బతుకు చిత్రం-19

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని ఆరాతీస్తూ చివరికి సైదులు తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

***

          ఈర్లచ్చిమి కొత్త కోడలు తో ఇల్లు నింపుకున్న సందర్భంగా ఇంట్లో చుట్టుపక్కల వారిని ,తెలిసిన వారిని పిలిచి విందు ఏర్పాటు చేసింది.

          వచ్చిన వారందరూ సైదులు చాల అదృష్టవంతుడని ఈడు కు తగ్గ జోడీ దొరికిందని సంతోషంగా దీవించారు . కొంత మంది కాకి ముక్కుకు దొండపండులాగా వీడికి ఇంత మంచి అమ్మాయా ? అని లోలోపల అసూయ పడ్డారు .

          రాజయ్య కొడుకు ను చూసి సంతోషపడినా జాజులమ్మ పట్ల అతనికి సదభిప్రాయం కుదరడం లేదు.అందుకే ఈర్లచ్చిమి లో ఉన్న ఆనందం అతనిలో లేదు. బయటికి మాత్రం కనిపించకుండా ఉన్నాడు.

          మరునాడు పదహారు పండుగ కూడా చేసింది. బంధువులు అందరూ ఎవరిండ్లకు వారు వెళ్ళడానికి తయారవుతుండగా , అందరినీ జంటలు జంటలుగా కూర్చోబెట్టి జాజులమ్మ ,సైదులు తో కొత్త బట్టలు పెట్టించింది. అందరి దగ్గరా ఆశీస్సులు ఇప్పించింది. ప్రతీవారు తృప్తిగా కలకాలం పిల్లా పాపలతో కలిసిఉండండనీ దీవించారు .
బంధువులందరూ సద్దుమనిగాక ఒక మంచి రోజు చూసుకొని శారె పంచడానికి ఊర్లో వాళ్ళ ఇండ్లకు తీసుకువెళ్ళింది.

          ఒక్కొక్కరినీ పరిచయం చేస్తూ ఊర్లో తమకు కావలసినవారందరి గురించి తెలియ జేసింది. తనలోని బెరుకు తనం కొంతయినా తగ్గి అందరితో కలివిడిగా ఉండాలని ఆమె తాపత్రయం గా జాజులమ్మ గమనించుకుంది .

***

          ఆ రాత్రి అయ్యవారు చెప్పిన ముహూర్తానికి కార్యక్రమం జరిపించాలని అన్ని ఏర్పాట్లు చేసింది . రాజయ్యను సైదులుకు తగిన విధంగా చెప్పమని చెప్పింది.

          ‘’నువ్వు పతీది నాకు చెప్పాల్సిన పనేమీ లేదే !నాకు తెల్వదా ?వాణ్ణి ఎట్ల సంసారం చేయించాల్నో ఇంట్లో చెప్పే ముచ్చట్లు కాదు గని పైసలియి .అట్ల తోల్కపోయి అన్ని చెప్పి తీస్కత్త ‘’అని ఈర్లచ్చిమి పైసలిచ్చేదాక వెంటపడి ఇవ్వగానే సైదులును తీసుకొని వెళ్ళిపోయాడు .

          కొత్త కోడలు ముందు గొడవ బాగుండదని ఈర్లచ్చిమి ఊరుకున్నా లోపల చాలా భయపడుతూనే ఇచ్చింది .సైదులుకు పాయసం చాలా ఇష్టమని పాయసం చేసింది .
మల్లెలు ,చామంతులు ,కనకాంబరాలు తెప్పించి మాలలు కట్టి జాజులమ్మకు పూలజడ వేసి చక్కగా ముస్తాబు చేసింది .

