వెనుతిరగని వెన్నెల(భాగం-34)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళిజరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. కష్టమ్మీద తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసవుతుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. తన్మయి స్థానిక రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగానికి కుదురుకుని జే.ఆర్.ఎఫ్ కూడా సాధిస్తుంది. 

***

తన్మయి లేడీస్ పీ.హెచ్.డీ హాస్టలు చూసొద్దామని బయలుదేరింది.

హాస్టలు సముద్రం ఒడ్డున ఉన్న పీజీ హాస్టలు దగ్గర్లో కాకుండా యూనివర్సిటీ కాంపస్ కి దగ్గర్లో ఉంది. తెలుగు డిపార్టు మెంటు నించి రెండు బస్టాపుల దూరం. కాస్త సమయం ఉంటే నడిచి కూడా వెళ్ళోచ్చు. విశాఖపట్నంలో ఉన్న సౌందర్యమంతా కొండ ఎక్కి, దిగినట్లుండే రోడ్లలో ఉన్నప్పటికీ దాదాపు సగం కొండ దిగువన ఉన్న బస్టాపు లో దిగి ఎత్తుకి ఎక్కి  హాస్టలు ప్రాంగణంలోకి అడుగు పెట్టేసరికి చెమట్లు ధారాపాతంగా కారసాగేయి తన్మయికి. బుడిబుడి అడుగులేసుకుని ఎక్కడా ఎత్తుకోమనకుండా తనతో నడుస్తూన్న బాబుని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది

పీజీ హాస్టలుకి ఉన్నట్లు కాపలాలేవీ లేవు ఇక్కడ. అసలు గేటే సగం విరిగి పక్కకి పడి ఉంది.

ఏదో ఒక పాత భవంతి అది. ప్రాంగణం లో పిచ్చి పిచ్చిగా పెరిగిన గడ్డి మధ్య ఉన్న కాలిబాట గుండా నడిస్తే పైకి అయిదారు మెట్ల మీద ఉన్న పెద్ద గది లోకి అడుగు పెట్టేరు. గుమ్మం దగ్గర వాచ్ మేన్ కోసంనామ్ కే వాస్తేఅన్నట్లు ఒక కుర్చీ వేసి ఉంది. ముందు గదిలో ఒక మూలగా టీవీ చుట్టూ పది పదిహేను మకిలి పట్టిన ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి. నైటీల్లో ఉన్న నలుగురయిదుగురు అమ్మాయిలు తమ వైపోసారి చూసి తల తిప్పుకున్నారు. అంతా తైల సంస్కారం లేని జుట్లు  ముడేసుకుని ఉండడం గమనించింది తన్మయి.

సందేహంగా అక్కడే పది నిమిషాలు కూచుంది తన్మయి. బాబు ఒళ్లో నుంచి దిగి టీవీకి దగ్గర్లో ఉన్న కుర్చీ మీద కూచుని తదేకంగా ఆసక్తిగా చూడసాగేడు.

వివేకానందా పాఠశాలలో టీ.వీ లేకపోవడం వల్ల వాడికి టీవీ చాన్నాళ్ళకి కనబడింది పాపం

టీవీని, వాడి ఆసక్తిని చూడగానే తన్మయికి తను మొదటి సారి టీవీ చూసిన జ్ఞాపకం మెదిలింది

తన్మయి ఎనిమిదో తరగతి లో ఉండగా ఊళ్ళో బాగా డబ్బులున్న వాళ్ళ ఇళ్ళలో బ్లాక్ & వైట్ టీవీ లొచ్చేయి.

తనతో  బళ్ళో చదువుతున్న పక్క బెంచీ అమ్మాయి వాళ్ళ పెదనాన్న గారిల్లు అందులో ఒకటి

ఇంకేం మరి, స్నేహితురాళ్ళ తో బాటూ కలిసి వింతేదో చూడడానికి వెళ్ళింది తన్మయి.

