మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 1

-చెంగల్వల కామేశ్వరి

          మా నేపాల్ టూర్ తర్వాత  రెండున్నరేళ్ల తర్వాత కరోనా ప్రభావం తగ్గిందన్న భరోసా వచ్చాక “శ్రీ వైష్ణుమాత యాత్ర తో శ్రీకారం చుట్టాను.
 
          ఇలా మార్చిలో ఎనౌన్స్ చేసానోలేదో అలా అలా రెస్పాన్స్ వచ్చేసింది. మాతో నేపాల్ వచ్చిన మా ఇష్టసఖి రాజ్యశ్రీ పొత్తూరి, ప్రియసఖి ఉమాకల్వకోట, అభిమాన సఖి వాణి వాళ్ల ఫ్రెండ్స్ కి బంధువులకు చెప్పడం వారంతా రావడానికి సుముఖత  వ్యక్తం చేసాక నా నెంబర్ ఇవ్వడం తో ఇరవై తొమ్మిది మందితో చక్కని గ్రూప్ ఏర్పడింది.
 
          ఇంక ప్రయాణానికి ట్రైనా విమానమా అని తర్జనభర్జనలు పడి చివరకు విమాన మయితేనే మంచిదని అందరికీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు నాకు ఒక బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ కలిగింది. అది అందరికీ చెప్పండి. అందరూ జాగ్రత్త పడతారు అని మా వాళ్లన్నారు. కానీ, మా యాత్ర పూర్తి అయ్యాకనే చెప్పాలి అని ఎవరికీ చెప్పలేదు. అమ్మవారి దయవలన అన్నింటినీ అధిగమించి మా యాత్రను విజయవంతంగా ముగించాము. అదేమిటో అందరికీ చెప్పాకనే యాత్రా విశేషాలు మొదలు పెడతాను.ఈ భాగం కాస్త విస్తృతంగానే  చెప్పవలసిన విషయాలు ఉండటం వలన  కాస్త పెద్దగానే ఉంటుంది. మా యాత్ర అంతా ఒకెత్తు!  ఈ వైష్ణుమాత యాత్ర ఒకెత్తు కాబట్టి కాస్త ఓపికగా చదవాలి.
 
          ఇంక వైష్ణుదేవి  యాత్ర చాలా కష్టమైనదని నడవలేనంత దూరమని చాలామంది చెప్పడం యూట్యూబ్ వీడియోల లో చూడటం వలన  దర్శనానికి యాత్రా పర్చీ తప్పనిసరి అంటే మొబైల్ యాప్ లో యాత్రాపర్చీలు అందరికీ బుక్ చేసాను.
 
          ఎక్కువ మంది పెద్దవారున్నారు కాబట్టి హెలికాప్టర్ అప్ అండ్ డౌన్ టికెట్స్ కొనుక్కుంటే దర్శనం ఈజీగా చేసుకోవచ్చు. అన్న ఒక మిత్రుని మాటను పరిగణనలోకి తీసుకుని ఆ టికెట్స్ కొనడానికి మన గూగులమ్మ ని ఆశ్రయించాను. 
 
          ఆవిడ చూపించిన అనేక వెబ్ సైట్స్ లో ఒకటి “వైష్ణుదేవి సెరైన్ బోర్డ్” ఎంచుకుని అప్ అండ్ డౌన్ టికెట్స్ 3460 అని చదివి బుక్ నౌ అన్నది క్లిక్ చేసాను. 
 
          అదే నేను చేసిన పొరపాటు ఎందుకంటే ఆ వెబ్ సైట్స్ ల లో అసలయిన అఫిషియల్ వెబ్ సైట్ ని ఎంచుకోక పోవడం అసలయిన అఫీషియల్ వెబ్ సైట్స్ కి లోగో ఉంటుంది ఫేక్ వెబ్ సైట్స్ కి AD అని ఉంటుంది. ఈ విషయం నాకు క్షవరమయ్యాక వివరం తెలిసిందన్నట్లు  తర్వాత తెలిసింది. నాకు లాగా గూగులమ్మ సెర్చింగ్  లో ఎవరూ మోసపోకూడదని ఫేక్ వేబ్ సైట్ల బారిన పడకూడదని ఇదంతా రాస్తున్నాను.
 
