వెనుతిరగని వెన్నెల(భాగం-33)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే చదువుతూ ఉంటుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. తన్మయి స్థానిక రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగానికి కుదురుకుంటుంది.

***

            “తనకి జే. ఆర్ ఎఫ్ వచ్చింది“. మెట్ల మీద కూలబడి ఆనందాతిరేకపు దు:ఖంలో కన్నీరు మున్నీరైన తన్మయి మీద ఆశీస్సుల జల్లుల వాన కురిపించసాగింది ఆకాశం. లిస్టులో ఉన్న తన పేరుని చూసి తన్మయి తన కళ్లని తనే నమ్మలేక పోతూంది

            ఓటమి పేరుకుపోయిన దు:ఖం తాలూకు వ్యథపు పొరలు అన్నీ ఒక్కొక్కటిగా కరిగిపోతున్నట్లు  మనసు బాగా తేలికపడసాగింది

            “ఎమ్మే మొదటి సంవత్సరంలో చేరినప్పుడుతెలుగు ఎమ్మే చేసి ఏం సాధిస్తారు?”  అన్న లెక్చరర్  నిరుత్సాహపూరిత మాటలు జ్ఞాపకం వచ్చేయి

            నిర్దాక్షిణ్యంగా తనని వదిలి వెళ్తూ శేఖర్ చూసిన నిర్లక్ష్యపు చూపు గుర్తుకొచ్చింది. భయంతో ఏడుస్తూ తన కంఠాన్ని కౌగిలించుకున్న బాబు గుర్తుకొచ్చేడు

            రోజు మొత్తం మ్మీద ఒకే ఒక్కటీతాగి,  పిచ్చి పట్టినట్లు రాత్రీ పగలూ చదువుతూతనలో తను మాట్లాడుకుంటూ, ఒకానొక ధ్యానంలో నడిచిన రోజులన్నీ కళ్ళ ముందు గిర్రున తిరిగేయి.

            వెనక నించి వచ్చి కళ్ళు మూసిన అనంత చప్పున ముందుకొచ్చిఏవిటీ, ఏడుస్తున్నావా? పిచ్చిపిల్లా, రిజల్టు చూసేవా అసలు, నీకు జే. ఆర్ ఎఫ్ వచ్చింది. ఇక మీదట నీకు నెలకు ఏడువేలు స్కాలర్ షిప్పు వస్తుంది. బాబుతో కలిసి దర్జాగా బతకొచ్చు తన్మయీ!” అంది భుజాలు పట్టుకుని కుదుపుతూ

            ఇంకా దు:ఖంలో నించి తేరుకోలేక పోతున్న తన్మయి కళ్లు తుడుస్తూ , ఇలా చూడునువ్వు గెలిచావుకాదు ..కాదు.. పురుషుడు శతవిధాలా ఓటమిపాల్చేయాలని చూసినా, మొక్కవోని దీక్షతో నిలబడ్డ స్త్రీ గెలిచింది.” అంది దృఢంగా

            మెట్ల కింద రాజు, దివాకర్, కరుణ కనిపించారు

            “కరుణకి, మాకూ లెక్చరర్ షిప్పు వచ్చింది. స్కాలర్ షిప్పు రాకపోయినా పీ.ఎచ్.డీ   లో జేరడానికి, బయటెక్కడైనా లెక్చరర్లగా పనిచేయడానికి అర్హత వచ్చినట్లేమా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. మొదటి సారి రాసిన వాళ్ళెవ్వరికీ లెక్చరర్ షిప్పు రావడం కూడా కష్టమట, తెలుసా! ” అంది పక్క నించి అనంత

            ప్రశంసా పూర్వక  నవ్వుతో చేతులూపేరు రాజు, దివాకర్.  తనకి రాని జే. ఆర్ ఎఫ్ తన్మయికి వచ్చినందుకు జీర్ణించుకోలేనట్లు కరుణ ముఖం కంద గడ్డ లా ఉంది. తన్మయి వైపు చూడలేనట్లు చప్పున కళ్ళు దించుకున్నాడు.

            లెక్చరర్ షిప్పు కూడా రాని దివాకర్ మనస్ఫూర్తిగా నవ్వుతూమీగెలుపు మ్మమనందరిదీ”  అన్నాడు.

            అందరి కంటే ఎత్తుకి ఎదిగిన అతనికి రెండు చేతులూ ఎత్తి నమస్కరించింది తన్మయి.

