పేషంట్ చెప్పే కథలు – 1

వీర నారి

ఆలూరి విజయలక్ష్మి

       “మా ఆవిడ కొట్టింది” సిగ్గు పడుతూ చెప్పాడు గోపాలం. 

       ఎవరైనా భర్తతో తన్ను లు తిని వైద్యానికోస్తే వాళ్ళ దెబ్బలని చూసి కోపం వచ్చి “తిరగబడి మళ్లీ  తన్నలేవా అతన్ని”?అని ప్రశ్నిస్తుంది తను. 

       “ఈ పవిత్ర భారత దేశం లో పుట్టిన ఆడదానికి అన్ని దమ్ములున్నాయా?” “ఎంత వెర్రి దానివి?”అని తనను పరిహసిస్తున్నట్లు కన్నీళ్లతో నవ్వేవారు కొందరు. చాలా ప్రమాదకరమైన వ్యక్తిని చూసినట్లు భయంగా చూసే వారు కొందరు.అసలా ప్రశ్నే అర్థం కానట్లు చలనం లేకుండా ఉండిపోయేవారు మరికొందరు.  భర్తతో తన్నులు తినడం అనేది ఊపిరిపీల్చుకున్న సహజ విషయమయినట్లుగా భార్య భర్తల జన్మహక్కు అన్నట్లుగా కొంతమంది ప్రవర్తించడం చూసి “ఇలాంటి వాళ్లకు విముక్తి లేదు, ఇలాంటి వాళ్ళని ఏ సంఘ సంస్కర్తా చేయి  పట్టుకుని ముందుకు నడిపించలేడు.”  అని నిరాశ పడిపోయేది తను.  కొద్దిమంది మాటలతోనే ఆగిపోయే వాళ్ళు . ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు ఎవరో గాని ఈ వీర నారీ చావ చితక తన్నేసింది.  పళ్ళతో కండలూడొచ్చేలా కోరికేసింది. రక్తమోచేలా గోళ్లు గుచ్చి పీకేసింది.  తనఅసమ్మతిని, అసంతృప్తిని తిరుగుబాటును ఇంత ఆవేశంగా  ప్రకటించిన సాహసవంతురాల్ని  ఒక్కసారి చూడాలనే కోరిక కలిగింది.  కొంతమంది ఆడవాళ్లిలా రాక్షసంగా ప్రవర్తించే భర్తల అధికారాన్ని ఎదిరిస్తే కొన్ని వందల మందిమూగ జీవుల్ని  అది తప్పక కదిలిస్తుంది.  కొన్ని వేలమంది మగవాళ్ళకి అది ఉలిక్కిపాటు కలిగిస్తుంది.  ఈ పరాభవం తమకూ జరుగుతున్నదనే జంకుతో నైనా  వెనుకముందులాలోచించి మరీ  భార్య మీద చెయ్యి చేసుకోకుండా ఉంటారు.  భార్యాభర్తల మధ్య ఉండవలసినది అధికారం  కాదు, తిట్లూ, తన్నులూ కాదు, కోపం ,ద్వేషం కాదని కొంతమంది నియంతలైన మగవాళ్ళైనా గుర్తిస్తారు. 

        “అబ్బా! అమ్మా !”గాయాల్ని శుభ్రం చేసి మందు రాస్తుంటే అతని అరుపులు విని శృతి లోని  స్త్రీ వెనక్కి వెళ్లి  డాక్టరు ముందుకు వచ్చింది. 

       “ఒక్క నిమిషం, మంట తగ్గిపోతుంది.” అని అతని వంక చూస్తూ మృదువుగా చెప్పింది శృతి. 

       పాపం! ముందు కాకమ్మ కథలు చెప్పి తనను నమ్మించాలని చూశాడు. పెళ్ళాం తో తన్నులు తిన్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడిపోయాడు మానవుడు. పళ్ళ గుర్తులు, గోళ్ల గాట్లు చూసి లోతుగా ప్రశ్నించే సరికి తప్పక ఇంకా అసలు విషయం బయట పెట్టాడు. ఇంతగా తిరగబడింది అంటే ఆ ఇల్లాలు ఎన్నాళ్ళు కడుపులో మంట భరించిందో! ఎన్నాళ్లీతని దౌష్ట్యాన్ని భరించిందో! ఎన్నాళ్ళుగా దాచుకున్న కసి ఈ విధంగా వెలిబుచ్చిందో!!

       ఏం జరిగింది అసలు? ఎందుకిలా అయింది? అడగడానికి సంకోచం పడుతూనే కుతూహలాన్నాపుకోలేక పోయింది శృతి.  ఆమె ప్రశ్న విని లజ్జతో వంగిపోయింది అతని తల.  ఇంత అమాయకంగా సాత్వికంగా ఉన్న ఇతను భార్యను హింసించగలడా?! తను పొరపాటు అభిప్రాయం తో మగ జాతి అవలక్షణాన్ని ,ఎవరో కొందరి  దౌర్జన్య స్వభావాన్ని ఇతనికి అంటగట్టి ఏవేవో ఊహిస్తోంది.  భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలకి  సవాలక్ష కారణాలు ఉంటాయి.  అన్నిసార్లు దుర్మార్గుడైనభర్తే  కారణమవ్వాలని రూలేం లేదు.  శృతి తనను తాను మందలించు కుంటూన్ది . 