          ఇంతకీ “బుక్ నౌ  క్లిక్ చేసాను కదా! అది తిన్నగా ఒక వాట్సప్ కి తీసుకెళ్లింది. హెలికాప్టర్ బొమ్మ డిపి తో ఉన్మ ఆ వాట్సప్ నుండి అంకిత్ అగర్వాల్ ( ఫేక్ నేమ్) అన్నవాడు  సెరైన్ బోర్డ్ ఎంప్లాయ్ అని పరిచయం చేసుకుని నాకు టికెట్స్ పంపిస్తాను అని ముందు అందరి ఆధార్ కార్డ్స్  పంపమన్నాడు. అందరివి పంపాక ఒకొక్కరికి 3460 లెక్కన డబ్బులు గూగుల్ పే అంటే నేను వద్దని బ్యాంక్ డిటైల్స్ పంపమన్నాను. సగమే కడతాను. అన్నీ వచ్చాకే మిగతా ఎమౌంటు పంపిస్తాను అన్నాను. అంటే “సరే! అని  సెరైన్ బోర్డ్ పేరుతో ఉన్న ఒక బ్యాంక్ అకౌంటు నెంబర్ ఇచ్చాడు. అది చూసి నమ్మకం కల్గి ముందర సగం మంది అమౌంటు వేసాను. వెంటనే అయిదు టికెట్స్ వచ్చాయి.( (ఇవికూడా ఫేక్ ) మిగతావన్నీ రావాలంటే మొత్తం అమౌంట్  వేస్తేనే వస్తాయి అన్నాడు. సరేలే అని మొత్తం అమౌంటు 1,00340 వేసాను. ఒక పావుగంట తర్వాత టికెట్స్ వస్తాయి వెయిట్ చేయండి అన్నాడు. నాకు గుండె దడ మొదలయింది. ఇంత వేసాను పర్వాలేదా అనుకుంటూ ఉన్నాను. పావుగంట తర్వాత వాడి ఫోన్ మీది గ్రూప్ కాబట్టి ట్రావెల్ ఇన్సూరెన్స్  తప్పనిసరి ఒకొక్కరికి 1950 పంపాలి అంటే 47400 రూపాయలు. అదేమిటి నువ్వు ముందు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావు మాకు ఏ ఇన్సూరెన్స్ అక్కరలేదు టికెట్స్ పంపించు. అని గట్టిగా అన్నా వాడు అలా కుదరదు. అవి పే చేస్తేనే వస్తాయి. అని అంటే ఇంక తప్పేదేముంది అనుకుని మా మెంబర్స్ కి చెప్పి వారు పంపాక ఆ డబ్బులు కూడా పంపాను. ఏదో టెన్షన్ మనసు లో అనుమానం మొదలయింది. కాని తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో “దేముడా !దేముడా ! అనుకుంటూ  కూర్చున్బాను. 
 
          మళ్లీ కాసేపయ్యాక   వాడి ఫోన్  మీరు పంపిన టికెట్స్ అన్ని స్టక్ అవుతున్నాయి. రెన్యూ చేయాలి. మొత్తం టికెట్స్ అమౌంటు మళ్లీ పంపిస్తే టికెట్స్ వచ్షేస్తాయి.. మీ డబ్బులు మీకు వొచ్చేస్తాయి. అని మొదలెట్టే సరికి  నాకు కోపం నషాలానికెక్కింది.
పంపిస్తావా టికెట్స్ పంపించు లేదా మా డబ్బు మాకు వాపస్ పంపు అని గొడవపడ్డాను. నేనెంత గట్టిగా చెప్పినా వాడు కూల్ గా మీరవి పంపిస్తేనే  టికెట్స్ వస్తాయి. లేకుంటే మీ డబ్బులు రిఫండ్  అవడానికి 14 రోజులు పడుతుంది అనితప్ప ఇంకొకటి చెప్పడం లేదు. ఒక పక్కన మా ఇంట్లో వసంత నవరాత్రులు హడావిడి! ఇక్కడ నాకు అలజడి! 
 