            సంతోషంతో తన్మయిని అనంత కేంటీన్ వైపు లాక్కెళ్తూ “అవును దివాకర్ చెప్పింది కరెక్టుఇది మనందరి విజయం. ఇవేళ మనందరికీ పండుగ రోజు.” అంది.

            “టీ బిల్లు నేనిస్తానుఅన్నాడు రాజు

            అన్నట్లు నీకో మంచి విషయం చెప్పాలి తన్మయీ. “మీ వివేకానందా పాఠశాలలో నాకూ, రాజుకీ ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. ఇది గనక వస్తే మా జీవితాలు సెటిల్ అయినట్లే. రెసిడెన్షియల్ గాబట్టి దిగులూ లేదు. ఉన్న ఊళ్ళో ఉద్యోగం గాబట్టి  పీ.ఎచ్.డీ నిశ్చింతగా పూర్తి చేసుకోవచ్చు.” అంది అనంత.

            “న్నాన్నాకు కూడా ఏదోటి చ్చు..చూడండి. వచ్చేస్తాను అన్నాడుదివాకర్.

            “బాయ్స్ హాస్టల్ లో వార్డెన్ పోస్టు కి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మీకిష్టమైతే నేను మిమ్మల్ని రికమండ్ చేస్తానుమీకు తప్పక ఉద్యోగం వస్తుంది అందితన్మయి మనస్ఫూర్తిగా

            సంతోషంగా తలూపేడు దివాకర్.

            “మరింకేం, అందరం ఒక చోటే ఉందాం.” అని కరుణ వైపు ప్రశ్నార్థకంగా చూసింది అనంత

            అప్పటికి కాస్త తేరుకున్నట్లు  బలవంతంగా చిన్న నవ్వు నవ్వి, “నాకు మరో ఆర్నెల్లు చెట్టు కింద సహవాసమే శరణ్యం. జే. ఆర్ ఎఫ్ మళ్లీ రాసి, సాధిస్తాను.” అన్నాడు పట్టుదలగా కరుణ.

            అతని పట్టుదల నిండిన మాటలకి ప్రశంసా పూర్వకంగా చూస్తూ, “మీరు తప్పక సాధిస్తారుఅంది తన్మయి.

            అప్పటి వరకూ జీవితంలో బాధలూ, దు:ఖాలూ తప్ప సంతోషాన్ని  చవి చూడని తన్మయి మనసు దూది పింజలా తేలికగా మారిందాసమయానికి.

            ఆ చెట్టు కింద అప్పటి వరకూ ఎన్ని సార్లు కూచున్నా కలగని గొప్ప శాంతి కలగసాగింది. అప్పటి వరకూ ఉన్న మబ్బు తొలగి ఆకాశం కాంతివంతంగా మారింది.

            తలెత్తి చుట్టూ ఉన్న ఎత్తైన చెట్ల మధ్య నించి సూటిగా పడ్తున్న సూర్య కిరణాల వైపు చూసి మనస్సులోనేధన్య వాదాలు మిత్రమా!  ధన్య వాదాలుఅంది.

            అనంత తన్మయి వైపే తదేకంగా చూస్తూ  దగ్గిరికి వచ్చి అబ్బా తన్మయీ! నీ  ముఖం ఎంత తేజస్సుతో వెలిగిపోతుందో! చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది. ఇక తిరుగులేదు నీకు జీవితంలో. చూస్తుండు ప్రతీ ఒక్కరూ ఇక నీ  చుట్టూ తిరుగుతారు.” అంది

***

            యూనివర్శిటీ నించి బయటకు రాగానే తల్లిదండ్రులకి ఫోను చేసి శుభవార్త చెప్పింది తన్మయి.

            హాస్టల్ కి వస్తూనే బాబుని ఎత్తుకుని ముద్దాడింది.

            గాల్లో గిరగిరా తిప్పుతూ నవ్వుతూన్న అమ్మ ముఖంలో సంతోషానికి అర్థం తెలీక పోయినా కొత్తగా వెలుగుతూన్న తల్లి ముఖాన్ని చిన్నారి చేతుల్తో ప్రేమగా తడిమేడు బాబు

            మురళికి ఈ విషయం వెంటనే చెప్పాలని ప్రాంగణమంతా వెదికింది తన్మయి.

