చెక్కిన శిల్పం

(తృతీయ ప్రత్యేక సంచిక కథ)

-వడలి లక్ష్మీనాథ్

          “గోవా నుంచి అప్పుడే వచ్చేసావా? అనుకొన్న దాని కంటే ముందే వచ్చాసావు. బాగా జరిగిందా మీ బిజినెస్ ట్రిప్. ఫారిన్ డెలిగేట్స్ వచ్చారా?” ప్రశ్నల వర్షం కురిపించింది జయ.

          “వెళ్ళిన పని తొందరగానే అయిపోయింది. అందుకే తొందరగా వచ్చేసాను” చెప్పింది రమ్య నీరసంగా.

          “నాకోసమే దేవుడు నిన్ను పంపించినట్టు, నీ పని ముగించుకొని ముందే వచ్చేసావు. ఇక్కడ నాన్నగారు పడిపోయారు, చెయ్యి విరిగింది” చెప్పింది జయ.

          “అయ్యో! అలా ఎలా పడిపోయారు? ఇప్పుడు బాగానే ఉన్నారు కదా!” అడిగింది రమ్య.

          “ఎలా పడిపోయారో నాకూ అర్దం కాలేదు. ఒకరోజు సాయంత్రం వీణ పనికి ఇంటికి వచ్చేసరికి పడిపోయి ఉన్నారట.

          ఆయనను అడిగితే “నాకు గుర్తులేదు” అంటున్నారు. వెంటనే వీణ నాకు ఫోన్ చేసింది. నేను వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్ళేసరికి, తెలిసింది ఆయన భుజం దగ్గర ఎముక విరిగిందని. ఆ పడడంలో కాలికి కూడా దెబ్బ తగిలినట్టుంది, మంచం మీదే ఉంటున్నారు, ఏదో బాత్రూంకి వెళ్లి వస్తున్నారు గాని, మంచం నుంచి లేవటం లేదు” చెప్పింది.

          “అయ్యో! పెద్దాయనకి కష్టం వచ్చింది” అంది.

          “సమయానికి వీణ కూడా పనిలోకి రావడం మానేసింది. నాలుగేళ్ల నుంచి నా దగ్గర పని చేస్తోంది. ఏ ఒక్క రోజు పనికి రావడం మానేది కాదు. ఇంట్లో మనిషిలా కలిసి పోయింది. మోనుని స్కూల్ నుంచి ఇంటికి తీసుకు రావడమే కాదు, ఇంటిపని, సాయంత్రం వంటపని అన్నీ చేసి, ఇల్లు శుభ్రంగా ఉండేట్టు చేసేది. ఇప్పుడు ……
నాకు పరీక్షలు ఉన్నాయి, నేను రాలేను అక్క…… అని చెప్పి పని మానేసింది” చెప్పింది జయ.

          “పరీక్షలు అయిపోయాకా వస్తుందేమో” అంది రమ్య.

          “అలా అని చెబితే నేను సంతోషంగా ఒప్పుకొనే దాన్ని. మొత్తానికి రానని చెప్పింది. నేను కొత్త ఇల్లు కట్టుకున్నాక, దానికంటూ ఒక రూమ్ ఇచ్చి అందులో ఉంచుకుంటాం అని కూడా చెప్పాను. దానికి పెళ్లి కూడా నేనే చేస్తానని చెప్పాను. ఎన్ని చెప్పినా చివరికి అది నాకు చెయ్యి ఇచ్చింది” అంది రమ్య.

          “అయ్యో ! ఇప్పుడు పని ఎలా చేసుకొంటున్నావు? వేరే మనిషిని చూసుకున్నావా?” అడిగింది.

          “వీణ లాగా పనిచేసే మనిషి దొరకడం కష్టం. రమ్య! అది నీ మాట అయితేనే వింటుంది. కొంచెం దానికి నచ్చచెప్పి పంపించవా! మళ్లీ నాకు అలాంటి మనిషి దొరకడం కష్టం, ఇప్పుడు నేను వెతుక్కునే పరిస్థితుల్లో కూడా లేను” బ్రతిమాలింది జయ.

          “నేను ప్రయాణంలో బాగా అలసిపోయాను. చెప్పి చూస్తానులే” అంది విసుగ్గా రమ్య.