          ఏమైతే అయిందని వాడి ఫోన్స్ ఆన్సర్ చేయడం మానేసి మా కోడలు నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాము. అక్కడ అన్ని వివరాలు అడిగి 1930 కిచేసి వివరాలు చెప్పమన్నారు. లక్ష లోపు నష్టమయితే లోకల్  పి ఎస్  అంతకు మించి అయితే గచ్చిబౌలి లో ఉన్న సైబర్ క్రైమ్  కి వెళ్లి FIR బుక్ చేయాలన్నారు. 
 
          మరునాడు శనివారం  నా వాట్సప్ కి ఒక ఫార్మట్ రావడం అది ఫిలప్ చేసి ఆన్ లైన్ లో అప్లోడ్ చేస్తే ఒక అకనాలెడ్జ్ మెంట్ వచ్చింది. అది తీసుకుని గచ్చిబౌలిలో ఉన్న సైబర్ క్రైమ్ ఆఫీస్ లో కంప్లైంట్ బుక్ చేయమన్నారు.
 
          మర్నాడు మా అబ్బాయితో వెళ్లాను. కాని శెలవు సోమవారం మంగళవారం వరసగా వెళ్లాల్సి వచ్చింది. మొత్తానికి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను.  ఇంక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా నాలో నే ఉంచుకుని అతి కొద్దిమందికి ఇలా జరిగిందని చెప్పాను. ఈ జరిగినదానికి నేనే జవాబుదారీ కాబట్టి మా టూర్ మెంబర్స్ కి కూడా చెప్పకుండా యధావిధిగా టూర్ ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టాను.
 
          అసలయిన అఫిషియల్ వెబ్ సైట్ లో చూస్తే హెలికాప్టర్ బుకింగ్స్ అయిపోయాయి.
 ఎప్పటిలాగే పదకొండు రోజులకు సరిపడా స్నాక్స్, స్వీట్స్, ఊరగాయలు, పట్టుకెళ్లాలంటే  ఫ్లైట్ లో లగేజ్ ప్రాబ్లం!  అందుకని మా టూర్ లో వచ్చే  జంటలకు  పది రకాల స్వీట్ హాట్ ఉన్న ట్విన్ బ్యాగ్స్ ఆర్డరిచ్చి వారినే  తీసుకురమ్మని  రిక్వెస్ట్ చేసాను. ఆ బిల్ నేను పే చేసేస్తాను అని చెప్పాను. 
 
          వారంతా సహృదయంతో  అలాగే సహకరించారు.
 
1)అరిసెలు జంతికలు – 
ఉమాకల్వకోట దంపతులు
2)బందరులడ్డు-సన్నకారపూస 
-పద్మలత దంపతులు
3)కాజా- కారబ్బూంది –
అనంతశయనం దంపతులు
4)మినపసున్ని చేగోణీలు- 
ఉమామహేశ్వర్ దంపతులు
5)బెల్లం గవ్వలు మిక్చర్- 
కెవి రావు దంపతులు
6)మైసూర్ పాక్ మురుకులు-
 వాణీ దంపతులు
7)రవ్వలడ్డు- చెక్కావడలు
 రాజ్యశ్రీ దంపతులు
8)కజ్జికాయలు కారప్పూస 
శ్రీనివాసరావు దంపతులు
9)పాలకోవా రిబ్బన్ పకోడీ 
వెంకటేశ్వరరావు దంపతులు
          ఈ రకంగా మంచి క్వాలిటీ కల స్నాక్స్ అందరూ తెచ్చారు. ఇంక పచ్చళ్లు ఎప్పటి లాగే అన్నీ నేను చేయకుండా మన మిత్రురాలు శ్రీమతి దమయంతీ పోలిన గారి భధ్రాధ్రి పికిల్స్ కొన్ని తెప్పించాను.
 
