జీవనది ఆరు ఉపనదులు 

(ఆకెళ్ల మాణిక్యాంబగారి “ఒక తల్లి ఆత్మకథ” పుస్తక సమీక్ష )

   -అనురాధ నాదెళ్ల

          ఇప్పుడిప్పుడు ఆత్మకథలు మళ్లీ వస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలురాస్తున్న సమగ్రమైన ఆత్మకథలు.

          చిన్న వయసులోనే పెళ్లిళ్లై, కుటుంబమే ప్రపంచంగా జీవించిన స్త్రీలు రాసిన జీవిత కథలు. అప్పటి సామాజిక పరిస్థితులలో ఆడపిల్లలకు చదువుకునే అవకాశం పెద్దగాలేదు. యుక్తవయస్కురాలవుతూనే కుటుంబ జీవితంలోకి ప్రవేశించే ఆడపిల్లలకు ఎలా ఉండాలన్నది ప్రత్యేకంగా నేర్పిందేమీ లేదు. చిన్నతనంలో చూసిన తమ కుటుంబ వాతావరణమే వారికి ఎన్నో విషయాల్లో మార్గదర్శి.

          జీవన ప్రవాహంలోకి ఇలా అలవోకగా ప్రవేశించిన వారంతా ప్రపంచం దృష్టిలో సాధారణమైనవారే కావచ్చు. కానీ, కుటుంబం కోసం, కుటుంబం చుట్టూ నిజాయితీగా అల్లుకున్న వారి జీవితాలు కనిపించేంత సాధారణమైనవేం కావు. తమవైన అనుభవాల్లోంచి ఎదుర్కొన్న సవాళ్లు, ఆ ఒత్తిళ్లు, బాధ్యతలు, పిల్లలను తీర్చిదిద్దిన తీరు… ఓహ్ జీవితం చాలా సుదీర్ఘమైనది సుమా! తమ ఆత్మకథల్లో ఇవన్నీచెపుతూ, తాముగా నిర్దేశించుకున్నఆశయాల వెంట చేసిన ఆదర్శవంతమైన ప్రయాణం అక్షరీకరించే ప్రయత్నంలో ఆనాటి సాంఘిక, ఆర్థిక, కుటుంబ పరమైన విషయాల నెన్నింటినో భవిష్యత్తు తరాలకి చరిత్రగా అందిస్తున్నారు.

          వ్యక్తి జీవితం చుట్టూ ఉన్న సమాజంతో మమేకమై ఉంటుందన్నది వాస్తవం. సమాజపు అదుపును, జోక్యాన్ని వ్యక్తి తప్పించుకు పోలేడు. అది నిర్దేశించే సూత్రాలకు కట్టుబడకా తప్పదు. ఇన్నింటినీ ఓర్పుతో ఎదుర్కొంటూనే కుటుంబాన్ని నడుపుకుంటూ, పిల్లల్ని తాము కోరుకున్న విధంగా ప్రయోజకుల్ని చెయ్యటం ఒక గొప్ప యజ్ఞం.ఈ బాధ్యత గృహిణిగా, అమ్మగా స్త్రీయే తీసుకుంటోంది. ఇలాటి అమ్మలందరినీ అసామాన్యులనే అంటాను. కార్యనిర్వహణలో ఈ స్త్రీ మూర్తులకు తోడ్పడింది వారి కామన్ సెన్స్ మాత్రమే. అదే కదూ ప్రస్తుత తరానికి కొరవడుతున్నది, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నదీ ఆ అవగాహనా లోపమే.

          ఈ నెల మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం ఆకెళ్ల మాణిక్యాంబ గారి ఒక తల్లి ఆత్మకథ “జీవనది ఆరు ఉపనదులు.” పుస్తక శీర్షికలోని ఆరు ఉపనదులు, మాణిక్యాంబ గారి ఆరుగురు కుమార్తెలు. పుస్తక ప్రారంభంలోనే వారంతా అందమైన సఫలమైన జీవితాలనందించి నందుకు అమ్మకు తమ ప్రేమను తెలియజేసుకున్నారు. కుమారుడు రవి ప్రకాష్ తన కవితా సంపుటిలో అందించిన అందమైన కవితను ముందు పేజీల్లో చూస్తాము. పుస్తకానికిచ్చిన శీర్షిక ఇక్కడి నుంచే వచ్చింది కాబోలు. రవి ప్రకాష్ గారి స్నేహితుడు డా. రావు మాణిక్యాంబ గారు తనను కూడా స్వంత కొడుకుగా ఆదరించారని చెప్పారు. ఇంకా, అమ్మ మాణిక్యాంబ చేసిన త్యాగాల ఫలితమే పిల్లల ఉన్నత విద్యకు, జీవితాలకు దారి వేసిందని చెపుతూ అమ్మ అంటే తను ప్రవహించినంత మేరా లోకాన్ని పచ్చగిల్ల జేసే ‘జీవనది” అంటారాయన.

