అనుసృజన

          అందరూ కవులు కాలేరు. మా పెదనాన్న కొడవటిగంటి వెంకట సుబ్బయ్య, మా అమ్మ పెదనాన్న చలం చెప్పుకోదగ్గ కవులే! అయినా నేను కవిని కాలేకపోయాను. కాని నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైన సాహితీ ప్రక్రియ కవిత్వం ! ప్రముఖ హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ ని 1966 లో కలిసినప్పుడు నేను హిందీ విద్యార్థిని అని తెలిసి, నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు, నన్ను అనువాదాలు చేయమని ప్రోత్సహించారు. నా అనువాదాలు ప్రచురణకు నోచుకున్నాయి. నాకు నచ్చిన కవితను వెంటనే అనువాదం చెయ్యడం నా అలవాటై పోయింది. అలా చేసిన అనువాదాలే ఇవి:

-ఆర్. శాంతసుందరి

నాన్న పచ్చదనం గురించి ఆలోచించేవాడు

మూలం: మిథిలేష్ కుమార్ గుప్త్

నాన్న ఆలోచనలు ఎప్పుడూ
పొలం గురించే
పంట గురించే
రుతువుల గురించే
వర్షం గురించే
ఎండ గురించే
 
నిజానికి పచ్చదనం గురించే ఆలోచించేవాడు నాన్న
ఎలాంటి పచ్చదనమనుకున్నారు?
దాన్ని చూడగానే మొహాలు పువ్వులై పోవాలి
పిట్టల పాటల్ని వింటూ
మనసు పరవశించి పోవాలి
 
కానీ నాన్న ఆ తర్వాత
ఆలోచించసాగాడు
అప్పుల గురించి
ఒంట్లో శక్తి నశించటం గురించి
అనారోగ్యం గురించి
 
మర్నాటి నుంచీ ఆలోచించటం మొదలెట్టాడు
దగ్గు గురించి
చివరికి మృత్యువు గురించి కూడా
నేనాయన దగ్గరకి విరిసిన పువ్వొకటి
తీసుకువెళితే
 
ఆయన ఆలోచించటం మొదలెట్టేవాడు
అది వాడిపోవడం గురించి
ఎక్కడైనా వాన కోయిల పాట వినబడితే
ఆయన ఆలోచించేవాడు ఏడుపు గురించి .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.