అమ్మ కోపం

-జె. యు. బి. వి. ప్రసాద్

          తెల్లవారు ఝాము నాలుగయింది. అంతే! అలారం, ఘొల్లున మోగింది. జానకమ్మ, చటుక్కున లేచింది. వెంటనే అలారం నొక్కేసింది, భర్తకి నిద్రా భంగం కలగ కూడదని.

          అప్పటికే కొంచెం మెలుకువ వచ్చిన రఘురామయ్య, “అప్పుడే నాలుగయిందా?” అనేసి, మళ్ళీ నిద్రకు పడ్డాడు.

          జానకమ్మ అసలు పేరు, జానకి. ఒక పిల్లాడు పుట్టి, వాడు ఇంటర్మీడియెట్ చదువు లోకి వచ్చేసరికి, జానకి, జానకమ్మ అయిపోయింది. అదేం దిగులనిపించలేదు, ఇంకా నలభయ్యో పడి కూడా రాని జానకమ్మకి.

          గబ గబా లేచి, పక్క గది లోకి వెళ్ళి, “బాబూ, కుమార్‌, నాలుగయింది. లేస్తావా?” అంది మృదువుగా కొడుకు భుజం తట్టి లేపుతూ.

          “లేస్తానమ్మా! ఒక్క ఐదు నిమిషాలు పడుకుని, వెంటనే లేచేస్తాను” అని మామూలు పిల్లలైతే అంటారు గానీ, కుమార్, “లేచానమ్మా!” అంటూ వెంటనే లేచి, బాత్‌రూము లోకి వెళ్ళాడు మొహం కడుక్కోడానికి.

          జానకమ్మ, కొడుకు లేచిన పక్క సర్దింది. ఆ పక్కనే వున్న టేబుల్ మీద పుస్తకాలు కూడా సర్దింది. గదిలో అక్కడా ఇక్కడా పడేసిన వస్తువులు కాస్త సర్దింది. తను మొహం కడుక్కుని, వెంటనే వంటింట్లోకి పరిగెత్తింది.

          గబ గబా టీ తయారు చేసి, ఒక కప్పులో పోసి, ఆ కప్పు పట్టుకుని కొడుకు గది లోకి వెళ్ళింది. అప్పటికే, కుమార్, పుస్తకం తీసి చదవడంలో నిమగ్నమై వున్నాడు.

          “కొంచెం టీ తాగి, చదువుకో కుమార్!” అంది తల్లి, టీ కప్పు అందిస్తూ.

          కుమార్ కప్పు అందుకున్నాడు.

          “ఐఐటీ ప్రిపరేషన్ బాగా జరుగుతోందా నాన్నా?” అని అభిమానంగా అడిగింది ఆ తల్లి. 

          “బాగానే వుందమ్మా! ఈ ఫిజిక్సుకు సంబంధించిన లెక్కలే కాస్త ఏడిపిస్తున్నాయి. అలాగే కెమిస్ట్రీ సమీకరణాలు కూడా!” అంటూ తల్లికి జవాబిచ్చి, ఖాళీ టీ కప్పు తల్లి చేతి కందించి, మళ్ళీ చదువులో పడ్డాడు కొడుకు.

          ఆ గది తలుపులు దగ్గిరగా వేసి, వంటింట్లోకి నడిచింది జానకమ్మ.

          కొన్ని నెలలుగా ఆ ఇంట్లో ఒక పెద్ద యజ్ఞం జరుగుతోంది! అది, ఐఐటీలో సీటు కోసం కుమార్ చేస్తున్న ప్రయత్నం. తండ్రి, అప్పు చేసి తెచ్చిన డబ్బు కట్టి, కొడుకును ఒక మంచి కోచింగ్ సెంటర్‌లో చేర్పించాడు. ఎప్పుడు చూసినా చదువే కుమార్‌కి. అది, ఆ అబ్బాయికి చాలా ఇష్టంగా వుంది! ఎలాగన్నా ఐఐటీలో సీటు తెచ్చుకోవాలన్నదే అతని ధ్యేయం. తల్లిదండ్రులిద్దరూ బాగా సహకరిస్తున్నారు.

          జానకమ్మ అప్పుడు మొట్ట మొదట చేసిన పని, స్నానం చేయడం. టీ కూడా తాగలేదు. తలారా చన్నీటి స్నానం మొదట!

          ఆ తడి బట్టలతో, నీళ్ళు కారుతున్న జుట్టుతో, దేవుడి మందిరం దగ్గిరికి వెళ్ళి, దణ్ణం పెట్టుకుని, దీపం వెలిగించింది.

          “భగవంతుడా! నాకు ఏమీ వొద్దు. నా కొడుక్కి ఐఐటీలో సీటు వచ్చేటట్టు చూడు తండ్రీ! వారంలో మూడు రోజులు ఒంటి పొద్దూ, ఒక రోజు ఉపవాసమూ చేస్తాను తండ్రీ!” అని మనసు లోనే కోరుకుంటూ, రోజూ లాగే ప్రార్ధనలు చేసింది.

