వెనుతిరగని వెన్నెల(భాగం-36)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళిజరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. కష్టమ్మీద తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసవుతుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. తన్మయి స్థానిక రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగానికి కుదురుకుని జే.ఆర్.ఎఫ్ కూడా సాధిస్తుంది. 

***

          మర్నాడు సాయంత్రం తన్మయి హాస్టలుకి వచ్చేసరికి, మేరీ గది శుభ్రం చేస్తూ కనిపించింది

          గది పరిశుభ్రంగా మెరుస్తున్నా మరింత అందంగా ఉంచుతుంది మేరీ.

          తన టేబుల్ మీద ఖాళీ హార్లిక్సు సీసాలో రంగు కలిపిన నీళ్లు, అందులో ఆవరణలోని పసుపు పూల చెట్టు  కొమ్మలని చూస్తూనే మేరీ దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా కౌగలించుకుంది తన్మయి.

          “పొద్దున్న ఎప్పుడు తిన్నావో ఏమో కాస్త టీ తాగుతావా?” అంది మేరీ ఆప్యాయంగా.

          పాలపొడి లో వేడి నీళ్లు వేసి క్షణాలలో చిక్కని పాలు తయారు చేసి, అందులో టీ డికాషను కలిపి మేరీ చేసే టీ అంటే తన్మయికి చాలా ఇష్టం

          ఇద్దరూ టీ కప్పులతో కిటికీ దగ్గిరికి కుర్చీలు జరుపుకుని కూర్చున్నారు.

          గది కిటికీ లో నుంచి వెనక ఎత్తుగా ఉన్న చిన్న గుట్ట మీదికి ఏపుగా పెరిగిన గడ్డి మీద సాయంత్రపు కిరణాలు ప్రతిఫలిస్తున్నాయి.

          లేత గాలికి గడ్డి చివర్లు మంద్రంగా సంధ్యా సంగీతమేదో వినిపిస్తున్నట్లు మెల్లగా ఊగుతున్నాయి.

          రోజూ వాళ్ళిద్దరికీ ఎన్ని కబుర్లు చెప్పుకున్నా ఎప్పటికీ తనివితీరనట్లే ఉంటుంది.  

          తన్మయి హుషారుగా పొద్దుటి విశేషాలు చెప్తూండగా ఫోను వచ్చిందని అటెండరు సింహాచలం గుమ్మం దగ్గరికి వచ్చి చెప్పేడు.

          అంతకు ముందు రోజే జ్యోతి ఫోను చేసింది. బాబుతో తను తనివితీరా కబుర్లు చెప్పింది. “మళ్లీ ఎందుకు  చేసుంటుంది?”

          అట్నించి లాయరు విశ్వ గొంతు విని కంగారు పడింది తన్మయి

          “ఏం లేదండి. మంచి వార్త, మనం కేసు గెలవబోతున్నాం. అతను విడాకుల కేసుని ఉపసంహరించుకుంటున్నాడని అతని లాయరు చెప్పేడు. అంతే కాదు మీ మీద అతను మోపిన అభియోగాలన్నీ అబద్ధాలని ఒప్పుకుంటున్నాడుఅన్నాడు.

          తన్మయిఅతను కేసు ఉపసంహరించుకుంటున్నాడంటే అర్థం, నేను అతనితో సంధికి ఒప్పుకుంటున్నాననా?” అంది చిరు చికాగ్గా.

          “అతనితో మీరు సంధికి ఒప్పుకోవడం, ఒప్పుకోవకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత  నిర్ణయం. మీకు అతనితో విడాకులు పొందే మార్గం ఇంకా సులువవుతుంది ఇప్పుడుఅన్నాడు.

          తన్మయి, “నాకు అర్థం కాలేదు విశ్వ గారూఅంది

          “అతను కేసుని ఉపసంహరించుకున్నా, అతని మీద మీరు తిరిగి విడాకుల కేసు పెట్టొచ్చు. మిమ్మల్ని అతను పెట్టిన హింస అంతా, ఇంతా కాదని ఇప్పటికే ఫైలులో ఉంది కాబట్టి కోర్టు మీకు వెంటనే విడాకులు మంజూరు చేస్తుంది.” అన్నాడు.

          “మరి బాబు…!” అంది సందేహంగా తన్మయి.

