నిష్కల – 20

– శాంతి ప్రబోధ

జరిగిన కథ: కేఫ్ లో నిష్కల, గీత, సారా కలుస్తారు. కావేరిని చూడడానికి వచ్చిన శోభ గోదావరి తమ్ముడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లలో గాయపడ్డాడని తెలిసి ఆందోళన పడుతుంది.   తన రొమ్ముల గురించి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఇచ్చిన మహిళ ట్వీట్ చూసి సరైన సమాధానం ఇచ్చిందని, మహిళకు ఆ ధైర్యం లేకపోతే ఈ ప్రపంచంలో కష్టం అనుకుంటుంది శోభ. 

***

నిష్కల కి నిద్ర పట్టడం లేదు .
ఆమె చేతిలో సెకండ్ సెక్స్ పుస్తకం..
ఆమె ఆలోచనలు మాత్రం ఎటు నుంచి ఎటో తాడు బొంగరం లేకుండా సాగుతున్నవి కాస్త గీత దగ్గరకి వచ్చి అడ్డుకట్ట పడినట్టు ఆగాయి. మనుషుల మధ్య సంబంధాలు ఎందుకింత క్లిష్టంగా మారిపోతున్నాయి. ప్రేమ గుడ్డిది. అంతులేని ఆకర్షణలో వశ పరచుకునే కోరిక, ఆలోచన లేకుండా చేసిందేమో అనుకోవచ్చు. కానీ గీత విషయం అలా కాదు. పెద్దలు తెచ్చిన సంబంధం. పెద్దల ఇష్టప్రకారం పెళ్ళికి సిద్ధమైన జంట. ఎలాగూ పెళ్ళి చేసుకోబోతున్నాం కదా .. కోరికలకు కళ్లెం వేయడం ఎందుకని ఏకమైన జంట..
ఆ జంటలో ఒక పక్షి చెప్పాపెట్టకుండా ఎగిరిపోతే ఎంత యాతన గా ఉంటుందో అర్థం చేసుకోగలదు. కానీ ఆమెకు న్యాయం ఎలా అందివ్వ గలదు? అది తన పరిధిలో లేనిది కదా..

          ఎంత చెప్పినా గీతకు అర్థం కాదు. అర్థం చేసుకోదు. అతను నా భర్త. అంతకు మించి ఆలోచించ లేను అంటుంది. 

          అసలు తల్లిదండ్రులు పిల్లలకు ఏమి నేర్పిస్తున్నారు? రాత్రీ పగలూ చదివి ర్యాంకులు సాధించడం, ఆ తర్వాత కెరీర్ లో ఎదగడం, డబ్బు పోగేయడం ఇదేనా?
ఇదేనా మనిషికి కావాల్సింది? జీవితాన్ని ఎంత ఇరుకుగా మార్చేస్తున్నారు?
ఇరుకైన జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, తలకు బొప్పి కట్టినప్పుడు, మోకాళ్ళ చిప్పలు విరిగినప్పుడు తలకిందులై బాధ పడతారు తప్ప వాటిని ఎదుర్కోవడం, మందు వేయడం తెలియదు. జీవితాన్ని గివ్ అప్ చేయడానికి సిద్ధమైపోతున్నారు.

          దేశాన్ని వదిలి వచ్చిన తర్వాత వేష భాషల్లో వచ్చిన మార్పు, ఆహార విహారాలలో వచ్చిన మార్పు ఆలోచనల్లో రాలేదు ఎందుకు? తాత ముత్తాతల కాలానికి ముందు ఆనాటి పరిస్థితుల బట్టి చేసుకున్న కట్టుబాట్లు, ఆచారాలు మార్చుకోవడం లేదెందుకో?
ఏ నీరైనా నిల్వ ఉంటే కుళ్ళి కంపు కొడుతుంది. అదే పాత కొత్త నీటిని కలుపుకుంటూ ప్రవహిస్తుంటే కమ్మదనం నింపుకుంటుంది. ఆ విషయం తెలిసి కూడా, చదువు సంస్కారం ఉన్నవారు కూడా ఇంకా మురిగిపోయిన నీటి గుంతలో పొర్లుతానంటే ఎలా? బురదని బురదగా గుర్తించాలిగా?

          ఏంటో ఈ మనుషులు.. తానున్న కాలమాన ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకోవాలి కదా.. కొత్త సంస్కారాలను అందిపుచ్చుకోవాలి కదా.!

          గీత అని మాత్రమే కాదు తన దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎంతో మందిని చూస్తున్నది. ఆసియా దేశాల నుంచి వచ్చిన వాళ్లలో సెంటిమెంట్స్ ఎక్కువ. ఇక భారతీయుల్లో చెప్పనవసరం లేదు. అదే కొన్ని సార్లు బలం కావచ్చు కానీ చాలా సార్లు వారి బలహీనత అవుతుంది. జీవితంలో ఎంతో నష్టపోవాల్సి వస్తుంది.

          మనసు కంటే శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల జరుగుతున్న అనర్ధం ఇది. పెళ్ళికి ముందు అమ్మాయి పవిత్రంగా ఉండాలి. ఆమె తనను తాను అతనికి అర్పించుకోవాలి అనే భావన, ఆడపిల్లలకు ఉండవలసిన వర్జినిటీ అబ్బాయికి అవసరం లేదని, మగాడు అని అహంకారపూరిత, పురుషాధిక్య భావజాలం అందుకు కారణం. అది పెట్టడానికి కృషి చేయాల్సిన గీత లాంటి వాళ్ళు కూడా అందులోనే అంటే కుడితిలో పడ్డ ఈగ లాగా కొట్టుకులాడుతున్నారు. అందులోంచి బయట పడలేక పోతున్నారు.

          ఈనాడు అనుభవిస్తున్న స్వేచ్ఛ, ఆదిలాబాద్ నుంచి అమెరికా దాకా చేరగలిగిన స్థితికి రావడానికి కారణం మేమే అనుకుంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదు. మా ఈ స్థితికి బాట వేయడానికి ముందుతరం మహిళలు ఎంతమంది, ఎంత సంఘర్షించారో.. ఎంత పోరాటం చేశారో.. తమని తాము కాపాడుకుంటూ ఎగుడు దిగుడు దారిలో ఉన్న రాళ్ళూ రప్పల్ని ఏరివేస్తూ జాగ్రత్తగా అడుగు ముందుకు వేయడం సామాన్య విషయమా..

          వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. గీత ముత్తవ్వ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నదని ఎంతో గర్వంగా చెప్పే గీత ఇంత బేలగా ఉందేమిటి అని చాలాసార్లు అడిగాను. 

          ఏమో.. అంటుంది గీత.

          ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, స్వేచ్ఛ , స్నేహం వీటిని తమవి చేసుకోవడం కోసం ఎంత పోరాటం చేసి ఉంటారు నా ముందు తరం మహిళలు. ఇప్పుడు నా తరం వాళ్ళు అట్లా ఎందుకు ఉండలేక పోతున్నారు?

          నాన్నమ్మల కంటే ముందు తరం వాళ్ళ లాగా ప్రవర్తిస్తున్నారు. నిజానికి నా తరం ఓ వైపు ప్రపంచమంతా చుట్టి వస్తుంది. మరో వైపు చూస్తే సమాజంలో ఉన్న లింగ అసమానతలు ప్రశ్నించకుండా గుడ్డిగా అనుసరిస్తున్నది.

          ఆధునికులం, నాగరికులం అంటే వేష భాషల్లోనేనా? ఆలోచనల్లో, ఆచరణలో కాదా?

          నా తరం చాలా కన్ఫ్యూజన్ లో ఉందా? సందేహం కలిగింది నిష్కలకి

          అంతలోనే, అసలు ఒక క్లయింట్ గురించి ఇంతగా ఆలోచిస్తున్నదెందుకు?
తమ దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో గీత కూడా ఒకటి . ఆమె గురించి అంత ఎందుకు శ్రద్ధ తీసుకుంటున్నది . తమ ప్రాంతం నుంచి వచ్చిందనా లేక ఆమె పరిస్థితి పట్ల సానుభూతి చూపుతున్నదా.. లేక గీత తో వస్తున్న సారాని చూడడం వల్లనా ..?

          అబద్ధాలు చెప్పే మోసగాడితో ఎంత పోరాడినా గీత విజయం సాధించ లేదు. కారణం అబద్ధాలు చెబుతారు.. అబద్ధాల్లో బతుకుతాడు కదా.. ఆ అబద్దాలతోనే నిన్ను ముంచెత్తుతారు గీతా, అని చెప్పినందుకు ఆమె చాలా హర్ట్ అయింది, వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడానికి ఆమెకి చాలా కష్టంగా ఉంది. మానసికంగా సిద్ధపడడం లేదు. వాస్తవాన్ని వాస్తవంగా స్వీకరించే ధైర్యం లేనంత కాలం ఇంతే..

          గీతలో ద్వంద వైఖరి చికాకు పరుస్తున్నది. ఒకరోజు ధిక్కార స్వరం వినిపిస్తుంది. అదే మనిషి మరో రోజు బేలగా మారిపోతుంది. ఎలా అర్థం చేసుకోవాలి ఆ అమ్మాయిని.
పరస్పర గౌరవం లేని బంధం, అబద్ధాలతో కట్టే బంధం ఎంత కాలం నిలుస్తుంది? పేకమేడలా కూలిపోతుంది. అదే జరిగిందిప్పుడు.

          ఒకరికొకరు సహకరించుకోకుండా పిల్లి ఎలుక లాగా జీవితాంతం ఉండటం ఎంత నరకం?! అది గీత అర్థం చేసుకోవట్లేదు. అతనే నా భర్త అని నన్ను నేను అర్పించు కున్నాను. నాకు అతనే కావాలి అంటుంది.

          అతనేమైనా సంతలో పశువా .. కట్టేసి ఇంటికి తెచ్చుకోవడానికి. లేకపోతే వస్తువా తెచ్చి ఇంట్లో పడేసుకోవడానికి. నువ్వు నాకొద్దు అని దొంగలా పోయిన వాడు మళ్ళీ వస్తాడనుకున్నావ్ .. నిన్ను వద్దనుకునే వాడి వెంట పడినంత కాలం అతను నిన్ను చులకన చేస్తూనే ఉంటాడు. నీ జీవితాన్ని హేళన చేస్తూనే ఉంటాడు. మేం బయటి నుండి నీకు చెప్పే వాళ్ళమే. జీవితం నీది. నీ జీవిత ప్రయాణం నువ్వే చెయ్యాలి.
ఎవ్వరూ నిన్ను, నీ ప్రయాణాన్ని దాటి ముందుకు పోలేరు. నువ్వు తప్ప. ఎటు వంటి కండిషన్స్, ఎక్సపెక్తేషన్స్  లేకుండా నీ ప్రయాణం సాగినప్పుడు నీ జీవితంలో ఉత్సాహం ఓంపు కోవచ్చు అని చెప్తే ఆమెకు ఎన్నో సందేహాలు. ఒక్కసారి మొహం ముడుచు కుంటుంది. మరోసారి తన సందేహాలు స్పష్టంగా వెల్లడిస్తుంది. చాలా సార్లు డార్క్ షేడ్స్ లోకి పోతూ మూడీగా తయారవుతుంది.

          నిన్ను నువ్వు సన్నద్ధం చేసుకోవాలి. ప్రేమ పంచాల్సి వచ్చినప్పుడు పంచాలి. తుంచేయాల్సి వచ్చినప్పుడు తుంచేయాలి. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు చేయాలి. నిన్ను నీవు కోల్పోకూడదు. అతనితో పరిచయం, కలిసి ఉన్న సమయం అంతా ఒక ఆక్సిడెంట్ అనుకో. నీ సెక్సువాలిటీ తో ముడిపెట్టి చూడకు. ఆ సమయాన్ని నీ జీవితాన్ని తుడిచెయ్. జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించు అని చెబితే,

          అది సాధ్యమా .. జస్ట్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అంటుంది.

          ఎస్, వి ఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టే సాధ్యం కానిది లేదు. అందుకు మన ప్రయత్నం కావాలి. నిరంతర సాధన కావాలి అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది సారా.

          నీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే చదువు అంటూ బెల్ హుక్స్, టోనీ మారిసన్, ఆలిస్ వాకర్, ఫైర్ స్టోన్ , ఏంజిలా డేవిస్ వంటి వారిని చదువు సలహా ఇచ్చింది సారా .

          గీతకి అవి బుర్రలోకి వెళ్ళాయో లేదో కానీ నిష్కల అటెన్షన్ సారా మీదకు మళ్లించాయి ఆ మాటలు.

          సారా చాలా మాములు పిల్లలాగా కనిపిస్తుంది కానీ అమెరికన్ సమాజం గురించి స్పష్టమైన అవగాహన ఉన్న యువతి అనుకుంది.

          నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. నువ్వు చెప్పిన రచయితల్లో టోరీమారిసన్ తప్ప ఎవరిని చదవలేదు. చదువుతాను. మిగత వారిని కూడా చదువుతాను సారాతో చెప్పింది కానీ ఇంత వరకు బుక్స్ కొనడం వీలుపడలేదు అనుకుంటూ అమెజాన్ లో సైమన్ డి బోయర్ రాసిన సెకండ్ సెక్స్, ఆర్డర్ చేసింది.