            “మురళి సార్ ధ్యానం క్లాసు నించి అటే వృద్ధాశ్రమానికి వెళ్ళేరు” అన్నాడు వాచ్ మేన్ దారిలో ఎదురుపడి.

            రాత్రి భోజనాలయ్యేక రెండు హాస్టళ్ళ మధ్య ఎప్పటిలానే ముగ్గురూ స్థిమితంగా కూర్చున్నాక చెప్పింది తన్మయి.

            “ఇంత మంచి వార్తని ఇంత లేటుగా చెప్పడం అన్యాయం. మీ జీవితంలో అత్యంత  గొప్ప శిఖరారోహణం ఇది. కానీ ఇది మొదటి శిఖరం మాత్రమే. ఇంకా ఎన్నో అధిరోహిస్తారు మీరు. నాకు వంద శాతం నమ్మకముంది మీ మీద.” అని వెంకట్ మనస్ఫూర్తిగా అభినందించేడు

            మురళి ప్రశాంతమైన నవ్వుతో కళ్ళు  మూసుకునిమీకు ఎల్లవేళలా శుభం కలుగుతుందిఅన్నాడు. క్షణకాలం తర్వాత తెరిచిన కళ్ళల్లో పలచని కన్నీటి పొరని చూసి ఆశ్చర్యపోయింది తన్మయి.  

            పక్కనే ఉన్న వెంకట్ కి తెలియకూడదన్నట్టు  చప్పున కళ్ళు దించుకున్నాడు

            “దు:ఖానికి మూలం కోరికలు, కాబట్టి కోరికల్ని జయించాలి. అని నమ్మి ఉద్బోధించేది ఇతనేనా? “  

            ఆక్షణం ప్రపంచంలో అన్ని బంధాల కన్నా గొప్పదైన అనుబంధం పంచగలిగిన ఆత్మీయత అతని కళ్ళల్లో కనిపించింది

            అతని మనస్సులో తనకే దక్కిన అరుదైన గౌరవం అది. కానీ ఎందరికో ఉపయోగ పడడమే అతని జీవిత ఆదర్శం

            అందుకు సాక్ష్యమన్నట్లు  మరు నిమిషంలో మురళి వైపు చూసిన తన్మయికి మళ్ళీ ప్రశాంతమైన చిరునవ్వు సాక్షాత్కరించింది

            ఆ రాత్రి ఎంతో స్థిమితంగా కంటి నిండా నిద్రపోయింది తన్మయి.

            ఎప్పటిలానే ఉదయం అయిదు గంటలకి అల్లారం మోగుతున్నా నిద్ర లేవాలనిపించని ప్రశాంతమైన నిద్ర అది

            ఇప్పటి వరకూ ఎప్పుడూ ఉదయానే దడదడలాడే గుండెతో నిద్రలేచే తన్మయికి బద్ధకం కొత్త అనుభవం.

            ఎర్ర బొట్టు మీద తెల్లని విభూది రేఖని అద్దుకుంటూ అద్దంలో వెలుగుతున్న తన ముఖాన్ని చూసుకుంది.

            ముందు రోజు ఉతికి, ఇస్త్రీ అయి వచ్చిన తెల్లచీరల్ని అల్మారాలో సర్దుతూ మడతల మీద ప్రేమగా తడిమింది.  ఇక మీదట వీటిని కట్టుకునే అవకాశం రాదు

            చేయాల్సిన పనుల జాబితాని సరిచూసుకుంది.

            యూనివర్సిటీకి వెళ్ళి వివరాలు కనుక్కోవాలి. డిపార్టు మెంటులో ఎలా రిజిస్టరు కావాలో, అసలు పీ ఎచ్ డీ లో ఎలా జాయిన్ కావాలో చూసుకోవాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా యూనివర్సిటీలోని రీసెర్చి స్కాలర్స్ హాస్టల్ కి మారాలి

            రిజిగ్నేషన్ అప్లికేషను రాసి వివేకానందా స్కూలు కరస్పాండెంట్ రాఘవరావు గారి దగ్గరికి పట్టు కెళ్లింది తన్మయి.

            “కంగ్రాట్స్. మా రూల్స్ ప్రకారం నెల రోజుల ముందు అప్లికేషన్ ఇవ్వాలి గానీ, మీరింకా ముందే వెళ్ళాలనుకున్నా వెళ్ళండి. మీరు మా స్కూలుకి అందించిన అత్యుత్తమ సేవలకు పారితోషికంగా మీకు రెణ్ణెల్ల జీతాన్ని బోనస్ గా ఇస్తాం.” అన్నారు

            తనతో బాటూ బయట వాకిలి వరకూ వచ్చిన ఆయన కాళ్ళకు నమస్కరించింది తన్మయి.