          “బాబుకి ఇంకా అయిదేళ్లు నిండలేదు కాబట్టి సంరక్షణ మీకే వస్తుంది. తర్వాతెప్పుడైనా ఒకవేళ అతను సంరక్షణ తీసుకోదల్చుకుంటే అతను మళ్లీ కోర్టులో అప్పీలు చేసుకోవాల్సి వస్తుంది. అయినా మీరు ధైర్యంగా ఉండండి. కట్టిన తాళితో సహా తిరిగి ఇవ్వమని అడిగిన ఇటువంటి దౌర్భాగ్యుడిని నేను నా ప్రాక్టీసులో ఇంత వరకు చూడలేదు. అంత వరకూ వస్తే బాబుని దక్కించుకోవడానికి మీకు తప్పకుండా సహాయం చేసి పెడతాను. అంతే కాదు మీ వాళ్లు కట్నంగా ఇచ్చిన సొమ్ము తో సహా అన్నీ ముక్కు పిండి వసూలు చేద్దాంఅన్నాడు.

          “చాలా థాంక్సండి, నేను తిరిగి కేసు ఫైలు చేస్తాను. రేపే వస్తాను మీ ఆఫీసుకిఅంది దృఢంగా తన్మయి.

          గదికి తిరిగి రాగానే దీర్ఘాలోచనలన్నీ చెదిరి, తుఫాను వచ్చి తగ్గిన తర్వాతలా ప్రశాంత వాతావరణంలా తేలికగా అనిపించింది తన్మయికి.

          “ఇప్పటికైనా నిర్ణయం తీసుకుని చాలా మంచి పని చేస్తున్నావు తన్మయీ. నీకేం తక్కువ? చక్కగా మంచి స్కాలర్ షిప్పుతో పీ.హెచ్ డీ కి సెలక్టు అయ్యావు. నీ కాళ్లమీద నువ్వు నిలదొక్కుకోగలిగావు. ఇక ఏవీ ఆలోచించకుండా హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు నువ్వు. బాబు గురించి కూడా దిగులు పడకు. వచ్చే ఏడాది ఏమవుతుందో అన్న ఆందోళనతో ఇప్పటి జీవితాన్ని అప్రశాంతంగా మార్చుకోకు. అన్నీ అవే చక్కబడతాయి.” అంది మేరీ తన్మయి భుజం తడుతూ.

          మేరీ దగ్గర అదే తనకు నచ్చుతుంది. గత అయిదేళ్లుగా ఒంటరిగా జీవిస్తూన్నా, అధైర్యం మచ్చుకి కూడా కనిపించదు. పైగా గొప్ప ఆత్మస్థ్యయిర్యంతో  తన వెన్ను తడుతుంది

          అసలు మేరీని చూస్తేనే ఒకానొక ధైర్యం, ఓదార్పు  కలుగుతాయి తన్మయికి.

          నిరంతర ప్రార్థన వల్ల కలిగిన గొప్ప ప్రశాంత తేజస్సు మేరీ ముఖంలో తాండవిస్తూ ఉంటుంది.  

          తన్మయికి క్షణాన సముద్ర తీరాన ఉన్నధ్యాన మందిరంజ్ఞాపకం వచ్చింది.

          ఎమ్మే చదువుతున్నపుడు మిత్రులంతా కలిసి ఋషికొండ తీరానికి విహార యాత్రకు వెళ్లినపుడు దారిలో బస్సు చెడిపోయి అంతా నడక మొదలు పెట్టేరు.

          కాస్సేపటిలోనే త్రోవ పక్కనే పెద్ద మందిరం విశేషంగా కనిపించింది.

          అదే మొదటిసారి తన్మయి ధ్యాన మందిరాన్ని చూసింది.

