క ‘వన’ కోకిలలు – 9 : 

విరోధాభాసల సనాతన గ్రీకు తాత్వికుడు హిరాక్లిటస్

   – నాగరాజు రామస్వామి

(Heraclitus 535–475 BC)

          Thunderbolt steers all things. The fiery shaft of lightning is a symbol of the direction of the world – Heraclitus.

          హిరాక్లిటస్ క్రీ.పూ. 5వ శతాబ్దపు గ్రీకు తాత్వికుడు. సోక్రటీస్ కన్న పూర్వీకుడు. గ్రీకు సాంస్కృతిక సనాతనులైన ఐయోనియన్ల ( Ionian ) సంతతికి చెందిన వాడు. 

          గ్రీకు సంపన్న కుటుంబంలో, నాటి పర్షా దేశానికి చెందిన ఎఫిసస్ పట్టణం (Ephesus)  (ప్రస్తుత టర్కీ) లో జన్మించాడు. ఐయోనియన్ సంస్థాపకుడైన ఆండ్ర క్లస్ రాజవంశస్థుడు. 

          హిరాక్లిటస్ యుక్తవయస్సులో ఆర్టెమిస్ (Artemis) ఆలయంలో అట్టచెమ్మ  లాంటి ఆట ( knucklebones) ఆడుకునేవాడట. ఆర్టెమిస్ ఆనాటి గొప్ప దేవాలయం. పురాతన సప్త అద్భుతాలలో (Seven Wonders of the Ancient World) ఒకటి. 

          హిరాక్లిటస్ – పరస్పర వైరుధ్యాల విరోధాభాస(Paradox). వైరుధ్యాల సంఘర్షణలతోనే సామరస్యం సిద్ధిస్తుందని అతని సిద్ధాంతం.  ఈ పరిణామ విధాన క్రమాన్ని strife అంటాడు హిరాక్లిటస్. అశనిపాతం (Thunderbolt) ఘర్షణ(strife) కు ప్రతీక. అదే ప్రపంచ మార్గం. అతని విరోధాభాసా చింతన, అతని  మిశ్రాక్షర పదకేళీ పరిభాష అతన్ని “అస్పష్ట” (obscure) తాత్వికున్ని చేసింది. అతన్ని Weeping philosopher అని, anti-intellectual obscurantist అని కూడా అంటారు. 

          ఒకేఒక్క మూల ద్రవ్యంతో ఈ విస్వమంతా సృష్టించబడిందన్న అర్థంలో అతడు భౌతిక ఏకసత్తావాది (Material Monoist). శాస్త్రీయ దృక్పథ  విశ్వసృష్టి తత్వ విచారకుడు ( Scientific Cosmologist), అభ్యుదయ హేతువాది, తొలితర్క శాస్త్రవేత్త. 

          హిరాక్లిటస్ తాత్వికతకు ముఖ్య భూమికలు/ సూక్తులు:

  1. ఏ ఒక్కడూ ఒకే నదిలో రెండు సార్లు కాలిడలేడు! 
  2. సృష్టిలోని ప్రతిదీ ఒకటే.
  3. విశ్వం ఏకధాతు నిర్మితం. అగ్ని ఆ మూల ద్రవ్యం.
  4. ప్రతీదీ ప్రవాహశీలమైనది (Flux); సూత్రబద్ధ మైనది(Logos). 
  5. పైకైనా కిందకైనా మార్గం మాత్రం ఒక్కటే. 
  6. వైరుధ్యాలలో ఏకత (The unity of opposites): పరస్పర వైరుధ్యాలు సానుకూల  సమైక్యతకు, సామరస్యానికి దారితీస్తాయి.
  7. ప్రతి రోజూ ఒక సరికొత్త సూర్యుడు ఉదయిస్తుంటాడు. 
  8. ప్రతీదీ నిరంతర పరివర్తనకు లోనౌతుంటుంది.
  9. అంతా అగ్ని మయం. 

          హిరాక్లిటస్ తాత్వికత ఎంత మార్మిక మైనదో, అతని అభివ్యక్తి  కూడా అంతే నిగూఢమైనది.

          క్లిష్టమైన పదాలతో నిండిన అతని రచనలు గూఢమైన పజిల్స్ లాంటివి. లోతుగా  అన్వేషిస్తే గాని అందనివి. హిరాక్లిటస్తాత్వికతకు ప్రభావితుడైన బోర్హెస్ (Jorge Luis Borges) రచించిన ఈ కింది రెండు ప్రసిద్ధ కవితలకు నా అనువాదాలు హిరాక్లిటస్  తాత్విక చింతనకు అద్దం పడతాయి. 

