దీక్ష

(తృతీయ ప్రత్యేక సంచిక కథ)

-లలిత గోటేటి

 

          సమయం  సాయంత్రం నాలుగు గంటలు అయింది. అనుకున్నట్టుగానే డ్రైవర్ రాజు వచ్చేశాడు. నేను విజయనగరం వచ్చి  ఇరవైనాలుగు  గంటలు గడిచింది.నిన్న రాత్రి  జరిగిన నా కజిన్ కూతురు పెళ్లి కి వచ్చాను. నిజానికి పెళ్లి కంటే శాంతిని చూడాలన్నదే నా కోరిక. విజయనగరంలో పెళ్లి అనగానే నా మనసు ఎగిరి గంతేసింది. జీవితం ఎంత పొడుగ్గా సాగి నా, ఎన్ని పొంగులూ,  కుంగులూ  చూసినా,   జీవితపు శుభారంభంలో  ఉషోదయంలా వెలిగిన   బాల్యానందపు అనుభవాలు నన్ను నిలువనీయ లేదు. తొమ్మిదవ తరగతి వరకూ విజయనగరం  జడ్  పి  హైస్కూల్ లో నాతో చదువుకున్న నా బాల్య స్నేహితురాలు శాంతిని కలుసుకోవాలనీ , నేను చదువుకున్న స్కూల్ ను చూసి రావాలనే బలమైన కోరిక ముప్ఫై ఏళ్ల తరవాత  ఈ రోజు తీరబోతోంది. 

          బంధువులకు వీడ్కోలు చెప్పి కారులో కూర్చున్నాను.కారు పది నిమిషాల్లో జడ్ పి  హైస్కూల్ ముందు ఆగింది. స్కూల్ లోకి అడుగుపెట్టాక జ్ఞాపకం వచ్చింది ఆ రోజు ఆదివారం అని. తరగతి గదుల్లోకి వెళ్లాలనే నా ఆశ నెరవేరలేదు. ఆదివారం కావటం చేత ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంది. సాయంత్రపు ఎండ వెలుగులో స్కూలు ఆవరణం అంతా  తిరుగుతూ చూస్తున్నాను. వాచ్ మేన్ కూడా కనపడలేదు. స్కూలుకు వెనుక వైపు గా నడిచాను. ఇక్కడే శాంతి, బంతి గోరింట మందార మొక్కలను తెచ్చి వేసేది. రోజూ సాయంత్రాలు నీళ్ళు పోసేది. .                    

          “అబ్బ శాంతీ ! రావే స్కూలు వదిలి అరగంట దాటింది.పిల్లలంతా వెళ్ళిపోయారు.” అని తాను విసుక్కునేది. “కాస్త ఆగవే కుసుమా! పాపం ఈ చిన్న మామిడి మొక్కకు కూడా  నీళ్లు  పోసి వస్తాను” అనేది. ఇదో పిచ్చిది అనుకునేదాన్ని.  శాంతి చామన ఛాయ రంగులో సన్నగా పొడుగ్గా ఉండేది. ముఖం ఎప్పుడూ నవ్వుతూ, ప్రసన్నం గానే ఉండేది. ఆఫీసులో, స్టాఫ్ రూమ్ లో, లైబ్రరీలో ఎవరికి ఏ అవసరం వచ్చినా  అందరూ  పిలిచే పిలుపు శాంతి.                   

          “ అమ్మా  శాంతీ !  కొత్త పుస్తకాలు వచ్చాయి, సర్దాలి అని లైబ్రేరీ మాస్టారు పిలిస్తే, ముఖం చిట్లించుకున్న నన్ను  చూసి నవ్వేది. “నువ్వు ఇంటికి వెళ్ళు కుసుమా ! నేను ఒక అరగంటలో వస్తాను.” అనేది.  ఓ వర్షపు సాయంత్రం ఇరువురం  స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ ఉంటే, తన పుస్తకాల సంచి నీటి గుంటలో పడి పోయింది. సంచిలోంచి పుస్తకాలను తీసి, అట్టలను ఊడదీసి గాలికి ఆరబెట్టింది  శాంతి. నీటికి నాని అలుక్కు పోయిన  నోటు  పుస్తకాలు చూసి తాను ఏడుస్తూ ఉంటే,” ఎందుకే చిన్నదానికి ఏడుస్తావు? ఇరవై పేజీలే  గా నేను రాసి పెడతానులే  అనేది.              

