తవ్వి తలకెత్తుకోవలసిన చరిత్ర

పుస్తకాలమ్’ – 8

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

తవ్వి తలకెత్తుకోవలసిన చరిత్ర

          తెలుగువారి సామాజిక చరిత్రలోని ఒక అత్యంత ప్రధానమైన విస్మృత ఘట్టం గురించి ప్రతిభావంతంగా వివరిస్తున్న పరిశోధనా వ్యాసం ఇది.

          తెలుగుసీమలో, బ్రిటిష్ భారతదేశం లోని కోస్తా, రాయలసీమలైనా, లేదా నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యమైనా, ఆధునిక చైతన్య భావ ప్రసారం ఎప్పటినుంచి జరుగుతున్నది; ఆ భావ ప్రసారానికి చోదకశక్తులు ఏమిటి; ఆ భావప్రసారకర్తలు ఎవరు; ఆ భావ ప్రచారపు ప్రభావానికి లోనైన వర్గాలు ఏవి; ఏయే ప్రాంతాలలో, ఏయే కారణాల వల్ల ఆ చైతన్యం వికసించింది వంటి అనేక ప్రశ్నలు ఇప్పటికీ ఇంకా సమగ్రమైన జవాబులు దొరకకుండానే మిగిలి ఉన్నాయి. ఇంకా ఎంతో పరిశోధన చేయవలసి ఉంది. ఇటీవలి పరిశోధకులు కొత్తగా తవ్వి తీస్తున్న కొత్త ఆకరాలు, ఆ ఆకరాల సహాయంతో వారు చేస్తున్న నిర్ధారణలు, వాదనలు గత రెండు శతాబ్దాల చరిత్ర రచన మీద కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఇంతకాలమూ నమ్మిన నిశ్చల నిశ్చితాలను అవి చెదర గొడుతున్నాయి, మారుస్తున్నాయి, తారుమారు చేస్తున్నాయి.

          అలా బద్దలవుతున్న నిశ్చల నిశ్చితాలలో ఒకటి, ఇంతకాలంగా తెలుగువారి చరిత్రగా, తెలుగువారి ఆధునికతా చరిత్రగా మనందరం చదువుకుంటూ వచ్చినది సమగ్రమైన తెలుగుజాతి చరిత్ర కాదనేది. అటు చివర శ్రీకాకుళం నుంచి ఇటు చివర ఆదిలాబాద్ నుంచి అటు చివర చిత్తూరు దాకా ఉన్న తెలుగువారందరూ ఉమ్మడిగా నిర్మించుకుంటూ వచ్చిన చరిత్ర, ఆ చరిత్ర నిర్మాణంలో భాగస్వాములందరికీ సముచిత స్థానం దొరికిన చరిత్ర రచనగా పర్యవసించలేదు. కొన్ని ప్రాంతాలకూ, కొన్ని కులాలకూ, కొన్ని భాషలకూ ప్రాధాన్యత దొరికిన చరిత్రగా పుస్తకాలకూ, పాఠ్యపుస్తకాలకూ ఎక్కింది.

          నిజానికి తెలుగుసీమ చరిత్ర అన్నప్పుడు ఇది కేవలం తెలుగు భాషీయుల చరిత్ర కావడానికి కూడ వీలులేదు. ఉర్దూ వంటి ప్రధాన భాషలు, సవర, కోయ, గోండి, బంజారా, చెంచు వంటి ఆదివాసి భాషలు మాట్లాడే ప్రజల చరిత్ర కూడ తెలుగుసీమ చరిత్రలో భాగం కావాలి. కాని అసలు తెలుగు భాషీయులలోనే ఉత్తరాంధ్ర, పల్నాడు, దక్షిణాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంత ప్రజల చరిత్రే ప్రామాణిక చరిత్ర రచనకు ఎక్కనే లేదు. ఎక్కడో ఒకచోట ఎక్కినా అది ప్రస్తావనవశాత్తుగానో, అధోజ్ఞాపికగానో మాత్రమే తప్ప, ఇతర ప్రాంతాల చరిత్రతో సరిసమానమైన ప్రతిపత్తితో కాదు.

          మొత్తంగా కృష్ణా, గోదావరి నదులు సముద్రంతో కలిసే చోట, ఆర్థర్ కాటన్ ఆనకట్టల వల్ల, వ్యవసాయ మిగులు వల్ల, రూపొందిన రాజకీయార్థిక ఆధిపత్యమే మిగిలిన అన్ని సామాజిక చైతన్య రూపాలలో లాగనే చరిత్ర రచనకు కూడ ప్రవహించి, ఆ మేరకు చరిత్ర నిర్మాణంలో ఇతర ప్రాంతాల పాత్ర విస్మరణకు గురయింది.

