మిట్ట మధ్యాహ్నపు మరణం- 7

– గౌరీ కృపానందన్

రిసెప్షన్ కి పక్కనే ఉన్న గదిలోకి ఉమను తీసుకెళ్ళారు ఇన్స్పెక్టర్ మాధవరావు. గది గుమ్మం దగ్గర ఎవరెవరో కెమెరాలతో నిలబడి ఉన్నారు.

“ఇప్పుడు ప్రెస్ కి న్యూస్ ఏమీ లేదు. ప్లీజ్.. దయచేసి విసిగించకండి.”

“మీరు రండి మిసెస్ మూర్తి! కాస్త ఫాను ఆన్ చెయ్యవయ్యా.”

కూర్చున్నదల్లా ఏడవసాగింది. మళ్ళీ మళ్ళీ ఉధృతంగా వచ్చేసింది ఏడుపు.

“మిసెస్ మూర్తి! ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. ఈ సమయంలో మిమ్మల్ని ఎక్కవ ప్రశ్నలు అడిగి బాధ పెట్టను. మినిమం ప్రశ్నలు మాత్రమే. జరిగిన ఈ సంఘటనను మీ బంధువులకు తెలియ పరచాలి కదా.”

“అమ్మా నాన్నలకి.” అన్నది.

“అడ్రస్ చెప్పండి.”

ఆలోచించింది. కూడబలుక్కుంటూ ఎలాగో అడ్రస్ చెప్పింది.

“నాన్నగారి పేరు రామనాధన్. అడ్రస్…” మెల్లగా ఒక్కొక్క పదంగా చెప్పింది.

“టెలిఫోన్ ఉందా?”

“ఉంది. పక్కింట్లో.”

“ఫరవాలేదు. మెసేజ్ ఇచ్చి, వాళ్ళు సాయంత్రం ప్లయిట్ లో వచ్చేటట్లు చూస్తాము. బెంగళూరులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?”

“మణి.”

“మణి ఎవరూ?”

“మేనమామ.”

“ఎక్కడ ఉంటాడు?”

“ఇక్కడికి వచ్చాడు, ఏదో కంపెని మీద. కంపెని పేరు… నార్త్… సరిగ్గా తెలీదు.”

“ఫరవాలేదు. తరువాత చూసుకుందాం. మిసెస్ మూర్తి! మీ పేరు ఏమిటి?”

“ఉమ.”

“మాయా అని ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళున్నారా?”

“మాయా?”

“ఓ.కె. ఉమా! ఇప్పుడు నాతో వచ్చి మీ భర్తను గుర్తు పట్టగలిగే స్థితిలో ఉన్నారా?”

“ఎక్కడికి?”

“నాలుగో అంతస్తుకి. అక్కడ ఫింగర్ ప్రింట్స్ తీస్తున్నారు. జస్ట్ ముఖం చూసి గుర్తు పడితే చాలు.”

“అక్కడికి  రాను.” తల అడ్డంగా తిప్పింది.

మాధవరావు పక్కనే నిలబడ్డ  మరో ఇనస్పెక్టర్, “లెటస్ వెయిట్” అన్నారు.

ఎవరు వీళ్ళంతా?నన్ను ఏదేదో ప్రశ్నలు అడుగుతున్నారెందుకు?

ఉమకు తల తిరుగుతున్నట్లు అనిపించింది.

డాక్టర్ వచ్చాడు. “ఈ టాబ్లెట్ వేసుకుని కాసిని మంచి నీళ్ళు తాగండి.”

డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ ను మరో మాట మాట్లాడకుండా వేసుకుంది.

“ఏమిటా టాబ్లెట్?”

“నిద్ర పట్టడానికి టాబ్లెట్.”

“మణికి తెలియ చేశారా?”

“కంపెని పేరు సరిగ్గా తెలియదే?”

“మీరు చెన్నై లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ని కాంటాక్ట్ చేసి కబురు చెయ్యండి.”

తన చుట్టూ జరిగే విషయాలతో తనకే మాత్రం పట్టనట్లు అలాగే కూర్చుంది ఉమ.

