అప్ప‌డాలు (కథ)

-గీత వెల్లంకి

          ఆ రాత్రి ఎప్ప‌టిలాగే – ఆడ‌ప‌డుచు పిల్ల‌లిద్ద‌రూ, అత్త‌గారూ, నేనూ-చిన్నీ మా గ‌దిలో ప‌డుకున్నాం. శెల‌వుల‌కి వ‌చ్చారు క‌దా! త‌న‌కి తెల్లారి ఆఫీసుంది అని అత్త‌గారి రూంలో ప‌డుకోమ‌న్నాం. 
 
          ఉన్న‌ట్టుండి వీపు వెన‌క మెత్తగా రెండుసార్లుగా గుద్దిన‌ట్లు అనిపించింది. రెండున్న‌ర‌యింద‌నుకుంటాను. వెన‌క్కి తిరిగి చూసే స‌రికి ర‌మ్మ‌ని సైగ చేసి గ‌దిలోంచి వెళ్ళిపోయారు.
 
          వెళ్ళి చూద్దును క‌దా – కూల‌ర్ ఆపేసి ఉంది – ‘ఏమిట‌ని’ అడిగితే ‘పొట్ట‌లో మంట‌గా ఉంద‌’ని మొహం ఎలాగో పెట్టారు. 
 
          ‘మ‌జ్జిగ‌లో పంచ‌దారేసి ఇస్తాన‌ని’ వెళ్ళి క‌లిపి తెచ్చే లోప‌ల మ‌ళ్ళీ మంచం మీద ప‌డుకుని క‌నిపించారు. లేపి మ‌జ్జిగ తాగ‌మ‌ని ప‌క్క‌నే కూర్చున్నాను. 
 
          కూల‌ర్ ఆన్ చేసి ప‌డుకోమ‌ని చెప్పి నేనెళ్ళి మ‌ళ్ళీ చిన్నీ ప‌క్క‌న న‌డుం వాల్చానో లేదో కూల‌ర్ ఆగిపోయిన చ‌ప్పుడు! మ‌ళ్ళీ లేచి వెళ్ళాను. ఒంగుని లేచీ ర‌క‌ర‌కాల ఆప‌సోపాలు ప‌డుతున్నారు.
 
          ‘ఏమిటీ ఇలా చేస్తున్నారు’ అంటే – ‘ఏమిటో త‌గ్గ‌ట్లేదు’ అన్నారు. వెళ్ళి బాల్కానీలో సిగ‌రెట్ కాల్చుకుని వ‌స్తాన‌ని వెళ్ళి వెంట‌నే లోప‌లికి వ‌చ్చేశారు. నోటికి సిగ‌రెట్ కూడా హిత‌వుగా లేద‌న్నారు. అయితే ‘108 అంబులెన్స్ పిల‌వ‌నా పోనీ’ అని జోక్ చేశాను. ఇద్ద‌రం న‌వ్వుకున్నాం!
 
          జెల్యూసిల్ టేబ్లెట్స్ ఉండాలి ఎక్క‌డో – వెతికితే దొర‌క‌లేదు! బాత్‌రూంలోకి వెళ్తుంటే ‘త‌లుపేసుకోకండి’ అన్నాను – అయినా వేసుకున్నారు. 
 
          ఇంక మెల్ల‌గా వెళ్ళి అత్త‌గారిని లేపాను. ఆవిడేమో – ‘కింద సాయిగాడిని లేపుదాం – వాడైతే స్కూట‌ర్ మీద హాస్పిట‌ల్ కి తీసుకుపోతాడు’ అంటారు. ‘వాడితో గొడ‌వైంది క‌దా వ‌స్తాడా’ అని నా అనుమానం. 
 
          అయినా వెళ్ళి ఫ‌స్ట్ ఫ్లోర్ లో సాయిగాడి త‌లుపు కొడితే లేచాడు. కానీ – గ్రిల్లు లోంచి బ‌య‌టికి రాకుండానే ఏదో గొణిగి, ‘ఈ టైంలో ఏం హాస్పిటలండీ నేను రాను’ అనేసి త‌లుపేసేసుకున్నాడు.
 
          నేను హైద‌ర్ కి ఫోన్ చేశాను – ‘మీ షాపుకి పాలు వేసే వేన్ వ‌స్తుంది క‌దా! అది కొంచెం పంపు భాయ్ ఇలా హాస్పిట‌ల్ కి వెళ్ళాలి’ అని. తీరా ‘వాడు ఇంకా రాలేదు, రాగానే పంపుతాన‌’న్నాడు.
 
          ఈలోగా ‘నేను న‌డుస్తాను – రోడ్డు దాకా వెళ్ళి ఆటో ఎక్కుతాం’ అన్నారు. వెళ్ళే ముందు నాకో వంద రూపాయ‌లిచ్చి – ‘నువ్వు రావాల్సి ఉంటుందేమో ఉంచు’ అన్నారు – ‘నేనెందుకు రావ‌డం మీరే వ‌చ్చేయండి’ అన్నాను న‌వ్వుతూ!
 
          వాళ్ళు అలా సందు చివ‌రికైనా వెళ్ళారో లేదో హైద‌ర్ ఫోన్ చేసి ‘వేన్ పంపుతున్నాన‌ని’ చెప్పాడు.
 
