ఒక్కొక్క పువ్వేసి-11

ఆధునిక భారత తొలి వెలివాడ రచయిత్రి

-జూపాక సుభద్ర

          ముక్తా సాల్వే పేరు చరిత్రలో చెరిపేయలేని గొప్ప రచయిత్రి పేరు. 15-02-1855 మరియు 1-03-1855 సంవత్సరం ‘జ్ఞానోదయమ్’ పత్రిక లో ‘మాంగ్ మహారాచ్య దుఖ్విసయి ‘ (Grief of the Mangs and Mahars)( మాoగ్ మహర్ల దుఃఖం) ముక్తా సాల్వే వ్యాసము రెండు భాగాలుగా వచ్చిన రచన. ఆ రచన లేవదీసిన అంశాలు ఆ కాలంలో సంచలనం. ముక్తా సాల్వే రాసిన ఈ వ్యాసము అప్పటికే కాదు యిప్పటికీ విప్లవాత్మకము, ప్రభావ శీలము. ‘మాంగ్ మహర్ ల దుక్కమ్’ అని రాసిన ముక్తాసాల్వే ఆ కాలములో (1855 నుంచి దశాబ్దాల పాటు) మానవత్వం లేని కుల సమాజం పట్ల లేవనెత్తిన సూటి ప్రశ్నలు, అవగాహనలు మరాఠీ, బ్రిటిష్ సమాజాల్లో ప్రకంపనాలు సృష్టించింది. ఆనాటి ప్రభుత్వము తన విద్యా రిపోర్టు లో కూడా ప్రచురించి ప్రశంసించినది. జ్యోతిరావు ఫూలే ‘పూణే, సచ రచ వర్ణన’ అనే గ్రంధం లో (1868) ప్రచురించాడు. స్వాతంత్ర భారతము తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వము ముక్తాసాల్వే గురించి, ఆమె రచనా వ్యాసంగాన్ని మరాఠీ లో పాఠ్యా0శంగా(7వ తరగతి) చేర్చి ప్రచురించింది. మరాఠా ఆధునిక చరిత్రలో యింత గొప్ప విప్లవాత్మక రచన చేసిన ముక్తా సాల్వే ను ఆమె రచన ‘మాంగ్ మహారాచ్య దుఖ్విసయి’ (మాంగ్ మహర్ ల దుక్కమ్) సామాజిక చరిత్ర కారులు, సాహిత్య పరిశోధకులు అవాచ్యమ్ చేసిన అన్యాయం వల్ల దళిత మహిళా సమాజానికి తీరని నష్టం జరిగింది.
          మరాఠా స్కూల్ పాఠ్యాoశాల్లో తప్ప చరిత్ర, సాహిత్యాల్లో ముక్తా సాల్వే పేరు ఎక్కడా కనిపించదు. 
          1991 లో సుశీతారు, కె.లలిత సంపాదకత్వం లో వచ్చిన ‘ఉమెన్ రైటింగ్ ఇన్ ఇండియా ‘  (women writing in India) పుస్తకం లో ‘ముక్తాసాల్వే ఆధునిక భారతదేశ మొదటి దళిత రచయిత్రి’ అని పేర్కొనడం వల్ల బయటి ప్రపంచానికి ముక్తాసాల్వే గురించిన కొంత సమాచారం, ఆమె ప్రభావశీలమైన రచన గురించి ప్రముఖంగా తెలియవచ్చింది.
          ముక్త్వా సాల్వే మాంగ్ కులానికి చెందిన మరాఠా రచయిత్రి. సావిత్రి బాయి ఫూలే, జ్యోతి రావు ఫూలే లు 1851 లో నెలకొల్పిన తొలి బాలికా పాఠశాలలో తొలి దళిత విద్యార్ధిని ముక్త్వా సాల్వే. ముక్తా సాల్వే తాత క్రాంతికార్ లహూజి సాల్వే. అంబేడ్కర్ తన గురువు జ్యోతిరావు ఫూలే అని చెప్పుకుంటే, పూలే తన గురువు లహూజి సాల్వే అని చెప్పు కున్నాడు. ఇప్పటికీ పూణే లో పూలే దంపతుల ఇంటిలో గోడ ఎత్తున మాoగ్ పహిల్వాన్ లహూజి చిత్రపటం వుంటుంది అంటే,. పూలేకి ఎంత దగ్గరి సామాజిక గురువో అర్థమౌతుంది.
