కథా మధురం 

సావిత్రి రమణారావు

‘భార్యని పురుగులా చూడటమూ హింసే! మానసిక హింసే..’

– అని చెప్పిన కథ!

 -ఆర్.దమయంతి

***

          వివాహిత స్త్రీలు నిరాశకి గురి అవడానికి గల ప్రధాన కారణాలలో ప్రధానమైనది  – కుటుంబంలో వారి ఉనికి కి విలువ లేకపోవడం.

          భర్త చులకన గా చూడటం,  హేళనతో గేలి చేయడం, పదిమందిలో పలచన చేసి మాటలతో అవమానించడం, మాటిమాటికి తూలనాడటం, హీనమైన తిట్లు తిట్టడం.. వంటి భర్త చర్యలకి ఇల్లాళ్ళు లోతైన నిరాశ నిస్పృహలకి గురౌతారు. ఈ ప్రభావం వారి మనసుపై ఎంత గాఢమైన పరిణామాలు చూపుతాయంటే..  దీర్ఘ మానసిక రోగాలకు గురి అయ్యేంత! 

          ఇదే అంశాన్నిఓ  భర్త ముందు ప్రస్తావించినప్పుడు..ఆయన మండిపడుతూ..”రోగం కాకుంటే, దానికేం తక్కువ చేస్తున్నాట? విలువలేదని ఏడ్వడానికి?  విలువివ్వకుండానే తాళి కట్టానా? విలువివ్వకుండానే ఇంట్లో వుంచుకుని కాపురం చేస్తున్నానా? విలువివ్వకుండానే పిల్లల తల్లి అయిందా? నాకు ఇంకొక పెళ్ళాం  లేదు . మరో సెటపూ లేదు మరి. అది విలువ కాదా అంటా? అర్ధం లేకుండా తనకి విలువ లేదు విలువలేదని ఏడుస్తుంది? అంటే అమ్మోరిలా..నెత్తినెట్టుకుని ఊరేగాలా?   రోజూ పూజలు చేయాలా పెళ్ళానికి? ‘ అంటూ రయ్యిన దూసుకొచ్చాడు ఓ మొగుడు. హబ్బ! ఈయన గారు తన పెళ్ళానికెంత విలువిస్తోందీ..  మాటల్లోనే తెలిసిపోవట్లా?

          నిజమే. ఆ భర్త మాటల్లో అబద్ధం లేదు. కానీ ఆ భార్య దిగుల్లో కానీ, నిరాశలో కాని  – ఇసుమంత అబద్ధమూ లేదు.

          ఇదేం జడ్జ్మెంట్ అంటారా? విడ్డూరం గా వుంది కదూ? మరి ఆ వింతంతా సవివరం గా, ఈ కథలో విస్తరించుకున్న  వైనమే ఈ కథ. – ‘మళ్ళి కూయవే గువ్వా!

***

అసలు కథేమిటంటే :

          కొత్తగా పెళ్ళైన కూతురింటికి వచ్చిన సీత కి ఆ ఇల్లూ, కూతురిని ప్రేమగా చూసుకునే భర్త, తండ్రిలా ఆదరించే మామగారు, ఇల్లంతా పరచుకున్న చల్లని మమతానుబంధాలు చూసి సంతోష పడిపోతుంది. కూతురి అదృష్టానికి ఆనందిస్తుంది.

          కానీ, ఇన్నేళ్ళ కాపురం లో తాను ఏ నాడు భర్త నించి చవి చూడని  ప్రేమాదరణలకు ఆమె మనసు చిన్నబోతుంది. చేదు అనుభవాలకు, ఏ పాటి విలువకు నోచని దురదృష్టానికి ఆమె మనసు ఖేదమౌతుంది.

          భర్త సుందరం కళ్ళ ముందు మెదులుతాడు.  అసలు ఆమె భర్త సుందరం. ఎలాటి వాడంటే..? తాగుబోతు, తిరుగుబొతు, జూదరి, స్త్రీలోలుడు, వ్యసనపరుడు.. అనుకుంటున్నారా? కాదు.

          ఓ తెలుగు కథలో ఎక్కడో చదివాను. భర్త పెట్టే బాధలకు ఓర్వలేక ఆ ఇల్లాలు అంటుంది. నా మొగుడు కనీసం వ్యసనపరుడైతే..ఈ కారణం గా నన్ను హింసిస్తున్నాడని చెప్పగలిగే దాన్ని..ఇప్పుడు కారణం ఏమిటీ చెప్పమంటే చెప్పడం చేతకావడం లేదు..’ అంటూ భోరున విలపిస్తుంది.

          కొందరి భర్తలు భార్యలని మూడో కంటికి తెలీకుండా మానసికంగా ఎంత లా హింసిస్తారనడానికి ఇదొక ఉదాహరణ.

          అలాగే సుందరం లో ఎలాటి దుర్లక్షణాలు లేవు అంటున్నారు, మరి ఇంకేమిటి  అతనిలో లోపం అంటే..కథ చదివితే నే తెలుస్తుంది ఆ మిస్టరీ!

***

కథలోని స్త్రీ పాత్రలు, వారి స్వభావాలు :

సీత : (సుందరం భార్య)

          కథలో ముఖ్య పాత్రధారిణి  సీత. దురదృష్టవశాన చిన్నప్పుడే తల్లి తండ్రుల్ని, తోడబుట్టిన వారినీ కోల్పోవడంతో మేనమామ పంచన చేరుతుంది. ఆమె కష్టాలు అక్కణ్ణించే మొదలౌతాయి – అత్తయ్య సాధింపులతో.

          ఆడవాళ్ళకి  అణకువతనం రెట్టింపవడానికి కారణం – పరిస్థితులు తోడ్పడ తాయనడానికి ఒక నిదర్శనం సీత అని చెప్పాలి.

          ఆ నెమ్మది తనమే పక్కింటి పరంధామయ్యకో..వెనికింటి సీతారామయ్యకో ముచ్చట గొలుపుతుంది. ఆ పళాన తన దుడుకు మనవడికి ఈమె అయితే జీవితాంతం గారంటీ గా మనవడు సుఖపడిపోతాడు..అని దురాశపడతారు. ఎందుకు దురాశ అంటున్నానంటే..

          మగాడి పరువు ని కాపాడగల ఏకైక స్త్రీ – భార్య. అతని అహాన్ని, అజ్ఞాన్ని, దురహంకారాన్ని, అవివేకాన్ని అన్నీట్నీ కొంగున ముడేసి దాచేసి, తప్పుల్ని చెరిపేసి, ఇతను చాలా మంచోడు. మచ్చలేని వాడు అంటూ అతన్ని  సమాజం లో ఓ మనిషిగా నిలబెట్టగల సమర్ధురాలు కేవలం భార్య మాత్రమే.  మరి ఇంత పేరుప్రతిష్టలు రావాలంటే అతనిలో ని  ఓర్చుకునే స్త్రీ కావాలి. జీవితాంతం భరించడానికి ఏ ఆడదైనా ముందుకొస్తుందా? కాపురానికొచ్చిన రెండో రోజే లేచిపోదూ? హమ్మో అదెంత పరువు నష్టం కాదూ? అందుకే తెలివి గా ఆలోచిస్తారు తాతలు. అణిగిమణిగి వుండే పిల్ల ఎక్కడ దొరుకుతుందా అని వేటాడుతుంటారు. పెళ్ళి అనే ఎర వేసి పట్టుకుంటారు. చాలు. మనవడు నిత్య పెళ్ళికొడుకౌతాడు. ఆమె నిత్య శోకిని అవుతుంది.  గొర్రె చావకుండా విందెలా సాధ్యం మరి!

          అలా ట్రాప్ చేయబడుతుంది సీత.

          ఎరకి చిక్కిన చేపకి మల్లేనే చాలా మంది స్త్రీలు ‘పెళ్ళీ అనే ఒక్క పదానికి చిక్కి పోతూన్నారు. కాదు. చిక్కులబడి పోతున్నారు. అయితే ఆ తప్పు వివాహానిది కాదు. ఆ పేరుతో మోసం చేస్తున్న కొందరి మగాళ్ళ దుర్మార్గపు ఆలోచనది.

          ఊహ తెలిసినప్పట్నించి..తనకెవరూ లేని సీతకి తనకీ ఒక ఇల్లు వుంది అనే  ఆనందం హరించుకుపోడానికి ఎంతో కాలంపట్ట్లేదు.  సరిగ్గా కాపురానికొచ్చిన రెండే రెండు రోజుల్లో తెలిసిపోయింది.

          అన్నం వుడికిందో లేదో..తెలుసుకోడానికి రెండు మెతుకులు పట్టుకుని చూస్తే చాలు..అన్న చందాన తన కాపురమేగతి నుంటుందో ..ఆమెకి అప్పుడే అర్ధమైపోయింది.

          తానిక చేసేదేమీ లేదన్న ఒక నిస్సహాయ స్థితిలో స్త్రీ –  కదిలే శిల లా మారి పోతుంది.

          సీత కూడా అంతే.