          వేసవిలో   ఆఖరి పరీక్ష రాసి ఇద్దరం వేప చెట్టు కింద కూర్చున్నాం.        

           చెట్టు అంటే నాకు ఇష్టం , చెట్టు నా ఆదర్శం కుసుమా!  చూడు ఎంత బావుంటుందో, చెట్టు ఒక పెద్ద  ఇల్లు అనిపిస్తుంది నాకు” అంది శాంతి     

          తల పైకెత్తి చూసాను. శాంతి మాటలని వింటూ ,పచ్చగా గుబురుగా ఉన్న కొమ్మల్లో కూర్చున్న జెముడు కాకి, అటూ ఇటూ పరిగెడుతున్న ఉడుతలు,గోరింక పిట్టలు ,కౌజు పిట్టలూ  సందడి చేస్తున్నాయి. బలంగా ఒంపు తిరిగిన కొమ్మలతో ఆకాశం వైపు  తలెత్తి చూస్తున్నట్టున్న  ఒక మహా వృక్షపు అస్థిత్వాన్ని మొదటిసారి చూస్తున్నట్టు ఉంది నాకు.  

          “చెట్లను ఎన్ని సార్లు చూడలేదు తానూ ?  కానీ నిజంగా చూడలేదు. ఇది వేప, ఇది కొబ్బరి, ఇది మామిడి  అనే పేర్లతో మాత్రమే చూసింది. ఒక చెట్టును పూర్తిగా నగ్నంగా చూసిన క్షణాలు ఇవే అనిపించింది నాకు. పచ్చని ఆకులతో, కమ్మని పరిమళంతో ఉన్న వేపపూల గుత్తులతో బహుముఖంగా విస్తరించిన ఒక  నిశ్శబ్దపు చైతన్యాన్ని, దానిలో  నిగూఢంగా ఉన్న ఒక భావాన్ని ఒక సందేశాన్ని శాంతి నాకు చూపించింది.   

          కొద్ది క్షణాలు గడిచాయి. “పెళ్లి కుదిరిపోయింది నాకు.” అంది శాంతి .    

          నీకు పెళ్లా?  అప్పుడే ? ఇంకా  పధ్నాలుగు సంవత్సరాలేగా “ అడిగాను ఆశ్చర్యంగా.    

          శాంతి మాట్లాడలేదు.  “ ఎవరు?”    అడిగాను.  

          “నాన్నగారి స్నేహితుని కొడుకు డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నారు, పేరు ఈశ్వర్ రావు గారు.”  తండ్రి కి సీరియస్ గా ఉందట, నాన్న దగ్గర పెళ్లి చేస్తానని మాట తీసుకున్నారు” అంది ముఖంలో ఏ భావమూ ప్రకటించకుండా.     

          నాకు ఏదో తెలియని దిగులు కలిగింది. “శాంతీ !మా నాన్నగారికి కూడా విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది.         

          శాంతి నా చెయ్యి పట్టుకుంది. “కుసుమా! మనం ఉత్తరాలు  రాసుకుందాం” ఎప్పటికీ ఇలా స్నేహంగానే ఉందాం” అంది.       

          స్కూలుకు ఉత్తరం వైపు నడిచాను. శాంతి అక్కడే మామిడి మొక్కకు నీళ్ళు పోసేది. ఒక్కసారిగా ఆనందంతో పులకించిపొయాను. ముప్ఫైఏళ్ల నాటి ఒక లేత మొక్క ఇప్పుడు  ఒక మహా  వృక్షం అయ్యింది.ఎత్తుగా బలంగా పెరిగింది. మామిడి పిందెలు గుత్తులుగా వేలాడుతున్నాయి. చెట్టు ని స్పృశిస్తూ కొద్ది క్షణాలు అలాగే చూస్తూ నిలబడ్డాను.       