        “ఏం జరిగుంటుందమ్మగారూ?! ఇలాంటి నాలిముచ్చు  మగాళ్ళ ఆగడాల్ని  ఎన్నాళ్ళని  ఓర్చుకుంటుందేఆడదైనా?  ఎప్పుడో ఒకప్పుడు ఇలా తిరగబడుతుంది “. అంది పేషెంట్ ఒక  ఆమె.  గోపాలం రక్త ధారలతో లోపలికి వచ్చేసరికి చూపించుకుంటున్న ఆమె ఒక పక్కన నిలబడి అతన్ని గమనిస్తోంది. 

       ఆమె మాటలు విని గోపాలం వెన్ను నిటారుగా అయింది. కళ్ళు  రోషంతో జ్వలించాయి.  అతని రియాక్షన్ని  చూసి ఆమెను మందలించి బయటకు పంపింది శృతి. 

       “మగాడు భార్య ని కొడితే “దుర్మార్గుడు” మంచిగా ఉంటే “చవట” అని తేలిగ్గా ముద్రలు వేస్తారు. భార్యను కొట్టే మగాళ్లని నేనేమ్ వెనకేసుకు రావడం లేదు.  కానీ అసలు చాలామంది మగాళ్ళలా  ఎందుకు ప్రవర్తిస్తారో మీకు తెలుసా?..  దెబ్బల కంటే ఎక్కువగా మాటలతో హింసించే ఆడవాళ్ళు ,తమ ఓర్పుతో, నేర్పుతో ఇంటిని ఆనంద నిలయం గా చేయడం కాక రణరంగం గా  మార్చి ప్రతిక్షణం సాధించే వాళ్ళు, భర్త తన కోసం ఎంత చేసినా సంతృప్తి లేకుండా ఇంకా ఏవేవో గొంతెమ్మ కోరికలు ఇంట్లో అశాంతి సృష్టించే ఆడవాళ్ళు, సూటిపోటి మాటలతో,వ్యంగ్య బాణాల్తో   ఎంతటి సహన వంతుడికీ  పిచ్చెక్కించి,అతనిలోని మంచితనాన్ని చంపేసి, రాక్షసత్వాన్ని నిద్రలేపి,తన్నక  తప్పని పరిస్థితి తీసుకొచ్చే ఆడవాళ్ళు..” ‘ ఆశ్చర్యంగా అతని ఆవేశాన్ని గమనిస్తూమ్ ది శృతి. 

       “నా మట్టుకు నేను నా భార్య నుంచి ఆశించినది చాలా స్వల్పమైన విషయాలు.  నేను కష్టపడి సంపాదించి తెచ్చిన దాంతో ఒబ్బిడిగా  సంసారాన్ని నడపాలని, పొదుపుగా ఉంటూ పిల్లల కోసం కొంత వెనకేయాలని , నాకు ,పిల్లలకు, వేళకు అమరుస్తూ సజావుగా సంసారం నడిచిపోయేలా  చూడాలనీ , ఇందులో తప్పేమైనా ఉందా చెప్పండి?” శృతి అభిప్రాయం కోసం అడిగాడతను. 

       “తప్పేముంది”? చిన్నగా అంది శృతి. 

       “అవునా? ఇది ఏ సగటు మగాడైనా  కోరుకునే కనీస కోరికలు.  కానీ నా భార్య ఎప్పుడు ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. సినిమాల్లోలా  చెట్టాపట్టాలేసుకుని చెట్ట్లూ,గుట్టలూ  పట్టుకు తిరిగితే అయిదు వేళ్ళూ నోట్లోకెళ్ళేదెలా?  కుబేరుడి  దత్తపుత్రికలా తెచ్చిన డబ్బు చీరలకీ, గాజులకీ, పౌడర్లకీ చేస్తుంటే ఎన్నాళ్ళని ఓపిక పట్టను? చూశాను, చూశాను, ఓపిక ఉన్నంతవరకు నచ్చజెప్పాను.  అప్పట్నుంచి మొదలెట్టింది సాధింపు.  ప్రతిదానికి అలగడం,మొండి సమాధానాలు చెప్పడం,కక్షగా ప్రతీదీ యతిమతంగా   చెయ్యటం,ఈ రోజు ఎంతో అలిసి పోయి జ్వరం తో ఒళ్ళు నలగ్గొట్టి నట్లుగా వుండి ఇంటికి వెళ్ళాను. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. ఇల్లు నానా  బీభత్సం గా  వుంది.వంటావార్పూ లేకుండా నా భార్య ముసుగుతన్ని పడుకునుంది. కోపంతో దహించుకు పోయాను!”మొండితనాన్నిక్కూడా  హద్దుండాలి.  ఏమిటీ వేషం రోజూ?” అంటూ విసురుగా చెయ్యి పుచ్చుకు లేపాను.అంతే,సివంగిలా లేచి నా మీద పడింది.చూసారుగా ఇవన్నీ మీరు?” గాయాలవంక చూసుకుంటూ చెప్తున్నాడతను. నోటమాటరాక,రెప్ప వెయ్య కుండా చూస్తూ వింటూంది శృతి.

           *****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.