          ఆడది పువ్వు వంటిది. చిరుగాలికే వొణికిపోతుంది..అంటూ ఏవో భావకవులంటారు కానీ..సుందరం లాటి చేతికి చిక్కాలే కానీ అంతటి సుమ బాల సైతం శిల కావాల్సిందే. లేకపోతే బ్రతకడం దుర్లభం.

          ఈ కథలో సీత మాత్రమే అంత అని కాదు. నిజ జీవితాలలో ఇలాటి  సీతలు ఎందరో వున్నారు.

కాపురం, రోజూ ఒక కఠిన పరీక్షే : 

          సీత జీవితం ఇలాగే సాగుతుంది. అంటే  భర్త సుందరం కొట్టడు. బండ బూతులూ తిట్టడు. మరేం చేస్తాడూ అంటే..

          వొళ్ళంతా కారం రాసినట్టు..మాట్లాడతాడు. ఒక వ్యగ్యం, హేళణ నిండిన స్వరం.. భళ్ళున వాంతి చేసినట్టు ఆ నవ్వు, భార్య ఒక దాసి అయినట్టు అజమాయిషీలు, చీత్కారాలతో బాటు, ఇంట్లోంచి ఫొమ్మంటూ తోసేయడం..అన్నిటికన్నా భరించలేని అవమానం..తల్లి తో ఏకమై ఆమెని ఒంటరిని చేయడం తో..సీత మనసు విరిగిపోతుంది. ఆకాశమంత శూన్యం ఆమెని మింగేస్తుంది. ఇది కాన్సర్ కణమని చెప్పలేం కాని అంత కంటే కూడా ప్రమాదకరమైన మానసిక రోగానికి మూల కారణం సుందరం లాటి దుర్మార్గం అని చెప్పాలి.

          సుందరం లాంటి వాళ్ళు పెళ్ళాన్ని ఓ పనికిమాలిన వస్తువు గా పరిగణిస్తారు. అసలు దృష్టిలోనే లోపం గల వానికి సమస్తమూ వక్రం గానే అగుపిస్తుందన్నట్టు..భార్య అనే పదానికే అర్ధం తెలీని మనిషికి –  ఆమె ని గౌరవించడం, విలువనీయడం అంటే ఏమిటో తెలిసే సమస్యే లేదు.

          అయినా ఈ ఇల్లాళ్ళు ఆ చూరే పట్టుకుని ఎందుకు వేళ్ళాడతారు? తాళి తెంపి పడేసి,  గడప దాటొస్తే బ్రతక్క పోతుందా?  అని ఆక్రోశిస్తారు స్త్రీల అభిమానులు.

          నిజమే. కానీ ఆ జ్ఞానాన్ని చీకటి చేస్తుంది పిల్లల బాధ్యత అనుకుంటా!

          సరిగ్గా ఇక్కడే ఈ సందర్భం లోనే చలం అంటారు..ఇద్దరూ కొట్టుకు చస్తుంటే ఆ పిల్లలేం ఆరోగ్యకరం గా ఎదుగుతారు..శుభ్రం గా విడిపోయి ఒక్క చేతి మీద పెంచుకుంటే రివ్వున ఎగిరే గువ్వల్లా ఎదుగుతారు పిల్లలు అని బోధిస్తారు. ఆలోచించదగిన మాటలు. – ఏ కాలానికి ఈ వాక్యం నిలిచిపోతుంది.

Philippa Gregory ఏమంటారంటే..  :

‘ A woman has to change her nature if she is to be a wife. She has to learn to curb her tongue, to suppress her desires, to moderate her thoughts, and to spend her days putting another first. She has to put him first even when she longs to serve herself or her children. She has to put him first even when she longs to judge for herself. She has to put him first even when she knows best. To be a good wife is to be a woman with a will of iron that you yourself have forged into a bridle to curb your own abilities. To be a good wife is to enslave yourself to a lesser person. To be a good wife is to amputate your own power as surely as the parents of beggars hack off their children’s feet for the greater benefit of the family.’

ఆలోచించదగిన మాటలు.  

సీత మౌనం గా భరించిన అతని దుర్మార్గాలు :

హేళన : ‘ నీ బొంద నీకేం తెలీదు.’

అవహేళన : ‘ నోర్మూయ్. తెలిసిందాన్లా వాగకు.

కత్తికి మరో వైపు : ‘నోరు తెరిచి ఏడు. ఎప్పుడూ ముంగిలా చస్తావెందుకు?

మరోహింస : ‘రోజూ శోభనం పెళ్ళి కూతురిలా తయారవ్వాలా? సంసార పక్షం గా వుండు చాలు.’

అదే నోరు : ‘పక్క మీదకొస్తూ ఎలా రావాలో తెలీదా? కొవ్వు నీకు.’

అడుగడుగునా అణుబాంబు : నా ఖర్మ కొద్దీ దొరికావ్. అవతలకు  ఫో. నీతో నాకు సుఖం లేదు. ఇంట్లోంచి తగలడు. ఫో. ఫొమ్మంటే పోవూ?’

          సుందరం లో మితి మీరిన ఈ ఇజం ఇంత మందాన పేరుకుపోడానికి కారణాన్ని రచయిత్రి వివరించినప్పుడు నిజమనిపిస్తుంది.

          ఆడపిల్లని కాపురానికి పంపిస్తూ ప్రతి తల్లి చెప్పే ఒక విలువైన మాట.. ‘భర్తని గౌరవించు..’ అనే ఆ ఒక్క చిన్నమాట ప్రతి మగపిల్ల వాని తల్లి కూడా చెప్పగలిగితే ఎంత బావుణ్ణు!

          ‘దాన్ని గౌరవిస్తే నెత్తినెక్కుతుందనీ, విలువ ఇస్తే నీ విలువ పడిపోతుందని’ చెప్పేది కూడా సాటి స్త్రీలే కావడం నిజం గా దురదృష్టకరం.

          ఎవరికైనా  ఒకరోజు నరకం చాలా భయంకరం గా వుంటుంది. కానీ రోజూ నరకమే అయినప్పుడు..అలవాటైపోతుంది. జీవితంలో అదీ ఒక భాగమౌతుంది. అప్పుడు మనిషి నడిచే శిల గా మారిపోతాడు. హృదయం చైతన్య రహితమైపోతుంది.

          కళ్ళు చూస్తూనే వుంటాయి. కాని,  కాంతి వుండదు.

          పెదాలు నవ్వుతూనే వుంటాయి. కానీ,  జీవం వుండదు.

          గుండె కొట్టుకుంటుంది. హృదయం మాయమైపోతుంది.

          పట్ట పగలు చీకటి గా వుంటుంది. చీకటి చింత అవుతుంది. గుండె లో తెలీని గుబులు కొండలా పెరిగిపోతుంటుంది. డాక్టర్లు దాన్ని డిప్రెషన్ అంటారు. రోగి మాత్రం తానొక నడుస్తున్న శవం అంటాడు. అంతే.

          ఆ కోవకి చెందిన స్త్రీనే – సీత కూడా.

          అయితే కాలం చిత్రమైనది. తన కుంచెలకు ఎప్పుడు ఏ రంగులు అద్ది, మనపై జిమ్ముతుందో తెలీదు.

          పెళ్ళైన పాతికేళ్ళ తర్వాత అతనిలో మార్పు చోటు చేసుకుంది.

          కానీ..రాత్రి రాని చంద్రుడు పొద్దున ఎదురైతే ఏం చందమని?

          ఎంత గొప్ప వసంత శోభ అయినా..శ్రావణం నాటి కుంభవృష్టిలో వస్తానంటే..కాలం అనుమతిస్తుందా?

          కరిగిన కాలం ఎలా మరలి రాదో..విరిగిన హృదయమూ అతకదేమో కదూ?

          నిర్దోషికి ఉరి వేసేశాక నిజం  తెలుసుకుని ఏం ప్రయోజనం? ఆ పై, చేయాల్సిన  న్యాయం అంటూ మిగులుతుందా?

          వృధా అయిపోయిన ఒక జీవితానికి తార్కాణం గా నిలుస్తుంది సీత పాత్ర.

          అయితే..సుందరం లాటి భర్తలే మన చుట్టూ వున్న  సమాజం లో అడుగడుగునా కనిపిస్తారు.

          ఐతే, ఓర్పు గా తెలివిగా టాకిల్ చేసుకునే ఉపాయాన్ని కూడా ఈ పాత్ర ద్వారా  మనం  గ్రహించవచ్చు. 

మరో స్త్రీ పాత్ర : లలిత ( సీత కూతురు)

          వాళ్ళిద్దరూ తల్లీ కూతుళ్ళు. కాని ఎవరి అదృష్టం వారిదన్నట్టు.. బ్రహ్మ దేవుడు లలిత కథని అందం గా రాసాడు.

          నేనెప్పుడూ ఒక వాక్యాన్ని రిపీట్ చేస్తుంటాను. మగాళ్ళందరూ చెడ్డ వాళ్ళు కాదు. అదే నిజమైతే,  మనం ఈ నాడు ఇంత పురొభివృద్ధిని సాధించే వాళ్ళం కాదు. అని చెబుతుంటాను.