          పూజ పూర్తవగానే, జానకమ్మ పొడి బట్టలు కట్టుకుని, వంట మొదలెట్టింది. పొద్దున్నే తినడానికి టిఫిన్లు. అవి తింటూ, తాగడానికి కాఫీ. మధ్యాహ్నం తినడానికి, భర్తకీ, కొడుక్కీ కేరియర్లు కడుతుంది. వాళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళాకే, బట్టలు ఉతకడాలూ, అంట్లు తోమడాలూ, ఇల్లు శుభ్రం చేయడాలూ. పని మనిషి లేదు వాళ్ళకి.

          “ముగ్గురు మాత్రమే వుండే ఇంట్లో ఎంత పని వుంటుందీ? నాకేమన్నా ఉద్యోగమా? నేను చేసుకోగలను. పని మనిషికిచ్చే డబ్బు, మనకి వేరే అవసరానికి పనికి వస్తుంది. అదీ గాక, ఎన్నో ఇళ్ళలో పని చేయనిదే బతకలేని పని మనుషులు, మన కోసం కావలిసినంత శుభ్రంగా పని చేయ గలరా?” అంటుంది జానకమ్మ.

          అసలు విషయం, ఆ ఇంట్లో డబ్బుకి కట కట! ఆ తండ్రిది పెద్ద జీతం తెచ్చే వుద్యోగం కాదు. కొడుకు పెద్ద చదువుల కోసం, వాళ్ళు వీలయినంత పొదుపుగా వుంటున్నారు. సైకిలు మీదే ఆఫీసుకు వెళతాడు రోజూ రఘురామయ్య. కొడుకు కూడా సైకిలే, కోచింగ్ సెంటర్‌కీ, జూనియర్ కాలేజీకీ.

          భోజనాల బల్ల మీద టిఫిన్, కాఫీ పెట్టేసరికి, కుమార్ పూర్తిగా తయారయి వచ్చేశాడు, తినడానికి.

          “అమ్మా! నాకు ఐఐటీలో సీటు తప్పకుండా వొస్తుంది కదూ? నువ్వు దేవుణ్ణి బాగా ప్రార్ధిస్తున్నావు కదూ?” అని అడిగాడు తల్లిని దిగులుగా.

          ఆ తల్లి హృదయం కరిగిపోయింది. “తప్పకుండా వొస్తుంది నాన్నా! నువ్వు, అస్సలు దిగులు పెట్టుకోకు! ఆ దేవుడు మనకు వున్నాడు.అన్నీ సవ్యంగా జరుగుతాయి!” అని ధైర్యం చెప్పింది ఆ తల్లి.

          ఎంతో కష్టపడి చదువు తున్నాడు కుమార్. ఇష్టంగా చదువుకునే వారికి కష్టం అనిపించదు గానీ, చూసే వారికి ఆ కష్టం తెలుస్తుంది. కొడుకు కష్టం చూసి, తల్లిదండ్రుల గుండెలు నీరవుతూనే వున్నాయి. కుమార్ చేసే ఆ యజ్ఞం, ఐఐటీలో సీటు కోసం కదా? అది మామూలుగా వొస్తుందా? ఎంత పోటీ! ఎంత పోటీ! అంటే, మనకు ఆ ప్రవేశ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వొస్తే చాలదు; ఇతరుల కన్నా ఎక్కువ రావాలి! పాత ప్రశ్నా పత్రాలు అన్నీ పట్టుకుని, వాటి లోని విషయాలు కూడా నేర్చుకుంటూ, చదువుతూనే వున్నాడు కుమార్. ఒక సినిమా అని లేదు, ఒక స్నేహితుడు అని లేదు. చదువూ, చదువూ! అంతే, ఆ పిల్లాడికి! చదవడం, ఎన్నో ప్రశ్నలకు చూడకుండా సమాధానాలు రాయడం, వాటిని దిద్దుకోడం, తప్పులకు తనని తిట్టుకోడం, మళ్ళీ మళ్ళీ, అవే!

***

          ఆ రోజు, అలారం మోగుతూనే వుంది పొద్దున్న నాలుగు దాటాక కూడా!

          అలారం మోగగానే, దిగ్గున లేచి, అలారం కట్టేసే భార్య, ఇంకా లేవక పోవడం చూసి ఆశ్చర్యం వేసింది రఘురామయ్యకి. “జానకీ! జానకీ! అలారం మోగుతోంది ఇందాకట్నించీ! లేవవా?” అనడిగాడు.

          జానకమ్మ, సమాధానం చెప్పకుండా ఒక మూలుగు మూలిగి, కొంచెం వొణికింది.

          “ఒంట్లో బాగోలేదా?” అంటూ భార్య నుదిటి మీద చెయ్యి వేసి చూశాడు భర్త.

          జానకమ్మ నుదురు కాలిపోతోంది. చలికి వొణికి పోతోంది మూలుగుతూ!

          అంతే! దిగ్గున లేచాడు భర్త. అలారం కట్టేశాడు. తన దుప్పటి కూడా భార్యకి కప్పాడు. “పడుకో, పడుకో!” అంటూ తను లేచాడు.

