ఉప్పు నీరు

-జయశ్రీ అట్లూరి

ఎండి పొడారిన కనుగవ
చెలరేగే తుఫానుల తాకిడి
కుమిలి కదలి చెమ్మారిన అలికిడి
ఆరని జ్వాల కరిగిన కల విరిగిన అల 
 
చేరేసిన తట్టా బుట్టా మట్టిపాలు
కనిపెంచిన పిల్లా జెల్లా నిన్నటి మురిపాలు
కసాయికన్ను పడితే కడదేరిపోయే జీవితాలు
ఆశలు ఆశయాలు కొడిగట్టిన దీపాలు
 
తరతరాలుగా ఎత్తుతున్న తలల అణచివేత  
యుగయుగాలుగా ఎవరూ వినని ఆత్మఘోష
దినదినపు సుడిగుండాల గుండెకోత 
నాకు నేను నాది..నాకుండకూడని భాష
 
కోటానుకోట్ల మగువల తీరని దుఃఖం
గుండె సెగకు కరిగిన వ్యథ రుధిరాక్ష స్రవంగా
బాధా సాంద్రపు రక్తకన్నీటి చుక్కలుగా 
లక్షల కోట్ల కన్నీటి చుక్కల సాకారం సాగరం
 
లవణం సాగర జల లక్షణం
కన్నీటి రుచి లక్షణం లవణం
భూగోళం మీద భూదేవి సహనాన్ని మించిన
సప్తసముద్రాలు ఉప్పురికిన శోక సముద్రాలు

*****

Please follow and like us:

One thought on “ఉప్పు నీరు (కవిత)”

  1. శ్రీమతి జయశ్రీ అట్లూరి గారి కవిత ‘ ఉప్పు నీరు ‘ లో తరతరాలుగా అణచివెయ బడుతున్న స్త్రీ ఆత్మ గౌరవాన్ని గురించిన ఆవేదన వుంది .
    సంద్రం , కన్నీరు రెండింటి లక్షణమూ ఉప్పగా వుండటమే . స్త్రీ ఆవేదన తీరేది ఎప్పుడు అని ప్రశ్నిస్తూ సమాజాన్ని నిలదీస్తున్నారు
    మంచి కవిత . అభినందనలు
    జి . రంగబాబు

Leave a Reply

Your email address will not be published.