          కారు హారన్ మోగింది. అప్పుడు గుర్తొచ్చింది, రాజు బయట వెయిట్ చేస్తున్నాడు అని. గబగబా వెళ్ళి కారులో కూర్చున్నాను.    

          “డైరెక్టుగా వీరసాగరమే కదూ   మేడంగారు?”   

          “అవును రాజూ! .”  కదులుతున్న కారులో నుంచి స్కూలును  మరొకసారి చూశాను.  కారుడోర్ వేసినప్పుడు చేతికి ఉన్న పచ్చ గాజులు గల గల మన్నాయి.   

           ”పాలమీగడ లాంటి తెల్లని మెత్తని చేతికి ముదురు ఆకుపచ్చ రంగు గాజులు ఎంత బాగుంటాయో, అనేది శాంతి. అంతటితో ఊరుకోకుండా నా అందాన్ని  పొగిడేది. మెడలోని ముత్యాల హారాన్ని,  చెవికి ఉన్న బుట్టలోలకులు , ముత్యాల్లాంటి పలువరస, సొట్టలు పడే బుగ్గలను చూడకుండా ఎవరూ ఉండలేరు, నవ్వితే నీ ముఖం ఎంత బావుంటుందో అనేది.    

           “ఆపవే బాబు నీ  కవిత్వం”   అనేది తాను.

          కారు హారన్ మోగడంతో జ్ఞాపకాల నుంచి బయట పడ్డాను.   

          ఎంత సమయం పడుతుంది రాజూ?     

          నలభైఆరు కిలోమీటర్లు మేడంగారు .  వీరసాగరం చిన్న ఊరండి, ఎక్కడికి వెళ్లాలి మీరు ?      

          శాంతి అని నా చిన్ననాటి స్నేహితురాలు, భర్త పేరు ఈశ్వరరావు గారు.అన్నాను .   

          అడ్రస్ తెలియకుండానే బయలుదేరాను . తనకేదో ప్లెజెన్ట్ సర్ ప్రైజ్ ఇద్దామని.  నా క్లాస్మేట్  పద్మ ,శాంతి ఫోన్ నెంబర్ ఇచ్చింది కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. శాంతి ఉండేది ది వీరసాగర మేనని భర్తతో కలిసి వ్యవసాయం చేస్తోందని చెప్పింది పద్మ. కొంతకాలం నాకూ  శాంతికూ మధ్య ఉత్తరాలు సాగాయి. పెళ్లి అయి తాను చెన్నైకి వెళ్లిపోయాక శాంతి గురించి ఏమీ తెలియదు  పద్మ చెప్పడమే.    

          “ మేడం మీరు చెప్పేది దీక్ష శాంతి గారి గురించేనా ?    

          అయోమయంగా  అవునన్నాను.   

          “ శాంతి గారు   తెలియనివారు ఈ  చుట్టుపక్కల ఎవరూ లేరండి, నాది రాజమండ్రి గానండీ,  మా బావమరిది ఉండేది  బాడంగి లోనే నండీ. ఆయన భార్య సుశీల గారిని చదివించింది శాంతిగారే నండీ . బాడంగి రైతు జట్టు ఆఫీసులో సుశీల పనిచేస్తారండి.       

          “ వీరసాగరానికి బాడంగి ఎంత దూరం?” అడిగాను.   

          ఎంతండీ!  ఏడు కిలోమీటర్లు .    

          “అయితే రాజూ ! మనం ముందుగా బాడంగి  వెళ్దాం ఆమె అక్కడ ఉండవచ్చు.  

          కారు బాడంగి చేరింది.” దీక్ష విమెన్ వెల్ఫేర్ సొసైటీ  అన్న బోర్డు ఉన్న ఒక రేకుల షెడ్డు ముందు ఆగింది.    

          శాంతి గారి కోసం వచ్చామని చెప్పాడు రాజు. అక్కడ ఉన్న యువతిని సుశీల గా పరిచయం చేశాడు రాజు.    

          “మీరు వచ్చే ముందే శాంతి గారు వీరసాగరం  వెళ్లారండి, ఫోన్ చేయమంటారా?   