          కొడుకు గది లోకి వెళ్ళాడు గబ గబా, పిల్లాణ్ణి లేపడానికి. కానీ, అప్పటికే పిల్లాడు లేచి, మొహం కడుక్కుని, చదువు మొదలెట్టేశాడు, అలవాటు కొద్దీ. ఎవరూ సర్దని మంచం మీద వాడి పక్క, అలాగే చిందర వందరగా వుంది!

          తండ్రిని చూసి, “అమ్మ ఇంకా నిద్ర లేవలేదా ఇవాళ? ఏమైంది?” అని అడిగాడు కొడుకు కాస్త చిరాగ్గా.

          “అమ్మకి ఒంట్లో బాగున్నట్టు లేదు. పడుకోమన్నాను. నువ్వు చదువుకో!” అంటూ కొడుకు గది తలుపు దగ్గిరిగా వేసి, పనిలో పడ్డాడు తండ్రి.

          మొదటగా, కొడుక్కి టీ కలిపి ఇచ్చాడు. వంటంతా చేశాడు. కొడుకును చదువుకి పంపించాడు, కేరియరు సర్ది ఇచ్చి. ఇల్లు శుభ్రం చేశాడు. భార్య చేత కొంచెం వేడి వేడి కాఫీ తాగించాడు.

          “వద్దండీ! తాగలేను!” అంది నీరసంగా జానకమ్మ, ఒక్క గుక్క మాత్రమే తాగి.

          ఇల్లు శుభ్రం చేశాడు. ఆఫీసుకు రెండ్రోజులు శలవు పెట్టేశాడు. జానకమ్మని డాక్టరు దగ్గిరికి తీసికెళ్ళాడు.

          డాక్టరు అన్ని పరీక్షలూ చేశాడు. అన్ని వివరాలూ అడిగాడు. “మీకు ఊపిరి తిత్తులలో చిన్న ఇన్‌ఫెక్షన్ లాంటిది వచ్చింది. ఈ తడి తలా, తడి బట్టల పూజలు మానకపోతే, విపరీత ఉపవాసాలు తగ్గించకపోతే, మీకు త్వరలో న్యూమోనియా వొస్తుంది. అప్పుడు వగచి, లాభం లేదు. ఈ మందులు వాడండి. రెండ్రోజుల్లో తగ్గి పోతుంది. ఆరోగ్యంగా వుండండి” అంటూ అన్ని జాగ్రత్తలూ చెప్పాడు.

          భార్యా, భర్తలిద్దరూ జడుసుకుని, చాలా వినయంగా, బుద్ధిగా తలూపారు.

          తండ్రి చెప్పిన విషయాలు అన్నీ విని, తల్లి వేపు ఒక రకంగా చూసి, వూరుకున్నాడు కొడుకు.

          రెండ్రోజుల్లోనే మామూలు మనిషి అయింది జానకమ్మ. రోజులు ఇది వరలో లాగానే గడవడం మొదలెట్టాయి. ఎటొచ్చీ, తడి బట్టల పూజలు మాని, ఎక్కువ సేపు పొడి బట్టల పూజలు చేసింది. ఉపవాసాలు తగ్గించి, ప్రార్ధనలు ఎక్కువ చేసింది. అనుక్షణమూ పిల్లాడి అవసరాలు చూసుకుంటూ, వాడి చదువుకు ఏ లోటూ రాకుండా చూసుకుంటూనే వుంది, ఆ తల్లి.

***

          కుమార్, మంచం మీద పడి భోరున ఏడవ సాగాడు. తల్లిదండ్రులు ఓదారుస్తున్నా వినడం లేదు. వాడికి, ఐఐటీలో సీటు రాలేదు! వాడి బాధ చూసి తట్టుకోలేక పోతున్నారు వాళ్ళు. వాళ్ళకీ చాలా బాధ గానే వుంది, కొడుక్కి ఆ సీటు రానందుకు.

          “వూరుకో నాన్నా! మళ్ళీ ప్రయత్నిద్దాం. ఆ దేవుడు మనకి సాయం చేస్తాడు. బాధ పడకు. ఏం చేస్తాం? మనకి ఇలా రాసి పెట్టి వుంది. వూరుకో! వూరుకో!” అంటూ తల్లి ఎంతో ఓదార్చింది.

          అంతే! ఘొల్లున ఏడుస్తున్న కుమార్, మంచం మీద నించీ దిగ్గున లేచాడు.

          తల్లిని చాచి పెట్టి లెంపకాయ కొట్టాడు!!

   “అంతా నీ వల్లనే! జబ్బు తెచ్చుకుని, పూజలు సరిగా చెయ్యలేదు. అందుకే నాకు సీటు రాలేదు!” అంటూ, మళ్ళీ మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడవ సాగాడు కొడుకు.

          తల్లి ఒక్క సారిగా మాన్పడి పోయింది. స్థాణువు అయిపోయింది. తానే సీత అయితే, భూమి చీల్చుకుని వెళ్ళి పోయేదే, ఈ జానకి కూడా! అవమానంతో మనసూ, మంటతో చెంపా మండి పోయాయి. కళ్ళ లోంచి నీళ్ళు జల జలా రాలాయి.

