చాతకపక్షులు  (భాగం-13)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

          బతుకుజీవుడా అనుకుంటూ అతనివెంట లోపలికొచ్చింది గీత. లోపలికి రాగానే భయం పోయింది. కొంచెం నవ్వు కూడా వచ్చింది. తన సాహసకృత్యాలు హరికి చెప్పి, “మీ పేరు మాత్రం గొప్ప కథ. యఫ్.బి.ఐ. వాళ్లు కూడా పట్టుకోలేరన్నాడా పెద్దాయన,” అంది గలగల నవ్వుతూ. 

          హరి కూడా నవ్వుతూ, “మా ఆఫీసులో నాపేరు ఎ టు జీ హారీ అంటార”ని చెప్పి, 

          “తింటానికేమైనా వుందా?” అని అడిగేడు.

          “రవదోశలు చెయ్యనా?” అంది గీత. 

          “అంత టైములేదులే. ఆవకాయా అన్నం తినేసి పోతాను,” అన్నాడు ఫ్రిజ్ తీస్తూ. 

***

          క్రమంగా గీతకి ఊరు అలవాటవుతోంది. పాలూ, కూరలూ ఒక్కర్తే వెళ్లి తెచ్చు కుంటోంది. 

          ఓరోజు కూరలకోసం బజారుకెళ్తే, అక్కడ ఒక తెలుగుమొహం కనిపించింది. గీత ఆగి అట్టే చూసింది ఆవిడవేపు. పొడగరి, పచ్చని పసిమి శరీరచ్ఛాయా, ఒత్తుగా కురులూ, చురుకైన కళ్లూ ఎవరినైనా ఆకట్టుకునే వర్ఛస్సు ముఖంలో. అట్టే వయసు వున్నట్టు లేదు కానీ హుందాగా వుంది. ఇద్దరికిద్దరూ మాటాడదామా వొద్దా అన్నట్టు ఓర చూపులు చూసుకుంటూ రెండు నిముషాలు సందిగ్ధావస్థలో గడిపేరు. తరవాత మళ్లీ చెకింగ్ దగ్గర తటస్థపడ్డారు.

          ఆ రెండో ఆవిడే చిన్న చిరునవ్వు నవ్వి హలో అన్నట్టు తలూపింది. 

          గీత జవాబుగా హలో అంది. 

          “కొత్తగా వచ్చినట్టున్నారు” అంది ఆవిడ.

          “నాలుగు నెలలు అవుతోందండీ,” అంది గీత

          “అనుకున్నానులెండి. యన్నారై మొహం పడడానికి కొంతకాలం పడుతుంది” అంది రెండో ఆవిడ నవ్వుతూ. 

          గీతకి ఆవిడ అభిప్రాయం అర్థం కాలేదు. నవ్వేసి వూరుకుంది. గీతకి ఆవిడతో మాట్లాడాలని వుంది. “నాపేరు గీత” అంది. 

          “ఆహా” అని “తపతి” అంది రెండో ఆవిడ. కొన్నవాటికి డబ్బిచ్చేసి, ప్లాస్టిక్‌ సంచీ అందుకుని, “వస్తాను” అనేసి వెళ్లిపోయింది త్వరగా అక్కడినుంచి.

          గీత దారిపొడుగునా ఆవిడగురించే ఆలోచిస్తోంది. రాత్రి హరితో చెప్పింది ఆసంగతి.

          “తపతిగారా? ఆవిడ సాధారణంగా ఎవరితోనూ మాట్లాడరే. ఆశ్చర్యమే,” అన్నాడు హరి.

          “ఏమో మరి, నాతో బాగానే మాట్లాడేరు,” అంది గీత.

          “నీ ముఖవిశేషం కాబోలు.”

          “హుఁ” అంది గీత కళ్లు చికిలించి వెక్కిరిస్తూ. 

***

          ఆదివారం భాగ్యంగారు గీతనీ, హరినీ పూజకి పిలిచారు. తమ వివాహం అయి 25 సంవత్సారాలు అయిందని, అంచేత ఇది స్పెషల్ పూజ అనీ చెప్పారావిడ. గీత “హరి గారు వచ్చేక అడిగి చెప్తానండీ,” అంది.