          రెండో రోజు పుస్తకం నిష్కల చేతికి అందింది.

          బుక్ తీసి చూస్తున్న నిష్కలకి మొన్న కాఫీ షాప్ కి వచ్చిన సారా, గీతలు కళ్ళ ముందు నిలిచారు.

          నిన్ను కలవడానికి వస్తానని చెప్పిన సారా గీత విషయంలో కాదు తమ కలయిక అన్నప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యా. కానీ సారా గీతని వెంట బెట్టుకుని రావడంతో చాలా నిరాశ ఆవహించింది. ఆ తర్వాత కొద్ది సేపటికి ముగ్గురం కలిసి ఎక్కడికైనా వెళదాం అని సారా ప్రపోజ్ చేసినప్పుడు మనసు ఆనందంతో ఎగిరి గంతేసింది. బెలూన్ లాగా ఎగిరింది.

          లాంగ్ వీకెండ్ వస్తున్నది డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోదామా అని ఉత్సాహంగా అంటే, మీకు క్యాంపింగ్ వెళ్లడం ఇష్టమైతే క్యాంపింగ్ కి పోదాం. ఏమంటారు అంటూ తతిమ్మా ఇద్దరి వైపు చూసింది సారా వావ్ గుడ్ ఐడియా.. నేనెప్పుడూ వుడ్స్ లో క్యాంపింగ్ వెళ్ళలేదు. తప్పకుండా వెళదాం ఉత్సాహంగా అన్నది.

          అద్దాల కిటికీల్లోంచి ఎత్తైన టవర్స్ కేసి చూస్తూ తనకేమి పట్టనట్టు కూర్చుంది గీత.

          ఏంటి గీతా .. ఏం మాట్లాడవే .. నువ్వు ఏమనుకుంటున్నావ్? క్యాంపింగ్ లేదా లాంగ్ డ్రైవ్ లేదా ఇంకా ఏదైనా .. ప్రశ్నించింది సారా.

          చూపు తిప్పి ఒకసారి మిత్రులిద్దరికేసి చూసి, ఏమీ మాట్లాడకుండా మౌనంగా తల వంచుకుని గోళ్లను చూసుకుంటున్నది గీత.

          గీతా నిన్నే .. అని గట్టిగా అనడంతో, తాను ఎక్కడికి రానని చెప్పింది.

          బహుశా, ఆమెకు వినోద్ తో క్యాంపింగ్ వెళ్లిన జ్ఞాపకాలు చుట్టుముడుతున్నాయి కావచ్చు. అందుకేనేమో రాలేనని చెప్పింది.అనుకుంది సారా.

          చివరికి నిష్కల , సారా వెళ్లాలని ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారు.

          ఏ కాంపింగ్ సైట్ కి వెళ్ళాలి అన్నది నిర్ణయించే బాధ్యత సారా తీసుకుంది.
నిష్.. ఇద్దరి కోసం రెండు కార్లు ఎందుకు. వేస్ట్ అఫ్ ఫ్యూయల్. నేను కారు తీసుకుని నీ దగ్గరికి వచ్చేస్తా అన్నది సారా.

          ఓ అయితే, చేతులూపు కుంటూ వచ్చి నీ కారులో కూర్చోవడమే గా.. రైట్ రైట్
క్యాంపింగ్ కి కావలసిన సరంజామా ఏమేమి కావాలో చెప్పు . సిద్ధం చేసుకుంటాను. నా దగ్గర ఏమీ లేవు. మనం వెళ్తే, అదే నా మొదటి క్యాంపింగ్ అవుతుంది. అడవుల్లో రెండు రాత్రులు ఉండడం .. ఓహ్ చాలా ఎక్సైట్ అవుతున్నా అన్నది నిష్కల.

          నిష్ .. నువ్వు ఏమీ కొననవసరం లేదు ఇప్పటికి. అమ్మా నేను చాలా సార్లు క్యాంపింగ్ కి వెళ్లిపోతుంటాం. నా దగ్గర అవసరమైన సామాగ్రి అంతా సిద్ధంగా ఉంది. నువ్వు నీకు అవసరమైన వాటితో వస్తే సరిపోతుంది. ఒక్కసారి వెళ్లి వస్తే ఆ అనుభవం నీకు నచ్చితే అప్పుడు క్యాంపింగ్ టెంట్, బెడ్, చైర్స్ వగైరా అన్ని కొనుక్కోవచ్చు అని చెప్పింది సారా .

          అగ్రీడ్ ..

          ఓకే .. గెట్ రెడీ ఫర్ త్రీ డే క్యాంపింగ్ అంటూ షేక్ హ్యాండిచ్చి వెళ్ళిపోయింది సారా గీతతో కలిసి.

          లాంగ్ వీకెండ్ వరకు ఆగాలంటే మరో 18 రోజులు ఆగాల్సిందే .. తప్పదు.
అబ్బా .. అన్ని రోజులు ఆగాలా.. మనసు మూలిగింది . పోనిలే, ఇప్పటికైనా గీత లేకుండా సారా తో మొదటిసారి కలవబోతున్నది . ఇద్దరు కలిసి రెండు మూడు రోజులు గడప బోతున్నారు తృప్తి పడింది. ఆ ఊహ చాలా ఎక్సైట్ చేస్తుండగా. .

          నిజానికి కాఫీ షాప్ లో సారా తో చాలా విషయాలు ముచ్చటించాలను కుంది. కానీ అనుకోకుండా గీత సారాతో రావడంతో ఏమీ మాట్లాడలేక పోయింది. కల్పించుకుని వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునేంత దగ్గరితనం లేదు కదా..

          ఏది జరిగినా మన మంచికే అంటారు పెద్దలు. అంటే ఇదేనేమో.. లేకపోతే సారా తో క్యాంపింగ్ ఏంటి? ఆమెకు కూడా తన విషయంలో ఏమైనా తీర్చుకోవాల్సిన సందేహాలున్నాయా.. ఏమో ఎవరికి ఎరుక?

          ఒక ఫోన్ కాల్ అటెండ్ అయి తను కూడా బయలుదేరుతుండగా సారా ఎయిర్ పోడ్స్ చూసింది నిష్కల. వాటిని తీసి తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకోబోతూ సారాకి కాల్ చేసింది. తన పక్కనే రింగ్ వినపడటం తో వెనక్కి తిరిగి చూసింది

          సారా, గీత వెనక్కి వచ్చారు. చేతిలో ఉన్న ఎయిర్ పోడ్స్ సారాకు అందించింది . సారా ఏదో జోక్ క్రాక్ చేసింది. ఇద్దరు నవ్వుకుంటున్నారు.