            అత్యంత కష్టకాలంలో ఆదుకున్న స్థలం తనకి దేవాలయం తో సమానం. తనెక్కడకి వెళ్ళినా స్కూలుని మరిచిపోవడం అసాధ్యం.

            హాస్టలు వరకూ వచ్చాక ఒకసారి చుట్టూ చూసింది.

            తక్కువ కాలంలో మనసుకి అత్యంత దగ్గరగా వచ్చిన పరిసరాలని, మనుషుల్ని వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పడం లేదు.

            మెల్లగా నడిచి వెళ్ళి తనకి ఇష్టమైన కలువపూల కొలను ఒడ్డున కూచుంది.

            కాళిదాసు జ్ఞాపకం వచ్చేడు.

            “రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ 

            పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతుః

            తచ్చేతసా స్మరతి నూన మభోధ పూర్వం

            భావస్థిరాణి జననాంతర సౌహృదాని

            “అందమైనవి చూసి, మధురమైనవి విని సుఖాన్ని చెందినా, ప్రాణి కలత చెందుతుంది.  

            ఆ కలతకు కారణం ఇది అని తెలుసుకోగలిగిన పూర్వ విషయ జ్ఞానం లేకపోవడం. 

            సుఖానికి కారణం మనస్సు తనలో స్థిరమై ఉన్న పూర్వ జన్మలోని స్నేహ భావానుభవాన్ని స్మరించడం.”.

***

            యూనివర్సిటీ లో డిపార్టుమెంటులోకి అడుగు పెడుతూనే గుమ్మం దగ్గర అటెండరు తన్మయి వైపు చూసి సెల్యూట్ కొట్టినట్లు నమస్కరించేడు.

            ఆశ్యర్యంగా ప్రతి నమస్కారం చేసింది.

            లెక్చరర్లకు, ప్రొఫెసర్లకు మాత్రమే దక్కే గౌరవం అది.

            అందుకు కారణం నాలుగడుగుల్లోనే గమనించింది తన్మయి

            డిపార్టుమెంటు ఆఫీసు బయట నోటీసు బోర్డు లో తన పేరు ప్రత్యేకించి  పెద్ద అక్షరాలతో రాసి ఉంది

            ఎప్పుడూ పనిబడినా పట్టించుకోని క్లర్కులునమస్కారం మేడమ్అని ప్రత్యేకించి గౌరవంగా పలకరించేరు.

            హెడ్డు గారి గది బయట అటెండరుమీరెప్పుడొచ్చినా వెయిటింగు లేకుండా వెంటనే పంపమన్నారు మేస్టారు.” అని  తలుపు తెరిచేడు.

            తన్మయిని  చూస్తూనే, “ఏమ్మా, సాధించేవుగా. అద్భుత విజయమిది. మన డిపార్టుమెంటులో పదమూడేళ్ళుగా ఎవరూ సాధించని గొప్ప విజయం. ఎంత ఆనందంగా ఉందో తెలుసా!” అని వాత్సల్య పూరితంగా అన్నారు

            “అంతా మీ ఆశీస్సుల వల్లనే మాస్టారూ!” అంటూన్న తన్మయికి గొంతుకేదో అడ్డు పడినట్లు దుఃఖం తన్నుకు వచ్చింది

            “ఇక నీ  కష్టాలన్నీ తీరిపోయినట్లేనమ్మానీకిక ఎదురులేదు. అన్నీ మంచి రోజులే. మన డిపార్టుమెంటులో కొత్తగా చేరిన వారికి నువ్వొక గొప్ప స్ఫూర్తివి. రేపు మొదటి సంవత్సరం  క్లాసులు మొదలవుతున్నాయి. ఆహ్వాన సమావేశంలో నీ ఉపన్యాసం ఏర్పాటు చేసేను.” అన్నారు నవ్వుతూ.

            “నేనా? నేనేమి చెప్పగలను మాస్టారూ!” అంది కొంచెం సంకోచంగా.

            అక్కడి నించి బయటికి వచ్చినా మాస్టారి మాటలే చెవిన మోగుతున్నాయి తన్మయికి.