          ‘’జాజులూ ..!ఇయ్యాల్టి నుండి వానికి అమ్మయినా ,ఆలివైనా నువ్వేతల్లీ !వాణ్ణి నీ చేతిల పెడుతానా .కడుపుల వేట్టుకున్నా ,కాలితో తన్ని కడుపవతల ఏసినా అంతా నువ్వే తల్లీ !వానికి తాగుడు తప్ప వరే ఏ అలవాటూ లేదు .మొక్కగా ఉన్నప్పుడే తెంపక , నేను చేసిన తప్పిదమే ఇయ్యాల వాడిట్ల బానిసయ్యిండెమో !’’……….అని అతడి పద్ధతులు ,మనస్తత్వాన్ని గురించి అత్త చెప్తున్న మాటలు విని జాజులమ్మ కళ్ళలో నీళ్ళు దీసుకొని ,

          అత్తా !నాకు దేవుడు అమ్మను లేకుంట చేసిన్నని అత్తనే అమ్మలాగా ఇచ్చిండే మో! నేను ఎన్నడూ నీ కొడుకును తిప్పలవెట్ట. ఆయన నాకు పుస్తేగట్టి ఆడదానికి దక్కవలసిన గౌరవం దక్కించిండు. నా ఇలువ పెంచిండు. కళ్ళలో పెట్టి కాపాడుకుంట అత్తా.! అని మాట ఇచ్చింది.

          ఈర్లచ్చిమి జాజులమ్మను ప్రేమగా దగ్గరకు తీసుకొని , జాజులూ ! బిడ్డలు లేని నాకు ఇకాన్నుండి నువ్వే బిడ్డవు .అన్నది ప్రేమగా తల నిమురుతూ . అలా మాట్లాడుతూనే ముహూర్తం మించి పోవడం కూడా గమనించి, ఆందోళన పడసాగింది. జాజులమ్మ మాత్రం ప్రశాంతంగా ఉండి అత్తనే చూడసాగింది. ఇద్దరూ మౌనంగా వాకిలి వైపే చూస్తూ ఉండగా ,తూలుకుంటూ రాజయ్య ,సైదులు రావడం కనిపించింది .

          పైలంగ రారా !నా కొడకా ! బొక్క బొ ర్లా పడితే నీ పెళ్ళాం ,నా పెళ్ళాం ముందు మన ఇజ్జతు పోతదిరా …!అని మాట్లాడుతూనే డబెల్ మని పడిపోయిన రాజయ్యను, ఈర్లచ్చిమి పట్టుకుంది. సైదులు ఏమీ మాట్లాడకుండా తల్లి దిక్కు చూడలేక తలదించుకొనే తూలసాగాడు .

          ఛీ ..!ఏం మనిషివయ్యా? కొడుక్కు మంచీ చెడూ చెప్పమని తోలిత్తే బోత్తపలిగే టట్టు తాపిచ్చుకచ్చినవ్ ? వాని కార్యం ఇయ్యాల అని సుత యావ లేకుంటే ఎట్లా?’’ టా జెడ్డ కోతి వనమెల్ల చెరిచినట్టు ‘’చేస్తివి? ఇన్నోద్దుల లెక్క వాణ్ణి ఎంబడేసుకొని తిరుగకు మంటి. వానికి సంసారం అంటే ఏందో పెద్దమనిషి తరహాల చెప్పమని తోలిత్తి ….అంటూ బాధతో బలవంతంగా లేవనెత్తి బావి దగ్గర కు తీసుకు పోయి నీళ్ళు తోడి శుభ్రంగా స్నానం చేయించింది. వాకిట్లో మంచం లో కూర్చోబెట్టి చల్ల పోసుకు వచ్చిన అన్నం మెత్తగా పిసికి తినిపించసాగింది.

          జాజులమ్మకు అత్త చేస్తున్న సేవ , తను చేయవలసిన పనిని కూడా చెప్పి నట్లయింది. తను కూడా సైదులును నడిపించుకు వచ్చి తలారా శుభ్రంగా స్నానం చేయించింది. ఈర్లచ్చిమి,రాజయ్యకు తినిపించడం పూర్తి చేసి జాజులును,సైదులును కూర్చోబెట్టి బొట్టు పెట్టి సైదులుతో తెల్లని ధోవతి కట్టించింది.జాజులమ్మతోనే భోజనం వడ్డింప చేసింది. ఈ లోగా తాను మంచం లో కొత్త దుప్పటి పరిచి అగరుబత్తులు, సాంబ్రాణి ధూపం వేసింది. పొయ్యి వెలిగించి పాలు మరగ కాచింది. ఇలా కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేసి జాజులమ్మకు కూడా భోజనం వడ్డించింది. ఇద్దరినీ కూర్చోబెట్టి ,

