మీను

-బండి అనూరాధ

          శీతాకాలం అంటే నాకు చాలా ఇష్టం. బద్ధకాన్నీ చలినీ పోగొట్టే తెల్లారగట్ట చలి మంటలంటే మహాఇష్టం. ఇప్పుడు ఈ ఖాళీ అప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళి రావడంవల్ల కొంత పూడుతోంది. నిజమయిన అమాయకత్వంలో అప్పటి ఆ అల్లరి రోజులు ఇలా ఉండేవీ అలా ఉండేవీ అనుకోవడంలో ఉన్న తృప్తి ఎంత బావుంటుందో. అప్పటి ఆటలూ పాటలూ వేరేలే ఎంతయినా.. ఇప్పుడు పిల్లలకి ఎంతచెప్పినా ఏమనర్ధమవుతుందీ.. చెబితే వింటారా అని అసలు.
 
          కొన్నిసార్లు అనిపిస్తుంది. నేనొక రాయినేమో. ఎవరో గిరాటేస్తే ఇటొచ్చిపడ్డానేమో అని. యాంత్రికజీవనంలో నాలా చాలామంది అనుకోవచ్చు కూడా. చదువు అవ్వడం పెళ్ళి ఇవన్నీ సాధారణంగా జరిగిపోయాయి. పిల్లలు పుట్టడం వాళ్ళు పెరిగి పెద్దవడం. చదువుకుని పెళ్ళిళ్ళై చెరోదేశం వెళ్ళడం అతిసాధారణంగా జరిగిపోయాయి. ఇక పెద్దవాళ్ళూ కాలం చేసారు. ఉన్నదల్లా నేనూ అతనే.
 
          పొద్దున్న వచ్చి పనిచేసి పెట్టే మీను మాత్రమే ఈ ఇంటికి సందడి. తను గత పది సంవత్సరాలుగా మా ఇంటికి వస్తోంది. తను చూస్తూ ఉండగానే మా పిల్లల పై చదువులూ పెళ్ళిళ్ళూ అయ్యాయి. తనకి ఇద్దరు పిల్లలు. స్కూలుకెళతారు. భర్త అపార్ట్మెంట్లో వాచ్మన్గా చేస్తాడు. తినేమో ఇళ్ళల్లో పనిచేస్తుంది. సెలవురోజుల్లో పిల్లలు కూడా తల్లివెంట వస్తారు. 
 
          వాళ్ళ అపార్ట్మెంట్కీ మా సందుకీ ఐదు నిమిషాల నడక. తను పొద్దున్నే ఇంట్లో పని చేసుకుని పిల్లల సంగతి చూసి పనికొచ్చేస్తుంది. అతను సైకిల్పై పిల్లల్ని తీసుకెళ్ళి దించుతాడు. మీనాక్షి తన అసలుపేరు. అప్పుడు పనికి వచ్చిన కొత్తల్లో తను ఇంకా చిన్నదే. బహుశా పదహారవ యేడు పెళ్ళి చేసినట్లున్నారు. ఇరవైకల్లా పిల్లలు పుట్టడం అంతా జరిగిపోయింది. తన ముఖంలో ఏదో నిర్మలత్వం ఉంటుంది. తన మాటలో నెమ్మది ఉంటుంది. ఎందుకో ఎప్పుడూ మా ఇంటి అమ్మాయే అనిపిస్తుంది. మీనూ అని పిలవడం అలవాటై పోయింది. నాకు ఆడపిల్ల లేకపోవడమూ కారణమేమో తెలియదు. కొన్ని విడమర్చి చెప్పలేము.
 
          ఇంట్లో అతను పెద్దగా అంతగా మాట్లాడడు. మితభాషి. గట్టిగా అరచినా చిన్నగా నవ్వి ఊరుకుంటాడు. అంతగా స్పందించడు దేనికీ. ఉద్యోగానికి వెళ్ళడం రావడం. కాస్త పిల్లల చదువులో కొంచం బయటి పనుల్లో.. అంతే. నిజానికి అతనిపై నాకేమీ కంప్లైంట్స్ లేవు. కానీ ఎక్కడో అసంతృప్తి. నన్ను ఎవరూ అర్ధంచేసుకోవట్లేదన్న దిగులు. ఏం చెప్పుకోవాలనుకుంటానో నాకూ తెలియదేమో పోనీ. అలాంటి రోజుల్లోనే మీను పనికి చేరడం. నిదానంగా మాటలూ. బాగోకపోతే ఆరా తీసుకోవడం. కొంత తనని చూస్తే మా అమ్మ నాకై చూపే ఆదుర్దా గుర్తుకొస్తది. పిల్లవాడు పై చదువుకి వేరే దేశం వెళ్ళిపోయాక నా బెంగని తనూ మాత్రమే పంచుకుంది. ఇక రెండోవాడు అన్నబాట పట్టినప్పుడు నాకు మామూలుగా తీసుకోవడానికి సాయపడింది. మాటలు, నిజం కేవలం ఓదార్పు మాటలు, ఇవే కొంత బ్రతికిస్తాయి. అప్పుడప్పుడూ వచ్చే చుట్టాలు, మధ్యన వచ్చే ఫోన్ కాల్స్ .. ఇవన్నీ సరే కానీ.. ప్రతొరోజూ మనకి కనిపించే మనుషులతో మనకి అనుబంధముంటుంది కదా!
 