మళ్ళీ నాలుగో అంతస్థుకి వెళ్ళారు మాధవరావు. అక్కడ ఇనస్పెక్టర్ గోపీనాద్ ని చూసి, “హలో! మీరూ వచ్చారా? ఎలా జరుగుతోంది మీ ఇన్వెస్టిగేషన్?”

“ఫింగర్ ప్రింట్స్ క్లియర్ గా ఉన్నాయి. నిలువుటద్దంలో చూశారా?”

“పోస్ట్ మార్టం కి ఎప్పుడు పంపించాలి?”

“ఇంకో అరగంటలో. మీరు ఎంక్వయిరీ ప్రారంభించారా?”

“ఆ.. మొదట రిజిస్టర్ బుక్ ని అడిగాను.”

“ఎవరైనా కొత్తగా వచ్చారా?”

“తెలియదు. ఈ ఏరియాని పూర్తిగా పరిశీలించాలి. కొంచెం అనుమానం ఏర్పడినా వాళ్ళని ఇంటరాగేట్ చేయాలి.”

నిలువుటద్దం కేసి చూశారు.

MAYA అన్న అక్షరాలలో M చిన్నగానూ ఆ తరువాత అక్షరాలు పొందిక లేకుండా క్రమంగా పెద్దగా కనిపించాయి. ఆ పదానికి అర్థం ఏమిటి?

“మూర్తిని ఇంతగా ద్వేషించే వ్యక్తి ఎవరై ఉంటారు? ఇంత కోపంతో, క్రూరంగా హత్య చేయాల్సిన కారణం ఏమై ఉంటుంది?”

“బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారా? సీరం దొరుకుతుందా?” శాంపిల్స్ తీస్తున్న వ్యక్తిని అడిగాడు గోపీనాథ్.  

“సీరం దొరకడం కష్టం సార్.”

“ఈ గోడ మీద ఉన్న రక్తాన్ని అలాగే తీసి భద్ర పరచండి.”

“సార్! మంచం క్రింద కత్తి దొరికింది సార్.”

“ఫింగర్ ప్రింట్స్ ని డిస్టర్బ్ చేయకుండా పాక్ చేయండి.”

“సార్! శవాన్ని మూసేయ మంటారా?”

“మూసేయండి.”  

MAYA అన్న అక్షరాలు ఐ బ్రో పెన్సిల్ తో వ్రాసినట్లుంది. ఒక స్త్రీ ఈ హత్యను చేసి ఉంటుందా? మాధవరావు ఆలోచిస్తూ ఉండిపోయారు.

“భార్యను పిలిపించి ఒకసారి ఐడెంటిఫై చేయించడం మంచిది. ముఖం మాత్రం మూసేయకండి.”

“కొంచం కోలుకుని ఉంటుందనుకుంటాను.”

“మేనేజర్ సార్! ట్రంకాల్ ఏదైనా వచ్చిందా?”

“ఇంకా రాలేదు.”

క్రింద గదిలో పడుకుని ఉన్న ఉమ ఉన్నట్టుండి లేచింది. పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్, “ఏం కావాలమ్మా?” అని అడిగింది.

“నేను వెళ్ళాలి. నా బాబ్జీని చూడాలి.”

“వాళ్ళే పిలుస్తారమ్మా.”

“లేదు. నేను వెళ్లి చూడాలి. లేకపోతే అతని ముఖాన్ని కూడా మరిచి పోతాను.” పిచ్చి పట్టినట్టు పరిగెత్తినట్టుగా వెళ్ళింది.

ఎదురుగా ఇనస్పెక్టర్ మాధవరావు వచ్చారు. “ఎక్కడికి వెళుతున్నారు?”

“గదికి.”

“నేను మిమ్మల్ని తీసుకు వెళతాను. నాతో రండి.”

తడబడుతున్న అడుగులతో అతని వెనకాలే నడిచింది. అదే గది 424.

“జరగండి… జరగండి.”

గదిలోకి వచ్చిన ఉమ, దిగ్బ్రమ చెందిన దానిలా అలాగే నిలబడి పోయింది.