          అనుకున్నట్లుగా అందరం  శంషాబాద్ విమానాశ్రయంలో కలుసుకున్నాము . ఆరోజు ఉదయం ఆరుగంటలకి మా ఫ్లైట్  ముందు ఢిల్లీ అక్కడి నుండి జమ్మూ ! ఆరు గంటల ప్రయాణం ! ఫుడ్ చపాతీలు కూర నేను ఆర్డర్ చేసాను. పులిహోర శ్రీమతి  కెవి లక్ష్మి గారి చేత ఆర్డర్ చేయించాను. ఆ రోజు అందరం జమ్మూ వెళ్లి మమ్మల్ని పికప్ చేసుకున్న టెంపో ట్రావెలర్స్  లో కాట్రా లోని హొటల్ కి చేరాము.
 
          ఆరోజు సాయంత్రం హొటల్ లో దర్శనానికి ఎలా వెళ్లాలి అని ఆ హొటల్ మానేజర్ ని అడిగితే14. కిలోమీటర్స్: నడిచి వెళ్లొచ్చు  అన్నాడు. మేము నడవలేని వారిమయ్యా అంటే  రోహిత్ అనే అబ్బాయిని రప్పించాడు. 
 
          ఆ అబ్బాయి అతని ప్యాకేజి చెప్పాడు. 9500 ఇస్తే డోలీ కేబుల్ కార్ , రోప్ వే స్పెషల్ దర్శనం చేయిస్తాను వెయిట్ ఎక్కువ ఉన్నవారికి  మరో వెయ్యి అదనం అన్నాడు. చేసేది లేక సరే అన్నాము. మర్నాడు తెల్లవారు ఝాము 3-30 am కి రెడీ గా ఉండమన్నాడు. ఎవరూ మొబైల్స్ తేకూడదన్నాడు. నేనొక్కదాన్ని పట్టుకొస్తానంటే సరే అన్నాడు. అలాగే అతని మాట ప్రకారం  రెడీ అయ్యాము. అందరినీ ఆటోల లో తీసుకుని వెళ్లాడు.  అక్కడికెళ్లాక అక్కడున్మ డోలీల వాళ్లు రావడం అందర్నీ  స్వయంవరం లాగా పరికించి  చూడటం సన్నగా ఉన్న వాళ్లని పట్టుకు పోవడమే ట్యాగ్ వేయడం , వాళ్లని డోలీ ఎక్కించుకుని వెళ్లడం! చూసి మాకు ఒకటే నవ్వు! వాళ్ల కళ్ల ముందు  ఏ స్కానర్స్ పనిచేయవు అనిపించింది. అలా అంచెలంచెలుగా వాళ్లు రావడం మా అందరినీ చెక్ చేసుకోవడం ఏరుకోవడం ఒక నవ్వుల ప్రహసనం ! ఒక ఇరవై అయిదు మందిని డోలీ లో మిగిలిన  నలుగురినీ గుర్రం ఎక్కించి కేబుల్ కార్ దాకా రావాలన్నాడు. దారిలో ఆ డోలీ వాళ్లకి ఏది కావాలంటే అదిప్పించాలి ఫుడ్ తినిపించాలి అని చెప్పాడు.
 
          మా లో చాలామంది కి  అలా డోలీ లు ఎక్కాలంటే  బాధ అనిపించింది. అది వారి జీవనోపాధి అయినప్పటికీ   ఇలా ఎక్కడం తప్పుఅనిపించింది.
 
          నిజానికి మొత్తం కేబుల్ కార్లు వెళ్లగల రోడ్ ఉంది. కాని  ఆ డోలీ , గుర్రాల మీద ఆధారపడి  చాలా మంది బ్రతుకుతున్నారు. గవర్నమెంట్ ఏదయినా చేద్దామన్నా చేయనివ్వరుట! కాని  అందరినీ ఇలా మోసి మోసి కాయలుకాసిన వారిచేతులను , భుజాలని, చూసి కళ్లనీళ్లు వచ్చాయి. అందుకే వారేదడిగినా కాదనకుండా మరింత ఖర్చు పెట్టారు మా వారందరూ! 
 