పెద్ద మండువా లోగిలిలో హాలంతా పరిచి ఉన్న చాపలలో చివరి సీటు దక్కింది. టీవీ స్క్రీన్ ని ఆన్  చెయ్యగానే  పెద్ద పెద్ద చుక్కలు చాలా సేపు వచ్చేయి. ఇంటికి పైనెక్కడో ఉన్న పెద్ద ఆంటీనా ని కదుపుతూ ఇంటి వాళ్ళు పాపం చాలా కష్టాలు  పడ్తున్నారు. పై నించి వచ్చిందాఅంటూ కొందరు. కింద నున్న హాల్లోరాలేదుఅని కొందరు. మొత్తానికి టీవీ మీద అలుక్కుపోయినట్లు మొదటి బొమ్మ కనీ కనబడగానే అంతా ఆనందాశ్చర్యాలతో గట్టిగా చప్పట్లు కొట్టేరు.

పాట్లు గుర్తు రాగానే తన్మయి పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు వెలిసింది

కాస్సేపు అలాగే కూచుని, ఇక లాభం లేదని తన్మయి లేచి గది దాటి, వెనక వైపున్న మరో ప్రాంగణం వైపు కదిలింది. బాబు వెంటనే తన్మయి వైపు పరుగెత్తుకొచ్చేడు. అంతసేపూ అక్కడున్న వారిలో ఒక్కరు కూడా బాబుని కూడా పలకరించకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది తన్మయికి

లోపల ఉన్న పెద్ద భవంతి చూసి ఆశ్చర్యచకితురాలైంది తన్మయి. అదేదో పురాతన రాజ భవంతిలా ఉంది

చుట్టూ రెండస్తుల్లో గదులున్నాయి.

మధ్య అంతా సిమెంటు చేసి ఉన్న పెద్ద ఖాళీ ప్రాంగణం. పైన కప్పు లేకుండా ఆకాశం కనిపిస్తూ ఉంది. చివరగా అటూ, ఇటూ  పైకి మెట్లు.

గొప్ప రాతి కట్టడమది. చాలా పురాతనమైన భవంతి అనడానికి సాక్ష్యంగా అక్కడక్కడా రాతి పగుళ్ళ మధ్య నించి మొక్కలు మొలకెత్తి ఉన్నాయి.

తన్మయి సందేహంగా చుట్టూ చూసింది. వరండా అంతా నిర్మానుష్యంగా ఉంది.

ఎక్కడో ఒక గదిలో నించి రేడియో శబ్దం వినిపిస్తూంది.

వెనక్కి చూస్తే ముందు గది అడ్డంగా ఉండడం వల్ల బయటి నించి వచ్చిన గేటు కానరాలేదు. లోపలికి ఉండడం వల్ల ఇంత పెద్ద భవంతి ఇక్కడ ఉన్నట్లే బయటి ప్రపంచానికి తెలియనట్లు ఉంది.

ఎడమ వైపు మొదటి గది తాళం వేసి ఉంది. కుడివైపు మొదటగా ఒక చిన్న గది ఉంది. “ఎటు వెళ్దామా?” అని చూస్తున్నంతలో బాబు చెయ్యి వదిలేసి ఎడమ వైపున్న రెండో గది వైపు పరుగెత్తేడు.

తన్మయి చప్పున గుమ్మం వరకు పరుగెత్తింది వాడి వెనక. పలుచని చీర కర్టెన్ లోపల చాల పెద్ద విశాలమైన గది కనిపించింది. పీజీ హాస్టలులో దాదాపు నాలుగైదు గదులు కలిపినంత పెద్ద గది అది. తలుపు దగ్గర చప్పుడయ్యేసరికి గదికి ఒక మూలగా ఉన్న మంచానికి ఒక వైపు నేల మీద మోకాళ్ల మీద కూచుని, మంచమ్మీద మోచేతులుంచి, తల నిండా కొంగు కప్పుకుని క్రైస్తవ ప్రార్థన చేస్తున్న నడి వయసు అమ్మాయి కళ్ళు విప్పింది.

తన్మయి తన తప్పు తెలుసుకుని, “క్షమించండి, బాబు పరుగెత్తుకొచ్చేసేడుఅంది.

ఫర్వాలేదు, లోపలికి రండి.” అత్యంత ప్రసన్నవదనంతో అందా అమ్మాయి.