మూర్తిని ఇప్పుడు పడుకోబెట్టారు. మెడడాకా తెల్లని బట్టతో మూసి ఉంచారు. కొద్దిగా తెరిచిన నోరు. కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి. 

“మిసెస్ ఉమా! ఇతనేనా మీ భర్త?”

అవును అన్నట్లుగా తల ఊపింది. “ఈ హత్యను ఎవరు చేశారు? ఎంత రక్తం? ఆయన ఎవరికి ఏ హాని చేశారు చెప్పండి?” పిచ్చిదానిలా ప్రశ్నించింది.

“వి విల్ ఫైండ్ అవుట్ మిసెస్ ఉమా!”

ఉమ మూర్తి పక్కన కూర్చుంది. మెల్లగా చేయి  చాచి మూర్తి చెంపలను తాకుతూ, “బాబ్జీ… బాబ్జీ” అని పిలిచింది.

“మిసెస్ ఉమా! లేవండి ప్లీజ్.”

ఎందుకు అన్నట్లు తలెత్తి చూసింది.

“సార్ చెన్నై నుంచి కాల్. మిస్టర్ రామనాధన్.”

“ఉమా! మీ నాన్నగారితో మాట్లాడతారా?”

ఉమ లేచింది. పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి టెలిఫోన్ తీసింది.

“ఉమా! నేనమ్మా నాన్నని. ఏమైంది తల్లీ?” దుఃఖంతో ఆయన గొంతు పూడుకుపోయింది.

“నాన్నా! నాన్నా!” ఏడుపు ఉప్పెనలా ముంచుకొచ్చింది.

“చూడమ్మా ఉమా! నేను సాయంత్రం ఏడూ గంటలకల్లా వచ్చేస్తాను. అక్కడే జాగ్రత్తగా ఉండు తల్లీ. కాస్త ధైర్యంగా ఉండమ్మా. మణికి ఫోన్ చేశాను. అతను వెంటనే అక్కడికి వస్తున్నాడు. జరిగిందంతా ఒక పీడ కల అనుకో. వచ్చేస్తున్నాం తల్లీ.”

“నాన్నా… నాన్నా… ఇదంతా ఎందుకు జరిగింది?”

“ఏమని చెప్పగలం తల్లీ. మన తలరాత… అతని విధి.”

అమ అక్కడే నేల మీద కూల బడింది. ఎవరు చేసి ఉంటారు? ఎవరికీ ఇంత శతృత్వం ఉంది? హనీమూన్ కి వచ్చిన రెండవ రోజే మూర్తిని చంపేసింది ఎవరు?

టెలిఫోన్ రిసీవర్ టేబిల్ మీద నుంచి క్రిందికి వేలాడింది.

మాధవరావు రిసీవర్ తీసి, “మిస్టర్ రామనాధన్! ఎప్పుడు వస్తున్నారు?” అని అడిగారు.

“సాయంత్రం ప్లయిట్ కి వచ్చేస్తాం. అంతవరకూ నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి సార్.”

“అఫ్ కోర్స్! మూర్తి పేరంట్స్ కి ఈ న్యూస్ తెలియ చేయగలరా?”“

“తెలియ చేస్తాను సార్. నా బావమరిది మణి, నార్త్ సైట్ ఇండస్ట్రీస్ ఆడిట్ కోసం బెంగళూరు కి వెళ్ళాడు. అతనికి ఇన్ ఫార్మ్ చేశాను. అతను వస్తే ఉమను చూసుకుంటాడు. ఏమైంది సార్? అసలు ఏం జరిగింది?”

“దాన్ని తెలుసుకోవాలనే మా ప్రయత్నం.”

పేరు : కృష్ణమూర్తి

వయసు: సుమారు 26.

ఎత్తు:     5”8

కర్నాటక పోలీస్ ఫారం నంబరు 14 లో వివరాలు పూర్తి చేయబడ్డాయి.

మూర్తి శవాన్ని స్ట్రక్చర్ లో తీసుకెళ్తూ ఉండగా మణి అక్కడికి వచ్చి చేరాడు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.