          భూమికి ఎన్నో వేల అడుగుల ఎత్తులో కొండల మీద నుండి వేసిన ఎత్తుపల్లాలు గా ఉన్న ఏటవాలు రోడ్లో అటు ఇటు వేసిన ఫెన్సింగ్ తో  పైన నడకదారి అంతా  రేకులు కప్పిన షెడ్ ఫినిషింగ్ తో  చాలా సురక్షితంగా ఉంది.  ఆ రహదారి లో  చేతికర్ర సహాయంతో నడుస్తూ వచ్చీ వెళ్లే జనాలు. ఇలా డోలీలు ఎక్కిన మమ్మల్ని చూసి నవ్వుతుంటే కాస్త సిగ్గు వేసింది.
 
          దారిపొడవునా ఉన్న రకరకాల దుకాణాలు ఫొటో స్టూడియోలు  హొటల్స్ మీదుగా   దారి పొడవునా మైకుల లో అమ్మవారి స్త్రోత్రాలు వింటూ, కనిపించే ప్రకృతి అందాలకు అచ్చెరు వందుతూ, సుమారు రెండున్నర గంటలు డోలీలో ప్రయాణించి, ఆ తర్వాత రోహిత్ ఎక్కించిన   కేబుల్ కారులో ఒక గంట ప్రయాణించి వైష్ణవీ  అమ్మవారి గుడి సెంటర్ వరకు చేరాము . మావాళ్లందరూ వచ్చేదాకా ఆగి అందరినీ తీసుకుని, రోహిత్ ని అనుసరిస్తూ పచ్చని ప్రకృతిలో రాయంచలా కనిపిస్తున్న  తెల్లని భవన సముదాయం అల్లంత దూరానే కనిపించింది. కానీ అంతస్తుల వారీగా కట్టిన అమ్మవారు నెలవై ఉన్న గుడిదాకా సుమారు కిలోమీటర్  దాకా నడిచి ఆమెట్లన్నీ ఎక్కి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. పూర్వంలా పొడవాటి గుహలో ఉన్న అమ్మవారిని  చూడటానికి వంగి పాకుతూ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ గుహని విశాలంగా మలిచారు దీపకాంతులతో ఏసి తో పునద్దరించారు. దేదీప్యకాంతులతో  ఉన్న అమ్మవారిని దర్శించుకున్నాము. కాని మన తిరుపతిలోలాగే  ప్రధాన అర్చకులు అర్చక భటులు జనాలని సరిగ్గా చూడనివ్వకుండా పద !పద  అని  చెవిలో జోరీగలా అరుస్తూ నెట్టేయడం  ఇక్కడా ఉంది.
 
          అప్పటికి ఉదయం  పదకొండు గంటలే అయింది. ఈ లోగా రోహిత్ హెలికాప్టర్ టికెట్స్ తీసుకుని వచ్చాడు .  స్లాట్ టైమింగ్ 12 గంటలకి  హెలిపాడ్ లో ఉండాలి. 12-30 కి హెలికాప్టర్ ఎక్కాలి. ట్రిప్ కి  ఆరు మందినే తీసుకుంటారు. మీరు రోప్ వే ఎక్కి భైరవ్ టెంపుల్ కి వెళ్లి రావడం కుదరదు. మీరు  వచ్చేసరికి  ఆలస్యం అవుతుంది. మనం హెలిపాడ్ కి వెళ్లటం ఆలస్యమయితే హెలికాప్టర్ మిస్ అయితే మీరు కిందకి నడిచే  వెళ్లాలి లేదా! డోలీయే ఎక్కాలి ! అని తొందర పెట్టాడు. అప్పటికే వాతావరణం బాగోలేదు అన్న సూచనలు వచ్చాయని చెప్పాడు. నిజంగానే  ఆకాశం మేఘావృతమయింది
 
ఇంక భైరవ్  టెంపుల్ కి రోప్ వే మీద వెళ్లి వద్దామంటే బుక్ చేసుకున్న టికెట్స్ వేస్ట్ అవుతాయి. ఆ గుడికి వెళ్లకపోతే ఎలా అన్న సందిగ్ధంలో పడి చివరకు అక్కడి నుండి కనపడుతున్న భైరవ్ టెంపుల్ కి దణ్ణం పెట్టుకుని హెలీపాడ్ కి వెళ్లటానికి  ఆ రోహిత్ మాట్లాడిన డోలీలు ఎక్కాము అప్పుడు కూడా మాకు స్వయంవరమే! ట్యాగ్ ల హారాలూ వేసేసి పట్టుకు పోవడమే.
 