          అర్థ గోళాకారంలో ఉన్న పెద్ద హాలు అది. విశాలంగా ఖాళీగా ఉన్న హాలులో ఈనె చాపలు పరిచి ఉన్నాయి. “నిశ్శబ్దంఅన్న పదం రాసి ఉంది స్తంభాల మీద

          ఏ విగ్రహాలూ లేవు. అక్కడంతా నిశ్శబ్దం. ఒట్టి నిశ్శబ్దం. కేవలం సాగర కెరటాల హోరు తప్ప ఏవీ వినిపించని నిశ్శబ్దం

          అక్కడ కూచుని తనలోకి తను తరచి చూసుకున్న  కాసేపూ తన్మయికి అల్లకల్లోలమైన జీవితం దాపున, నిరంతరం లోలోపల సలుపుతున్న గాయాల మీద గొప్ప లేపనమేదో పూసినట్లయ్యింది

          కానీ ఎందుకో మళ్లీ ఎప్పుడూ అక్కడికి వెళ్లగలిగే అవకాశం ఇప్పటి వరకూ కలగలేదు. “ఒకసారి వెళ్ళిరావాలిఅనుకుంది

          ప్రతీ రోజూ రాత్రి భోజనం కాగానే మేరీ తన ప్రార్థన లోకి వెళ్లిపోతుంది.

          చిన్నగా వెలుగుతున్న టేబుల్ లాంపు ముందు కూచుని లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాలు చదువుకుంటూన్నపుడు తన్మయికి అదే ప్రశాంతత కలుగుతూంది.

          ఇప్పుడు పరీక్షలేవీ లేవు. అయినా పుస్తకాలే తన్మయికి ప్రప్రంచమయ్యాయి

          ‘’తన సుఖం మాత్రమే కోరే మనిషి చెడ్డవాడు, ఇతరుల అభిప్రాయమే తనది అని చెప్పేవాడు బలహీనుడు, ఇతరుల సుఖాన్ని కోరే వాడు ఉత్తముడు, అన్నిటా భగవంతుడే అని భావించేవాడు మహా గొప్ప వాడు ”  అని టాల్ స్టాయ్

          “పని ఆనందమైతే జీవితం సంతోషమవుతుంది! పని, బాధ్యతైతే, జీవితం బానిసత్వమవుతుంది.”   అని గోర్కీ

          “నీవు ఎంత వెర్రి వాడవు. నీ బరువు నీవే మోయాలని యత్నిస్తున్నావు. భిక్షకుడా! నీ గడప దగ్గర నీవే భిక్షాటన చేస్తున్నావు. అన్ని భారాలూ ఆయనపై వదిలి పెట్టు.ఆయనే అన్నింటినీ భరిస్తాడు. నీవు నిశ్చింతగా వుండు. నీ వాంఛాపరత, మలిన శ్వాసలో నీలోని దీప్తిని ఆర్పివేస్తుంది. అపవిత్రమైన హస్తాలతో కానుకలను స్వీకరించకు. పవిత్ర ప్రేమతో అందించిన కానుకలనే స్వీకరించు.”   అని ఠాగూర్

          “సహృదయం అనే వస్తువు ఒకటి వుంది. మీరు దాన్ని ఇంకెక్కడా చూడలేదా”   అని శరత్……..తడి ఆరని హృదయపు దుఃఖాన్ని సమూలంగా తుడిచి తనకి గొప్ప నిశ్చింత నివ్వడం కోసమే రాసేరేమో!”  

          మెల్లగా ఒక్కొక్కరి రచనలూ చదువుతున్న కొలదీ జీవితం లో కొత్త కోణాలు అర్థం కావడం మొదలుపెట్టేయి తన్మయికి. అక్షరాల ప్రవాహంలో  కోల్పోయినవెన్నో లభించసాగేయి.

          నిరంతర పఠనం ఒంటరి జీవనంలో అద్భుత సహచరుడయ్యింది తన్మయికి

***

          ఆ ఉదయం హఠాత్తుగా అనంత వచ్చింది హాస్టలుకి.

          చాలా సంతోషంగా ఉన్న తన ముఖాన్ని చూస్తూనే గుర్తు పట్టింది తన్మయి ఏదో శుభ వార్త అయ్యి ఉంటుందని.

          గవర్నమెంట్ బి..డీ టీచర్ పోస్టులకు అనంత, రాజు సెలక్టు అయ్యేరు

          “చాలా మంచి వార్త చెప్పేవు అనంతా. కంగ్రాట్స్. అనుకున్నట్లుగానే సెలక్టు అయ్యారన్న మాటఅంది తన్మయి.

          పరిచయాలయ్యేకనేను ఇంత వరకు ఎన్నో సార్లు  ప్రయత్నించేను. కనీసం సెకండరీ గ్రేడు టీచరు పోస్టులకు కూడా సెలక్టు కాలేదు. మీరిద్దరూ సెలక్టు కావడం చాలా గొప్ప విషయంఅంది మేరీ అభినందిస్తూ.