సాదరమైన పిలుపుకి తన్మయికి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించి ఆనందం వేసింది

నమస్తే, నా పేరు తన్మయి. కొత్తగా రీసెర్చి స్కాలర్ ని కాబోతున్నాను. హాస్టలు చూద్దామని వచ్చేనండీ.” అంది.

అండీ అనక్కరలేదు మేరీ అని పిలవండి చాలు, కొద్దిగా కాఫీ తీసుకుంటారా?” అంది లేచి మళ్ళీ  అదే చిర్నవ్వుతో.

అప్పటి వరకు ఉన్న బెరుకు కొంచెం కాస్త తగ్గి, “ఆహా వద్దండి. అడిగేరు అంతే చాలు. ఇక్కడ వార్డెను ఎక్కడుంటారు?” అంది తన్మయి.

బదులుగాచూపిస్తాను. వీడు మీ అబ్బాయా?” భలే ముద్దుగా ఉన్నాడు అని,

 “ఏమోయ్, గర్ల్స్ హాస్టలులో ఉంటావా మరి?” అంది దగ్గరకు చెయ్యి చాస్తూ.

పాతా కొత్తా లేకుండా, దగ్గరకు వెళ్లి తలూపుతూఉంతాఅన్నాడు ముద్దుగా.

అమ్మాయి కిలకిలా నవ్వింది. పొట్టిగా, లావుగా, చూడడానికి సీరియస్ గా, పెద్దదానిలా  కనబడుతూన్నా నవ్వితే చాలా చిన్నపిల్లలా కనిపించింది

తన్మయి చుట్టూ పరికించింది. అత్యంత పరిశుభ్రంగా ఉన్న గదికి ఒక మూలగా చిన్న వత్తుల స్టవ్వు, కొద్దిగా సామాన్లు, ఒక రైటింగు టేబులు, టేబుల్ లాంపు, కర్టెన్లు వేసున్న గోడ అల్మారాలో పొందికగా సర్ది ఉన్న బట్టలు, పుస్తకాలు. గోడకి తగిలించి ఉన్న మేరీమాత పటం.

అక్కడక్కడా పెళ్ళలు ఊడిపోయిన గచ్చుకి స్వయంగా మట్టి మెత్తినట్లు స్పష్టంగా తెలుస్తూంది

గదికి రెండో వైపు మరో మంచం, మరో టేబులు , కుర్చీ ఖాళీగా ఉన్నాయి.

ఇంత పెద్ద గదికి ఇద్దరేనా?” అంది తన్మయి ఆశ్చర్యంగా.

హాస్టలులో మొత్తం 25 గదులున్నాయి తన్మయీ. మొత్తం స్కాలర్సు ఉన్నది పదిహేను మందిమే

విడిగా ఒక్కో గదిలో ఉండలేక కొందరు ఒకే గదిలో ముగ్గురు కూడా ఉంటారు

అంతా ఎవరిష్టం వారిది. నా గదిలో మొదట్నించీ నేనొక్కదాన్నే ఉంటున్నాను. మీకభ్యంతరం లేకపోతే మీరు నా గదిలో ఉండొచ్చు.” అంది మేరీ బాబుకి డబ్బా లో నుంచి బిస్కెట్టు తీసి ఇస్తూ.

చాలా థాంక్సండీ. ఇంత కంటే అదృష్టం ఇంకోటి ఉండదుఅంది తన్మయి.

అసలు ఇంత పరిశుభ్రంగా, అందంగా గదిని ఉంచుకోవచ్చని అప్పుడే తెలుసుకుంది తన్మయి.

చుట్టూ కిటికీలకు అందమైన లేత గులాబీరంగు చీర కర్టెన్లు, అమ్మాయి మంచమ్మీద తెల్లని అందమైన దుప్పటీ.

గదిలో చెప్పులతో సహా ఎక్కడ ఉండాలో అక్కడే ఒద్దికగా ఉన్నాయి.

చూడగానే మేరీ తన్మయికి బాగా నచ్చేసింది.

మీ వాడు ఎంత తెల్లగా ముద్దొస్తున్నాడో! నేను వీడి దగ్గిర మరీ నల్లగా ఉన్నానుఅంది నవ్వుతూ అప్పటికే గదిలో అటూ ఇటూ పిల్లిమొగ్గలు వేస్తున్న బాబుని మురిపెంగా చూస్తూ.