          లహూజి సాల్వే తన భూమిని పాఠశాల కోసం యిచ్చి చదువు నిషిద్ధ కులాలకు పరోక్షంగా తోడ్పడి నాడు. పూలేకు యుద్ధ విద్యలు, ఆత్మరక్షణ పద్దతులు తన వ్యాయామశాలలో తర్ఫీదు ఇచ్చేవాడు. లహూజి తండ్రి రాగోజీ సాల్వే బహుజన యువతకు మొట్ట మొదలు ఆత్మ రక్షణ శిక్షణ పాఠశాలలు, వ్యాయామ శాలలు ఏర్పాటు చేసి బహుజన యువతను యుద్ధ వీరులుగా తయారు చేసిన యుద్ధ వీరుడు. ఖడికి యుద్ధంలో బ్రిటిష్ తిరుగుబాటు దారుడని వ్యాయామ శాలల పేరుతో బ్రిటిష్ వ్యతిరేక సైన్యాన్నీ తయారు చేస్తున్నాడని రాగోజి సాల్వేను బ్రిటిష్ గవర్నమెంట్ బహిరంగంగా ఉరితీసినారు. అట్లాంటి గొప్ప పోరాట వారసత్వ, సామాజిక చైతన్య కుటుంబం నుంచి వచ్చినందు వల్లనే ముక్తాసాల్వే తన 14వ ఏటనే ‘మాంగ్స్, మహర్ల దుక్కమ్’ ఎంత దయనీయంగా వుందో ఆనాటి ప్రపంచానికి వినిపించ గలిగింది.
          ముక్త్వా సాల్వే మహారాష్ట్ర లోని పూణే బుధవార్ పేటలో అంటరాని కులాలకు అంటరాని మాంగ్ కులంలో జన్మించింది. 1851 లో స్థాపించిన మొదటి బాలికా పాఠశాలలో అన్ని కులాల విద్యార్ధినిల్లో ముక్తాసాల్వే ఒక్కతే మాంగ్ కుల విద్యార్ధిని. అట్లా ఆధునిక భారతదేశ చరిత్రలో మాంగ్ కుల ముక్తా సాల్వే పేరు మొదటి దళిత విద్యార్థినిగా,మొదటి దళిత రచయిత్రి గా ప్రస్తుతించ బడినది. సావిత్రిబాయి ఫూలే జ్యోతి రావు ఫూలే లు అంటరాని పిల్లలకు బడులు తెరవక ముందు బాలికా పాఠశాలలు నెలకొల్పక ముందు అంటరాని పిల్లలు, అన్నీ కులాల బాలికలు చదువుకు వేల మైళ్ళ ఆవలే ఉన్నారు. ఈ పాఠశాలల కృషి వల్ల వూరు, వాడ పిల్లలకు, బాలికలకు చదువుకునే అవకాశ మొచ్చింది. అట్లా ముక్తా సాల్వేకు చదువుకునే అవకాశం కల్పించిన పాఠశాల సావిత్రిబాయి ఫూలే, జ్యోతి రావ్ పూలేల బాలికా పాఠశాల.
          ముక్తాసాల్వే కులంలో, కుటుంబంలో ఎవరికీ చదువుల్లేవు. ముక్త్వాసాల్వే సామాజిక బాధ్యత, చైతన్యంతోకూడిన పాఠశాలలో చదవడం, కుల బానిసత్వమ్, అంటరాని తనాల మూలాల ఎరుక ఒక వైపు అయితే, తన వెలివాడ కుటుంబాలు, కులాలు ఎదుర్కొంటున్న సామాజిక పరిస్థితులు అమానవీయాలు మరోవైపు. యిట్లాంటి సామాజిక చైతన్యాలుండడం వల్ల ముక్తా సాల్వే ‘మాంగ్స్ మహర్ ల దుక్కమ్’ లోకానికి చాట గలిగింది.