          “అది కాదే, నా పరిస్థితి అర్థం చేసుకో, నాకు వేరే మార్గం లేక నీకు ఫోనుచేస్తున్నాను” అంది జయ.

          “సరే “అంటూ ఫోన్ పెట్టేసింది రమ్య.

          జయ తన సమస్య వల్ల హడావిడిగా ఉంది, కాబట్టి సరిపోయింది. లేకపోతే తన గొంతులో ఉన్న బాధ కనిపెట్టి, వంద ప్రశ్నలు వేసేది.

          గోవా ట్రిప్ తలుచుకుంటేనే కళ్ళమ్మట నీళ్ళు కారుతున్నాయి రమ్యకి. వద్దన్నా అవే ఆలోచనలు…

          విదేశాల్లో తమ శాఖ విస్తరించాలని రమ్యకి ఎన్నో యేళ్ల కల. ఆ కల తీరడం కోసమే, బావ సంతోష్ తో పెళ్ళి కూడా వాయిదా వేస్తూ వస్తోంది.

          కల తీరే సమయంలో బాలాజీ ప్రవర్తన…….తలుచుకొంటేనే అసహ్యంగా ఉంది. ఇన్నేళ్ళగా బాలాజీని చూస్తూనే ఉంది. అతడు అలాంటి వాడని కొంచం కూడా అనుమానం రాలేదు.

          పడుకొందామని కళ్ళు మూసుకుంది. కానీ, జరిగిన విషయాలన్నీ ఒకటొకటిగా గుర్తుకు వస్తున్నాయి.

          బాలాజీ రమ్యకి ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్. అప్పుడు ఇద్దరి మధ్య అంత చనువు కూడా ఉండేది కాదు. ఇంజనీరింగ్ తర్వాత బాలాజీ ఎంబీఏ చదవడానికి వెళ్లిపోయాడు. రమ్య ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగంలో చేరింది. రమ్య ఉద్యోగంలో చాలా చురుకుగా ఉండడంతో తక్కువ సమయంలో, ఉన్నత స్థాయికి తొందర్లోనే చేరిపోయింది.

          స్వతంత్ర భావాలు కలిగిన రమ్య, ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం కలిగిన స్వభావం కూడా ఆమె ఉన్నత స్థాయికి చేరడానికి తోడయ్యాయి.

          అదే కంపెనీలోకి బాలాజీ హెచ్ ఆర్ కింద వచ్చాడు. రమ్యతో ఉన్న పూర్వ పరిచయంతో, రమ్య తెలివి తేటలు చూసి, “మనము ఇద్దరము ఇక్కడ ఎంత చాకిరీ చేసినా ఉపయోగం లేదు. నాకు స్టార్టప్ పెడదామని ఉన్నా, నీలాంటి వాళ్ళు దొరకక ఆగిపోయాను. నీ టెక్నికల్ నాలెడ్జ్ పెట్టుబడిగా మనిద్దరం కలిపి కంపెనీ పెడదాము” అడిగాడు.

          మొదటి నుంచి తనకి స్టార్టప్ కంపెనీ పెట్టి ఎదగాలనే కోరిక ఉన్నా, వెనక నిలబడి సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల బాలాజీ చెప్పిన దానికి వెంటనే ఒప్పుకొంది రమ్య.

          ఇద్దరు కలిసి ఒక కంపెనీ పెట్టారు. ఐదేళ్ల నుంచి ఇద్దరూ రాత్రనకా, పగలనకా కంపెనీలో పని చేస్తున్నారు. చాలా తొందర్లోనే కంపెనీ మంచి స్థాయికి ఎదిగింది.

          రమ్య ఒక స్థాయిలో ఎదిగాక పెళ్లి చేసుకోవాలని, పెళ్ళి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ “నేను ఎప్పటికైనా ఫారిన్లో ఈ కంపెనీ బ్రాంచ్ ఒకటి పెడతాను. అప్పుడు పెళ్లి చేసుకుంటాను” అంటూ దాటవేస్తూ వచ్చింది.

          బాలాజీతో కలిసి పని చేసినప్పటికీ, తన సొంత విషయాలు గోప్యంగానే ఉంచేది రమ్య. బాలాజీతో ఎంత వరకు చనువుగా ఉండాలో, అంత వరకే పరిమితంగా ఉండేది.