నలుపు, తెలుపులలో అందం ఉండదండీ, మంచి వ్యక్తిత్వంలో తప్ప.” అంది తన్మయి

మేరీ తన్మయి వైపు ఆశ్చర్య చకితురాలై చూసిచాలా చక్కగా చెప్పేరుఅంటూ  

పదండి మీకు హాస్టలు చూపిస్తానుఅని గది తాళం వేసి ముందుకు నడిచింది మేరీ.

హాస్టలు వరండాలోని కుడి వైపు గది తలుపు మీద చిన్నగా కొట్టి, ” వార్డెను ఆంటీ! కొత్త అమ్మాయి వచ్చిందిఅంది

పెద్ద బొట్టు పెట్టుకుని చూడడానికి కొంచెం కఠినంగా కనబడుతున్న ఒక పెద్దామె వచ్చింది జుట్టు ముడేసుకుంటూ.

డిపార్టుమెంటు?” అంది సీరియస్ గా.

తెలుగండీఅంది నెమ్మదిగా తన్మయి.

పేరు, ఇంటి పేరు…” అంటూ వివరాలు రిజిస్టరు లో రాసుకున్నాక, వరండా మధ్య ఉన్న ఖాళీలో అటూ ఇటూ తిరుగుతున్న బాబుని చూస్తూ, “ పిల్లోడెవరూ?” అంది నొసలు చిట్లించి

మా అబ్బాయిఅంది

మరి నువ్వు హాస్టలు లో ఉంటే పిల్లోణ్ణి మీ ఆయన చూస్తాడా?” అంది.

అహాహా, బాబు నాదగ్గరే ఉంటాడుఅంది తన్మయి.

అలా ఉండడానికి హాస్టలు రూల్సు ఒప్పుకోవు, ఇది తల్లీపిల్లల హాస్టలు కాదు. కేవలం లేడీస్ హాస్టలుఅంది ఒత్తి పలుకుతూ.

మాట వినగానే ఏదో అర్థమైనట్లు బాబు పరుగెత్తుకొచ్చి తన్మయి కాళ్ళని చుట్టుకున్నాడు కాస్త భయంగా.

వాణ్ణలాగే పొదివి పట్టుకుని, “అయ్యోఅంది తన్మయి.

తన్మయి ఏదో అనబోతూండగా మేరీ మధ్యలో అందుకుని, “అలాగేలెండి, మీరు స్ట్రిక్టని తెలుసు కదాఅంది తన్మయి చెయ్యి పట్టుకుని రమ్మన్నట్లు బయటికి లాగుతూ.

ఏవిటీ, నీ రూములోనే ఉంటుందా పిల్లఅంది గట్టిగా వెనక నించి వార్డెను.

అవును, రాసుకోండిఅంది మేరీ.

గది తాళం తీసి, “మిగతా హాస్టలు తర్వాత చూద్దాం లే. ముందు లోపలికి రా. నా కంటే చిన్నదానివే అయి ఉంటావు నువ్వు. అందుకే నువ్వు అంటున్నాఏవీ అనుకోకు. మంచి నీళ్ళు తాగు ముందు. ” అంది తన మంచమ్మీద కూచోబెడుతూ.

కొద్దిగా స్థిమిత పడుతూన్నట్లున్న తన్మయి ముఖం వైపు చూస్తూ, “ఏవిటి ప్రాబ్లం!” అంది మేరీ.

మొదటి పరిచయంలోనే మీకు చెప్పాల్సి వస్తూంది. అని తన కథని టూకీగా చెప్పింది తన్మయి.

కళ్ళ నిండా నీళ్ళతో చప్పున దగ్గరికి వచ్చి, “అయ్యో, ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చింది!” అంది చెయ్యి పట్టుకుంటూ మేరీ.

చెయ్యినలాగే వదలకుండా అమ్మాయి ఎప్పటికీ తనకి స్నేహితురాలైతే బావుణ్ణుఅనుకుంది తన్మయి. హఠాత్తుగా వనజ జ్ఞాపకం వచ్చింది.