            “నువ్వు చేసిందే చెప్పు. ఎన్ని కష్టాలెదురయినా అధిగమించి గమ్యాన్ని చేరుకోవడానికి నువ్వేం చేసేవో చెప్పు. నీదేమీ మామూలు విజయం కాదు తెలుసా? చిన్న వయసులో తల్లివయి, కుటుంబంసమాజ సహకారం లేకుండా  చంటి బిడ్డని పెంచుకొస్తూ చదువుని కొనసాగించి,  ఒంటరిగా మొక్కవోని దీక్షతో  అత్యుత్తమమైన లక్ష్యాల్ని సాధించడం మామూలు విషయం కాదు. ఒక అద్భుత విషయం. ఇంత సాధించావంటే నీలో ఏదైనా సాధించే ఒక గొప్ప పట్టుదల ఉంది. ఇక్కడితో ఆగిపోకుండా ఎప్పటికప్పుడు ముందుకు దూసుకెళ్ళు. నీలాంటి వాళ్ళ వల్ల ఎందరికో జీవితంలో గొప్ప స్ఫూర్తి లభిస్తుంది.” 

            ఆ మాటలు వినిపిస్తున్న కొద్దీ తన్మయికి వేస్తున్న ప్రతీ అడుగులోనూ గొప్ప ఉత్తేజం కలగ సాగింది

            ఉన్నట్టుండి వెనక నించి కరుణ పిలుస్తున్నట్టు అనిపించింది

            నిజంగానే కరుణ పరుగున వచ్చిఏవిటి తనూ! పిలుస్తున్నా ఆగకుండా అంత వేగంగా నడుస్తున్నారు?” అన్నాడు చిన్నగా నవ్వుతూ.

            చాన్నాళ్ళకుతనూ!” అని ఆత్మీయంగా వినబడ్డ పిలుపు తన్మయి మనస్సులో గొప్ప సంతోషాన్ని కలగజేసింది.

            ఆగి అతని వైపు  చూస్తూ  “లేదురుణా! నాకిప్పుడే వినిపించింది మీ పిలుపుఅంది

            అతని ముఖంలో రిజల్స్ట్ వచ్చినప్పటి బాధ తగ్గు ముఖం పట్టినట్లనిపించింది.

            తన్మయి ఏదో మాట్లాడబోయే లోగా తనే చెప్ప సాగేడు. “సారీ, మిమ్మల్ని సరిగా అభినందించలేకపోయేను మొన్నరోజుకొక ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నాను. అయినా ఫలితం ఉండడం లేదువరస పరాజయాలు నన్ను కుంగదీస్తున్నాయి. మొత్తానికి మీ ఆశలైనా నెరవేరినట్టేగాజే. ఆర్ ఎఫ్ కొట్టేరు. ఇంకేముంది ఎదురులేదికఅన్నాడు.

            ప్రతిగా తలూపుతూ  “యూనివర్సిటీ లో మొదటి అయిదు ర్యాంకుల వారికి మెరిట్ స్కాలర్ షిప్పు వస్తుందని తెలిసి అప్లికేషను పెట్టేను. మీరు పెట్టేరా?” అంది.

            “నేను పెట్టకుండా ఉంటానా చెప్పండి, ఇప్పుడు వెళ్ళేది అక్కడికే.” అన్నాడు.

            యూనివర్సిటీకి వెనకగా మరోమూలకి  ఉన్న ఆఫీసుకు కాలి నడకన వెళ్ళడానికి కనీసం నలభయి నిమిషాలు పడుతుంది.

            కాస్త దగ్గర దారి అవుతుందని డొంక దారిన నడవడం మొదలు పెట్టేరు.

            దారంతా ఆహ్లాదంగా ఉంది. చిక్కని చెట్లు . అక్కడక్కడా పడుతున్న చిన్న సూర్యకిరణాలు. ఆకాశంలో నుంచి సూటిగా నేల మీదికి ప్రసరిస్తున్న కాంతి పుంజాలు

            ఎవరో దగ్గర్లోని మరో త్రోవలో నడుస్తూ  సన్నగా  పాడుతున్నారు.

            “మేరె మెహబూబ్ తుఝే, మేరీ మొహబ్బత్ కి కసమ్” 

            పాట వింటూ అన్యమనస్కంగా నడుస్తున్న తన్మయి చీర చెంగు చటుక్కున దారి పక్కని కొమ్మకి తగులుకుంది.