          అదేమీ పట్టించుకోని గీత “స్త్రీ పురుష సంబంధాలంటే ఈ సమాజానికి అంత ఆసక్తి ఎందుకో.. ఈ ప్రపంచంలో అసహ్యాన్ని, నచ్చని అంశాలను అగ్గిపుల్ల గీసి అంటించినట్టు వ్యాపింప చేస్తారు’ అకస్మాత్తుగా అన్నది

          “అలాగే మనుషుల్లోని మానవత్వాన్ని, ప్రేమను అందరికి పంచితే ఎలా ఉంటుంది..?” ఆమె మొహంలో కదులుతున్న భావాల్ని గమనించని సారా

          “అచ్చం సారా లాగా ఉంటుంది” కోటు సర్దుకుని బ్యాగ్ తగిలించుకుంటూ నవ్వుతూ అన్నది నిష్కల.

          కొద్ది క్షణాల క్రితం వినోద్ మిత్రుడికి మిత్రుడైన స్వామిరాజ్ గీతను చూస్తూ అచ్చమైన తెలుగులో అన్న మాటలు గీత చెవిన పడ్డాయి. వెళ్లి అతనితో యుద్ధం చెయ్యాలన్నంత కోపం కసి ఆమెలో వచ్చాయి. తాను ఉన్న ప్రదేశం ఏంటో స్ఫురణకు వచ్చి మౌనంగా సారా వెంట అడుగులు వేసింది. సారాకు అవేమి అర్థం కాదు కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్లకి గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకునేది.

          సారా ఎయిర్ పోడ్స్ కోసం వెనక్కి రావడం తో గీత కూడా గబగబా కాఫీ షాప్ లోకి వచ్చింది. ఆమె మొహం అవమానంతో ఆపిల్ ఎరుపు లోకి మారింది. ఆమెకు ఇప్పుడు బయటకు వెళ్లాలని లేదు. వెళ్తే ఇంకా ఏమి వినాల్సి వస్తుందోనన్న భయం ఆ మొహంలో దోబూచులాడుతున్నది.

          వినోద్ తన దారి తాను చూసుకున్నాడని బాధపడింది కానీ తన క్యారెక్టర్ ని ఇంత అసాసినేట్ చేసాడని తెలుసుకుని కుంగిపోతున్నది. ఇంత దుర్మార్గుడా వినోద్. అతన్ని ఎంత ప్రేమించింది. మనస్ఫూర్తిగా అతన్ని నమ్మింది. కోరుకుంది. దగ్గరయింది. ఎంత దుర్మార్గుడు?! అతని ఆధిపత్యంలో, అతని కింద బానిసత్వంలో ఉండే మనిషి కావాలి. అలా కాకుంటే ఎంతటి నీచంగా నైనా ప్రవర్తించ గలరు ఈ మగవాళ్ళు . ఛి ఛీ .. లోలోనే తిట్టుకుంది గీత.

          లేకపోతే వాడెవడో కోన్ కిస్కా గాడు తన గురించి అంత అసభ్యంగా ఎలా మాట్లాడ గలడు? అసలు వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చింది నేనే, నా తొందరపాటు తనమే ఇంత దాకా తెచ్చింది. నా జీవితాన్ని సర్వ నాశనం చేసింది. ఇటు వంటి మాటలు మా అమ్మా నాన్నలకు చేరితే.. అసలే హార్ట్ పేషెంట్ అయిన అమ్మ కుప్పకూలి పోతుంది, నాన్న నలుగురిలో తలెత్తుకోలేక ఏమైపోతాడో .. ” ఆమె మనసు కలవర పడుతున్నది.

          ఏంటి గీతా.. మళ్ళీ కూర్చున్నావ్. బయట చలికి మరో కాఫీ కావాలంటున్నదా నీ శరీరం అన్నది నిష్కల నవ్వుతూ. 

          అవునన్నట్లుగా తలూపింది గీత.

          సారా ఫోన్ లో ఉన్నది. గీత వెళ్లి రెండు కాఫీ లు తెచ్చి నిష్కల ముందు, సారా ముందు పెట్టింది. వెళ్లి మరో కప్పు తెచ్చింది.

          ఓ .. సో స్వీట్ డియర్ .. నాక్కూడా తెచ్చావా .. చిరునవ్వుతో సారా “నేను కాఫీ టీ ఎక్కువ తీసుకోను. ఎప్పుడో అకేషనల్ గా తప్ప. ఇప్పుడు తెచ్చింది ఎవరు.. గీత.. కదా.. తాగుతుందిలే ఈ నిష్క్” డల్ గా ఉన్న గీతను చీరప్ చేస్తూ అన్నది నిష్కల

          నిష్కలను సారా నిష్ అని అంటుంది. గీత నిష్క్ అంటుంది.

          నెమ్మదిగా కాఫీ సిప్ చేస్తూ తనను తాను కూడదీసుకున్నది గీత. తర్వాత “ఓ ఇండియన్ భర్త, భార్య పుట్టిన రోజు కానుకగా చంద్రుడిపై ఎకరం స్థలం ఇచ్చాడట. న్యూయార్క్ లోని ఇంటర్నేషనల్ ల్యూనార్ సొసైటీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మధ్య డాక్యుమెంటేషన్ పూర్తి చేసుకుని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్సు అందుకుని భార్యకు కానుక ఇచ్చి సర్ప్రైజ్ చేసాడట. ఆ భార్య ఎంత అదృష్టవంతురాలు..” కళ్ళు పెద్దవి చేస్తూ గీతచాలా ఎమోషనల్. ఊహా ప్రపంచంలో విహరించే వ్యక్తి. ఎదుటి వారి నుండి చాలా ఎక్సపెక్టషన్స్ ఉంటాయి. సినిమా భర్తలాగా భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అనుకునే రకం. విలాసవంతమైన జీవితం పై మోజు ఎక్కువ. డాక్టర్ అయిన అతని సంపాదన చూసి అతన్ని వదులు కోవడానికి సిద్ధంగా లేదేమో.. అని ఒకటి రెండు సార్లు సందేహం కలిగింది నిష్కలకి . ఈమె ఆశలు, కోరికలు గమనించి అతను అవకాశంగా చేసుకుని వాడుకు వదిలేశాడా.. అతను. ఆ తర్వాత వదిలించు కున్నాడు. ఆలోచిస్తున్నది నిష్కల.

          “బాధపడకు గీతా నీకు ఏదో ఒక గ్రహ శకలం నేను కొనిస్తాలే” నవ్వింది సారా

          “మొగుడనే వాడు ఈ భూమి మీద ప్రతి పనికి అడ్డుపడింది సరిపోలేదా.. అంతరిక్షంలో కూడా ప్రశాంతంగా ఉండనీయడా.. నేనైతే ఏ శని గ్రహాన్నో కబ్జా పెట్టేదాన్ని కానీ నా దగ్గర అంత సొమ్ములేదే..” దిగులు నటిస్తూ నిష్కల “ఆ డబ్బు దేముంది..ఫర్వాలేదు.. క్రిప్టో కరెన్సీలో అనకొండలా పెరుగుతున్నదిగా” పకపకా నవ్వింది సారా.