          అందరూ కూడా నవ్వుతారు. ఆయనా, పిల్లలు కూడా. నీకు మీను ఉంటే చాలు. మమ్మల్ని పట్టించుకోవూ అని. వాళ్ళకి నేను చెప్పేవి ఎప్పుడైనా తలకెక్కాయా, మనసుకి పట్టాయా అని నేనేం చెబుతాను. మహా అయితే దిగాలుగా ఒక నవ్వు నవ్వుతాను. తత్వవేత్తల పుస్తకాల్లో తలని దూర్చే అతనికి ఇవన్నీ ఎప్పటికర్ధమయ్యేనూ.
 
          రోట్లో పచ్చడి చేసి అందులో అన్నం తుడిచి పెడితే ముద్దుగా నవ్వుతూ తినే పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. ఊరగాయ పట్టి జాడీకెత్తేప్పుడు అన్నం కలిపిన ముద్దలు ఇష్టంగా కారంగా తింటూ నవ్వుతూ మంచినీళ్ళు తాగే పిల్లలకి ఇప్పుడు పెద్దవాళ్ళై ఇవన్నీ విసుగుని తెప్పిస్తున్నాయని నేనెవరికి ఫిర్యాదు చెయ్యాలీ. ఇష్టమే, పిల్లలు కదా!  ఇష్టమే, భర్త కదా!
 
          మొన్న అరుగుపై కూర్చున్నప్పుడు రోజీ అంటుంది. పిల్లలు ఆదివారం ప్రార్ధనకి రావడానికి విముఖత చూపుతున్నారని. మొన్న వాకింగ్లో రీనా కూడా ఇలాంటివే. నా చుట్టూ ఉన్న నాలాంటి ఎందరో స్త్రీలు ఇలాంటివే ఫేస్ చేస్తున్నారు. నిజానికి ఇవి కొందరికి పిల్ల కారణాలు కావొచ్చు. మా సందులో ప్రతి ఇంటికీ అరుగు ఉంటుంది. దాదాపుగా అందరం బాగానే ఉంటాం. మీనూ ఒక్క మా సందులోనే మూడు ఇళ్ళల్లో పనిచేసుకుని వెళ్ళిపోతుంది.
 
          అయితే ఈరోజు ఇటువంటి వార్తొకటి చెవినపడుతుందని అనుకోలేదు. మీను వాళ్ళ అబ్బాయి చిన్నూ ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు వాళ్ళ నాన్నకి ఆక్సిడెంట్ అయిందని. హాస్పటల్కి తీసుకెళ్ళారని. వింటున్నది అర్ధం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది. వాడికి మంచినీళ్ళు ఇచ్చి, విషయం, మీనూ పనిచేసే రోజీకి రీనాకి చెప్పి పర్స్ పట్టుకుని వాడిని వెంటబెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అప్పటికే కింద సెల్లార్లో కొందరు మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సెంటర్లో సినిమా హాలుకివతల కొట్లో సరుకులు తీసుకుని రోడ్డు దాటుతున్నప్పుడు లారీ గుద్దిందని. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేసరికే మరి ఇక అతను లేడని. అతను చాలా మంచి వ్యక్తి. కష్టపడి పనిచేస్తాడు. మీనూ చెబుతది, అపార్ట్మెంట్లో అందరికీ తనంటే చాలా ఇష్టమని. మునీ మునీ అని పిలుస్తానే ఉంటారని. 
 