          ఇప్పుడు యువ పరిశోధకుల, కొత్త చూపు పరిశోధకుల అన్వేషణ వల్ల, కొత్త ఆకరాల వెలికితీత వల్ల ఆ విస్మరణల మీద వెలుగు ప్రసరిస్తున్నది. ప్రధాన స్రవంతి చరిత్ర రచనకు అదనంగా చేర్చవలసిన ఇతర స్రవంతులు ఎన్నో ఉన్నాయనే ఎరుక కలుగుతున్నది.

          ఈ పుస్తకం ఆ కొత్త చూపులో, ఆ కొత్త ఎరుకలో భాగం. ఇది తెలుగుసీమలో మహిళా చైతన్య విస్తరణలో అగ్రభాగాన ఉండి కూడ విస్మరణకు గురైన, ప్రధాన స్రవంతి చరిత్రకు ఎక్కని రాయలసీమ మహిళా చైతన్య చరిత్రనూ, అందులోనూ ప్రధానంగా మహిళా సంఘాల వ్యాప్తి చరిత్రనూ, కొందరు వ్యక్తుల కృషినీ పరిశీలకుల దృష్టికి తెస్తున్నది.

          చరిత్ర నిర్మాణమూ చరిత్ర రచనా సరిసమానంగా ఒకటే కావాలి గాని అనేక సంక్లిష్ట కారణాల వల్ల చరిత్ర నిర్మాణానికీ చరిత్ర రచనకూ మధ్య ఒక్కోసారి దాటరాని దూరాలు తలెత్తుతాయి. నిర్మాణమవుతున్న, నిర్మాణమైన చరిత్ర యథాతథంగా రచనలోకి ఎక్కదు. అనేక విస్మరణలు, కొన్ని అంశాల క్లుప్తీకరణ, కొన్ని అంశాల సాగతీత, చరిత్ర రచయిత ఇష్టారాజ్యంగా “చారిత్రక వాస్తవాల” ఎంపిక వంటి ఎన్నో అంశాలు వచ్చి చేరుతాయి. అసలు చరిత్ర రచన ఒక విచిత్రమైన ప్రక్రియ. చరిత్ర నిర్మాణం ఎంత సమష్టిగా సాగుతుందో, చరిత్ర రచన అంత వ్యక్తిగతంగా సాగుతుంది.

          చరిత్ర నిర్మాణం ఎంత వస్తుగత, రాజకీయార్థిక, సామాజిక కారణాలతో సాగుతుందో, చరిత్ర రచన అంతగా స్వీయమానసిక, వ్యక్తిగత కారణాలతో, అభిమాన దురభిమానాలతో సాగుతుంది. చరిత్ర నిర్మాణానికి ప్రత్యక్ష, పరోక్ష, దృశ్య, అదృశ్య కారణాలెన్నో ఉండగా, చరిత్ర రచనకు మాత్రం సాధారణంగా ప్రత్యక్ష, సంకల్పపూరిత కారణాలే ఉంటాయి. ఆ ప్రత్యక్ష, సంకల్పపూరిత కారణాల వెనుక నేపథ్యంలో మరెన్నో మూలాలు ఉండవచ్చును గాని సాధారణంగా చరిత్ర చదువుతున్నప్పుడు అవి కనబడవు. చరిత్ర నిర్మాణమేమో భౌతిక సామాజిక జీవన పర్యవసానమూ, అనివార్యమూ కాగా, చరిత్ర రచనలో అంత అనివార్యత ఉండదు. సామాజిక జీవనంలో ఆధిపత్య శక్తులు తమకు కావలసినట్టుగా చరిత్ర రచన చేయించుకోవడం, సామాజిక సంఘర్షణలో విజేతలే చరిత్ర రచనను నిర్దేశించడం, ప్రత్యేకించి ఎవరూ ఏదీ నిర్దేశించకపోయినా యుగస్వభావంగా, సాధారణ లోకజ్ఞానంగా కనబడే పాలకవర్గ భావజాలమే చరిత్ర రచన మీద ప్రభావం వేయడం వంటి పరిణామాలెన్నో ఉంటాయి.

          అటువంటి ఆధిపత్య, అనూచాన భావజాలం వల్ల తెలుగుసీమలో ఆధునికత అన్నా, మహిళా చైతన్యమన్నా కృష్ణా గోదావరీ మండలాల వైపు మాత్రమే చూసే ధోరణి కొనసాగుతున్నది. ప్రధాన స్రవంతి చరిత్ర రచన ఆ భావజాలంతోనే సాగుతున్నది.

