కొత్త అడుగులు – 29

లావణ్య సైదీశ్వర్

– శిలాలోలిత

            కవయిత్రి లావణ్య సైదీశ్వర్ —నల్గొండలోని ‘హాలిమా’లో పుట్టి పెరిగింది. అమ్మా, నాన్నలు సరస్వతి యాదగిరి గార్లు. వీరు స్వంతంగా స్కూల్ నడిపేవారట. తల్లిదండ్రుల తోడ్పాటే కాక,పెళ్లయ్యాక కూడా ప్రోత్సాహం,స్వేచ్ఛ ఉండటం వల్ల లావణ్య రచనా వ్యాసంగం కొనసాగింది.

            కవిత్వమంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. చాలా ఎక్కువగా పుస్తకాలు చదవడం వల్ల ఎందరెందరి జీవితాలో ఆమె మనస్సులో నిక్షిప్తమైపోయాయి. జీవితాన్ని అనేక పార్శ్వాలను దగ్గరగా మనకు చూపించేది పుస్తకం అని ఆమె భావన. శ్రీశ్రీ, తిలక్, వరవర రావు, శివసాగర్, అల్లంరాజయ్య, బండి నారాయణస్వామి రచనలు తనెంతగానో ఇష్టపడతానని, తననెంతో ప్రభావితం చేశాయని ఉత్సాహంగా చెప్పింది.

            కవిత్వమంటే ఎందుకిష్టం అంటే, స్కూల్ రోజుల్లో నోటీస్ బోర్డ్ మీద రచనలు పెట్టేవారట. హెడ్మాష్టర్ ఎంతో ప్రోత్సహించేవారట. తను కూడా కవితలు రాసిపెట్టి, నా పేరు చూసుకొని మురిసిపోయేదాన్నంది. సరదాగా రాసానే గానీ సీరియస్ గా రాయడమెలాగో తెలవలేదంది. విస్తృతమైన సాహిత్య అధ్యయనం ద్వారానే  తాను ఎదగడానికి ప్రయత్నిస్తున్నానంది.

            అలా ‘హంసధ్వని’ శీర్షిక తో మొదలైంది. 2015లో వాట్సప్ గ్రూప్ లో ఫ్రెండ్ ద్వారా రాయడం మొదలు పెట్టింది.   టాపిక్ యిస్తే కవితలు రాయడమన్నది కొనసాగింది. ఆ తర్వాత ఒక ఏడాదిన్నర తర్వాత కవి ‘బిల్లా మషీందర్’ గారి ద్వారా ‘కవి సంగమం’లో జాయిన్ అయ్యింది. అప్పుడే కవిత్వమంటే ఎంత సీరియస్సో, ప్రత్యక్షంగా తెల్సిందట. కాలమ్స్ చదువుతూ, కామెంట్లు పెడ్తు సుమారు ఒక ఏడాదిపాటు గమనించి తను కూడా పోస్ట్ పెట్టడం మొదలుపెట్టిందట.

            నాది కవిత్వమా కాదా అని డోలాయమానంగా వుండే నాకు   ‘కవి సంగమం’ ఆత్మవిశ్వాసాన్నిచ్చింది .

            2015 లో నా తొలి పుస్తకం ‘కలం సవ్వడి’ వేసాను . దీనిలో లోపించిన కవిత్వం, గాఢత నాకు స్పష్టంగా తెలిసాయంది. ప్రస్తుతం రెండవపుస్తకం పేజ్ ఆలోచనలో వుంది. ఇటీవల ‘రాధేయ’ పురస్కారం లభించడం కూడా ఆమె పరిణత కవిత్వానికి మచ్చుతునక.

            ఒక మొగ్గదశనుంచి క్రమక్రమంగా ఎదుగుతున్న రీతిలోనే లావణ్య కవిత్వ ప్రయాణం సాగింది. 

బందిఖానా

నిర్భందగది లాంటి లోకం

ఇనుప ఊచలపైన

సార విహీనమైన చేతివేళ్ళు

ఉక్కుపిడికళ్లు గా మారటం

గమనిస్తూనేవున్నాను.

మసక బారిన ఫైబర్ గ్లాసు గోడల మీద

రెక్కలు విప్పుతున్న విశ్వంభర

పక్షిఛాయను కళ్ళార్పకుండా చూస్తూనేవున్నాను.

            చాలా పొడవైన బతుకంత కవితఇది. లావణ్య కవిత్వ తృష్ణ నిండిన కవిత. రాతి గోడల వ్యవస్థ ముఖంపై/విసిరే ప్రశ్నల కొత్త వడిసెలరాలు ఈ నేలపై దొరక్కపోదు / హక్కులకోసం కాలం పడుతున్న ప్రసవవేదనలోంచి చైతన్యం పుట్టకపోదు. నాకిప్పుడు బందిఖానా లోంచి విముక్తం కావాలని వుంది అంటుంది. అలాగే ‘సిగ చుట్టుకున్న రాత్రి’  కవిత కూడా కవిత్వ గాఢతను నింపుకున్న కవిత. అక్కడక్కడా కొన్ని కవితావాక్యాలు—‘సొమ్మసిల్లిన ఆకలి ఇంకా మెలకువ గానే వుంది’ / చివికిన పాత ఇంటి గోడల్లాంటి ఆశలను / అరికాళ్ళలో చిదిమేసిన నేల / కళ్ళకు కనబడటం లేదు / కాటి కాపరి చేతి కర్రతో ఎగదోస్తున్న ఈ రాత్రి నిప్పు ఆరట్లేదు / తడిసిపోయిన తనవాళ్ళ కోసం / వొణుకుతున్న గుండెతో మెలకువగానేవుంది. ఈ రోజు ‘కవిసంగమంలో’ ‘వంశీకృష్ణ’ ప్రతిభానందకుమార్ కవిత్వం గురించి రాశారు. ప్రతిభకు లావణ్యకు కొంచెం దగ్గరి పోలికలున్నాయనిపించింది. ప్రతి తరమూ తమదైన స్వంత భాషను సృష్టించు కోవాలనుకున్నారు. నీకంటూ ఒక భాష లేకుండా, ఒక భావ వాతావరణం లేకుండా కవిత్వమెలా కవులు రాయగలరు అని ప్రశ్నించారు. లావణ్య కూడా ఇలా తన కవిత్వాన్ని తాను తెరిచి చూసుకుంటూ, మారడానికి, ఎదగడానికి చేసే ప్రయత్నమే ఈ కవిత్వం. సద్విమర్శ తనకు తాను చేసుకునే నిజాయితీ పరుల పంచనే కవిత్వముంటుంది .

            త్వరలో రాబోతున్న లావణ్య పుస్తకంలో అలాంటి కవితలు, కొత్త చూపుతో మనముందుకు రాబోతోంది. అందరం త్వరలో చదువుదాం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.