చిన్నూ- బన్ను

-కందేపి రాణి ప్రసాద్

          ఎండలు భగ భగ మండుతున్నాయి. అడవిలో ఎటు చూసినా మొక్కలు తలలు వాల్చేసి ఉన్నాయి. వృక్షాలు కొన్ని చోట్ల రాలిన ఆకులు సూర్య కిరణాలు పడి వాటికవే కాలి పోతున్నాయి. వేసవి కాలంలో అడవి ఎండకు మాడి పోతున్నది. చిన్న చిన్న నీటి కుంటలు, దొరువులు ఎండిపోయాయి. నీళ్ళ కోసం చాల దూరం వెళ్ళ వలసి వస్తోంది చిన్న జంతువులు, పక్షులు దాహంతో గొంతెండి అల్లాడుతున్నాయి.
          ఓ పెద్ద వృక్షం కింద బొరియలో కుందేళ్ళ కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబంలో అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు చాల చిన్నవి కావడం వల్ల  అకతాయిగా ఉంటాయి. రెండు కుందేలు పిల్లల పేర్లు చిన్ను, బన్నులు. ఏ పని చెయ్యవద్దు అని అమ్మా నాన్నలు చెబితే అదే పనిని చేస్తాయి. ఏ పని చేసినా రెండూ కలిసే చేస్తుంటాయి. వీళ్ళు బోరియకు దగ్గరగానే గడ్డి బాగా దొరుకుతుంది. క్యారేట్లూ బాగానే దొరుకుతాయి. ఈ కుందేళ్ళకు ఇంకా ఇష్టమైన గడ్డి చేమంతి మొక్కలు మాత్రం బాగా దూరాన ఉంటాయి. చిన్ను, బన్నులకు దూరం వెళ్ళవద్దని అమ్మా నాన్న చెప్పారు ఎండాకాలం కాబట్టి బయట ఎక్కువ సేపు ఉండకుండా బోరియలోనే ఉండాలని హెచ్చరించాయి. సరేనంటూ బుద్ధిగా తలూపాయి చిన్నూ బన్నూలు.
అమ్మా నాన్నా బయటికి వెళుతూ పిల్లలకు జాగ్రత్తలు చెప్తాయి. “ఎండల్లో బయట తిరగవద్దు! తినేసిన వెంటనే ఇంట్లోకి వచ్చేయండి! శత్రువులను గమనించుకోవాలి! ఇలా ఎన్నో చెప్పి వెళతాయి. చిన్నూ, బన్నూలు పిల్లలు కదా! వద్దన్న పని చెయ్యాలని చూస్తాయి.
          ఒకరోజు అమ్మానాన్న బయటికి వెళ్ళి పోగానే చాల దూరంలో ఉన్న గడ్డి చేమంతి మొక్కలను తినటానికి వెళదామనుకున్నాయి. గడ్డి చేమంతి మొక్కల రుచి గుర్తు చేసుకుంటూ బయల్దేరాయి. చాలా దూరం వెళ్ళాక గడ్డి చేమంతి కనిపించింది. రెండూ మొక్కల్లోకి దూకి కొరకటం మొదలు పెట్టాయి. కడుపునిండే దాకా తిన్నాయి. “అబ్బా ఎంత బాగుందో” అని పొట్ట నిమురుకుంటూ ఇక వెళ్దామా? అన్నాయి. సూర్యుడు నడినెత్తి కొచ్చేశాడు. ఇంటికి బయల్దేరాయి చిన్నూ బన్నూ. పొట్ట నిండా తిన్నా ఆయాసంతో వేగంగా నడవలేక పోయాయి. కొద్ది దూరం నడవగానే దాహం వేసింది. ఎక్కడా నీళ్ళు లేవు వచ్చేటప్పుడు తెలియలేదు గానీ చాల దూరమే ఉన్నది. గొంతు ఎండి పోయింది. వగరుస్తూ ఆయాసంతో నడుస్తున్నాయి. ఎంత నడిచిన ఇల్లు రావటం లేదు. నడుస్తూనే ఉన్నాయి. చిన్నూ బన్నూలు కళ్ళు తిరిగి పడిపోయాయి.
          చిన్నూ బన్నూలు తిరిగి కళ్ళు తెరిచే సరికి హాస్పిటల్లో ఉన్నాయి. ఆదుర్దాగా తమ వంకే చూస్తూ అమ్మా నాన్నలు కనిపించారు. మర్రి చెట్టు మీదుండే కాకి మామ కుటుంబం, రావి చెట్టు మీద వాలే పావురం బాబాయి కుటుంబం. ఇంకా చుట్టూ పక్కల ఇళ్ళ వాళ్ళంతా ఉన్నారు. నెమలి మామ ఇంట్లో ఉన్నారు తామంతా.
          ‘అమ్మా ఏమైంది మాకు ‘ నీరసంగా అడిగారు చిన్నూ బన్నూలు. “మీకు వడ దెబ్బ తగిలింది. నెమలి మామ వైద్యం చేస్తున్నాడు” తల మీద చెయ్యేసి అన్నది అమ్మ. “మీరు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే కాకి మామ చూశాడట. మిమ్మల్ని తీసుకొని హాస్పిటల్ వచ్చాడు” మళ్ళి అమ్మా ఏడుస్తూ చెప్పింది.
          సాయంకాలం దాకా హాస్పిటల్లో ఉంచుకుని తగ్గాక ఇంటికి పంపిస్తానన్నాడు నెమలి మామ. నెమలి మామ చిన్నూ బన్నూలతో ఇలా అన్నాడు – ఎండాకాలంలో బయట తిరిగితే వడదెబ్బ తగులుతుంది. మీరు బొరియల్లో ఉండే జాతి కాబట్టి ఎండను తట్టుకోలేరు. అందుకే నీడ పట్టున ఉండాలి. ఇదే విషయం మీ అమ్మా నాన్న చెప్పారు. మీరు వినకుండా బయటకు వెళ్ళారు. అమ్మానాన్న చెప్పిన మాట వినాలమ్మా. మీ మంచి కోసమే చెబుతారు. మీకు ఇష్టమైనవి తినాలనిపిస్తే అమ్మానాన్నలతో కలసి వెళ్ళండి. మీకు ఆపద రాకుండా అమ్మానాన్నా తోడుగా ఉంటారు. ఇంకా ఎప్పుడూ వద్దన్న పని చేయవద్దు. సరేనా!
          చిన్నూ బన్నూల కళ్ళు తెరుచుకున్నాయి. “ఇంకెప్పుడూ ఇలా చేయం మామా” అన్నారు చిన్నూ బన్నూలు పిల్లలూ! ఎప్పుడూ అమ్మానాన్న వద్దన్న పని చెయ్యవద్దు. చెప్పిన మాట వినండి.
 

    *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.