          ఈలోగా హొటల్ వారికి లంచ్ కి వచ్చేస్తున్నాము అని మాకేం కావాలో మెనూ ఆర్డర్ చేసేసాను . ఇంత సునాయాసంగా అమ్మవారి దర్శనం అయినందుకు పొంగిపోతూ హెలిపాడ్ చేరాము. దారిలోనే పెద్దపెద్ద  ఈదురుగాలి పెద్ద వర్షం మొదలయింది. విపరీతమైన చలి అక్కడ ఉన్న క్యాంటీన్ లో టీ శాండ్విచ్ తప్ప మరేదిలేదు. మేము పట్టుకెళ్లిన స్నాక్స్ తిని టీ త్రాగి కూర్చున్నాము. మొత్తం లాంజ్ లో ఉన్న కుర్చీలు నిండిపోయి నిల్చున్న వారితో రెండు వందల మంది జనాలతో కిటకిటలాడి పోయింది.  ఆ సందడిలో మసాజ్ చేసే యువకులు ఆడా మగా తేడా లేకుండా పాదాలను పిక్కలను భుజాలను చక్కని మసాజ్ చేసే వాళ్లకు వందరూపాయలు ఇచ్చి అందరం మసాజ్ చేయించుకున్నాము.  చాలా రిలాక్స్   అయ్యాము.  వర్షం కాస్త తగ్గగానే హెలికాప్టర్స్ వస్తున్నాయి అని తెలిసి రిలాక్స్ అయ్యాము. అవి రావడం లిస్ట్ లో చేర్చిన వారు కొందరూ వెడుతుండటం మొదలయింది. ఇంక అందరూ కౌంటర్ మీదకి ఎగపడటమే! 
 
          అప్పటికే మాతో వచ్చిన వెంకటేశ్వరరావు గారు చురుకుగా ఆ పద్మవ్యూహం లాంటి క్యూలో ప్రవేశించి మా టికెట్స్ ఆ కౌంటర్ లో ఇచ్చి మా అందరినీ పేరు పేరునా పిలిచి మా ఆధార్ కార్డ్ ని మమ్మల్ని చెక్ చేయించడమొక బ్రహ్మ ప్రళయం అనుకోవాలి.  ఆ తొక్కిసలాటలో మా పద్మలత గారు కట్టుకున్న పమిటకొంగు లో సగం చిరిగిపోయింది  అంటే ఎంత మంది జనమో చూడండి. ఈ లోగా రోహిత్  తనకు రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు.. మొత్తానికి ఆ క్యూలో   వెంకటేశ్వర రావు గారే అందరినీ లిస్ట్  వైజ్ చేయించారు.   
ఇంక హెలికాప్టర్ ఎక్కడమే  వెళ్లిపోవడమే అనుకుని ఉర్రూతలూగిన మమ్మల్నందరినీ నిరాశపరుస్తూ మళ్లీ పెద్ద వర్షం కుండపోత వాన భూమికి అంత ఎత్తులో  ఆ వానలో  ఇరుక్కున్న మాకు దిక్కుతోచ లేదు. అప్పటికి సమయం మూడున్నర  ఉదయం నుండి టిఫిన్ లేదు భోజనం లేదు. కొండ కొమ్ముపైన  ఈ కుంభవృష్టి లో మేము వర్షం తగ్గదు హెలికాప్టర్ లు తిరగవు. అని ఫైనల్ ఎనౌన్స్మెంట్ మీ డబ్బులు మీకిచ్చేస్తాం అని చెప్పారు.
 