          లలిత భర్త రమేష్ కూడా ఇదే కోవకి చెందిన వాడని ..ఆమె మాటల్లో మనకర్ధ మౌతుంది.

          అత్త గారింట్లో అందరూ మంచి వాళ్ళే అయినా..కొందరి కోడళ్ళకి ఆ మంచితనం కనిపించక పోగా..అన్నిటా లోపాలే కనిపిస్తాయి. అందర్లోనూ దుర్మార్గాన్నే దర్శిస్తారు.

          కానీ ఈ కథలో లలిత తన ఇంటినీ, ఇంట్లో మామగారినీ, భర్తని దేవతలుగా అభివర్ణిస్తూ చెబుతుంది తల్లికి.

          కొత్తగా కాపురానికి వెళ్ళిన ఆడపిల్ల ‘అత్తిల్లు స్వర్గం..’ అని చెబుతుంటే వినడం ఏ తల్లి తండ్రులకైన ఎంత అదృష్టకరమైన దశ కదూ!

          ఎంతైనా ఆడపిల్ల ప్రేమే ప్రత్యేకం : తల్లికి సుఖం లేదని, తనలా సంతోషం గా బ్రతకలేకపోతోందని..నిజాయితీ గా బాధపడుతుంది లలిత.

          ప్రతి ఆడపిల్ల –  తల్లి మనసుని అర్ధం చేసుకుని మసలుకోమని బోధిస్తుంది – ఈ పాత్ర.

          తల్లి కి ఇష్టమైన గాన కళని ప్రోత్సహిస్తూ..సింగింగ్ ఆప్స్ లో పాడిస్తూ..సోషల్ మీడియాలలో వాటిని పోస్ట్ చేస్తూ..తల్లికి కొంత వుత్సాహాన్ని..సంతోషాన్ని కలిగిస్తూ.. ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తి గా నిలిస్తుంది.

          తల్లి తండ్రులని చూసుకునే బాధ్యతని కొడుకులతో సమానం గా కూతుళ్ళు కూడా తీసుకుంటే ..వృద్ధాప్యం లో పెద్దవాళ్ళు సంతోషం గా బ్రతికేస్తారనడానికి – ప్రత్యక్ష నిదర్శనం గా నిలిచే పాత్ర లలిత పాత్ర.

తండ్రిని, దుశ్చర్యలని వ్యతిరేకించిన అమ్మాయి గా :

          చాలా మంది ఆడపిల్లలు తండ్రి తల్లిని బాధ పెడుతున్నా సరే..తండ్రిగా తనని ప్రేమిస్తున్నాడు చాలనుకుంటారే తప్ప, ‘నాన్నా!  నువ్వు చేస్తోంది తప్పు, నువ్వు మారాలి అని ఖచ్చితం గా చెప్పలేరు. భయం కావొచ్చు. ఆర్ధికం గా అతనిపై ఆధారపడి వుంటం వల్ల కావొచ్చు..లేదా కూతురిగా తనకి ఏ లోటు రానీయకుండా చూస్తున్నాడు కదా అనే సర్దుబాటు మనస్తత్వం కావొచ్చు. నోరు మెదపరు.

          తననెవ్వరూ అర్ధం చేసుకుని, ఓదార్చడం లేదన్న కారణం గా కూడా చాలామంది తల్లులు నిరాశ నిస్పృహలకి  లోనవడం జరుగుతుంది.

          కానీ లలిత తల్లిని ఓదారుస్తూనే..తండ్రిని వ్యతిరేకిస్తూ మాట్లాడి, ఆ తల్లి హృదయాన్ని చల్లబరుస్తుంది. ఆడపిల్లలు సహజం గా తల్లి మనసునే ఈ లక్షణాన్ని కలిగి వుండాల్సిన ఆవశ్యకతని చాటుతుంది – ఈ పాత్ర.

తండ్రిలో మార్పు తీసుకురావాలనే దిశగా ఆలోచించిందేమో! :

          తల్లి  తిరుగు ప్రయాణాన్ని  మరి కొన్ని రోజులు పొడిగిస్తుంది.

          ఎన్నడూ గడప దాటి రాని తల్లి.. ఆ ఇంటికి దూరమైతే..అప్పుడైనా ఆమె  విలువ తండ్రికి తెలిసొస్తుందేమో అనే ఆశ ఆ కూతురిలో వుందేమో అనిపించకమానదు.

          సుందరం వంటి అహంభావి తండ్రికి కూతురైన పాపాన, తండ్రి ప్రేమానురాగాలకు, తీపి బాల్య స్మృతులకు దూరమైన లలిత పాత్ర పై జాలి కలుగుతుంది.

          మరో పక్కన, భర్త తో అందమైన జీవితాన్ని గడుపుతున్నందుకు ఆనందమూ కలుగుతుంది.

          జీవితం సప్త సాగర  వర్ణగీతం అంటే ఇదేనేమో!

***

హామ్మో! అత్త గారి పాత్ర లో సుందరం తల్లి :

          కథలో ఈమె నిడివి అతి స్వల్పమే అయినా, ప్రభావం మాత్రం పెను తుఫాను లాటిది అని చెప్పక తప్పదు.

          ప్రతి ఇంట్లో ఒక తల్లి గుణవంతురాలైతే చాలు. కుటుంబమంతా శాంతి యుతం గా జీవితం చల్ల గా సాగిపోతుంది అని అందుకే అంటారు.

          అదే కనక ఆ తల్లి పెడ ఆలోచనలు గలదైతే..ఎందరి జీవితాలు దుర్భరమౌతాయో!

          ఓ సారి  ఇంగ్లీష్ క్లాస్  లో మా  సార్ అడిగారు. ఒక తల్లి తన కొడుకుని ప్రేమించినట్టే కోడల్ని కూడా ప్రేమిస్తుంది కదూ? అని. యస్ సార్ అంటూ ఏక కంఠం గా చెప్పాం. పెద్ద అంతా మాకే తెలిసినట్టు.

          ఆయన నవ్వుతూ తల అడ్డం గా ఊపారు. ఎన్నేళ్ళ సంగతో..కానీ ఇప్పటికీ ఆయన మాటలు నా చెవిలో ప్రతిధ్వనిస్తూనే వుంటాయి.

          ‘తల్లి తనకు మాత్రమే తల్లి. తన భార్యకి కాదన్న సత్యం ప్రతి మగవాడూ గ్రహించాలి.’

          కొన్ని అగ్గి లాంటి నిజాలు వెలిబుచ్చడానికి వెనకాడకూడదు. దాచేస్తే కొంపలు తగలబడిపోవా, ఈ కథలోకి మల్లేనే?!

          పెళ్ళయ్యాక ప్రతి కొడుకూ తన తల్లికి వ్యతిరేకి కానవసరం లేదు. తల్లి తల్లే. కాదనలేని సత్యం. కానీ భార్యని భార్యగా నే ట్రీట్ చేయాలి. తల్లి మాటలు నమ్మి గుడ్డిగా వ్యవహరించి భార్యని హింసిస్తే చివరికి నాశనం అయ్యేది తన బ్రతుకే అని ప్రతి మగాడు గుర్తించాలి..అని పరోక్షం గా చెప్పిన పాత్ర సుందరం తల్లి పాత్ర.

          ఈవిడ నిలువెత్తు కోడలి ద్వేషి. అకారణం గా కోడల్ని ఆడిపోసుకుంటూ, కొడుకూ కోడలి మధ్య ఆరకుండా చిచ్చు రగిలిస్తూ..అలా తన  చివరి శ్వాస  దాకా కూడా  కళ్ళళ్ళో  నిప్పులు పోసుకున్న భయంకరమైన ఈ గయ్యాళి అత్త..’ఇంతటితో నశించు గాక..’ అని శపించాలనిపిస్తుంది.

          స్త్రీలలో దేవతలు మాత్రమే కాదు,  రాక్షసులూ వుంటారనడానికి ఈ పాత్ర  ఓ ప్రత్యక్ష నిదర్శనం.

          తస్మాత్! అబ్బాయిలూ కాపురాలు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది సుందరం తల్లి.

***

          ఇవండీ ఈ కథలోని కథాంశం, కథనరంగ విశేషం, ఇంకా, కథలోని పాత్రల వైవిధ్య, వైరుధ్య స్వరూప స్వభావాలు..విశ్లేషణలు.

***

రచయిత్రి గురించి :

          ఫేస్బుక్ సాహితీ సమూహాలలో, మరి కొన్ని వాట్సప్ గ్రూప్ ల్లోనూ శ్రీమతి సావిత్రి రమణా రావు గారు అంటే తెలీని తెలుగు వారుండరు. కవితలు, గజల్స్, కథలు, స్కెచెస్, స్వగతాలు, స్వీయానుభవాలు, మినీ కథలు, మంచి కథలు, అనువాదాలు ..ఇలా ఎన్నో ప్రక్రియల్లో చురుకుగా పాల్గొని తనదైన గుర్తింపు ని పొందారు.  ఆలోచనల్లో కొత్తదనం, కథని చెప్పడంలో సూటి తనం, పాత్రల చిత్రీకరణలో సహజత్వం, నిజాలను వెలుగులోకి తీసుకు రావాలనే నిజాయితీ తనం వీరి సొంతం.  