          వద్దన్నాను. అక్కడ మరో నలుగురు ఆడపిల్లలు బెల్లంతో చేసిన నూ పప్పు ఉండలను, పూతరేకులను, ములగ ఆకు, ఇంకా ఇతర ఆకులతో చేసిన పొడులను ప్యాక్ చేస్తున్నారు.కోల్డ్ స్టోరేజ్ లో ఉంచిన రకరకాల వ్యవసాయ ఉత్పత్తులను చూపించింది సుశీల.  రాజు తనను శాంతి  స్నేహితురాలిగా పరిచయం చేశాడు.   

          శాంతి ఆర్గానిక్ పంటలు  పండిస్తోంది అనీ ఆమె నాయకత్వంలో సుమారు నాలుగు వందల  మంది రైతులు మూడు వేల ఎకరాల్లో సాగుబడి చేస్తున్నారని, వారిలో వంద మంది మహిళలు కూడాఉన్నారని చెప్పింది సుశీల. 

          “అయితే శాంతి రైతుగా స్థిరపడింది అన్నమాట”అన్నాను. నా అజ్ఞానానికి నవ్వింది సుశీల. బల్ల  సొరుగులో నుంచి  ఒక పేపర్ కటింగ్ తీసి నా చేతిలో పెట్టింది.    

          రెండు గ్లాసుల తో నాకూ , రాజుకూ  తీయని చెరుకు రసం ఇచ్చింది.

          పేపర్లో శాంతి ఫొటో చూశాను పోలికలు మారాయి అయినా గుర్తుపట్టాను. శాంతి గురించి రాసిన వాక్యాలను  ఆత్రంగా చదివాను. 

          విజయనగరం జిల్లాలోని బాడంగి, తెర్లాం, రామభద్రాపురం, మండలాల్లో చెరకు కూరగాయల సాగు ఎక్కువ. వర్షాధార మైన భూములు కావటం చేత మినుములు పెసలు నువ్వులు  లాంటి మెట్ట పంటలే రైతులు వేస్తారు. కానీ ఏడాది కష్టం రైతు కు నష్టం గానే మిగిలేది. వీరి దుస్థితి చూసి వీర సాగరానికి చెందిన లచ్చిపతుని శాంతి గుండె నీరైంది . నలుగురి సంక్షేమమే తన మార్గంగా ఎంచుకుంది. రైతు శక్తిని సంఘటితపరచి సహకార సంస్థ గా మార్చింది. అదే రైతు జట్టు. గ్రామాన్ని  తన ఇల్లు అనుకుంది. వారానికి ఒకసారి అందరితో కలిసి గ్రామపు రోడ్లను శుభ్రపరుస్తుంది , మొక్కలను నాటుతుంది . వయోజన విద్య ద్వారా ఎమ్ఎ చదువుకున్న శాంతి అక్షర విజయం వాలంటీరుగా ఎందరినో విద్యావంతులను చేసింది. వన సంరక్షణ సమితి  ఎన్.జి.ఓ ఫెలిసిటేటర్ గా గిరిజన వాసులకు సేవలందిస్తోంది. రైతులకు డ్వాక్రా మహిళలకు తొంభై  లక్షల రూపాయలు రుణ సౌకర్యాన్ని ఇప్పించింది. ప్రభుత్వ సహకారంతో కోల్డ్ స్టోరేజ్ ను ,ఒక వాన్  ను  ఏర్పాటు చేసుకున్నారు రైతు జట్టు సభ్యులు, స్వచ్ఛమైన రుచికరమైన బెల్లాన్ని వినియోగదారులకు అందిస్తున్నారు .    

           తాగుతున్న చెరుకు రసం తీయగా గొంతు దిగుతూ ఉంటే మనసు కూడా తియ్యగా మారిపోయింది నాకు.  అన్ని రకాల ఫామ్ ప్రొడక్ట్స్  కు  ధర చెల్లించి తీసుకుని కారులో పెట్టించాను.   

          అక్కడ నుంచి వీర సాగరానికి బయలుదేరాం. అరగంటలో కారు ఒక పెద్ద పెంకుటింటి  ముందు ఆగింది. రాజు నన్ను దింపి తాను తన బావమరిది ఇంటికి వెళ్లి వస్తానని అవసరమైతే ఫోన్ చేయమని చెప్పి వెళ్ళాడు.   

