విశ్వసనీయ ఊహ – సంభవనీయ కల్పన

పుస్తకాలమ్’ – 9

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

విశ్వసనీయ ఊహ – సంభవనీయ కల్పన

 

          ఆయన పేరు వినడమూ, ఆయన వేసిన దేవతల బొమ్మలు కొన్ని బంధువుల, మిత్రుల ఇళ్లలో చూడడమూ, ఆయన గురించి రెండో మూడో వ్యాసాలు చదవడమూ మినహా రాజా రవివర్మ గురించి నాకేమీ తెలియదు. ఐదున్నర దశాబ్దాల జ్ఞాపకాలు తవ్వి, మా ఇంట్లో నా అయిదారేళ్ల వయసులో ఉండిన శ్రీరామ పట్టాభిషేకం చిత్రం కూడా ఆయన రచనే అని గుర్తు చేసుకుంటున్నాను. అలా నాకు తెలియని, నూట పద్నాలుగేళ్ల కింద చనిపోయిన, అంతకు ముందు నాలుగు దశాబ్దాలు తన చిత్రకళతో దేశాన్ని ఉర్రూతలూగించిన ఆ కళాకారుడి మీద, ఆ మనిషి మీద అపారమైన ప్రేమను కలిగించింది పి. మోహన్ రాసిన ‘రాజా రవివర్మ’ నవల. ఆయన జీవితంలోనూ, మోహన్ నవలీకరణలోనూ లోపాలు లేవని కాదు, కాని ఆ లోపాలను గుర్తిస్తూనే గౌరవించి గాఢంగా ప్రేమించవలసిన జీవితం అది. ప్రేమగా ఆహ్వానించి హృదయానికి హత్తుకోవలసిన పుస్తకం ఇది.

          చరిత్రకు, అందులోనూ ఒక ఉద్వేగభరితమైన జీవిత చరిత్రకు నవలారూపం ఇవ్వడం చాలా సంక్లిష్టమైన పని. ఆ చరిత్రలోని అత్యంత సూక్ష్మ అంశాలను కూడా ఆకళించుకోవాలి. ఆ నిజ జీవిత ఘటనలను యథాతథంగా జాబితాలా, వార్తా నివేదికలా కాకుండా కళగా మార్చాలి. ఆ కళ తప్పనిసరిగా ఊహల, కల్పనల రంగులు అద్దుకోవాలి. అదే సమయంలో ఆ ఊహలు స్వకపోల కల్పనలు కాగూడదు, విశ్వసనీయం కావాలి. ఆ కల్పనలు విశృంఖల ఊహలు కాగూడదు, సంభవనీయమే అనే నమ్మకం కలిగించాలి. ఆ విశ్వసనీయతా, సంభవనీయతా కచ్చితంగా తత్కాలపు జీవన వాస్తవికత నుంచి అటూ ఇటూ ఎగిరిపోగూడదు. విసురు గాలిలో కూడ తాను తలచుకున్నట్టుగా గాలిపటం ఎగరేయాలనుకునే వ్యక్తి పడే కష్టం అది.

          జీవితంలో చాల కష్టాలు అనుభవించిన మోహన్ కు ఈ కష్టం పెద్దది కాకపోవచ్చు. కొంతకాలమైనా తనను దగ్గరిగా చూసే, తాను రాసిన ‘కిటికీపిట్ట’ కవితా సంపుటానికీ, డావిన్సీ జీవిత చరిత్ర పుస్తకానికీ ముందుమాటలు రాసే అవకాశం నాకు వచ్చింది. ఈ నవలను కూడా దాని చిత్తుప్రతి రూపంలో నాకిచ్చాడు గాని, ఈ ఏడాది ఒత్తిళ్లలో అది చదవలేకపోయాను. ఇప్పుడిక పుస్తకంగా వెలుగు చూసిన తర్వాత, చదవడం మొదలుపెడితే ఒక అద్భుత ఆవిష్కరణ. అపారమైన సమాచార సేకరణ. అసాధారణమైన శ్రమ. ఆ సమాచారాన్ని ఒక కుప్పగా పోయడం కాకుండా దాన్ని కళాత్మకం చేయడానికి, ప్రతి అధ్యాయాన్నీ, ప్రతి వాక్యాన్నీ, చివరికి ప్రతి మాటనూ చిత్రిక పట్టి, రంగులు అద్ది, చదువరుల కళ్ల ముందు మాయాజాలం అల్లిన మాంత్రిక నైపుణ్యం. మోహన్ నా మిత్రుడైనందుకు గర్వపడిన క్షణాలు పుస్తకం నిండా పరుచుకున్నాయి.