అనంత ద్వారా లోటు కాస్త తీరినప్పటికీ, వనజకి దూరమైనప్పటి నించి అంతరాంతరాల్లో పేరుకుపోయిన దు:ఖమేదో క్షణాన ఉబికి వచ్చింది తన్మయికి

తను అమ్మాయికి ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే కలిసిన తన మీద ఇంత దయ ఆమెకు ఎందుకు కలిగింది?

అజ్ఞాత మిత్రమా! నువ్వు ఎన్ని రూపాలలో నాకు ఎదురయ్యి సహాయపడ్తున్నావో కదా!” అని మనస్సులోనే ధన్యవాదాలు సమర్పించింది.

***

బస్సులో ఇంటికి వెళ్తున్నంత సేపూ ఆలోచిస్తూనే ఉంది తన్మయి.

బాబుని తనతో ఉండనివ్వకపోతే తను హాస్టల్లో ఉండడం ఎలా?

బయటెక్కడైనా ఉండాలంటే ధైర్యం చాలడం లేదు.

అలాగని బాబుని మళ్ళీ అమ్మ దగ్గర వదిలి పెట్టి ఉండడమూ ఇష్టం లేదు.

ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి?”

మేరీ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి.

వివేకానందా పాఠశాలలో రిజైన్ చేసేసావు గనుక, పోనీ ఒక నెల రోజుల పాటు బాబుని అమ్మ దగ్గిర వదిలి రా. అందాక తలదాచుకోవడానికి హాస్టల్ పనికి వస్తుంది. పీ.హెచ్.డీ లో జాయినయ్యి, హాస్టల్లో చేరేక నిదానంగా ఆలోచించుకోవచ్చుబహుశా: అదే మంచిదేమో.

తనకి ఒక్కతే ఉండడం అంటే ఏదో తెలీని భయం. ఒక్కతే సినిమాకు కూడా వెళ్లలేని తను ఏకంగా ఒక ఇల్లు తీసుకుని చిన్న పిల్లాడితో ప్రపంచంలో మనగలదా?

తనలాంటి వాళ్ళు అసలు ఎలా ఉండగలుగుతున్నారో ఏమో.” పిరికితనంతో  తనలో తనే కుమిలిపోసాగింది తన్మయి. వెంటనే శేఖర్ మీద కోపం ముంచుకొచ్చింది.

తనేం పాపం చేసింది? ఇలా అనుక్షణం క్షోభననుభవించాల్సి వస్తూంది?”

ఒళ్ళో నిద్రపోతున్న బాబు లేత చెంపల్ని నిమిరింది.

నన్ను క్షమించురా నాన్నా. మళ్లీ  కొన్నాళ్ళు నీకూ, నాకూ ఎడబాటు తప్పదు.” 

ఇంటికి చేరుతూనే తల్లి కాస్త ముభావంగా ఉండడం గమనించింది తన్మయి.

ఇన్ని రోజుల తర్వాత తను ఇంటికి వస్తే కాస్త నవ్వుతూ పలకరించకపోయేసరికి తన్మయికి బాధ రెట్టింపయ్యింది.

తల్లి అలా ముఖం ముడుచుకున్నప్పుడల్లా అందుకు తన పెళ్ళి, అది కాస్తా ఇలా పెటాకులయ్యి పరిణమించడం కారణంగా భావించి తన్మయి న్యూనతకు గురికాసాగింది.

తండ్రి  బాగా నీరసించిపోయ్తినట్లు  కనిపించేడు. అంతకంతకూ ఆయన ఆరోగ్యం క్షీణించడం వెనుక తన జీవితమే కారణం.

ఛీ, కన్నతల్లిదండ్రుల్ని సంతోషంగా ఉంచలేని బతుకు తనది.” 

రాత్రంతా కలత నిద్రతో గడిపింది తన్మయి.

—-

తెల్లారి తన్మయి లేచే సరికి బయట వరండాలో పరిచితమైన స్వరాలు వినిపించేసరికి దిగ్గున నిద్ర లేచింది తన్మయి

బాబు చాలా అస్థిమితంగా అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడు

“తన పక్క నించి ఎప్పుడు లేచాడో ఏమోతెల్లవారు ఝాము వరకూ సరిగా నిద్ర పట్టలేదు. ఇక తెల్లవారగానే మెలకువ రాలేదు.” 