          కథా మధురం కోసం కథ  కావాలని  అడిగిన వెంటనే మంచి కథని అందచేసిన రచయిత్రి శ్రీమతి సావిత్రీ రమణా రావ్ గారికి నెచ్చెలి తరఫున ధన్య వాదాలు తో బాటు  అభినందనలు కూడా తెలియచేసుకుంటున్నాను.

***

‘నెచ్చెలి’ ప్రియ పాఠకుల్లారా!

‘మళ్ళి కూయవే గువ్వా! ‘ కథనీ, కథ పై నా విశ్లేషణనీ కూడా చదివి, మీ అమూల్యమైన హృదయ స్పందనలను నెచ్చెలి తో పంచుకోవలసిందిగా మనవి.

శుభాకాంక్షలతో..

ఆర్.దమయంతి.

***

 మళ్ళి కూయవే గువ్వా!

– సావిత్రి రమణారావు

          “రా అమ్మా! ఫ్లైట్ లో నీకేమి ఇబ్బంది కలగ లేదు కదా !” అంటూ ఆప్యాయం గా ఆహ్వానించిన వియ్యంకుడి తో.. “లేదు అన్నయ్యగారు. ప్రయాణం అంతా సుఖం గానే జరిగింది ” అంటూ లోపలికి నడుస్తూ కళ్ళ తో నే హాల్ అంతా కలయ చూసింది. కూతురు లలిత కోసం. ఆమె భావం అర్ధం అయిన వాడిలా శేఖరం గారు – ” అమ్మాయి ఇంకా లేవలేదమ్మా. లంచ్ తరవాత టాబ్లెట్స్ వేసుకుంది. కాస్త బలహీనంగా వుంటం వల్ల ఎక్కువసేపు నిద్ర పోతోంది. లేవగలగి నపుడే లేస్తుందిలే విశ్రాంతి తీసుకోనీ అని  నేను కూడా డిస్టర్బ్ చేయటం లేదు. ఇదిగో కాస్త కాఫీ తీసుకోండి. ” అంటూ కాఫీ కప్ అందించాడు.

          కోడలిపై గల ఆయన మమకారానికి ఆ తల్లి మనస్సు పొంగిపోయింది.

          మొహమాటం గా కాఫీ అందుకుని సిప్ చేస్తుంటే అల్లుడు – తన లగేజీ తీసుకు వచ్చి రూమ్ లో పెట్టి, “అత్తయ్యా మీరు కాఫీ తాగి రిఫ్రెష్ అవండి. ఈ లోపల లలిత లేస్తుంది.” అన్నాడు.

          “సరే!”అని తలవూపి కాఫీ తాగి తన లగేజ్ ఉన్న రూమ్ లోకి నడిచింది.

        స్నానం చేసి బట్టలు  మార్చు కుని కుర్చుంది.

          “రండత్తయ్యా!” అని రమేష్ వచ్చి పిలవడం తో –  కూతురి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది సీత. లలిత బలహీనం గా మంచం మీద పడుకుని ఉంది.” రా అమ్మా! ప్రయాణం ఎలా జరిగింది అంది?”

          “బాగానే జరిగింది. నువ్వెలా ఉన్నావు. బాగా నీరసించి పోయావమ్మా!” అంటూ, కూతురి పక్కన మంచం మీద కుర్చుంది.

          “డెంగ్యూ  ఫీవర్ కదమ్మా.  ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గి పోయింది అన్నారు. ఇప్పుడు పరవాలేదు. బాగానే వున్నానని అంటున్నా వినకుండా.. మామయ్య ‘మీ అమ్మా, నాన్న ని రమ్మంటాను అమ్మా!” అని మీకు ఫోన్ చేశారు.

          పెళ్ళి అయి మూడు నెలలే అయింది కదా. నాకు వీళ్ళ దగ్గర మొహమాటంగా ఉంటుందేమో! నువ్వు,నాన్నా నా కూడా ఉంటే మంచిది అంటూ మీకు మామయ్య ఫోన్ చేశారని రమేష్ చెప్పారు. కానీ నిజానికి మామయ్య, రమేష్  నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారమ్మా! నాకు ఇక్కడ దేనికీ లోటు లేదు.” .. అని అంటున్న కూతురి మాటలకు హాయిగా నిట్టూర్చింది. లలిత కి బావులేదని తెలిసిన దగ్గరి నుండి ఎన్నో సందేహాల తో  మధన పడుతున్న సీత మనసు  ఇప్పుడు  కాస్త  కుదుటపడింది.

          “లలితా నాకిక్కడ కొత్త. ఏ పని చెయ్యాలో తెలియదు. ఏ వస్తువు ఎక్కడుందో నువు చెబితే కానీ ఏమీ చేయలేను అమ్మా!” అంటున్న తల్లితో..

          “నీకా బాధ లేదమ్మా. అన్నీ మామయ్యే స్వయం గా చూసుకుంటారు. ఎందుకంటే,  ఒకటీ ఆర్మీ లో ఉద్యోగం, రెండూ అత్తయ్య పోయి పదేళ్లు అయిపోవడం తో మామయ్య, రమేష్ అన్ని పనులూ వాళ్ళంతట వాళ్ళు చేసుకుందికి అలవాటు పడి పోయారు. మామయ్య అన్నీ ప్రణాళిక ప్రకారం చేస్తారు. రమేష్ కి అదే అలవాటు అయింది. అసలు చిరాకులు, పరాకులు వుండవమ్మా. వీళ్ళని చూసి నేర్చు కోవాలి నాన్న.” అంది. చివరి వాక్యాన్ని దిగులుగా ముగిస్తూ..

          అంతలోనే ఏదో సందేహం కలిగినట్టు.. ” అయినా నాన్న ఎందుకు రాలేదు నీతో?   రిటైర్ అయి  ఇంట్లోనే వున్నారు కదా! కూతురికి బావులేకపోయినా రాకుండా వెలగ బెట్టాల్సిన రాచ కార్యాలు ఏమున్నాయిట అక్కడ? ఎప్పుడూ గడప దాటని నిన్ను ఒక్క దాన్నీ ఫ్లైట్లో  ఎలా పంపారు? ” అడిగింది కినుక గా!

          “ఆయన కొత్త చోట ఇబ్బంది గా ఫీల్ అవుతారని తెలుసు కదమ్మా. ఎప్పుడూ చుట్టపు చూపుగా కూడా ఎక్కడికీ వెళ్ళటానికి ఇష్టపడరు అందుకే.” సీత పొడి పొడిగా జవాబిచ్చింది.

          “ఎక్కడికీ వెళ్ళటం వేరు. కూతురికి బావోలేదని తెలిసీ వెళ్ళాలి అనుకోక పోవటం వేరమ్మా. అసలు నిన్ను అనాలి! ఆయన అన్న దాని కల్లా మౌనం గా తల ఊపుతావు. నానమ్మా, నాన్న కలిసి నిన్నో మూగి బొమ్మను చేశారు.” బాధగా అంది.

          “పోనీలే అవన్నీ ఆలోచించకు. నీకు ఏమి చేయాలో చెప్పు” అంటుంటే…

          వియ్యంకుడు వచ్చి “చెల్లమ్మా నేను బయటికి వెళుతున్నా. వచ్చి రాత్రి డిన్నర్  కి చపాతీలు, పప్పు చేస్తాను. అంతవరకు మీరు కబుర్లు చెప్పుకోండి. రమేష్ కి  ఆఫీస్  డిన్నర్ ఉందట. చెప్పాడు ” జవాబు కోసం కూడా చూడకుండా వెంటనే  వెళ్లిపోయాడు.

          “నేనుండగా అన్నయ్యగారు వచ్చి చపాతీలు చేయటం ఏమిటి! నేను చేస్తానులే!” అంది కూతురితో.

          “వద్దమ్మా.మామయ్య నన్నే చెయ్యనివ్వరు. నువ్వు వొత్తు లలితా నేను కాలుస్తాను అంటారు. ఆయనే పిలుస్తారు లే అవసరమైతే. ఆయన వచ్చేవరకు పనేమీ ఉండదు మనకి.” అంది లలిత.

          రమేష్ రూమ్ లోకి రావటం తో లేచి నిలుచున్న తల్లి తో “కావాలంటే కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా!” అనటం తో సీత తనకు కేటాయించిన రూమ్ లోకి వచ్చి తలుపు ఓరు గా వుంచి మంచం పై వాలింది.

          కూతురిని చూసి కుదుట పడ్డ మనసులో  మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి.