          మహిళా చైతన్య వ్యాప్తిలో రాయలసీమ కోస్తాకు తీసిపోదనీ, నిజం చెప్పాలంటే రాయలసీమలో మహిళా సంఘాల నిర్మాణం కోస్తాతో సమానంగానో, ఇంకా ముందుగానో సాగిందనీ ఇప్పుడిక్కడ షేఖ్ మహబూబ్ బాషా నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో రుజువు చేస్తున్నారు. నిజానికి ఆర్థర్ కాటన్ ఆనకట్టల వల్ల కృష్ణా గోదావరీ మండలాల్లో జరిగిన సామాజిక సంచలనానికి సమానమైనది కొన్ని దశాబ్దాలకు ముందే రాయలసీమలో థామస్ మన్రో చేపట్టిన కార్యక్రమాల వల్ల జరిగింది. ఈ రెండు ప్రాంతాల, రెండు సందర్భాల తులనాత్మక అధ్యయనం ద్వారా అన్వేషించి వెలికి తీయవలసిన చరిత్ర ఎంతో ఉంది.

          ఈ పరిశోధనా వ్యాసానికి అంత పరిధి లేదు గాని, 1939లో కడపలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర మహిళా మహాసభ ఆహ్వాన సంఘాధ్యక్షురాలు కడప రామసుబ్బమ్మ ఉపన్యాసం ఆధారంగా వలస రాయలసీమలో మహిళా చైతన్యం గురించి కొన్ని పరిశీలనలు, నిర్ధారణలు పంచుకుని, భవిష్యత్ పరిశోధనకు మార్గం సుగమం చేయడం ఈ వ్యాస లక్ష్యం.

          అయితే ఆ పరిమిత పరిధిని దాటి ఈ వ్యాసం రామసుబ్బమ్మ ఉపన్యాసానికి ముందు నాలుగైదు దశాబ్దాల పాటు జరిగిన కృషిని కూడ ప్రస్తావించింది. ఏ ఘటనైనా దానికది స్వయంభువుగా పుట్టుకురాదు, అది ఒకానొక దీర్ఘకాలిక ప్రక్రియలో భాగంగా, పరిణామక్రమంలో సుదీర్ఘ గతం నుంచి ఇవాళ్టి వర్తమానానికి వచ్చి ఉంటుంది. తత్వశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ఏ పరిణామమైనా సుదీర్ఘకాలం పాటు ఎన్నో పరిమాణాత్మక మార్పులకు గురై, ఒక గెంతుగా హఠాత్తుగా గుణాత్మక మార్పుకు లోనవుతుంది. 1939 డిసెంబర్ లో రామసుబ్బమ్మ ఉపన్యాసం అనే గుణాత్మక మార్పుకు వెనుక కనీసం ఐదు దశాబ్దాల క్రమ పరిణామం ఉంది.

          అందుకే మహబూబ్ బాషా 1880లలో అనంతపురం జిల్లా గుత్తిలో ఏర్పడిన మహిళా సంఘం గురించి ప్రస్తావించారు. ఇంకా నిశిత పరిశోధన సాగిస్తే ఈ తేదీ ఇంకా వెనక్కి కూడ వెళ్లవచ్చు. ‘గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణే చరిత్ర’ అని ఇ ఎచ్ కార్ అన్నమాటకు అర్థం అదే. ఆ గుత్తి మహిళా సంఘం నుంచి, 1909లో మడకశిర, అనంతపురం, 1910లో కర్నూలులో మహిళా సంఘాలు ఏర్పడడం, 1918లో కడపలో ఆంధ్ర మహిళా సభ వార్షిక సదస్సు జరగడం, స్త్రీల సమస్యలను స్త్రీలే పట్టించుకోవాలనే ఆలోచన 1928లోనే వాయల్పాడులో ఆర్యవైశ్య మహిళా మహాసభలో తలెత్తడం, ఈ మధ్యలో నంద్యాల, మదనపల్లి వంటి అనేక చోట్ల మహిళా సంఘాల నిర్మాణం వంటి ఉజ్వలమైన చరిత్రనంతా మహబూబ్ బాషా ప్రస్తావించారు. సమాజంలో ఒకవైపు ఆధునికతా భావాలు, మరొకవైపు వలస వ్యతిరేక జాతీయోద్యమం సాగుతుండగానే, మహిళాలోకంలో కొత్త భావాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న దృశ్యాన్ని కొండ అద్దమందు అన్నట్టు చూపారు. 