          ఏయ్ .. అమ్మాయ్ ఇంకా ఎక్కడున్నావ్ .. నీ క్రిప్టో కరెన్సీ ఎప్పుడో ఢమాల్ .. ఢమాల్” అన్నది నిష్కల

          “పోతే పోనీలే .. అయినా వాడెవడో గిఫ్ట్ చేయడం ఏంటి? మనమే గిఫ్ట్ ఇచ్చుకుందాం. ఏదో ఒక గ్రహ శకలం మ్మీద….జాగా చూసుకో.. డబ్బుదేముందీ.. ఉన్నపుడే ఇవ్వొచ్చులే .. ” సారా.

          “ఇలా అయితే నవ గ్రహాలు కబ్జాలు అయిపోతాయి” అన్నది గీత.

          “ముందు ఆ పని చూడండి. సూర్యుడు జోలికి మాత్రం వెళ్ళకండి.” హెచ్చరిస్తున్నట్లు నిష్కల

***

          తెల్లవారితే క్యాంపింగ్ . సారాతో క్యాంపింగ్ .

          వర్తింగ్టన్ స్టేట్ ఫారెస్ట్ లో మూడు పగళ్లు రెండు రాత్రులు గడపడం. మిగతా ప్రపంచం తో పని లేకుండా సారాతో ఇద్దరే. ఇద్దరు. ఒకరికొకరు కలిసి మెలసి ఎన్ని కబుర్లు పంచుకోవచ్చు .. వీలయినంత సమాచారం సేకరించాలి. ముఖ్యంగా నాన్న గురించి.

          పాపం నాన్నమ్మ, పెద్ద కొడుకు కోసం ఎదురు చూస్తున్నది. తల్లీ కొడుకులు చూసుకునే ఏర్పాటు చేయాలి బాగ్ లో బట్టలు సర్దుకుంటూ మరోసారి అనుకుంది నిష్కల;

          అంతలో సారా నుంచి ఫోన్. సిద్దమే కదా అంటూ.. క్యాంపింగ్ ఏర్పాట్లను చేసింది. క్యాంపింగ్ టెంట్, అవసరమైన సామగ్రి ఇద్దరికీ తానే తీసుకుంది.

          వెళ్ళేది అడవుల్లోకి కాబట్టి ఉష్ణోగ్రతలు చాలా తక్కువ ఉండొచ్చు. రాత్రిపూట మరింత తక్కువ ఉండొచ్చు. కాబట్టి వింటర్ క్లోత్స్ , పొడవు చేతుల చొక్కాలు, మొత్తం శరీరం కప్పి ఉంచే విధంగా బట్టలు తెచ్చుకొమ్మని చెప్పింది. అదే విధంగా సన్ స్క్రీన్ లోషన్, మస్కిటో లోషన్, గాగుల్స్ వంటివి తెచ్చుకొమ్మని చెప్పింది.
వాతావరణం బాగుందని గూగులమ్మ చెప్పింది. ఫర్వాలేదు .

          సారా చెప్పిన వర్థింగ్టన్ గురించి గూగుల్ చేసి చూద్దామనుకుని కూడా ఆగిపోయింది నిష్కల. వెళ్లిన చోట ప్రతి క్షణం ఆస్వాదించాలంటే ముందు ఏమి తెలుసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అనుకున్నది. గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన నిష్కల ఎప్పుడు ఇలా క్యాంపింగ్ కి వెళ్ళలేదు. అడవుల్లో సంచరించలేదు.

***

          అనుకున్నట్లుగానే ఉదయం ఏడు గంటల సమయంలో వచ్చేసింది సారా.
అప్పటికి నిష్కల తన సరంజామా సర్దుకుని సిద్ధంగా ఉన్నది. ఉత్తర దిశలో గంటన్నర పైన ప్రయాణం చేసిన విశాలమైన రోడ్డు దాటి అటవీ మార్గంలో ప్రయాణం.. లోపలి వెళ్ళిన కొద్ది చిక్కనవుతున్న అడవి. అద్భుతమైన వాతావరణం. కొండలపై మేఘం నీడ పడి మరింత చిక్కగా అగుపిస్తూ. కనుచూపు మేర ఎటు చూసినా పచ్చదనమే ..
ఎత్తైన కొండలు.. లోయలు.. సెలయేళ్ళు. అద్భుతమైన దృశ్యాలు.. ఆపైన నీలాకాశం.. మేఘ మాలికలు .. థాంక్స్ సారా మనసులో అనుకున్న మాట పైకి వచ్చేసింది.

          “ఎందుకు?” ఎదురుగా పొదల మాటున ఉన్న నలుపు రంగులోని ఎలుగు బంటిని చూస్తూ, “అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకొచ్చావ్”

          “హహ్హ .. ఏం చూసావ్ .. ఇప్పుడేగా లోనికి వస్తున్నాం. అటు చూడు. ఆ ఆకుపచ్చటి పొద మధ్యలో.” 

          “ఆమ్మో.. అది ఎలుగుబంటి కదా..”

          “అవును”

          “భయం లేదా”

          “వాటిని దూరంగా గమనించాలి కానీ దగ్గరకు పోకూడదు. మనకు దారి పొడవునా అడవి జంతువులు ఎదురు పడుతూనే ఉంటాయి. వాటి సామ్రాజ్యం లో అవే కదా ఉండేది” అన్నది సారా

          వర్తింగ్టన్ స్టేట్ ఫారెస్ట్ వారెన్ కౌంటీ లో ఉంది. ఆరు వేల ఆరు వందల ఎకరాల్లో అంటే 27 మైళ్ళ విస్తీర్ణంలో ఉంది. మైళ్ళ కొద్దీ విస్తరించి ఉన్న నడకదారులు.. మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. కొంత వరకు కార్లు వెళ్లగలిగే రోడ్లు.ఉన్నాయి.
ఇక్కడ మొత్తం 78 క్యాంపు సైట్స్ ఉన్నాయి. ఒక్కో సైట్ లో రెండు టెంట్స్ వేసుకోవచ్చు. ఆరుగురు ఉండొచ్చు . ఒక్కో సైట్ కి ఒక ఫైర్ పిట్ , పిక్నిక్ టేబుల్ ఉన్నాయి. మంచి నీరు, మోడరన్ టాయిలెట్, స్నానపు గదులు వంటి సదుపాయాలు ఉన్నాయి.
అవునా .. గ్రేట్. ఇవన్నీ ఫ్రీ నే కదా .. ఉహు.. కాదు, కొద్ది మొత్తంలో మనం డబ్బు చెల్లించాలి. ఇవన్నీ మెయింటైన్ చెయ్యాలంటే వాళ్ళకి కూడా డబ్బు అవసరం కదా ..
1-23 సైట్స్ లో టెంట్స్ వేసుకోవడానికి మాత్రమే వీలుంది. మిగతా వాటిలో టెంట్స్, మోటార్ హోమ్స్, ట్రావెల్ ట్రైలర్స్ కూడా నదికి అభిముఖంగా ఉన్న సైట్ అద్భుతంగా ఉంటుంది. బోటింగ్ చేసుకోవచ్చు . కయాకింగ్ చేయొచ్చు. కాకపొతే వాటిని మనం సొంతంగా తీసుకుపోవాలి” అంటూ వివరాలు చెప్పింది సారా