          పుస్తకం ఆఖరున గుడిపాటి గారు ‘దశాబ్దాల కిందటి తెలుగువారి జీవనరీతిని అర్థం చేసుకోడానికి ఉపకరించే ఈ జీవితకథ చదవడం ఆసక్తికర అనుభవం’ అంటూ, ఆత్మకథలు సామాజిక చరిత్రలో అంతర్భాగం అన్నది ఈ పుస్తకానికి అక్షరాలా వర్తిస్తుంది అంటారు.

          మడీ ఆచారాలను పాటించే ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో మన రచయిత్రి మాణిక్యాంబ గారు పుట్టారు.పెళ్లైన ఆడపిల్లకి పుట్టింట్లో ఎలాటి పనీ చెప్పేవారు కాదు. వాళ్లు అత్తవారింట పనులు చేసి అలసి వచ్చి ఉంటారని పూర్తి విశ్రాంతి ఇచ్చేవారు. కోడళ్లే ఎంత పనైనా చెయ్యవలసి ఉండేది. ఆ రోజుల్లో భర్త చనిపోయిన ఆడపిల్లలు పుట్టింట్లోనూ, అన్నదమ్ముల ఇంట్లోనూ ఉంటూ ఇంటి పని బాధ్యతనంతా చూసుకునేవారు. భర్త ఆస్తి అతని అన్నదమ్ముల పిల్లలకో, పినతండ్రి, పెదతండ్రి పిల్లలకో వెళ్ళేది. అందుకే మగవాడికి మగమహారాజన్న పేరొచ్చిందేమో అంటారు రచయిత్రి.

          తల్లి కాన్పు సమయంలో మగపిల్లవాడిని కని వాతం వచ్చి చనిపోవటంతో రచయిత్రి తండ్రి మరొక వివాహం చేసుకున్నారు. అప్పట్లో వాతం రాకుండా ఇంజక్షన్లు ఇవ్వడమనేది తెలియకపోవటంతో అలా జరిగింది. ఆ కాలానికి చాలా వ్యాధులకు మందులు లేవు. మలేరియా, టైఫాయిడ్ జ్వరాలకు మాత్రం మందులు దొరికేవి. ఏ జబ్బుకైనా పెన్సిలిన్ ఇచ్చేవారు.

          మాణిక్యాంబ గారి చిన్నతనం వారి పెదనాన్న గారింట గడిచింది. పెదనాన్నకి పిల్లలు, స్వీట్లు ఇష్టం కనుక చుట్టుపక్కల పిల్లలందరినీ చేరదీసేవారు. పిల్లలు పుట్టి దక్కక పోవటంతో ఆయన మాణిక్యాంబను తన ఇంటికి తెచ్చుకుని, అపురూపంగా చూసుకునేవారు. పెద్దమ్మకి మాత్రం తనవైపు బంధువుల నుంచి ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలని ఉండేది. మాణిక్యాంబ పట్ల ఆవిడ కొన్ని సార్లు నిరసన ప్రదర్శించేది. కానీ పెదనాన్న ప్రేమానురాగాల మధ్య పెరుగుతున్నచిన్నారి మాణిక్యాంబ ఏనాడు ఫిర్యాదు చెయ్యలేదు. అలాటి సంయమనం చిన్ననాడే ఆమెకు అలవడింది.

