బతుకు చిత్రం-17

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని ఆరాతీస్తూ చివరికి సైదులు తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

***

          కానీ పరాయి మగవాడితో రాత్రంతా గడిప్పిందంటే ఈమెకు పెళ్ళి ఎలా జరుగుతుందని బాధ పడుతుండగా సైదులు తల్లి రాయలచ్చిమి మీరందరూ అంగీకరిస్తే నాకోడుక్కు చేసుకుంటానని అనడంతో అందరూ సంతోషిస్తారు.

          ఆ విధంగా పేదరాలు అయిన జాజులమ్మ పెళ్ళిని శ్రీ రామ నవమి రోజున అదే కళ్యాణ గద్దెపై జరిపించాలని నిర్ణయిస్తారు .ఊరు వారే పెళ్ళి పెద్దలయి ఆనందంగా జరిపిస్తున్న వేడుక.

          జాజులమ్మ అన్నదమ్ములు ఎవరూ రారు. పిర్య్య ,అతని వాడకట్టు తోడుగా ఉంటారు. రాయలచ్చిమి చిన్న కొడుకు పెళ్ళి తానూ ఎలాగూ చేయలేక పోయానని చాలా సాంప్రదాయ బద్దంగా పెళ్ళికి ముందు జరుగ వలసిన కార్యక్రమాలన్నీ జరిపిస్తుంది.
ఇప్పుడు గుడిలో కళ్యాణం తంతు జరుగుతుంటుంది.

***

          ఇంటి ముందు వేసిన పెళ్ళి పందిరిలో సైదులుకు వడ్లతో మైలపోలు పోశారు. మంగలాయన బొట్టు పెట్టుకొని రుమాలు చుట్టుకొని వడ్లతో మైలపోలు రాసి దాని పైన పీట వేశాడు.సైదులును తూర్పుముఖంగా కూర్చోబెట్టాడు. మంగలాయన జుట్టుకత్తిరించి గడ్డం, మీసం సరిచేశాడు. కాలి, చేతి వేలి గోళ్ళు తీశాడు. వంటికి నూనె రాసి మాడ అంటాడు. పెద్దవాళ్ళు అందరూ వచ్చి దీవించారు.

          వడ్లను మంగలాయనకే ఇచ్చారు. ఈర్లచ్చిమి సంతోషంతో కొత్త కండువా పెట్టింది.

          మైలపోలు మీద నుండి తీసుక వెళ్ళి కుంకుడు కాయ తో తలరుద్ది వంటికి గట్టి పిండి రాసి ముత్తయిదువలు స్నానం చేయించారు.

***

          ఇదే విధంగా జాజులమ్మకు కూడా ఆ వాడకట్టు ఊరివారందరూ ఆచారయ్య చెప్తుండగా బొట్టుపెట్టి వంటికి పసుపు, నూనె రాసి స్నానం చేయించారు.

          నలుగు పేరు తో చేసిన ఈ వేడుక లో ముసలవ్వ 

పుట్టుతా సీతమ్మ ఏమి కోరింది 

పుట్టుతా సీతమ్మ పురుడు కోరింది 

పెరుగుతా సీతమ్మ ఏమి కోరింది 

పెరుగుతా సీతమ్మ పెళ్ళి కోరింది 

నడువంగా సీతమ్మా ఏమి కోరిందీ 

నడువంగా సీతమ్మా నాగవేల్లీ  కోరూ 

          ఇద్దరి ఇళ్ళ లోనూ ఐరోన్లు తెచ్చే వేడుక ఘనంగా జరిగింది. ముత్తైదువలు, బంధువులు అందరూ కుమ్మరి వారింటికి వెళ్ళారు. కట్నం ఇచ్చి రెండు ఐరోన్లు ఒక గరిగె బుడ్డి తీసుకున్నారు.

          చేద్ధరును కర్రతో పైకెత్తి పట్టి దాని కింద వాటిని పట్టుకొని వచ్చారు. “వలిపెం” అని పిలుస్తూ చాకలి వచ్చి మిత్తి తీశాడు.

          దేవుని గది లో ధాన్యం పోసి దాని పైన పిడుకలు పెట్టి వాటి పైన ఐరోన్లు పెట్టారు. ఈ తంతు అంతా సైదులు చూడకూడదంటూ దూరంగా కూచోబెట్టారు.