          “ఓ అందుకేనా.. కొందరు తమ కారు పైన పెట్టుకుని , లేదంటే తగిలించుకున్న చిన్న ట్రాలీలో వేసుకుని తెచ్చుకుంటున్నారు”.

          “కొందరు తమ పెట్స్ కూడా తెచ్చుకుంటారు. కానీ వాటిని జాగ్రత్తగా చూసుకోవడం తో పాటు వాటి వ్యర్ధాలను ఈ అడవిలో వదలడానికి వీల్లేదు. తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ కవర్ లో తమతో తీసుకుపోవాలి” .

          “అవునా .. ఆశ్చర్యం.. పట్టుకు పోవడం ఇబ్బందిగా ఉండదూ..?”
“తప్పదు. కాంప్ సైట్ దగ్గర లో ఉన్న ఆఫీస్ లో క్యాంపర్స్ కోసం చిన్న స్టోర్ ఉంది. ఎండు కట్టెలు, అగ్గిపెట్టెలు, టి షర్ట్స్, స్టీకర్స్, నీళ్ల బాటిల్స్, సన్ స్క్రీన్ వంటివి.

          నేను అమ్మతో ఒకసారి, నా బాయ్ ఫ్రెండ్ తో ఒకసారి గతంలో వచ్చాను. వేడి నీటి సదుపాయంతో షవర్స్ , టాయిలెట్స్ చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల అస్సలు ఇబ్బంది పడలేదని చెప్పింది సారా.

          “మనం అడవిలో అలా నడుచుకుంటూ పోతున్నప్పుడో, కొండలపైకి పోతున్నప్పుడో టాయిలెట్ వెళ్ళవలసి వస్తే.. “మనసులో వచ్చిన సందేహం వెళ్లబుచ్చింది నిష్కల.

          “కాలి బాటల నుంచి అడవి లోపలికి వెళ్లి గుంత తీసి దాన్ని టాయిలెట్ గా వాడుకోవాలి. పని అయిన తర్వాత ఆ గుంత మూసి వేయాలి. ఇండియాలో ఏమి చేస్తారు?”

          “ఏమో.. నేను ఎప్పుడు ఇట్లా అడవుల్లోకి పోలేదు. ప్రయాణాల్లో అవసరమైతే మదుగుగా ఉన్న చోటు చూసుకుని కారు ఆపుకుని పని కానిచ్చుకుంటాం. ఇలా చేస్తారని నేను అనుకోను”.

          మాటల్లోనే చాలా దూరం వచ్చేశారు. కారు ఓ పక్కగా ఆపింది సారా. ఇద్దరూ తమ షోల్డర్ బాగ్స్ వేసుకుని నడక మొదలు పెట్టారు. ఎక్సయిట్ అయిపోతూ కనిపించిన వాటన్నిటినీ ఫోటో తీస్తున్నది నిష్కల. తాను చూసినవి ఎప్పటికప్పుడు తల్లికి కూడా చూపించాలని ఆమె తాపత్రయం. అంతలో. ఎలుగు కనిపించింది “సారా .. అటు చూడు ఎలుగుబంటి” గట్టిగా అరిచింది నిష్కల

          “ష్ .. అరవకు నిష్.

          ఎలుగుబంట్లు, దుప్పిలు , తోడేళ్ళు వంటివి చాలా చాలా జంతువులు ఉన్నాయి ఈ అడవిలో. వీటిని వేటాడ కూడదు. గోల్డ్ ఫించేస్ , ఇండిగో బంటింగ్స్ , బాల్డ్ ఈగిల్స్ , తెల్ల తోక ఉండే డీర్స్ , నల్ల ఎలుగుబంట్లు , అడవికోళ్ళు అడవిలో ఉండే జంతువులకి మనం తినే ఆహారం ఏమీ పెట్టకూడదు . అవి చచ్చిపోతాయి . త్రాచు పాములు, కాపర్ హెడ్స్ అనే పెద్ద పాములు, తోడేళ్ళు, బాబ్ క్యాట్ ల నివాస స్థలం ఇది. అడవిని, అడవిలో ఉండే జీవాల్ని గౌరవిస్తూ మనం మన ఆనందం పొందాలి.” అన్నది సారా ..
అంతేకాదు, ఇతర జంతువులూ చాలా ఉన్నాయి ఈ అడవిలో. స్వేచ్ఛగా అవి సంచరించే చోటుకు మనం వచ్చాము కాబట్టి వాటికి దూరంగా ఉండి ఫోటోలు తీసుకోవాలి తప్పితే, కానీ వాటిని ఇబ్బంది పెట్టొద్దు. రోడ్లపై ఎక్కడంటే అక్కడ పార్క్ చేయకూడదు అంటూ ఈ ప్రాంతం గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా విషయాలు చెప్పింది సారా. ఆ చెప్పడంలో ప్రకృతిలో ఉన్న మన చొరబాటు, అహంకారంతో కూడుకున్నది కావడంవల్ల జీవావరణానికి నష్టం కలుగుతున్నదనే స్పృహతో కూడిన ఆమె మాటలు నిష్కలకు సారాలోని కొత్తకోణం కనిపిస్తున్నది.

          పర్యావరణాన్ని ప్రకృతిని గౌరవిస్తున్న సారా అంటే మరింత ప్రేమ కలిగింది నిష్కలకు. ఆమె సున్నిత మనస్తత్వాన్ని, పరిపక్వతతో కూడిన కారుణ్యాన్ని వాటిని వ్యక్తపరిచే తీరు అబ్బురంగా గమనిస్తున్నది. పర్యావరణ ఉద్యమకారిణి ఆమెలో ఉన్నట్లు ఫీలయింది నిష్కల.

