మా శృంగేరి యాత్ర!-1

-సుభాషిణి ప్రత్తిపాటి

          2018 దసరా సెలవుల్లో కేవలం  మూడు రోజుల యాత్ర కు ప్రణాళిక వేసుకున్నాం. మేము అంటే మావారు, ఇద్దరు పిల్లలు, అలాగే బెంగుళూరులో ఉన్న మా మరిది, తోడికోడలు,ఇద్దరు పిల్లలు. బెంగళూరు నుంచి ఓ ట్రావెలర్ మాట్లాడుకున్నాం. సాయంత్రం 6 గంటలకు అంతా బయలుదేరాము. వెనుక సీట్లలో పిల్లలు, మధ్యన మేము ముందు మా మరిదిగారు మొత్తానికి సెటిల్ అయ్యాము. రాత్రి 9 దాటాక మధ్యలో ఆగి ఇంటి నుంచి తీసుకువెళ్ళి న చపాతీలు తిన్నాము. ముందుగా హోరనాడు అన్నపూర్ణా దేవి ఆలయం అనుకున్నాము. 
          మా ప్రయాణం సాగుతుండగానే వాన మొదలైంది. పిల్లలు నిద్రలో మునిగి పోయారు. దాదాపు 340 కిలోమీటర్ల దూరం బెంగుళూరు నుండి. హోర్నాడు కొండపైన ఉన్న ఆలయం. అక్కడికి వెళ్ళడానికి ముందు కొంత అడవి ఆపై కొండపై ప్రయాణం. ఆ ఘాట్ రోడ్డు లోకి ప్రవేశించేసరికి హోరున వాన , అర్థరాత్రి చుట్టూ అడవి. కారు సర్ర్ అంటూ మలుపు తిప్పుతున్నపుడల్లా ఆ లైట్లవెలుగులో ప్రతిమలుపులోనూ ఓ సెల కనిపిస్తూ నన్ను మైమరిపించింది. బాగా వర్షం పడుతుండటంతో రెండు మూడు చోట్ల కొండనుంచి జారిన సెల రోడ్డు మీదుగా ప్రవహిస్తూ లోయలోకి జారుతూ చేసిన గల గలమని సవ్వడి ఇంకా నా చెవుల్లో మోగుతోంది. అలవోకగానే నా పెదవులపై  గలగలనే పారు సెలపాటలో తేటినై…. దేవులపల్లి వారి గీతం నాట్యం చేసింది. నేను మా తోడి కోడలు అప్పటికే శాస్త్రిగారి కలం పరచిన  సిరివెన్నెలలో విహరిస్తున్నాం. కారు ఆపి మరీ ఆ సవ్వడి విన్నాము. కొద్ది దూరం పోగానే వాన వెలసి, చుక్కలు కనిపించాయి. ఎత్తైన పేరు తెలీని చెట్లు, పేద్ద పూలగుత్తులు వింతైన పరిమళాలు ఎర్రని మట్టితో కలసి ప్రవహిస్తున్న కొండ వాగులు, వాఁవ్. అడవి మా కోసం మేలుకుందేమోననే భావన. లోపల సిరివెన్నెల గీతాల ఝరి సాగుతోంది.రెప్పలంటని కళ్ళ దోసిళ్ళతో మనసు ఆ అడవిలోని అందాలను నింపుకుంటోంది. ఆ ఆనందాన్ని మోయలేక నా గుండె ఉక్కిరిబిక్కిరి అయి కన్నీళ్ళొచ్చేశాయి. ఏదో మైకం నుంచి బయటపడిన భావనలో ఉన్నా నేనైతే. అదిగో అలా….
అర్థరాత్రి 1:45 కల్లా హోర్నాడు చేరుకున్నాము. అక్కడ ఏ సమయంలోనైనా యాత్రికుల కోసం బస సిద్ధంగా ఉంటుందట. మమ్మల్ని ఓ పెద్ద హాలులో అక్కడి సెక్యూరిటీ గార్డు విడిచి పెట్టారు. వరుసగా కంబళ్ళు దిండ్లు పరచి ఉన్నాయి. ఓ నాలుగు గంటలు కునుకు తీశాం.
          ఏ గదులు అద్దెకు తీసుకునే శ్రమ లేకనే అక్కడ ఎవరికి వారికి స్నానపు గదులు, వేడినీటి సదుపాయాలు చాలా చాలా చక్కగా చేయబడటమే కాకుండా శుచిగా ఉండటం గమనించాను. త్రాగునీటి సదుపాయం కూడా ఉంది. ఐదున్నర కల్లా అందరం స్నానాదులు పూర్తి చేసుకుని అమ్మ దర్శనానికి బయలుదేరాము.