          “అయితే తప్పకుండా నువ్వు  ప్రొఫెసర్ వి అవుతావు మేరీ. అందుకే నీకు చిన్న ఉద్యోగాలేవీ రావు.” అంది తన్మయి.

          “నీ నోటి వాక్యాన అదే జరిగితే,   ప్రపంచం లో నా కంటే అదృష్టవంతురాలు ఉండదు. అవునూ, నువ్వూ రాయకపోయావా?” అంది మేరీ

          “బి..డీ చెయ్యలేదు నేనుదిగులుగా అంది తన్మయి.

          అనంత వెంటనే అందుకుని, “తన్మయి ఆశయాలు, లక్ష్యాలు ఉన్నతమైనవి. చూడండి, జే ఆర్ అఫ్ కి సెలక్టు అయ్యి గొప్ప విజయం సాధించింది. త్వరలో గవర్నమెంటు లెక్చరర్ అయినా  ఆశ్చర్యపోవలసిన పనిలేదు.” అని తన్మయి వైపు తిరిగిఅవునూ గవర్నమెంటు లెక్చరర్ పరీక్ష రిటెన్ టెస్టు రిజల్ట్సు రేపు వస్తున్నాయి. నీ నంబరు ఇవ్వు తన్మయీ. పొద్దుటే నీ కంటే ముందే నేను పేపరు చూస్తాను.” అంది అనంత.

          వెళ్లబోతూ, అన్నట్లుకరుణ కి కూడా టీచరు ఉద్యోగం వచ్చింది.” అంది అనంత.

          కరుణ ప్రసక్తి రాగానే తన్మయి ముఖంలో కనబడ్డ ఒక అప్రశాంతత ని కనిపెట్టినట్లు మేరీ అనంత వెళ్లగానేకరుణ ఎవరు?” అంది.

          తన్మయి మాటల్లో కరుణ చివరి ప్రతిపాదనని విన్న తర్వాత, “అతనికి చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పి మంచి పని చేసేవు తన్మయీ. అతను నీ మిత్రుడు గానే కొనసాగి ఉంటే అతని మనస్సులోని దుర్గార్గపు ఆలోచనలు ఎప్పటికీ బయటపడేవి కావు. ప్రపంచంలో చాలా దురదృష్టకరమైన  విషయం ఏవిటంటే మగవాళ్లతో స్నేహం ఏదో ఒక సందర్భంలో శరీరం వైపు దారితీస్తుంది. స్నేహం స్నేహంగానే  కొనసాగడం చాలా అరుదు. బహుశా: అసాధ్యమేమో. ఆడవాళ్లుగా మనకున్న కనీసపు వివేచన, నియమాలూ మగవాళ్లకి సహజంగానే ఉండవనుకుంటాఅంది మేరీ.  

          “అందరూ అలా ఉండరు మేరీ. వెంకట్, మురళి వంటి ఉత్తములూ ఉన్నారుఅంది సాలోచనగా తన్మయి.

          “ఇదే నీలో మెచ్చుకోదగిన విషయం. ఇంత జరిగినా పురుషుల పట్ల ద్వేషం లేదు నీకు. నాకైతే మగవాళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది.” అంది మేరీ నవ్వుతూ.

          “ఒక బంగారు తండ్రి నా కడుపున పుట్టేడు మేరీ. అందుకే నాకు ద్వేషం లేదేమో! వాణ్ణి  స్త్రీలని గౌరవించే మంచి వ్యక్తిగా పెంచాలి. ఉత్తముడిగా తీర్చి దిద్దాలి.” దృఢంగా అంది తన్మయి.

***

          కోర్టుకి మరుసటి వారమే చివరి వాయిదా అని చెప్పేడు లాయరు విశ్వ

          ఉదయానే తలకి స్నానం చేసి బయలుదేరింది. ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా ఒక విధమైన వణుకు పుట్టుకు రాసాగింది.

          కొంగుని చుట్టూ  మరింత గట్టిగా బిగించుకుని  కోర్టు బయట తన వంతు కోసం ఎదురు చూస్తూ చెట్టు కింద ఎప్పటిలానే కూచుంది తన్మయి.