          మాణిక్యాంబ గారి చదువు లక్ష్మీబాయమ్మ గారి శారదా నికేతన్ లో పదవతరగతి వరకు నడిచింది. ఉద్యోగాలు చెయ్యనక్కరలేదు, అంతంత చదువులు అక్కరలేదు అంటూ పరీక్షలు రాయటానికి వీల్లేదనిపెద్దమ్మ పట్టు పట్టడంతో ఆగిపోవలసి వచ్చింది. మలేరియా జ్వరం రావటంతో మాణిక్యాంబను చూసేందుకు వచ్చిన ఆమె తండ్రి తనతో వస్తావా అని అడగటంతో ఆమె తండ్రితో వెళ్తుంది. కానీ అక్కడ సరైన పోషణ జరగక తిరిగి పెదనాన్న దగ్గరకే పంపిస్తారు. ఆ సమయంలోనే గొప్పవారి జీవిత చరిత్రలు, అనేకానేక పుస్తకాలు ఆమె చదివారు. అప్పటికి పెద్దమ్మ సాధింపులు తగ్గాయి.

          గుంటూరులో ఆ రోజుల్లో ప్రేమ వివాహాలు చేసుకున్న డాక్టర్, కలెక్టర్ గార్లు పెదనాన్నను పెళ్లిపెద్దగా ఉండమని కోరటంతో ఆయన ఆనందంగా జరిపించారు. ఇవన్నీ మాణిక్యాంబ గారికి అందమైన జ్ఞాపకాలుగా ఉండిపోయాయి.

          తల్లి లేదన్న లోటే కానీ తానున్న అన్నిచోట్లా చుట్టుపక్కల వారి ఆదరణ, ప్రేమ మాణిక్యాంబకు దక్కాయి. పెదనాన్న పర్మిషన్ తీసుకుని బంధువులు ఆమెను తీసుకెళ్లి ఆదరంగా చూసి పంపుతుండేవారు. నెహ్రూ వచ్చినప్పుడు పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన సభకు వెళ్లి ఆయనను చూసి రావటం ఆమెకు మంచి జ్ఞాపకం. ఆగష్టు 15, 1947 లో పెర్రేడ్ గ్రౌండ్స్ లో జరిగిన జెండా వందనం చూసేందుకు వెళ్లి,అక్కడ కలెక్టర్ హోదాను గమనించిన మాణిక్యాంబ గారికి ఐయ్యేఎస్ చదువు పట్ల ఒక ఆరాధన మొదలైంది. భవిష్యత్తులో తన కొడుకు కలెక్టర్ అయినప్పుడు ఆమె కల నెరవేరింది.

          పెదనాన్న ఇంట్లో వార్తా పత్రికలు, సాహిత్యం చదువుతున్న ఆమెకు ప్రభుత్వ ఉద్యాగాల్లో అవినీతి ఉంటుందన్న స్పృహ కలిగింది. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు చిన్న చదువులు, ప్రభుత్వోద్యోగాలు ఉన్న వరులను తీసుకొచ్చినప్పుడు ఆమె తిరస్కరించారు. ఆమె ఇష్టపడితేనే పెళ్లి చెయ్యాలని పెదనాన్న సమర్థించారు. ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో పెళ్లికి సమ్మతించినప్పుడు కొంత సర్దుబాటు తప్పదన్న విషయంతో ఆమె రాజీ పడ్డారు.
భర్త కూడా తల్లి లేనివాడే. తండ్రి మరొక పెళ్ళి చేసుకుని పిల్లల బాధ్యతను వదిలి వెళ్లిపోయినప్పుడు చిన్నవయసులోనే తమ్ముడు, చెల్లెళ్ల బాధ్యతను ఆయన తీసుకోవలసి వచ్చింది. తన వాళ్లంతా తల్లి లేని పిల్లలు, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని భర్త చెప్పినప్పుడు తన వయసువారైన ఆడపడుచుల, మరిది బాధ్యతను ఆమె ఆనందంగా తీసుకున్నారు. వారి విమర్శలకు కూడా ఎప్పుడూ ఆమె సమాధానం చెప్పలేదు. భర్త చెప్పింది వేదం అన్నట్టే మసులుకున్నారు.