          “మన కంపెనీ బ్రాంచ్ అమెరికాలో పెట్టడానికి, అక్కడి నుండి మనుషులు వస్తున్నారు” అన్న బాలాజీ మాటలకి, ఇన్నాళ్ళకి తన కోరిక తీరబోతున్నదని ఆనందపడింది.

          వాళ్ళతో బిజినెస్ మీట్ హైదరాబాద్ లో కన్నా, గోవాలో ఒక రిసార్ట్లో అయితే బాగుంటుందన్న బాలాజీ సూచనతో అతనితో కలిసి గోవాకు వెళ్ళింది రమ్య.

          అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి బాలాజీ ప్రవర్తనలో చాలా మార్పులు గమనించింది రమ్య. ఒక మగవాడు ఆడదాన్ని ఏ దృష్టితో చూస్తున్నాడు అన్నది ఆ ఆడదానికి మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది. అప్పటి దాకా బాలాజీలో చూడని రంగులు, అప్పుడప్పుడు కొత్తగా కనిపించడం మొదలయ్యాయి రమ్యకి. కొత్తగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం, ఎక్కువ సాన్నిహిత్యంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. అతని పట్ల తనకున్న అయిష్టాన్ని ప్రవర్తన ద్వారా చూపిస్తూనే ఉంది రమ్య.

          అమెరికా నుండి వచ్చిన వారి ఏర్పాట్లతో బిజీగా ఉండి, “ఈ ఒక్క రోజు గడిస్తే, వచ్చిన వాళ్ళు వెళ్ళి పోతారు. తర్వాత బాలాజీతో అతని ప్రవర్తన గురించి విభేదించాలి” అని గట్టిగా నిశ్చయించుకుంది.

          అనుకొన్నట్టుగా ఆ రోజు ఫారిన్ డెలిగేట్స్ మీటింగ్ బాగా జరిగింది. ఆ జరిగిన కార్యక్రమాన్ని రమ్య తన లాప్టాప్ లో రికార్డు చేస్తోంది. అందరూ వెళ్ళిపోయాక, బాలాజి రమ్యకి దగ్గరగా వచ్చి వెనకనుంచి భుజం మీద చెయ్యివేసాడు.

కంగుతింది రమ్య.

          ” కంగ్రాట్యులేషన్స్ రమ్య! ఇన్నాళ్ళకి నీ కల తీర బోతోంది. ఎప్పుడూ పనేనా రమ్య! మనం ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు కదా మనకి ఏకాంతం దొరికింది. దీని కోసమే నేను ఇక్కడ దాకా వచ్చాను. బహుశా నీ మనసులో కూడా ఇదే ఉండి ఉంటుంది” అన్నాడు.

          అప్రమత్తమైన రమ్య, బాలాజి నుండి విడిపించు కొంటూ
“బాలాజీ! నేనెప్పుడూ నీ గురించి అలా అనుకోలేదు. దయచేసి కొంచెం దూరంగా నిలబడు” అంది.

          “మన ఇద్దరి తెలివితేటలు, చదువు రెండు కలిపితే, మనము ఇంకా ఎన్నో ఇలాంటివి బ్రాంచీలు తెరవగలుగుతాము, గొప్పగా ఎదగ గలుగుతాము. నువ్వు నా సొంతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను” అన్నాడు.

          ” పిచ్చి వేషాలు వేస్తున్నావా! నీకు భార్య పుట్టబోయే పిల్ల ఉన్నారు” అన్నది.

          “అదే అసలు సమస్య రమ్య! భార్య ఉందన్న మాటే కానీ, గర్భవతినని, అనారోగ్యం అని ఆమె వల్ల నాకు సుఖము లేదు. కాలేజీలో ఉన్నప్పటి నుంచే నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ, చెప్పే అవకాశం నువ్వు ఇవ్వలేదు. అందువల్ల పెద్దవాళ్ళు చెప్పారని ఆమెను పెళ్ళి చేసుకున్నాను. నీ మనసులో ఏముందో కూడా నాకు ఎప్పుడూ చెప్పలేదు. కానీ, నువ్వు పనిచేసే తీరు, మన ఇద్దరి కలయికలో మనం సాధిస్తున్న అద్భుతాలు చూసాక, ఇద్దరం కలిసి ఉంటే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతాము అనిపించింది. నువ్వు కూడా పెళ్ళి గురించి ఏమీ ఆలోచనలో ఉన్నట్టు లేవు. నీ స్థానం నీకే ఉంటుంది రమ్య! నీ తర్వాతే ఎవరైనా. కావాలంటే ఆమెను వదిలేస్తాను” చెప్పాడు.

