నాంది

(తృతీయ ప్రత్యేక సంచిక కథ)

-మొహమ్మద్. అఫ్సర వలీషా

” ఏమండీ ” అంది లత కాస్త అసహనంగా.
“ఊ” అన్నాడు దినపత్రిక లో వంచిన తలను పైకి ఎత్తకుండానే రఘు.
” మీ అమ్మ గారిని ఎప్పుడు ఊరు  తీసుకుని  వెళ్ళి దిగబెడతారు,” అంది కాస్త సందిగ్ధంగా…
 
          “అమ్మ తో నీకు ఇబ్బంది ఏమిటి, తన దారిన తాను ఉంటుంది, నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అన్నాడు ” పత్రిక చదువు తూనే. ఎందుకంటే అది ఈ నాటి సమస్య కాదు లతది. వసుంధర వచ్చిన నెల రోజులు దాటిన దగ్గర నుండీ ఇదే వరస. లత చెప్పడం రఘు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని పోవడం ప్రతి రోజూ జరుగుతున్న దైనా ఎలాగైనా అత్తగారిని పల్లెటూరులో ఉన్న మరిది దగ్గరికే పంపేయాలని మనసులో పట్టు పట్టి మరీ పంతం నెగ్గించుకోవాలనే పట్టు దలతో ఉంది….
 
          నిజం చెప్పాలంటే అత్తగారితో తన కెలాంటి ఇబ్బంది లేదు .వచ్చిన ఇబ్బంది అంతా తన ముద్దుల కన్నయ్య గురించే …
 
          తనూ రఘూ ఇధ్దరూ ఉద్యోగస్తులే. చాలా కాలం తరువాత చిన్నీ పుట్టాడు. ఓ మూడు సంవత్సరాలు ఆఫీస్ కు శెలవు పెట్టింది లత. ఆ తరువాత ఇంటి దగ్గర లోని కాన్వెంట్ క్రష్ కలిసి ఉన్న దాంట్లో  జాయిన్ చేసింది. సాయంత్రం కాస్త త్వరగా వచ్చి బాబును తీసుకుని వెళ్ళేది. చాలా సార్లు రఘు చెప్పాడు “అమ్మ ను మన దగ్గర ఉంచుకుంటే బాబును చూసుకుంటుందని”.లత ససేమిరా అంది. ఎందుకంటే బాబు ఆవిడకు అలవాటు అవుతాడని, అలవాటు అయితే పూర్తి గా అత్తగారిని ఇక్కడే ఉంచుకోవాల్సి వస్తుందని .ఇప్పుడైతే ఆర్నెల్లు తమ దగ్గర  ఆర్నెల్లు మరిది దగ్గర ఉంటోంది ఆవిడ.అదే బాధ లతది . ఇల్లు పొలం చెరి సగం పంచుకున్నప్పుడు ఆవిడ ఒకరి దగ్గరే ఎందుకు అని భర్త తో వాదించింది, ఆస్తి పంపకాలు అయ్యాక తల్లి ని తమతోనే ఉంచుకుందా మన్న భర్త తో . అక్కడ తమ్ముడి సంపాదన తక్కువ, అదీ కాక తల్లి అంటే వల్ల మాలిన ఇష్టం రఘు కు .లత మాటలతో ఏమీ చేసేది లేక ఊరకుండి పోయాడు రఘు బాధతో చిరుగులు  పడ్డ మనసుకు ధైర్యపు కుట్లు వేసుకుంటూ…..
 
          మధ్య మధ్యలో వచ్చి పోయినా చాలా కాలానికి పుట్టిన మనవడిని వదల లేక వదల లేక భారమైన గుండె కు  సర్దిచెప్పుకునేది….
 
          వసుంధర వస్తే మాత్రం వాడి పక్క ఆమె గదిలోకి మారిపోయేది. ఆమె అంటే ఎంతో ఇష్టం చిన్నీకి. బోలెడన్ని కబుర్లు తన కోసం మోసుకొచ్చే ఓ ఆత్మీయ టపా. తన స్నేహితుల సంగతులు అన్నీ చిన్న గుండెలో దాచి నానమ్మ రాగానే ఆమె ముందు విప్పేవాడు .ఇప్పుడు చిన్నీ కి పది సంవత్సరాలు వచ్చాయి .ఇప్పుడు నానమ్మ అంటే మరీ ఇష్టమై పోయింది చిన్నీకి. 
 
          పల్లెటూరి అలవాట్లు ఏమి నేర్పిస్తుందో అత్తగారు అని లత బాధ.ఈ బాధ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది లతకు. ఈ మధ్య డబ్బులు పాకెట్ మనీ ఇవ్వాలని రఘు లతలను అడుగు తున్నాడు. లత “ఇవ్వను పిల్లలు పాడై పోతారు,”  అంది రఘు తో . “పైపెచ్చు ఇలాంటి అలవాట్లు మీ అమ్మ గారే నేర్పిస్తున్నారు వీడికి. వీడి వయసెంతని , ఈ వయసులో ఏం చేసుకుందామని డబ్బులు, నానమ్మ కు అందిస్తున్నాడటుగుంది”  అంది కాస్త కటువుగా.
 