          నేను త‌న‌కి ఫోన్ చేసి ఇలా ‘వేన్ వ‌స్తోంది వెన‌క ఆగ‌మ‌ని’ చెప్పాను. ‘స‌రే పంపు’ అని పెట్టేశారు. అంతే ఇక‌! ఆ త‌ర్వాత నేను ఫోన్ చేస్తే తీయ‌లేదు.
 
          నాకు నిద్ర ముంచుకొస్తోంది – నాలుగున్న‌ర‌యింది. ఇంకేం నిద్ర‌పోతాంలే అని నిద్ర ఆపుకోవ‌డానికి డైనింగ్ టేబుల్ మీద హాట్ పేక్ లో వేయించిన అప్ప‌డాల ముక్క‌లుంటే తింటూ ఏదో పుస్త‌కం తీసుకుని పేజీలు తిర‌గేస్తున్నాను. ఎప్పుడు నిద్ర‌పోయానో కూడా తెలీదు. 
 
          ఫోను మోగిన శ‌బ్దానికి మెల‌కువ వ‌చ్చింది. అత్త‌గారు – ‘చాలా అన్యాయం జ‌రిగిపోయింది!’ అంటూ ఏడుస్తున్నారు. 
 
          కంగారేసినా త‌మాయించుకుని ‘ఏమైంద‌ని అడిగితే – డాక్ట‌రు లోప‌ల చూస్తున్నారు, ఏదో ఇంజెక్ష‌న్ ఇచ్చారు – పెద్ద‌గా కేక పెట్టాడ‌ని ప‌రుగెత్తాను. వాళ్ళు న‌న్ను బ‌య‌టికి తోసి త‌లుపేసేశారు’ – అని చెబుతూ ఏడుస్తున్నారు. ‘ఏం కాదులెండి బానే ఉంటుంది – వాళ్ళు పిలుస్తారు క‌దా ఉండండి’ అని చెప్పి ఫోన్ పెట్టేశాను.
 
          త‌న టీమ్ మేట్ అర‌వింద్‌కి ఫోన్ చేసి ‘అత్త‌గారు ఒక్క‌రే హాస్పిటల్ లో ఉన్నారు వెళ్ళ‌మ‌ని’ చెప్పాను. కాసేపాగి అర‌వింద్ ఇంటికొచ్చాడు – ‘డ‌బ్బులేమైనా ఉన్నాయా’ అంటూ! 
 
          త‌న ప‌ర్సూ డెబిట్ కార్డులూ ఇచ్చేసి పిన్ తెలియ‌దా అని అడిగాడు. నా ద‌గ్గ‌ర త‌ను ఇచ్చిన వంద త‌ప్ప ఇంకేం లేవు! ఇక ప‌క్కింటి భాగ్య‌ని లేపి రెండు వేలు తీసుకున్నాను. అర‌వింద్ చెప్పిన ఇంకో మాట నా బుర్ర‌కి ఎక్క‌లేదు – ‘హార్ట్ రెస్పాండ‌వ‌ట్లేదు, డాక్ట‌ర్లు ట్రై చేస్తున్నారు’ అని!  అప్ప‌టికే అంతా అయిపోయింద‌న్న‌సంగతి ఎందుకు ఎక్క‌లేదో మ‌రి!
 
          కాసేపాగి అత్త‌గారు ఇంటికొచ్చేశారు అర‌వింద్ బండిమీద‌. వ‌స్తూనే నా మీద గ‌య్యిమ‌ని అరిచారు – ‘మొహానికి ఆ బొట్టు ఎక్క‌డ పెట్టుకోవాలో తెలీదా’ అని! చూస్తే స్టిక్క‌ర్ జుట్టుకి ప‌ట్టుకుని వేలాడుతోంది. 
 
          స‌రిచేసుకుని లోప‌లికెళ్ళి కాఫీ క‌లిపి తెచ్చాను. ఆవిడ ఏం మాట్లాడ‌టం లేదు. ఇంత‌లో జ‌య వ‌చ్చింది – ఆవిడ‌తో ర‌హ‌స్యంగా ఏదో మాట్లాడి మ‌ళ్ళీ బ‌య‌టికెళ్ళి ఫోన్ చేసి గంద‌ర‌గోళంగా మాట్లాడుతోంది. 
 
          నేను వెళ్ళి ‘ఏమైంద‌ని’ అడిగాను. ముందు సందేహించింది – కానీ చెప్పేసింది – ‘ఎంత ట్రై చేసినా ఏం కాలేదు ఇంటికి తీసుకొస్తున్నారు’ అని!
 
          ఇక త‌ర్వాత జ‌రిగిన చెదురు మ‌దురు సంఘ‌ట‌న‌ల త‌ర్వాత ఇప్ప‌టికి జీవితం మ‌ళ్ళీ ఒక దారిలో ప‌డింది – కానీ, మ‌ళ్ళీ ఎప్పుడూ నేను అప్ప‌డాలు తిన‌లేదు!

*****     

Please follow and like us:

2 thoughts on “అప్ప‌డాలు (కథ)”

Leave a Reply

Your email address will not be published.