          చాలా ప్రశాంతంగా ఉంది. పక్షుల అరుపుల సవ్వడి తప్ప మరో శబ్దం వినిపించడం లేదు. ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి. ఏపుగా ఆకాశంకేసి పెరిగిన చెట్ల మధ్య నుంచి వాటి నీడలు దాటుకుంటూ నది ఒడ్డుకు చేరారు ఇద్దరూ. కొద్దిసేపటి క్రితం కనిపించిన మేఘం ఎక్కడ దాక్కుందో .. నీలాకాశం నదిలో ప్రవహిస్తున్న నీటిలోకి వచ్చినట్లు ఉంది.. ఆ పై ఏపుగా ఎదిగిన వృక్షాల నీడల ముద్రలు వేస్తూ.. సూర్య కిరణాలతో మిల మిల మెరుస్తూ.. అక్కడ ప్రతి దృశ్యం అద్భుతంగా కనిపించింది నిష్కలకు.

          కొండలు , కోనలు , ఏర్లు, సెలయేర్లు, నదులు ప్రకృతి పరమైన వస్తువులు కావు. మనసుకు, మనసు చూపుకు సంబంధించినవి. ప్రకృతిని పరిశీలించడం అంటే దాని సంకేతాల్ని, సంజ్ఞల్ని మనం శక్తిగా పొందడం ” అంటున్న సారాకేసి విస్మయంగా చూసి ఆ వాతావరణాన్ని మైమరచిపోయి ఆస్వాదిస్తున్నది నిష్కల

          అంతలో “నిష్ కాఫీ..” అన్నది సారా.
          “వాట్ ..”
          “అవును నువ్వు విన్నది నిజమే” అంటూ

          ఫ్లాస్క్ లోంచి టీ రెండు కప్పుల్లో పోసింది సారా.

          “వావ్ .. ఈ సమయంలో ఇక్కడ .. ఇలా .. టీ తాగడం .. రియల్లీ.. గ్రేట్ సారా” అంటూ సారాని కౌగలించుకుంది నిష్కల .

          హాయిగా నవ్వేసింది సారా

          ఇద్దరూ నది వొడ్డున కూర్చుని నీళ్లలో కదిలే చిన్న చిన్న చేప పిల్లల్ని చూస్తూ కొన్ని క్షణాలు గడిపారు. ఉత్సాహంగా నీళ్లలోకి దిగ బోయింది నిష్కల.

          “జాగ్రత్త .. నీటి లోపల కొన్నిసార్లు జలగలు ఉంటాయంటారు. జాగ్రత్తగా చూసుకోవాలి. అవి మనని పట్టుకున్నాయంటే రక్తమంతా పీల్చేస్తాయి ” చెప్పింది సారా
“అవునా ” అంటూ కొన్ని క్షణాలు తటపటాయించింది నిష్కల

          “స్వచ్ఛమైన నీటిని చూస్తుంటే ఆగలేకపోయాను. ఒక్క సారి అలా కాళ్ళు తడుపుకుని వచ్చేస్తా .. “

          “నువ్వు కూడా నా లాంటి దానివేనన్న మాట . నీళ్లను చూస్తే .. ” నవ్వేసింది సారా .
ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నీళ్ళలోకి దిగారు. చల్లటి నీళ్లు జల్లుమనిపించాయి.
అక్కడక్కడే దోబూచులాడుతున్న చిన్న చిన్న చేపలన్నీ భయంతో దూరంగా జరిగిపోయాయి. తర్వాత నెమ్మదిగా వీళ్ళ కాళ్ళ దగ్గర చేరాయి . స్వచ్ఛమైన నీటిలో గులకరాళ్ళ మీదుగా పారుతున్న నీళ్లు, స్పాకి వెళ్లనవసరం లేదు. చూడు నా కాళ్ళని అంటూ ఇద్దరు ఒకరి కాళ్ళను ఒకరు చూసుకున్నారు. మనస్సు లోపల జలగ ఎక్కడ పట్టుకుందో నన్న భయం దోబూచులాడుతుండగా పైకి వచ్చేశారు.

          నది ఒడ్డున ఓ చెట్టు నీడన చాప పరిచింది నిష్కల. ఇద్దరూ కూర్చున్నారు. చేపలను చూస్తూ ఫిషింగ్ చేద్దామా అన్నది సారా.

          సరే అంటే సరే అనుకున్నారు. ఎర పెట్టి ఇద్దరికీ గేలం సిద్ధం చేసి ఒకటి తాను తీసుకుని మరొకటి నిష్కల చేతికి అందించింది సారా. తాను గేలాన్ని నీటిలోకి వదులుతూ ఎలా వదలాలో నిష్కలకు చూపింది. ఎంత సేపటికి ఒక్క చేప కూడా పడ లేదని నిష్కలకి విసుగ్గా ఉంది. సారా గేలానికి చిన్న చేప పడింది. దాన్ని నీళ్ళలోకి వదిలేసింది సారా. ఆ తర్వాత కాసేపటికి అరకిలో బరువున్న పెద్ద చేప పడింది.
వావ్ .. ఎగిరి గంతేసింది నిష్కల.

          సారా ఆ చేపని నెమ్మదిగా పైకి తీసింది.

          “ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం సారా ..”

          “పిచ్చి సన్నాసి, కొద్ది సేపట్లో మనకి ఆహారంగా మారిపోనుంది”

          “అవునా.. ఎలా.. మన దగ్గర ఏమీ లేవుగా .”.

          “చూస్తూ ఉండు ..”అంటూ బాగ్ లోంచి ఒక కిట్ తీసింది. కిట్ లో ఉన్న చాకు, దువ్వెన లాంటి వస్తువు తీసింది. చేపకు గాటు పెట్టి లోపలివి తీసేసి, పై పొలుసులను శుభ్రం చేసింది. ఆ తర్వాత నదిలో నీటితో ఓ రాయిపై వేసి శుభ్రం చేసింది.
దానికి ఇంటి నుండి తెచ్చుకున్న ఉప్పు, ఏదో సాస్ పట్టించింది.

          “నిష్ కొద్దిగా హెల్ప్ ప్లీజ్ ..”

          “చెప్పు సారా ..”

          “చిన్న చిన్న కట్టెపుల్లలు తేగలవా.”.

          గబగబా ఎండు పుల్లలను ఏరుకొచ్చింది నిష్కల.

          బ్యాగులోంచి అగ్గిపెట్టె తీసి ఆ పుల్లల్ని అంటించింది సారా. మండుతున్న మంటపై చేపను బాగు లోంచి తీసిన ఊచకు గుచ్చి అటు ఇటు తిప్పుతూ కాల్చింది .
అది బాగా కాలిన తర్వాత దాన్ని రెండు ముక్కలుగా చేసింది. టిష్యూ పేపర్ తీసి ఒక ముక్క నిష్కలకు ఇచ్చి, తాను ఒక ముక్క తీసుకుంది సారా.