          సైదులూ !నువ్వు ఇన్నోద్దుల లెక్క తాగుడు చెయ్యొద్దు కొడుకా! నీకంటూ ఓ తోడున్నది. దాని మొకం చూసన్న నువ్వు మంచిగుండాలె,ఈ అమ్మ మాట ఇను బిడ్డా !అని గదువ పట్టుకొని బ్రతిమిలాడుతున్నట్టుగా చెప్పి పాయసం ,పాల ను జాజులు కు ఇచ్చి గది లోకి పంపింది.

          జాజులు ఈర్లచ్చిమి పాదాలకు నమస్కరించి వెళ్ళింది. గదిలో సైదులుకు పాల గ్లాసు ఇచ్చి పాదాలకు నమస్కరించింది.

          సైదులు దూరం జరిగాడు. నాకు పాలు ఇష్టముండదు,నువ్వు తాగు,అని పక్కన పెట్టాడు. పాయసం తినమని ఇచ్చింది. దాన్ని కూడా వద్దన్నట్టుగా చేయి తో వారించాడు. మత్తు ఇంకా పూర్తిగా దిగాక పోవడం తో మంచం పై అలాగే ఒరిగి తొందరగానే నిద్ర లోకి జారి పోయాడు.

          జాజులుకు పాయసం,పాలు ఏవి తినాలని కానీ, తాగాలని కానీ అనిపించక మంచం పై మరోపక్క సర్దుకొని పడుకొని పోయింది. ఆమెకు బాధ కానీ ఏడుపుకానీ రాలేదు. ఒకప్పుడు పుట్టింట్లో తండ్రితో ఒంటరిగానే గడిపింది. ఇప్పుడు భర్త ఉండీ తనకు ఒంటరితనమే రాసి ఉందేమో అనుకోని మగత నిద్ర లోకి జారుకుంది. తెల్లవారింది.
జాజులమ్మ అవతారాన్ని చూసి ఈర్లచ్చిమి విషయం గ్రహించింది. గది లో మొద్దు నిద్ర పోతున్న కొడుకును చూసి అసహ్యించుకుంది. జాజులమ్మ అత్త మొహం లోకి చూడ లేక పోయింది. మరో రెండు రాత్రులు కూడా ఇలాగే విశేషం ఏమీ లేకుండానే గడిచి పోయింది

***

          పీరయ్య బిడ్డను చూసి పోను పండ్లు పట్టుకొని వచ్చాడు , మరో రెండు రోజుల తరువాత. రాజయ్య ,సైదులు ఏమీ పలుకలేదు. బావా ?ఎట్లున్నవ్ ?
కొడుకా ! ఏడ పన్జేత్తానవ్ ? అని అడిగినా మాట్లాడకపోయేసరికి కొంత బాధ పడ్డా ఈర్లచ్చిమి చూపిస్తున్న ఆప్యాయత తో పెద్దగా పట్టించు కోలేదు. చెల్లే !బిడ్డను ,అల్లుణ్ణి రెండోద్దులు మా ఇంటికి తొలక పోనా ?అడిగాడు.

          అప్పుడే బిడ్డ మీద బెంగటీలినవానే ?ఇంకో రెండోద్దులు పోనీ ,నేనే తోలిత్త!ఇప్పుడిప్పుడే ఇక్కడ అలవాటు పడుతాంది.మల్ల . అన్నది. ఆమె మనసులో జాజులును,సైదులును దగ్గర చేయాలనే కోరిక బలంగా ఉండడం వల్ల, ఇప్పుడు పీరయ్య తో పంపిస్తే తను అనుకున్నది చేయలేనని అలా అన్నది.

          జాజులు అత్త మొహం చూసి చిన్నవోయినా తను చెప్పినట్టు వినాలనుకొని ఏమీ మాట్లాడలేదు.

          బిడ్డా !నువ్వేమంటవ్?అడిగాడు.