          ఆమె వ్యాసము భారత దేశంలో అంటరాని వాళ్ళ పట్ల సవర్ణ కులాలు ఎంత క్రూరంగా వున్నాయని, ఎంత అమానుషంగా వుంటున్నాయని ఆనాటి సమాజానికి లిఖిత పూర్వకంగా ఎలుగెత్తి చాటిన రచన ముక్తా సాల్వే ‘మాంగ్స్ మహర్ల దుక్కమ్.’ అందుకే యీ రచన ఆధునిక భారత చరిత్ర లో మొదటి దళిత మహిళా గొంతు గా వెలుగుతుంది. భారత సాహిత్య చరిత్రలో తొలి వెలివాడ మాంగ్ రచయిత్రి గా ముక్తా సాల్వే పేరు చరిత్రలోకి ఎక్కింది. అట్లా చరిత్రలో నిలిచి పోయే వ్యాసం ఒక 14 సంవత్సరాల బాలిక గొప్ప చైతన్యంగా, వివేకంగా రాయడానికి జ్ఞానాన్ని యిచ్చింది ఫూలే దంపతులు నెలకొల్పిన సామాజిక పాఠశాలలని అర్ధమైతున్నది.
(కానీ ముక్తా సాల్వే జీవితానికి సంబంధంచిన పూర్తి వివరాలు అందుబాటు లో లేవు.ఆమె చదువు కొనసాగినదా లేదా ఇంకా ఏమి రచనలు చేసినది అనేది కూడాపరిశోధన చేయాల్సి వుంది)
          పూణేలో జరిగిన విద్యార్థుల వ్యాసరచన పోటీలో ముక్తా సాల్వే ‘మాంగ్ మహారాచ్య దుఖ్విసయి’(మాంగ్ మహార్ ల దుక్కమ్) వ్యాసానికి మొదటి బహుమతి ప్రకటించడం జరిగింది. బొంబాయి గవర్నర్ యిచ్చిన బహుమతి గా ఇచ్చిన పెద్ద చాక్లెట్ డబ్బాను చూసి ‘సర్ ఈ చాక్లెట్ డబ్బా కన్నా మా పాఠశాలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, నల్లబోర్డులు అందివ్వాలని అదే మీరిచ్చే గొప్ప బహుమతి అని అర్ధించడంతో.,., ఆ గవర్నర్ ముగ్దుడై బాలికా పాఠశాలలకు పెద్ద ఎత్తున పుస్తకాలు, పెన్నులు యింకా పాఠశాలకు అవసరమైనవన్నీ పంపే ఏర్పాటు చేసిండు.
          ఆ వ్యాసాన్ని పలు పాఠశాలల్లో మీటింగుల్లో ముక్తాసాల్వే చేత చదివించేవారట. అట్లా ఒక సమావేశంలో చదువుతుంటే, ‘జ్ఞానోదయమ్’ పత్రికా సంపాదకులు ముక్తా సాల్వే రచనను మెచ్చి ప్రశంస తో తన పత్రికలో రెండు భాగాలుగా (15-02 1855 మరియు
1-03 -1855) ప్రచురించడంతో ఆ వ్యాసం రికార్డ్ గా చరిత్రలో నిలిచి పోయింది.