          ఇంట్లోకి అడుగు పెట్టాను, లోపలనుంచి “ఎవరండీ! అంటూ వచ్చింది శాంతి.   

           శాంతిని కాసేపు ఆటపట్టించాలని పించింది. ఈలోగా శాంతి ఫోన్ మోగింది. నన్ను అక్కడ కుర్చీలో కూర్చోమని సైగ చేసింది.   

          “వంద  కేజీల పేడా, రెండు కేజీల బెల్లం ,రెండు కేజీల శనగపిండి, ఒక కేజీ  పుట్టమట్టి  ఇవన్నీ కలిపి వేయండి” అని ఎవరికో సలహా చెబుతోంది.  

          మాట్లాడటం అయ్యాక “ఎవరండీ ? అని అడిగింది.  

          “ మీరే చెప్పాలి” అన్నాను నవ్వి.  ఒక క్షణం వింతగా చూసి   “తెలియడం లేదండి “ అంది.   

          “శాంతీ ! విజయనగరం జడ్ పి   హైస్కూల్,   ఇంకా గుర్తుకు రాలేదా?   

          చప్పున నా చేయి అందుకుని  “కు  సు  మా!”   అంది ఒక్కొక్క  అక్షరాన్ని ఒత్తి పలుకుతూ.       

          అవునని తలాడించాను.   మరుక్షణం నన్ను గట్టిగా హత్తుకుంది.  శాంతి కొద్ది క్షణాలు సంతోషం తో ఉక్కిరిబిక్కిరి అయింది. భర్తని పరిచయం చేసింది. “మీ పేరే ఎక్కువగా తలుచుకుంటూ ఉంటుందండీ!” అన్నారు ఈశ్వర్ రావుగారు. 

          రాత్రి పోద్దుపోయేవరకూ  కబుర్లలో మునిగిపోయాం శాంతి నా కుటుంబం గురించి అడిగింది .   నాకు ఇద్దరు అబ్బాయిలనీ ,చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారనీ చెప్పాను.

          “చెప్పు శాంతీ !  ఇంకా నీ గురించి చెప్పు” అన్నాను.

          ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేసానని,పెద్దమ్మాయి బి ఎస్ సి డైటీషియన్ చదివిందని,అల్లుడు  ఇండియన్ ఎయిర్ ఫోర్సు లో పని చేస్తాడని, చిన్నమ్మాయి బయోటెక్నాలజీ అయిన తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి నేచురల్ ఫార్మింగ్ లో   జే డి ఆఫీస్ లో పనిచేస్తోందని చెప్పింది. తాను  ఊరికి సర్పంచ్ గా  చేశానని  గ్రామానికి ఆర్  ఓ సిస్టం ద్వారా మంచినీళ్లు అందించే తన కల నెరవేరిందని చెప్పింది. జట్టు ఆశ్రమంలో అరవై  మంది పిల్లలకు సేవలు అందిస్తున్నామని చెప్పింది. పదహారు  గ్రామాలకు లైబ్రేరీలను ఏర్పాటు చేయగలిగాను గురుతుల్యులు అనిల్ కుమార్ దత్తా గారి సహకారంతో అంది .     

          “అందరు ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగాలు వెతుక్కుంటే నువ్వు రైతు గా మారాలని ఎలా అనుకున్నావ్ శాంతీ ?’  

          “నిజమే కుసుమా  ! కొత్తలో పొలంలోకి దిగాలంటేనే  కష్టంగా ఉండేది .ఈ గ్రామం లోని అమాయకపు ప్రజల దుస్తితి చూశాకా నాకు ఏ పనీ కష్టం అనిపించలేదు.ఇరవై  లక్షలరూపాయల విలువైన బెల్లం తీసుకుని ఐ పీ  పెట్టేసిన వాడు ఒకడూ ,  పంటను తీసుకుని డబ్బు ఇమ్మంటే తిట్టే వాడు మరోకడూ  , ఇక ఆడవాళ్ళ కష్టాలు  చెప్పలేనివి, ఈ పరిస్థితికి అడ్డం పడాలి అనుకున్నాను.     