          పక్కనే కూచున్న మరొకావిడ పలకరించింది. చూడగానే పెద్దగా చదువుకోలేదని అర్థం అవుతూ ఉంది

          “ఎన్నో వాయిదా?” అడిగింది తన్మయి మెల్లగా గొంతు సవరించుకుని

          విడాకులు వచ్చి సంవత్సరం దాటినా భర్త నెలనెలా ఇవ్వాల్సిన భరణం చెల్లించక పోవడంతో మళ్లీ కోర్టుని ఆశ్రయించిందావిడ.

          “ఇద్దరు పిల్లలతో నానా కస్టాలూ పడతన్నాను. నాతో బాటూ పిల్లల్ని కూడా ఒద్దన్న ఎదవ అసలు ఎందుకు కన్నాడో మరికనీసం పిల్లల పోసన కైనా బరణం ఇవ్వని శనిగొట్టు ఎదవ, తాగుబోతు సచ్చినోడు, ముండల ముటాకోరు….” ఆమె మాట్లాడుతూ ఉండగా తన్మయికి పిలుపు వచ్చింది

          “కలిసున్నన్నాళ్ళు ఎముకలు సున్నంలాగా ఇరగదీసేసేడు. చూడమ్మా…” అని తట్లు , లోతైన గాయాల గుర్తుల వీపు చూపించింది ఆమె

          ఆమె దీనగాథ విని మనసంతా వికలం అయ్యింది తన్మయికి. వెళ్లబోతూ ఆమె చేతిలో వందరూపాయల నోటు పెట్టివద్దనొద్దు, నీ చెల్లెలిగా ఇస్తున్నాను. పిలలకేవైనా కొనిపెట్టుఅంటూ లాయరు వైపు నడిచింది.

          అనుకోకుండా అప్పటివరకూ ఉన్న ధైర్యం దాపున దైన్యం అలుముకుంది

          కలగా పులగంగా సలుపుతున్న పచ్చి పుండు లాంటి జ్ఞాపకాలు బాధ రేపసాగేయి. తమాయించుకుని లోపలికి అడుగు పెట్టింది.

          జడ్జి తన్మయిని అడిగేడుమీకు విడాకులు మంజూరు చేస్తున్నాం. సమ్మతమేనా?” 

          తన్మయిసమ్మతమేతలూపుతూ  సమాధానమిచ్చింది గొంతులోని దుః ఖం పైకి రానివ్వకుండా నొక్కిపెడుతూ

          “మీకు భరణం కావాలా?” తర్వాతి ప్రశ్న.

          శేఖర్ పక్కన అక్కడ నిలబడడానికి కూడా అసహ్యం వేస్తూంది. అతి చిన్న గది కావడం వల్ల తప్పని అయ్యింది.

          “వద్దు, అవసరంలేదుదృఢంగా అంది.

          లాయరు ఆశ్చర్యంగా చూసేడు.

          “మీకు భరణం అవసరంలేకపోయినా, పిల్లవాడికి మాత్రం భరణం ఇప్పిస్తున్నాం. అతని జీతంలో ఇరవై అయిదవ శాతం, అంటే నెలకు మూడు వందల రూపాయలు. ఇవేళ్టి నించి మీ ఇద్దరికీ ఎటువంటి సంబంధమూ లేదు….”జడ్జి  చెప్తున్నవేవీ తన్మయి చెవికి ఎక్కడం లేదు.

          చేతికి ఇచ్చిన కాగితాల మీద యాంత్రికంగా సంతకం చేసి, బయటకు అడుగు పెట్టింది.

          శేఖర్ వడివడిగా ముందుగానే బయటకు వెళ్లిపోవడాన్ని కూడా గమనించలేదు తన్మయి.

          “అతను అత్యంత తక్కువ జీతం పొందుతున్నట్లు  కోర్టుకి కాగితం సమర్పించేడు. మీకు, అబ్బాయికి భరణం ఇవ్వబడుతుందని. నెలకు మూడు వందలకు మీ అబ్బాయికి కనీసం ఒక జత బట్టలు కూడా రావు. పోషణ భారం మీకు మొత్తం పడాలని అతని ఎత్తు.”  కూడా బయటకు వచ్చిన లాయరు విశ్వ చెప్తున్నవేవీ వినకుండా నమస్కరించి బయటకు నడిచింది