          వరుసకు ఆడబిడ్డ వచ్చి బొట్టుపెట్టి పెళ్ళి పిలవానిగా అలంకరించింది. నుదుట పెళ్ళిబొట్టుపెట్టి, బుగ్గకు కాటుక తో చుక్కను పెట్టి కాళ్ళకు పసుపు రాసి పాయిరాళ్ళ తో అలంకరించి ఐరోన్ల ముందు కూర్చోబెట్టారు.

          సైదులు తో పాటు ఒక అబ్బాయిని తోడు పిల్లవానిగా తయారు చేశారు.

          అయ్యవారు వచ్చి ఐరోన్ల లో బియ్యం గింజలు వేశాడు. నూలు కండె తో రెండు ఐరోన్లు కలిపి ఐదు వరుసల దారం చుట్టాడు. ఐరోన్ల్ వెనుక శ్రీరస్తు, శుభమస్తు అని రాసి దాని కింద లగ్న ముహూర్తాన్ని చందనం తో రాసాడు.

          సైదులు చేత ఐరోన్ల పూజ చేయించి చేతికి కంకణం కట్టాడు. ఆడబిడ్డ చేత సైదులుకు బాషింగం కట్టించారు.పెద్దవారు వచ్చి తోక రుమాలు చుట్టి అలంకరించిన గరిగె బుడ్డిని ఇచ్చి సాగనంపటానికి సిద్హం చేసారు.

          జాజులమ్మను కూడా ముత్తైదువలు ఐరోన్ల ముందు కూచోబెట్టి కాళ్ళకు పసుపు రాసి పైన పాయిరాలు పెట్టారు.పెళ్ళి బొట్టుపెట్టి బుగ్గన చుక్కపెట్టి అలంకరించి ఒక చిన్న అమ్మాయిని అలంకరించి తోడూ పెళ్ళిపిల్ల గా ఉంచారు.

          అయ్యవారు వచ్చి ఐరోన్ల ముందు కూర్చున్న జాజులమ్మతో గౌరీ పూజ చేయించి బాషింగం కట్టించాడు.

***

          సైదులును లగ్గానికి తరలించడానికి తర్లిపోవుడు అనుకుంటూ ఆడబిడ్డ మంగళ హారతి పట్టుకొని ఉరేగింపుగా బయటకు వచ్చింది. పల్లకిలో గుడి వరకు డప్పుతో ఊరేగించి  గుడి లో దండం పెట్టుకున్న తరువాత ట్రాక్టర్ ఎక్కించారు.

          జాజులమ్మ ఊరు చేరగానే ఊరు బయటనే  మర్రి చెట్టు నీడన కూర్చోబెట్టారు. లగ్గం ఇల్లు దాటిపోకూడదని చాపలు వేసి ఏర్పాట్లు చేశారు.   

          జాజులమ్మ తరుపున ఆ వాడ కట్టు బంధువులు సైదులు రాక తెలియగానే దూరం నుండి వచ్చారని అతిథి మర్యాదకు అంబలి బుడ్డి ఇవ్వడానికి వచ్చారు.

          ఈర్లచ్చిమికి ఊరివారి మర్యాదకు చాలా ఆనందం కలిగింది. తల్లి లేని పిల్ల, వదినెలు, అన్నలు లేక్కచేయ్యకపోయినా ఆన్నింటిని శాస్త్రబద్దంగా జరిపిస్తున్న తీరుకు సంతోషం కలిగింది.

          ఎదుర్కోళ్ళు జరిపించారు.

          పీరయ్య తలపాగాతో ఇత్తడి తామ్బాలం లో ఈర్లచ్చిమి, రాజయ్య ల కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని కొత్త కండువాతో పాదాలు తుడిచి బట్టలు పెట్టాడు.

          రాజయ్య,ఈర్లచ్చిమి కూడా పీరయ్యకు బట్టలు పెట్టారు.

          ఇరువైపులా బంధుమిత్రులు ఎదురెదురుగా కూర్చొని అంబలిబుడ్డి ఇచ్చు కున్నారు.

          తరువాత అందరూ కలిసి కళ్యాణ వేదికకు చేరుకున్నారు.

          ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసి ఉంది. తమ ఇంటిలో పెళ్లన్నట్టుగా ఊరంతా అక్కడే ఉన్నారు.

          మండపాన్ని కొబ్బరి మట్టలు, మామిడి పిందెలు, మామిడి ఆకులతో అందంగా అలంకరించారు. ఎటు చూసినా ఉత్సాహమే కనిపించసాగింది.

          మైకులో అయ్యవారు కళ్యాణ విశేషాలను ..

          అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి? అనే వివరణ ఇస్తున్నాడు.

          రాముడు వసంత ఋతువు, చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు జన్మించాడు. దీనినే  అభిజిత్ లగ్నమని, అభిజిత్ ముహూర్తమని అంటారు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన ఈ రోజున పండుగ జరుపుకుంటామని చెప్తూ చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిశిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. అలా కళ్యాణం కూడా ఇదే రౌన జరిగిందని అందుచేత ఈ రోజు పన్నెండు తరువాత పూజలు, చేసే పనులు శ్రీరామానుగ్రహం వల్ల విజయవంత మౌతాయని చెప్పి పెళ్ళి వేడుక ను జరిపిస్తున్నాడు.

          అంతా వింటున్న ఈర్లచ్చిమికి తన కొడుకుకు అన్నీ మంచి శుభాలే జరుగుతాయని సంపూర్ణ విశ్వాసంతో రాముల వారికి నమస్కరించింది.

          జాజులమ్మను కూడా మంటపానికి తోడుకొని వచ్చారు.

          మంగళవాయిద్యాల నడుమ రామ కళ్యాణం  కన్నుల పండువగా జరిగింది.

          శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రారండి ……

          అంటూ అలనాటి పాట మైక్ లో మొదలయింది. ముత్యాల తలంబ్రాలు పోస్తూన్న రాముల వారిని జనం మైమరిచి చూస్తుండి పోయారు.

          కాసేపటి తరువాత ఆచారయ్య సైదులు, జాజులమ్మ పెళ్ళి ని గురించి ఊరివారికి, పొరుగు నుండి వచ్చిన వారికి తెలియజేసి ఇద్దరినీ మంటపం లోకి ఆహ్వానించాడు.

          పెళ్ళి పందిట్లో బియ్యం తో చాకలి వారు బొట్టుపెట్టుకొని తలకు రుమాలు చుట్టుకొని తూమెడు బియ్యం తో పోలు పోశాడు. ముందు పడమర నుండి తూర్పుకు రాసి అనంతరం దక్షిణం, పడమర, తూర్పులకు పోసి పోలు రాశాడు. చతురస్రాకారంగా రాసి మధ్యలో మళ్ళీ బియ్యం పోశాడు.

          ఈవిధంగా పోలు పైన ఉత్తర దక్షిణాలు గా బండి కాని పెట్టి తూర్పు వైపున గద్దె పీత పడమరన పెళ్ళి పీట వేసి ఉంచాడు.  

          ఒకే మోదుగ కర్రతో మూడు పీటల ఆకారంగా చేసి పసుపు రాసి కంకణం కట్టిన మొలలు వాడని పీట పై పడమర ముఖంగా కూర్చోబెట్టి గరిగె బుడ్డి పక్కన పెట్టారు.

          సైదులు ఎదురుగా పోలుపైన ఆచారయ్య దంపతులు కూర్చొని కుడుకలో పాలు, పెరుగు, తేనే, చక్కర, నేయి వేసి చేసిన పంచామృతంను మామిడి ఆకు తో పోసి మూడు సార్లు త్రాగించారు. వేదమంత్రాలు చదువుతుండగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

          సైదులుకు అడ్డంగా ముందు భాగం లో కులపెద్దలు ఇరువురు కలిసి తెరను పట్టారు. జాజులమ్మను సైదులుకు ఎదురుగా పెళ్ళిపీట పైన తూర్పు ముఖంగా కూర్చో బెట్టారు.

          అయ్యవారు ముహూర్తం సమయం కాగానే ఇరువురి జిలకర్ర బెల్లాల్ని ఒకరివి మరొకరికి ఇచ్చాడు. దాన్ని అరచేతిలో పెట్టుకొని ముహూర్తం ఘడియ రాగానే తెరచాటుగా ఉండి ఒకరి నెత్తిలో మరొకరికి జిలకర్ర బెల్లం పెట్టించారు. తర్వాత తెరతీసి ఒకరి ముఖాలు మరొకరిని చూసుకోమ్మన్నాడు.

          తొలిసారిగా సైదులు జాజులమ్మను చూసి చిరునవ్వు నవ్వడం చూసిన ఈర్లచ్చిమి సంతోషం తో సగం దిగులు తీరింది. జాజులమ్మ సిగ్గుల మొగ్గయింది.

          ఈ దృశ్యం అందరినీ కనువిందు చేసింది.