            పక్కకి పడబోయిన తన్మయి చేతిని చప్పున అందుకున్నాడు వెనకే వస్తూన్న కరుణ.

            అనుకోకుండా మరో రెండడుగులు అలాగే నడిచేరిద్దరూ.

            తన్మయికి ఏదో అర్థమయ్యినట్లయ్యి వెంటనే చెయ్యి విదిలించుకుంది

            కరుణ చప్పున దగ్గరకు వచ్చితనూ! ఇప్పుడు చెప్పగలిగిన విషయమవునో కాదో తెలీదు. కానీ చెప్తాను. నేను.. నేను.. మిమల్ని ప్రేమిస్తున్నానుఅన్నాడు.

            తన్మయికి ఒక్కసారిగా గొంతు తడారినట్లయ్యి ఏమీ మాట్లాడ లేకపోయింది

            కరుణ ఎప్పుడో ఒక్కప్పుడు మాట అంటాడని భయపడుతూనే ఉంది

            నిజానికి తనెంత కాదనుకున్నా కరుణని తను కూడా ఇష్టపడుతూనే ఉంది. కానీ తన జీవిత పరిస్థితులు వేరు. అతని పరిస్థితులు వేరు. ఇవి రెండూ ఒక ఒరలో ఇమడవు

            పైగా ఇప్పుడు తనున్న పరిస్థితితన మన:స్థితి ఇటువంటి వాటికి సిద్ధంగా ఉందా? నెలనెలా కోర్టు చుట్టూ  ప్రదక్షిణలు, జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాబు భవిష్యత్తు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే జే. ఆర్ ఎఫ్ విజయంతో ఆర్థిక పరంగా నిలదొక్కుకునే అవకాశం రాబోతూ ఉంది

            అయిదు నిమిషాలు అంతా నిశ్శబ్దం తాండవించింది ఇద్దరి మధ్య.

            అప్పటికి డొంక దారి దాటి చిన్న కేంటీను బాట వచ్చింది

            ఇక నడవలేక రోడ్డు పక్కని బెంచీ మీద కూలబడింది తన్మయి.

            కరుణ పక్కనే కూచున్నాడు

            నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ , “మౌనం అర్థాంగీకారం అనుకోవచ్చా?” అన్నాడు.

            తన్మయి గొంతు సవరించుకునేలోగా

            “ఇంకో విషయం. మీరు అర్థం చేసుకుంటారనే చెప్తున్నాను. మా అమ్మకి సంప్రదాయాల పట్టింపు ఎక్కువ. మీరు మరో కులానికి చెందిన వారని మనిద్దరి పెళ్ళిని ఆవిడ ఒప్పుకోదు. నాన్న లేని నన్ను అన్నీ అయి పెంచిన మా అమ్మ అభిమతానికి వ్యతిరేకంగా నడచుకోలేను. అందుకే మా అమ్మకు నచ్చినట్లుగా, ప్రపంచం కోసం మా కులంలో మరో  అమ్మాయిని కూడా చేసుకోవాలనుకుంటున్నాను.” అన్నాడుకూడాని ఒత్తి పలుకుతూ.

            తన్మయికి ఒక్క క్షణం అతనేమంటున్నాడో అర్థంకాలేదు. “అంటే….?” అంది తల విదిలిస్తూ.

            “మీతో బాటూ ఇంకొక అమ్మాయిని కూడా చేసుకోవాలి నేనుఅన్నాడు కరుణ.

            హఠాత్తుగా ఆకాశం పెళ్ళున విరిగి పడ్తున్న భయమేదో కలిగింది తన్మయికి

            “అసలు ఇతను కరుణేనా? తన స్నేహితుడై తనని ఓదార్చిన కరుణేనా? ఇటు వంటి దురాలోచనలకి ఇతనెందుకు లోనవుతున్నాడు? అనంత చెప్పినట్లు తన ఆర్థిక విజయమే కారణమా?!”

            విపరీతమైన ఆవేదనతో దుఃఖం తన్నుకు రాసాగింది.

            “అసలు ఏమనుకుంటున్నాడు ఇతడు తన గురించి ఇటువంటి  వాడితోనా  తనిన్నాళ్ళూ స్నేహం చేసింది!”

            బాధావేశాలు కుదిపివేస్తుండగా ఒక్కసారిగా అరికాలి నుంచి రక్తం తలకి ఎక్కినట్లయింది తన్మయికి. గగుర్పాటుతో చప్పున లేచి నుంచుంది.