          ఏదో అనబోయి, అనకుండా, కొడుకు గది లోంచి తమ గది లోకి వెళ్ళి పోయింది ఆ తల్లి రోదిస్తూ.

          తండ్రి కూడా మొదట మాన్పడి పోయాడు గానీ, వెంటనే లౌక్యంగా తేరుకున్నాడు. కాగల పనులు చూడాలని నిశ్చయించుకున్నాడు.

          “వూరుకో కుమార్! అమ్మ ఏం చేయగలదు? నువ్వలా చెయ్యకూడదు! తప్పు! ఏదోలే! నీ బాధలో ఏదో చేశావు. ఇక చాలు. వూరుకో. నువ్వు ఇంజినీరింగులో కూడా చేరనక్కర లేదు. ఇంట్లోనే వుండి, యేడాదంతా చదివి, మళ్ళీ ఆ పరీక్షే రాయి. ఈ సారి నిన్ను ఖరీదైన కోచింగ్ సెంటర్‌లో చేరుస్తాను. ఈ సారి తప్పకుండా సీటు వస్తుంది” అంటూ ఓదార్చాడు తండ్రి.

          కొంత సేపటికి యేడుపు ఆపాడు ఆ పుత్ర రత్నం.

          రఘురామయ్య, తమ గది లోకి వెళ్ళాడు. అక్కడ జానకమ్మ, కిటికీ దగ్గిర నించుని పెరట్లోకి చూస్తోంది. రోదించడం లేదు. ఆమె మనసంతా నిర్వేదనతో నిండి పోయింది. ఎడం చెంప మీద, కొడుకు వేళ్ళ తట్టు! రెండు చెంపల మీద ఎండి పోయిన కన్నీటి ధారలు!

          “వూరుకో జానకీ! వాడేదో వాడి బాధలో వుండి, తొందర పడ్డాడు. తప్పే వాడిది. వూరుకో!” అన్నాడు భర్త, భార్యని ఓదారుస్తూ.

          “వూరుకోక ఏం చేస్తాను? ఏం చెయ్యగలను? ఇక నుంచి దూరంగా వుంటాను, నా పనులు నేను చేస్తూ!” అంది భార్య చాలా బాధగా.

          “అలా అనకు జానకీ! మనకున్నది వాడొక్కడే. వాడి భవిష్యత్తు కోసమే మన ఆరాటమంతా! ఇప్పుడు నువ్వు వాణ్ణి పట్టించుకోవడం మానేస్తే, వాడు చెడిపోతాడు. వాడి భవిష్యత్తు పాడై పోతుంది. మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి” అన్నాడు సానునయంగా ఆ భర్తా, ఆ తండ్రీ.

          జానకమ్మ ఏమీ మాట్లాడకుండా, మౌనంగా వుండి పోయింది. 

          “అవును జానకీ! నువ్వు వాడిని ఇక పట్టించుకోకు! తల్లిలా ఇంత వండి పెట్టి, ఒళ్ళూ, వెచ్చా చూస్తూ వుండు చాలు. వాడికే బుద్ధి రావాలి!” అని భర్త అంటాడనుకుంది ఆ అమాయకత్వపు జానకమ్మ.

          అలా జరగనందుకు కూడా ఎక్కువగా ఆశ్చర్యపడనూ లేదు, బాధపడనూ లేదు.

***

          తర్వాత రోజుల్లో, జానకమ్మ ఏమీ జరగనట్టే ప్రవర్తించింది. కొడుకు, మొదట్లో కొంచెం జంకుగా వున్నాడు గానీ, ఎవరూ ఏమీ అనకుండా, ఇంట్లో ఏమీ జరగకుండా వుండటంతో ఆ విషయం తొందర్లోనే మర్చి పోయాడు. మళ్ళీ తన చదువులో మునిగి పోయాడు. ఈ సారి యేడాదంతా చదివాడు.

          ఆ కొడుకు మాత్రం ఏ నాడూ తల్లికి క్షమాపణ చెప్పలేదు. అంతేకాదు, ఆ విషయం తల్లి దగ్గిర ఎప్పుడూ ఎత్తలేదు. తనే పూర్తిగా మర్చి పోయాడు, అదేదో చాలా చిన్న విషయం అన్నట్టు!

          జానకమ్మ, తల్లిగా తన భాధ్యత నెరవేరుస్తూనే వుంది. “కొడుకు భవిష్యత్తు పాడై పోతుందని” భర్త పెట్టిన భయం, ఆమె మనసులోకి బాగా ఎక్కింది. ఆ భయమే, ఆ తల్లిని మామూలుగా వుండేటట్టు చేసింది. ఎంత దెబ్బ తిన్న తల్లైనా, కొడుకు భవిష్యత్తు పాడవడం చూడలేననుకుంది. మనసు లోని బావాలు మనసు లోనే దాచేసుకుంది.

          “అమ్మా! ఈ సారి ఇదివరకు కన్నా, బాగా రాశానమ్మా పరీక్షలు” అని కొడుకు సంతోషంగా చెబుతూ వుంటే, ఆ తల్లి నిజం గానే సంతోషించింది.