          ఆవిడ “ఆలానే తరవాతే చెప్పండి. మీరు తప్పక రావాలి. మనవాళ్లు చాలా మంది వస్తారు. మీరు వాళ్లని కూడా కలుసుకోవచ్చు.” అందావిడ.

          రాత్రి హరితో భాగ్యంగారి పిలుపుసంగతి చెప్పి, “నాకలాటి నమ్మకాలు లేవు” అంది

          హరి నవ్వి, “నాకూ లేవు. కానీ ఆవిడ పులిహోరా, పెరుగువడా ఊరూ వాడా చెప్పు కుంటారు. మనవూళ్లోలాగ ఇరుగూపొరుగూ వుండరు కదా ఇక్కడ. ఇది మరోరకం ఊసుపోక అన్నమాట. కనీసం ఒకసారి చూద్దువుగానీ పద,” అన్నాడు.

          మర్నాడు భాగ్యంగారిని పిలిచి వస్తున్నాం అని చెప్పింది. ఆవిడ మంచిదమ్మా అంది సంతోషంగా. 

***

          ఆదివారం ఇద్దరూ బయల్దేరి రెండుగంటలకి భాగ్యంగారింటికి వెళ్లేరు. గీతకి ఆ యింట్లో అడుగు పెట్టగానే మరో లోకంలో వున్నట్టనిపించింది. మనవాళ్లు చెప్పినట్టు అక్షరాలా లంకంత ఇల్లు. ఈ మధ్యనే కట్టించుకుని ‘మువ్వ’య్యేరుట. “ముందున్న ఇంట్లో పూజగది లేదు. స్వామివారిని బ్రూమ్ క్లాజెట్టులో పెట్టుకున్నాను. నాకు మనసుకి అది తృప్తి లేదు. ఇంత సంపాయిస్తున్నాం, ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాం. స్వామికి తక్కువ చేయ తగునా? ఏమంటారు? నేనే పోరు పెట్టి స్వామికి వేరే గది కట్టింపించాను,” అన్నారు భాగ్యంగారు. మనవాళ్లకి పూజగదీ, ఇక్కడివాళ్లకి చీపుళ్లగదీ ఏ సంస్కృతిలో దేనికి ప్రాధాన్యత అన్నది చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలి అనుకుంది  గీత నవ్వుకుంటూ. 

          ఇల్లంతా ఇండియానించి తెచ్చిన వస్తువులతో కిక్కిరిసి వుంది. ముక్కోటి దేవతలూ గోడలనిండా కొలువు చేసి వున్నారు. స్టీరియోలో భజనగీతాలు వినిపిస్తున్నాయి. పార్టీకి    వచ్చినవాళ్లంతా ఉద్యోగాల్లో స్థిరపడ్డవాళ్లే. ప్రొఫసర్లూ, డాక్టర్లూ, ఇంజినీర్లూ,. సర్వ మానవులూ సమానులే అంటూ గోలెత్తే ఈదేశంలో ఆరోజు అక్కడ గీతకి కనిపించని తెరలు విదితమయ్యేయి. తనూ, హరీ కాక, రాధా, మాధవ్, మరో ఇద్దరూ 30, 40 లలో వున్నట్టు కనిపిస్తున్నారు. వారందరూ లివింగ్ రూములో ఓమూల ఒదిగి కూర్చుని వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటున్నారు. యాభైలు దాటినవాళ్లు మరోపక్క చేరేరు. వాళ్ల చర్చలు పిల్లల చదువులూ, మార్కెట్టూ, రిటైర్మెంటు ప్లానులూ…

          “మార్కెట్ మెరుగయ్యేట్టు లేదు ఇప్పట్లో. గ్రీన్‌స్పాన్ చేతిలో మంత్రదండం పవరు ఎలా వుంటదో.

          “20 పెర్సెంటు లాస్”

          “పేపర్ లాసేలెండి.”

          “మీ అబ్బాయి గ్రాడ్యేటు అవుతాడేమో. కాలేజీలకి అప్లై చేస్తున్నాడా?”

          “బ్రౌనుకి అప్లై చేసేడు. ఏం చదువులో. ఏడాదికి అరవైవేలు.”

          “మావాడికి ఫుల్ స్కాలర్షిప్పుంది లెండి”

          “యేల్‌లోనే?”

          “కాదండీ. జార్జిటౌనుకెల్తాడంట. ఏటో … ఆల్ల సదూలు ఆల్లకే తెలవాల.”