          రాజా రవివర్మ జీవితం, ఆ మాటకొస్తే వలస భారతదేశంలో పందొమ్మిదో, ఇరవయో శతాబ్ది మధ్య సంధికాలంలో జీవించిన సామాజిక వ్యక్తులందరి జీవితాలూ, వైవిధ్య భరితమైనవి. అనేక వైరుధ్యాల మయమైనవి. పాతకొత్తల మేలు కలయికకూ, కీడు కలయికకూ కూడ ఆలవాలమైనవి. అగ్నిహోత్రావధానులనూ లుబ్ధావధానులనూ ఇంకా రద్దు చెయ్యని సమాజం అది. రామప్పంతుళ్లనూ గిరీశాలనూ సౌజన్యారావులనూ అటువంటి కలగూరగంపలనూ పుట్టిస్తున్న సమాజం అది. మధురవాణిల కోసం పెనుగులాడుతున్న సమాజం అది. ఆ నాటి తెలుగు సమాజం ఎంత విచిత్రంగా వైరుధ్యాల పుట్టగా ఉన్నదో, మలయాళ సమాజం దానితో సమానంగానో, అంతకన్న ఎక్కువగానో విచిత్రంగా, వైరుధ్యమయంగా ఉండింది. ఊడలు దిగిన రాచరిక భూస్వామ్యం. మరుమక్కతాయం పేరుతో ఒకానొక ప్రత్యేక రూపంలో కరుడుగట్టిన మాతృస్వామ్య, మాతృవంశాధికారం. ఆ ఆధునిక పూర్వ సారాలు చెదిరిపోకుండానే వలసవాద ప్రవేశంతో చొరబడిన వక్రీకృత ఆధునికత.

          ఆ పాతకూ ఈ కొత్తకూ మధ్య జరిగిన మథనంలో, అధికారమూ పనీ లేని రాచరికం నేపథ్యంలో పుట్టుకొచ్చిన అనేక అంశాలలో ఒకానొక ప్రతిభావంతమైన, ప్రభావశీలమైన వ్యక్తిత్వం రాజా రవివర్మది. రాజప్రాసాదాలలో తిని కూచోగలిగిన సోమరితనాన్ని ఈసడించుకుని తనకు తాను పెట్టుకున్న పని చిత్రలేఖనం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగి, ఐదారు వేల చిత్రాలను సృష్టించిన ఆ సృజన ఆయనను ఆధునిక భారతీయ చిత్రకళకు నాయకుడిని చేసింది. అప్పటివరకూ రాజుల, సంపన్నుల, వలస ప్రభువుల రూపచిత్రాలకే పరిమితమైన చిత్రకళను కొత్తపుంతలు తొక్కించింది. వలసవాదంతో ప్రవేశించిన యూరపియన్ చిత్రకళను అనుసరించాడా, అనుకరించాడా, భారతీయ చిత్రకళ పేరుతో భారత రామాయణాలనూ పురాణాలనూ దృశ్యాలలోకి దింపి, హిందుత్వ రాజకీయాలకు మార్గం సుగమం చేశాడా, అప్పటికి కవుల కల్పనలోనే ఉండిపోయిన అనేక పురాణ పాత్రలకు ఆకారాలు తొడిగాడా, తాను దేశమంతా తిరిగి చూసిన సామాన్య ప్రజల ముఖాలనే పురాణ కల్పనా పాత్రలకు అతికించి, పురాణానికీ చరిత్రకూ, కల్పనకూ వాస్తవానికీ విభజన రేఖ చెరిపేశాడా, అంతా కళాకారుడయ్యీ, సామాజిక వ్యక్తి అయ్యీ, వ్యక్తిగత జీవితంలో చీకటిని మిగిల్చాడా, మిగుల్చుకున్నాడా… ఆయన జీవితం మీదా, సృజన మీదా ఎంతైనా విచికిత్స చేయవచ్చు.