          1. :చీజీకటి వేళలు:

          (In Praise of Darkness)                 

          సాయంసంధ్య:

          నిద్రలోకి మునుగుతున్న రాత్రి

          శుద్ధ విస్మృతి. 

          ఉదయసంధ్య:

          అరుణోదయం గత ప్రత్యూష,

          పగలు గతించిన ఉదయం,

          అలసిన సాయంత్రం కిక్కిరిసిన పగలు. 

          వేకువ చీకటి.

          గ్రీకుల దిగ్భ్రాంతి. 

          ఏమీ త్రికాల జాలం? 

          ఏ నది ఇది?

          మూలం తెలియని ఈ నదిలో గంగ ప్రవహిస్తున్నది. ఈ నది పౌరాణికాలను, కత్తులను మోసుకొస్తూన్నది. ఎడారులలోంచి, నేలమాళిగల్లోంచి, నిద్రలోంచి; నన్ను నదిని చేసి ఈదుకొస్తున్నది. నేను మారుతున్న కాలద్రవ్య రహస్యాన్ని. 

          ఈ నదీమూలాన్ని నేనేనేమో!

          నా నీడలలోంచే ఈ అవాస్తవిక నిర్నిద్రా రేబవళ్ళు నిదుర లేస్తున్నాయేమో! 

             2. ఎఫిసస్ నగరానికి:

          (To Ephesus of Heraclitus)

          ఆ మధ్యాహ్నం

          అతడు అర్థించకుండానే అతన్ని లాక్కొచ్చింది

          నింపాదిగా పారుతున్న ఏటి గట్టుకు.

          పరధ్యాన్నంగా నిరాసక్తంగా నిర్లక్ష్యంగా అతడు;

          పక్కనే పోప్లర్ చెట్ల నీడల్లో జానస్ దైవ శిల. 

          అతడు 

          పాత స్మృతుల ప్రతిబింబాలలో కొట్టుకు పోతూనే 

          ముందు తరాలు మరువలేని మహా వాక్యాలను అల్లుతున్నాడు: 

          ఏ ఒక్కడూ ఒకే నదిలో రెండు సార్లు  కాలిడలేడు! 

          అలవోకగా జాలువారిన అతని వాక్కుకు అతనే అవాక్కవుతున్నాడు; 

          తానే ఆ నిశ్శబ్ద నిమ్నగయై నోరు జారుతున్నట్టు

          ముప్పురిగొన్న ఏదో పవిత్ర భయద సంభ్రమం! 

          ఆ ఉదయాలను, ఆ దివా రాత్రాలను  పట్టుకోలేని అశక్త్య నీరసం! 

          ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకొంటున్నాడు;

          భవిష్యత్ అనుసృజనుడు బర్నెట్ తాత్విక సంపుటాలలో తన వాక్కు అక్షరబద్ధమైనట్టు కలకంటువ్నాడు.

          హిరాక్లిటస్ కు గ్రీకు భాష తెలియదు.

          ద్వారబంధాల దైవం జానస్ లాటిన్ దేవుడు!

          (హిరాక్లిటస్ గ్రీకులో మాట్లాడుతూ స్పానిష్ భాషలో రాసేవాడట.)

          హెరాక్లిటస్ భావధారకూ, ఉపనిషద్ సూక్తులకూ, బౌద్ధ సత్యాలకూ అవినాభావ  సంబంధ మేదో ఉన్నట్టుతోస్తుంది. “అగ్ని మీళే పురోహితం” మన ఋగ్వేద  అగ్ని స్తోత్రానికి సరిపడుతుంది.  స్టాయిక్స్ తాత్వికతకు హెరాక్లిటస్తత్వాలోచనలు  ఆధారమని అంటారు. అరిస్టాటిల్, ప్లేటో, నీషే,  మార్టిన్ హేడెగ్గర్, ఆస్వాల్డ్  స్పెంగెల్ లాంటి పెక్కు తాత్వికులపై హెరాక్లిటస్ ప్రభావం ఎంతో వుంది. హెగెల్, మార్క్స ల గతితార్కికత  సైతం ప్రభావితమయిందంటారు. హెరాక్లిటస్ గ్రీకు ప్రసిద్ధ  కవి హోమర్ ను, హిసియాడ్ ను తృణీకరించాడు. 

          నిరంతర పరివర్తనా వాది హెరాక్లిటస్! పాశ్చాత్య పురా చింతనకు పునాదులు  వేసిన “అబ్స్కూర్” తాత్వికుడు, “డార్క్ ఫిలాసఫర్” హెరాక్లిటస్! 

 *****                  

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.