          ” తన ప్రయాణం తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  ఎప్పుడూ ఒంటరిగా గడప  దాటని తనను కూతురికి బావులేదని వియ్యంకుడు ఫోన్ చేయడం..వెంటనే  ఢిల్లీ కి ప్రయాణం అవమని భర్త అనడం జరిగింది. ఆ మాటకి గుండె గుభేల్మంది. “ఒక్కదాన్ని ఎలా వెళ్ళ గలను. మీరు కూడా రండి” అని అందామనుకున్న  మాట లోపలే  అణిచి పెట్టుకుని బయలుదేరింది. ఎందుకంటే అడిగితే ఏమంటాడొ తెలుసు. ” ఏం! ఆ మాత్రం వెళ్ళలేవా. నీ కెన్నేళ్ళు  నిండాయి. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇలా ఇంజినీరింగ్ చేసి అలా ఒంటరిగా అమెరికా  వెళ్ళిపోతున్నారు. నీకేం తీపి దిగేసింది. అయినా నోట్లో నాలికుందిగా. ముంగిలా మూసుకు  కూచోక తెలియనిది ఎవరినయినా అడుగు. మనం మహరాణిలా కూర్చుంటే కాదు. ఎవడూ నీ కాళ్ళ దగ్గరకొచ్చి నీకేం కావాలో చూసి చేయడానికి ఎవడికి పడుతుంది?… ఇలా  అర్ధం లేని సాధింపు సాగుతుంది.  అతని ధోరణి తనకి అలవాటైపోయింది. అందుకే ఏమీ అడగబుద్ధి కాదు.

          ఖర్మ కాలి దేనికయినా నోరు విప్పిందా “ఓహో!మా గొప్ప సర్వజ్ఞురాలివి.అన్నీ చెప్పేస్తావు. నోరుంది కదా అని మాట్లాడేయటం కాదు. బుర్ర ఉపయోగించాలి కాస్త మాట్లాడే ముందు” అంటూ ముదరకిస్తాడు.

          అందుకే కాపురానికి వచ్చిన కొద్ది రోజులకే భర్తా ,అత్తగార్ల తీరు అర్ధం చేసుకుని మౌనంగా ఉండి పోవటం, వాళ్ళు చెప్పింది ఏదో  చేసేయటం అలవాటు చేసుకుంది.  మరి అంతకు మించి  తనకి మరో  గత్యంతరం  లేదని  చెప్పిన మేనమామ మాటలు తూచా తప్పకుండా పాటించటం నేర్చు కుంది సీత.

***

          తల్లి, తండ్రి, ఐదేళ్ల సీత, మూడేళ్ళ సీత తమ్ముడూ అన్నవరం నుండి మొక్కు తీర్చుకు  ఆటో లో వస్తూ ఆటోని లారీ గుద్దేయటం తో రోడ్డు మీద ఎగిరి పడ్డారు.  సీత తప్ప అందరూ కన్నుమూయటం తో సీత దిక్కులేని పిల్ల గా మిగిలి, మేనమామ పంచన చేరింది.

          మేనమామ సౌమ్యుడయినా, భార్య గయ్యాళి. ఆమెకి  ఇష్టం లేక పోయినా అక్క కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి,  తన  ఇద్దరు ఆడబిడ్డలతో సమానంగా అభిమానించి పెంచి పెద్ద చేసాడు.

          సీత మేనమామ కూతురు లక్ష్మి సీత ఒకే వయసు వారు. చక్కగా పాడేవారు. తనకున్నంతలో చదువు, సంగీతం చెప్పించి ముగ్గురు ఆడ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన  రెండేళ్లకే కాన్సర్ తో అతను పోయాడు.

          అతని ఆర్ధిక స్థితీ అంతంత మాత్రమే. సొంత ఇల్లు కూడా లేదు. ఫామిలీ పెన్షన్ తో తాను బ్రతకటం కష్టమని అత్తయ్య హైద్రాబాద్ లో  ఉన్న పెద్ద కూతురు దగ్గరకి వెళ్ళి పోయింది.

          సీత భర్త సుందరానిది పెద్ద ఉన్న కుటుంబం కాదు.

          సుందరం తండ్రి మ్యూనిస్పల్ స్కూల్ లో టీచర్ గా చేసేవాడు. సుందరానికి రెండేళ్ల వయసులో తండ్రి కామెర్లు వచ్చి పోయాడు.  సుందరం తల్లి విశాఖపట్నం లోని తన పుట్టింటికి చేరింది. అక్కడే సుందరం డిగ్రీ చేసి తరువాత బీఈడీ  సెకండరీ స్కూల్ టీచర్  గా ఉద్యోగం సంపాదించుకున్నాడు. సుందరం తల్లి ఒక్కర్తే కూతురు కావటం తో ఆమె తండ్రి పూర్వీకుల ఇల్లు ఆమెకే వచ్చింది. తల్లీ తండ్రి పోయాకా ఆమెదే మొత్తం పెత్తనం అయిపోయింది.

          తండ్రి లేని పిల్లాడు అని అమ్మమ్మ, అమ్మ చేసిన గారం సుందరాన్ని ఏ మాత్రం అవగాహన లేని అహంకారిగా  తయారు చేసింది. అతని తాత పుణ్యమా అని చదువు అబ్బింది కానీ లేకపోతే వీళ్ళు చేసిన గారానికి సుందరం తుప్పలు పట్టేసే వాడు.

          ఆ  తాతే తమ పొరుగున ఉన్న సీతని చూసి ముచ్చటపడ్డాడు.  మేనమామ తో మాట్లాడి సీతని తన మనవడికి కట్ట బెట్టాడు. అలా  వచ్చి  ఈ ఇంట్లో పడ్డ సీత కి ఆ ఇల్లు, అందులో మనుషులు తప్ప మరో లోకం లేకుండా అయిపోయింది. తనని తలచి, పిలిచే వారుకూడా ఎవరూ లేకపోవడం కూడా అందుకొక కారణం.

          మేనమామ పోయాక  అతని భార్య కూడా సీతని పెద్ద గా ఎప్పుడూ దేనికి పిలవడం, ఆదరించటం చేయక పోవడం తో సీత  పురుళ్ళు  కూడా అత్త వారింట్లోనే పోసుకుంది. చిన్నపుడు కలిసి పెరిగిన కారణం గా మేనమామ కూతుళ్ళ తో తప్ప సీతకి మరి ఎవరితో సంబంధ బాంధవ్యాలు ఉంచలేదు సీత అత్తగారు, భర్తా! పెట్టు పోత, ముద్దు  ముచ్చట కు నోచు కోలేదు దిక్కు, మొక్కు లేని సంబంధం చేసుకుని  అంటూ ఎదో రకం గా  రెండు నెలల  క్రితం దాకా.. అంటే ఆవిడ ప్రాణం పోయే వరకు  సీతని మాటలతో దెప్పుతూనే ఉంది.

          పిల్లలు ఎదిగి వచ్చారు. కొడుకు  ఇంజినీరింగ్ అమెరికా లో  ఎంఎస్ చేస్తున్నాడు.

          కూతురు ఎం ఏ ఇంగ్లీష్ చేసింది. స్నేహితురాలి పెళ్లి లో చూసి పరిచయం పెంచుకున్న రమేష్   ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. అతను ఢిల్లీ లో ఎయిమ్స్ లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు.

          రమేష్ కి తల్లి లేదు . తండ్రి ఆర్మీ లో ఆఫీసర్ గా చేసి   రిటైర్ అయిపోయాడు. మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు.  ఆర్థికం గా స్థితిపరులు. రమేష్ ఒక్కడే కొడుకు. డబ్బు ఆశ లేని, సంస్కార వంతమైన కుటుంబం వారిది.

          ఉన్నంతలో పెళ్ళి బాగానే చేసాడు సుందరం.

          ఇదిగో ఇప్పుడు ఆ పిల్ల కే డెంగ్యూ  ఫీవర్ వచ్చిందని వియ్యంకుడు ఫోన్ చేస్తే సీత కూతురింటికి వచ్చింది.

***

          రమేష్ బయటకు వెళ్ళటం తో సీత , లలితా మళ్ళీ ఏవో మాటలలో పడ్డారు.

          ఎక్కువగా లలితే తన కొత్త కాపురం గురించి తన భర్తా, మామగార్ల  మంచి తనం గురించి చెబుతూ ఉంటే తన కూతురు అంత మంచి ఇంట్లో పడినందుకు సంతోషం తో  వింటూ ఉండి పోయింది సీత.

          ఇంతలో  శేఖరం వచ్చి సలాడ్, దాల్, సబ్జీ  చేసాడు.   వత్తి ఇస్తే చపాతీ లు చేయటం పూర్తయింది. నవ్వుల మాటలతో..  తొమ్మిదికల్లా డిన్నర్ చేయడం.. బెడ్ మీదకి చేరటం జరిగి పోయింది.

          కుటుంబంలో ఎవరి ఆసక్తులు వాళ్ళకి ఉండి, ఒకరినొకరు ప్రోత్సహించు కుంటూ, పరస్పరం ప్రేమాభిమానాలతో  ఒకరినొకరు గౌరవించుకుంటూ..ఒక సామరస్యమైన అవగాహనతో..సుహృద్భావం తో మసలుకునే ఇల్లు నిజం గా స్వర్గసీమ కదూ!   ఆ ప్రశాంత గృహ వాతావరణం సీతకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తన కూతురి అదృష్టానికి ఎంతగానో మురిసి పోయింది.