            అతని ముఖమ్మీద చరిచినట్లు  చప్పుడు చేస్తూ నమస్కరించి, “చాలు. ఇక ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. అయినా దేశాన్ని ఉద్ధరించే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో? నీకు ఇద్దరు భార్యలు. అందులోఒకరు నేను. ఛీ.ఛీ.. ఇంతకంటే అసహ్యమైన ఆలోచన ఇంకొకటి ఉందా?” అంది చిరాగ్గా తన్మయి.  

            “అదేవిటి, ఇందులో తప్పేవిటినేను మా అమ్మని బాధ పెట్టలేను, అలాగని నిన్ను వొదులుకోలేనుఅన్నాడు ఆశ్చర్యంగా

            “తప్పు ఏవిటని అడుగుతున్నావా ఆలోచనే తప్పు. నీలాంటి కుసంస్కారం వంతుడు నా స్నేహితుడు కావడం నా దురదృష్టం. జీవితంలో ఇక నాకు దగ్గరకు రావడానికి ప్రయత్నించొద్దు.”

            అతని వైపు మరోసారి చూడడం కూడా తప్పన్నట్లు విసవిసా ముందుకు నడిచింది.

            ఎంత అసహ్యంగా ఆలోచిస్తున్నాడో! “ప్రపంచం కోసం ఒక పెళ్ళి, అతని కోసం ఒక పెళ్ళి.”

            ఆడవాళ్లంటే ప్రతీ ఒక్కడికీ అలుసయిపోయింది

            అయినా తనేం తప్పు చేసింది? తనకే ఇలాంటి మనుషులు ఎందుకు  ఎదురవు తున్నారు?

            మగవాళ్ళు ఎంత అవకాశవాదులు

            శేఖర్ కి, ఇతనికి దుర్మార్గంలో తేడా ఏవుంది

            అతను తనుండగా ఎవరో అమ్మాయితో రహస్యంగా ఎఫైర్ నడిపి, ఆమె కోసం తనని ఒదిలి వెళ్ళిపోయేడు.

            ఇతను పబ్లిగ్గా ఇద్దరు భార్యల్ని కట్టుకోవాలనుకుంటున్నాడు.

            “తనెప్పుడూ కరుణ జ్ఞానాన్ని చూసి చాలా అబ్బురపడేది. అటువంటి స్నేహితుడు తనకి ఉన్నందుకు ఎంతో గర్వపడేది. అతని ఆర్థిక పరిస్థితి చూసి వీలైనంత సహాయం చెయ్యాలని జాలి పడేది. తనతో బాటూ శేఖర్ వల్ల ఇతను కూడా సమస్యల్లో ఇరుక్కున్నపుడు అతని ఓర్పుకి కృతజ్ఞతాభావంతో పొంగిపోయింది. అలాంటిదిఇప్పుడు…”ఇక ఆలోచించలేక  తన్మయి గొంతునిండా దుః ఖం నిండిపోయింది

            అసలే తను పెళ్ళనే ఉచ్చులో ఇరుక్కుని ఇంకా బాధలు పడుతూనే ఉంది. ఒక స్నేహితుడిగా అతను తనకి ఓదార్పునివ్వాల్సింది పోయి ఇంత దారుణంగా ఎందుకు ఆలోచిస్తున్నాడు?

            తను ఇంకో పెళ్ళి కోసం అర్రులు చాస్తున్నట్టు కనిపిస్తోందా ఇతనికికాదు.. ముమ్మాటికీ కాదు. తనున్న పరిస్థితుల్ని ఇతనికి అనుగుణంగా మలచుకోవడానికి పన్నుతున్న కుతంత్రం ఇది.

            ఇతని గురించి ఆలోచించడం కూడా తప్పే. అనర్హుల కోసం కన్నీరు కార్చడం కూడా వృథానే

            “అజ్ఞాత మిత్రమా! నా మనసుని రాయిగా మార్చు. నా కళ్ళ నించి చుక్క కూడా రానివ్వకునన్ను దుష్ట ప్రపంచం నించి కాపాడు. నాకు లోకంలో సగౌరవంగా బతికే ధైర్యాన్ని ఇవ్వు…” జీరబోయిన గొంతుతో తనలో తనే   గొణుక్కుంటున్నట్లు మాట్లాడుకుంటూ ముందుకు నడిచింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.