          అయినా, ఆ సంతోషం ఆ తల్లి హృదయం లోని అగ్ని పర్వతాన్ని ఆర్ప గలదా? నివురు కప్పింది, అంతే!

          అందరూ ఆశగా పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూశారు. అందరూ ఆశించినట్టు గానే, కోరుకున్నట్టు గానే, కుమార్‌కి ఐఐటీలో సీటు వచ్చింది. కొడుకు ఆనందానికి పగ్గాలు లేవు. అది చూసి, తల్లిదండ్రుల మనసులు కూడా వికసించాయి.

          “మా ఫ్రెండ్సందరి తోనూ చెప్పి వొస్తానమ్మా!” అంటూ, అప్పుడే బయటి స్నేహితులు గుర్తొచ్చిన కొడుకు, బయటికి వెళ్ళాడు.

          ఇంటి ఆర్ధిక పరిస్తితులు కొడుక్కి తెలియనివ్వలేదు ఆ తండ్రి. పిల్లాడి చదువుల కోసం, ఆ తండ్రి కూడా సాయంకాలాలు వేరే చిన్న ఉద్యోగం చేశాడు. తల్లి కూడా చిన్న పిల్లలకు సంగీతం నేర్పుతూ, ఆ చిన్న సంపాదనతో భర్తకి చేదోడు వాదోడుగా వుంది. కొడుకు కూడా బాధ్యత లెరిగి, ఖర్చుల విషయంలో జాగ్రత్త గానే వున్నాడు.

          “జానకీ! ఈ నాలుగేళ్ళ చదువూ అయిపోతే, ఆ పైన పెద్ద చదువులకి వాడికే స్కాలర్‌షిప్పులు వొస్తాయి. మనం ఈ నాలుగేళ్ళూ కాస్త గుంభనంగా సంసారం నడపాలి” అన్నాడు రఘురామయ్య భార్యతో.

          జానకమ్మ తలూపింది అంగీకారంగా. తనకి చేతనయినది అంతా చేసింది ఆ నాలుగేళ్ళూ. ఆ కాలంలో, కొడుకు ఇంటికి వచ్చిందే తక్కువ. వేసం కాలం శలవుల్లో కూడా, ప్రోజెక్టులనీ, ఇంటర్న్‌షిప్ అనీ, ఇంటికి వచ్చేవాడే కాడు. ఎప్పుడో వచ్చినా, రెండ్రోజులకే వెళ్ళి పోయేవాడు ఇంట్లో చదువు సాగదంటూ. తల్లిదండ్రులు, ఏ నాడూ ఏ విషయానికీ కొడుక్కు అభ్యంతరం చెప్పలేదు.

          ఒక సారి, అప్పు ఇస్తామన్న వారు, తొందరగా సమయానికి డబ్బు ఇవ్వలేక పోయారు.

          “బాబూ! ఒకట్రెండు రోజులు ఆలస్యం అవుతుంది డబ్బు చేతికందడానికి. అందిన వెంటనే ఇస్తాను నీకు” అని రఘురామయ్య చెప్పాడు, ఇంటికి వచ్చిన కొడుకుతో.

          చాలా చిరాకు పడిపోయాడు కొడుకు. “అదేంటి నాన్నా! చెప్పిన టైంకి ఇవ్వక పోతే ఎలా? చదువు అయిపోయాక నా కెంత పెద్ద ఉద్యోగం వస్తుందో! ఎంతెంత డబ్బు సంపాదిస్తానో! ఈ కాస్త డబ్బుకే నువ్వు ఇంత అవస్త పెడుతున్నావు నన్ను!” అంటూ తండ్రి మీద ఎగిరాడు.

          ఆ తండ్రి చిన్నబుచ్చుకున్నాడు గానీ, ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదివే కొడుకుని ఏమీ అనలేదు. మనసు లోనే కొంచెం మధన పడ్డాడు.

          కాలం చాలా వేగం గానే సాగిందని చెప్పాలి. ఆ కష్టపడే తల్లిదండ్రులికి కాదు, మిగిలిన అందరికే.

          కుమార్‌, ఎంటెక్ కూడా చదివి, పీహెచ్‌డీ కూడా చేశాడు. పెద్ద చదువులు స్కాలర్‌షిప్పుతో చదివాడు. తల్లిదండ్రుల ఆర్ధిక కష్టాలు తగ్గాయి.

          “రేపే నా థీసీస్ డిఫెన్స్ పరీక్ష. నాకు ఇప్పటికే ఢిల్లీ లోని ఒక పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం వచ్చింది. చాలా పెద్ద జీతం. చాలా ఎక్కువ బోనస్. చేరినందుకే మొదట చాలా డబ్బు, బోనస్‌గా ఇస్తారు. రెండ్రోజుల్లో బయలుదేరి ఢిల్లీకి వెళ్ళిపోవాలి. ఇంటికి రాను. ఉద్యోగం మొదలు పెట్టెయ్యాలి” అని చెప్పాడు కుమార్‌.