          ఆయన గురించి సానుకూల దృష్టి ఉన్నా, ప్రతికూల దృష్టి ఉన్నా అసలు ఆయన ఏమిటో తెలుసుకోవడం అవసరం. ఏ సామాజిక నేపథ్యంలో ఆయన జీవితమూ చిత్రకళా సాగాయో, ఆ జీవితంలోనూ చిత్రకళలోనూ వెలుగు కింద పరుచుకున్న నీడలు, లేదా నీడల కింద పొడసూపిన వెలుగులు ఎటువంటివో అర్థం చేసుకోవడం అవసరం.

          బహుశా తెలుగులో రవివర్మ గురించి వ్యాసాలో ప్రస్తావనలో తప్ప పూర్తిస్థాయి జీవిత చరిత్ర వచ్చినట్టు లేదు. ఆ లోపాన్ని తీరుస్తూ, జీవిత చరిత్రను నవలా రూపంలో చెపుతున్నాడు మోహన్. “ఘటనల్లో, పాత్రల్లో ముప్పావు వంతుకు పైగా వాస్తవమైనవే. చారిత్రక సంఘటనలు, రవివర్మ చిత్రాలు ఆధారంగా కొన్ని సన్నివేశాలను కల్పించాను…. రవివర్మ జీవితానికి, సృజనకు కాల్పనిక రూపమివ్వడంతో అవసరమైనంత స్వేచ్ఛ తీసుకున్నాను” అని వినయంగా చెప్పుకున్నాడు. యాబై ఎనిమిది సంవత్సరాల రవివర్మ జీవితంలో నాలుగేళ్ల వయసు దగ్గర ప్రారంభించి మరణించే దాకా, అంటే యాబై నాలుగు సంవత్సరాల సువిశాల కాన్వాస్ మీద రవివర్మ జీవితంలోని రంగులనూ రాగాలనూ, ఎత్తు పల్లాలనూ, ఆనంద విషాదాలనూ అంతే వర్ణమయంగా చిత్రించడానికి ప్రయత్నించాడు. నల్లపువ్వు, తెర ఆవలి ఊపిరి, భగ్న ఏకాంతాలు, కీలుబొమ్మలు, చల్లారని ఆవిరి, హంసధ్వని, పొగమంచు, మునిమాపు అనే ఎనిమిది అధ్యాయాలలో, ఒక్కొక్క అధ్యాయంలో ఐదు నుంచి పద్నాలుగు ఉప అధ్యాయాలలో నలుపు తెలుపు అక్షర చిత్రాలలోనే అనేక వర్ణాల రవివర్మ జీవితాన్నీ సృజననూ ప్రదర్శించాడు.

          ఈ నవల గురించి మొట్టమొదట చెప్పుకోవలసింది, నవల పొడవునా సాగిన కవితాత్మక శైలి. అతి సాధారణ జీవిత ఘటనల గురించి చెప్పినప్పుడైనా, అత్యంత రమణీయ ప్రకృతిని వర్ణిస్తున్నప్పుడైనా, మహోజ్వల ఉద్వేగాన్ని చూపుతున్నప్పుడైనా, రవివర్మ చిత్రాలను మనకు చూపెడుతున్నప్పుడైనా మోహన్ వాక్య నిర్మాణం కుంచె కదలికలా సాగుతూ, చదువరుల కళ్ల ముందర అనేక వర్ణాల అద్భుత దృశ్యాలెన్నిటినో గీస్తుంది. ఆ కవితాత్మక శైలిలో ఇమిడ్చినవి అసంఖ్యాకమైన అతి సూక్ష్మ వివరాల నుంచి అతి స్థూల ఆవరణలు, మనుషులవీ, వాళ్ల భావోద్వేగాలవీ, ప్రకృతివీ, ప్రయాణాలవీ.