          శాంతి మాటలు వింటుంటే నా రక్తం పొంగింది.   

          “ఈ యుద్ధంలో నాకు సహకరించిన పెద్ద వాళ్ళు ఎందరో ఉన్నారు. ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి నా భర్త ఈశ్వరరావు గారు, ఇంకా  అరుణక్క, పద్మజ గారు లక్ష్మీ గారు నాకు ప్రోత్సాహమిచ్చారు . 2016లో రైతు జట్టు స్థాపించాము.  దీక్షా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో  సాలూరులో ధరణీ, కొమరాడ లో రైతు నేస్తం, బాడంగి లోనే అక్షయ పేరుతో తో సహకార సంఘాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికి  కోటి రూపాయల టర్నోవర్ సాధించాము కుసుమా!”   

          ఇదంతా నబార్డ్, ఆచార్య రంగా విశ్వవిద్యాలయం, హార్టికల్చర్,అనిల్ కుమార్  వారిచ్చిన ఆర్థిక సహాయంతో చేయగలిగాము.    

          “నబార్డ్ అంటే” అన్నాను    

          “నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ,కేవలం వ్యవసాయానికి మాత్రమే కాకుండా గ్రామీణాభివృద్ధికి కావలసిన ఆర్థిక సహాయాన్ని బ్యాంకు ద్వారా ప్రజలకు అందిస్తుంది నబార్డ్.    

          “నీ గురించి చెప్పు కుసుమా !  నువ్వు కథలూ వ్యాసాలు రాస్తావని పద్మ చెప్పింది.”      

          నేను మాటల మనిషిని శాంతీ ! నువ్వు చేతల మనిషివి, అన్నదాతవు ,నేను కేవలం అన్నం వండి పెట్టే అమ్మని, శాంతి చేతులను నా చేతుల్లోకి తీసుకున్నాను, కాయకష్టం తో దృఢంగా ఉన్నాయి.      

          “శాంతీ! నీ చూపులో లోకానికి అవసరమైన వెలుగు ఉంది, నీ చేతిలో దీక్ష ఉంది, నీ గుండెలో స్పందనను కోల్పోని మెత్తదనం ఉంది.”అన్నాను ఉద్వేగంగా .      

          “కుసుమా! ఈ మాటలే గా మనిషిని నడిపించేవి, అమ్మానాన్నలు, గురువులు, పెద్దలు మంచి మాటలను మన మనసులో నాటక పోతే ఆశలు ఎలా మొలకెత్తుతాయి,  ఎలా చిగురిస్తాయి?” 

          చెమ్మగిల్లిన కళ్లతో అడిగింది శాంతి.                                            

          పొద్దున్నే స్నానం చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాను . శాంతి దంపతులను  కూర్చోబెట్టి పట్టు బట్టలతో సత్కరించాను .     

          “నాకు ఎందుకండీ !” అన్నారు  మొహమాటంగా ఈశ్వరరావు గారు.        

          “భార్యను ప్రేమించి, ఆమె భావాలను గౌరవించి, ఆమెకు చేదోడు వాదోడుగా ఉన్నందుకు మీకు ఈ గౌరవం,  కాదనకండి “అన్నాను నమస్కరించి.   శాంతి  విజిటింగ్ కార్డు  తెచ్చి నాచేతి లో పెట్టి ఫోన్ నంబర్లు ఉన్నాయి కుసుమా!   అంది . కార్డ్ మీద  ప్రింట్ లో ఉన్న అక్షరాలను చదివాను.

          “మనిషిగా జన్మించడానికీ, మనిషిగా  జీవించడానికి  మధ్య ఉన్న దూరాన్ని అధిగమించడానికి  మనం రోజూ కనీసం ఒక అడుగు వేద్దాము., చెట్టు ‘లోగో’   వేసి ఉంది కార్డు మీద.. 

           రాజు కారు తెచ్చాడు. దంపతులు ఇద్దరూ కారు వద్దకు వచ్చారు. వెళ్లొస్తాను రైతమ్మా! త్వరలోనే మళ్ళీ కలుద్దాం అన్నాను .

          నీళ్ళు  నిండిన కళ్ళతో చేయి ఊపింది శాంతి. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.