          ఒకరి తర్వాత ఒకరుగా ఆడపిల్లలు పుడుతూ వచ్చినప్పుడు భర్త తన అసంతృప్తిని బహిరంగ పరిచినా, చెల్లెళ్ల, తమ్ముడి బాధ్యతలతో పిల్లలకు కావలసిన కనీస అవసరాలను ఆయన తీర్చలేనన్నా ఆమె మౌనంగా తనకు చేతనైన విధంగా పిల్లలకు ఏలోటూ రాకుండా చూసుకున్నారు. వరుసగా ఆడపిల్లలు పుడుతూ ఉండటంతో మాణిక్యాంబ గారి ఆడపడుచులు ‘మాకు సిగ్గుగా ఉంది, ఆ ఆడపిల్లల తల్లేనా అంటూ వదిన గురించి అడుగుతున్నారు’ అంటూ తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు. అంతే కాదు తమ పురుళ్లు మాణిక్యాంబ గారు పోస్తే ఆడపిల్లలు పుడుతున్నారన్న అసహనమూ చూపించారు. మాణిక్యాంబ గారి మౌనమే సమాధానం. తమ కుటుంబంలో ఎవరు ఎవరితో గొడవ పడినా అవి తాత్కాలికమే అని తెల్లవారి అందరూ కలిసిమెలిసి మామూలుగా మసులుకునేవారమని రచయిత్రి ఒకచోట చెపుతారు. ఎంత మంచి ఆదర్శం! ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు భావాలు, నమ్మకాలు వేర్వేరు కావచ్చు. ఏదైనా సందర్భంలో వాటి గురించి నిందా పూర్వకంగానో, నిష్టూరంగానో అనుకున్నా తామంతా ఒక్క ఇంటి మనుషులమన్న సంయమనం, భావన ఎంత బలం ఇస్తుందో కదా.

          నాలుగవ ఆడపిల్ల పుట్టినప్పుడు మాణిక్యాంబ గారి భర్త నిరాశ పడి ఆఫీసుకు వెళ్లిపోగా, ఆయన పై అధికారి మాత్రం శుభవార్తకు స్పందించి ఆఫీసులో అందరికీ పార్టీ ఇచ్చారని చదివినప్పుడు బాధ కలగక మానదు. అప్పటి సమాజంలో మగపిల్లవాడు వంశోద్ధారకుడన్న నమ్మకం, మగపిల్లలు కలగాలన్న ఆశ ఎంత బలంగా ఉండేవో అర్థమవుతుంది. ఆడపిల్లలూ తాము కన్న పిల్లలే అన్న మమకారాన్ని అధిగమించేంతగా ఈ ఆలోచనను పెంచి, సమర్థించే సమాజం రీతి ఆశ్చర్యం, ఆవేదన కలిగించక మానదు.
చిన్ననాడు ఆదరించిన పెదనాన్న తన ఆస్తిని మాణిక్యాంబగారి కూతుళ్ల పెళ్లిళ్ల కోసం రిజిస్టర్ చేసి పెట్టారు. మాణిక్యాంబ గారి కుమార్తెలను తమ స్వంత బిడ్డల్లాగే చూసుకున్నారు. చివరి వరకూ ఆయన మాణిక్యాంబ పట్ల, ఆమె కుటుంబం పట్ల ఎంతో ఆదరణ చూపించారు. పెద్ద చదువులు చదువుకుని, పెద్దపెద్ద హోదాల్లో స్థిరపడిన ఆమె కుమార్తెలు మాణిక్యాంబగారి పెదనాన్న సూర్యప్రకాశరావు గారి స్వంత గ్రామంలో అనేక దేవాలయాలు కట్టించి, అన్ని వర్గాల వారికి ప్రవేశం ఏర్పాటు చేసారు. ఈవిషయం చెప్తూ తాను పిల్లల కోసం పడిన తపన సార్థకమైందంటారు రచయిత్రి. అప్పటి వరకు ఆ గ్రామంలోని దేవాలయాల ప్రవేశం కేవలం అక్కడ అధిక సంఖ్యాకులైన బ్రాహ్మణ కులస్థులకే పరిమితమై ఉండేది.