***

          రెండు  రోజు ల తరవాత లలితతో సీత

          “నేనిక్కడ చేయాల్సిన పనులు ఏమీ లేవమ్మా. ఇంట్లో పని చేసే వాళ్ళు వాళ్ళ పనులు చేసేస్తున్నారు. వంట మీ మామగారు, నీ భర్తా చేసేసు కుంటున్నారు. అల్లుడు గారు  డాక్టర్ కనక నీకు కావలసినవి అన్నీ అతనే చూసుకుంటున్నాడు. చాలా సంతోషం గా వుంది తల్లీ.

          అక్కడ మనింట్లో పరిస్థితి చూస్తేనేమో.. నేనిక్కడకి రాగానే పని మనిషి  వాళ్ళ నాన్నకి బావులేదని ఊరెళ్ళి పోయిందట.

          మీ నాన్న ఫోన్ చేశారు.ఎన్నాళ్ళు అక్కడ  మకామ్ అంటూ!”  అని అంది  సీత కూతురితో.

          “ఇక్కడి విషయాలు నువ్వేమీ ఆయనకు చెప్పకు అమ్మా. నేను మాట్లాడు తాను నాన్నతో. అయినా వచ్చిన రెండు రోజులకే ఎన్నాళ్ళు మకాం అంటా రేమిటి ఆయన? రెండు వారాలు కనీసం ఉండాలి నువ్విక్కడ.  ఆ లోపల నువ్వు వెళ్ళ వద్దు.  ప్లీజ్ అమ్మా! ” అని బ్రతిమాలుతున్న  కూతురి వైపు అభిమానం గా చూస్తూ ‘ అలాగే’

          అన్నట్లు తల పంకించింది సీత.

***

          తనూ, పని మనిషి ఉండి అన్నీ అమిర్చి పెడితే నే అస్తమానూ చిరు బుర్రు లాడటం, వస్తువులు, న్యూస్ పేపర్లు చిందర వందరగా పడేయటం ఏమైనా అంటే తాడెత్తున లేచి పోవటం, ఇంట్లో ఉన్నంత సేపూ  చెవులు పగిలిపోయే  సౌండ్ తో టీవీ పెట్టేయటం, రాత్రి పదకొండు అయినా టీవీ ఆపక పోవటం సీత కి ఇంట్లో తలనొప్పులు. రిటైర్ అయ్యాక మరీ ఇల్లు కదలటం మానేసి ఎదురుగా టీవీ, చేతిలో  మొబైల్. ఇక తనగది లో అత్తగారి టీవీ సీరియల్స్. పొద్దున మొదలెడితే టీవీ ఆవిడ రాత్రికి గానీ కట్టేది కాదు. ఈ రెండు టీ వీ ల గోల కి బుర్ర కాటెక్కి పోయేది సీత కి. కొంచెం కూడా ఎదుటి వారి అసౌకర్యాలని , అవసరాల్ని అర్ధం చేసుకునే సంస్కారం లేని మనుషులు అని ఓ నిట్టూర్పు విడిచి ఊరుకునే సీత కి ఈ ఇంట్లో నిశ్శబ్ద ప్రశాంత వాతావరణం ఎంతో సుఖం గా అనిపిస్తోంది.

          “ఏమిటమ్మా! ఎప్పుడూ ఏదో ఆలోచల్లోకి జారిపోతుంటావ్! నువు బాగా పాడే దానివి. ఓ పాట పాడు అమ్మా! చాలా రోజులయింది నీ పాట విని.” అంది గోముగా .

          చిన్న గొంతు తో “గోరంత దీపం కొండంత వెలుగు, చిగురంత ఆశ జగమంత వెలుగు” అనే తన కిష్టమైన సుశీల పాట పాడింది సీత.

          “అమ్మా!స్మూల్ అనే ఆప్ లో నువు పాడి రికార్డ్ చేసి చూసుకోవచ్చు నీ పాట ఎలా వచ్చిందో! నీకు నేర్పుతాను. నువు పాడి నీ రికార్డెడ్ సాంగ్స్ నాకు వాట్సాప్ లో పంపుతూ  ఉండు.”  అంది ఎలాగైనా తల్లిని తనకిష్ట మైనా పాటలు పాడించటం వైపు మళ్ళించాలి అని!

          తలూపి, నవ్వి ఊరుకుంది సీత.

          పట్టు బట్టి ఆ అప్ సీత మొబైల్ లో డౌన్ లోడ్ చేసి అది వాడటం నేర్పింది. ఎంతో ఆసక్తిగా నేర్చుకున్న పాటలు పాడి రికార్డ్ చేసి కూతురికి వాట్సాప్ చేయటం నేర్చుకున్న సీతకి తనకి నచ్చిన పని చేయటంలో ఇంత సంతృప్తి వుంటుందని  అంత వరకు తెలియని ఆమెకి ఈ అనుభవం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.

          ఆమెలో ఓ కొత్త అనుభూతి కలుగుతోంది.

          ఎండిన మానుపై వానజల్లు కురుసినట్టు..సొమ్మసిల్లిన దేహానికి చిరు గాలి తాకు తున్నట్టుంది ఆ జీవికి.

***

          వారం గడిచింది. సీత ఇంట్లో లేకపోవటం, పని మనిషి కూడా రాక పోవటం తో సుందరానికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ  కాఫీ అయినా కలుపుకోని, దగ్గర్లో ఉన్న రిమోట్ ని అందుకోడానికి కూడా బద్ధకిస్తూ సీతని కేకేసే సుందరానికి తన జీవితం లో సీత పాత్ర ఏమిటో తెలియరాసాగింది. అంతే కాదు తన నిర్వాకం కూడా తెలిసొస్తోంది. వుతకని బట్టలు, తాగి పడేసిన కాఫీ కప్పులు, వాడి వదిలేసిన గిన్నెలూ, హాలంతా చిందర వందరగా పడి వుండే న్యూస్ పేపర్లు, బెడ్ రూమ్ లో- మంచం మీద చిందరవందర చేసిన  బెడ్ షీట్స్ చూస్తుంటే ఇప్పుడతనికి చిరాకు వస్తోంది.

          తాను చిందరవందర చేసిన ఇంటిని సర్ది పెట్టే-  సీత వల్ల నీట్ గా వుండే పరిసరాల్లో ఉండటం, అడిగింది తడవుగా అన్నీ సీత అందించటం వలన వెతుక్కోవలసిన అవసరం ఉండక పోవటానికి అలవాటు పడ్డ ప్రాణం. ఇప్పుడు అన్నీ వెతుక్కోవలసి వస్తుండటం తో గిలగిల లాడి పోతున్నాడు.  పిలవగానే రాపోతే అరిచేసి, ఏదయినా ఇవ్వడం కాస్త లేట్ అయితే “అన్నీ సర్దేస్తావు. నా వస్తువు లెందుకు తీస్తావు” అని గయ్యి మనే సుందరానికి తన వస్తువులు చేతికి అందించకపోతే తన పరిస్థితి ఏమిటో అనుభవానికి వస్తోంది.

          వంట రాక,  బయట తినటం తో కడుపు లో మంటలు పుడుతున్నాయి.. ఆ తిండి ఎక్కటం లేదు అసలు. అనుకుంటూ యు ట్యూబ్ చూసి ఓ రోజు కుక్కర్ పెట్టాడు. న్యూస్ చూస్తూ కుక్కర్ లో నీళ్లు పోయడం మరిచిపోయాడు. కుక్కర్ సేఫ్టీ వాల్వ్ ఎగిరి పోయింది. అదే కనక సీత చిన్న పొరపాటు చేస్తే తానూ, తన తల్లి సీతని ఎన్నెన్ని మాటలు అనేవారో!  సువాసనలతో గుమ్మెత్తే తాలింపు ని కూడా ఆస్వాదించడం రాక, గోటెత్తిందని ఒకవైపు తను, దగ్గుతో చస్తున్నా నంటూ మరో వైపు తన తల్లీ ఆమెని వేధించి పడేసే వాళ్ళు మాటలతో. అమె కి ఏ దిక్కూ లేదని తెలిసినా ఇంట్లోంచి పొమ్మని ఎలా కసిరే వారో! పాపం! పిచ్చిది! ఎంత లా భరించిందని!! 

          రుచిగా వండిన వంటల్ని వొదలకుండా గుటకలేసుకుంటూ తినడం మాత్రం బాగానే వచ్చేది తల్లీకొడుకులకి.

          మొట్టమొదటి సారిగా సుందరానికి తను చేసిన తప్పు తెలిసొచ్చింది. 

***

          అదే రోజు సాయంత్రం-  పొరిగింట్లో కొత్తగా వచ్చి దిగిన బాంక్ మేనేజర్ చాలా కలుపుగోలు మనిషి.  డిన్నర్ కి ఆహ్వానించాడు.  తన ఇరవై అయిదవ పెళ్ళి రోజు అని.  పిల్లలు ఘనం గా చేస్తున్నారట. వాళ్ల టెర్రస్ పై రాత్రి డిన్నర్ అనిచెప్పి ఆహ్వానించాడు.