పరుగెడుతున్న బాబుని ఆపి మూతి తుడిచింది. జ్యోతి వాడికి పాలు పట్టించినట్లుంది.

మూతికటూ ఇటూ పాలచారికలతో బాటూ చేతిలో పెద్ద ఫైవ్ స్టార్ చాక్లెట్టు విప్పుకుని తింటున్నాడేమో మన్ను తింటున్న కృష్ణుడిలా కనిపించేడు.

వాణ్ణి ఎత్తుకుని ముద్డాడిఎక్కడికిరా పరుగులు? పొద్దున్నే చాక్లెట్టు ఏవిటి?”  అంది తన్మయి.

బదులుగాఅమ్మా! “తిరుగుబోతుఅంటే ఏంతి?” అన్నాడు

హఠాత్తుగా వాడి నోటి వెంట వచ్చిన మాటకి  ఆశ్చర్యపోయింది తన్మయి. “ఎవరన్నార్రా? అసలిలాంటి మాటలు ఎలా నేర్చుకుంటున్నావు?” అంది.

మరి బయట నాన్న ఉన్నాడుగా. ‘ఎక్కడికెళ్ళేవు?’ అని అడిగేను. “మీ అమ్మ తిరుగుబోతురా”  అందుకే వెళ్లిపోయేను.” అని చెప్పేడు.

తన్మయికి విపరీతంగా కోపం పెల్లుబికి వచ్చింది. “పసి పిల్లాణ్ణి కూడా చెడగొడుతున్నాడుఅని పళ్ళు నూరుకుంది

మధ్య గదిలోకి వస్తూనే వరసగా శేఖర్ తల్లి, పిన్ని, తాతయ్య, మావయ్య గొంతులు వినవచ్చాయి.

వరండాలో మడత కుర్చీలో కూచున్న భానుమూర్తి నీరసమైన స్వరమూ విన వచ్చింది

వంటింట్లో కాఫీలు పెడుతున్న జ్యోతి నిన్న రాత్రి లాంటి ముడుచుకున్న ముఖంతోనేలేచావా? కాస్త కాఫీలు పట్టుకెళ్ళుఅంది.

స్వరంలో నిష్టూరం విని తన్మయికి చికాకు వచ్చింది.

తనకి తెలియకుండా వాళ్ళెందుకు వచ్చారు?

పైగా అదేదో తన తప్పన్నట్లు తల్లి ఇలా నిష్టూరంగా మాట్లాడడమేంటి?

అదే అడిగింది అసహనంగా.

అవునమ్మా, అంతా నా మీదే చికాకు పడండి. చేసుకున్నావుగా, అందుకే అనుభవిస్తున్నాం. పిల్లాడి కోసం వస్తున్నాం అంటే ఒకరో ఇద్దరో అనుకున్నా. ఇలా అంతా కలిసి తగలడతారని ఎవరికి తెలుసు?” అంది.

అసలెవరి వైపూ చూడకుండా లోపలికి నిశ్శబ్దంగా కాఫీలు పట్టుకెళ్ళి గుమ్మంలో టీపాయి మీద పెట్టింది తన్మయి

ఏమ్మా, అంతా కులాసాయేనా? కాస్త ఇలా తెచ్చివ్వుఅన్నాడు శేఖర్ తాతయ్య

ఆయనకో కప్పు తీసి చేతి కిచ్చిపెళ్ళి చూపులకి వచ్చినట్లు ఇంకా వీళ్ళకు కాఫీలు చేతికందించడమొకటితనలో తనే తిట్టుకుని లోపలికి వచ్చింది తన్మయి.

శేఖర్ తన వైపు చూసేడో, లేదో అని పట్టించుకునే స్థితి ఎప్పుడో దాటి పోయింది తనకు.

మరో అరగంటలో భానుమూర్తిఅమ్మా, తన్మయీ!” అంటూ పిలిచేడు

జుట్టు ముడేసుకుని అలాగే నైటీతో వెళ్ళి, తండ్రి వైపు ఏవిటన్నట్టు చూసింది.