          అత్త చెప్పినట్టే కానీ ,నాయ్నా !నేనూ ఆయన వత్తంతీ !నువ్వు రెండు దినాలు ఉండిపో !అన్నది. అట్నే !అంటాడేమోనని ,తానె ముందుగా ఈర్లచ్చిమి ,
ఈ తాపకు పోనీయ్ బిడ్డా !మల్ల త్తడు తీ!ఏం పనులున్నయో !ఏందో!అని సర్దింది.

          అవును తల్లీ !ఉండబట్టలేక ఉరికచ్చన గని, మన వాడెమ్మటి గుడిసెలు సదిరేటివి చానా ఉన్నయ్.వచ్చేది వానాకాలమాయే !ఏగిరంగ చెయ్యాలే.అత్తన్నట్టు ఈ తాపకు పోనియ్.మల్లత్త.అని తెల్లవారుజామున వెళ్ళిపోయాడు.

          జాజులూ !నాయ్నను ఉండనియ్యలేదని గుస్సగాకు బిడ్డా !నువ్వు,సైదులు కూడి ఉండేదాక మిమ్మల్ని ఎక్కడికి తోలద్దని అనుకుంటాన.అర్థం జేసుకో బిడ్డా !అన్నది.

          నువ్వు ఎట్లా జెప్తే గట్లనే అత్తా !అన్న జాజులుతో, నేను ఏది జెప్తే దానికి అట్నే అనుడు గాకుంట నువ్వు సుతం తెలివిగ ఉండాలే.ఆన్ని నీవైపుకు తిప్పుకోవాలే.సరేనా ?అడిగింది తల నిమురుతూ .

          జాజులు తలాడించింది.

***

ఆ సాయంత్రం ,

          లచ్చిమీ !ఓ లచ్చిమీ !గుడికాడ బాగోతం ఆడుతాండ్రట. పోదాం రారాదు. ఇన్నోద్ధులు ఎప్పుడు మొగుడేట్లా? కోడుకేట్లా అని బయట కాలువెట్టవోతివి. కోడలచ్చింది గదా! ఇప్పుడన్న రారాదు. అనుకుంటూ నాలుగిండ్ల అవతల ఉండే సుందరమ్మ వచ్చింది.

          అవును,మంచి ముచ్చట పట్టుకచ్చినవే !సుందరీ !ఇగ ఇప్పట్నుంచి నేను సుత నువ్వెటంటే ఆటే సై అనుడే.అన్నది సంతోషంగా.

          ఒసినీ !నీ సంబురం జూత్తే ఇప్పుడే పొయి ఆడ కూసుందం అనేటట్టున్నవ్?బువ్వదిను ,తెల్లందాంక జెప్తారట.మల్ల.అని ,

          ఓ పిల్లా !నువు సుతం వత్తవా?అని అడిగి, అయినా లగ్గమైన కొత్త మురిపెం నీ మొగుణ్ణి ఇడిసి పెట్టి నువ్వేమత్తవ్ ?తీ!అని ముసి ముసి నవ్వులు నవ్వింది సుందరమ్మ , జాజులును చూస్తూ.

          నీకుఎకసెక్కాలు ఎక్కువైతానయే !అని ఈర్లచ్చిమి గూడా నవ్వడం తో
తయ్యారుగుండు, మల్లత్తనని సుందరమ్మ వెళ్లిపోయింది.

          బిడ్డా !నువ్వూ నాతోనే బువ్వతిందువు రా !అయ్యా ,కొడుకులు అచ్చేటాళ్ళకు నడిజామైతది ,అని తానె ఇద్దరికి వడ్డించింది.

          సుందరమ్మ మాటలు ఇంతివి గదా !కొత్తగ లగ్గమైనోళ్ళు చిలకా గోరింకలెక్క సంబురంగ ఉండాలే !అది నీతోనే గావాలె. గందుకోసమే నేను ఈ బాగోతం కు పోతాన. అట్నుంచి ఆటే మీ మామను కూడా తొలక పోతా! సైదులు తోని మంచిగుండు బిడ్డా !అత్తను, ఇంతకంటే ఎక్కువ నేనేం జెప్పలేను,అని తలుపులు పైలంగ ఏసుకొని పండు కొండ్రి ,అని చెప్పి సుందరమ్మరాగానే వెళ్లిపోయింది ఈర్లచ్చిమి.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.