          ఆ మాటలు కాస్త బాధ పెట్టాయి రఘుని.మాట్లాడటం అనవసరమని ఊరుకున్నాడు. ఇప్పుడు తను ఉండే ఆర్నెల్ల గడువు కంటే వారం ఎక్కువైందని నసుగుతూ ఉంది లత త్వరగా ఊరికి పంపేయాలి గడువు దాటగానే అని.ఎంత చెప్పినా పట్టించుకోని భర్త తో చెవిటి వాని ముందు శంఖమూదినట్లు  అనుకుని ఊరుకుంది.
 
          ఫస్ట్ తారీఖు రాగానే వసుంధర ఊరు వెళ్ళిపోయింది. తన గదిలో ఒంటరి పక్షి గా మిగిలిపోయాడు. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి . లత వచ్చి కాసేపు కొడుకును గుండె లకు హత్తుకుని పడుకోబెట్టింది. 
 
          స్కూల్  వార్షికోత్సవానికి  ఇద్దరినీ రమ్మని ఆహ్వానం అందింది.చిన్నిని తీసుకుని వెళ్ళారు ఇద్దరూ. కాసేపు పిల్లలకు ఉత్సాహపు కార్యక్రమాలు జరిపి “,ఈ యేటి మేటి స్కూల్ హీరో మాస్టర్ భరత్ ” ,అనగానే అందరూ చప్పట్ల తో హాలు మారు మ్రేగించారు. “ఏమి చేశాడు అంత హీరో అయిపోవడానికి అని ఆశ్చర్య పడుతున్న వారి తల్లి దండ్రులను చిన్నీని స్టేజ్ మీదకు రమ్మంటే వెళ్ళారు .వాళ్ళు చెప్పడం ఆరంభించారు . “తన కంటే వయసులో చిన్న వాడైన స్కూల్ విద్యార్థి కి చదువు ఆగిపోకుండా స్కూల్ ఫీజు కట్టాడు భరత్ .తను దాచుకున్న డబ్బులు మరియు తల్లి దండ్రుల సహాయ సహకారాలతో ఒక పేద విద్యార్థి కి విద్యా దానం చేశాడు. చాలా గొప్ప సహాయం. ఇంత చిన్న వయసులోనే ఇంతటి మహత్తర కార్యక్రమానికి నాంధి పలికాడంటే పెద్దయ్యాక చాలా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి పెడతాడు ఇంటికి దేశానికి భరత్ అంటూ” ముగ్గురినీ సత్కరిస్తుంటే నోట మాట రాలేదు లతకు .అత్తగారు పల్లెటూరి అలవాట్లు నేర్పుతారన్న అపోహ తో కొడుకును దూరంగా ఉంచాలనుకుంది. కానీ సమాజంలో ఓ గొప్ప వ్యక్తిత్వం నేర్పిస్తుంది అనుకోలేదు. ఓ నాడు చిన్ని అడిగాడు .తన పక్క బస్తిలో ఉండే రాజు చదువు ఫీజు కట్టలేక ఆగిపోతుంది మీరు కడతారా అని , దానికి తమ కష్టం అంతా ఊరోళ్ళని పెంచడానికి కాదు నీ చదువు నీవు చదువు కోమని చిన్న పిల్లాడివి ఇదంతా నీకెందుకని కసురుకుంది. మధ్య మధ్యలో రఘు ఇచ్చిన డబ్బులు జాగ్రత్త గా కిడ్డీ బ్యాంకు లో వేసుకునేవాడు. నానమ్మ వచ్చి నప్పుడు సహాయం అడిగాడు “నాయమ్మే ఎంత మంచి మనసురా నీది ఫస్ట్ దాకా ఉండి పెన్షన్ డబ్బులు నీకిచ్చి వెళతానని అక్కడి కెళితే డబ్బులు మిగలవు ఖర్చై పోతాయని ఫస్ట్ వచ్చేదాకా ఉండి మనవడి మాట ప్రకారం డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయింది. చిన్నీ ఇచ్చిన డబ్బు కాకుండా స్కూల్ మేనేజ్ మెంట్ మిగతా డబ్బు వేసుకొని రాజును జాయిన్ చేసుకున్నారు. ఎవరికి తెలుసు వారిలో ఓ అబ్దుల్ కలామో, ఓ అంబేద్కరో , ఓ వీరేశలింగమో ఉదయించ వచ్చు.
 
          పిల్లలు పెద్దవారి అడుగు జాడలలో నడుస్తారన డానికి చిన్నీయే ఒక ఉదాహరణ అనుకుంటూ భర్త ను అడిగింది. అత్తగారు మనతోనే ఉంటారు. కావాలంటే అందరం కలసి వెళ్ళి మరిది గారి దగ్గర శెలవులకు వెళ్ళి గడిపి వద్దాము అని .”
 
          భార్య లోని మార్పుకు చాలా సంతోషించాడు రఘు. చిన్ని సంతోషానికి అవధులు లేవు నానమ్మ తనతోనే ఉండిపోతుందని తెలిసి బోలెడు కలలు కంటూ నిద్దురమ్మ ఒడిలో జారిపోయాడు……

*****

Please follow and like us:

One thought on “నాంది (తృతీయ ప్రత్యేక సంచిక కథ)”

Leave a Reply

Your email address will not be published.