          పొరుగునే ఉండి వెళ్ళ క పోతే బావుండదు అని కాస్త నలత గా వున్నా వెళ్ళాడు. ఆ మేనేజర్ భార్యకి ఆక్సిడెంట్ అయి నాలుగేళ్లుగా వీల్ చైర్ కే పరిమితం అయిపోయింది. కానీ ఆ విషయమే పట్టనట్లు ఆ కుటుంబంలో భార్యా, భర్త, వారి కొడుకు, కూతురు, అల్లుడు చక్కగా జోకులు వేసుకుంటూ నవ్వు కుంటూ వచ్చిన వారందరినీ ఆప్యాయం గా పలకరిస్తూ ఉండటం చూసిన సుందరానికి సిగ్గేసింది.

          తను  ఇంటికి యజమానిని అనే అహంకారం తో భార్యని, పిల్లల్నీ  ఎంతసేపూ సూటి, పోటి మాటలతో ఆమడ దూరం లో నిలబెట్టి బాధించే తన తీరు తలపుకు వచ్చి మనసు సిగ్గుతో చితికి పోయింది.

          ఆ మేనేజర్, అతని భార్య ఆహూతులందరి ముందు తమ వైవాహిక జీవితం లోని ఒడిదుడుకుల  గురించి, సున్నితం గా  ప్రస్తావించి ఎన్ని ఆటు పోట్లు వచ్చినా తామిద్దరూ ఒకటిగా నిలబడి వాట్లన్నిట్నీ  దాటుకుని ఈ రోజు ఈ సంతోష తీరం చేరామని, శరీరాలు వేరయినా ఆత్మలు ఒకటి గా బతికే మని సగర్వంగా మాటల్లో చాటుతుంటే వింటున్న సుందరానికి జ్ఞానోదయం కాసాగింది. 

          తనని విజయ తీరాన్ని చేర్చటం లో వెనక ఉండి నడిపించిన తన భార్య పాత్ర ని ఆయన ప్రశంసిస్తుంటే, భార్య లేక పోతే తాను ఇవన్నీ సాధించ గలిగే వాడే కాదు అని చాటుతుంటే.. ఆ మాటలు  అతనిలో ఆత్మవిమర్శ కు పురి కొల్పాయి. 

          డిన్నర్ తరవాత ఇల్లు చేరిన సుందరం మనసులో అంతర్మధనం మొదలయింది. తన జీవితం లో సీత పాత్ర ఏమిటో అవగాహనకు అందుతోంది మెల్లిగా.

          మరో రెండు రోజులు గడిచాయి. ఆ రోజు ఉదయం తలనొప్పి, జ్వరం  తో  లేవ లేక పోయాడు. జ్వరం మాత్ర వేసుకుని కాస్త కాఫీ తాగేసరికి కడుపు లో తిప్పేసి తాగిన కాఫీ అంతా వాంతి అయిపోయింది. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి కాసేపు సోఫా లో కూలబడి లేచి డాక్టర్  దగ్గరకి వెళ్ళి , మందులు తెచ్చుకున్నాడు. రెండు రోజుల తరువాత జ్వరం తగ్గింది కానీ నీరసం వదల లేదు. ఏదో పడుతూ, లేస్తూ మరో రెండు రోజులు గడిపాడు.

          సీత వెళ్ళి పది రోజుల పైనే అయింది కానీ సుందరానికి పది యుగాలు లా గడిచింది ఆమె లేక పోవడం తో!

***

          ఆ రోజు ఉదయం కూతురు ఫోన్ చేసి, తల్లి  రెండు రోజుల్లో వచ్చేస్తుంది అని చెప్పింది.

          ఆ శుభవార్త తో సుందరం ముఖం వికసించింది.  లేని ఓపిక తెచ్చుకుని ఇంటి ని   ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు.  తనకి వచ్చినట్లు సర్దాడు. యు ట్యూబ్ లో చూసి, వుత కాల్సిన బట్టలు వాషింగ్ మెషీన్ లో వేసి ఆరవేశాడు. అన్ని గిన్నెలు ప్రిల్ వేసి తోమి గిన్నెల బుట్టలోపెట్టాడు. సీత వెళ్లిన దగ్గర నుండి వీధి గుమ్మం తుడుపు లేదు అనుకుంటూ వీధి గుమ్మం తుడిచి కాస్త నీళ్లు జల్లి,  చిన్న గీతలు  గీసాడు. సీత వేసే ముత్యాల ముగ్గులు ఒక్కసారి కళ్ళముందు మెదిలాయి. ఎంత కళకళలాడుతుండేవో.. ఏనాడూ ఒక్కసారైనా మెచ్చుకున్న పాపాన పోయాడా తను! ఒక్క సెకను..గుండె నొక్కినట్టైంది!

          స్నానం చేసి, దేవుడి మందిరం ముందు నిలబడ్డాడు.  సీత వెళ్ళినపుడు పెట్టి వెళ్ళిన పువ్వులే. వాడిపోయివున్నాయి. సీత మనసులానే. అవితీసేసి  దీపం వెలిగిస్తుంటే  పక్కనే షెల్ప్ లో ఉన్న   ‘ఓం నమ శివాయ మంత్రం ..’ ఇరవై నాలుగు గంటల చాంటింగ్  బాక్స్ కనిపించింది. అది పెట్టిన రోజు తాను ‘ఏమిటి కందిరీగల  రొదలాగ అని  సీత పై విసుక్కోవటం  గుర్తు వచ్చింది. అప్రయత్నం గా ఆ బాక్స్ తీసి స్విచ్ బోర్డ్ లో దాని ప్లగ్ పెట్టి ఆన్ చేసి మంద్రం గా మంత్రం వినబడేట్లు సరి చేసి, ఓ సారి హాల్ అంతా దృష్టి సారించాడు. రాగానే సీతకి కాస్త రిలీఫ్ కలిగేలా ఉండాలి ఇల్లు అనే తపన తో!

          అంతలో ఏదో స్ఫురించి నట్లు బెడ్ రూమ్ లో కి వెళ్ళి సీత అల్మారా లో ఉన్న తమ ఫామిలీ ఫోటో తెచ్చి హాల్లో  మూల ఉన్న టేబుల్ మీద పెట్టి “ఇన్నాళ్లూ మీ పట్ల నా ఆవేశ, కావేశాలు ప్రదర్శించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. వెరీ సారీ. ఇక పై అలా చేయను.” అని ఆ ఫోటో ముందు నిలబడి మనసులో అనుకోబోయి, పైకే అనేసాడు. తనకి తెలీకుండానే కళ్ళు తడిసాయి. కళ్ళు తుడుచుకుని,  సీతని తీసుకు రావటానికి  ఎయిర్ పోర్ట్ కి  బయలు దేరాడు.

***

          “పని మనిషి కూడా రావటం లేదు ఇల్లు ఎలా ఉంటుందో గజిబిజిగా  అనే బెంగతో ఇల్లుచేరిన సీతకు పర్వాలేదు అనిపించేలా హాల్, చిన్నగా వినిపిస్తున్న నమః శివాయ మంత్రం గొప్ప ఆశ్చర్యం తో బాటు మనసుకి కాస్త తెరిపి నిచ్చాయి. వాష్ రూమ్ కి వెళ్ళి వంటింట్లో కి వెళ్ళ బోయేసరికి అక్కడ స్టవ్ మీద పాలు వేడి చేస్తూ సుందరం – “కాఫీ నే చేస్తానులే. నువు కూచో” అన్నాడు.

          లోపల అణచుకోలేని ఆశ్చర్య మనిపించినా బయటకి ఏ భావం కనబడ నీయ కుండా కూచుని హాల్ పైకి దృష్టి సారించిన సీతకి గతం లో తాను ఏ చోటయితే  ఫామిలీ ఫోటో పెడితే తన మీద విరుచుకు పడ్డాడో అదే చోట ఆ ఫోటో పెట్టటం శాంతి స్థాపనకు సంకేతం లా తోచి మనసు లో మల్లెలు విరిసినట్లు అనిపించింది క్షణ కాలం.

          సుందరం రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి సీతకి ఓ కప్పు ఇచ్చి,  మరో  కప్పులో కాఫీ సిప్ చేస్తూ..”ఈ రోజు ప్రత్యేకత ఏమిటి చెప్పు” అన్నాడు.

          “ఏమో ” అంది.

          “ఆలోచించు” అన్నాడు.

          ఎంత ఆలోచించినా గుర్తు రాక “తెలియటం లేదు” అంది.

          ‘అవునులే! ఒకప్పుడు అవన్నీ చెరిపేసింది నేనే . అందుకే ఇప్పుడు మళ్ళీ నేనే గుర్తు చేస్తాను.’ అని మనసులో అనుకుని ..

          “ఈ రోజు తో మనకి పెళ్ళి అయి ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యాయి. ఈ రోజు మన వైవాహిక రజతోత్సవం. ఇన్నాళ్లూ నువ్వు నాకు అనుగుణం గా గడిపావు. కుటుంబాన్ని తీర్చిదిద్దావు. ఈ రోజు నీకోసం నేను నువ్వు ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా వున్నాను  సీతా. నీకేమి కావాలో చెప్పు. చేస్తాను.” అన్నాడు.