          అప్పటికే చాలా దగ్గరగా, రమ్యకి ఊపిరాడ లేకుండా గట్టిగా పట్టుకొన్నాడు. పెదాలతో, పెదాలను అందుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. రమ్య ఎక్కడ లేని ఓపిక తెచ్చుకుని, అతని నుండి విడిపించు కొని, తన సామానులు పట్టుకుని హైదరాబాదు బయలుదేరి వచ్చేసింది.

          ఆలోచనల్లో ఉండగానే కళ్లల్లో నుంచి నీళ్లు జారి మీద పడ్డాయి. తను ఎంతో ఇష్టపడి చేసి పెంచుకున్న మొక్క లాంటి కంపెనీ, ఇప్పుడు వృక్షము అవుతోంది. ఇప్పుడు అలాంటి కంపెనీని తను వదులుకోలేదు. ఇన్నాళ్లు ఇలాంటి మనిషితో కలిసి పని చేసినా, ఇకముందు అతనితో కలిసి పని చేయలేదు. తను కోరుకున్న స్థాయికి వచ్చిన కంపెనీ… ఇప్పుడు వదులుకొని ఒట్టి చేతులతో బయటకి రాలేదు. ఎటు ఆలోచనలు తెగడం లేదు రమ్యకి.

          జయ నుండి మెసేజ్ రావడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చింది రమ్య.
“వీణతో మాట్లాడావా?” అని మెసేజ్ పెట్టింది.

          వీణకి ఫోన్ చేసింది రమ్య. వీణ ఫోను వాళ్ళ అమ్మ మంగమ్మ తీసింది, “వీణ లేదమ్మ, కాలేజీకి వెళ్ళింది” చెప్పింది మంగమ్మ.

          “వీణ, జయ వాళ్ళింట్లో పని మానేసిందట” అడిగింది రమ్య.

          “అవునమ్మా! సర్కారి నౌకరికి తయారవు తున్నానని చెప్పింది. అందుకని, జయక్క వాళ్ళింట్లో పని చేయడానికి కుదరదని చెప్పింది” చెప్పింది మంగమ్మ.

          “ఆమె ఇంట్లో పని చేయడం వల్ల వచ్చిన డబ్బుతోనే వీణ చదువుకుని, ఇంత స్థాయికి వచ్చింది. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు వదిలి పెట్టడం న్యాయం కాదు కదా! కనీసం, వేరే పని మనిషి దొరికే వరకైనా వెళ్ళమని చెప్పకపోయావా” అంది రమ్య.

          “చెప్పి చూశానమ్మా! వినట్లేదు ” అంది మంగమ్మ.

          “కాలేజీ నుంచి రాగానే ఇంటికి రమ్మని చెప్పు. ఈ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను” చెప్పి ఫోన్ పెట్టేసింది రమ్య.

          వీణ తల్లి మంగమ్మ తన దగ్గర పని చేసేది. ఆ రోజుల్లో వీణ టెన్త్ క్లాస్ పరీక్షలు అయిపోగానే చదువు మాన్పించి ఇంటిపనికి తీసుకుని వచ్చేది. వీణకి చదువుకోవాలనే ఆసక్తిని గమనించిన రమ్య, “వీణ చదువులో చురుకైన పిల్ల. అలాంటి పిల్లను చదువు ఎందుకు మానిపించావు” అని అడిగింది .

          దానికి మంగమ్మ, “చాన అప్పులైనాయి, ఇప్పుడు ఈమె కష్టపడి సంపాదిస్తే గానీ ఇల్లు గడవదు. అమ్మా! ఇంకా ఈమెని చదివించే పరిస్థితి మాకు లేదు” అని చెప్పింది.