          నా వరకు నాకు ముప్పై నలబై ఏళ్ల వెనుకటి జ్ఞాపకాలు తోసుకొచ్చాయి. చంద్ర పక్కనా, మోహన్ పక్కనా నిలబడి ఆ వేళ్ల మధ్య కుంచె, క్రోక్విల్, పెన్సిల్ నాట్యాలు చూస్తూ తబ్బిబ్బవుతూ, ఎప్పటికైనా ఆ ఐంద్రజాలిక కళ నేర్చుకోవాలని కలిగిన ఆపుకోలేని కోరిక ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ మళ్లీ మళ్లీ మోసులెత్తుతూ ఉంది. అలాగే, ప్రస్తావనవశాత్తూ అన్నట్టుగానే రవివర్మ చిత్రాల్లో ముప్పై నలబై చిత్రాలను మన కళ్ల ముందరి ఊహాస్థలంలో నిలిపి ఆ రంగుల గురించీ, ఆ కథల గురించీ, అక్కడి రూపదాతల గురించీ మోహన్ చెపుతున్నప్పుడు, ఆ చిత్రాలన్నీ సంపాదించి, పక్కన పెట్టుకుని ఒక్కొక్క చిత్రాన్నీ చూస్తూ, మోహన్ రాసింది చదువుతూ రవివర్మ చిత్రాల కండక్టెడ్ టూర్ తీసుకోవాలన్న మహా ఉద్రేకం కలిగింది.

          చాలచోట్ల సన్నివేశాలూ సంభాషణలూ ఉద్వేగాలూ వాదనలూ వంద సంవత్సరాల కిందటి చరిత్ర చదువుతున్నప్పటిలా కాక వర్తమానం గురించి చదువుతున్నట్టే ఉండడం మన సామాజిక చరిత్ర మారినట్టు కనబడుతూనే నిజంగా మారకపోవడానికి నిదర్శనం కావచ్చు. గత వర్తమానాలను రంగులు కలిపినట్టు కలగలిపిన మోహన్ నైపుణ్య ఫలితం కావచ్చు. నూట ఇరవై సంవత్సరాల కిందటి బొంబాయి ప్లేగ్ వ్యాధి సమాజాన్ని ఎట్లా అతలాకుతలం చేసిందో చదువుతుంటే సరిగ్గా ఆ ప్లేగ్ అనే మాట దగ్గర కొవిడ్ అనే మాట పెట్టి వర్తమానాన్నే చదువుతున్నామనిపిస్తుంది. అటువంటి సందర్భాలు ఎన్నో. పాత్రల అంతరంగ మథనాలు, ముఖ్యంగా రవివర్మ ఆలోచనలు తాత్వికంగానూ, ఆలోచనాత్మకంగానూ సాగి ఇరవయో ఒకటో శతాబ్ది ఆలోచనాపరుడి అంతరంగ మథనాల్లా అనిపిస్తాయి. అలాగే మతం మీద, కళా ప్రయోజనం మీద, రాచరికం మీద, అంతఃపురాల కుట్రల మీద, రాజకీయాల మీద  సన్నివేశాలు, చర్చలు కూడ ఇవాళ జరుగుతున్నట్టే అనిపిస్తాయి.