          మేమంతా హాస్పిటల్కి వెళ్ళి మీనూని చూసి ఏడుపు ఆపుకోలేక పోయాం. మగవాళ్ళు హాస్పిటల్లో మాట్లాడారు. ఆక్సిడెంట్ కేసు కదా పోలీసులు వచ్చారు. ఒక్కొక్కరూ బంధువులు వస్తున్నారు. సాయంత్రమయింది. ఫార్మాలిటీస్ పూర్తయి బాడీని మీనూవాళ్ళ అత్తగారి ఊరు తీసుకుని వెళ్ళారు. మాకు అరగంట ప్రయాణం ఆ ఊరు. మరునాడు వెళ్ళి కాసేపు ఉండి మీనూ చేతిలో డబ్బులు పెట్టి ఖర్చులకు వచ్చేసాం. ఎంత బాధ. ఎంత నొప్పి. మేమేదో చెప్పే నాలుగు మాటలకి ధైర్యం తెచ్చుకునే సంఘటనేనా ఇది. ఇంటికొచ్చినా మీనూనే గుర్తుకొస్తోంది.
 
          ఫోన్  చేసినా చిన్నూనే ఎత్తుతున్నాడు. వాడిప్పుడు ఎనిమిదో తరగతి. పిల్ల వేణి ఆరు. పన్నిండు రోజులు గడిచాయ్. మధ్యన ఒకసారి వెళ్ళి వచ్చాం. కార్యం పూర్తైంది. ఈలోపు అపార్ట్మెంట్ వాళ్ళు లారీ వోనర్ అంతా పోలీస్ స్టేషన్లో మాట్లాడుకున్నారు. సాక్షులు చెప్పినదాని బట్టీ, తప్పు ఇద్దరిలో ఎవరిదో స్పష్టంగా తెలియలేదు. డ్రైవర్ వణికిపోయి ఉన్నాడు. వోనర్ కూడా అంతంత మాత్రమే. మీనూవాళ్ళు కూడా రాజీకి ఒప్పుకున్నారు. రెండు లక్షలు పిల్లలపేర బాంక్లో వేసారు. మరి కొన్ని రోజులకి ఇన్సూరెన్స్ డబ్బులు ఒక ఆరు లక్షలు రావచ్చనుకుంటా. ఇక అపార్ట్మెంట్ వాళ్ళు రెండు నెలలు ఉండడానికి అనుమతి ఇచ్చారు. మరి వాళ్ళకి మరో వాచ్మన్ కావాలిగా. వాళ్ళవంతు అందరూ కలిసి లక్షరూపాయలు ఇచ్చారు.
 
          మా పిల్లలు ఇద్దరూ చెరొక లక్షా పంపించారు. ఇద్దరు పిల్లలకీ బాంక్లో వేయించా. నెలరోజులకి మీనూ మళ్ళీ పనిలోకి వచ్చింది. పాపం ఒంటరిదైపోయింది. ఈలోకాన్ని మరొకలా చూడాలి. కొంత యుద్ధం చెయ్యాలి. వెంట తన ముసలి అత్త. ఆరోజు రీనా రోజీ కూడా వచ్చి తమకి తోచిన వంతు డబ్బులు ఇచ్చి ధైర్యం చెప్పారు. ఇక తను మరొక నెలకి అపార్ట్మెంట్ ఖాళీచేసి వేరే ఇంటికి మారింది. నాకెందుకో తను ఇంకా బావుంటే బావుండనిపించింది. ఇలా ఒక్కత్తే ఎన్నిరోజులు పనిచేస్తది అనిపించింది. మొన్న బాగోనప్పుడు సూపర్ బజార్లో దోసెల పిండి తెచ్చుకున్నప్పటి నుండీ, మీనూతో అలా పెట్టిస్తే బావుంటుందనిపించింది. అదే చెబితే, అవన్నీ సాగుతాయా అమ్మా అని నవ్వింది. ఒకవేళ కుదరకపోతే నేను ఉన్నా కదా. నీకు సాయపడడానికి అని చెప్పా. మా వాకింగ్ టైంలో మేము అంతా మాట్లాడుకున్నాం. అందరికీ ఇలా నచ్చింది. మగవాళ్ళకి చెబితే రోడ్డుపై షాప్ మాట్లాడారు. ఎనిమిదివేలు అద్దె. రెండు నెలలు అడ్వాన్స్. మా వారు అవి కట్టేసారు. తను ఏమో గ్రైండర్లు రెండు కొనుక్కుంది. ఒకరోజు ఉదయం మొదలయ్యింది తన వ్యాపారమలా. పొద్దున్నే నాలుగింటికి లేచి షాపుకి వెళ్ళడం, రాత్రి నానబెట్టుకున్న పప్పు బియ్యం రవ్వ కడగడం గ్రైండర్లో వేసుకోవడం, కిలో చొప్పున కవర్లో వేసి దారం చుట్టడం. ఐదున్నర నుండే అమ్మడానికి అందుబాటులో ఉండేలా చూడడం.. మేమంతా వెళ్ళి ఇడ్లీ పిండి దోసెలపిండి తెచ్చుకున్నాం.
 