          జాజులమ్మకు ఇరువైపులా ఆచారయ్య దంపతులు కాళ్ళు కడిగే చెంబు నిండా నీళ్ళుపోసి మామిడి ఆకు వేసి ఉంచి తాంబూలం మధ్యలో పెట్టి దాంట్లో సైదులు కాళ్ళు పెట్టించి అయ్యవారు వేద మంత్రం చదువుతుండగా అయ్యగారమ్మ చెంబు పట్టుకొని మామిడి ఆకు మీదుగా నీళ్ళు పడేలా పోస్తుంటే ఆచారయ్య కాల్లుకడిగి కన్యాదానం చేశాడు.

          అందరి మనస్సులో ఏ జన్మ పుణ్యమో కాకుంటే ఆచారయ్య దంపతులు కన్యాదానం చేయడమేమిటని సంతోషించారు.

          పుస్తెలు ను కుడుక లో ఉంచి పందిరిలో ఉన్న అందరి చేత ముట్టిస్తూ వేద మంత్రాల నడుమన జాజులమ్మ మేడలో కట్టింప చేశారు. ముడి పైన పసుపు, కుంకుమ చల్లింప చేశారు. అందరి అక్షింతలు వానజల్లు గా వారిపై కురుస్తుండగా ,

          సుట్టుతేరా కట్టి నడుమ  పాలుపోసి 

          మల్లెలు మరువాలు విరజాజి పందిట్ల 

కొబ్బరాకులు మామిడాకులు పచ్చని ఆకులు  

భూదేవంత అరుగుళ్ళ ఆకాశ గొడుగుల్ల 

కట్టేనే రామయ్య సీతమ్మ మేడలోన 

రత్నాల పూస్తే అతి సుందరముగాను …………

అని పాటలు పాడారు.

          జాజులమ్మ కుడికాలిని కాని పైన పెట్టగా సైదులు ప్రక్కవేలుకు వెండి మట్టెల జత పెట్టాడు. తరువాత ఎడమ కాలికి కూడా ఇదే విధంగా పెట్టి కంసాలాయన తో మట్టేలను దగ్గరికి ఒత్తించి కట్నం ఇచ్చారు.

          సైదులు లేచి నిలబడి కుడికాలిని కాని పైన పెట్టగా, జాజులమ్మ లేచి తన కుడి కాలితో సైదులు కాలిని మూడు సార్లు తొక్కింది. ఆ తరువాత సైదులుకూడా అలాగే చేశాడు. ఇలా కాలు తొక్కించడం వేడుక కూడా పూర్తి చేశారు. కూర్చున్న సైదులు కాళ్ళు మొక్కించారు. దండలు మార్పించారు.

          జాజులమ్మ కుడివైపున సైదులును కూర్చోబెట్టి అయ్యవారు వీరిరువురి కొంగులు కలిపి బ్రహ్మముడి వేశాడు.

          జాజులమ్మ చీర కొంగులో కుడుక, ఖర్జూర పండు, పోక, పైస పెట్టి మూట కట్టి దాన్ని సైదులు పైన వేసుకున్న పంచె కొంగుకు ముడి వేశారు.

          పందిరి మధ్యలో కొత్త గుడ్డ కట్టి అందులో చెక్క బొమ్మ పెట్టి అయ్యవారు గరిగె బుడ్డిలో చందనం నీరు బొమ్మ పై పోసి కిందికి జారే నీళ్ళను ఇద్దరి పైనా చల్లాడు. చంటి పిల్లలు మూత్రం పోసినట్టుగా చెప్పి మీకూ సంతాన భాగ్యం త్వరగా కలగాలని దీవించాడు.

          నాగవెల్లికి పోలును బియ్యం తో పోశారు. పోలు పైన నాలుగు ముంతలు పెట్టారు. ఈ పోలుకు పడమరన పెల్లిపీటలు వేశారు. అయ్యవారు పోలు ముంతలను కలుపుతూ ఐదు వరుసల దారం చుట్టాడు. ముంతల్లో మామిడాకు వేసి నాగవెల్లి పూజ చేసాడు.

          ఆడబిడ్డ అన్నం వండి తెచ్చింది. గుడాలు, దీపంత విస్తరాకులు తెచ్చి నాలుగు ముంతల వద్ద నాలుగు ఆకులు వేసి అందులో అన్నం పెట్టి నాలుగు దీపాలు వెలిగించి ముంతల వద్ద పెట్టగా అయ్యవారు నైవేద్యం పెట్టించాడు. 

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.