          ఇంట్లో ఉన్నంత సేపూ భర్తపనులు చూస్తూ, ఆయన కబుర్లు వింటూ ఉండమనే వారని, తనకు మంచి భవిష్యత్తునిచ్చి సుఖపెడతానని చెప్పేవారంటారు రచయిత్రి. భర్తతో సినిమాకు వెళ్లివచ్చాక ఫలానా నటుడు బావున్నాడనో, బాగా నటించాడనో చెప్పినప్పుడు, పిల్లల అవసరాలైన తువ్వాళ్లో, బట్టలోకొనలేదని అడిగినప్పుడు ఆయన చేతిలో చెంప దెబ్బలు తినటాన్ని చెప్తూ అప్పుడూ తాను మౌనంగా ఉండిపోయేదాన్నని చెప్పేరు రచయిత్రి. ప్రేమానురాగాలతో పాటు అవమానాల్ని కూడా దాచుకోకుండా పాఠకులకు చెప్పటం ఆమె నిజాయితీకి నిదర్శనం. ఆత్మకథకు కావలసిన ముఖ్య లక్షణం ఇదేకదా. తనకంటూ పెద్ద చదువు, సంపాదన లేకపోవటంతో ఇలా ఉన్నానని, తన కూమార్తెలను పెద్ద చదువులు చదివించాలని స్థిరంగా నిర్ణయించుకున్నారామె.
భర్త ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో ఉండవలసి రావటం, కొన్ని సార్లు పిల్లల చదువుల దృష్ట్యా తాను, పిల్లలు ఒకచోట ఉండిపోవలసి రావటం జరిగినా చుట్టుపక్కల వారితో, మాట మంచితనంతో ఇంటిని, పిల్లల్ని గౌరవంగా సమర్థించుకురావటం ఆమె సమర్థతను చెప్తుంది. పిల్లలను ఇంగ్లీషు మీడియం చదువులు, ప్రైవేటు స్కూళ్లలో చదివించే స్థోమత లేదని భర్త అన్నప్పుడు పిల్లల్నిప్రభుత్వ పాఠశాలల్లో చేర్చి, వారి చదువులు గట్టిగా ఉండాలని ఇంగ్లీషు, లెక్కలు వంటి వాటికి ఇంటి దగ్గరే ట్యూషన్ ఏర్పాటు చేసిన ఆమె ముందుచూపు ఆమెది. ఆడపిల్లలు ఎదుగుతున్న కొద్దీ అద్దె ఇళ్లల్లో వసతులు కొరతగా ఉన్నాయని స్వంత ఇంటిని కావాలని కోరుకున్నారు. భర్త పెట్టుబడికి సాయంగా పెదనాన్న కూడా ఒక చెయ్యి వేసి విజయవాడలో స్వంత ఇంటిని అమర్చారు.
ఆడపిల్లలను ఒక్కక్కరినీ చదువుల కోసం ఏలూరు సెయింట్ థెరీసా హాస్టల్ లో చేర్పించారు. మాణిక్యాంబ గారు పిల్లల చదువులనే యజ్ఞం లో తనకంటూ ఇష్టాలు, కోరికలు లేకుండా నియంత్రించుకుంటూ వచ్చారు. భర్త వాళ్ల చదువులు భరించలేనని చెప్పినప్పుడల్లా తక్కువ ఫీజులతో చదువు, వసతి, తిండి అమరుస్తున్నారు కనుక సెయింట్ థెరిసాలో చేర్చానని చెప్పేవారు. పిల్లల చదువులు పట్టించుకుంటూ వాళ్లు వెనకబడిన సబ్జెక్ట్ ల గురించి ప్రిన్సిపాల్ తో మాట్లాడి స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేయించేవారు. పిల్లలను చూసేందుకు వెళ్లినప్పుడు అందరికంటే పాతచీర కట్టుకునే ఆవిడే మా అమ్మ అని తన కుమార్తెలు స్నేహితులతో చెప్పేవారని రచయిత్రి చెప్పారు. అమ్మ అంటే త్యాగమన్నది అక్షర సత్యం. ఆ త్యాగానికి ఫలితం ఇప్పటి ఆ అమ్మ ఆనందం, పిల్లల బంగారు భవిష్యత్తు.