          అప్పుడు కూడా  మా వెంకటేశ్వరరావు గారు బాద్యత గా ఆ డబ్బులు అన్నీ ఆయనే కలెక్ట్ చేయడానికి వెళ్లారు. ఇంకా అక్కడే  ఉంటే  చీకటి పడితే దిగటం కూడా కష్టమని అందరం కిందకు దిగుదాము ఎవరికి ఏది దొరికితే దాంతో వెళ్లిపోవాలని కిందకు దిగుదాము అని చూస్తే ఏటవాలు రోడ్లు వర్షంతో తడిసిన రోడ్ల మీద జారకుండా నడవాలి. కింద ఒక్క గుర్రం కాని డోలీ కాని ఏమీ లేవు. అన్నీ కిందకు వెళ్లిపోయాయి. రోహిత్ కి కాల్ చేస్తే మెల్లగా  ఎక్కడ డోలీ ఎక్కారో ఆ సెంటర్ కి రండి కేబుల్ కార్ లో కొంతదూరం ఆ పైన ఏదో ఒకటి మాట్లదాము అన్నాడు.  తప్పదు కదా ! అని నడవటం మొదలు పెట్టాము. ఎవరి దగ్గరా ఫోన్స్ లేవు అందరూ కకావికలు అన్నట్లు కిందకు ముందూ వెనకా అన్నట్లు  నడకే నడక! దారిలో చెక్ పోస్ట్ వాళ్లు మీరు  ఆ గుడి  సెంటర్ కి అటు వెళ్ల కుండా కాట్రా వైపు  వెడితే కేబుల్  కార్ లు మొదలయ్యే దగ్గరకు వెడతారు అన్నాడు. ఇంక మేమంతా ఇటు మా కన్నా ముందు  గుడి నుండి కేబుల్ కార్లు బయలుదేరే  దారిలో వెళ్లిపోయారు. 
 
          ఎవరూ ఏమి చేయలేని పరిస్తితి; ఎంతో కంఫర్ట్ గా చేయాలనుకున్నా ఇలా అయిందేమిటి?  అనుకుంటూ  పడిపోకుండా జారకుండా చిన్నగా నడిస్తే పిక్కల లో క్రాంప్స్ రావడం కాస్తాగి నొప్పి తగ్గాక  దారిలో ఎదురయ్యే గుర్రాలమీద వచ్చే వారిని తప్పించుకుంటూ మళ్లీ నడవటం. చివరికి ఎవరో కర్రలు సంపాదించి  ఇస్తే వాటి సపోర్ట్ తో బాగానే నడవగలిగాము. 
 
          మాతో వచ్చిన అనంతశయనంగారు పెద్దాయన డెభ్బయ్యేళ పైబడ్డ వయసు పద్మలత గారికి ఆపరేషన్ అయిన కాళ్లు  కెవి లక్ష్మి గారికి ఆనెలు ఆపరేషన్ అయిన పాదాలు.  ఇలా రకరకాల  సమస్యలున్నవారు నడకే అలవాటు లేని నాలాంటి వారు పడుతూ లేస్తూ ఎడు కిలోమీటర్స్ నడిచి కిందకొచ్చి డోలీ మాట్లాడుకుని  హొటల్ కి వచ్చేసరికి  రాత్రి తొమ్మిది అయింది. లంచ్ కి వండినవే వేడి చేసి పెట్టిన డిన్నర్ లాగించిన అలిసి పోయిన శరీరాలతో పెయిన్ కిల్లర్స్ వేసుకుని  బేంగే లాంటి  పెయిన్ బామ్స్ రాసుకుని పడుకున్నాము. ఇదీ మా వైష్ణుదేవి యాత్ర లో మొదటి రోజు ప్రహసనం
 
          తిరుపతి నడిచి ఎక్కినట్లుగా ఎక్కగలిగితే ఎక్కువ ఖర్చు కాదు. శ్రమ ఒక్కటే! కింద నుండి పైకి రావాలన్నా  వెళ్లానుకున్నా డబ్బుల ఖర్చే! లేదా హెలికాప్టర్ లో దిగినా, గుడికి వెళ్లడానికి  డోలీకాని గుర్రం  ఎక్కాలి తిరిగి వెళ్లేప్పుడు హెలిప్యాడ్  కి వెళ్లన్నా డోలీ లేక గుర్రం ఎక్కాలి. డబ్బు ఖర్చు తప్పదు. కొత్తగా వెళ్లాలనుకున్న వారికి ఈ వివరాలు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. వైష్ణవీ దేవి టెంపుల్ వివరాలు భైరవ్ టెంపుల్  యొక్క  విశిష్టత రేపు తెలియచేస్తాను.

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.