కూచోమ్మా, అన్నాడు శేఖర్  తాతయ్య.

ఫర్వాలేదు చెప్పండి”  అంది విసుగు ధ్వనించే గొంతుతో.

లేదు, కాస్సేపు మాట్లాడాలి నీతోఅన్నాడు.

అది అంది పుచ్చుకుని శేఖర్ మావయ్యమరేం లేదమ్మా, ఎంతైనా మనం మనం కావాల్సిన వాళ్ళం. విడాకులు, అవీ ఎందుకు గొడవ? సామరస్యంగా సాధించుకుంటే పోలా?” అన్నాడు.

తన్మయి చివ్వున తలెత్తింది.“విడాకులు నేనడిగానా? అతనా?” అంది.

అదేలే, ఎవరడిగితే ఏం?” సామరస్యంగా…” అన్నాడు మళ్లీ శేఖర్ మావయ్య

శేఖర్ గుమ్మం లోంచి బయటకు చూస్తూ కూచున్నాడు మాట మాట్లాడకుండా.

తన్మయికి వద్దనుకున్నా, తనని అనవసరంగా దోషిని చేసి ఇంటిగలవాళ్ళ ముందు అతను ఆడిన నాటకం, కోర్టు  బయట అతను తన వైపు చూసిన నిర్లక్ష్యపు చూపు గుర్తుకు వస్తున్నాయి.

అసలు అతనికీ తనకూ మధ్య ఎప్పుడూ ఏవీ లేనట్లు ఎంత కఠినంగా ప్రవర్తించేడో తల్చుకుంటే అతని మీద కంపరం పుట్టుకొస్తూంది.

పైగా బాబుతో అతను కాసేపటి క్రిందట తన గురించి చెప్పిన చెడ్డ మాటలొకటి

తన్మయి ఏదో అనబోయేలోగా, తండ్రి సంతోషం నిండిన స్వరంతో  “అంత కంటేనా బాబూ, మీరెలా అంటే అలాగేఅన్నాడు.

అర్థం పర్థం లేని తండ్రి మాట విని నివ్వెరపోయింది తన్మయి.

ఇంత జరిగినా ఇంకా ఇలా ఎలా ఆలోచిస్తున్నాడు తన తండ్రి?

 “నాన్నగారూ!” అంది అసహనంగా.

బాబుని పొదివి పట్టుకున్నాడు శేఖర్. వాడు తండ్రిని మరిచిపోనట్లు అతని ఒళ్ళోకి చేరి గట్టిగా కావలించుకున్నాడు.

బాబు వైపు ఆశ్చర్యపోయి చూసింది తన్మయి

చంటి పిల్లాడు కదా, తెలీనితనంఅని సరిపెట్టుకోలేకపోతూ ఉంది తన్మయి. ఏవీ చెయ్యలేని నిస్సహాయత చుట్టూ ఆవరించినట్లయ్యి కళ్ళు మూసుకుంది

ఒక పక్క తండ్రి ఆమోదం చెప్పడం. తనకి విషయం బొత్తిగా సంబంధం లేనిదన్నట్లు తల్లి అసలు బయటికే రాలేదు

శేఖర్ కి  భానుమూర్తి మాటల్తో గొప్ప బలం వచ్చినట్లు  కాళ్ళూపుతూ, గొంతు గట్టిగా  సవరించుకునిఅయితే నాదొక కండిషను.” అన్నాడు ఏదో పెద్ద దయామూర్తి లాగా

చెప్పరా చెప్పు. నీకున్న కండిషన్లన్నీ స్పష్టంగా చెప్పెయ్యి.” అంది శేఖర్ తల్లి ఈసడింపుగా

ఇదంతా వినోదం చూస్తూ అటూ ఇటూ కళ్ళు తిప్పసాగింది అతని పిన్ని.

వీళ్ళందరి ముఖాలు చూడడానికే అసహ్యం వేస్తూ ఉంది తన్మయికి.

చెప్పు బాబూఅన్నాడు భానుమూర్తి.