          అప్పుడు మంగమ్మను ఒప్పించి, వీణకు కావాల్సిన బట్టలు, పుస్తకాలు అన్ని ఇస్తూ, జయ వాళ్ళ ఇంట్లో పనికి కుదిర్చింది. అప్పటి నుండి వీణకి రమ్యమాట అంటే చాలా గురి. రమ్య ఎలా చెబితే అలా వింటుంది.

          వీణను తన వారసురాలిగా తయారు చేసింది. ఒక ఆడపిల్లగా బయటకు వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమస్యను దైర్యంగా ఎలా ఎదుర్కోవాలి వంటి విషయాలను వివరించేది.

          కాలింగ్ బెల్ చప్పుడుకి రమ్య ఉలిక్కిపడి, లేచి తలుపు తీసింది. వీణ వచ్చింది. ఇద్దరూ బాగోగులు మాట్లాడుకున్న తరువాత రమ్య, వీణతో,

          “జయక్క వాళ్ళింట్లో పని మానేసావా? ఈరోజు నువ్వు చదువుకుంటున్నా, బట్టలు కొనుక్కుని ఎవరి మీదా ఆధారపడకుండా బతుకుతున్నా, జయ దగ్గర పని చేయడం వల్లనే కదా!” అంది.

          “జాబ్ కోసం చదువు కొంటున్నాను. అందుకని జయక్క వాళ్ళింట్లో… ” నీళ్ళు నమిలింది వీణ.

          “ఇన్నాళ్లూ పని చేసుకొంటూ చదువుకొన్నావు కదా! అక్క నీకు ఏమి లోటు చేయలేదు. అంత మంచి ఇల్లు వదులుకుంటే, నీకు ఉద్యోగం దొరికేదాకా ఖర్చులకు డబ్బులు ఉండాలి కదా! ఎలాగోలాగా సర్దుకునే అక్క వాళ్ళింట్లో పని చెయ్యి” చెప్పింది రమ్య.

          “జయక్క వల్ల నాకు సమస్య లేదు” మాటల్లోనే కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంది వీణ.

          ” వెళ్లి పనిచేసుకో. నేను చెబుతున్నాను, వేరే మనిషి దొరికేవరకు” అంది రమ్య.

          ” అక్కా! నాకు నువ్వు జీవితాన్నిచ్చావు, ధైర్యాన్నిచ్చావు. నీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర చెప్పగలను” అంటూ అక్కడ జరిగిన విషయాన్ని చెప్పసాగింది వీణ.

          “అక్కా! నీ దగ్గర దాచడానికి ఏమీ లేదు.

          నువ్వు చెప్పినట్టు జయక్క వల్లనే నేను ఇంత వరకు చదువుకోగలిగాను. నేను కూడా సొంత చెల్లెలాగా ఆ ఇంట్లోపని నా పని అనుకునే చేసాను. కానీ, వాళ్ళ నాన్న ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు సమస్య ఎదురయింది.

          నీకు తెలుసు కదా అక్క! నేను రోజూ వెళ్ళగానే నా మొబైల్ లో పాటలు పెట్టుకుని నేను పనులు చేసుకునేదాన్ని.

          నేను వంట చేస్తున్నంతసేపు ఆయన నా దగ్గరే తిరిగేవాడు. వంటింటి చుట్టు పక్కలే ఉంటుండేవాడు. పెద్దాయన అనుకునేదాన్ని. అనవసరమైన ప్రశ్నలు అడిగేవాడు. మన ఇంట్లో పెద్దవాళ్ళలాగా, ఆయనకే మనవరాలుగా అనుకునే సమాధానాలు చెప్పేదాన్ని.

          ఒక రోజు అది ఆసరాగా తీసుకుని నన్ను వెనక నుంచి ఒడిసి పట్టుకున్నాడు, పెట్టకూడని చోట చేతులు పెడుతూ. నేను విడిపించుకుని నువ్వు ఇచ్చిన ధైర్యంతో” మాట్లాడడం ఆపేసింది వీణ.

          “చెప్పు వీణా” లాలనగా అడిగింది రమ్య.