          సీత ఈ అనుకోని పరిణామానికి సంభ్రమం కలిగినా అతని తీరు తెలిసిన  మనిషి కావటం వలన పైకి నిర్లిప్తం గా “నాకేమి కావాలి. ఏమీ వద్దు”  అంది.

          “కాదు! ఇన్నేళ్ల లో నువు నన్ను ఎప్పుడూ ఏదీ అనలేదు. అడగ లేదు. ఈ రోజు నువు అడిగి తీరాలి. నీకేమి కావాలో. ఇది నిన్ను శాసించటం కాదు ఆర్థిస్తున్నాను.

          నిన్నెంత గా కట్టడి చేసి అమ్మా, నేను హింసించామో నాకు ఇప్పుడు తెలుస్తోంది. దానికి చాలా బాధ పడుతున్నాను. నన్ను క్షమించు. ప్లీజ్.

          నిజం గా అడుగుతున్నాను. ఈ రోజు నీ సంతోషం కోసం నన్ను ఏమి చేయమంటే అది చేస్తాను. నన్ను నమ్ము.” అని బతిమి లాడుతున్న భర్తను చూసి.

          “మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను ఈ రోజు అంతా టీవీ  పెట్టకండి. ఇంటినీ, నన్నూ ప్రశాంతం గా వుంచండి. చాలు. ” అని ఖాళీ కప్పులు తీసుకుని వంట గది వైపు  నిర్వికారం గా నడిచి వెళిపోతున్న భార్య వైపు చూస్తూ…

          “నువు నోరు విప్పి ఇది చేయండి అనటమే ఓ పెద్ద ఉత్సవం నాకు ఈ రోజు. ఈ ఇల్లు నీది కూడా. నీకు ఆశలు, అవసరాలు, ఆశయాలు ఉంటాయి అనే కనీసపు ఇంగితం లేకుండా అడిగే వాళ్ళు ఎవరూ లేరు, నీకు వెళ్ళటానికి మరో చోటు లేదు అని తెలిసీ అస్తమాను ఈ ఇల్లు మాది నువుపో.. అని అమ్మ ,నేనూ ప్రతి చిన్న విష యానికి నిన్ను అవమానించేం.

          నీ పాతికేళ్ల వైవాహిక జీవితం మా మూర్ఖత్వాల తో నరకం చేసాం.

          అయినా ఒక్కరోజు నువ్వు మమ్మల్ని నిందించ లేదు. నీ బాధ్యతలు విస్మరించ లేదు. వెన్న లాంటి నీ మనసును నా కరకు మాటలతో, చేతలతో రాయి లా మార్చేసాను. ఒకనాటి రాగాల కోయిల ని మూగ దానివి గా చేసేసాము మేము.

          నీలో స్పందనలు కలగడానికి నేను చాలా కృషి చేయాలి అని నాకిప్పుడు తెలుస్తోంది సీతా!

          అయినా ఎట్టిపరిస్థితి లో నా ప్రయత్నం మానను. ఏదో  ఒక రోజున నీ మనసుని  గెలుచుకుంటాను. ” అనుకుంటూ,  తన మాటలకి స్పందించకుండా వెళుతున్న భార్య  వైపు చూస్తుండిపోయాడు.

          రెండు వెచ్చని కన్నీటి చుక్కలు అతని చెంపల మీంచి జారుతున్నాయి.

          చేసిన పాపాలకు  కన్నీటితో నిష్కృతి దొరుకుతుందా!

కానీ,

          ప్రాణంపోయిన మనిషిలాంటిదే..నమ్మకం నశించిన మనసు కూడా!!

***

సావిత్రి రమణారావు పరిచయం :

నాగురించి…

Savitri Ramanarao

నా  పేరు –  ఆయాపిళ్ళ సావిత్రి.

జననం 1955

పుట్టింది అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్ లో..

తలి తండ్రులు : ( లేట్) గంటి వెంకట రమణయ్య, సుందరమ్మ.

భర్త : (లేట్ ) ఎ.వి.రమణ రావ్

విద్యార్హతలు: MSc physic s, Mphil, PG Dip Electronics

ఉద్యోగం: విశాఖపట్నం AVN కళాశాల లో భౌతిక శాస్త్ర విభాగంలో – విభాగ అధిపతి గా చేసి , 2013 లో రిటైర్ అయ్యాను.

కధలు, కవితలు రాయటం సరదా.

కొన్ని ప్రచురింపబడ్డా, అవి ఏవీ సేకరించి పెట్టు కోలేదు.

అసలు ప్రచురణ కి పంపటమే చాలా తక్కువ.

గృహ,ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ వీటికే టైం సరిపోయేది కాదు సర్వీస్ లో ఉన్నపుడు.

రిటైర్ అయ్యాక ఈ ఫేస్ బుక్  లోకి వచ్చాకా ఎదో రాసి మన గోడ మీద పెట్టటం  మొదలు  పెట్టాను.

ఆ రకం గా నా వ్రాతలు ఎక్కువ గా ఫేస్ బుక్ లో పెట్టినవే అయ్యాయి.

ఇది సరదా గా ఎంచుకున్నదే  అయినా, బాధ్యత మాత్రం మరవనిది.

ఇప్పటి వరకూ ఎన్ని రాసాను అన్నది ఖచ్చితం గా చెప్పలేను.

రాసుకున్నవి చాలా మట్టుకు పోయాయి రక రకాల కారణాల వలన.

అయినా  2015 నుండీ గజల్స్, ఫ్రీ వెర్సెస్, కొన్ని వృత్తలు, పద్యాలు, కధలు, మ్యుజింగ్స్ లా  వివిధ విషయాల పై నా భావాలు ఫేస్ బుక్ లో టపాలుగా వ్రాస్తూనే వున్నాను.

ఫేస్ బుక్ లో నేను Savitri Ramanarao అనే పేరుతో వ్యవహరింపబడుతున్నాను.

నేను భావుక, పొన్నాడ వారి పున్నాగ వనం, అ ఆ, మనకధలు మన భావాలు,అచ్చం గా తెలుగు, తెలుగు గజల్, తెలుగు దోహలు,గజల్ సాహిత్య వేదిక ఇంకా కొన్ని  గ్రూప్స్ లో నా రచనలు పోస్ట్ చేస్తుంటాను.

నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులకు, ఫేస్ బుక్ స్నేహితులకు, చదివి ఆదరిస్తున్న అభిమానులకు, ప్రోత్సహిస్తున్న నా వారందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభివందనములతో బాటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

*****

Please follow and like us:

5 thoughts on “కథామధురం-సావిత్రి రమణారావు”

 1. ఈ కథ ను ఇంత వివరం గా పాత్రల స్వస్రూప స్వభావాల ను విశ్లేషిస్తూ సమీక్షించిన తీర్జ్5 అద్భుతం దమయంతి గారు.

  పురుషులు ఎంత అహంభావం తో, భార్య లను నిరసన చేస్తారో..అలా చేసి, చేసి వాళ్ళ లో సందనలాంజ్8 చంపేస్తారో . కొందరు, తెలిసి, కొందరు తెలియక భార్యల పై ఈ రక మైన చిత్ర హింస అనాదిగా మన సమాజం లో కొనసాగుతున్నది. ఎప్పుడో చచ్చే ముందు వాళ్ళకి బుద్ధి వచ్చినా అప్పటికి మీరు అన్నట్లు జీవితంలో ఏ అనుభూతి అందని నిలువెత్తు సూన్యం గా మిగిలిన ఆ భార్య..కేవలం ఒక క ట్టె లా బిగుసుకి పోతుంది..మళ్ళీ కూయ మంటే గొంతు పెగ లదు ఆమెకు.
  గడచిన కాలం రాదు కదా.
  ఆమె కోల్పోయిన జీవితాన్ని ఆమెకి ఎవరూ తెచ్చి ఇవ్వగలరు..
  ఆ విషయం అద్భతం గా మీ సమీక్ష ప్రతి ఫలించింది.. మీరిలా నా కథ ఎన్నుకుని సమీక్షించి నందుకు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు, అభివాదములు అండీ

  1. 🙂 మీ ఈ స్పందన చూసి మురిపెమైంది పద్మావతి గారు.
   సావిత్రి గారు చూసి వుండరు. నేను inform చేస్తాను i తప్పక గుర్తుపడతారు. సంతోషిస్తారు.
   రచన చదివి మీ అమూల్యమైన హృదయ స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలండి..padmavati gaaru!
   పండగ శుభాకాంక్షలతో..

 2. సావిత్రిగారి ఫోటో ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. కింద వివరాలు చూసాక మా గురువుగారే అని తెలిసి ఎంతో ఆనందపడ్డాను. ఆవిడ రచయిత్రి అని తెలిసి మరింత సంబరపడ్డాను..
  ఆవిడకు నేను గుర్తు లేకపోవచ్చు కానీ నేను ఆవిడను ఎలా మరువగలను.
  మాట్లాడడానికి ఆవిడ ఫోన్ నంబర్ నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

Leave a Reply

Your email address will not be published.