          ఆడవాళ్లందరూ వంటింట్లోనూ డైనింగురూంలోనూ సర్దుకున్నారు. వారి సంభాషణలు ఇండియా ప్రయాణాలూ, ఇక్కడి నుంచీ తీసుకెళ్లే బహుమానాలూ, అక్కడినుంచీ తెచ్చుకునే నగలూ, చీరెలూ, మధ్య మధ్య స్థానిక కుటుంబాల్లో విశేషాలూ, రెసిపీలూ ..

          “శాన్నాళ్లయి గౌరి కనపిచ్చట్లేదు. ఊర్ల లేరా ఏమి ఆమె? అంది నీలి పట్టుచీరెలో మిలమిల మెరిసిపోతున్నావిడ. 

          “ఊళ్లోనే ఉన్నారు. మొన్న నాకు గ్రోసరీస్టోరులో కనిపించేరు. అంది కంచిపట్టు చీర కట్టుకున్న ఇల్లాలు. 

          అటు పక్కనున్నావిడ ఇటు తిరిగి, కిందటివారం వాళ్లమ్మాయిని వెస్టౌన్ మాల్లో చూశాను. పక్కన ఒక అమెరికను అబ్బాయి వున్నాడు. డేటనుకుంటా. అంది. 

          “మా పిల్లకాయలకి ఆపోకడలు లేవు. ఆళ్లు నువ్వు చెప్పిన అమ్మాయిల్నే చేసుకుంటాం మమ్మీ అంటన్నరు, అంది గౌరిగారి గురించి అడిగిన ఆవిడ.

          గోడవార కూర్చున్న మరొకావిడ ఇండియాకి ఏం పట్టుకెళ్తోందో చెప్పి, ఈసారి రుబ్బురోలు తెచ్చుకుంటాను, కందిపచ్చడి రోట్లో నలిగితే వచ్చే రుచి ఈ బ్లెండరుతో రాదు, అంటోంది. 

          వారందరికీ కాస్త ఎడంగా ముభావంగా కూర్చున్నావిడని చూసి గీత ఎక్కడో చూసినట్టుంది, ఎవరై వుంటారు చెప్మా అని ఆలోచిస్తోంది. 

          ఆవిడ గీతని చూసి చిన్నగా నవ్వింది. అప్పుడు గుర్తొచ్చింది గీతకి. రెండు వారాల కిందట స్టోరులో కనిపించింది ఈవిడే. 

          ఇంతలో భాగ్యంగారు భజనకి పిలిచారు. ఆడవాళ్లూ, మొగవాళ్లూ అందరూ కుడివేపున్న ఫామిలీరూంలోకి చేరేరు. దాదాపు ముప్పావుగంట పాటలూ. తరవాత మంగళహారతీ ఇచ్చి ముగించేరు. మళ్లీ అందరు హాలూ, కిచెనూ, డైనింగురూమూ ఆక్రమించేరు. డైనింగురూంలో ఓ మూల నక్కిన తపతి దగ్గరికి ఇందాక గౌరి ప్రస్తావన తెచ్చినావిడ పనిగట్టుకుని వచ్చి, మీవారిని చూపరేమీ? ఆయన ఎప్పుడూ భజనకి వచ్చిందే లేదు? అని అడిగింది. తపతి సమాధానం చెప్పకుండా చిన్న నవ్వు నవ్వి మరోవేపు తిరిగింది.

          “మీ అబ్బాయి ఆర్మీలో చేరినాడంట గంద?

          తపతి అవునన్నట్టు తలూపింది. 

          “మీకెంత గుండి దయిర్యం. నేనయితే బయంతో సచ్చిపోదును పోరగాని యుద్దానికి అంపి వొప్పిడేం ఐపోతందో అని అంది నీలి చీరెలో మెరిసిపోతున్నావిడ.

          ఈసారి తపతి, మీ అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు కదా. భయంలేదులెండి అంది.

          మరొకావిడ, మీ పాప ఏం చేస్తోంది? అని అడిగింది.

          తపతి ఇంకా తెలీదండీ అని అక్కడనుండి లేచి మరో వేపుకి వెళ్లింది. 

          “మారు మనువు సేస్కుందని సెప్తినే. ఆయమ్మే అన్న మాటలు వెనకనించి స్పష్టంగా వినిపించేయి. 