          తల్లిదండ్రులు మామూలుగా, యధావిధిగా సంతోషించారు కొడుకు విజయానికి. ఇంకేమీ అనలేదు.

***

          కొన్ని నెలలు జరిగి పోయాయి.

          “నాకు రెండ్రోజులు శలవు దొరికింది. రేప్పొద్దున విమానంలో మన వూరు వొస్తున్నాను. నాకు ఇష్టమైన వంటలు చేసి వుంచండి! మీరు ఎయిర్‌పోర్టుకు రావొద్దు. నేనే టాక్సీలో వొచ్చేస్తాను” అని కొడుకు ఒక రోజు చెప్పాడు ఫోనులో.

          చాలా కాలానికి కొడుకు ఇంటికి వొస్తానంటే, ఏ తల్లిదండ్రులు సంతోషించరు? వాళ్ళూ సంతోషించారు, కొడుకు ఆగమనానికి.

          టాక్సీ ఇంటి ముందర ఆగగానే, తండ్రి ఒక్క గెంతున గుమ్మం దిగి, కొడుకు చేతి లోంచి చిన్న సూట్‌కేసు అందుకున్నాడు. తల్లి, గుమ్మంలో నవ్వు మొహంతోనుంచుంది.

          కొడుకు చిరునవ్వులతో కనపడ్డాడు.

          “నాన్నా! బాగున్నావా? నీ కోసం మంచి కోటు తెచ్చాను. అమ్మా! నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం” అన్నాడు నవ్వుతూ సంబరంగా.

          తండ్రి మొహం విప్పారగా, తల్లి నవ్వుతూ చూసింది ఏమీ అనకుండా.

          వెంటనే సూట్‌కేసు తెరిచి, అందులోంచి ఒక బాక్సు తీశాడు కొడుకు. ఆ బాక్సును తల్లి చేతిలో పెట్టి, దాని మూత తెరిచాడు.

          తల్లిదండ్రులు, ఆ బాక్సులో ఏముందా అని ఆతృతగా చూశారు.

          అందులో వున్నది ఒక వజ్రాల నెక్లెస్! అది, తల్లి కోసం ఆ కొడుకు తెచ్చిన కానుక!

          “అమ్మా! నేను చదువుకునేటప్పుడు నాకు ఎంతో సాయంగా వున్నావు. నాకు ఎన్నో పనులు చేసి పెట్టావు. నీ రుణం తీర్చుకునే కానుకమ్మా ఇది! చాలా ఖరీదులే! చాలా వేలు!” అన్నాడు కొడుకు చాలా గొప్పగా, ధీమాగా.

          తల్లి మొహం మ్రాన్పడి పోయింది. అయినా మౌనంగా లోపలికే వెళ్ళింది. కొడుకే ఆ బాక్సుని తల్లి చీరల మీద పెట్టాడు. ఆ రోజంతా తల్లి మౌనమే. కొడుకు దాన్ని గమనించినట్టు లేడు.

          ఆ సాయంత్రం, పక్కింటి వాళ్ళు పిలిచారని ఏదో పేరంటానికి బయలుదేరింది జానకమ్మ. ఆ హడావిడి చూసిన కుమార్, “అమ్మా! నేను కొన్న ఆ ఖరీదైన వజ్రాల నెక్లెస్ పెట్టుకుని వెళ్ళు ఆ పేరంటానికి!” అని తన గది లోంచే అరిచాడు.

          జానకమ్మ, ఆ మాటలు పట్టించు కోలేదు. విననట్టే, ఆ నెక్లెస్ వేపు చూడకుండానే, పేరంటానికి వెళ్ళి పోయింది.

          పేరంటం నించి తిరిగొచ్చిన తల్లినీ, వజ్రాల నెక్లెస్ లేని తల్లి బోసి మెడనీ చూసి, “అదేంటమ్మా? ఎన్ని సార్లు చెప్పాను, ఆ ఖరీదైన నెక్లెస్ పెట్టుకుని పేరంటాని కెళ్ళమని? అక్కడి వాళ్ళందరూ చూసేవారుగా నీ వైభోగాన్ని? నీ కొడుకెంత బాగా నిన్ను చూసుకుంటున్నాడో వాళ్ళకి తెలిసేదిగా?” అన్నాడు కోపంగా తల్లితో.

          ఇక మౌనాన్ని ఛేదించక తప్పలేదు జానకమ్మకి. 

          “చూడు కుమార్! ఆ నాడు నువ్విచ్చిన చెంప దెబ్బ నా గుండెల్లో ఇంకా మండుతూనే వుంది! అమ్మకి కోపం వుండకూడదు కదూ? నేను నిన్ను పట్టించుకోకుండా కోపం చూపిస్తే, నీ భవిష్యత్తు పాడై పోతుందని మీ నాన్న భయ పెట్టారు నన్ను. నువ్విచ్చే ఈ కానుక, నా కోపాన్ని తగ్గిస్తుందా? ఎన్నటికీ కాదు. పైపెచ్చు, నా కోపాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఇచ్చింది ఈ కానుక.

          నువ్విచ్చిన అసలు కానుక, ఆ నాటి చెంప దెబ్బే! ఆ కానుక గురించి ఎప్పుడన్నా మాట్లాడావా?