ఈవిడ ఉద్యోగం చేస్తుందో, ఊళ్ళేలుతుందో తనిష్టం. జీతం పట్టుకొచ్చి నా చేతుల్లో పెట్టాలి. ఇక నేను మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాను, మీకు తెలుసనుకుంటాను. ఆమెని పక్క పోర్షనులో ఉంచుతాను. మేం మా తాత గారింటి పక్కనే అద్దెకి ఉంటాం ఇక మీదట. నేను ఊళ్ళోలేనపుడు ఈవిడెక్కడికి వెళ్ళినా మా వాళ్ళెవరికైనా చెప్పి వెళ్ళాలి.” అన్నాడు ఒక్కొక్క  కండిషనుని  వత్తి  పలుకుతూ

ఇంట్లో కాబట్టి సమయానికి చెప్పులు వేసుకోలేదు తన్మయి, లేకపొతే చెప్పు తీసుకుని అతడిని అక్కడే అందరి ముందూ ఎడా పెడా వాయించాలన్నంత కోపం వచ్చింది తన్మయికి.

గెటవుట్అని వీధి వైపు వేలు చూపిస్తూ అరిచింది లేచి నిలబడి.

తండ్రి తన్మయిని వారించబోతూంటే రెండు చేతులూ జోడించి, “దయచేసి మీరు మాట్లాడకండి నాన్నా మధ్యలోఅంది.

అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? అంతా బయటికి నడవండి ముందు.” అంది మహాకాళిలా.

ఎర్రగా కందిపోయిన ముఖంతో శేఖర్ మాత్రం చాలా కూల్ గాచూసేరా, ఎలా అరుస్తుందో, ఇది రాజీకి రాదని వచ్చేటపుడే చెప్పేను మీ అందరికీఅన్నాడు వాళ్ళ వాళ్ళ ముందు అమాయకత్వం నటిస్తూ

శేఖర్ తల్లి, పిన్ని ఒక్కసారిగా విరుచుకు పడ్డారు.

ఏవిటే పోన్లే కదా అని సంధికి వస్తే రెచ్చిపోతున్నావేంటి? మా వాడు మంచి వాడు కాబట్టి బాబు గురించి ఆలోచించి సంధికి వచ్చేడు. అదే ఇంకెవడన్నా అయితే…” అని మొదలుపెట్టేరు.

బాబు గురించి ఆలోచించే వాడే అయితే ఇల్లొదిలి రోడ్డున నన్నూ, బాబునీ వొదిలి ఎందుకు వెళ్లిపోయేడు? బాబు గురించి ఆలోచించే వాడే అయితే ఎవత్తె తోనో  ఎందుకు కలిసి ఉంటున్నాడు? ఇదిగో అతను ఇచ్చిన విడాకులు నోటీసువిసురుగా  పక్కనే ఉన్న టేబులు సొరుగు లాగి టేబుల్ మీద కాగితాన్ని గిరాటు వేసింది.

“ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీ వాడు నాకు విడాకులు ఇవ్వడం కాదు, నేనే ఇతనికి విడాకులిస్తున్నాను

అంతా కలిసి గంగలో దూకుతారో దూకండి. అంతే కాదు కట్నంగా మా వాళ్ళిచ్చిన సొమ్ము మర్యాదగా వెనక్కి తిరిగివ్వండి. బాబుని చూడడానిక్కూడా వీల్లేదు.” అంది గట్టిగా బాబు చెయ్యి పట్టుకుని గుంజి లోపలికి తీసుకు వెళ్తూ.

తల్లి రౌద్రాన్ని చూసి బెంబేలెత్తో, భుజం నొప్పి పుట్టో, గట్టిగా ఏడుపు లంకించుకున్నాడు వాడు.

వాళ్ళ చెంప వాయగొట్టలేక, గట్టిగా వాణ్ణి వీపు మీద బాది లోపలికి ఈడ్చుకు వెళ్ళింది.

ఒక్క ఉదుటున లోపలి గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. బెంబేలుగా చూస్తూ ఏడుస్తున్న బాబుని దగ్గరకు తీసుకుని గట్టిగా పట్టుకుని గుండెలవిసేలా దు:ఖించసాగింది.

భయంతో ముడుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న తల్లి వైపు వెక్కుతూ చూడసాగేడు బాబు.  

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.