1951 న విద్యా బోర్డు ఛైర్మన్ జాన్ వార్టెన్ బాలికల కోసం ఫూలే దంపతులు ఏర్పాటు చేసిన బాలికా పాఠశాలల్ని సందర్శించి ఆ పాఠశాలల గొప్పతనాన్ని , సంస్కరణలను తన రిజిష్టర్ లో ఎక్కించడం జరిగింది. ఇంగ్లాండులో నాజీల పిల్లల్ని యితర పిల్లలతో కలపనట్లే.. ఇక్కడ కొన్ని కులాల పిల్లల్ని కూడా కలపరు, బడికి అనుమతి ఇవ్వరు. చదువు చెప్పరు, దూరంగా ఉంచుతారు. అట్లాంటి పిల్లలకు ఒక మహిళా సంస్కర్త పాఠాలు చెప్తుందనీ ఆమె విద్యార్ధిని, ఒక మాంగ్ బాలిక అనీ, రచనలు చేస్తుందనీ, యీ బాలికా పాఠశాలల పిల్లలు పూణేకు పరిక్ష రాయడానికి వస్తే… ఈ బాలికలని చూడ్డానికి వేల మంది జనమ్ ఎగబడ్డారని రిపోర్ట్ అయింది.
          పూణె అబ్జర్వర్ పత్రిక (29-5-1952) మాలి కులం దంపతులు తమ సొంత ఖర్చు తో అంటరాని మాంగ్, మహార్, పాకీ వంటి కులాలకు పాఠశాలలు నెలకొల్పి భారత దేశ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వారికి విద్యనందిస్తున్నారు. ఆ పాఠశాలల్లో గొప్ప విద్యార్ధులు సంఘ సేవ దృక్పధంతో చదువుకుంటున్నారు. రచనలు కూడా చేస్తున్నారని ప్రస్తావించింది.
          ముక్తాసాల్వే తన రచన ‘మాంగ్ మహర్ల దుక్కమ్ ‘ లో ‘పీష్వా కులాలు కుక్కల్ని, పిల్లులని, ఆవులు, వంటి పశువుల్ని కూడా ముట్టుకొని, పట్టుకొని ముద్దు చేస్తారు గానీ మమ్మల్ని మాత్రం దూరంగా పెట్టి అంటనివ్వరు. ఒక గాడిదని కొడితే దాని యజమాని కొట్టిన వాల్లను నిలదీస్తాడు, అడ్డుకొంటాడు. కానీ మమ్మల్ని ఎవరు కొట్టినా తిట్టినా చంపినా ఏ మానవులు ప్రశ్నించరు, అడ్డురారు, అడగరు. ఏంటి యీ అన్యాయం. అంటరాని వారిగా పుడితే యింత హింసపడాలా !ఇంత ద్వంసం గా బతకాలా! బాజీరావ్ బ్రాహ్మల యింటి వైపు కాదు గదా! కనీసం వాల్లు చేసే కసరత్తుల వ్యాయామశాలకు ఆమడ దూరమ్ లో కనిపించినా మా తలలు బంతులుగా కత్తికో కండగా గాల్లో ఎగురుతుంటయి. యిది అన్యాయం, అధర్మం అనే మనుషుల్లేరు. ఏ దేవునికి మేము ఏ పాపం చేయ లేదు. మేము ఎవరికి ఏ అన్యాయాలు ఏ అక్రమాలు చేయ లేదు.
ఎర్రటి సీసం నూనె తాగిచ్చి మమ్మల్ని వాల్ల భవనాల పునాదుల కింద బలిస్తుంటారు. దీన్ని ఆపేటోల్లే లేరా! మా ప్రాణాలు యిట్లా పాతేసే పాపాత్ముల్ని దేవుడేమి చేయడా! దేవునికి కూడా మా పట్ల దయ లేదా.
          మా అంటరాని జాతులకు ఏ మతం లేదు, ఏ మత గ్రంథం లేదు. పీష్వాలకు మంచిదో చెడ్డదో ఓ మతమున్నది. నిత్యం అది చదువుకోనీకి ఒక గ్రంధమున్నది. అట్లా వాల్లకు ఆధ్యాత్మిక సంతోషాలున్నాయి. మాకు ఏ సంతోషాలు లేవు. కనీసం మత గ్రంధాలు ముట్టు కోవడం కాదు, కనీసం చూడడం కూడా నిషేధాలే. ఓ ప్రభూ మాకు నీవు ఏమతం ప్రసాదించినావో తొందరగా తెలియపర్చు. స్వేచ్చలు, బతుకు తెరువు ఆస్తులు, చదువులు హక్కులు కొందరికే ఏర్పాటై మిగతా మా లాంటి జనానికి ఏమి మిగల్చని దరిద్రాన్ని, పేదరికం యిచ్చే మతాలు మాకొద్దు. మేము వూరికి బైటనే కాదు, హిందూ మతానికి కూడా బైట వున్న వాల్లమే. హిందూ మతా నికే కాదు కూడు, గుడ్డ, గూడు కు కూడా బైటి వాళ్ళమే.