          భర్తకు జ్యోతిష్యం పట్ల గురి ఉండేది. శకునాలు, జాతకాలు బాగా నమ్మేవారు. జ్యోతిష్కుల దగ్గరకి వెళ్లేందుకు సమయం దొరకక పోవటంతో ఆయన ఇబ్బంది పడుతున్నారని గ్రహించి మాణిక్యాంబ గారు రెండు సంవత్సరాల కాలంలో అనేక జ్యోతిష్య గ్రంథాలను, రిఫరెన్స్ పుస్తకాలను తెప్పించుకుని సంపూర్ణంగా నేర్చుకున్నారు. భర్తకు ఆర్థిక భారం కాకుండాచుట్టుపక్కల వారి దగ్గర కుట్టు నేర్చుకుని తమ పిల్లలకవసరమైన దుస్తులను తనే తయారు చేసేవారు మాణిక్యాంబ గారు. ఇంటి పరిస్థితులను, భర్త బాధ్యతలను అర్థం చేసుకుని ఎక్కడా లోటు కనపడకుండా తనలోని సృజనాత్మకతని అన్ని విషయాల్లోనూ పెంచుకుంటూ సంసారాన్ని నడిపారామె. ఏదో లేదంటూ అసంతృప్తితో ఇంట్లో తగవులుపెట్టుకుని కుటుంబాలని వీధుల్లోకి చేర్చేవారికి వీరి జీవన విధానం ఆదర్శప్రాయం.

          పెద్దమ్మాయి పెళ్లికి పెడుతున్న ఖర్చు చూసి ఆడపడుచులు గొడవ చేసినప్పుడు తన కుమార్తెల పెళ్లిళ్లకు పెదనాన్నగారు ఆస్తిని ఏర్పాటు చేసేరని చెప్పినా నమ్మలేదు వారు. తమ అన్నయ్య చేత అంత ఖర్చు పెట్టిస్తున్నారంటూ గొడవ చేసి, అంతలోనే వారంతా పెళ్లిలో అన్నింటా తామై సరదాగా పనులను అందుకుంటూ జరిపించారు.
ఆడపిల్లలందరినీ పెద్ద పెద్ద చదువులు చదివించి, పెళ్లిళ్లు చేసారు మాణిక్యాంబ దంపతులు. పిల్లల చదువుల కోసం ఒక చోట ఉండవలసి వచ్చినప్పుడు, భర్తతో పాటు ఆయన ఉద్యోగపు ఊరికి వెళ్లే అవకాశం లేనప్పుడు మాణిక్యాంబ గారు స్థిరంగా, ధైర్యంగా నిలబడి పిల్లలకు సరైన మార్గదర్శకత్వం చేసారు. తాను కలలు గన్నట్టుగానే పిల్లలను పెద్ద చదువులవైపు మళ్లించారు. పిల్లలు కూడా తల్లి ఆదర్శం, శ్రమ అర్థం చేసుకున్నారు. పెళ్లిళ్లైన తరువాత కూడా వాళ్లు చదువు కొనసాగించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

          విజయవాడలో కొనుక్కున్న ఇల్లు బదిలీల కారణంగా అద్దెకి ఇచ్చారు. కొన్నాళ్లకు విజయవాడ వచ్చి పిల్లలతో అక్కడ ఉండవలసి వచ్చి ఇల్లు ఖాళీ చెయ్యమన్నప్పుడు అద్దెకున్నవాళ్లు ఇబ్బంది పెట్టారు. భర్త వేరే ఉద్యోగపు ఊళ్లో ఉన్నారు. మాణిక్యాంబ గారు కుటుంబ స్నేహితుల సాయంతో, తన మాట నేర్పరితనంతో ఆ సమస్యను పరిష్కరించు కోగలిగారు. సమస్య ఎదురైనప్పుడు భయపడక మిత్రుల సహాయాన్నిపొందగలిగే మంచితనం, స్నేహ వాతావరణం ఆమె జీవితం పొడవునా తన చుట్టూ ఏర్పరచు కున్నారు. మిత్రుల పిల్లలను, తమ పిల్లలతో చదువుకుంటూ ఇంటికొచ్చి వెళ్లే పిల్లలను ఆమె ప్రేమతో ఆదరించారు.పెదనాన్న పోయినప్పుడు పెద్దమ్మ కోరుకున్న విధంగా ఆమెను తనతో తీసుకు వచ్చి ఆమె రుణం తీర్చుకున్నారు మాణిక్యాంబ.

