయితల్ని చదివినా ఈ రచయిత్రినాకు ప్రత్యేకం. ఎందుకంటే ఒక రచయిత్రిని వ్యక్తిగతంగా కలుసుకోవటం నాకు శిరీషగారితోనే మొదలు. ఆమె సీరియల్ చదువుతూ రాసిన ఉత్తరానికి జవాబిచ్చి, అంతలోనే వెతుక్కుంటూ ఇంటికొచ్చిన వ్యక్తి శిరీష గారు. ఆ అనుభవం మూడు దశాబ్దాలైనా ఇంకా తాజాగానే ఉంది. కానీ తియ్యనిపాటలాటి స్నేహాన్నిపరిచయంచేసినఆమెఇప్పుడులేరు. అందంగా జీవించటం అనే కళ అందరికీ సాధ్యంకాదు. అలా జీవించి చూపించారు. ఎందరికో మార్గదర్శకులయ్యారు.

          అనుకున్నవి కాలేదనే అసహనాలతోనో, ఎదురయ్యే సమస్యలపట్ల ఫిర్యాదులతోనో జీవితపు మాధుర్యాన్నికోల్పోయేవాళ్లేఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ శిరీష వీటన్నింటికి అతీతురాలన్నట్టు ఉండేవారు. తల్లి పరిపూర్ణగారి పెంపకంలో చుట్టూ ఉన్న జీవితాల్లో కనిపించేలోటుపాట్లను అర్థంచేసుకోగలిగేనేర్పు ఆమెకి చిన్న వయసులోనే పట్టుబడింది. సాహిత్యంతో సహచర్యంచేస్తూ మంచిచెడుల విచక్షణనూ, సహజమైన సంస్కారాన్ని అలవరచుకున్న ఆమెబాధ్యత గల రచయిత్రిగాపేరుతెచ్చుకున్నారు. ఉద్యోగం ఇచ్చిన ఆర్థిక స్వాతంత్రాన్నివిలాసాలకో, స్వంత అనుభవాలకో ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. ఆమెకున్న వ్యసనం స్నేహం. ఎక్కడెక్కడివారినీ తన స్నేహంతో దగ్గర చేసుకున్నారు. ఆమెను సుదీర్ఘకాలంచూసి, ఆ స్నేహమాధుర్యాన్ని అనుభవించిన నేను ఈ పుస్తక పరిధిని దాటి ఆమె గురించి ఈ నాలుగు మాటలూ రాయకుండా ఉండలేక పోతున్నాను. మనం పోగొట్టుకున్నదేమిటో అర్థం అయ్యేందుకు, మానసికంగా అంగీకరించేందుకు కూడా ఎంత సమయం పడుతుందో?! బహుశా జీవితకాలం!

****

Please follow and like us:

2 thoughts on ““కొత్తస్వరాలు” దాసరి శిరీష పుస్తక సమీక్ష”

  1. దాసరి శిరీష గారి కధల సంపుటి మీద సమీక్ష బావుంది. ముఖ్యంగా “దారి ఎటు”,”నాకు కావాలి” కధలు చక్కగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published.