          మాంగ్ లు చదివితే పీష్వా బ్రాహ్మల ఉద్యోగాలు వూడుతాయట. మాంగ్ లు, మహార్ లు విద్యావంతు లైతారా ఎంత ధైర్యం’ అని మండి పడ్తుంటరు. బ్రాహ్మణ పిల్లలు మమ్మల్ని రాళ్ళతో కొడ్తారు. మా మాంగ్ మహర్ పిల్లల్ని రాళ్ళతో కొట్టినా, గాయాలై రక్తాలు కారినా చని పోయినా ఎవరికీ ఫిర్యాదు చేయగూడదు. ఫిర్యాదు చేస్తే గిన్నె పట్టుకొని పోయి వాళ్ళు తినగా మిగిలిన పాసి బువ్వను అడుక్కునే వీలుండది.
          పీష్వా బ్రాహ్మణ మహిళలకు మా మహిళలకు నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుంటది అన్ని విషయాల్లో. మా ఆడవాల్లు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణికి చచ్చి బత్కుతుండే, ఆకలితో అల్లాడే జీవితాలు. కనీసం వాల్లు ప్రసవించేటప్పుడు గూడ వాల్లతల మీద చిన్న చింతాకంత నీడ కూడా వుండదు, ఎట్లాంటి రక్షణ లుండవు. ఎట్టి పుటకలు, ఎట్టి చావులు. నిత్యం క్రూరమైన హింసలు, వివక్షలు, అమానవీయాలు వెంటాడుతుంటాయి. మనుషులకు కూడు, గూడు, నీడ విద్య మానవ కనీస అవసరాలు. బ్రాహ్మణ సమాజం తమ అధికారాన్ని విస్తృతం చేసుకొనడానికి, కొన సాగించడానికి జ్ఞానం ను తమ పట్టు లోనే వుంచుకున్నారు. ఆ.,.జ్ఞానాన్ని మాకు అందకుండా మేము జ్ఞానవంతులుగా ఎదగ కుండా ముళ్ళ కంచెలేసి కట్టడి చేస్తున్నది. అన్నింటికీ మేము నిషేధాలే .
          మా పేదరికమ్, వివక్షలు అనారోగ్యమ్, అవమానాలు పోగొట్టుకోడానికి జ్ఞానమే మందు. అందుకే మనం జ్ఞానవంతులమ్ కావాలి’.
          పీష్వా బ్రాహ్మణులు సమాజమ్మీద నియంత్రణాధి పత్యం చేస్తున్నందువల్ల అన్ని వనరులు వారి నిర్మాణ కేంద్రకంగా సాగు తున్నాయని, విద్య కూడా వారి నియంత్రణ పట్టులో వుండి మమ్మ ల్ని విద్యకు దూరం చేశారు. యీ దుక్కాన్ని ఇట్లా రాస్తూ పోతే.. కన్నీల్లతో నేను బద్దలవుతానని అంతులేని దుక్కాన్ని ఆవిష్కరించింది ముక్తా సాల్వే.
వెలివాడ మాంగ్ బాలిక ముక్తా సాల్వే విద్యావంతురాలై జ్ఞానవంతంగా వ్యక్తీకరించిన ‘మంగ్ మహార్ దుక్కమ్’ రచనలోని దుక్కాలు యిప్పటికీ అంటే దాదాపు 200 సంవత్సరాలు అయినా నేటికీ సంబంధిత అంశాలుగానే, చర్చించాల్సిన తర్కించాల్సిన అంశాలుగానే మిగిలి వున్నాయి.          

  *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.