          అనేక మంది సంస్థానాధీశులు, దాదాభాయి నౌరోజీ, ఎం జి రనడే, సురేంద్రనాథ్ బెనర్జీ, వివేకానంద, అరవింద ఘోష్, గురజాడ అప్పారావు, కిషన్ పర్షాద్, రాజా దీన్ దయాళ్, బెంగళూరు నాగరత్నమ్మ, వలసవాదులు ఉరి తీసిన చాపేకర్ సోదరులు వంటి చారిత్రక వ్యక్తులెందరో పాత్రలుగా వచ్చి గాని, ప్రస్తావనకు వచ్చి గాని నవల వాస్తవికతను ఇనుమడింపజేస్తారు.

          ఎన్నోచోట్ల నాకు నచ్చిన, నేను కిందిగీతలు గీసుకున్న కవితామయ, తాత్విక, ఆలోచనాత్మక వాక్యాలను మీతో పంచుకోవాలని ఉంది గాని, మీ అంతట మీరే నవల చదివి, మీకు నచ్చిన ఆణిముత్యాలను ఏరుకోవడానికి అవకాశం వదులుతున్నాను.

అయినా కొన్ని మాటలు పంచుకోవాలి:

          “దర్బారు రాజకీయాలు అసలేం బాగాలేవు…ఈ బురదలో చిక్కుకోకు. కళ అందరికీ అబ్బదు. దాన్ని నిర్లక్ష్యం చేయకు. ఈ రాజులు, రాణులు, దివాన్లు, సిరిసంపదలు, సౌఖ్యాలు అశాశ్వతం. ప్రజలు ఈ రోజు గుర్తుంచుకుంటారు, రేపు మరచిపోతారు. అసలైన విలువ కళాసారస్వతాలదే. నేను దివాన్ గా వందల ఫర్మానాలు రాసి ఉంటాను. కాని ఓ పద్యం రాస్తే కలిగే తృప్తి వేరు. రాజసేవ అనేది కత్తి అంచును నాకడం, పాము ముట్టెను ముద్దాడ్డం…” అనే దివాన్ మాధవరావు,

          “మీ దేశానికి సుసంపన్నమైన చరిత్ర ఉంది. చిత్రరచనకు కావలసినంత ముడిసరుకు ఉంది. ఎన్ని కథలు, ఎన్ని కల్పనలు, ఎన్ని పాటలు, పండుగలు, ఎన్ని రాగాలు, ఎన్ని వర్ణాలు, ఎన్ని వాద్యాలు, నృత్యాలు… పాశ్చాత్య కళలో మీకేది పనికొస్తుందో దాన్ని తప్పకుండా తీసుకోవాలి. రూపచిత్రణ, వెలుగునీడలు, పర్స్పెక్టివ్, మరెన్నో లాఘవాలను అందుకోవాలి. అంతిమంగా మీ చిత్రాలు మీ దేశానికి, మీ చరిత్రకు, మీ సంస్కృతీ సంప్రదాయాలకు, మీ విలువలకు అద్దం పట్టాలి” అని చెప్పిన నేపియర్,

          “…సముద్రాల అవతల ఉన్నదీ మనలాంటి మనుషులే. మన హిందువుల కట్టుబాట్లన్నీ మంచివి కావండీ. వాటివల్లనే మన దేశం ఇలా తగలడింది. కాలంతో పాటు మనమూ మారాలి. మన పూర్వీకులు ఎక్కని రైళ్లను మనం ఎక్కడం లేదూ?… సముద్రం దాటడమూ అంతే…” అనే జానకమ్మ,

          “అదొక బ్రహ్మ పదార్థం. ప్రతి వంద మైళ్లకు వేషభాషలు మారే ఈ దేశంలో భారతీయతకు నిర్వచనం ఏమిటి” అనే రాజా రాజవర్మ,