          చాలా చాలా అద్భుతంగా నిర్మించిన పెద్ద ఆలయం అది. వన్నెవన్నెల పూల పరిమళాలు, కర్పూరం, సాంబ్రాణీ సువాసనల కలబోత, మరోవైపు దీపాల నుంచి వెలువడుతున్న కాంతులు మనసును అలౌకిక స్థితి కి తీసుకు పోతుంటే ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ వలయంలోకి ప్రవేశించి కొద్ది సేపట్లోనే అమ్మను దర్శించుకున్నాము. గంటల కొద్దీ క్యూలైన్ యాతన లేమీ అక్కడ లేవు. అక్కడ గర్భగుడి కి ముందే 30₹ లు ఇస్తే ఓ రాగి పళ్ళెం లో బియ్యం ఇస్తారు. ఆసక్తి ఉన్న వారు అవి తీసుకుని అమ్మ ముందు పూజారి గారికి ఇస్తే అవి దేవికి సమర్పించి కొన్ని తిరిగి ఇస్తారు. మనం సమర్పించి న బియ్యం నిత్యాన్నదానానికి వినియోగిస్తారట. మనకు ఇచ్చిన కొద్ది బియ్యం మనం ప్రసాదంగా స్వీకరించాలి. పురుషులు మాత్రం ఖచ్చితంగా పైన షర్ట్ ధరించకూడదు, పైన ఉత్తరియం లాటివి ధరించే అమ్మ దర్శనానికి రావాలి. తొలుత ఇక్కడ అమ్మను శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించారట. తరువాత కాలంలో ఇప్పటి స్వర్ణ అన్నపూర్ణ మ్మను ప్రతిష్టించారట. బంగారు అన్నపూర్ణా దేవి విగ్రహం మనల్ని చూపు తిప్పుకోనివ్వనంత అందంగా అమ్మ చిరునవ్వొలుకుతున్నట్లుగా ఉంటుంది. చేతిలో గరిటెతో ఆ జగదేకమాతను చూడడానికి వేయికన్నులు కావాలనిపిస్తుంది.
          దర్శనమయి బయటకు వస్తూనే మరలా పెద్ద వాన. ఆ వెంటనే మబ్బులు .ఏదో తలపై వాలినట్లు అందంగా కదిలిపోతుంటే మా నోళ్ళలలాగే తెరుచుకుని ఉండి పోయాయంటే నమ్మండి. సముద్ర మట్టానికి దాదాపు గా 850 పై మీటర్ల ఎత్తులో ఉన్న ప్రకృతి రమణీయక ప్రదేశం ఇది.  మంచుకప్పిన ఆకుపచ్చని కొండ. దానిపై పొగ కమ్మినట్లు సాగే మేఘాల బారులు, ఆలయం వెనుక ఉన్న కొండశిఖరంపైకి ఎక్కి ఫోటోలు దిగుతున్న ఔత్సాహికులు కనిపించారు. అప్పుడే సూర్యోదయమయింది ఓ కొండవాలుపై వాలిన లేలేత భానుకిరణాలతో బంగారంలా ఆ వైపు మెరుస్తుంటే, మరో వైపు కొండను ఢీ కొడుతున్న మబ్బు తెగువని చూస్తూ దేఁవుడా రెండు కళ్ళే ఎందుకిచ్చావయ్యా అనేసుకున్నాను సుమండీ!
          ఆలయం ఎదురుగా ఉన్న ఓ హోటల్లో పూరీ తిన్నాం. చాలా చాలా రుచిగా అనిపించింది. కర్ణాటక శైలి లో వండిన కూర బాగా నచ్చేసింది మా అందరికీ.ఒళ్ళంతా పులకలు రేపుతున్న శీతగాలికి అక్కడి కమ్మటి కాఫీ ఒక్కో చుక్కా…ఓ అమృతమై అలసిన  అంతరంగానికి పునర్జీవం పోసిందంటే నమ్మండి. పడమటి కనుమలలో రాత్రి,వాన, వెన్నెల తొలిభాగమిది. మరి పగలు ఎలా ఉందో చెప్పాలా!? ఆగండాగండి వేచి చూడండి మరి…!!
*****
(సశేషం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.