          గీతకి ప్రాణం చివుక్కుమంది. లేచి వెనకగుమ్మం వేపు నడిచింది. పెద్ద అద్దాల తలుపులోంచి విశాలమయిన పెరడు పువ్వులమొక్కలతో కన్నులపండువగా వుంది. నెమ్మదిగా తలుపు పక్కకి తోసుకుని, బయటికి నడిచి, మళ్లీ తలుపు వేసింది దోమలు ఇంట్లోకి జొరబడకుండా. భాగ్యంగారికి తోటపని అంటే అత్యంత ప్రీతి అని ఆ మొక్కలు చూస్తే తెలిసిపోతుంది ఎవరికైనా. మామూలుగా సర్వత్రా కనిపించే గులాబీలూ, చేమంతులే కాక కొత్తరకాల మొక్కలు కూడా వేసారు. ఓ గోలెంలో నిలువెత్తు మందార చెట్టు రెండుపూలు పూసింది అపురూపంగా. అది చూస్తే గీతకి గుంటూరులో తమ పెరడు గుర్తుకొచ్చి దిగులేసింది. మరో వేపు ఓ పెద్దచెట్టు పెద్దపూలతో విరగబూసింది చూపరుల కన్ను చెదిరేలా. మందారాలంత పెద్దవి, రేకులు తెలుపు, చిగుళ్ల చిన్న ఎర్రటి జీర అబ్భ ఎంత అందం అనుకుంది గీత కన్నార్పకుండా వాటిని చూస్తూ. ఉల్లము రంజిల్లగా, ఆపూల గుత్తిమీద సుతారంగా చేయి వేయబోతుంటే మనసున సంగీతం తొణికింది.

          “చివాలున కొమ్మ వంచి గోరానెడు నంతలోన పూలకన్నెలు జాలిగా నోళ్లువిప్పి బావురుమన్నవి కృంగిపోతూ… కూనిరాగం తీస్తున్న గీత వెనక అడుగుల చప్పుడు వినిపించి గతుక్కుమని పాట ఆపేసింది. తపతి నిల్చుని వుంది చిరుహాసం చిప్పిలు తున్న కన్నులతో. ఇద్దరికీ మాట తోచలేదు ఒక్కక్షణం. గీత గాజుతలుపులలోనించి కనిపిస్తున్న మనుషులవేపు చూసింది. ఆతలుపుకి అటూ ఇటూ దూరం పది గజాలే అయినా వాతావరణంలో ఎంత తేడా! తపతి చెట్టువేపు చూస్తూ అంది, మగ్నోలియాలు. అక్షరాలా నాలుగు ఘడియలే వాటి ఆయువు అయినా ఎంతటి సౌందర్యం విరజిమ్ముతున్నాయో చూడండి.గీత మరోసారి చెట్టువేపు చూసింది. చెట్టంతా పూలే, గుప్పున మతాబాలు వెలిగినట్టు, కొమ్మలు కనిపించడంలేదు. పూత కూడా అట్టే కాలం వుండదు. మహా అయితే నెలరోజులు పూస్తాయి. ఆరేకులన్నీ రాలిపోయినప్పుడు కూడా బహుసుందరంగా వుంటుంది చెట్టుకింద అందమయిన తివాసీ పరిచినట్టు, సంక్రాంతి వేళ సూర్య రథం ముగ్గు వేస్తాం చూడండి, అలాగే అని మళ్లీ మీకు సంగీతం వచ్చులా వుంది అంది తపతి. గీత నవ్వి, నేర్చుకోలేదండి. మన ఇళ్లల్లో సంగీతం రాని ఆడపిల్ల లెవరు లెండి అంది.

          “ఎంతవరకూ నేర్చుకున్నారు?

          “ఎంతవరకూ లేదండీ. సరళీస్వరాలూ, జంటస్వరాలూ, ఆ తరవాత ఏదో అంటారు స్వరజతులు కాబోలు. అంతే. ఆపైన సినిమా, రేడియో..

          “మీ కంఠం బాగుంది. నేర్చుకోండి.

          గీత ఆశ్చర్యంగా, ఇక్కడా? అంది తపతివేపు తేరి చూస్తూ. 