          “అక్క నేను ఆయన్ని ఒక్క తన్ను తన్ని, నా చేతిలో రొట్టెను చేస్తున్న కర్రతో భుజం మీద రెండు కొట్టాను.

          అంత బాధలోనూ వాడు నా కాళ్ళు పట్టుకున్నాడు “అమ్మాయికి చెప్పకు. నాకు ఈ మాత్రం ఆసరా కూడా దక్కదు” అని.

          ” ఇంకెప్పుడూ ఎవరి జోలికి వెళ్లకు. నా దగ్గర మొబైల్లో నీ వీడియో అంతా రికార్డయింది. ఇది నీ కూతురుకి చూపిస్తానని బెదిరించాను” అంటూ ముగించింది వీణ.

          “జయక్కకి ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోయావా? రానని మానేయడం ఎందుకు?” అడిగింది రమ్య.

          ” డబ్బు లేని వాళ్ళని ఎవరు నమ్ముతారు. ఆడపిల్లలు ఎవరిమీదైనా నెపం వేస్తే, డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ….అంటారు. నేను నిజము చెప్పినా, ముసలాయన కూతురు దగ్గర ఒప్పుకోడు. వాడి కళ్ళ ఎదురుకుండా నేను మానేసి, కూతురు కష్టపడుతుంటేనే వాడికి పశ్చాత్తాపము వస్తుంది. జయక్క మంచితనానికి తప్పకుండా మనిషి దొరుకుతుంది. తప్పు చేసినవాడు, ఇంకెప్పుడూ ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా, వాడికే శిక్ష వేసాను…..ఇదంతా నువ్వు ఇచ్చిన స్ఫూర్తి తోనే” అంటూ సెలవు తీసుకుంది వీణ.

          వీణ వెళ్లిన వైపుకు చూస్తున్న రమ్యకు మనసులో ఎక్కడో గర్వంగా ఉంది. తాను చెక్కిన శిల్పం, తనకు నేరానికి తగిన శిక్ష ఎలా వేయాలో వివరిస్తూ ఉంటే తను ఎందుకు ఇంత బేలగా ఆలోచిస్తోంది.

          ఆలోచనతోనే కొత్త ఉత్సాహం వచ్చిన రమ్య, లాప్టాప్ తీసి గోవాలో జరిగిన మీటింగ్ తో పాటు , రికార్డు అయిన బాలాజీ ప్రవర్తన వీడియో బాలాజికి పంపుతూ” నీ అంతంట నువ్వు కంపెనీ నుండి రిసైన్ చేసి వెళ్లిపో…..లేకపోతే ఇది నీ భార్యకు, మరియు పోలీస్ స్టేషన్ కి పంపి నీ మీద కేసు పెడతాను” అని.

          వెంటనే బాలాజీ నుండి రిప్లై వచ్చింది ” ఏదో పొరపాటు అయిపోయింది. మళ్ళీ ఇలాంటివి జరగవు. ఇద్దరం కలిపి పెంచిన కంపెనీ. అలా ఎలా వదిలి వెళ్ళిపోతాను” అని జవాబిచ్చాడు.

          “నువ్వు మర్యాదగా తప్పుకొంటె సరే. లేకపోతే నేను ఆధారాలతో కేసు పెడితే… మళ్ళీ నీకు ఉద్యోగం కూడా రాదు” అని మెసేజ్ పెట్టింది.

          అరగంటలో బాలాజీ నుండి రాజీనామా ఉత్తరం వచ్చింది. రమ్య బావకు ఫోన్ చేసి, “నేను అనుకొన్నట్టు నా కంపెనీ విదేశాల్లో బ్రాంచి పెడుతున్నాను. తొందరలో ముహూర్తం చూడమను. ఇద్దరూ కలిసి వెళదాము” అని.

                                                                    (సమాప్తం)

*****

Please follow and like us:

One thought on “చెక్కిన శిల్పం (తృతీయ ప్రత్యేక సంచిక కథ)”

  1. చెక్కిన శిల్పం కధ చాలా బాగుంది. ఈనాటి ప్రతి అమ్మాయి తప్పక చదవాల్సిన కధ. నీ కలం బాగా చెక్కిన కధ ఇది లక్ష్మీ నాధ్

Leave a Reply

Your email address will not be published.