          అది ఎలా ఉంటుందో అని బెరుగ్గా ఉంది నిష్కలకు. మామూలుగానే చేపలు తక్కువ తింటుంది. అటు వంటిది కారం, మసాలాలు లేకుండా తినాలంటే ఎలా .. అని ఆలోచిస్తున్నది.

          సారా చాలా ఇష్టంగా తింటున్నదల్లా ఆగి నిష్ తినడంలేదే.. అన్నది
తింటాను అన్నట్లుగా తల ఊపి ప్రయత్నించి చూస్తాను. అని మనసులో అనుకుని ఓ మూల కొద్దిగా కొరికింది. బాగానే ఉన్నట్లనిపించింది. మరో బైట్ తీసుకుంది. ఆ రుచి అద్భుతంగా అనిపించింది.

          “చేప రుచి ఇంత అద్భుతంగా ఉంటుందా.. థాంక్ యూ..” అన్నది సారాకేసి చూస్తూ.

          “స్వచ్ఛమైన నీటిలో పెరిగిన చేప. ఎటు వంటి ప్రిజర్వేటివ్ లేకుండా ఉన్న ఫ్రెష్ చేప .. ఈ రోజు మనకి ఆహారం అయిపొయింది” అన్నది సారా .

          అవునన్నట్లు తల ఊపింది నిష్కల.

          “నిష్ వేస్ట్ కింద పడెయ్యకు. నీ దగ్గరున్న పాలిథిన్ కవర్ లో వేయి” అని చెప్పి నిప్పు పూర్తిగా ఆర్పేసింది సారా.

          ఆ తర్వాత ఇద్దరూ చాప మీద ఒరిగారు.

          నిష్కలకు కొత్తగా జీవం పోసుకున్నట్లుగా ఉంది. రోజు ఉండే జీవితానికి భిన్నంగా .. , ఇంటర్నెట్, సెల్ఫోన్, టీవీ ఏవి లేకుండా.. అచ్చమైన ప్రకృతిలో ఒదిగిపోయి
బ్యాగ్ లోంచి ‘ది కలర్ పర్పుల్ ‘ నవల తీసింది సారా . ఇప్పటికి చాలా సార్లే చదివింది. మరో సారి ప్రశాంతంగా చదవాలని తెచ్చుకుంది. ఈ మధ్యనే ఆ పుస్తకం గురించి విని ఉన్నది నిష్కల. కానీ ఇంకా చదవలేదు.

          సారా మొన్నా మధ్య గీతకు చెప్పిన రచయితలు, ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న పుస్తకం అన్నీ కూడా అమెరికన్ స్త్రీవాద సాహిత్యానికి సంబంధించినవే..
ఆలోచిస్తూ ఉంటే , ఆమె మాటలు వింటూ ఉంటే సారాలో ఎకో ఫెమినిస్ట్ ఉన్నట్లుగా తోచింది నిష్కలకు.

          ఒక్క నిముషం ఆమెను డిస్టర్బ్ చేయాలా వద్దా అని ఆలోచించి, ఇక ఆగలేక అడిగేసింది. ఆశ్చర్యం సారా.. వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్ వి. ప్రవ్రుత్తి రీత్యా .. ఓ వైపు ఫెమినిజాన్ని ఔపోసన పడుతున్నావు . అదే సమయంలో ప్రకృతిని , పర్యావరణాన్ని కూడా .. గమ్మత్తుగా లేదూ ..

          నువ్వు పుస్తకాలు బాగా చదువుతావని మొన్న నువ్వు చెప్పిన రచయితల పేర్లు వింటేనే అర్ధమయింది అన్నది నిష్కల. చేతిలో ఉన్న పుస్తకాన్ని పక్కన పెట్టి లేచి కూర్చుంది సారా ..

          “మా నాన్న ఇంజినీర్ కాబట్టి ఇంజినీర్ కావాలనుకున్నా. అయ్యాను. అమ్మ ఆలోచనల ప్రభావం ఉంటుంది కానీ అంత కంటే ఎక్కువ మా టీచర్ ప్రభావం ఉంటుంది. నాన్న నుండి పుస్తకాలూ బాగా చదివే అలవాటు వచ్చింది. అమ్మ నుంచి ప్రతీదీ పరిశీలించి ప్రశ్నించే తత్త్వం వచ్చినట్టుంది. నేనున్న సమాజం, నేను చూస్తున్న సమాజం నన్ను మలిచినట్లుంది.” నవ్వేసింది

          “నీపై మీ నాన్న ప్రభావం చాలా ఉన్నట్లుంది.”

          అవునన్నట్లు తలూపింది.

          సారా నాన్న ప్రస్తావన తెచ్చినప్పుడు చాలా సార్లు గతంలో లేని బాధ వస్తున్నది, నాన్నకు దూరంగా ఉండి చాలా మిస్ అయిపోయానని, ఎంతో కోల్పోయాననీ ఆమె మనసు మూలుగుతున్నది. వాతావరణాన్ని ఉత్సాహ పరుస్తూ ఎక్కడినించో పక్షి పాట పాడుతున్నది. గాలి ఈలలు వేస్తూ మోసుకొస్తున్నది. ఆ స్వరాన్ని అందుకోవాలని ప్రయత్నించింది నిష్కల. కానీ అది సాధ్యం కాలేదు.

“పూలు గుసగుస లాడెనని .. జత గూడేనని..
గాలి ఈలలు వేసెనని .. సైగ చేసేనని
అది ఈ రోజే తెలిసిందీ .. హా .. ” అంటూ అప్రయత్నంగా కూనిరాగం మొదలైంది నిష్కల నుంచి పుస్తకంలో నిమగ్నమైన సారా ఉలిక్కిపడింది. “నిష్.. ఏది .. ఆ పాట మళ్ళీ హమ్ చేయవా.. ” అడిగింది సారా . ఆ స్వరంలో ఆత్రుత . “రిథమ్.. నీకు నచ్చిందా” అంటూ మళ్ళీ హమ్ చేసింది నిష్కల .

          “ఈ పాట ఎక్కడ నేర్చుకున్నావు”

          “ఎక్కడా నేర్చుకోలేదు. మా అమ్మకి మూడ్ బాగున్నప్పుడల్లా పాడుతుంది . మా నాన్న కూడా అట్లాగే పాడేవాడని నాన్నమ్మ చెబుతుంది. మా నాన్నని చూసి, చిన్నప్పుడే అమ్మ కూడా అట్లా హమ్ చేయడం నేర్చుకుందట. అది నాకు వచ్చినట్లుంది. “

          “ఏంటి ఏమన్నావ్.. చివరి లైన్స్ మళ్ళీ చెప్పు”

          చెప్పింది నిష్కల.

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.