          “విడాకులంటే ఇలా చెరో  కాగితం చేతికి తీసుకుని, జీవితాల్ని మధ్యకి చింపి వెళ్లిపోవడం. అంతే! “

          ప్రాంగణం లో నుంచి బయటకి అడుగులు వేస్తూ ఉంటే పెళ్లికి జరిగిన తంతంతా వరసగా జ్ఞాపకం వచ్చింది

          పెళ్లి కోసం ఆతృతగా ఎదురు చూసిన రోజులు  జ్ఞాపకం వచ్చేయి

          తన పెళ్లి కోసం తల్లిదండ్రులు పడ్డ శ్రమ  జ్ఞాపకం వచ్చింది

          పెళ్లి మాటల దగ్గర నుంచి పెళ్లయ్యే వరకూ జరిగిన అనేకానేక సంఘర్షణలూ, ఉద్విగ్న క్షణాలూ గుర్తుకు వచ్చేయి

          అన్నిటి మీద నించి అతను నిర్దాక్షిణ్యంగా నడిచి వెళ్ళిపోయేడు. చేసిన ప్రమాణాలన్నీ తృణ ప్రాయంగా తొక్కి పడేసేడు

          అతనికి బుద్ధి చెప్తున్నాను అనుకుని, విడాకులు వద్దని మూర్ఖంగా ఇన్నాళ్లూ కోర్టు చుట్టూ తిరిగింది కానీ ఒకసారి విడాకులు తీసుకోవాలనుకున్నాక అసలు తాత్సారం భరించలేక పోయింది.

          ఇంకా ఎన్ని నెలలు పడ్తుందో అనుకుంటే మొదటి వాయిదాకే విడాకులు రావడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది తన్మయికి.

          ఏదైతే జరిగితే బావుణ్ణనుకుందో అది జరిగిన తర్వాత కలుగుతున్న దుఃఖానికి కారణం ఏవిటి

          బస్సెక్కిధ్యానమందిరంఅని చెప్పింది కండక్టరుతో.

          దాదాపు గంట తర్వాత మెల్లగా మనసు తేలిక పడసాగింది.

          “ఇక మీదట అతనికి మీ మీద ఎటువంటి హక్కూ లేదు.” వినడానికే ఎంత బావుంది వాక్యం!! అమాంతంగా రెక్కలు పొడుచుకొచ్చి సీతాకోక చిలుకలా గాలి వాటున పైకెగిసిన భావన!!!

          బస్సు జోడు గుళ్ల పాలెం కొండ వంపులు తిరుగుతుండగా దిగువన సముద్రమ్మీద దూరాన దిగంతాన్ని కలిసే చోటు మీదుగా సాయంత్రపు సూర్య కిరణాలు ఏటవాలుగా పడ్తూ నారింజ రంగు కాంతి ప్రసరిస్తూ  ఉంది.

          అలల మీదుగా ఎగురుతూన్న పక్షులను చూడగానే తన్మయికి తన జీవితం అత్యంత ఆశావహంగా, స్వేచ్ఛాయుతంగా కనిపించింది.

          అందులో అన్నిటికన్నా ఎత్తున ఎగురుతూ అవలీలగా గిరికీలు కొడ్తున్న పక్షిలా సంకెళ్లు తెగిన హాయి మనసంతా వ్యాపించింది

          ఎక్కడైనా ఆగి దిక్కులు పగిలేలా గట్టిగా అరవాలని ఉంది

          ఆలోచన రాగానే తర్వాతి స్టాపులో బస్సు దిగి పోయి తీరంలో తడి ఇసుకలో నుంచి నడక ప్రారంభించింది

          అరగంట సేవు ముందుకు నడవగానే  సరుగుడు చెట్ల తోట కనబడసాగింది. అక్కణ్ణించి తీరం లోపలికి సాగి, రోడ్డు కనుమరుగవుతుంది

          సాయం సంధ్య తనకు తోడుగా ఎంతో సేపు ఉండదు. చీకటి పడేలోగా జనారణ్యంలోకి అడుగుపెట్టవలసిందే

          కాళ్లు మునిగే కెరటాలలో నిలబడి దోసిలితో  ఇసుకను, నీటిని సముద్రంలోకి విడుస్తూ  “శేఖర్, ఇక నీకు నా మీద ఎటువంటి హక్కూ లేదు” అని అరిచింది.          

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.