          అమ్మంటే ఎందుకు అంత చులకన? ఇంట్లో వుండి అన్ని పనులూ చేస్తుందనా? ఆ దెబ్బ, నాన్నని కొట్ట గలిగావా? అది ఎన్నడూ జరగదని నీకూ తెలుసు.

          అమ్మ గురించి ఒక చిన్న కధ చెబుతారు. ఒక ధూర్తుడు, తన భార్య అడిగిందని, తన తల్లిని చంపి, గుండెకాయను చేత్తో పట్టుకుని వెళుతుంటే, తలకి గుమ్మం తగిలి, ‘అమ్మా’ అని బాధతో అరిచాడట. అప్పుడా తల్లి గుండె కాయ, ‘కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు నాయనా!’ అందట. ఇలా నిర్వచిస్తారు తల్లి ప్రేమను! కొడుకు చంపినా, ఆ తల్లి తన ప్రేమనే చూపించాలి!

          అంతే మరి! తల్లికి ఆత్మ గౌరవం వుండకూడదు. కోపం అసలే వుండ కూడదు. పిల్లలు ఎలా చూసినా, ఎలా చేసినా, చివరికి ఒక గుడ్డ ముక్క చేతిలో పెట్టినా, విపరీతంగా సంతోషించెయ్యాలి. సమాజం ఇలాగే పెంచుతోంది తల్లులను. అడ్డమైన కవిత్వాలూ రాసి, తల్లులను గొప్ప చేసేస్తారు. ‘నీ వంటలు చాలా బావుంటాయమ్మా! నా కన్నీ చేసి పెట్టు’ అని సిగ్గులేకుండా తల్లి చేత చేయిస్తారే గానీ, తల్లికి ఎప్పుడూ వంట చేసి పెట్టరు ఈ కొడుకులు! ‘మదర్స్ డే’ అంటూ బోడి కానుకలు చేతిలో పెట్టి, ఉబ్బేస్తారు తల్లులను. ఆ వెర్రి తల్లులు, ఆ కొడుకుల బుట్టల్లో పడుతూనే వుంటారు ఎప్పుడూ.

          ‘నీకేమమ్మా! నీ కొడుకు ఒక రత్నం. పెద్ద పెద్ద చదువులు చదివాడు. పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. నీ కెన్నో కొంటాడు’ అంటారు చుట్టాలూ, పక్కాలూ. ‘నీ కొడుకు జాతి రత్నం. అప్పుడు ఏదో బాధలో అలా చేశాడు. వాణ్ణి ఏమీ అనకూడదు. ఎంత పెద్ద చదువులు చదివాడో చూడు నీ కొడుకు!’ అంటారు మీ నాన్న. అదేనా తల్లికి కావలిసింది? దెబ్బలేనా? కానుకలేనా? గౌరవం అక్కరలేదా?

          నా కొద్దు కుమార్, ఈ వజ్రాల నెక్లెస్‌! నువ్విచ్చిన చెంప దెబ్బ కానుక ఇంకా నన్ను కదిలిస్తూనే వుంది. నాకు చాలా ఏళ్ళుగా నీ మీద చాలా కోపంగా వుంది” అంటూ, జానకమ్మ, కాదు, కాదు, జానకి, ఆ నగ పెట్టెని కొడుకు చేతిలో పెట్టేసి, చాలా కోపంగా లోపలికి వెళ్ళి పోయింది.

          తండ్రి, భార్య వేపు కొంచెం అభినందనగా చూశాడు.

          కొడుకు మాత్రం నిశ్చేష్టుడై వుండి పోయాడు!

*****

చిత్రం: పొన్నాడ మూర్తి 

చిత్ర సౌజన్యం: అచ్చంగా తెలుగు 

Please follow and like us:

10 thoughts on “అమ్మ కోపం (కథ)”

 1. ఈ కాలం లో తల్లిని కొట్టే కొడుకులు ఉన్నారు. కథ చాలా బాగుంది.

 2. మనం సమాజంలో మంచిని ప్రేరేపించాలి
  తల్లిని కొట్టె తనయులనుకాదు

 3. ఈ కధ నిజానికీ చాలా దూరంగా ఉంది,కానీ,ఇప్పుడు అలాంటి కొడుకులు కూడా ఉన్నారేమో

 4. కథ బాగుంది అండి. ఎంతో ప్రేమగా శ్రద్ధగా పిల్లలకు సమయానికి అన్ని చేసి పెడుతూ ఉంటారు తల్లితండ్రులు, వారి అవసరాలను సైతం పక్కన పెడుతూ. కానీ పిల్లలు అవన్నీ గ్రహించరు. మేమె గొప్పగా చదివామని, మంచి ఉద్యోగం వల్లే సంపాదించుకో గలిగామన్న అహంకారం కొందరిలో ఉంటుంది. ఈ కథలో కొడుకు చేసిన పని నాకసలు నచ్చలేదు. తల్లిని కొట్టడం, దేవుడికి పూజ చేయకపోవటం వల్లనే పరీక్ష ఫెయిల్ అయ్యననటం అతని చేతకాని తనానికి నిదర్శన.