          మాణిక్యాంబ గారు కొడుకు గురించి చెపుతూ తనను ఆడపిల్లల తల్లి అంటూ హేళన చేసిన వారికి ఆ పిల్లవాడే తన సమాధానం అంటారు. బిట్స్ లో చదువు ముగించుకుని సివిల్స్ లో విజయం సాధించి తల్లి కలను నిజం చేసిన కొడుకును తలుచుకుని ఆమె గర్వ పడతారు. భర్త మరణం తరువాత పిల్లలతో కలిసి కాశి, గయ, కాశ్మీర్, బదరీనాథ్, హరిద్వార్ యాత్రలను చేసారు. బదరీనాథ్ లో మాణిక్యాంబ గారికి శ్రీరాముడు కోదండం పట్టుకుని నిలబడినట్టు కనిపించింది. అది వాస్తవమేనా అని తనతో ఉన్న కూతురిని అడిగారు. ఆమె తనకేమీ కనిపించలేదు అన్నప్పుడు ఇలాటి దర్శనం ఇచ్చేందుకే తనను ఈ యాత్ర చేయించాడు రాముడని ఆమె నమ్మారు.

          వయసు మీద పడ్డాక పిల్లల దగ్గరకు వెళ్లి వస్తూ ఉండటం కంటే వాళ్లు వచ్చి వెళ్లటమే బావుంటుందని అంటారామె. పిల్లల మీద బాధ్యత పెట్టకుండా స్వంతంగా జీవించటంలోనే ఆత్మగౌరవం, తృప్తి ఉంటాయంటారు. తనకు సహాయంగా ఒక పిల్లవాడిని చేరదీసి చదివించి ఉద్యోగస్థుణ్ణి చేసారు. అతను మాణిక్యాంబ గారింట ఆమెకు సహాయంగా ఉన్నాడు. మాణిక్యాంబ గారు ఆధ్యాత్మిక చింతనలో తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు.

          పుస్తకంలో ఆఖరి అధ్యాయం తన భర్త సూర్య జనార్థన రావు గారి గురించి రాసారు. తెలుగు కుటుంబాల్లో భార్యలకు విలువనిచ్చి చూసుకునే సంప్రదాయం భర్తల్లో లేదంటారు. పైగా కుటుంబ పరంగా, సామాజిక పరంగా ఉన్న బంధాల వల్ల ఒత్తిడి మగవారిపై ఉంటుంది.

          ఎవరూ తమ కుటుంబంపట్ల వేలు పెట్టి చూపించే పరిస్థితి రాకుండా చూసు కోవటం, కుటుంబ విలువలను కాపాడి, ఇంట పుట్టిన ఆడపిల్లలను మంచి జీవితాల్లో స్థిరపరచటం వారికున్న పెద్ద బాధ్యత. సూర్య జనార్థన రావు గారు పిల్లల చదువుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. చెల్లెళ్లను, తమ్ముడిని, కుమార్తెలను, కుమారుడిని మంచి చదువులకు ప్రోత్సహించారు. చిన్నతనంలోనే బాధ్యతలు తన భుజాలపై పడినా చలించక ధైర్యంగా జీవితాన్ని గడిపిన వ్యక్తి ఆయన. భార్యను, కుటుంబ సభ్యులను ఎంతగానో ప్రేమించేవారు. మాణిక్యాంబ గారిని తల్లిలాగా ప్రేమించారు. తన భార్య తల్లి లేని పిల్ల అని తెలుసు, తనకూ తల్లి లేదు. ఆ కొరత తెలుసు కనుకే ఆమెను ప్రేమగా చూసుకున్నారు. తన చెల్లెళ్లకు, పిల్లల జీవితాలకు మంచి బాట వేసేందుకు ఆమె తోడ్పాటును వంద శాతం పొందారు. చెల్లెళ్లు, కుమార్తెల మధ్య జీవితాన్ని గడిపిన ఆయన ఆడవారి పట్ల ఎంతో ఆదరంతో ఉండేవారు. ఆయన కఠినంగా వ్యవహరించిన పరిస్థితులు కూడా కుటుంబానికి అవసరమైన సందర్భాలే అంటారు మాణిక్యాంబ గారు.

          ఆఖరి రోజుల్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన భార్యను గురించి ఎప్పుడూ ఆలోచించేవారు. ఆమెను సుఖంగా చూసుకోవాలని తపన పడేవారు. అనుక్షణం ఆమెను తన ఎదుటే ఉండమని కోరేవారు. తన పిల్లల్నిఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన భార్యకు పదేపదే కృతజ్ఞతలు చెప్పుకునేవారు. మాణిక్యాంబ గారు భర్త ప్రేమలో తనను తాను ఇష్టపూర్వకంగా కుటుంబానికి అంకితం చేసుకున్నారు. ఆమెకు ఎదురైన ఏ సమస్యా ఆమెను భయపెట్టనూలేదు, నిరాశపరచనూ లేదు.