          తెలిసినవాళ్ళందరికీ చెప్పాం. చిన్న సెంటర్లోనే షాప్ కాబట్టి వెళ్ళేవాళ్ళూ వచ్చేవాళ్ళతో మొదటి నెల కాస్త డల్గానే అనిపించినా ఇప్పుడంతా బాగానే ఉంది. ఉదయం పదకొండింటికి కట్టేసి మళ్ళీ సాయంత్రం మూడింటికి తెరుస్తుంది. ప్రతిరోజూ మా ఒక్క ఇంటికి మాత్రం వస్తుంది. నేను వేరేవాళ్ళని పెట్టుకుంటానంటే మీనూ వినదు. నన్ను అర్ధం చేసుకున్నది మీనూ ఒక్కత్తేనేమో అనిపిస్తది ఎప్పుడూ. నెలకి ముప్పైవేలు సంపాదిస్తోన్న మీనూని చూస్తే నాకెప్పటికీ ఆశ్చర్యమే. తనెప్పుడూ శాంతంగా నింపాదిగా నవ్వుతానే ఉంటది. 
 
          ఒక చిన్న ప్రయత్నం చాలా ప్రయాణంలో ముందుచూపు అవుతుంది. భరోసా దారి అవుతుంది.  తనకి చెప్పాలి, నువ్వు ఇంతటితో ఆగకూడదని.. మరెంతో సాధించాలని.

       

*****

Please follow and like us:

14 thoughts on “మీను (కథ)”

 1. సామన్య కధ,ముచ్చటైన ముగింపు

 2. చక్కని రచన, మన రోజువారీ జీవితంలో ఎక్కడో దగ్గర తారస పడ్డ పాత్రలు, మాటలు. సమకాలీన తెలుగు కవిత్వంలో తనదైన ముద్ర వేసిన అనురాధ గారు, కథా రచనలోనూ అందరి మన్ననలు పొందాలని మనసారా కోరుకుంటూ..

 3. చక్కని రచన.ఒక చిన్న ప్రయత్నం అవతలి
  జీవితాలకు పెద్ద భరోసా. చిన్నపాటి చేయూత
  వారి కుటుంబంలో వేయి వెలుగులు నింపాయి.

 4. కథలు ఎక్కడి నుంచో పుట్టవు, చూసే చూపు, అర్ధం చేసుకునే పరిపక్వత ,దృస్టి కోణం .ఇవే ఒక మంచి కథ ను తయారుచేస్తాయి. కథనం చక్కగా నడిచింది. తీసుకున్న వస్తువు జీవితం పట్ల ఆశ కలిగించేలా,అంటే ప్రతి జీవితం లో ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఒక వెలితి అనేది ఉంటుంది. దాని పూడ్చుకుంటూ ముందుకు సాగడమే కదా జేవితం యొక్క అర్ధం. మనుషుల పట్ల ఒక ఆశా భావం కలిగిఉండటం అనేది కూడా ముఖ్యం అని చెప్పడం బావుంది.
  ఆ కోవకి చెందినదే ఈ కథ
  మణి వడ్లమాని

 5. చాలా బావుంది అనురాధ గారు. ఇలా ఇన్స్పిరేషన్ ఇచ్చే ఎంతో మంది మీను వంటి వారు సమాజంలో ఉన్నారు.. నిజ జీవితాల్లోంచి వచ్చిన కథలు బావుంటాయి. Congratulations 🎉💐

 6. మీనూ జీవితంలో కలిగిన కష్టం పెద్దదే. పెద్ద మనసుతో అందరూ కలిసి ఆమె జీవితానికో ఆధారం చూపించడం ఆశావహ దృక్పధం సూచనతో కథ ముగిసింది.
  కానీ కథలో ‘అతను’ తత్త్వవేత్త గా ఉండి ఆమె మనసులో కొంత వెలితి మిగల్చడం , ఆ వయసు వారందరూ అలాంటి వెలితితో బాధ పడుతూండడం కథకు అవసరమా, ఆ వెలితే వారందరినీ ఒక మంచి పని వైపు నడిపించిందా అని సందేహ పడనవసరం లేదేమో.
  రచయిత్రికి అభినందనలు

  జానకిరామం

 7. చక్కని కథనం.ఒకరి ఖాళీలు మరొకరు భర్తీ చేయడానికి చేసే ప్రయత్నం జీవితానికి అర్ధం చేకూర్చుతుంది.అభినందనలు.

Leave a Reply to Vijay bhaskar Cancel reply

Your email address will not be published.