          కడప రామసుబ్బమ్మ ఉపన్యాసానికి, ఆ ఉపన్యాసంలోని ఆధునిక భావాలకు ఈ నేపథ్యమంతా ఉంది. ఆమె ఉపన్యాసాన్ని వివరంగా పరిశీలించిన మహబూబ్ బాషా అందులోని ప్రధానాంశాలను, సానుకూల ప్రతికూలాంశాలను సమ్యగ్ దృక్పథంతో విశ్లేషించారు. ఆమె బాల్య వివాహాల రద్దు, స్త్రీ విద్య, స్త్రీ పురుష సమానత్వం, విడాకుల హక్కు, హిందూ ముస్లిం ఐక్యత వంటి ఆనాటి, అంటే ఇప్పటికి ఎనిమిది దశాబ్దాల కిందటి ప్రధాన సామాజిక, మహిళా సమస్యలన్నిటినీ ప్రస్తావించి తనవైన అభిప్రాయాలు ప్రకటించారు. ఆనాటి బౌద్ధిక వాతావరణంలోనే స్త్రీ విద్య గురించి, అది కేవలం దేశం కోసం, సంఘం కోసం, పురుషుడి కోసం అనే పరిమిత భావాలున్నప్పుడు, రామసుబ్బమ్మ కూడ ఆ భావజాలంలోనే ఎలా ఉన్నారో వివరించారు. ఆమె స్త్రీ పురుష సమానత్వ భావనను ఎలా దైవికవాద సమానత్వ సూత్రం మీద, చారిత్రక ఉదాహరణలతో వివరించారో చూపారు. విడాకుల హక్కు పట్ల ఆమెకు ఉండిన వ్యతిరేకతను ఎటువంటి శషభిషలు లేకుండా ఖండిస్తూ వివరించారు.

          అలాగే ఆ సభలోనే బేగం అమీరుద్దీన్ ఇచ్చిన అధ్యక్షోపన్యాసాన్ని కూడ మహబూబ్ బాషా విశ్లేషించారు. ఆమె తన ఉపన్యాసంలో లేవనెత్తిన వరకట్న సమస్య, వితంతు సమస్య, ముస్లిం స్త్రీల విడాకుల (తలాక్) సమస్య, స్త్రీల వారసత్వపు హక్కు సమస్య, స్త్రీలు పురుషులతో పోటీ పడుతున్నారా అనే సమస్య వంటి అనేక అంశాలను విశ్లేషించారు.

          ఈ చర్చాక్రమంలోనే, బెంగళూరు నాగరత్నమ్మ అభిప్రాయాలు, వాటిని ఖండిస్తూ వి. సరస్వతి రాసిన అభిప్రాయాలు, గృహలక్ష్మి సంపాదకులు, ఆంధ్రపత్రిక సంపాదకులు తీసుకున్న ఖండనార్హమైన వైఖరులు వంటి అనేక అంశాలను కూడ మహబూబ్ బాషా ప్రస్తావనవశాత్తూ చర్చించారు.

          ఈ మొత్తం పరిశోధనా వ్యాసానికి వివరమైన, విలువైన అధోజ్ఞాపికలు, ఉపయుక్త గ్రంథసూచి చేర్చి ఒక మంచి అకడమిక్ పరిశోధనగా మార్చారు. ఈ పరిశోధనలో ఇప్పటికి తగిన ఆకరాలు దొరకక మిగిలిపోయిన ఖాళీలను కూడ సూచించి, భావి పరిశోధనకు అవకాశం వదిలారు.

          మొత్తం మీద సంతృప్తికరమైన, సామాజికంగా ఉపయోగకరమైన చరిత్ర పరిశోధన ఇది. తమ ప్రాంతపు సొంత అస్థిత్వాన్ని వెతుక్కుంటున్న రాయలసీమ ఉద్యమకారులకూ, తెలుగునాట మహిళా చైతన్య చరిత్ర అధ్యయనం చేయదలచిన మహిళా ఉద్యమకారులకూ, తెలుగు జాతి సాంఘిక చరిత్రలో విస్మృత అధ్యాయాలను పరిశోధించదలచుకున్న చరిత్ర పరిశోధకులకూ, సాధారణ పాఠకులకూ కూడ ఆసక్తిదాయకమైన, ఆలోచనాస్ఫోరకమైన, చైతన్యదాయకమైన పుస్తకం ఇది. పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటుందని విశ్వసిస్తున్నాను.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.