          “ఏం? ఇక్కడా అంటే? ఈ చెట్టుకిందా అనా అమెరికాలోనా అనా? అంది తపతి వెక్కిరిస్తున్నట్టు.

          “అది కాదండీ. ఇక్కడ ఎవరు నేర్పుతారని?

          “నేన్నేర్పుతాను మీరు నేర్చుకుంటానంటే.

          గీతకి ఏమనాలో తోచలేదు. నిజానకి నేర్చుకుంటే బాగుంటుంది, మంచి కాలక్షేపంగా వుంటుంది. మరి తపతి నిజంగా అంటోందో, మాటవరసకి అంటోందో …

          అంతలో భాగ్యంగారు వచ్చారు ఎన్ని కాఫీలో, ఎన్ని టీలో లెక్క వేస్తున్నారావిడ.

          ఇద్దరూ లోపలికొచ్చారు. నాలుగు నిముషాలాగి గీత తిరిగి చూసింది తపతికోసం. ఆవిడ ఎక్కడా కనిపించలేదు. తపతిగారేరీ అని అడిగితే ఆవిడ వెళ్లిపోయి చాలాసేపయింది అన్నారెవరో.

          “అదేమి తీరో నాకర్తం గాదమ్మా. పిలిస్తే రాదు. వస్తే ఇట్ట కనిపించి అట్ట మాయమయి పోతది. నావల్ల కాదమ్మ అట్టాటి నడతలు అంది అంతకుముందు భర్తని చూపించలేదేం అని తపతిని అడిగినావిడ. 

          తపతి మనవాళ్లతో ఎందుకు కలవదో గీతకి అర్థం అయింది. 

          మరో పావుగంట కూర్చుని ఒకొరొకరే లేచారు ఇళ్లకి వెళ్లడానికి. కారులో హరి అడిగేడు, ఎలా వుంది పార్టీ?

          గీత తపతి గురించే ఆలోచిస్తోంది. అచ్చంగా మనవాళ్లని కలుసుకున్నట్టే వుంది, అంది నర్మగర్భంగా. 

          “ఏం? మనవాళ్లని కలుసుకోడం, తెలుగులో పిచ్చాపాటీ, తెలుగు భోజనం బాగులేదూ? అడిగేడు అతను గీతవేపు చూస్తూ. 

          చాలాసేపటి నుండి తనని బాధిస్తున్న ప్రశ్న చెప్పింది, వీళ్లందరూ చాలా కాలంగా ఇక్కడున్నారు అంటున్నారు. ఇక్కడి మర్యాదలు బాగానే ఒంట బట్టించుకుని వుండాలి కదా. మరి ఆ వెకిలి మాటలూ, లేకి ప్రశ్నలు ఏమిటి? అవతలి మనిషిని నొప్పిస్తున్నాం అన్న జ్ఞానం వుండక్ఖర్లేదూ? అంది చిరాగ్గా.

          హరికి తికమక అయింది. ఏమన్నారు? ఎవరు? నిన్నా?” అని అడిగేడు గాభరాగా. 

          గీత తల అడ్డంగా వూపుతూ, “నన్ను కాదు. తపతి గారిని. ఆవిడ ఎక్కడికీ రారు అన్నారు మీరు. ఇందుకేనేమో. భాగ్యంగారింట్లో అమ్మలక్కల ప్రశ్నలు చూస్తే అసలు ఏం అనుకోవాలో తెలీడం లేదు నాకు.” 

          హరి కొంచెంసేపు ఊరుకుని, అందుకేనేమో రారు. నాకు తెలీదు కదా మీ ఆడవాళ్లు ఏం మాటాడుకుంటారో.  భాగ్యంగారితో దూరపు బంధుత్వమో, పాత స్నేహమో ఏదోవుంది. అందుకే వాళ్లింటికి అదేనా ఇలా ఏదో స్పెషల్ సందర్భం అయితేనే వస్తారు.యానివర్సరీ అన్నారుకదా అని వచ్చి వుంటారు ఇవాళ. 

          “నాతో బాగా మాటాడారు. నాకు సంగీతం కూడా నేర్పుతానన్నారు కూడా.

          “చెప్పేను కదా నీ ముఖవిశేషం.

          గీత చాలా రోజులు తపతిగురించి ఆలోచిస్తూనే వుంది.

* * * * *

(ఇంకా ఉంది)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.