          “…దేశప్రేమను, నవీన భావాలను ప్రచారం చెయ్యడానికి మన రచయితలు, కళాకారులు ముందుకు రావాలి. నిరంకుశ ఆంగ్లేయ పాలనలో మన దేశం తన ఔన్నత్యాన్ని కోల్పోయింది. భారత జాతి బానిస సంకెళ్ల నుంచి బయట పడక పోతే మరింత పతనం తప్పదు. మనలో ఎన్ని లోపాలైనా ఉండొచ్చు గాక, అది మన అంతర్గత విషయం. తెల్లదొరలు మన సంపదను దోచుకోవడమే కాక మనల్ని అన్ని విషయాల్లోనూ తొక్కేస్తున్నారు. రాజకీయాలు, సాహిత్యం, కళలు, వాణిజ్యం, పరిశ్రమలు… అన్నిటా భారతీయులు స్వశక్తితో ఎదిగి బలమైన జాతిగా అవతరించాలి…” అనే సురేంద్రనాథ్ బెనర్జీ మోహన్ అక్షరాల్లో సజీవంగా కనబడతారు.

          “నా బొమ్మలు అందరికీ అర్థం కావాలి కదా. అందుకే వాళ్ల అభిప్రాయం తెలుసుకోవాలి. నేను వాళ్ల తెలివితేటలకు, అభిప్రాయాలకూ విలువ ఇచ్చి గౌరవ ప్రదంగా స్వీకరిస్తాను. నా చిత్రపటాలు జనబాహుళ్యానికి చూడగానే అర్థం కావాలి. అంతకు మించి నేనేమీ ఆశించడం లేదు. ఇలాంటి నౌకర్ల పిల్లలు ఏదో ఒకరోజు మహారాజుల మందిరాల్లోని చిత్రాలకు యజమానులవుతారేమో ఎవరికి తెలుసు! పాశ్చాత్య దేశాల్లో చిత్రపటాలను ప్రజలందరూ చూడ్డానికి పబ్లిక్ గ్యాలరీలు ఉన్నాయని విన్నాను. అక్కడి చిత్రాలు ప్రజల ఉమ్మడి ఆస్తి అట. మన దేశంలోనూ అలాంటి చిత్రశాలలు వెలుస్తాయేమో…” అన్న రవివర్మకు అనేక రూపాలు ఉన్నాయని మోహనే అంటాడు.

          “కోయిల్ తంపురాన్, కళాకారుడు, సౌందర్యారాధకుడు, వనితాసక్తుడు, వియోగదహితుడు, నిత్యాన్వేషకుడు, ఆవిష్కర్త, అనుగామి, స్వేచ్ఛాప్రియుడు, శృంఖలాబద్ధుడు, కీర్తిలాలసుడు, సాహసి, పిరికిపంద, స్వార్థపరుడు, దయాళువు…”

          బహుశా అన్ని రూపాలూ నిజమే. కాలం వాటిలో కొన్ని రూపాలను మరపున పడేస్తుంది. కొన్ని రూపాలను ఎత్తిపడుతుంది. భార్యను వేదనకు గురిచేసిన వాడనీ, స్త్రీలోలుడనీ, తన చిత్రాల పేరు ప్రఖ్యాతుల కోసం దేన్నయినా వదిలేసిన కీర్తి కాముకుడనీ సమకాలికులు చూసిన రూపాలు ఇప్పుడు లెక్కలో లేవు.

          ఇప్పటికైతే రాజా రవివర్మ కళాకారుడు. హిందూదేవతల చిత్రాలను ప్రాచుర్యంలోకి తెచ్చి, ప్రతి ఇంటికీ చేర్చి, భవిష్యత్తు హిందుత్వకు పునాది కల్పించిన వాడని కూడ విశ్లేషించవచ్చునేమో. కాని మోహనే, రవివర్మ చేత అనిపించినట్టు, “తెలుసుకోకుండానే తీర్పు ఇవ్వడమంత సులువైన పని మరొకటి లేదు. ఈ దేశంలో కూడు గుడ్డలకు కొరత ఉంది. నీళ్లు నిప్పులకు కొరత ఉంది. మందూ మాకులకు కొరత ఉంది. కొరత లేనిది ఒక్క తీర్పులకు మాత్రమే.”

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.