  తల్లి కోపం చూపిస్తే అల్లకల్లోలం అయిపోతుంది ప్రపంచం. మంచి పని చేసి జానకి చివరకి.

 5. చాలా బావుంది. పిల్లలు పెద్ద అయ్యాక మంచి స్థితిలో ఉంటే తల్లితండ్రులను పొగుడుతారు. అదే వారు పైకి రాలేకపోతే కారణం మమ్మల్ని సరిగా పెంచలేదు అంటారు. చదువుకునే టైమ్లో ఏమి చెప్పినా వారి మూడ్ని బట్టి అది పాటిస్తే పాటిస్తారు, లేకపోతే లేదు. ఇలా కొట్టిన పిల్లలు కూడ ఉంటారు. ఏమంటే …ఏ అఘాయిత్యం చేసుకుంటారో అని తల్లితండ్రులు మాట్లాడకుండా రోజులు గడుపుతారు. ఎంతో కఠినంగా ఉండే తండ్రినించి పారిపోయే పిల్లలు కూడ ఉంటారు. వీరు ఎంతో చేసాం అనుకుంటారు గాని పిల్లలు ‘అది వారి బాధ్యత-అంతే’ అని తీసిపడేస్తారు. ఆ వయసే అంత. జాగ్రత్తగా జానకిలా వ్యవహరించాలి.

 6. ప్రసాద్ గారు వ్రాసిన అమ్మ కోపం కథ చాలా బాగుంది. చిన్న వయసులో ఉన్న పిల్లలకి మంచి చెడు నేర్పిస్తుంది అమ్మ. పిల్లల చిన్నప్పుడు వాళ్ళు చేసే అల్లరి, మొండితనం అన్నీ మరిచిపోయి వాళ్ళకి ప్రేమనే ఇస్తుంది. పిల్లలఊహ తెలిసి పెద్దయ్యాక అమ్మని మాటలతో బాధించడం ఎక్కువగానే చూస్తున్నాం. ఎంత బాధ్యతగా, ప్రేమగా పెంచినా పెద్దయ్యాక వారి వైఫల్యాలకి తల్లి తండ్రులనే బాధ్యులుగా భావిస్తున్నారు. దూరం పెడుతున్నారు. అవమానిస్తున్నారు.
  పిల్లల్ని దూరంగా పెట్టడం తల్లి తండ్రులు నేర్చుకోవాలి.

 7. చాలా చెత్తగా ఉంది, మధ్యతరగతి కుటుంబం లో ఏ కొడుకు,అది జస్ట్ ఇంటర్ చదివే పొరడు తల్లిని కొట్టడు,దానికి ఏ తండ్రీ కూడా సర్డుకుపో అని చెప్పడు

  1. తాత్కాలిక మానసిక రుగ్మతలో జరగవచ్చు. నేను స్వయంగా ఒక తల్లిని కొడుకు పీటతో కొట్టగా కుట్లు వేసాను.

   – డా. వడలి సత్యనారాయణ మూర్తి

   1. అవును ,వడలీ ,నేనూ చూసా ,అన్నం లో కూర లేదని కంచం తల్లి మొహం మీద విసిరేడు ఇలా ఇంటర్ చదువుతున్న కుర్రాడే .పోనీ ,ఈ కథ లో లా ఏదో విరగ దీసే చదువు చదువుతున్నాడంటే అదీ లేదు. నాకు అర్థం అయ్యింది ఏమిటంటే వాడి క్వాలిఫికేషన్ మగపిల్లవాడు అవ్వడం, వాడిని తల్లి తండ్రులు ముద్దు మురిపెంగా పెంచి నెత్తిన ఎక్కించుకోవడం

    – తటవర్తి శ్రీకృష్ణ

 8. కధ చాలా బాగుంది. కారణాలు ఏమైనా కొడుకు తల్లిని కొట్టడం గర్హనీయం.ఆ తండ్రి అపుడే అతని లెంపలు వాయించి బుద్ధి చెప్పి ఉండాల్సింది. కానీ అతడూ ‘నాన్నే’ గాని ‘అమ్మ’ కాదుగా.
  ఆ తరువాత కూడా అతడు కించిత్తు పశ్చాత్తాపం కూడా పడకుండా నెక్లెస్ కొనిచ్చి ఋణం తీర్చుకున్నాననడం అతడు కొడుకుగా ఎంత దిగజారాడో తేటతెల్లం చేస్తుంది. చివరగా తండ్రి భార్య వైపు అభిమానంగా చూడడం ద్వారా అతడు తన భార్యను అర్ధం చేసుకున్నాడనుకోవాలి.
  ఇది జరిగాక అయినా ఆ కొడుకులతో మార్పు వస్తుందా అన్నది జవాబు లేని ప్రశ్న. తల్లులెప్పుడూ లోకువే కొడుకులకు మరి!
  జానకిరామం
  మాతృదినోత్సవ సందర్భంగా చక్కటి రచన !రచయితకు అభినందనలు.
  జానకిరాం

Leave a Reply

Your email address will not be published.