          తను ఉన్న పరిస్థితులను అర్థంచేసుకుని ఒక ధీర లాగా దృఢ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నారు. అది కుటుంబాన్ని విజయపథంలో నడిపించింది.
భర్త పెన్షన్, ఇంటి అద్దె తనకు ఇప్పుడు ఆర్థికపరంగా స్వతంత్రాన్నిస్తున్నాయంటారు. ప్రతి స్త్రీకి తనదైన ఆదాయం ఉండి తీరాలంటారామె. భర్తతో కలిసి ఉన్న స్త్రీకి, ఆ కుటుంబానికి సమాజంలో విలువ ఉంటుందని, అది ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేస్తుందని అంటారు. వ్యక్తుల మధ్య అవగాహన ఉంటే కలతలను, కష్టాలను సులభంగా జయించ వచ్చన్నది ఆమె ఆచరించి చూపిన జీవితం చెపుతుంది.

          తన చిన్నప్పుడు సాధారణ పెళ్లి సంబంధాలను వద్దంటూ తిరస్కరించిన తన అవివేకాన్ని చెపుతూ అప్పటికి తనకు సరైన అవగాహన లేకపోవటం వల్లనే గొప్ప సంబంధాలు కావాలని కోరుకున్నానంటారు. కానీ పెళ్లైన తర్వాత మాత్రం దేనికీ అసంతృప్తి లేకుండా భర్తతో సమన్వయాన్ని సాధించానంటారు. ఇంటెడు పనీ చేసుకుంటూ, భర్తతో దెబ్బలు తింటూ కూడా సంసారం గురించి గొప్పగా చెప్పుకునే స్త్రీలే అప్పుడు ఉండేవారు అంటారు. ఆడపిల్ల చదువు కొంతవరకు ఈ పరిస్థితిని మార్చినా, సంపూర్ణమైన మార్పు రావాలంటే వ్యక్తుల ఆలోచనలు, ఆచరణ విశాలమవ్వాలి. తన భర్త పోయాక ఆడపడుచులు తనను తల్లిలా అక్కున చేర్చుకుని, వారి అన్నయ్యకిచ్చిన గౌరవం తనకూ ఇచ్చారంటారు ఆమె. ఒకప్పుడు వారి నిరసనలు భరించవలసి వచ్చినా ఆమె ఓర్పు, మంచితనం కుటుంబంలో ఒక సానుకూలమైన ధోరణిని కలిగించింది.

          స్త్రీ అయినా పురుషుడైనా తమ చుట్టూ ఉన్న బంధాలకు, బాధ్యతలకు విలువ నిచ్చినప్పుడే ఆరోగ్యకరమైన అనుబంధాలు పెరుగుతాయి. జీవితానికి సాఫల్యాన్నిచ్చేవీ అవే. అవి సమాజాన్ని ఉన్నతమైనదారుల వెంట నడిపిస్తాయి. ఈ వాస్తవాన్ని నమ్మి, తను నడిచి వచ్చిన మార్గాన్ని మనముందు ఓపిగ్గా, ఇష్టంగా, స్పష్టంగా ఆవిష్కరించిన మాణిక్యాంబ గారికి అభినందనలు. వారి జీవితం చెప్పిన విలువలను అర్థం చేసుకుని, అనుసరిస్తే సమాజం ఆదర్శప్రాయంగా నిలబడుతుంది.

          ఈ పుస్తకంలో కొన్నివిషయాలు ఒకటికి రెండుసార్లు చెప్పడం కనిపిస్తుంది. ఎడిటింగ్ తో ఈలోపం సరిచేసుకొని ఉండి ఉంటే బావుండేది. దాని వల్ల కథనానికి మరింత బిగువు వచ్చిఉండేది. చిన్ననాటి తీపి, చేదు జ్ఞాపకాల నుంచి ఇప్పటి వరకు గడిచిన తనజీవితానికిఎనభై ఏడేళ్ల వయసులో ఓపిగ్గా పుస్తక రూపమిచ్చిన రచయిత్రి మాణిక్యాంబ గారికి అభినందనలు.

          ఈ పుస్తకం సెప్టెంబరు 2021 లో ప్రచురించబడింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.